(విర‌సం 28వ మ‌హాస‌భ‌ల కీనోట్ పేప‌ర్‌లోని కొన్ని భాగాలు పాఠ‌కుల కోసం- వ‌సంత‌మేఘం టీం)

సంస్కృతి ఉత్పత్తి :  

సాహిత్యం, కళలలాగే సంస్కృతి సామాజిక ఉత్పత్తి.  సంస్కృతిలో నుంచే  కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయి. సామాజిక ప్రపంచంలో మనిషి ఆవిర్భవించినట్లే సామాజిక సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది. 

అన్ని సామాజిక అంశాలకంటే ఎక్కువగా  సంస్కృతి  మనిషిని  పెనవేసుకొని ఉంటుంది.  సంస్కృతి మానవ భౌతిక జీవితావరణకు సంబంధించిందే కాదు. మానవ మనో ప్రపంచంలోనూ ఉంటుంది. మనిషి ప్రవర్తనలో, ఆలోచనా రీతుల్లోనే ఉంటుంది.  సంస్కృతి తనకు తగినట్లు మనుషుల మనో ప్రపంచాన్ని డిజైన్‌్‌ చేసుకుంటుంది. అది భౌతిక ప్రపంచంలో వలె మనస్సులో  కూడా తిష్ట వేస్తుంది. ఆ మానసికతే సంస్కృతి  అందుకే సంస్కృతి మానవ అస్తిత్వంలోని లోతైన తలానికి చెందినది.    అక్కడి నుంచి మనుషుల స్వభావాలు రూపొందుతుంటాయి.  ఆ తలం నుంచే  సంస్కృతి నిరంతరాయ ఊటగా ప్రవహిస్తుంటుంది. మనుషులు చైతన్యవంతంగా, చైతన్యరహితంగా  చేపే పనులకు అక్కడ ఆధారాలు ఉంటాయి. 

         వ్యక్తులు సముదాయపు కట్టుబాట్లకు లోబడి ఉంటారు. వాళ్లు  చేసే పనులే సముదాయపు సంస్కృతిగా బైటికి కనిపిస్తుంది.  అలాంటి పనులకు  లోతైన అర్థాలు ఉంటాయి. సమూహం నిర్దేశించే సమయ సందర్భాల్లో చేసినందు వల్ల అవి  ప్రత్యేక అర్థాలు  సంతరించుకుంటాయి.  వాటితో  ఆ సమూహానికి  ఏకీభావం ఉంటుంది. అందరూ వాటిని ఒకేలా స్వీకరిస్తారు. అందువల్ల అవి అనివార్యమవుతాయి. ఆ సమూహ ప్రత్యేకతలు అక్కడి నుంచి మొదలవుతాయి. ఆ సమూహానికి అదొక సాంస్కృతిక కైవారం అవుతుంది. అదొక ప్రత్యేక సముదాయంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. మనకు తెలిసీ, తెలియకా ఆ ప్రత్యేకతలను సంస్కృతి  అంటాం. 

 వేర్వేరు సముదాయాల మధ్య సాంస్కృతిక ప్రత్యేకతలు ఎన్నో ఉంటాయి. వాటి సంపర్కం కూడా సాంస్కృతికంగానే ఉంటుంది. కానీ వాటన్నిటి మధ్య అంతిమ సారంలో పోలికలు ఉంటాయి. ఏ సముదాయమైనా తన భావాలను భాషలో వ్యక్తీకరించుకుంటుంది. ఈ వ్యక్తీకరణ స్థాయి కూడా సంస్కృతే.  అసలు మానవ  వ్యక్తీకరణే తొలి సాంస్కృతిక రూపం. భాషలోని పదాల అర్థాల వలె  సంస్కృతిలోని చిహ్నాలు, సంకేతాలు, నమ్మకాలు, కట్టుబాట్లు రూపొందే క్రమంలో అవి నిర్దిష్ట అర్థాలు సంతరించుకుంటాయి. ఆ అర్థ ప్రపంచమే సంస్కృతి. 

మనుషులు ఒకదానికి అలవాటు కావడమంటే సాంస్కృతిక జీవితంలోకి చేరుకోవడం. లేదా సాంస్కృతిక జీవితాన్ని నిర్మించుకోవడం. అలవాటు ద్వారా తామే సృష్టించుకున్న సంస్కృతికి బందీ కావడం. 

అందులో పరంపరాగత లక్షణం ఉంటుంది. చేసిన పనే చేస్తుంటారు. ఒకేలాగా చేస్తుంటారు.  అలవాటుగా జీవించడం అంటే సంస్కృతిని ఉత్పత్తి చేయడం. లేదా సంస్కృతికి సాధికారతను కల్పించడం. ఆ అలవాటులో ప్రాచీన నాగరికతా మూలాలు  దాగి ఉంటాయి. ఇవాళ్టి ఆచరణలో ఉంటూనే  ప్రాచీన విశేషాలతో కనెక్ట్‌ అయి ఉంటారు. మధ్యలో వచ్చిన  సాంస్కృతిక విశేషాలను  కలుపుకపోతూనే గతంలోకి ఒరిగి ఉంటారు. ఇలాంటి రోజువారీ  ఆచరణే సంస్కృతి. ఆదివాసుల దగ్గరి నుంచి అత్యాధునికులనబడే ప్రవాసాంధ్రుల దాకా అందరూ ఇలాంటి ఆచరణతో సంస్కృతిని నిరంతరం ఉత్పత్తి చేస్తుండటం గమనించవచ్చు. 

మనుషుల పనులు అమూర్తంగా ఉండవు.  కులాలవారీగా, మతాల వారీగా  ఉంటాయి.  ఆ పనుల్లో   భావోద్వేగాలతో భాగమవుతుంటారు.  ఎవరూ  ఆదేశించరు. ఒక నిర్దిష్ట సందర్భంలో అలవాటుగా గుంపైపోతారు. మనుషులకు ఉండే విశ్వాసాల చట్రం ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణే సంస్కృతి. 

అట్లా ఆ సమూహం చేసే ఆ పని వల్ల మనుషుల వ్యక్తిత్వంలో సంస్కృతి భాగమవుతుంది. సంస్కృతి సజీవమవుతూ ఉంటుంది. అదొక  మానవ నిర్మాణం. అందువల్ల అదొక భౌతికశక్తి, చారిత్రిక ఉత్పత్తి. అది తనంత తాను పుట్టేది కాదు.  వెనుక ఒక సామాజిక నిర్మాణం ఆధారంగా ఉంటుంది. అందులో వర్గాలు ఉంటాయి. సాంఘిక అస్తిత్వాలు ఉంటాయి. వాటి  సంఘర్షణా ఆవరణలో   మనుషులు సంస్కృతిని నిర్మించుకుంటారు. అందులో మనుషుల చైతన్యం ఉంటుంది. లేదా తప్పుడు చైతన్యం ఉంటుంది. అందువల్లనే సంస్కృతిని ఇతర ఉత్పత్తుల్లాగా చూడటానికి లేదు. ఇది పూర్తి భిన్నమైనది. సంస్కృతి ఉత్పత్తి అయ్యే క్రమాన్ని ప్రత్యేకంగా చూడాలి. దాన్ని గుర్తించకపోతే సంస్కృతీ విశ్లేషణ అనేదేమీ ఉండదు. 

మానవ సమాజం నిర్మాణమయ్యే క్రమంలో రూపొందిన సంస్కృతిలో ప్రకృతి`మానవ సమాజానికి సాగిన ఘర్షణ కూడా భాగమే. ప్రకృతి అంటే మానవులకు ఉండే భయమో, ఆరాధనో, కుతూహలమో, అన్వేషణో దానికి కారణం. ఆ దశ దాటాక సామాజిక సంబంధాల చట్రంలో మనుషులు భాగమయ్యారు. ఆ సంబంధాల్లో భాగంగా ప్రకృతితో  సంబంధాల్లో ఉన్నారు. దానితో సంఘర్షించారు. 

ఈ క్రమంలో అనేక సామాజిక వ్యవస్థలు అవతరించాయి. స్త్రీ, పురుష సహజ ప్రత్యేకతలు పితృస్వామ్యంగా వ్యవస్థీకృతం అయ్యాయి.భారతదేశంలో అత్యంత దుర్మార్గమైన కుల సంబంధాలు వ్యవస్థీకృతమయ్యాయి. మనుషులు స్త్రీలు పురుషులుగా, వివిధ కులాలవారుగా ప్రకృతితో సంపర్కంలోకి వెళ్లారు. వాళ్లు భాగమైన కుల, కుటుంబ సంబంధాలు విధించిన పరిమితుల్లో జీవించడం మొదలు పెట్టారు.  వివక్షలు,  ఆంక్షలు, అంతరాలతో కూడిన ప్రత్యేకతలు ఉన్న సమూహాలుగా విడిపోయారు. వాటిలో అమానవీయమైన ఆధిక్యాన్ని చెలాయించే ధోరణి, దాని బారినపడి హింస, వివక్ష అనుభవించే ధోరణి తలెత్తింది. ఇలా జీవించే క్రమమే భిన్న సంస్కృతుల  ఆవిర్భావానికి దారి తీసింది. 

అందువల్లనే వివిధ కులాలకు చెందిన సంస్కృతులు ఏర్పడ్డాయి. పితృస్వామ్యం కూడా కులాలవారీ సంస్కృతిగా మారిపోయింది. ఆ రెంటి మధ్య విడదీయలేని పీడముడి పడిరది. ప్రతి సమూహానికి తనదైన నమ్మకాలు, విశ్వాసాలు, ప్రతీకలు, అర్థాల సంపుటిగా సంస్కృతి ఏర్పడిరది.  సాంఘిక సంబంధాల క్రోడీకరణగా  సంస్కృతి మారింది. ప్రతి కులానికి స్వీయ అస్తిత్వంగా ఏర్పడిరది.  దాని అట్టడుగున   శ్రమ ప్రాతిపదిక అయింది. 

దీనితోపాటు పితృస్వామ్య వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను స్వచ్ఛందంగా అంగీకరించే అర్థాలను కూడా ప్రజల సంస్కృతులు సంతరించుకున్నాయి. అన్ని కులాల్లో  మగవాళ్ల ఆధిక్యం ఉంది. ‘కింది’ కులాలపై అగ్ర కులాల ఆధిక్యం కొనసాగుతున్నది. సొంత ఆస్తి పదిలంగా ఉంది. ఆయా సంస్కృతుల ప్రత్యేకతల్లో ఇవన్నీ  విడదీయలేని భాగం అయ్యాయి. జానపదుల భాషలో, కళలలో, ఆచారాల్లో, విధి నిషేధాల్లో అవీ ఇవీ అల్లుకొని పోయి ఉంటాయి. వాటన్నిటికీ ఆ ప్రజలు బందీ అయిపోయి ఉంటారు. వాటిలోనే జీవిస్తుంటారు. సంస్కృతి  ఒక వ్యవస్థగా ఇలా కొనసాగుతునే ఉంటుంది. ఇందులో ఆధిపత్య సమూహాల ప్రయోజాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇలాగే కొనసాగాలని కుట్రలు కూడా పన్నవచ్చు. కానీ ఆధిపత్య సంస్కృతికి కుట్రలే ఏకైక కారణం కాదు.  

ఉదాహరణకు పితృస్వామ్య సంస్కృతి వల్ల మగవాళ్లకు చాలా సుఖంగా ఉంటుంది. అట్లని తల్లిని, భార్యను, కూతుర్ని నియంత్రించడానికి కుట్రపూరితంగా  పితృస్వామ్య సంస్కృతిని మగవాళ్లు కాపాడుతుంటారని అనలేం. అలా అన్నాక ఇక విశ్లేషణలు అవసరం ఉండదు. వర్ణనలతో సరిపట్టుకోవచ్చు. అంతకంటే ఇంకో పెద్ద సమస్య ఇందులో ఉంది. పితృస్వామ్యమనే వ్యవస్థలోని ‘తర్కాన్న’ంతా విస్మరించినట్లవుతుంది. 

  కులానికి, పితృస్వామ్యానికి సంస్కృతితో ఉన్న సంబంధాన్ని తిరస్కరించినట్లవుతుంది. మౌలికంగానే సంస్కృతి సామాజిక ఉత్పత్తి అనే భావననే  పక్కనపెట్టినట్లవుతుంది. 

సంస్కృతిలోని ఆధిక్యత,  హింస,  వివక్ష అనేవి వాటిని ప్రదర్శించే వాళ్లకు, ఆ దుర్మార్గాన్ని అనుభవించే వాళ్లకు  అలవాటుగా మారుతుంది.  చాలా ‘మామూలు’ విషయంగా  మారిపోతుంది. రాజకీయార్థిక వ్యవస్థను పట్టి ఉంచడంలో సంస్కృతి పాత్ర ఇదే. సంస్కృతి అలవాటుగా మారడం, అలవాట్లలోంచి సంస్కృతి స్థిరపడటం ఒక  నిరంతర ప్రక్రియ. 

  దీనికి వ్యతిరేకంగా లోపలి నుంచే ధిక్కారాలు పెల్లుబికాయి. కొత్త దృక్పథాలు  ముందుకు వచ్చాయి. విలువలు ఏర్పడ్డాయి. అయినా భారతదేశ నాగరికతా పునాదిలోని కులం, పితృస్వామ్యం, మతం ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అక్కడి నుంచే  సంస్కృతి ఉత్పత్తి అవుతున్నది. మనుషుల్లోని ప్రాచీన మూలాలను  సంస్కృతి పట్టి ఉంచుతున్నది. వాటిని  సంస్కృతి నిరంతరం తట్టిలేపుతూ ఉంటుంది. దానితో అనుసంధానిస్తుంటుంది. ఇందులో ఆనవాయితీగా జరిగేదే ఎక్కువ.  స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు ఈ ఆనవాయితీ పనుల్లో జోక్యం చేసుకుంటాయి. అప్పుడు ఆ పనుల అర్థాలు మారుతాయి. ఆ పనుల వెనుక ఉన్న విశ్వాసాలకు సహితం కొత్త అర్థాలు ప్రచారం అవుతాయి. సంస్కృతిలో ఫాసిస్టుల ప్రవేశం ఇట్లా ఉంటుంది. 

సంస్కృతి పని తీరు:  

సంస్కృతి అంటే ఏమిటో  సులభంగానే  చెప్పవచ్చు.  కానీ సంస్కృతి ఎలా పని చేస్తుందో చెప్పడం కష్టం. బహుశా సంస్కృతీ విశ్లేషణలోని సందిగ్ధత అంతా అక్కడే ఉంటుంది. సంస్కృతి పుట్టుకకు, పని తీరుకు దగ్గరి సంబంధం ఉంది. సంస్కృతి ఒకసారి రూపొందేది కాదు. గతంతో తెగతెంపులు చేసుకొనేదీ కాదు. అనేక ఎత్తు పల్లాల  మధ్య సాగుతూ ఉంటుంది. కొత్తగా వచ్చేవాటినీ కలుపుకొనిపోతుంటుంది.   సంస్కృతిలోని మార్పును  గ్రహించడం తేలికే. కానీ దాన్ని  సులభంగా అంచనా వేయలేం. 

ఎందుకంటే` సంస్కృతిలోని మార్పులకు  మూడు నాలుగు రకాల అవకాశాలు ఉంటాయి. అవి.. ఒకటి:   సంక్లిష్టమైన సాంస్కృతిక ప్రపంచంలోనే జరిగే తర్కబద్ధమైన మార్పులు, రెండు: ఉత్పత్తి వ్యవస్థలోని మార్పులు,  మూడు:  ఇతర సామాజికాంశాల ప్రభావం,  నాలుగు: మానవ బుద్ధి. 

 సంస్కృతి అనే వ్యవస్థలో మార్పులకు వీటిలో ఏది ఏ మేరకు కారణం అని పరిశీలించాలి.  

నిజానికి సామాజంలో  వచ్చే మార్పులను సంస్కృతి ద్వారా తెలుసుకోగలం. లేదా సంస్కృతిలో ఏ చిన్న మార్పు కనిపించినా  సమాజంలో ఏవో మార్పులు జరిగి ఉంటాయని  ఊహించగలం. మార్పుల సూక్ష్మ  చలనాన్ని  సంస్కృతిలో గ్రహించగలం.    

ఈ మార్పు అన్ని చోట్ల  ఒకే స్థితి, గతులతో ఉండకపోవచ్చు.  అది  ఎంత ప్రభావశీలిగా ఉంటుందో అంతగా మిగతా వాటికి ప్రభావితం అవుతుంటుంది. కాబట్టి   సాంస్కృతిక మార్పులుగా పైకి కనిపించేవాటిలో దేనికి ఏది కారణమో  వివరించడం అంత తేలిక కాదు. 

      సంస్కృతిలో వచ్చే ప్రతి మార్పుకు ఒక సామాజిక రంగంలో మార్పు మాత్రమే కారణం కానక్కర లేదు. అత్యంత సంక్లిష్టంగా, దీర్ఘకాలంగా కొనసాగుతున్న  సంస్కృతిలోని అంతర్గత కారణాలు కూడా సంస్కృతిలోని మార్పులకు కారణం కావచ్చు. అంటే  సంస్కృతి అనేది సమాజానికి, అందులోని మార్పులకు కేవలం  మాధ్యమం కాదు. మార్పుల  ప్రతిబింబం కాదు.  

మొత్తం మీద సంస్కృతిలోని మార్పులకు సమాజంలో కారణాలు ఉన్నట్లే  సంస్కృతిలో కూడా కారణాలు ఉంటాయని నిర్ధారణకు రావచ్చు. దేనికంటే సంస్కృతి అనేది ఒక సజీవ వ్యవస్థ. మానవుల మధ్య ఉండే సాంస్కృతిక సంబంధాల వాస్తవం. సమాజ మార్పుల ప్రతిఫలన వేదికగానేగాక సమాజంలో మార్పులకు, తనలోని మార్పులకు కూడా సొంత కారణాలు ఉన్న వ్యవస్థ.   ఈ అవగాహన  సంస్కృతిని ఒక ఏజెన్సీగా అధ్యయనం చేయడానికి వెసులుబాటు ఇస్తుంది. 

ఇది మార్పు అనే కోణంలో సంస్కృతి పనితీరుకు సంబంధించిన ముఖ్యమైన ప్రాతిపదిక

సంస్కృతి పని తీరు తెలుసుకోడానికి సిద్ధాంత భూమికను అభివృద్ధి చేయాలి.  లేకపోతే మిగతా సామాజికాంశాలకు, సంస్కృతికీ సంబంధం తెలియదు. సంస్కృతి అనే వ్యవస్థకు`మనిషి క్రియాశీలతకు`మనిషి బుద్ధికి ఉండే సంబంధం తెలియదు.

0           0             0

    చారిత్రక పరిణామంలో సంస్కృతి  పాత్ర  నిరోధించడంలో ఉన్నది. లేదా మార్పుకు దోహదపడటంలో ఉన్నది. సంస్కృతి స్థిరీకరణ, సంస్కృతీ పరివర్తన అనే రెండు బలమైన పునాదుల మీద సంస్కృతీ అధ్యయనం సాగాలి. ఇప్పటి దాకా సాగిన  మానవ వికాసంలో సంస్కృతి మార్పును అడ్డుకోవడంలోనే ఎక్కువగా ఉన్నది. అందుకే సంస్కృతీ చర్చలో ఇది ఎక్కువ జాగా అక్రమిస్తుంది. 

అందుకే సంస్కృతి పాత్రను ప్రగతి అనే గీటురాయి మీద చూడాలి.    సంస్కృతిని ఆధిపత్య శక్తులు వాడుకోవడం గురించి  ఎంతయినా చర్చించవచ్చు. అలాగే ఆధిపత్య సంస్కృతి  పీడిత సమూహాల సంస్కృతులపై చేసిన దాడికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. ఇవి అప్రధానం కాదు. మౌలికంగా సంస్కృతి చరిత్రలో  పోషించిన పాత్రను గుర్తించడం ముఖ్యం. అది మార్పును నిరోధిస్తుంది. ఆ పని ఎలా చేయగలిగింది? అనే ప్రశ్న సంస్కృతి పని తీరుకు సంబంధించింది. ఆ రకంగా సంస్కృతికి ఒక రకమైన ‘ప్రతికూల’  స్వభావం ఉంది. 

సంస్కృతి శ్రమ నుంచి పుడుతుందనే మాట వాస్తవమే. అయితే ఏ కాలంలో అయినా ఆధిక్యంలో ఉన్నది శ్రమ నుంచి పుట్టిన సంస్కృతి కాదు. వేరే సంస్కృతే ఆధిక్యంలో ఉన్నది. అంటే నేరుగా శ్రమ నుంచి సంపద పుట్టినట్లుగా శ్రమ నుంచే సంస్కృతి యావత్తూ పుట్టిందని నిర్ధారించలేం. దాని ప్రకారం సంస్కృతిలోని వైవిధ్యాన్నంతా వివరించలేం. సంస్కృతి క్రమంలో లోయలు ఎలా ఏర్పడ్డాయో చెప్పలేం.  మానవ జీవితంలో  సంస్కృతికి ఉన్న స్థానాన్ని గమనించలేం. శ్రమ సంస్కృతి శ్రామికుల జీవితంలో కూడా దానికి సంబంధించిన పాత్రనే పోషించడం లేదు. ఇంకా చాలా చేస్తున్నది. భిన్న అంతస్తులలో అనేక రూపాల్లో  సంస్కృతి పని చేస్తుంటుంది. 

శ్రమ నుంచి పుట్టిన సంస్కృతికి, ఆధిపత్య  సంస్కృతికి తీవ్ర వైరుధ్యం ఉంది. ఆధిపత్య శక్తులు శ్రమ  సంస్కృతిని కొల్లగొట్టాయి. దాన్ని తమకు తగినట్లు మార్చున్నాయి. అయినప్పటికీ సంస్కృతీ ఆవిర్భావానికి, అందులోని మార్పులకు నేరుగా   శ్రమ ఒక్కటే ఏకైక కారణం కాదు.  సామాజిక ప్రపంచంలోని ప్రతి చిన్న విషయానికి శ్రమ  ఒక్కటే  ఏకైక ప్రత్యక్ష కారణం కానవసరం లేదు. అలాంటి సామాజిక జీవితంలో భాగమైన   సంస్కృతి శ్రమ నుంచేగాక  ఇంకా అనేక రకాలుగా పుడుతుంది. 

ఈ వాస్తవం మన చూపును విశాలం చేస్తుంది.  సంస్కృతికి ఉండే సానుకూల పాత్రతో పాటు ప్రతికూల పాత్ర దగ్గరికి మనల్ని తీసికెళుతుంది.  ఆధిపత్య శక్తుల వల్లనే సంస్కృతికి  ప్రతికూల స్వభావం వచ్చిందనే విశ్లేషణకే పరిమితం చేయదు.  .  అప్పుడు మార్పును సంస్కృతి ఎలా అడ్డుకొనేదీ తెలుస్తుంది.  ఇది సంస్కృతి పని తీరు దగ్గరికి మనల్ని తీసికెళుతుంది. 

ఈ ప్రతికూల స్వభావం వల్ల సంస్కృతి సామాజిక వైరుధ్యాలను మరుగుపరుస్తుంది. అందులోని వాస్తవికతపట్ల ఎరుక కలగకుండా చేస్తుంది. అలాంటి భావజాలాన్ని విడుదల చేస్తుంటుంది. దాని ప్రభావంలో అందరూ ఉంటారు.  మతం`ఆధ్యాత్మిక క్రతువులు`భావజాలం` సంస్కృతి వంటివన్నీ సన్నిహితమైనవి. ఇవన్నీ కలిసి ఉండిన దశ ఒకటి ఉన్నది. ఇవన్నీ భావజాలంగా మారుతాయి.  దాని ప్రభావంలో మనుషులు ఉన్నంత వరకు  వాస్తవికత కనిపించదు. హేతుదృష్టి పని చేయదు. దీన్నుంచే అణచివేతకు ఆమోదం దొరుకుతుంది. పాలకుల చేతిలో సంస్కృతిని ఇట్లా సాధనంగా మారుతుంది.  ఇవన్నీ కలిసి ప్రతికూల లక్షణం అవుతుంది. 

దీన్నుంచే   సంస్కృతికి  యథాతధ స్థితిని పట్టి ఉంచే స్వభావం వచ్చింది.

సంస్కృతి అనేక ప్రతీకలతో, వాటి అర్థాలతో  ఆ జన సముదాయాన్ని  ఆంతరంగికంగా కట్టిపడేస్తుంది. దాన్నొక నిర్మాణంగా మార్చేస్తుంది. అందులోని ప్రతీకలకు నిర్దిష్ట నిశ్చయ అర్థాలు ఉంటాయి. వాటిని అందరూ అలాగే అంగీకరించాలి. భిన్నంగా చూడ్డానికి వీల్లేదు. ప్రశ్నించేందుకు లేదు. అవే సత్యమని నమ్మాలి. వాటికి లోబడి జీవించాలి. అలా జీవిస్తున్నామనే ఎరుక ఉండదు. అదొక మామూలు విషయంగా మారి మనుషులను నడిపిస్తూ ఉంటుంది. ఆచారాలు, కట్టుబాట్లు, విధి నిషేధాలు అలాంటివి. వాటి మంచి చెడ్డల చర్చ వస్తే  సగటు మనుషులు భరించలేరు. అందుకే ఆ తలంతో వాళ్ల ఇంటరాక్షన్‌ చాలా స్వల్పం. వెంటనే ఆ చర్చను ముగిస్తారు.    విసుగో, అసహనమో, కోపమో ప్రదర్శిస్తారు. నిజానికి కొందరు మౌనం పాటిస్తారు. అది అన్నిటికంటే చాలా శక్తివంతమైనది.  ఇట్లా కాకుంటే ఇంకెలా ఉంటాం? అనే అర్థం అందులో ఉంటుంది  ఇలాగే ఉండాలనే మౌన సమ్మతి కూడా ఉంటుంది.  ఇది మనుషుల భావనా ప్రపంచంలో చాలా లోతైనది. భిన్నమైనదేదీ ఉండదనే భావన చాలా పటిష్టంగా తయారై ఉంటుంది. అది సంస్కృతిలోని ప్రతీకలకు, అర్థాలకు, వాటి వెనుక ఉండే కట్టుబాట్లకు, నమ్మకాలకు అంతులేని  బలాన్ని ఇస్తుంది. 

 ఇదొక మానసికతే కాదు. సామాజికత కూడా. అట్లా లోపలా, బైటా సజీవంగా ఉంటుంది. అందుకే సంస్కృతిలోని ఏ భావననూ యాంత్రికమని అనుకోడానికి లేదు. అన్నీ సజీవమైనవే. వాటి ద్వారా ఆ సముదాయం తన  ఆంతరంగిక,  బహిరంగ జీవితాలను కాపాడుకోవాలని అనుకుంటారు.  నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కింది కమ్యూనిటీలు  అనుకున్నట్లే గేటెడ్‌ కమ్యూనిటీ వాళ్లు కూడా అనుకుంటారు. సంపద వల్ల, హోదా వల్ల ఒక ‘కమ్యూనిటీ’గా మారి వాటికి సంబంధించిన పద్ధతులను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతుంటారు. వాటిని పాటించకపోతే ఇతరులతో కలిసిపోతామనుకుంటారు. తమదొక ప్రత్యేక ‘సంస్కృతి’ అనుకుంటారు. అందులోని అర్థాలు మారకుండా ఉండేందుకు నిత్యం  ‘మేం ఫలానా. మీకు ఆ సంగతి తెలుసా?’ అనే ఆ భేషజాలే తమ ఆత్మిక, భౌతిక అస్తిత్వమనుకుంటారు. దాని కోసం ఆరాటపడుతుంటారు.  

 సంస్కృతికి భావనల్లాగే  ఆచరణా సందర్భాలు ఉంటాయి. మానవ జీవితంలో కొన్ని అరుదైన సందర్భాలు ఉంటాయి. పదే పదే వచ్చే సందర్భాలు ఉంటాయి.  ఏవైనా సరే   విధి విధానాలను, ప్రశ్నలకు అవకాశం లేని విలువలను వెంటేసుకొని వస్తాయి. వాటికి అధికారం ఉంటుంది. దీనికి ఇంట్లో ప్రతినిధులు ఉంటారు. ప్రతి కమ్యూనిటీకి సంప్రదాయక ప్రతినిధులు కూడా ఉంటారు.  ఆ సందర్భాల్లో వాళ్లకు తిరుగులేని అధికారం వస్తుంది. అది ఎక్కడో రాసి ఉండదు. దాన్ని ఎవ్వరో అప్పగించరు. అసలు వాళ్లు ఆ అధికారాన్ని నిండుగా ప్రదర్శిస్తేనే, దానికి ఇతరులు లోబడి ఉంటేనే ఆ సందర్భం పూర్తి అర్థవంతం అవుతుంది. 

సంస్కృతి గురించిన వాస్తవ ఆచరణ ఇదే.

ఇక్కడి నుంచి సంస్కృతికి యథాతథ లక్షణం వస్తుంది. 

సనాతన ధర్మం ఇట్లా  కర్మకాండలతో, విధి నిషేధాలతో జీవితాన్ని అనేక సందర్భాలకు కట్టిపడేసింది. ఆ ప్రకారం మనుషుల ఆలోచనలను గానిగెద్దు చలనంలో నిర్దేశించింది. జీవితాన్ని ఉక్కు చట్రంలో బంధించింది. కర్మకాండల నిర్వహణ సాంస్కృతిక కర్తవ్యాలయిపోతాయి. నైతిక బాధ్యత అవుతుంది. 

నిజానికి  సంస్కృతిలో నైతికత అనేది సానుకూల భావన. కానీ ఆధిక్య సంస్కృతి మానవుల నైతిక ప్రపంచంలోకి జొరబడిరది. దాన్ని అంగీకరించడమే నైతికత అనేదాకా వెళ్లింది. దాన్ని అంగీకరించడమంటే లొంగిపోవడమే. అక్కడ సృజనాత్మకతకు చోటు లేదు. కొత్తదనానికి ఆస్కారం లేదు.

 యథాతధ స్థితిని పట్టి ఉంచడానికి అది ఇక్కడి నుంచి పని చేస్తున్నది.  సంస్కృతి పాత్ర ఇట్లా ఉంటుంది. అందుకే ఆధిక్య సంస్కృతికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సాంస్కృతిక ధారలన్నీ మనుషుల నైతికతను ముట్టుకున్నాయి. అక్కడి నుంచి వాళ్లను విముక్తం చేయాలనుకున్నాయి. అందులో బలమైన నైతిక కోణం ఉంది. చివరికి ఆధ్యాత్మిక రూపంలో వచ్చిన సాంస్కృతిక ప్రత్యామ్నాయాల్లో కూడా ఇది ఉన్నది. నీవుగా భగవంతుడిని తెలుసుకో.. అని చెప్పాయి. 

అట్లా జీవితం గురించిన సొంత అన్వేషణలు, ఆసక్తులు, విలువల తాపత్రయం నైతికతలో భాగం. ఆధిక్య సంస్కృతికి లొంగి ఉండటమే నైతికత అయ్యాక ఇక వీటికి చోటు లేకుండా పోయింది. మన సంస్కృతీ వికాస క్రమం సక్రమంగా లేకపోవడానికి ఇదొక ముఖ్యమైన కారణం. 

సరిగ్గా ఇప్పుడు ఫాసిజం ఈ నైతికతను సమూలంగా తుడిచిపెట్టాలని చూస్తున్నది. దీని వల్ల మన నమ్మకాల మీద నమ్మకం లేకుండా పోతున్నది. మనం ఎంచుకున్న పోరాటాల విజయంపట్ల తార్కిక జ్ఞానం మసకబారుతున్నది. అంతిమంగా న్యాయభావనలోని శక్తిపట్లనే విశ్వాసం పోతుంది. అంతగా నైతిక బలహీనులను చేస్తుంది. ఫాసిజం బైటికి కనిపించకుండా చేసే విధ్వంసం ఇలాగే ఉంటుంది. ఇదొక పెద్ద సాంస్కృతిక సమస్య. 

0              0                0

యథాతధ స్థితిని కాపాడే సంస్కృతికి నిరంతరం పునరుత్పత్తి అయ్యే స్వభావం ఉంది. సంస్కృతిది ఒకసారి పుట్టి కొనసాగే యాంత్రిక శైలి కాదు. తనను తాను పునర్పుత్తి చేసుకుంటుంది. సంస్కృతి ఒక్కటే కాదు. సామాజిక అంశాలన్నిటికీ ఈ లక్షణం ఎంతో కొంత ఉంటుంది. తీవ్రమైన రప్చర్‌ జరిగాక కూడా కొన్ని పాతవి మిగిలే ఉంటాయి. అవి అవశేషాలుగా  ఉండవు. మృతప్రాయంగా  ఉండవు. కొత్త పరిస్థితుల్లో కూడా పునరుత్పత్తి అవుతుంటాయి. 

సామాజిక చరిత్ర  ఏక ముఖంగా, సరళంగా మునుముందుకే సాగదు.  గతం పూర్తిగా రద్దు కాదు. ఆ సంగతి మనకు అర్థమవుతూనే ఉంటుంది. పాత వాటిలోని మెకనిజం పూర్తిగా రద్దయి, పూర్తిగా కొత్త తర్కం మీద కొత్త నిర్మాణం పనిలోకి రానంత వరకు అవి మిగిలే ఉంటాయి.     

ఈ లక్షణం మిగతా వాటికంటే సంస్కృతికి ఎక్కువ. పైగా మిగతా సామాజిక వ్యవస్థలు పునరుత్పత్తి కావడానికి కూడా సంస్కృతి దోహదం చేస్తుంది. 

సంస్కృతి ఉత్పత్తిని ఎంత అర్థం చేసుకుంటే దాని పునరుత్పత్తిని అంతగా అర్థం చేసుకోగలం. అది నిరంతరం ఉత్పత్తి అయినట్లే  పునరుత్పత్తి కూడా అవుతుంది. సంస్కృతి మానవ సంబంధాల మధ్య పునరుత్పత్తి అవుతుంది. తిరిగి తనకు తగిన మనుషులను సాంస్కృతిక మానవులను తయారు చేసుకుంటుంది. వాళ్ల అంతరంగాలను తయారు చేసుకుంటుంది. వాటికి  అనుగణమైన మానవ సంబంధాలను పునరుత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. అన్నీ కలిసి ఇట్లా కాకపోతే ఇంకెట్లా ఆలోచిస్తాం? ఇంకెట్లా జీవిస్తాం? అనే స్వీయామోదం ప్రకటించగలవాళ్లుగా మనుషులు తయారవుతారు. అంతగా ప్రజల సగటు చైతన్యాన్ని సంస్కృతి అదుపులోకి తీసుకుంటుంది. అంటే మనుషుల అంతరంగాల్లోంచి కూడా పుట్టి  తిరిగి వాళ్లనే తన పునరుత్పత్తి స్థావరాలుగా మార్చుకుంటుంది. ఇలా సంస్కృతికి లోబడిన వాళ్లకే ‘ఉత్తమ సంస్కృతీపరుల’నే గౌరవం దక్కుతుంది. 

దీని కోసం సంస్కృతి తన పునరుత్పత్తి స్థావరాలను కూడా విస్తరించుకుంటుంది. ఇది సంస్కృతికి ఉన్న ఇంకో లక్షణం.

దీనికి పితృస్వామ్యం, కులం మంచి ఉదాహరణ. 

పితృస్వామ్యాన్ని సహజంగా కుటుంబ సంబంధాల్లో చూస్తాం. వంట గదిలో, పడక గదిలో ప్రబలంగా ఉంటుంది. కానీ అది ఆఫీసుల్లో, రైళ్లలో, బస్సుల్లో, వీధుల్లో సర్వత్రా వ్యాపించి  ఉంటుంది. ఆ స్థావరాలకు తగినట్లు పని చేస్తుంది.  స్త్రీ`పురుషులు ఉన్న ప్రతి చోటా ఆ ప్రదేశానికి తగినట్లు అవతరిస్తుంది. దాని వల్ల అప్‌డేట్‌ అవుతుంది.   శక్తివంతమవుతుంది. దానికి తగిన అర్థాలను సంతరించుకుంటుంది. ఆమోదం పొందుతుంది. ఇదంతా సహజమే అనిపించుకుంటుంది. అసలు స్త్రీలు పురుషులు లేని చోట కూడా పితృస్వామ్య దృక్పథమే అన్నిటినీ నిర్ధారిస్తుంటుంది. 

 సంస్కృతి పునరుత్పత్తి కావడం అంటే దృక్పథం పునరుత్పత్తి కావడమే. ఇదంతా భాష, నుడికారం, ప్రతీకలు, విలువలు, భావజాలం కలసిన వ్యవస్థ.  

ఇది చివరికి పితృస్వామ్యం మనం  ‘ఊహించలేని’ చోటికి కూడా వ్యాపిస్తుంది. ఇది విస్తరణే కాదు. పునరుత్పత్తి కూడా. కులం గ్రామాల్లోనే కాదు. కార్పొరేట్‌ కేంద్రాల్లో కూడా పునరుత్పత్తి అవుతుంది. మామూలుగా అలాంటి చోట అంటరానితనం ఉండదని చాలా మంది భ్రమపడుతుంటారు. దాని స్వభావం వల్లనే ఇది సాధ్యం కాదనుకుంటారు. పైగా ఆ కొత్త స్థావరాలకు అది నప్పదని కూడా అంటారు. కానీ రుచులు, అభిరుచులు,  ఆహార విశేషాలు, రంగులు, భాషలు, యాసలు మొదలైన వాటిని అడ్డం పెట్టుకొని ఆ ప్రపంచంలో కూడా కులం పని చేస్తుంది. అక్కడా అంటరానితనం పని చేస్తుంటుంది. 

ఇదంతా సంస్కృతీ పునరుత్పత్తి. 

పునరుత్పత్తి అవుతున్నదంటే తప్పక పునస్సంఘటితం  అవుతున్నట్లే. లేదా పునర్నిర్మాణం అవుతున్నట్లే. ఇతర సామాజిక, ఆర్థిక సంచలనాల వల్ల ఏర్పడే కొత్త సమీకరణాలు  సంస్కృతిని ప్రభావితం చేస్తాయి. అందులో కుదుపులు వస్తాయి. పైకి  ఏదో చాలా మారిపోయిందని అనిపిస్తుంది. కానీ  సంస్కృతిలోని పునరుత్పత్తి స్వభావం వల్ల అది తిరిగి పునస్సంఘటితం కూడా అవుతుంది. ఈసారి మరింత పటిష్టంగా  తయారవుతుంది. 

   ఇందులో చారిత్రక, సాంస్కృతిక క్రమాలే లేవు. సంస్కృతికి ఉండే పునరుత్పత్తి, పునస్సంఘటిత స్వభావమే వీటికి కారణం.   

మన నాగరికతా క్రమంలోనే  సంస్కృతి  ప్రాబల్యం అలాంటిది.  

సంస్కృతి-ఆధునిక‌తః

సంస్కృతిపై మన  ఆలోచనలను  నిగ్గుదేల్చడానికి   ఆధునికత  గీటురాయి. అట్లాగే మన సమాజంలోకి వచ్చిన ఆధునికతను కూడా పరీక్షించాల్సిందే. పాశ్చాత్య  ప్రమాణాల ప్రకారం చూస్తే మన దేశంలో ఆధునికత లేనట్లే.  ఆధునికతగా కనిపిస్తున్న దాన్నంతా యథాతధంగా తీసుకోడానికీ లేదు. సంస్కృతీ విశ్లేషణలో కీలకంగా ఉండాల్సిన ఆధునికత మన దేశంలో ఎందుకు ఇలా ఉన్నదనే ప్రశ్న తలెత్తుతుంది. దాని కోసం మళ్లీ సంస్కృతి దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. 

యూరప్‌లో ఆధునికత  అక్కడి నాగరికతను సమూలం మార్చే జ్ఞానక్రమంగా మొదలైంది. కొత్త ఆలోచనారీతులను ముందుకు తీసుకొని వచ్చింది. పాత సాముదాయక  వ్యవస్థల మీద విమర్శ పెట్టింది. ముద్దగా ఉన్న సాముదాయక వ్యవస్థల్లో విభజనను తీసుకొచ్చింది. సాయుదాయక భావజాలాన్ని పట్టి కుదిపివేసింది. పరంపరాగతమైన సంప్రదాయాలను దెబ్బతీసింది. తాత్విక రంగాన్ని  సమూలంగా మార్చేసింది.  వైజ్ఞానిక ఆవిష్కారానికి దారి చూపింది.  ఇంకో పక్క ఈ కాలంలోనే భూస్వామ్యాన్ని కూలదోసే రాజకీయార్థిక పోరాటాలు పెల్లుబికాయి. ఆధునికతలోని హేతుచింతన,  భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాల వల్లే ఇదంతా సాధ్యమైంది. 

పెట్టుబడిదారీ విధానం ప్రపంచమంతా విస్తరించింది. తనతోపాటు ఆధునికతను  ప్రపంచమంతా పరిచయం చేసింది. అయితే అన్ని చోట్ల  ఒకే పద్ధతిలో కాదు. మన దగ్గర వలసవాద చట్రంలో భాగంగా పునరుజ్జీవన, ఆధునికతగా బయల్దేరింది. వలస  పాలన, పెట్టుబడిదారీ అభివృద్ధి, ఆధునిక చింతన కలిసి భారతదేశంలో కొత్త ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నం చేశాయి. ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు.

దేనికంటే  మనకు ఆధునికత పరిచయం అయ్యేనాటికే యూరప్‌లో పెట్టుబడిదారీ విధానం ఆధునికతను తనకు తగినట్లు వ్యవస్థీకృతం చేసుకున్నది. దాని సారంలో మార్పు తీసుకొని వచ్చింది. 

అంత మాత్రాన ఆధునికత పాత్రను తక్కువ చేయడానికి లేదు. జ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో అది మానవాళిని కొత్త చారిత్రక ప్రపంచంలోకి తీసికెళ్లింది. దాని పాత్ర  చెప్పడానికి పెద్దగా వివరాలు అక్కరలేదు. వలసవాదం అత్యంత నిరంకుశమైనదే. కానీ దానితోపాటు వచ్చిన ఆధునికత భారత సమాజం మీద వేసిన సానుకూల ప్రభావాలను పరిశీలిస్తే చాలు. 

పెట్టుబడిదారీ విధానం ఆధునికతలోని వ్యక్తి స్వేచ్ఛను  వేతన బానిసత్వంగా మారింది. వ్యక్తి ఆవిర్భావం పెట్టుబడిదారీ వ్యవస్థకు వేతన కార్మికులను  తయారు చేసింది. సాయుదాయక సంబంధాల నుంచి,  వృత్తుల నుంచి వ్యక్తులు బైటపడి తమ  శ్రమశక్తిని సరుకుగా అమ్ముకొనే కొత్త సంబంధాల్లోకి వెళ్లారు.  ఆధునికతలోని హేతుబుద్ధి పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీ తర్కంగా స్థిరపడిపోయింది.  పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ తన సొంత తర్కం మీద రూపొందింది. మానవుల రక్తమాంసాలను లాభాల కోసం పీల్చిపిప్పిచేసింది. మానవులను యంత్రాల్లో మరలుగా మార్చేసింది. దీంతో తీవ్రమైన ఆర్థిక సాంస్కృతిక అసమానతలు తలెత్తాయి. అమానవీయ సంబంధాలు స్థిరపడ్డాయి. 

ఆధునికత తీసుకొచ్చిన బహుళ వ్యవస్థల్లో అన్నిటిలో ఇలాంటి మార్పులే జరిగాయి. దీన్ని రాజకీయ రంగంలో కూడా చూడవచ్చు. వ్యక్తి ఆవిర్భావం అనేది  తర్వాత్తర్వాత  రాజకీయ రంగంలో ఓటు హక్కుకు దారి తీసింది. ప్రజా ప్రాతినిధ్య విధానం వచ్చింది. అది ఉదారవాద రాజ్యాన్ని తీసుకొచ్చిందని అంటారు. కానీ పెట్టుబడిదారీ విధానం దాన్ని అత్యంత నిరంకుశమైన బూర్జువా రాజ్యంగా  మార్చేసింది. అందరికీ ప్రజాస్వామ్యం అనే భావన నికార్సయిన బూర్జువా వర్గానికే ప్రజాస్వామ్యంగా మారిపోయింది. 

ఇట్లా యూరప్‌లోని పెట్టుబడిదారీ విధానం లాభాల కోసం వలసల్లోకి చేరేనాటికే అది ఆధునిక విలువలను భ్రస్టుపట్టించింది. అంత మాత్రాన ఆధునికత    అంతరించిపోయిందని అనుకోడానికి లేదు. మానవాళి వికాసానికి అవి అత్యవసరమైనవి. పెట్టుబడిదారీ విధానం ఆధునికతను అలా తయారు చేసినందుకు దాని మీద వ్యతిరేకత ఉండాలి. అంతేగాని ఆధునికత మీద చిన్న చూపు ఉండటానికి వీల్లేదు. పైగా ఆధునికత మీద సరైన వైఖరి తీసుకుంటేనే వర్తమాన ప్రపంచంలోని రాజకీయ, సాంఘిక సాంస్కృతిక సవాళ్లపై సిద్ధాంత వైఖరి తీసుకోడానికి వీలవుతుంది.   

వలసవాదం ఇండియాకు ఆధునికతను తీసుకొని వచ్చే నాటికి  ఆ విలువల మీద దానికి ఏ గౌరవం లేదు. అలాంటి ఆధునికత వల్ల మన దేశంలో ఆధునికతా క్రమం వికృతంగా తయారైంది. 

దీనికి  ఇంకో పక్క నుంచి మన దేశంలోని నాగరికత  ముఖ్యమైన కారణం. ఆధునికత  మన   నాగరికత పునాదులతో  తీవ్రంగా సంఘర్షించిన మాట వాస్తవమే.  ఈ సంఘర్షణ, కలయిక నుంచి విచిత్రమైన సంస్కృతి పుట్టింది. నాగరికతా కారణాలతోపాటు భూస్వామ్య  ఉత్పత్తి సంబంధాలు, దాని నుంచి పుట్టిన  పుట్టిన  సంస్కృతి వల్ల కూడా ఆధునికత ఇలా తయారైంది. ఈ కారణాలన్నీ కలిసి  ఇక్కడి సామాజిక క్రమాలకు తగిన మేరకు ఆధునికతను అనుమతించాయి.  అందుకే మన ఆధునికత విచిత్రంగా ఉంటుంది.  

ఈ రెండు తీవ్రమైన నష్టాలు జరిగాయి.  అవి..వలస పాలనకు ముందు మన దేశంలో మొదలైన పెట్టుబడిదారీ అభివృద్ధి  వక్రీకరణకు గురి కావడం. అంతక ముందున్న దేశీయ  జ్ఞాన క్రమాలు  కూడా దెబ్బతినిపోవడం. 

ఫలితంగా మన దేశంలో పెట్టుబడిదారీ అభివృద్ధి కూడా వికృతంగా జరిగింది. విపరీతమైన అసమ ‘అభివృద్ధి’గా మారిపోయింది. ఆ ఆధునికత కూడా భారత ఉప ఖండ సమాజాల్లో ఒక్కో చోట  ఒక్కో క్రమాన్ని తీసుకున్నది. అందువల్ల ఒకే తరహా మార్పులు రాలేదు. 

  మన సామాజిక నిర్మితి వల్లే ఇలా జరిగింది. ఆధునిక చింతన బ్రాహ్మణ కులం దగ్గరికి వెళ్లినంత సులభంగా మిగతా కులాల దగ్గరికి వెళ్లలేదు. దాని కోసం శక్తివంతమైన రాజకీయార్థిక, సాంఘిక పోరాటాలు, సంస్కరణలు జరగాల్సి వచ్చింది. ఆధిపత్య కులాల విషయంలోనూ జరిగి ఉండవచ్చు. కానీ  తేడా చాలా ఉంది.  

అట్లాగే వలసవాద పెట్టుబడిదారీ అభివృద్ధి వ్యూహంలో భాగమైన ప్రాంతాల్లోలాగా మిగతా ప్రాంతాల్లో లేదు. అసలు బ్రిటీష్‌ పాలన కిందికి భారత సమాజాలు వెళ్లిన తీరును బట్టి కూడా ఆధునికతా పరిణామాలు జరిగాయి. 

అంటే, ఆధునికత   ఏ ఏ సమూహాల్లోకి, వర్గాల్లోకి ఏ రూపంలో వెళ్లింది? అనేది ముఖ్యమైన అధ్యయనం. ఇది మన దేశంలో ఆధునికతకు ఉన్న పరిమితులను తెలియజేస్తుంది. ఆధునికత  మన దేశంలో సంస్కృతిని ఎంతో ప్రభావితం చేసింది. అంతకంటే ఆధునికతా క్రమమే మన నాగరికత, సంస్కృతి ప్రభావానికి లోబడిరది. ఈ మొత్తం ఉత్పత్తి వ్యవస్థకు, దానిదైన ఉపరితలానికి అవతలి ద్వీపంలో జరగలేదు. 

000

సారాంశంలో వలసవాదం ద్వారా మన దేశానికి పరిచయమైన ఆధునికత పైన చెప్పిన కారణాల వల్ల  యూరప్‌లోని తొలినాళ్ల నమూనా వంటిది కాదు. భిన్నమైనది. ఆధునికత మన దేశంలో సక్రమంగా లేదు కాబట్టి దాన్నొక ప్రమాణంగా తీసుకోమని అంటే అచారిత్రక వైఖరి అవుతుంది. దేనికంటే ఇవాళ ప్రపంచమంతా స్థూలంగా ఆధునికత అనే యుగావధిలో ఉంది. 

ఈ చట్రంలో భారతదేశంలో  కొన్ని గుర్తించవలసిన సాంఘిక, సాంస్కృతిక మార్పులు జరిగాయి. వాటిని అతిగా చూడ్డానికి లేదు. కుదించి తిరస్కరించడానికీ లేదు. అప్పుడే మన నాగరికతా క్రమంలోని మార్పులను చూడగలం. సంస్కృతిలోని మార్పులనూ చూడగలం. కేవలం ఇప్పటి దాకా జరిగిన మార్పులను గుర్తించడానికే కాదు. మొత్తంగానే సంస్కృతిని అర్థం చేసుకోడానికి ఆధునికతను ఒక ముఖ్యమైన ప్రమాణంగా వాడుకోగలం. 

లేకపోతే సంస్కృతికి  ప్రాచీన మూలాలు ఉన్నందు వల్ల సులభంగా గతంలోకి జారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత సంస్కృతిని స్థానీయమనే పేరుతో,  జాతీయమనే పేరుతో నెత్తినెత్తుకొనేవారిని మనం చూస్తున్నాం. ఈ పని సంఫ్‌ుపరివార్‌ ఒక్కటే చేయడం లేదు. తెలిసిగాని, తెలియగాని ఇలాంటి వాదన చేసేవాళ్లు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నారు. ఇట్లాంటి వైఖరికి గతంలో  వలస వ్యతిరేకత అని, సామ్రాజ్యవాద వ్యతిరేకత అనే ముద్దు పేర్లు పెట్టుకున్నారు. దేశీయ ప్రగతిశీల అవగాహనతో వలసవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడానికీ దీనికీ ముఖ్యమైన  తేడా ఉంది. ఇలాంటి వాళ్లు మన నాగరికతలోని ఆధిక్య వ్యవస్థలను, సంస్కృతులను, ఆలోచనాధారలను, ఫ్యూడల్‌ దోపిడీ పద్ధతులను పునాదిగా చేసుకొని సామ్రాజ్యవాదాన్ని  వ్యతిరేకిస్తున్నట్లు పైకి కనిపిస్తారు.  దీన్ని అప్పట్లో  గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనమని కీర్తించారు.  ఇప్పటికీ వాళ్ల వారసులు ఉన్నారు. వలస వాద మనస్తత్వంతో, మేధస్సుతో ఉన్న వాళ్లను ‘ఆధునికులు’గా చిత్రించి వాళ్లను వ్యతిరేకించడానికి దీన్ని వాడుకుంటారు. 

ఈ రెంటికీ వ్యతిరేకంగా సంస్కృతీ చర్చలో ఆధునికతలోని వ్యక్తి స్వేచ్ఛ, హేతుచింతనను ప్రమాణంగా తీసుకోవాలి. మన దేశంలోని ఆధునికతను విమర్శించడానికి కూడా అవే ప్రమాణాలు కావాలి. అలాగే  ప్రగతి అనేది అంతే ముఖ్యమైన ప్రమాణం కావాలి. 

మన దేశంలోని కులాల్లో, తెగల్లో వ్యక్తులు ఉండరు. అందుకే  అందుకే పితృస్వామ్య కుటుంబంలో స్త్రీకి ఉనికి ఉండదు. పురుషుడి గుర్తింపుతో కుటుంబం మాత్రమే ఉంటుంది. వ్యక్తి లేని సామూహికతే సంస్కృతిగా చెలామణిలోకి వచ్చింది. ఆ సమూహానికి వ్యక్తి లోబడి ఉండటంలోని ప్రత్యేకతలు, నియమాలు, కట్టుబాట్లు, నమ్మకాలు ఆ సమూహ గుర్తింపుగా మారిపోయాయి. అవే ఆ సమూహ సంస్కృతి. దాన్ని ఎవ్వరూ విమర్శనాత్మకంగా చూడ్డానికి లేదు. తప్పొప్పులు వెతకడానికి లేదు. దాన్ని శిరసావహిస్తేనే  పద్ధతి ప్రకారం జీవించినట్లు. సంస్కృతిని పాటించడం అంటే అదే. అందులో చిన్నపాటి విభిన్నతలు ఉండవచ్చు. 

ఈ స్థితిని మన దేశంలోకి వచ్చిన ఆధునికత ప్రశ్నించింది. ఆ మేరకు విమర్శనాత్మక చింతనను అందించింది. వలస పాలన వల్ల తలెత్తిన రాజకీయార్థిక సంక్షోభాలతో గ్రామ వ్యవస్థ కుదుపులకు లోనైంది. జీవనోపాధులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యం వల్ల పాత సాముదాయకతలు బీటలువారాయి. ఆ నెర్రెలలోంచి వ్యక్తులు ి్త బైటికి తొంగి చూశారు.  ఒక క్రమంలో బైటికి వచ్చారు.  వేతన కూలీలు అయ్యారు.  అయితే పాత సాముదాయక వ్యవస్థలు శిధిలమయ్యాయేగాని రద్దు కాలేదు. వ్యక్తి మనో ప్రపంచం దానిలోనే బందీ అయింది. అందులో కూరుకపోయిన  పాదాలను వ్యక్తి పూర్తిగా పెకలించుకొని బైటికి రాలేదు. మన నాగరికత, ఆధిక్య సంస్కృతి వ్యక్తుల  సమస్త స్పందనల్లో, చలనాల్లో, చలన రాహిత్యాల్లో  సజీవంగా ఉన్నది. 

ఇదంతా భావజాల, సంస్కృతీ సంబంధంగానే చూడ్డానికి లేదు. వ్యక్తి అక్కడి నుంచి విముక్తం కాగల వెసులుబాటు ఉత్పత్తి వ్యవస్థ  ఇవ్వలేదు. ఉదాహరణకు గత ముప్పై ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు జరిగాయి. వాటికి సంబంధించిన సాంస్కృతిక మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇవి చాలా తీవ్రమైనవే. కానీ పరిపూర్ణమైన వ్యక్తి ఏర్పడలేదు. చివరికి  శ్రమశక్తిని అమ్ముకోవడంలో సర్వస్వతంత్రులైన వేతన కూలీలు ఏర్పడలేదు. ఆ మేరకు హేతుచింతన కూడా అలవడలేదు. ఉత్పత్తి వ్యవస్థలో, మానవ వినియోగంలో టెక్నాలజీ బాగా పెరిగింది. కానీ శాస్త్రీయ ద్పక్పథం కనీసంగా కూడా లేదు. 

కులం, మతం మీద ఆధారపడి ఫాసిజం పెచ్చరిల్లడానికి బూర్జువా రాజకీయార్థిక వ్యవస్థ, పార్లమెంటరీ పాలనా వ్యవస్థలాగే సమాజంలోని ఈ స్థితి కలిసి వచ్చింది. ఈ సాంస్కృతిక సానుకూలతను లోతుగా చూడాలి. అత్యంత ప్రాచీనమైన మూఢ నమ్మకాలు, కుల మత విశ్వాసాలు, వాటి మీద ఆధారపడిన అంతరాలతో, ఆధిక్యాలతో కూడిన కట్టుబాట్లు, అవి నిరంతరం అప్‌డేట్‌ అవుతూ సంక్లిష్టం కావడం కూడా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి కలిసి వచ్చింది. ప్రజాస్వామిక విలువలు, పద్ధతులు, ప్రమాణాలు కునారిల్లుతూ ఉన్నాయి.  ఆ మేరకు  భారత సమాజాల్లో ఆధునికత  అనేది సాధించాల్సిన లక్ష్యంగానే మిగిలిపోయింది. 

మామూలుగా ఆధునికత వల్ల మానవ జీవితంలో  ప్రైవేట్‌, పబ్లిక్‌ విభజన జరుగుతుంది. ప్రైవేట్‌ జీవితం అభిరుచులు, నమ్మకాలు, ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. పబ్లిక్‌ లైఫ్‌ తార్కికంగా, ప్రజాస్వామిక చర్చా క్షేత్రంగా ఉంటుంది.  ఇతరులకు కష్టం, నష్టం కలిగించని ఒప్పందాల మీద నడుస్తుంది. ఇతరులతో సమాన హోదాలో ఇచ్చిపుచ్చుకొనే సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. 

మన దగ్గర ఈ విభజన  అస్సలే జరగలేదనడానికి లేదు. కానీ  ప్రైవేట్‌, పబ్లిక్‌ స్పృహే చాలా తక్కువ. నిజానికి వ్యక్తిగత జీవితం కూడా హేతుబద్ధంగా ఉన్నప్పుడే అర్థవంతం అవుతుంది. అది లేకపోగా బహిరంగ జీవితంలో కూడా కనీసంగా హేతుబద్ధత ఎదగలేదు. కనీస ప్రజాస్వామిక విలువలకు చోటు లేదు. చర్చలకు అవకాశం లేదు. ఇది రాజ్య నియంతృత్వం వల్లేనే కాదు. మన పబ్లిక్‌ ప్రపంచమే అంతగా ఎదగలేదు. అక్కడ రాజ్యం ప్రవేశించింది. పాలకవర్గాల ప్రయోజనాలకు తగినట్లు రాజ్యం వ్యవహరిస్తున్నది. విమర్శనాత్మక చర్చలు, అన్వేషణలు, ఆవిష్కరణలు, సృజనాత్మక ప్రయోగాలు అనేవి ఒక సమాజ బహిరంగ క్షేత్రం ఎంత ఎదిగిందనే దానికి గుర్తు. దీనికి ఇదే సాంస్కృతిక విషయం. సంస్కృతిని విశాలమైన అర్థంలో ఇక్కడ చూడాలి. 

ఇది సవ్యంగా లేకపోవడానికి ఏదో ఒక్క కారణం చూస్తే కుదరదు.   మన సమాజ ప్రజాస్వామికీకరణే అర్థవంతంగా లేదు. దానికి తగినట్లు మౌలికంగా మారలేదు. దీనికి  మన ఉత్పత్తి వ్యవస్థలో మూలాలు ఉన్నాయి. నాగరికతా క్రమంలోని అవలక్షణాలతోపాటు, ఉత్పత్తి వ్యవస్థ నుంచి నిరంతరం పుట్టే సంస్కృతి కూడా ప్రజాస్వామికీకరణను అడ్డుకుంటున్నది. 

అందువల్లే  ప్రజల మనో ప్రపంచం నుంచి, వ్యక్తిగత జీవితం నుంచి అత్యంత ప్రాచీన భావనలను ఫాసిస్టులు రెచ్చగొడుతుంటారు. అతార్కికతను ప్రేరపిస్తుంటారు.  అక్కడి నుంచి   బహిరంగ జీవితంలోకి మురికి  ప్రవహిస్తుంటుంది.  బైట కూడా అదే ఉన్నది. ఆ రకంగా ఈ రెండూ మళ్లీ కలిసిపోతున్నాయి.  

వ్యక్తిగత, బహిరంగ జీవితాలు స్పష్టంగా వేరుపడి ఉంటే ఈ కలయికకు అంతగా చోటు ఉండేది కాదు. మన దగ్గర అదే సక్రమంగా  జరగలేదు. దీంతో పబ్లిక్‌ జీవితంలో మాట్లాడటానికి వీల్లేని అనాగరిక  విషయాలను  సులభంగా ఫాసిస్టులు  మాట్లాడుతుంటారు. సెలబ్రటీస్‌ నోళ్లకు ఇక అంతే ఉండదు. సెలబ్రటీస్‌ అంటే పబ్లిక్‌ ఫిగర్స్‌. కానీ పబ్లిక్‌లో మాట్లాడకూడని హేతురహితమైన జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతుంటారు. అట్లాగే వాళ్ల ఆంతరంగిక విషయాలపట్ల పబ్లిక్‌ ప్రపంచానికి అంతులేని ఆసక్తి ఉంటుంది. పుకార్లు బహిరంగ వేదికల మీద ప్రచారం అవుతుంటాయి. ఇంకోపక్క నుంచి సరిగ్గా స్వాములు, బాబాలు ఇట్లాగే వ్యవహరిస్తుంటారు. ఆధ్యాత్మిక, సామాజిక విషయాలను కలిపి కషాయం తయారు చేస్తుంటారు.

సంఫ్‌ుపరివార్‌ ఫాసిస్టులు ఇక్కడ చోటు సంపాదించుకున్నారు.  భావోద్వేగాలు,  సంస్కృతి, దాని ప్రతీకల పేరుతో ప్రజల వ్యక్తిగత జీవితాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. తద్వారా వాళ్లను మౌనంలోకి తోసేస్తున్నారు. లేదా వాళ్ల ఆమోదం పొందామని ప్రకటించుకుంటున్నారు. ఈ పనులన్నీ చేసి  బహిరంగ సమాజం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నిజానికి వాళ్లు వ్యక్తుల సొంత జీవితం మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నారు. 

ఈ మొత్తం ఒక పెద్ద సాంస్కృతిక, భావజాల వ్యూహం. ‘మనో భావాల’ పేరుతో ఒక ప్రజా సమూహం మరో సమూహం మీద దాడికి దిగేది ఇందులో భాగమే. ఇదొక రాజకీయ, సామాజిక క్రీడగా మారిపోయింది. మార్కెట్‌ ఉద్దేశం కూడా వ్యక్తిగత, బహిరంగ  జీవన క్షేత్రాలను సరుకుల సంతగా మార్చడమే. 

సారాంశంలో వ్యక్తి`సమూహం, వ్యక్తిగతం`బహిరంగం అనే విభజనలో అనేక వక్ర మార్గాలతో మన దగ్గర ఆధునికత కొనసాగుతున్నది. అందువల్ల వ్యక్తి పాత సమూహ బంధనాల నుంచి బైటపడి స్వేచ్ఛాయుతమైన ఉన్నత సమూహంగా మారలేదు. ప్రగతిదాయకమైన పరివర్తనలో భాగంకాగల సమూహంగా ఎదగలేదు. ఇవాళ మనం ఎదుర్కొంటున్న సాంస్కృతిక సంక్షోభం ఇదే. 

దీన్ని ఇంకో వైపు నుంచి చూడవచ్చు. ఫ్రెంచ్‌ విప్లవ నేపథ్యంలో రాజ్యానికి, మతానికి మధ్య స్పష్టమైన విభజన జరిగింది. మతం, ఆధ్యాత్మికత మనుషుల సొంత విషయాలు. అవి బహిరంగ కార్యకలాపాల్లో భాగం కాకూడదు. రాజ్యం ఏ మతానికి  దగ్గరిగా ఉండటానికి వీల్లేదు. ఇదే సెక్యులరిజం. రాజ్యం మతాతీతంగా ఉండాలి. ఆధునికతలాగే ఇదీ మనకు బైటి నుంచే పరిచయం అయింది. మతాతీతంగా  ఉండాలనే సభావన అన్ని మతాలకు సమాన దూరం అని మన దేశంలో అర్థం చేసుకున్నారు. అదీ అమలు కాలేదు. సమాన దూరం అనే మాట మెజారిటీ మతానికి ఎక్కువ దగ్గరిగా, మైనారిటీ మతాలకు ఎక్కువ దూరంగా ఉండటం అని రుజువైంది.  అక్కడి నుంచి  క్రమంగా మెజారిటీ మత రాజ్యంగా మారింది. అది చాలదని ఇప్పుడు సంఫ్‌ుపరివార్‌ ఏకంగా హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నది. ఏకంగా సమాజాన్ని కూడా హిందూ సమాజంగా మార్చాలని చూస్తున్నది. దీంతో   సాంస్కృతిక సంక్షోభం తీవ్రమైంది. దీనికి వాళ్లు గతం మీద ఆధారపడుతున్నారు. 

దీన్ని అధిగమించాలంటే` గతం నుంచి ఏం తీసుకుంటామో స్పష్టత ఉండాలి. ఒక భౌగోళిక ప్రాంతంలో, ఒక సామాజిక ప్రపంచంలో తరతరాలుగా పోగుపడడుతున్న సంస్కృతిలో కొనసాగవలసిన అంశాలు తప్పక ఉంటాయి. అవి ఆ ప్రజల వారసత్వం. వాళ్లు ఉత్పత్తిలో పాల్గొన్నట్లే అనేక సాంస్కృతిక కలాపాల్లో పాల్గొని వాటిని రూపొందించుకొని ఉంటారు. అవి ఆ సమాజ ప్రత్యేకతలు. ప్రజల సొంతం. అవి నడిచిన దారిలో పోగపడినవి. కాబట్టి వాటికి ప్రాచీన లక్షణం ఉంటుంది. అయితే వాటిని ఆధునికత మీద ఆధారపడి పునర్నిర్మించుకోవాలి. యథాతధంగా అనుసరించడానికి లేదు. బైటి ప్రాంతాల, దేశాల, ప్రజల సంస్కృతిని అనుకరించడం ఎంత తప్పో వీటిని యథాతధంగా ఆధునిక యుగంలో కొనసాగించడానికి లేదు.  

శ్రమ మీద ఆధారపడిన సాంస్కృతిక విశేషాలను, దేశీయమైన సాంఘిక ప్రత్యేకతలను పీడిత కులాల, తెగల, ప్రాంతాల సాంస్కృతిక విశేషాలను పదిలంగా కాపాడుకోవాలి. అవి ఆధిక్యాలకు, ఆత్మన్యూనతలకు లోనుకాని సామాజిక, చారిత్రక ప్రత్యేకతలై ఉండాలి. ప్రగతికి ప్రతిబంధకం కానివై ఉండాలి.  అలాగే సంస్కృతిలో కొత్త భావనలు భాగం అవుతుంటాయి. ఏవి భాగం చేసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి నిర్దిష్టమైన ప్రమాణాలను ఏర్పరుచుకోవాలి. 

అట్లా కాకుండా  ప్రజల సంస్కృతి ` పాలక సంస్కృతి అనీ, దళిత బహుజన సంస్కృతి ` అగ్రకుల సంస్కృతి  అనీ, మత మైనారిటీల సంస్కృతి ` హిందుత్వ సంస్కృతి అనీ, ఆదివాసీ`ఆదివాసేతర సంస్కృతి అనీ, అభివృద్ధి చెందిన, వెనుకబడిన ప్రాంతాల సంస్కృతి అనే విభజనకే పరిమితం కావడానికి లేదు. అవి స్థూల విభజనలు.   అందులో ఏ ఒక్కదాన్నో సంస్కృతిగా స్వీకరించలేం. అన్నిటిని కలిపి కూడా  సంస్కృతిగా స్వీకరించలేం.  వాటిని కూడా ఆధునికత, వ్యక్తి స్వేచ్ఛ, హేతుబద్ధత, ప్రగతిదాయకత, స్వేచ్ఛాయుతమైన నూతన సమిష్ఠీకరణ మొదలైన ప్రమాణాల మీద  అభివృద్ధి చేసి సొంతం చేసుకోవాలి. సంస్కృతిలోని యథాతధ స్వభావాన్ని బలహీనపరుస్తూ సంస్కృతీ వికాసానికి ఇవన్నీ అవసరం. అప్పుడే మొత్తంగా సామాజిక పురోగతిలో సంస్కృతి కీలకమైన పాత్ర నిర్వహించగలుగుతుంది. 

అప్పుడే ఆ   సంస్కృతులు ప్రత్యామ్నాయం అవుతాయి. దాన్ని చేరుకోడానికి మధ్యలో ఎన్ని వాదనలైనా చేయవచ్చు. అప్పటికి అవి అవసరమే కావచ్చు.  కానీ వాటి పరిమితి తెలిసి ఉండాలి. ఉదాహరణకు బ్రాహ్మణ సాంస్కృతిక ఆధిక్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణేతర ఉద్యమం చాలా కొత్త పద్ధతులను ముందుకు తీసుకొచ్చింది. సంస్కృతంలో కాకుండా తెలుగులో మంత్రాలు, బ్రాహ్మణేతర పౌరోహిత్యం మొదలైనవాటిని ప్రవేశపెట్టింది. అలాగే రాముడి సంస్కృతికి పోటీగా రావణుడి సంస్కృతి వచ్చింది. ఇవన్నీ చూడ్డానికి బాగుంటాయి. కానీ అవే నూతన సంస్కృతిని నిర్మించేందుకు సరిపోవు. సరికాదు. 

ప్రజా, దళిత, ఆదివాసీ, మత మైనారిటీల సంస్కృతులు అనడంలో ఒక సామూహితక ఉన్నది. అది ముఖ్యమైన ప్రాతిపదిక. దాన్ని స్వీకరిస్తూనే ఏ ఏ సాంస్కృతిక అంశాలు ఆ సామూహికతను పట్టి ఉంచుతున్నాయో, ప్రత్యేకతలను కల్పించాయో చూడాలి. వాటిలో ప్రగతి వ్యతిరేకమైనవి, యథాతధ స్థితిని పట్టి ఉంచేవి చూసి వాటిని తిరస్కరించాలి. వాటిలో హేతుబద్ధత మీద పునర్నిర్మించగలిగేవి ఏవో గుర్తించాలి. 

ఇది చాల సునిశిత విమర్శనాత్మక దృష్టితోనే సాధ్యం. ఒక సామాజిక దశ నుంచి మరో దశలోకి చేరుకోడానికి ఆ సమూహాలు చేసే ప్రయత్నంలో భాగంగానే సాధించగలం. అనేక పోరాట రూపాలతో, వర్గపోరాటాలతోనే ఇది సాధ్యం. 

Leave a Reply