ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాల ఒత్తిడి, పెరిగిన ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్ల కారణంగా తడబడుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా వెల్లడిరచిన ప్రపంచ ఆర్థిక ధృక్కోణం(వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్) రానున్న రోజుల్లో ప్రపంచ ప్రగతి దిగజారనుందని జోస్యం చెప్పింది. ఇతరత్రా అనేక మంది ఆర్థికవేత్తల విశ్లేషణలు, దేశాలు, ప్రాంతాల పనితీరును చూసినా అధోగతి తప్ప పురోగతి కనుచూపు మేరలో కనిపించటం లేదు. గతేడాది (2022) ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం ఉండగా వర్తమానంలో (2023) మూడు, వచ్చే ఏడాది (2024) 2.9 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2000 నుంచి 2019 వరకు సగటు ప్రపంచ వృద్ధిరేటు 3.8 శాతం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి సగటు కంటే తక్కువగా ఉండడం మరింత ఆందోళనకరంగా ఉంది. ఐరోపాలో పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న జర్మనీ పురోగమనం తిరోగమనంలోకి దిగజారుతుందా అన్న భయాలు ఉన్నాయి. ఇప్పటికే అది రోగిగా మారినట్లు వర్ణిస్తున్నారు.
సంపన్న దేశాల వృద్ధిరేటు గతేడాది 2.6 శాతం ఉండగా ప్రస్తుత ఏడాదిలో 1.5, వచ్చే ఏడాది 1.4 శాతానికి దిగజారుతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు 4.1 నుంచి 4 శాతానికి తగ్గుతుందని అంచనా. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే అన్న ప్రాతిపదిక మీద చెప్పిన మాటలు. యుక్రెయిన్ సంక్షోభం కొత్త సమస్యలను తెచ్చి పెట్టింది. ఐఎంఎఫ్ తాజా అంచనాలను రూపొందించే సమయానికి ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఉహలో కూడా లేదు. అమెరికా తన ఆయుధ పరిశ్రమలకు లాభాలను సమకూర్చేందుకు ప్రపంచంలో ఎప్పుడు ఏ మూలన చిచ్చుపెడుతుందో, అది అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పలేము. ఇటువంటి స్థితిలో ఎగుమతుల మీద ఆశలు పెట్టుకున్న మన లాంటి వర్ధమాన దేశాల పరిస్థితి మరింత అగమ్యగోచరం, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎగుమతుల్లో మిగులు ఉన్న చైనాకు వాణిజ్య మిగులు తగ్గవచ్చు తప్ప ఇప్పటికిప్పుడు వాణిజ్య లోటులో పడే అవకాశం లేదు.
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అమెరికా తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలు యావత్ ప్రపంచాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. ఫెడరల్ బ్యాంకు వడ్డీరేటును పెంచటంతో ప్రపంచంలో ఉన్న డాలర్లన్నీ అమెరికాకు పయనం కట్టటం, దాని విలువ పెరగటంతో అనేక దేశాల కరెన్సీల విలువ పతనమౌతున్నది. అది కష్టజీవుల మీద ఎనలేని భారాన్ని మోపుతున్నది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2024లో 5.8 ఉంటుందని అంచనా. ఇదేమీ తక్కువ కాదు. రెండు శాతానికి పరిమితం చేయాలన్న ప్రపంచ ద్రవ్యోల్బణ లక్ష్యం ఎప్పటికి నేరవేరుతుంది అన్నది ప్రశ్నే. మనదేశంతో సహా అనేక దేశాలు తీవ్రమైన ద్రవ్య లోటును ఎదుర్కొంటున్నాయి. అమెరికా విత్తలోటు 8 నుంచి వచ్చే ఏడాదికి 7.4 శాతానికి, ఐరోపాలో 3.4 నుంచి 2.7 శాతానికి తగ్గుతుందని చెబుతున్నారు.
సమీప భవిష్యత్త్‌లో ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ఎగుమతి దేశాలు తమను తాము కాపాడుకునేందుకు ఉత్పత్తి, సరఫరాను తగ్గించాలన్న నిర్ణయం దిగుమతి దేశాలకు ఆశనిపాతమే. ఒకవైపు రష్యా ఇంధన ఎగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించి దాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపాకు ఇంధన సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్-2 పైప్లైన్లను ధ్వంసం చేయించింది అమెరికాయే అనే వాస్తవాలు వెల్లడయ్యాయి. యుక్రెయిన్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని తన ఇంధనాన్ని ఎక్కువ ధరలకు ఐరోపాకు అంట గట్టేందుకు చేసిన కుట్ర ఇదని అందరికి తెలిసిన విషయమే. తనను నమ్మిన యూరప్ దేశాలకే అమెరికా పంగనామాలు పెడుతోంది. ఇప్పటికే ఐరోపా దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో సతమతమౌతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ దేశాలు ఎంత మేరకు తట్టుకోగలవు అన్నది ప్రశ్న. అంతిమంగా కార్మికవర్గం మీదనే ఆ భారాలు మోపుతారన్నది వేరే చెప్పనవసరం లేదు.
ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా పెరిగిన ద్రవ్యోల్బణం గృహస్తుల పొదుపును ఇప్పటికే హరించింది. దీంతో కొంతమేరకు ఒత్తిడి తీవ్రత తగ్గింది తప్ప దాని పర్యవసానాలైన పెరిగిన రుణభారం, ఇతర వ్యవస్థాగత ప్రతికూలతలు ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి. ప్రపంచ మంతటా వాణిజ్య విశ్వాస సూచిక దిగువ చూపులు చూస్తున్నది. ప్రజల ఆదాయాలు సన్నగిల్లి కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా మార్కెట్లో గిరాకీ తగ్గుతున్నది, ఆ మేరకు ఉత్పత్తిని తగ్గిస్తే నిరుద్యోగం తీవ్రత పెరుగుతుంది. అది గిరాకీని మరింతగా తగ్గిస్తుంది. అలాంటప్పుడు ఆర్థికంగా కోలుకోవటం ఎలా అన్నది ప్రశ్న. తాజా ప్రపంచ ఆర్థిక దృక్కోణ నివేదిక (వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్) వెల్లడిరచిన అంశాలు పరిస్థితి మరింతగా దిగజారటాన్నే సూచిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం.
అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం పొరుగు దేశాలకు విస్తరించటం జరిగితే చమురు ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేస్తోంది. గాజాను నియంత్రించే మిలిటెంట్ సంస్థ హమస్, ఇజ్రాయెలీ రక్షణ దళాల మధ్య చెలరేగిన ఘర్షణ పర్యవసానంగా ప్రపంచ చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. యుద్ధం ముందు బ్యారెల్‌కు 84 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర నవంబర్ చివరి నాటికి 90.8 డాలర్లకు పెరిగింది. జరుగుతున్న యుద్ధానికి మూడు ప్రమాదకర అవకాశాలు ఉన్నాయని, ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రమాదకర అవకాశాలు ఇలా ఉన్నాయి: మొదటిది, యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీనాల వరకే పరిమితం కావటం, రెండవది, యుద్ధం లెబనాన్, సిరియాలకు విస్తరించటం, మూడవది, ఇజ్రాయెల్ ఇరాన్‌తో ప్రత్యక్షంగా తలపడటం. ఈ మూడు అవకాశాలు కూడా చమురు ధరలను, ద్రవ్యోల్బణాన్ని పెంచటమే కాకుండా ప్రపంచ ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తాయి.
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం అంటూ జరిగితే అది అన్నింటికంటే వినాశకారిగా పరిణమించనుంది. యుద్ధం విస్తృతి పెరిగితే దాని ప్రభావం ప్రాంతీయంగా కాకుండా యావత్ ప్రపంచం పైన పడుతుంది. మధ్య ప్రాచ్చం చమురు సరఫరాకు ప్రధాన కేంద్రంగానే కాకుండా అది ప్రముఖ నౌకాయాన మార్గంగా కూడా ఉంది. అక్కడ గనుక యుద్ధం జరిగితే అది ప్రపంచాన్నే కుదుపుతుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అదే జరిగితే చమురు ధర బ్యారల్ 150 డాలర్లదాకా పెరుగుతుంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అంచనా ప్రకారం 2024లో 5.8శాతంగా ఉంటుందనుకున్న ద్రవ్యోల్బణం 6.7 శాతానికి పెరుగనుంది. 1.7 శాతం పెరగవలసిన ప్రపంచ ఆర్థికాభివృద్ధి 1 శాతం కుంగిపోతుంది. ఇది ఒక ట్రిల్లియన్ డాలర్లకు సమానం(80 లక్షల కోట్ల రూపాయలకు మించి) ఉంటుంది.
1982 తరువాత ఆర్థిక పరిస్థితి ఇంత ప్రతికూలంగా ఎన్నడూ లేదు. ఒకవేళ ఇరాన్ గనుక హోర్ముజ్ జలసంధి(హోర్ముజ్ జలసంధి, పర్షియన్ సిందుశాఖకు, ఒమన్ సింధుశాఖకూ మధ్య ఉన్న జలసంధి. ఇది పర్షియన్ సింధుశాఖ నుండి మహా సముద్రాల్లోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం) ని మూసివేస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచినా ఉపయోగం ఉండదు. ఈ జలసంధి గుండా ప్రపంచ చమురులో 5వ వంతు రవాణా అవుతోంది. ఇది ఫైనాన్షియల్ మార్కెట్‌ను కూడా అతలాకుతలం చేస్తుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ ప్రభావం చాలా వేగంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిపై పడుతుంది. ఇప్పటికే యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపైన విధించిన ఆంక్షల ప్రభావంతో ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో పెనుమార్పులు సంభవించాయి. ఇంధన ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతంలో మరో యుద్ధమే గనుక జరిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేస్తోంది.
మాంద్యం అంచున యూరోపియన్ యూనియన్ :
వర్తమాన సంవత్సరాంతానికి యూరోపియన్ యూనియన్ మాంధ్యంలో మునిగిపోనున్నదని మాజీ ఇటాలియన్ ప్రధాని, మాజీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఇసిబి) అధ్యక్షుడు మారియో ద్రాగీ ఫైనాన్షియల్ టైమ్స్‌కి చెప్పాడు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో యూరోజోన్ ఆర్థిక వ్యవస్థ అంతకు ముందటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) తో పోల్చినప్పుడు 0.1 శాతం కుదింపుకు గురైందని గణాంకాల ఏజెన్సీ యూరోస్టాట్ అంచనా వేసింది. వర్తమాన సంవత్సరాంతానికి యూరోజోన్‌లో మాంద్యం వస్తుందని, రానున్న సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాలలో ఈ విషయం బయటపడుతుందని ద్రాగీ అన్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది. తక్కువ స్థాయి ఉత్పాదకత, ఇంధన వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోవటం, తగినంత ప్రావీణ్యత గల శ్రామికులు లేకపోవటం వంటి కారణాల వల్ల యూరోపియన్ యూనియన్ మాంధ్యంలోకి జారుకోబోతోందని ఆయన విశ్లేషించాడు. గత 20 సంవత్సరాలుగా అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లతో యూరోప్ పోటీపడలేకపోతున్నదని కూడా ఆయన అన్నాడు.
యుక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుండి పశ్చిమ యూరప్ దేశాలతో తగినంతగా డిమాండ్ లేకపోవటం వల్ల యూరోజోన్ ఆర్థిక వ్యవస్థ గత రెండు సంవత్సరాలుగా వేగంగా కుదింపుకు గురౌతోందని తాజగా విడుదలైన స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పి) గ్లోబల్ నివేదిక తెలియజేస్తోంది. వ్యాపార కార్యకలాపాలను స్థాయిని కొలిచే పర్చేజింగ్ మేనేజర్స్ సూచిక (పిఎమ్‌ఐ) ప్రకారం సెప్టెంబర్‌లో 47.2 పాయింట్లున్న సూచిక అక్టోబర్‌లో 46.5 పాయింట్లకు పడిపోయింది. ఇది ఉత్పత్తి పతనాన్ని సూచిస్తోంది. వరుసగా ఐదు నెలల పాటు ఈ సూచిక 50 పాయింట్ల నుంచి పతనమౌతూ వస్తోంది. ఉత్పత్తి పతనంతో పాటు ఉద్యోగ కల్పన కూడా స్తంభించిందని ఎస్ అండ్ పి నివేదిక పేర్కొంది. జర్మనీ, ఫ్రాన్స్‌లలో పతనం వేగవంతం అవుతోంది. ఇటలీ గత సంవత్సరం నుంచే పతనావస్థలో ఉంది. స్పెయిన్‌లోని ప్రైవేటు రంగంలో వృద్ధి అక్టోబర్‌లో స్తంభించింది. యూరోజోన్ ఆర్థిక వ్యవస్థలో ఇంతగా పతనం ఎన్నడూ సంభవించలేదు. యూరోజోన్‌లో అంతిమ త్రైమాసికంలో సేవారంగం మరింతగా కుదేలయింది. రానున్న కాలంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని బ్లూమ్‌బర్గ్ బ్యాంకు చీఫ్ ఎకనామిస్టు సైరస్ డి లా రూబియా అన్నది.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఒఇసిడి) ప్రకారం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు 2024లో వాటి ఆర్థిక వ్యవస్థలు క్షీణించనున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2023లో 2.4 శాతం నుండి 2024లో కేవలం 1.5 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అందుకు కారణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు మార్చి 2022 నుంచి పెంచుతూ పోవడం వల్ల 11 శాతం వృద్ధిని నిరోధించిందని ఒఇసిడి తెలిపింది. ఫెడ్ అధిక వడ్డీరేట్లు వినియోగదారులకు, వ్యాపారాలకు రుణాలను ఖరీదైనవిగా చేశాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, ఎగుమతులు మందగించాయి. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ 2023లో 5.2 శాతం నుండి 2024లో 4.7 శాతానికి మాత్రమే విస్తరిస్తుందని అంచనా వేసింది. యూరో కరెన్సీని పంచుకునే ఇయూ దేశాలు ఈ 2024లో 0.9 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. దీంతో యూరో కరెన్సీని పంచుకునే 20 ఇయూ దేశాలు కూడ ప్రపంచ మందగమనానికి దోహదం చేసే అవకాశం ఉందని ఒఇసిడి తెలిపింది.
రుణ ఊబిలో ప్రపంచ దేశాలు :
2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యూరోజోన్‌లో ఉత్పత్తి పతనం అవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోని సగం దేశాలు ప్రభుత్వ రుణభారంతో ప్రమాదంలో పడ్డాయని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొంది. రుణభారాన్ని తగ్గించుకునే అవకాశంలేక 52 దేశాలు దివాళా దిశగా పయనిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించాడు. పెరుగుతున్న రుణ సమస్య పట్ల, వాణిజ్యం, అభివృద్ధిపైన ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యుఎన్సిటిఎడి) నివేదికలోని విషయాలను గురించి ఆయన మాట్లాడాడు. 330 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న 52 దేశాలు తాము ఆరోగ్యంపైన లేక విద్యపైన చేస్తున్న వ్యయం కంటే చేసిన అప్పులపైన కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని గుటెర్రెస్ అన్నాడు. యుఎన్సిటిఎడి ప్రకారం కనీసం 19 వర్ధమాన దేశాలు తాము విద్యమీద చేస్తున్న వ్యయం కంటే వడ్డీ ఎక్కువగా కడుతున్నాయి. మరో 45 దేశాలు ఆరోగ్య సంరక్షణ మీద చేసే వ్యయం కంటే వడ్డీ మీద ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ప్రకారం ప్రపంచంలో 40 శాతం దేశాలు ఆందోళనకర స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ‘ఇది వ్యవస్థ ప్రమాదంలో పడటం కంటే ఎక్కువ. ఇది వ్యవస్థా వైఫల్యం’ అని ఆయన అన్నాడు.
2023లో ప్రపంచ దేశాల ప్రభుత్వాల రుణం 97 ట్రిలియన్ డాలర్లు ఉంది. ఈ మొత్తం రుణంలో అగ్రరాజ్యం అమెరికా రుణం 33 ట్రిలియన్ డాలర్లు. అంటే 34 శాతం, (జిడిపిలో 127 శాతం). రెండవ స్థానంలో చైనా 14.6 ట్రిలియన్ డాలర్లు అంటే 15 శాతం (జిడిపిలో 83 శాతం). జపాన్ 10.8 ట్రిలియన్ డాలర్లు. అంటే 11 శాతం (జిడిపిలో 255.7 శాతం). ఇంగ్లాండ్ 3.5 ట్రిలియన్ డాలర్లు అంటే 3.6 శాతం (జిడిపిలో104 శాతం). ఫ్రాన్స్ 3.4 ట్రిలియన్ డాలర్లు అంటే 3.5 శాతం (జిడిపిలో110 శాతం). ఇటలీ 3.1 ట్రిలియన్ డాలర్లు అంటే 3.2 శాతం (జిడిపిలో 144 శాతం). భారత్ 3 ట్రిలియన్ డాలర్లు అంటే 3.1 శాతం (జిడిపిలో 82 శాతం). జర్మనీ 2.9 ట్రిలియన్ డాలర్లు అంటే 3 శాతం (జిడిపిలో 66 శాతం). జపాన్ జాతీయ ఆదాయానికి రెండున్నర రేట్లు రుణం కలిగి ఉనిది. అమెరికా ఒక్కటే ప్రపంచ దేశాల రుణం మొత్తంలో మూడవ వంతు రుణం కలిగి ఉంది. ఇక ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల రుణం జాతీయ ఆదాయానికి మించి ఉన్నాయి. 2028 నాటికి ప్రపంచ రుణం జిడిపిలో 100 శాతం మించిపోతుందని ఏఎంఎఫ్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ వ్యవస్థలోనే అంతర్లీనంగా అసమానత్వం ఉండటం, అది వర్ధమాన దేశాలపైన అసమంగా భారం కావటం అన్నింటికంటే ఆందోళన కలిగించే అంశమని యుఎన్సిటిఎడి పేర్కొంది. ఆఫ్రికా దేశాలు కడుతున్న వడ్డీ అమెరికా కంటే నాలుగు రెట్లు, సంపన్న ఐరోపా దేశాలకంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంది. గత దశాబ్దంలో 47 శాతంగా ఉన్న ప్రైవేట్ రుణదాతలు నేడు 62 శాతానికి పెరగటం వల్ల ఈ రుణాలను పునఃనిర్మించటం కష్టంగా మారింది. 2000 సంవత్సరంతో పోల్చినప్పుడు ప్రభుత్వాల రుణభారం 2023 నాటికి ఐదు రెట్లు పెరిగింది. ప్రపంచ జనాభాలో 20 శాతం లేక 165 కోట్ల ప్రజలు రోజుకు 3 డాలర్ల(249 రూపాయల) కంటే తక్కువ ఆదాయంతో బ్రతుకుతున్నారనే వాస్తవం ఆందోళన కలిగించే అంశమని ఐక్యరాజ్యసమితి తన ఆవేదనను వెలిబుచ్చింది. మరోవైపు ప్రపంచ సంపదలో సగం ఒక్క శాతం కుటుంబాల వద్ద పేరుకపోయింది. ప్రపంచ జనాభాలో సగం మంది ప్రజల వద్ద ఉన్న సంపద ఒక్క శాతం కంటే తక్కువే. ఒక్క శాతం కుటుంబాల వద్ద ఉన్న సంపద 99 శాతం కుటుంబాల వద్ద ఉన్న సంపదకు రెట్టింపు.