ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన  ఏది రాసినా, మాట్లాడినా    నేరుగా  అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం.  అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి.  ఆగాధాలు ఉన్నాయి.   చిక్కుముళ్లు ఉన్నాయి.  అలాంటి ఎంవిఆర్‌ గురించి సరళంగా   ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది.  

ఆయన సామాజిక, రాజకీయ జీవితం  గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం ఏర్పడ్డాక  ఖమ్మంలో జరిగిన తొలి మహా సభలకు  ప్రభంజనం పత్రికతో హాజరయ్యారు. విప్లవ రచయితల సంఘం తొలి కార్యవర్గంలో సభ్యుడయ్యాడు. ఆ రోజుల్లో ఆయన వాక్యం సరళంగానే కాదు, పదునుగా ఉండేది. అది విప్లవం వల్ల వచ్చింది. ఇవన్నీ కలిసి ఆయనలోని ఆనాటి ప్రభావశీల వ్యక్తిత్తాన్ని అప్పటి వాళ్లు తలచుకుంటారు. 

విప్లవోద్యమ ఆవరణలో ఆయనకు ఉన్న ఈ గుర్తింపుకు భిన్నమైన ఇమేజ్‌ సొంత ఊళ్లో ఉండేది.  విప్లవ రాజకీయాలు, విరసం, ప్రభంజనం పత్రికతోపాటు  ఆయన అప్పటికే స్థానికంగా కార్మిక సంఘాలు స్థాపించారు. ఇప్పడు వెనక్కి తిరిగి చూస్తే వాటిని ఆయన కార్మిక వర్గ చైతన్యంతో నడపలేకపోయారని అర్థమవుతుంది. ఆయన రాజకీయ జీవితంలో మార్పుకు మూలం అక్కడే ఉంది. అదొక ముఖ్య కారణం. మేధావిగా ఆయ‌న ఏమైనప్పటికీ  ప్రజా ఆచరణలో ఆయన చైతన్యానికే ఆ పరిమితి ఉందని చివరికి రుజువైంది.  దానికి బహుశా   స్థానిక పరిస్థితుల ప్రాబల్యం  తోడై ఉండ‌వ‌చ్చు. 

 ఇలాంటివ‌న్నీ కలిసి ఆయన  హత్యా రాజకీయాల్లోకి చేరుకున్నారు.  1975 నాటికే ఒక హత్య చేయించారు. హత్యలు చేసిన వారిని చేరదీశారు. ఒక పక్క ఆయన ఈ తీరం చేరడం, ఇంకో పక్క విరసానికి దూరం కావడం రెండూ ఒకేసారి జరిగాయి. 1975లో అనంతపురంలో జరిగిన సభల్లో విరసం నుంచి కొంతమంది వెళ్లిపోయారు. అప్పటికే విరసం కడప యూనిట్‌ నిర్వ్యాపకంగా తయారైంది.  సంస్థ మీద దుష్ప్రచారాలు మొదలు పెట్టింది. అందుకని ఆ యూనిట్‌నే రద్దు చేశారు. ఆ రకంగా  ఎంవిఆర్‌ సాంకేతికంగా కూడా విరసానికి దూరమయ్యారు.  

ఆ తర్వాత  హత్యా రాజకీయాల్లో  ఆయన వేగంగా చాలా దూరం వెళ్లిపోయారు.  అందులో  తలమునకలయ్యారు. పౌరహక్కుల సంఘం 1996లో  ప్రచురించిన కడప  జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం  పుస్తకంలో ఆ వివరాలన్నీ ఉన్నాయి.  అప్పటికి ఎంవిఆర్‌ ఇంకా ఆ రాజకీయాల్లోనే ఉన్నారు. బహుశా అప్పుడే ఆయన జెయిలు నుంచి బైటికి వచ్చినట్లుంది. ఆ పుస్తకంలో ఒక చాప్టరే పొద్దుటూరు ఫ్యాక్షన్‌ హత్యల గురించి రాశారు. ఇది రాస్తూ ప్రొద్దుటూరు ఫ్యాక్ష‌నిజం గురించి  తెలిసిన  ఆధారాల్లో,  విన్న మాటల్లో  కొంత నిజమైనా.. అని చాలా మినహాయింపు ఇచ్చి రాశారు. అదీ ఎంవిఆర్‌ అసలు స్వరూపం. అందులో పూర్తిస్థాయి ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తారు. ఆ రాజకీయాలకు దూరమైనా ఇప్పటికీ ఆయనకు స్థానికంగా ఆ  గుర్తింపు పోలేదు. ప్రొద్దుటూరులో, కడప జిల్లాలో ఆయన పేరు వింటే జడుసుకొనే వాళ్లమని చెప్పేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అంతగా హింసకు ఆయన కేంద్రం అయ్యారు. 

అదొక్కటే అయితే ఆయన్ను అర్థం చేసుకోవడం తేలిక అయ్యేది. ఆయనలో ఇంకొన్ని ముఖ్యమైన కోణాలు ఉన్నాయి. 

ఫ్యాక్షన్‌  రాజకీయాల్లో ఉంటూ అనేక మంది గెలుపు ఓటములకు కారణమైన ఎంవిఆర్‌ నేరుగా ఓట్ల రాజకీయాల్లోకి దిగారు. అంతక ముందు ఆయన రాయలసీమ గురించి ఎన్న‌డూ ఆలోచించిన ఆధారాలు లేవు. ఎమ్మెల్యే అయ్యాక రాయలసీమ సమస్యను ఎజెండా మీదికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కాకుండా ఉండి ఉంటే ఇది సాధ్యమయ్యేదేనా? అనుమానం కలుగుతుంది. 

దాని వల్ల రాయలసీమకు కొంచెం మేలు జరిగింది. అంతకంటే ఎక్కువ ఎంవిఆర్‌కు మేలు జరిగింది. ఆ మాటకొస్తే ఎంవిఆర్‌ చేపట్టిన రాయలసీమ ఉద్యమం చాలా కొద్ది కాలమే నడిచినా ఆ ప్రాంతంలోని ఒక తరం నాయకులకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి రాయలసీమ సమస్యలు చర్చనీయాంశమే అయినా తొలిసారి నీటిపారుదల రంగంలో ఆ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని లోకం గుర్తించేలా ఎంవిఆర్‌ చేశారు. రాయ‌లసీమ నీటి స‌మ‌స్య‌పై ఆయ‌న రాసిన  చిన్న పుస్త‌కం ఆ ప్రాంత అస్తిత్వ అవ‌గాహ‌న‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. 

ఆ ర‌కంగా ఆయన ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ప్రాంతీయ రాజకీయాలను తోడు చేశారు. రాయలసీమ స్పృహను ప్రజల్లోకి తీసికెళ్లారు.  ఇది ఎన్నికల రాజకీయాల్లో సాధ్యమయ్యే అంశమే.  దాని వల్ల  ఆయన పాపులర్‌ ఇమేజ్‌ హత్యా రాజకీయాల నుంచి నీటి రాజకీయాల మీదికి మారింది. రాయలసీమ స‌మ‌స్య‌లు ఎంవిఆర్‌ తర్వాత కూడా అప్పుడప్పుడు చర్చనీయాంశమవుతూ వచ్చాయి. పోరాటాలు జరుగుతూ వచ్చాయి. కానీ రాయలసీమ ఉద్యమం అనే గుర్తింపు ఎంవిఆర్‌ నిర్వహించిన దానికే వచ్చింది. అంతగా ఆయన రాయలసీమ నీటి ఉద్యమానికి ప్రతినిధిగా మారారు. నీటి వాద వివాదాల వ్యాఖ్యాత అయ్యారు.  

అదే సమయంలో ఆయన ఆనాటి ఉద్యమానికి ద్రోహం చేశాడని అనే వాళ్లూ ఉన్నారు. ద్రోహం కాకపోయినా.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఆ తర్వాత ఏమీ చేయకుండా ఉద్యమాన్ని వదిలేశాడనే వాళ్లూ ఉన్నారు. కార్మికోద్యమం నుంచి హత్యా రాజకీయాలకు చేరి ఆస్తులు సంపాదించుకున్నాడనే వాళ్లు ఉన్నట్లే  రాయలసీమ ఉద్యమం వల్ల ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదిగాడనే వాళ్లూ ఉన్నారు. దీనికి పూర్తి భిన్నంగా ఆయన రాయలసీమ కోసం త్యాగం చేశాడనే వాళ్లూ ఉన్నారు.  రాయలసీమ ఉద్యమం ముగిసిపోయాక క్రమంగా  రాజకీయాల్లో ఆయన ‘క్రియాశీల’ పాత్ర తగ్గడం మొదలైంది. దీనికి హత్యా నేరాల్లో జెయిలుకు పోవడం తప్ప మరేమీ కాదనే వాదన చేసే వాళ్లూ ఉన్నారు.  

కానీ రాయలసీమను దీర్ఘకాలం వెనుకబాటుతనంలో ఉంచిన ప్యాక్షనిజంలో ఆయన  భాగమయ్యార‌నే మాటను ఎవ్వరూ దాచి పెట్టలేరు.  సీమ ప్ర‌జాస్వామికీక‌ర‌ణ‌కు  ఫ్యాక్ష‌నిజం  తీవ్ర ప్ర‌తిబంధ‌కం. ఇప్పుడు ఆయ‌న వెళ్లిపోయారు కాబ‌ట్టి  దాని గురించి ఎందుకులే అని ఎవ్వ‌రూ విస్మ‌రించ‌లేరు.  కాక‌పోతే  హత్యల సంఖ్యలో తేడా చెప్ప‌వ‌చ్చు. కానీ  హత్యలు చేయించలేదని అభిమానులు కూడా అనలేరు. ఆయన హత్యలు ప్రారంభించలేదని, ఆయన  హత్యలు చేయక తప్పని స్థితి అవతలి వాళ్లు కల్పించారనీ సమర్థించవచ్చు.  

ఇందులో ఊహలకు తావు లేదు. విస్మరణకు అవకాశం లేదు. సమర్థనలకు లొంగవు. ఏ ఒక్క వైపు నుంచో ఆయన దగ్గరికి చేరుకోలేం. దేనికంటే  ఇవన్నీ సమీప చరిత్రలో భాగం. ఒక సందర్భంలో ఆయనే  తాను ఇలాంటి రాజకీయాల్లో భాగమయ్యానని రాసుకున్నారు.  ఇంత చేశాక  ఆల‌స్యంగా ఆయన చాటుకున్న  పశ్చాత్తాప స్వరానికి పెద్ద గౌరవం దక్కలేదు. ఆ సంగతి ఆయనకు  కూడా తెలుసనిపిస్తుంది.

కాకపోతే ఆయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే కావడం తప్ప ఎన్నికల రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయారు.  రాయలసీమ ఉద్యమంలో కూడా ఆంతే. ఆ తర్వాత మళ్లీ నిర్మించలేకపోయారు. గట్టి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఒకప్పటి మార్క్సిస్టు అని, ఒకప్పటి రాయలసీమ ఉద్యమకారుడనే గతం మాత్రమే ఆయనకు మిగిలింది. ఒకప్పటి ఫ్యాక్షనిస్టనే విమర్శ కూడా మిగిలే ఉన్నది.  వీటిలో ఏదీ చెరిగిపోయేది కాదు.  వాటిని మ‌ర‌ణం ఆయ‌న నుంచి వేరు చేయ‌లేవు. ఆయన తన జీవిత చరిత్రను వెనుకటి దినాలనే పేరుతో రాస్తున్నారని తెలిసినప్పుడు ఆసక్తి కలిగింది. కానీ దానికి ఆ పేరు పెట్టడం యాదృశ్చికం కాదు. 

ఆ వెనుకటి జీవితంలోని చైతన్యం వల్ల కావచ్చు.. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముమ్మరమయ్యాక పూర్తి సానుకూల వైఖరి తీసుకున్నారు. వాళ్లకు రాష్ట్రం ఇచ్చేయాల్సిందే అనేవారు. సమైక్య ఉద్యమం మొదలయ్యాక దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.  తెలంగాణ‌కు అనుకూలంగా ఉన్నార‌ని, స‌మైక్య‌వాదాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ర‌ని  అనంత‌పురంలో జ‌రిగిన ఓ స‌భ‌లో ఆయ‌న‌పై అల్ల‌రి మూక దాడి చేసింది. అయినా ఆయ‌న అక్క‌డే త‌న నిస్సంకోచ వైఖ‌రిని ప్ర‌క‌టించి వ‌చ్చారు.  

స‌మైక్య‌వాదాన్ని వ్య‌తిరేకిస్తూ  తిరిగి రాయలసీమ సమస్యల గురించి మాట్లాడారు. రాయలసీమ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నారు.   ఇంకో పక్క ఆయన ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌కు దూరమయ్యారేగాని పార్లమెంటరీ పార్టీలకు దూరం కాలేదు. చివరి దాకా వైసీపీలో కొనసాగారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేదాకా రాయ‌ల‌సీమ గురించి మాట్లాడినంత గ‌ట్టిగా ఆ త‌ర్వాత మాట్లాడ‌లేద‌నే ఆరోప‌ణ ఆయ‌న మీద ఉంది. ఆనాటికి  ఆరోగ్యం బాగా క్షీణించిన మాట కూడా వాస్తవమే. కానీ రాజకీయంగానే రాయలసీమ విషయంలో కూడా మౌనం పాటించారనే వాళ్లు ఉన్నారు. ఇవేవీ నిరాధారం కాదు. 

ఇన్నిటి మధ్యనే ఆయన చాలా  శ్రద్ధగా తన జీవితంలోని మూడో దశను తిరిగి సాహిత్యంతో పెనవేసుకున్నారు. తొలినాళ్ల విప్లవ దృక్పథానికి దూరమైనా ఆయనలో స్వతహాగా  అద్భుతమైన సాహిత్య అభిరుచి ఉన్నది. రచనా శక్తి ఉన్నది. గొప్ప మేధస్సు ఉన్నది. హత్యా రాజకీయాల్లో నిండా ముగినిగి తేలినా ఇవన్నీ మిగిలే ఉన్నాయి. హృదయాన్ని, మేధను ఈ విధ్వంసాల మధ్య కూడా కాపాడుకున్నారు.  నిజానికి ఆయన జెయిలులో ఉన్న రోజుల్లో కూడా రచన ఆపలేదు. కానీ చెప్పుకోదగిన రచనలన్నీ ఆ తర్వాతే రాశారు. 

ఆయన కథలు కూడా రాశారు. కానీ సృజనాత్మక రచయితగా ప్రత్యేకతను సంతరించుకోలేకపోయారు. ఆయన సృజనాత్మకత అంతా అనువాద రచనల్లో చూడవచ్చు. ‘పురోగమనం’, ‘పాపియాన్‌’, గాన్‌ విత్‌ ది విండ్‌ వంటి అనువాదాలు మిగిలిపోయేవి. మృత్యువు ముంచుకొస్తోంటే ఆయ‌న టూకీగా  ప్రపంచ చరిత్ర మూడు  భాగాలు పూర్తి చేశారు. అంత‌క ముందు రాసిన తెలుగు సినిమా స్వ‌ర్ణ‌యుగం ఆయ‌న అభిరుచిని, విశ్లేష‌ణా దృష్టిని  తెలియ‌జేస్తుంది. ఇవ‌న్నీ ఆయ‌న  స్వతంత్య్ర రచనా శైలికి గుర్తు. అంతకంటే ఆయన మేధాశక్తికి గుర్తు. ఆయన సాహిత్య అభిరుచికి ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. కాదంబరి పునర్ముద్రణలో ఆయన చూసిన శ్రద్ధ అసాధారణం. ఆయన విప్లవ రాజకీయాలను వదిలేసుకున్నా, హత్యా రాజకీయాలను సుదీర్ఘ కాలం నడిపినా, వాటిని ఎంత విమ‌ర్శించినా..  ఆయన మేధావి అని అంగీకరించాల్సిందే.   

చివరి దాకా సాహిత్యంతో జీవించారని, రాయలసీమ అస్తిత్వ ప్రతినిధిగా నిలిచారనే విషయాలను ఆయన వ్యక్తిత్వం నుంచి విస్మరించలేం. అట్లాగే ఆయన హత్యా రాజకీయాలను.. అందునా రాయలసీమ సందర్భంలో..  అసలే ప‌క్క‌న పెట్ట‌లేం.  విచిత్రం ఏమంటే ఆ రకంగా కూడా ఆయన రాయలసీమ ప్రత్యేకత గుర్తింపుకు ప్రతీక అయ్యారు. 

ఎంవిఆర్‌ గురించి పూర్తిగా  ఏ ఒక్క సానుకూల ప్రకటన చేయలేం. చేయనవసరం లేదు. అనేక కోణాల ఆయన వివాదాస్పద వ్యక్తిత్వాన్ని సరిగా గుర్తిస్తేనే  ఆయనను అర్థం చేసుకున్నట్లు. ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఆ పని చేయని రాయలసీమ అస్తిత్వవాదులు ఇప్పటికైనా దానికి సిద్ధం కావాలి. 

4 thoughts on “వివాదాస్పద వ్యక్తిత్వం

  1. “కాకపోతే ఆయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే కావడం తప్ప ఎన్నికల రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయారు. రాయలసీమ ఉద్యమంలో కూడా ఆంతే. ఆ తర్వాత మళ్లీ నిర్మించలేకపోయారు. గట్టి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఒకప్పటి మార్క్సిస్టు అని, ఒకప్పటి రాయలసీమ ఉద్యమకారుడనే గతం మాత్రమే ఆయనకు మిగిలింది. ఒకప్పటి ఫ్యాక్షనిస్టనే విమర్శ కూడా మిగిలే ఉన్నది. వీటిలో ఏదీ చెరిగిపోయేది కాదు. వాటిని మ‌ర‌ణం ఆయ‌న నుంచి వేరు చేయ‌లేవు. ఆయన తన జీవిత చరిత్రను వెనుకటి దినాలనే పేరుతో రాస్తున్నారని తెలిసినప్పుడు ఆసక్తి కలిగింది. కానీ దానికి ఆ పేరు పెట్టడం యాదృశ్చికం కాదు.” పరిచయం బావుంది. నిర్మొహమాటం గా చెప్పారు

  2. Maa Satyam
    పాణి గారు రాసిన డాక్టర్ ఎంవీ రమణారెడ్డి గారి గురించి “వివాదాస్పద వ్యక్తిత్వం ” లోతైన విశ్లేషణతో కూడిన వాస్తవాలు తెలిశాయి.
    “విప్లవ రచయితల సంఘం తొలి కార్యవర్గంలో సభ్యుడయ్యాడు. ఆ రోజుల్లో ఆయన వాక్యం సరళంగానే కాదు, పదునుగా ఉండేది. అది విప్లవం వల్ల వచ్చింది. ఇవన్నీ కలిసి ఆయనలోని ఆనాటి ప్రభావశీల వ్యక్తిత్తాన్ని అప్పటి వాళ్లు తలచుకుంటారు. “నిజమే మాలాంటి వాళ్లలో ఆనాటి ప్రభావశీల వ్యక్తిత్వం మా మనసులో నిక్షిప్తమై ఉండడం,
    డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి గారు ఒక రచయితగా అనువాదకుడిగా వాటిని పరిశీలించి చూసినట్లయితే
    వరలక్ష్మి గారు పేర్కొన్నట్టుగా” “సీరియస్ రచనలోకి ఆలస్యంగా వచ్చారు. ఆ ముఠా రాజకీయాలను వదిలేసి ముందుగానే వచ్చి ఉంటే తెలుగు సాహిత్యానికి చాలా మేలు జరిగేది”. గుర్తు చేసుకుంటూ…..

Leave a Reply