వేమన, వీరబ్రహ్మాల్ని తెలుగు పాఠక లోకం ముందు మరోసారి చర్చకు పెట్టినందుకు ముందుగా ప్రజాశక్తి బుక్ హౌస్ వారిని అభినందించాలి. వీరిద్దరూ సామాజిక సంస్కర్తలు, తరువాతే కవులు. ఈ పుస్తకం పేరు ‘‘తెలుగు సాహిత్యంలో వేమన వీరబ్రహ్మం – ఒక సంభాషణ’’. రచయిత జి.కల్యాణరావు. మూడు వందల సంవత్సరాల క్రితం కవులు వేమన, వీరబ్రహ్మ సంఘ సంస్కర్తలు. సాంస్కృతిక విప్లవం మార్పును కోరుతుంది. సంస్మరణ మార్పును కాక మరమ్మత్తులు కోరుతుంది. సంస్కరణ మార్పుకు వ్యతిరేకం కాదు. ముందుస్తు రూపం. పైగా ఈ కవులు కలం పట్టేనాటికి మార్పుకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతం ఇంకా రూపొందలేదు కదా! ఈ నేపథ్యంలో మన సమాజంలో మార్పు కొరకు ప్రారంభమైన సాంస్కృతికోద్యమ చరిత్రకారుడిగా కల్యాణరావు ఈ చిన్న ప్రసంగ వ్యాసంలో భిన్నకోణాల నుంచి వీరిని పరిచయం చేసిన తీరును పరిశీలించాలి.
కల్యాణరావు దృక్పథాన్ని నేపథ్యంగా పెట్టుకుని వేమనను వీరబ్రవ్మాన్ని తులనాత్మకంగా పరిచయం చేయాలి. ఇదీ ప్రణాళిక. ఈ పని చేయడానికి కల్యాణరావుకు ఎన్నో అర్హతలున్నా ఒక పాఠకునిగా వీరిని చదివి పొందిన అనుభూతిని, అనుభవాన్ని మనతో పంచుకుంటానని అంటారు.
వేమన, వీరబ్రహ్మాల సాహిత్యంతో నాకున్న కొద్దిపాటి పరిచయాన్ని దృష్టిలో వుంచుకుని చూస్తే వారి సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ చిన్న పుస్తకం ఒక మ్యానిఫెస్టో అనిపిస్తుంది. వీరిని అధ్యయనం చేయడానికే కాదు ఏ కవిని అధ్యయనం చేయడానికైనా పనికొచ్చే ప్రణాళిక ఈ పుస్తకంలో వుంది. పైగా ‘‘ఒక సంభాషణ’’ అన్న మాటను ప్రయోగించారు. ఈ ఒక్క మాటనే చాలా అర్థాన్నిస్తుంది. వేమన వీరబ్రహ్మాలతో కల్యాణరావు సంభాషిస్తున్నారా? కల్యాణరావు పాఠకుల్లో సంభాషిస్తున్నారా? లేక వేమన వీరబ్రహ్మాలు పాఠకుల్లో సంభాపషిస్తున్నారా? అనే అనేక అర్థాలొస్తున్నాయి. కొడవటిగంటి కుటుంబరావును గురించి రాస్తూ వరవరరావు ఒక రచన చేయడమంటే సమాజంతో సంభాషణ అని అర్థం చేసుకున్నవారు కొ.కు. అని ఒక చోట అంటారు. ఈ మాట ఇక్కడ కూడా అన్వయిస్తుంది. వేమన వీరబ్రహ్మాలు సమాజంతో మాట్లాడిన తీరును కల్యాణరావు ఇందులో వివరించారు.
ఈ పుస్తకంలో మొత్తం పది భాగాలున్నాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్క విషయానికి ప్రాధాన్యత నిచ్చింది.
మొదటి భాగంలో తెలుగు సాహిత్యంలో వేమన, వీరబ్రహ్మాల స్థానమేమిటో వివరించారు. మిగతా అన్ని భాగాలకు సంబంధించిన విషయాల్ని స్థూలంగా ప్రస్తావించారు. ఈ ఇద్దరు కవులపై పరిశోధించిన వారిని ప్రస్తావించి, వేమన వీరబ్రహ్మాల సాహిత్య స్వభావాన్ని స్థూలంగా పరిచయం చేశారు. రాజుల సేవ, ప్రణయ శృంగారాలు సాహిత్యం కాదని సమాజాన్ని పట్టి పీడిరచే సమస్త కల్మషాన్ని ఎండగట్టడమే వారి పని అని ప్రబంధకవుల్ని వ్యంగ్యంగానూ, వీరి సేవా దృక్పథాన్ని బాధ్యతాయుతంగానూ వివరించారు.
రెండో భాగంలో మొత్తం సాహిత్యలోకంలోని ప్రగతి వ్యతిరేక శక్తులు వీరిపై కత్తిగట్టినా ప్రజల నోళ్ళు మాత్రం మూతపడవని కల్యాణరావు అంటారు. ఎందుకింత బలంగా ఈ ఇద్దరు కవులు ప్రజల నోళ్ళలో నిలిచిపోయారని ప్రశ్నించుకుంటే సమాధానంగా వచ్చేది వారేర్చరచుకొన్న తాత్విక నేపథ్యమేనని అన్నారు. ‘అది చార్వాకులను లోకాయుతులు అని పిలుస్తారు. లోకాయతులంటే ప్రజల్లో విశేషంగా కలిసిపోయినవాళ్లని అర్థం’ అంటారు కల్యాణరావు. వారు ప్రబోధించిన ఈ లోకాయుతమే వారి సంస్కరణకు మూలమంటారు. ఇక మిగతా భాగాల్లో లోకాయతానికి సంబంధించిన అంశాల్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి ఎన్నుకున్న పద్ధతి అందులోని సౌలభ్యాన్ని భాషను వివరిస్తారు.
ప్రజల పక్షం కవులు ఎందుకు నిలబడాలి అన్న ప్రశ్నకు వేమన వీరబ్రహ్మాల ఆధారంగా కల్యాణరావు వివరిస్తారు. సమాజంలో తమ చుట్టూ వున్న అమానవీయ విలువల్ని ప్రశ్నించడం, శ్రామికుల పక్షం మాట్లాడడం కవులకు సంబంధించిన విషయమని, ఈ ఇద్దరు కవులు చెప్పిన తీరును వివరిస్తారు. పునాది అంశంలోనూ, ఉపరితల అంశంలోనూ, ప్రజా వ్యతిరేక విధానాలు, ఆచార వ్యవహారాలు ఎలా కొనసాగుతున్నాయో, ఎవరి కొరకు కొనసాగుతున్నాయో వేమన, వీరబ్రహ్మం ఇద్దరూ వివరించారని కల్యాణరావు అంటారు. ఈ వివరణకు ఏ లక్షణ గ్రంథాలు, సాంఘిక రాజకీయ సిద్ధాంతాలు వీరు చదువుకోలేదు. రామాయణ మహాభారతాల ప్రభావం కాని, ప్రస్థావన కాని వుండదు. తమ కళ్ళముందు జరుగుతున్న అమానుష కృత్యాల్ని నిరసించడమే వీరిద్దరి ధ్యేయం. శ్రమను గౌరవించాలని, యజ్ఞయాగాలు, క్రతువులు ఇవన్నీ పరభాగ్యోప జీవులు ఏర్పరచుకున్న విధానాలని వేమన, వీరబ్రహ్మం వివరించారని కల్యాణరావు అంటారు.
ప్రజా సమస్యల్ని వివరించాలనుకునే వారు, సంక్షిష్ట విషయాల్ని వివరించాలనుకునే వారు రాసేవారిగానే వుండి పోలేదు ఈ ఇద్దరు కవులు. ప్రజలకు తమ సమస్యల్ని తేలికగా బోధపడే భాష అన్వయ కాఠిన్యం లేని పద్య నిర్మాణం, ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అర్ధం చేసుకోగల వివరణలు ఈ ఇద్దరి సొంతం.
ఆనాటి రాజకీయ సాంఘికోద్యమాలకు వ్యాసం, పాట ముఖ్య పాత్రను నిర్వహించాయి. సామాజిక స్థితిని బట్టి ఏ రూపం ద్వారా తమ సందేశం ప్రజల్ని చేరుకుంటుందో గుర్తించిన వారు ఈ ఇద్దరు కవులు. వీరబ్రహ్మం ఇంకో అడుగు ముందుకేసి పాటను కూడా తన సందేశానికి వాడుకున్నాడు. తన తత్వాన్ని ముందుకు తీసుకు పోగల కార్యకర్తల్ని కూడా వీరబ్రహ్మం నిర్మించుకోగలిగాడు.
రచయిత నిబద్ధత ఎలా వుంటుందో! ఈ ఇద్దరి రచయితల్ని చదివితే అర్ధమౌతుంది. రచనల్లో ప్రజా పక్షం నిలబడి, ఉద్యమాలకు దూరంగా వుండి సన్మాన సభల్లో కనిపించే ద్వంద్వ స్వభావం నేడు రచయితల్లో కనిపిస్తూ వుంది. సందేశం, ఆచరణల్లో వైరుధ్యం లేని కవులు వేమన, వీరబ్రహ్మం.
వీరి ప్రత్యేకతను కల్యాణరావు ఇదే పుస్తకంలో ఒక చోట వివరిస్తారు. ‘‘పదానికున్న ప్రాణం తీసేస్తే పాండిత్యమైంది. గానానికున్న స్వేచ్ఛను చంపేస్తే సంగీతమైంది’’ అని కల్యాణరావు అంటారు. పదానికి పాండితీ ప్రకర్ష కాదు ముఖ్యం. ప్రజలకు కనువిప్పు కలిగించి కదిలించడం ముఖ్యం. సంక్షిష్టమైన జీవిత సమస్యల్ని సులభంగా ఆవిష్కరించడం ముఖ్యం. మాటకు ప్రాణం సత్యమే కదా! ఆ విధంగా ఈ ఇద్దరు కవులు పదాలకు ప్రాణం తీయకుండా ప్రాణప్రతిష్ట చేశారు. వాటికి ప్రాణముంది కాబట్టే ప్రజల్ని చేరుకోగలిగాయి.
ప్రజల కోసం రాసే వాళ్ళను సాటి రచయితలు, సమాజాన్ని శాసించే వారు ఎలా అణగదొక్కడానికి ప్రయత్నిస్తారో ఈ పుస్తకం వల్ల కొంత తెలుస్తుంది. సి.పి.బ్రౌన్ సేకరించిన ఐదు వందల వేమన పద్యాల్లో యాభై పద్యాలే కాలేజీ బోర్డుకు పాఠ్యాంశంగా అందాయి. మిగిలిన 450 పద్యాలు గుజరీలో బయట పడినాయంటే ప్రజా కవుల పట్ల అధికారుల వైఖరేంటో అర్ధమౌతుంది. అలాగే వీరబ్రహ్మం కాలజ్ఞానాన్ని టి.టి.డి. అచ్చు వేయాలనుకొంటే ‘‘కాలజ్ఞానం అనబడేది ప్రక్షిప్తమయం, బ్రహ్మంగారు అక్షరం ముక్క తెలియని పామరుడు, కనక తనంతట తానేదీ రాయలేడు. కనుక దేవస్థానం వాళ్ళు దీని ముద్రణను అంగీకరించడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నాం’’ అని హిందూ దినపత్రికకు ఒక లేఖ వచ్చింది.
ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఘర్షణ కూడా అదే స్థాయిలో వుంటుంది. సమాజంలోని వ్యక్తులే రచయితలు కనుక ఘర్షణలకు తటస్తులుగా వుండటం అసాధ్యం. అణచివేత సంస్కృతికి వ్యతిరేకంగా వేమన, వీరబ్రహ్మం నడుం బిగించిన తీరు – దాని ఆవశ్యకత ` రచయిత విధులు కల్యాణరావు ఇందులో వివరించారు. ఆనాటి సామాజిక పరిణమాలను, ఉద్యమాలను, సమాంతరంగా వెలువడిన సాహిత్య చరిత్రను, దాన్ని ఇవాళ అధ్యయనం చేయాల్సిన పద్ధతిని ఈ చిన్న పుస్తకం గుర్తింపజేస్తుంది.