మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం.
కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన భావోద్వేగపరమైన అంశంగా చూసినా, ఆరాధనా వైఖరితో చూసినా, వైభవీకరించినా అది సరైంది కాదు. ముఖ్యంగా ఈనాటి ఆధునిక యుగంలో సంస్కృతిని నిర్విమర్శగా చూడడం అశాస్త్రీయమవుతుంది. సంస్కృతిని విమర్శనాత్మకంగా చూడకపోతే దానికి ఉండే గతిశీల స్వభావం మనకు అర్థం కాదు. దానిలో మారేది ఏమిటో, మార్పును ప్రేరేపించేది ఏమిటో, ఏ మార్పును ఏది ప్రభావితం చేస్తుందో మనకు తెలిసే అవకాశం ఉండదు.
అయితే సంస్కృతీ చర్చ ఇటీవలే మొదలైంది కాదు. గతంలో జరిగిన సంస్కృతీ చర్చలో సంప్రదాయవాదులు, హేతువాదులు, ఉదార మానవతావాదులు, జాతీయవాదులు, గాంధేయవాదులు, ప్రగతిశీలవాదులు, కమ్యూనిస్టులు మొదలైన ఎంతోమంది పాల్గొన్నప్పటికీ, కమ్యూనిస్టుల పోరాట ఆచరణ మౌలికంగా భిన్నమైనది. ఆ తర్వాత నక్సల్బరీ నుండి నేటి దండకారణ్యం వరకు కమ్యూనిస్టు విప్లవకారుల ప్రత్యామ్నాయ సాంస్కృతిక కృషి కొనసాగుతున్నప్పటికీ, సంస్కృతీ చర్చ స్పష్టమైన, శాస్త్రీయ ప్రాతిపదిక మీద ప్రత్యేకంగా జరగలేదనే చెప్పాలి. అందువల్ల వర్గపోరాటాల క్రమంలో విప్లవాన్ని సాధించాలని బయలుదేరిన విప్లవకారులు (విప్లవ రాజకీయ పోరాటాల రూపంలో) చేసిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాట ఆచరణలు సైతం భావనీకరించబడి ప్రత్యేకంగా సిద్ధాంతరూపం దాల్చలేకపోయాయి.
ఆ తర్వాత కాలంలో నానాటికీ విస్తృతమవుతూ వచ్చిన ప్రజా, వర్గ పోరాటాల క్రమంలో స్త్రీవాదులు, దళిత బహుజనవాదులు, ముస్లిం మైనారిటీవాదులు కూడా అనేకానేక కొత్త, కొత్త విషయాలను రంగంమీదికి తీసుకువచ్చి చర్చకు పెట్టారు. వీటన్నింటి ప్రభావాల నేపథ్యం వల్ల, గత ఏడెనిమిదేళ్లుగా దేశంలో కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలన వల్ల సంస్కృతీ చర్చ మరింత ప్రత్యేకంగా కొనసాగుతూ ఇటీవల పుంజుకుంటున్నది. అందులో భాగంగానే ఈ 28వ విరసం మహాసభలు కొనసాగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఇవ్వాల్టి సంస్కృతీ సంక్షోభానికి మూలాలు ఎక్కడున్నాయి? ఈనాటి సంక్షోభాన్ని పార్లమెంటరీ రాజకీయాలలో భాగంగా సంఘ్ పరివార్ పాలనే తీవ్రతరం చేస్తున్నప్పటికీ, దాని మూలాలు మాత్రం సంఘ్ పరివార్ రాజకీయాల్లో మాత్రమే లేవు. మొత్తంగా మన సమాజ గర్భంలోనే ఆ సంక్షోభపు మూలాలున్నాయి. సంస్కృతి పుట్టుక, పనితీరు అర్థం అయితేనే తప్ప సంస్కృతిని ఎలా మార్చాలో మనకు తెలియదు. అందుకే మన దేశ నాగరికతా సంస్కృతులు ఎలా రూపొంది ఎలా పనిచేస్తున్నాయో లోతుగా పరిశీలించాలి.
సంస్కృతి పుట్టుక, పనితీరు:-
సంస్కృతి అనేది ఒక కాల బిందువు దగ్గర పుట్టి మరో కాలబిందువు దగ్గర అంతరించేది కాదు. దాని పుట్టుక, వికాసం, అంతర్థానం ఇవన్నీ సుదీర్ఘ క్రమాలే. చరిత్రలో ఒక రాజకీయ ఆర్థిక వ్యవస్థ మారినప్పుడు అది ఎలాగైతే పాత వ్యవస్థతో తెగదెంపులు చేసుకుంటుందో, సంస్కృతి అలా ఒక్కసారి నిర్మాణమై గతంతో తెగదెంపులు చేసుకునేది కాదు. అది అనేక ఎగుడుదిగుళ్ళ మధ్య ముందు వెనుకలుగా సాగుతూ కొత్త అంశాలను కలుపుకుంటూ, మారుతూ, మారుస్తూ పునరుత్పత్తి అవుతుంది. అందుకే సంస్కృతి ఎంత ప్రాచీనమైనదో అంత సమకాలీనమైన సజీవ(వాస్తవిక) వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇలా సంస్కృతిని ఒక సజీవ వ్యవస్థ అని అంటున్నామంటే, సంస్కృతిలోని మార్పులకు సమాజంలోని మార్పులే గాక సంస్కృతిలోని అంతర్గత అంశాలు కూడా కారణమ వుతున్నాయని దానర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే- ఉత్పత్తి వ్యవస్థ, నాగరికతా పునాది అనే రెండు ప్రధాన సోర్సుల నుండి సాగే ప్రభావాల వల్ల సమాజ రూప సారాల సమ్మిశ్రమ ఐక్యావరణమైన సంస్కృతిలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ రెండు వైపుల నుంచి కలిగే ప్రభావాలు నేరుగా కాకుండా అనేక సామాజిక అంశాల మాధ్యమంగా ఉమ్మడి సాంస్కృతిక ఆవరణంలో పనిచేస్తాయి. అయితే ఈ మార్పులన్నీ మనుషులతో నిమిత్తం లేకుండా జరగవు గనుక మానవ బుద్ధి అనే నిర్మాణాత్మక వ్యవస్థ కేంద్ర స్థానంలో ఉండి ఆ మార్పుల వెనుక పనిచేస్తుంటుంది.
అంటే, సమాజం అనే మొత్తంలో భాగంగానే సంస్కృతి ఉంటుంది. కాబట్టి సమాజానికి చరిత్ర ఉన్నట్లే సంస్కృతికి కూడా చరిత్ర ఉంటుంది. కనుకనే ఉత్పత్తి వ్యవస్థ, నాగరికతల వైపు నుండే గాక ఇతర సామాజిక రంగాల నుండి ప్రసరించే పరస్పర ప్రభావాలకు కూడా సంస్కృతి లోనవుతూ, వాటిని తిరిగి ప్రభావితం చేస్తుంది. ఈ మొత్తం మార్పుల క్రమంలో సనాతన, ప్రాచీన కర్మకాండల హిందూ సంస్కృతిదే పైచేయిగా ఉండడం వల్ల పరిమాణాత్మక మార్పులే గాని గుణాత్మక మార్పులేవీ సంభవించ(డం)లేదు. సనాతనకాలం నాటి కుల, పితృస్వామిక అసమానతా పీడనలకు తోడుగా వర్గ సమాజం ఏర్ప(డికొనసాగుతుం)డడంతో భారతీయ సంస్కృతికి దోపిడీ, అణచివేతల స్వభావం అదనంగా వచ్చింది. దోపిడీ వర్గాలు, రాజ్యమూ కలిసి ప్రజలను లొంగదీసుకొని అణచివేయడానికి సంస్కృతిని కూడా ఒక సాధనంగా చేసుకోవడం వల్ల సంస్కృతి ఒక ఆధిపత్య శక్తిగా మారిపోయింది.
అయితే సంస్కృతిలో కేవలం మార్పులను నిరోధించే లక్షణాలే గాకుండా, మార్పులకు దోహదపడే లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే సంస్కృతిలో స్థిరీకరణ, పరివర్తన అనే రెండు లక్షణాలు ఉంటాయని అంటాం. కాబట్టి సంస్కృతి పనితీరులో సంస్కృతికి, మనిషి క్రియాశీలతకు, మానవ బుద్ధికి ఉండే పరస్పర సంబంధాలను లోతుగా అధ్యయనం చేయడమే కీలకాంశం అవుతుంది.
సనాతన హిందూ సంస్కృతి మనిషి బుద్ధిని, క్రియాశీలతను నిరంతరం కుదించి అదుపుచేస్తూ వాటిని గానుగెద్దు(వర్తులాకార) చలనంలో ఉంచుతుంది. తద్వారా మనుషుల బహిరాంతర ప్రపంచాలను నిరంతరం శాసించే విధంగా నిత్యం అలవాటుగా చేసే కర్మకాండలను నిర్దేశించింది.తనదైన ప్రతీకలతో, అర్థాలతో రొటీన్ గా చేసే చర్యలతో సంస్కృతికి యథాతథ స్వభావం సమకూరి సముదాయంలోని మనుషులను ఆంతరంగికంగా బంధించివేస్తుంది. ఎవరూ భిన్నంగా చూడడానికి గాని, ప్రశ్నించడానికి గాని తావు లేకుండా మనుషుల మనోప్రపంచం తయారైవుండమే అదొక విచిత్రమైన మానసికత. అది వ్యక్తిగత మానసికతగానే కాదు, సామాజిక మానసికతగా(సాంస్కృతిక వాస్తవంగా) స్థిరపడిపోయింది. ఆ మానసికతా ఆవరణంలో వాస్తవికత అసలే కనిపించదు. హేతుదృష్టి పనిచేయదు. తార్కికత ఉండనే ఉండదు. దీన్నుంచే సంస్కృతికి మార్పులను నిరోధించే ప్రతికూల లక్షణం సమకూరుతుంది.ఈ నెగెటివ్ స్వభావమే సామాజిక వైరుధ్యాలను మరుగుపరుస్తుంది. ఇట్లా యథాస్థితిని కాపాడే సంస్కృతికి నిరంతరం పునరుత్పత్తి అయ్యే లక్షణం ఉంటుంది. ఈ పునరుత్పత్తి ప్రక్రియ మనుషుల సంబంధాల మధ్యనే జరుగుతుంది కాబట్టి తిరిగి తనకు తగిన (సాంస్కృతిక) మనుషులనే తయారు చేసుకొని, పునస్సంఘటితం/పునర్నిర్మాణం చేస్తుంది. ఆ క్రమంలో సంస్కృతి మనుషుల అంతరంగాలను తన పునరుత్పత్తి స్థావరాలుగా మార్చుకుని విస్తరిస్తూపోతుంది. దీనికి మంచి ఉదాహరణలుగా కుల వ్యవస్థ, పితృస్వామ్యాలను పేర్కొనవచ్చు. ఇతరేతర సామాజిక, ఆర్థిక చలనాల వల్ల సంస్కృతిలో కొన్ని మార్పులు సంభవించినప్పటికీ, అవి పైపై మార్పులు గా ఉండే పరిమాణాత్మక మార్పులే తప్ప సారాంశంలో గుణాత్మక మార్పులు కావు.
అయితే ఈ మొత్తం సంస్కృతిలోని మార్పులను మరింత సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే వ్యక్తుల క్రియాశీలతను, వారి సముదాయాన్ని పరిశీలించాలి. మనుషులు తమ సముదాయంలో మాత్రమే భాగమై ఆచరణలో ఉండరు. ఏక కాలంలో వాళ్లు ఇతరేతర సముదాయాల్లో, వ్యవస్థలలో కూడా కార్యకలాపాల్లో ఉంటారు. కనుక ఆ వివిధ చలనాల నుండి మనుషులు చైతన్యవంతమైన క్రియాశీలురుగా మారి సోషల్ స్ట్రక్చర్ ను మార్చే ఏజెన్సీ గా మారుతారు. ఇలా చైతన్యవంతమైన క్రియాశీలురుగా మారడం వెనక మానవ బుద్ధి (మైండ్) పాత్ర కీలకంగా ఉంటుంది. బుద్ధి కూడా ఆంతరంగిక నిర్మాణం కలిగిన ఒక సజీవ వ్యవస్థగా మారుతూ, మారుస్తూ ఉంటుంది. బుద్ధి ప్రభావం వల్ల మానవ కర్తృ త్వానికి రాడికల్ నేచర్ (విప్లవాత్మకత) వస్తుంది. కాని ఈ మనిషి క్రియాశీలత మళ్లీ పాత సముదాయంలో భాగంగానే కొనసాగడం వల్ల సంభవించే మార్పులన్నీ గుణాత్మక దశను సంతరించుకోకుండా పరిమాణాత్మక మార్పులుగానే ఉంటాయి. సంస్కృతి ఉండే యథాతథ లక్షణం వల్ల కాలక్రమంలో అవి కూడా అంతర్ధానమై ఎప్పటికప్పుడు సనాతన సంస్కృతే స్థిరపడుతూ ఉంటుంది.
చరిత్రలో కొనసాగిన చార్వాకం, బౌద్ధం, భక్తి ఉద్యమం లాంటి ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాలు, ఫూలే, అంబేద్కర్, పెరియార్ లాంటి వాళ్ళ సాంస్కృతిక ప్రత్యామ్నాయాలన్నీ కనుమరుగు కావడానికి కారణం ఇదే. పైగా, ఎప్పటికప్పుడు పాలకవర్గాలు కొత్త కొత్త భావజాలాన్ని తయారు చేసి ప్రజలను దారి తప్పిస్తారు. ఉదాహరణకు ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సూత్రం అందులో భాగమేనని ఇక్కడ పేర్కొనవచ్చు. పైకి చూడడానికి ఇది చాలా బాగుంటుంది.భిన్నత్వాన్ని లేదా వైవిధ్యాన్ని గౌరవించినట్లే ఉంటుంది. కాని చరిత్రలో ఆదిత్య సంస్కృతి నిర్వహించిన పాత్రను చూస్తే ఇది ఎంత మాయదారి సూత్రమో మనకు అర్థమవుతుంది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే పేరిట సామాజిక వైరుధ్యాలను మరుగుపరిచే కుట్ర ఇందులో ఇమిడి ఉందని మనకు తెలిసిపోతుంది.
ఇంతకీ తెలుసుకోవడం అంటే ఏమిటి? అసలు దేన్నైనా మనుషులు ఇంద్రియాల ద్వారా తమ అనుభవంలోకి తెచ్చుకొని ప్రాథమికంగా తెలుసుకుంటారు. అయితే దాంతో అంతా తెలియక పోవచ్చు. తెలియని దాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచి చూపే యంత్ర పరికరాలు అవసరమవుతాయి. ఉదా: మైక్రోస్కోప్, టెలిస్కోప్ లాంటివి. వాటి ద్వారా మనం మరింత బాగా, అతి సూక్ష్మంగా తెలుసుకోగలం. అయినా మనకు అంతా తెలిసినట్టుగా ఉండదు. అసలు ఒక విషయాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా తెలుసుకోవాలంటే దాని రూప సారాలను తెలుసుకోవాలి. అందుకు శాస్త్రీయ సిద్ధాంతం అవసరమవుతుంది. దానికి మానవ బుద్ధి ఉపయోగపడుతుంది. మానవ బుద్ధి సామర్థ్యాన్ని పెంచుకొని విశ్లేషించి తెలుసుకునే తలమే సిద్ధాంతం. అటువంటి సిద్ధాంతాన్ని రూపొందించుకోవడం ద్వారానే సంస్కృతిని కూడా సమగ్రంగా తెలుసుకోగలం. అందుకే సమాజంలో విభిన్న కోణాల్లో సాగే వివిధ సిద్ధాంత అధ్యయనాలు, చర్చలు చాలా బాగా దోహదపడతాయి.
చివరగా మళ్లీ మానవ బుద్ధి, క్రియాశీలతల దగ్గరకు వస్తే- అవి స్వేచ్ఛగా పనిచేసే సామాజిక పరిస్థితుల కోసం పోరాడాలి. అందుకు బుద్ధి, క్రియాశీలతలను నిరంతరం కుదించి, నియంత్రించే పితృస్వామిక, కులాధిపత్య తదితర తిరోగామి సంస్కృతులపై పోరాడుతూ, వాటి నుండి మనుషులు విముక్తం కావాలి. వ్యక్తిస్వేచ్ఛ, హేతుదృష్టి, ప్రగతి అనే ఆధునిక ప్రమాణాలే గీటురాయిగా శ్రామి(కార్మి)క వర్గపు కొత్త సాముదాయకతను బలోపేతం చేసుకుంటూ దాని దన్నుపై రాజ్యాధికార స్పృహతో ప్రత్యామ్నాయ ప్రజా(స్వామిక)సంస్కృతులను నిర్మించుకుంటూ స్థిరీకరించుకోవాలి.
ఇక్కడ రాజ్యాధికారమంటే దోపిడీ, పీడనాణచివేతలకు గురవుతున్న ప్రజలు వ్యక్తిగత, సాంఘిక స్థాయినుండి ఆర్ధిక స్థాయి వరకు స్వయం(నిర్ణయ) అధికారం సాధించడమే. అందుకు ఆర్ధిక దొపిడీ, సాంఘిక పీడనాణచివేతలను నిర్మూలించే రాజీలేని మార్క్సిస్టు సిద్ధాంతబద్దమైన విప్లవకర వర్గ పోరాటాలే సరైన శాస్త్రీయమార్గం. వాటి సమన్వయంలోనే మానవ బుద్ధి, క్రియాశీలతలను స్వేచ్ఛగా వికసింపజేసే సకల ప్రజా పోరాటాలను నిర్వహించాలి.
(నెల్లూరులో విరసం 28 వ మహాసభలలో ప్రసంగం కోసం తయారుచేసుకున్న నోట్స్ నుండి రాసిన వ్యాసం)