ప్రభువెక్కిన పల్లకి కాదోయ్
అది మోసిన బోయీలెవ్వరని
ప్రశ్నించి, ‘మానవ చరిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీశ్రీని, ఆయన మహాప్రస్థానాన్ని ఈ రోజు (నవంబర్ 30న) తిరుపతిలో కొందరు పల్లకిలో ఊరేగించారు. ఈ కాలపు వికృత, జుగుప్సాకర సన్నివేశమిది. ఆదర్శాలు, విలువలు, విశ్వాసాలు తలకిందులుగా ఊరేగిన దృశ్యమిది. మారుమూల బొరియల్లో వినిపిస్తుండిన మూలుగులు నడిరోడ్డు మీద వికటాట్టహాసమైన తీరు ఇది. శ్రీశ్రీని నిలువునా పాతేసి ఆయన శవానికి చేసిన సర్వాలంకృత వేడుక ఇది.
మహాప్రస్థానం భారీ సైజ్‌లో అచ్చు వేయడమే విడ్డూరం. అది చదువుకోడానికి పనికి వచ్చేది కాదు. ఏ లాభాపేక్ష లేకుంటే దాన్ని సాహిత్యలోకంలోని, ప్రచురణ రంగంలోకి ‘ముచ్చట’ అనుకోవచ్చు. కానీ అది అక్కడితో ఆగుతుందని అనుకోలేదు. వ్యక్తిగత అభిరుచి అచ్చోసుకొని జనం మధ్యలోకి వచ్చేసింది. నిజానికి మహాప్రస్తానం భారీ సైజ్ దానికదే సమస్య కాదు. దాని చుట్టూ ఒక ఆడంబరం మొదలైంది. ఆ మధ్య విజయవాడలో ‘అందరూ’ కలిసి దీన్ని ఆవిష్కరించారు. ఆ కలయికే అసంబద్ధం. శ్రీశ్రీ ఆలోచనలకు, ఆశయాలకు విరుద్ధమైన కలయిక అది. ‘అందరూ’ కలిసి శ్రీశ్రీ ఆశయాల కోసం పని చేయడం కష్టం.. ఇదుగో ఇలాంటి పనులే సాధ్యం. పోలీసులతో, రాజకీయ నాయకులతో, అధికార యంత్రాంగంలో కీలక అవినీతి అధికారులతో కలిసే దాకా భారీ సైజ్ ముచ్చట వికటించింది.
ఇప్పుడు అది నడివీధుల పల్లకి సేవగా మారింది.
మనుషులు చేసే ప్రతి పనికీ ఒక అర్థం ఉంటుంది. లేదా ప్రతి పనీ ఒక అర్థవ్యాఖ్యానం కోరుకుంటుంది. సరిగ్గా అదే జరిగింది. పెద్ద ఇండ్లు లేకుంటే దాచుకోవడమూ కష్టమయ్యే భారీ మహా ప్రస్థానం ఏకంగా పల్లకి ఎక్కడం యాదృశ్చికం కాదు. ముచ్చటగానో, వెర్రిగానో మొదలై ఒక అభ్యంతరకర విలువగా మారి పల్లకి సేవగా తార్కిక ముగింపుకు చేరుకుంది.
ఏ పని చేయాలో, ఏది చేయకూడదో విచక్షణ లేకపోవడం, శ్రీశ్రీ పేరుతో ఏది చేసినా చెల్లుబాటవుతుందని అనుకోవడం, శ్రీశ్రీ ని భావావేశంగా మార్చాలనుకోవడం వంటివి ఈ పనిలో లేవా? దీన్ని కేవలం శ్రీశ్రీ అంటే అతిశయంగా, అత్యుత్సాహంగా, మతిలేని ప్రేమగానే చూడగలమా?
నిజానికి ఇది తెలుగు సాహిత్యరంగంలోని పాపులిస్టు ధోరణికి రుజువు. ఇది మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తోంది కాని, సాహిత్యం పేరుతో సాగే ఉత్సవ క్రీడలు, వేడుకలు, భజన కీర్తనలు, కవిత్వం మీది ప్రేమే పరమంగా మారడం, కవిత్వం కవిత్వం కోసమే అనడం, దాని కోసం చేసే పనులన్నీ జీవితాన్ని ఉద్ధరించేవని ప్రకటించడం.. వంటి ఎన్నో వికృత విశేషాలు ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. ఈ పాపులిస్టుగా ధోరణుల పక్కనే కెరీరిస్టు విన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. ఏది ఏదో తెలియనంతగా ఈ రెండూ కలగలసిపోయాయి. కలిసే ఉంటాయి.
చాలా మందికి తమలోని ‘ప్రగతిదాయకత’ను చాటుకోడానికి శ్రీశ్రీ ఒక సాధనం. నిజానికి శ్రీశ్రీది ఇలాంటి వాళ్లకు లొంగే వ్యక్తిత్వం కాదు. ఆయనే స్వయంగా చెప్పుకున్నతన పరిమితులు ఇలాంటి వాళ్లకు ఆసరా కావచ్చేమోగాని మహాప్రస్థానం నుంచి మరో ప్రస్థానం దాకా శ్రీశ్రీ రాడికల్ జర్నీ చేశాడనే సంగతి మర్చిపోడానికి లేదు. తనలో ఉన్న సంప్రదాయ ఛాయలన్నీ తుడిచేసుకొని ముందుకు సాగాడు. కానీ ఇప్పుడాయను ఒక ఆరాధనా మూర్తిగా మార్చేశారు. మహాప్రస్థానాన్ని పల్లకిలోని పూజా వస్తువుగా మార్చేశారు. ఒక పక్క భారీ సైజ్ తోపాటు పాకెట్ సైజ్ ‘రెడ్ బుక్’గా కూడా మహాప్రస్థానాన్ని ముస్తాబు చేశారు. దాన్నీ ఊరేగించారు.
ఇలాంటి విన్యాసాలను చూసి కొందరు తెలుగు సాహిత్యమంతా భ్రష్టు పట్టిపోయిందని గుండెలు బాదుకుంటారు. ప్రగతిశీల భావజాలంలో ఉన్నా ప్రగతిని చూడలేక నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. ఇంకొందరు శ్రీశ్రీ పరిమితులను మాత్రమే చూసి, వాటిని అడ్డం పెట్టుకొని ప్రగతిశీల వారసత్వం మీదే దాడి చేయడానికి ఇలాంటి వాటిని సాకు చేసుకుంటారు.
వీటన్నిటి మధ్యనే శ్రీశ్రీ వారసులు ప్రొ. సాయిబాబా, వరవరరావు, ప్రజాకళాకారుడు కోటి యావజ్జీవ, నిరవధిక జైలు జీవితంలో ఉన్నారు. కాగితం మీది అక్షరానికి బలైపోవడానికి సిద్ధమయ్యారు. జైలు మధ్యనే తెలుగు జాతిని ప్రభావితం చేయగల రచనలు చేస్తున్నారు. నిన్న మొన్ననే ప్రముఖ రచయితలు కళ్యాణరావు, అరసవిల్లి కృష్ణ ఇండ్ల మీద ఎన్ ఐఏ పోలీసులు దాడులు చేశారు. ఈ తావులన్నిటా గొప్ప ధిక్కారం ఉన్నది. శ్రీశ్రీ చారిత్రక స్పూర్తి అక్కడ ఉంది. అది రూపొందుతున్న ప్రపంచం. చివరికి శ్రీశ్రీ వంటి గతం కూడా కాదు. శ్రీశ్రీ కవిత్వంలోని మరో ప్రపంచం. దాని కోసం అక్షరాలా సిద్ధమైన వాళ్ల సాహిత్యంలో శ్రీశ్రీ స్పూర్తి రవరవలాడుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ వీళ్లు శ్రీశ్రీని పల్లకి ఎక్కించారు. కాకపోతే వాళ్లు ఊరేగిచింది శ్రీశ్రీని కాదు. మహా ప్రస్థానాన్ని కాదు. ఫ్యూడల్ బ్రాహ్మణీయ సంస్కృతిని. ఆ సంగతి తెలియకుండా ఈ పని చేశారని ఎలా అనుకోగలం?
Maa Satyam
” శ్రీశ్రీకి పల్లకి మోత”
పాణి రాసిన వ్యాసంలో తార్కిక తాత్విక పరమైన విశ్లేషణతో
“ప్రభువెక్కిన పల్లకి కాదోయ్
అది మోసిన బోయీలెవ్వరని
ప్రశ్నించి, ‘మానవ చరిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీశ్రీని, ఆయన మహాప్రస్థానాన్ని ఈ రోజు (నవంబర్ 30న) తిరుపతిలో కొందరు పల్లకిలో ఊరేగించారు.
ఈ కాలపు వికృత, జుగుప్సాకర సన్నివేశమిది. ఆదర్శాలు, విలువలు, విశ్వాసాలు తలకిందులుగా
ఊరేగిన దృశ్యమిది”.
అక్షరాల నిజమే పాణి గారు!
గతి తార్కిక దృష్టితో పల్లకి సేవ లోని విష సంస్కృతిని తెలుగు సాహిత్య లోకం ముందు నిలబెట్టారు. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
మహాప్రస్థానాన్ని
(నవంబర్ 30న) తిరుపతిలో కొందరు అవార్డు గ్రహీత కవులు, మేధావులు, జర్నలిస్టులు, విమర్శకులు, రాజకీయ నాయకులు ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొని జేజేలు పలకడం సింబాలిక్గా రాజ్యము బహుముఖ రూపాలలో చేస్తున్నా దాడులకు ప్రతిరూపమే ఈ పల్లకి సేవ.
ఈ పల్లకి ఊరేగింపు లో పాల్గొన్న వారికి నిజంగానే శ్రీ శ్రీ మహాప్రస్థానం వారి జీవితాల్లో చైతన్య స్ఫూర్తిని కలిగించి ఉంటే, స్ఫూర్తి పొంది ఉంటే, ఇలాంటి ఈ పల్లకి సేవ నిర్వహించకుండా, మరొక ఉద్యమ రూపంలో రాజ్యము పై నిరసన తెలిపేవారు.
రాజ్య నిర్బంధాన్ని ప్రశ్నించేవారు, ప్రతిఘటించే వారు, ఇలా పల్లకి సేవలతో కాలయాపన చేసే వారు కాదు. ఈనాడు మనం ఎవరి పక్షాన నిలబడదాం? రాజ్యము అవలంబిస్తున్న నిర్బంధం వైపా? లేక నవ సమాజ నిర్మాణానికి తమ అమూల్యమైన జీవితాలను అంకితం చేస్తూ నిర్బంధ జీవితాలు అనుభవిస్తున్న విప్లవ ఉద్యమకారుల వైపా?
అంతర్జాతీయ దృక్పధాన్ని కలిగి ఉన్న కవి, కళాకారుడు, రచయిత, మేధావి, నలువైపులా వ్యాపించి ఉన్న క్రూరత్వాన్ని కళారంగంలో ఉన్న ఎవరు కూడా చూస్తూ తటస్థంగా ఉండలేరు.
1930 లలో ప్రపంచ సైద్ధాంతిక రాజకీయ సంక్షోభంలో పడినప్పుడు మేధావులు రెండు విరుద్ధమైన ధోరణుల మధ్య నుంచి ఒకటి ఫాసిస్టు రెండవది కమ్యూనిస్టు ఒక ఏకైక చారిత్రక అవసరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు కవులు మేధావులు తమ మద్దతును సంఘీభావం చూపిస్తూ కమ్యూనిస్టుల వైపు నిలబడ్డారు. ఈనాడు ఈ అవార్డు గ్రహీత కవులు, కళాకారులు, బుద్ధి జీవులకు, ప్రగతిశీల వామపక్ష పార్టీల అందరి ముందు ఒక చారిత్రాత్మకమైన అవసరంగా మన అందరి ముందు ప్రశ్నార్థకం గా నిలబడి ఉంది.
ఈ నాడు దేశ ప్రజల ముందున్న ప్రశ్న?
Looks cheap- needs maturity—think twice