చాలా కాలం నుండి నేను “రక్త చలన సంగీతం ” కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి (రిసారె) పుస్తకం కోసం ప్రయత్నాలు చేశాను. నాకు నిరాశే ఎదురైంది. రెండు సంవత్సరాల నా ప్రయత్నంలో మిత్రుడు శివరాత్రి సుధాకర్ సలహాతో నాకు ” రక్త చలన సంగీతం” సంకలనం వీక్షణం వేణుగోపాల్ సార్ వద్ద దొరికింది. ఎంతో ప్రేమతో వేణుగోపాల్ సార్ పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకం మిత్రుడు నరేష్ ద్వారా నా చేతి మునివేళ్లు తాకింది. నాకు కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి గూర్చి ముందుగా పరిచయం చేసింది మాత్రం కామ్రేడ్ అమర్. నేను అమర్ దగ్గర నుండి రిసారె గూర్చి తెలుసుకున్నాను. అలా రిసారెను చదవాలని ప్రయత్నం చేశాను. రిసారె కవిత్వం రాసేవాడని, తాను రాసిన కవితలు, పాటలు లభ్యమైన వాటితో విరసం కామ్రేడ్ రిసారె అమరత్వం తరువాత ముద్రించిందని చెప్పాడు. అలా అమర్ ద్వారా పరిచయం అయిన రిసారెను చదవడం కోసం నా అడుగులు పడ్డాయి. నేను ఇలా పుస్తకాల ప్రయత్నం చేస్తున్న ప్రతీ సారి నాకు మిత్రులుగా ఉన్న పొడుపుగంటి మోహన్, నరేష్ పాలడుగు శ్రీనివాస్ ల సహకారం లేకపోదు.నాకు ఎప్పుడు పుస్తకాలల్లో సహకారం అందించే పవన్, బామ్మర్ది వి.సాయి ల సహకారం కూడా కామ్రేడ్ రిసారె పుస్తకాని నాకు అందించే ప్రయత్నంలో వారి కృషి కూడా ఉన్నది. కామ్రేడ్ రిసారెను తాను రాసిన ” రక్త చలన సంగీతం” పుస్తకం ద్వారా మనం ఎంత అర్థం చేసుకున్న గానీ తన ఆలోచనలు మాత్రం ఏ పోరాటంతో ముడిపడి ఉన్నాయో మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. రిసారెను ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు తన రచనకు పెట్టిన పేరు మనకు తెలియజేస్తుంది. ఇది విరసం తన ఆలోచనలతో, కామ్రేడ్ రిసారె విశ్వసించే రాజకీయాలకు, తాను విశ్వసించి ప్రాణాలు ఒదిలిన తన రాజకీయ నిబద్ధతను తెలియజేస్తుంది. బహుశా అందుకే కావచ్చు సంకలనం పేరుకు తగ్గట్టుగానే నిర్ణయించారు.
ఇంతకీ ఎవరీ రిక్కల సహదేవ రెడ్డి.? ఆయనను కవిగా మార్చిన పరిణామాలు ఏంటి.? తను ఎలా విప్లవ ప్రజా సంఘాల్లోకి రాగలిగాడు. మనకు రిసారె రాసిన రక్త చలన సంగీతం పుస్తకం చదవక ముందు ఉదయించే ప్రశ్నలు. అవును ఎవరికైన ఒక రచయిత గూర్చి తెలుసుకోవాలంటే వారు రాసిన పుస్తకం చదివితే తెలుస్తుంది. కానీ ఆ రచనలకు కారణం ఏంటి అనేది ఉదయించే ప్రశ్నలే కదా. అలా నా మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలతోనే నేను కామ్రేడ్ రిసారెను చదవగలిగాను. నా ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం ప్రారంభించాను. ఆ క్రమమే ఇది.
కామ్రేడ్ రిసారె గూర్చి రాయాలనుకున్నప్పుడు తాను విశ్వసించిన రాజకీయాల గూర్చి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది భారత దేశాన్ని కర్రు నాగలితో చెక్కిన నక్సల్భరి పోరాట కాలం. ఈ కాలం కంటే ముందే తెలంగాణ నేల మీద మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాట ప్రభావం నేలంతా తాకింది. ఈ ప్రిపరేషన్ గ్యాప్ లోనే నక్సల్భరి పోరాటం బద్దలైంది. అది వందలు వేల గ్రామాలను తాకి లక్షలాది మేదలన్ను కదిలించింది. దోపిడీ పీడన లేని రాజ్యం కోసం పోరాటాలు బద్దలైన కాలమది. ఈ కాలంలో బుద్ది జీవుల మీద, విద్యార్థుల మీద, కవులు కళాకారుల మీద ఇలా అన్ని సెక్షన్ల ప్రజల మీద తన ప్రభావం వేసింది. అది తెలంగాణ నేలలోని గోదావరి లోయ పోరాటంగా మారింది. అక్కడి నుండి అది నిమ్మపల్లి పోరాటం రెక్కలు తొడిగింది. సిరిసిల్ల తాలూకా లోని నిమ్మపల్లి (ఇప్పటి కొనరావు పేట మండలం నిమ్మపల్లి) భూ పోరాటం కామ్రేడ్ డివి కృష్ణల రాజకీయాల వలన కామ్రేడ్ కూర రాజన్న, కామ్రేడ్ జేవి చలపతిల నాయకత్వంలో ఆ పోరాటం బద్దలైంది. ఆ పోరాటం ఒక ఉవ్వెత్తున ఎగసిన పడింది. పోరాటం ఏ స్థాయిలో ఉన్నదో భూస్వామ్య కిరాయి గుండాల ఆగడాలు అదే స్థాయిలో కొనసాగాయి. అక్కడి నుండే దళాల ప్రతిఘటన ఉద్యమం మైదాన ప్రాంతాలకు విస్తరించింది. అలా నిమ్మపల్లి పోరాటం 10 గ్రామాల నుండి అనతి కాలంలోనే 100 గ్రామాలకు ఎగబాకింది. ఇదే సిరిసిల్ల రైతాంగ పోరాటాపు పునాది. ఈ పోరు నుండే పల్లె పల్లెల జనం కదిలారు. గడప గడపకు తాకిన సిరిసిల్ల రైతాంగ పోరాటం ఉత్తర తెలంగాణ మీదగా మెదక్ జిల్లాకు విస్తరించింది. భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలు, వారి ఆగడాలను కట్టడి చేశాయి. రైతు కూలీ సంఘాలు ఊరూరా వెలిశాయి. రాత్రి బడులను నడిపారు. పోరాట కాలంలో కాళ్ళ కింద మట్టి దొరల కండ్ల బడ్డది. ఇది జీర్ణించుకోలేని భూస్వాములు, కిరాయి రౌడీలతో పోరాటాన్ని అణచడం కోసం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని అణిచివేతల నడుమ పోరాటం ఒక కెరటంగా ఎగసింది. పల్లెలన్ని పోరాటల ప్రభావంతో దావణంలా చుట్టుముట్టాయి. పోలీసు క్యాంపులు వెలిశాయి.భూస్వామ్య, గుండాల దాడులకు, పోలీసు క్యాంపులకు వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 1977లో సిరిసిల్ల పట్టణంలో భారీ బహిరంగ సభ జరిగింది.దీనికి వక్తగా సి.పి.ఐ (ఎం – ఎల్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ హాజరయ్యాడు.అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్ కూర రాజన్న ఆ సభ కోసం బయటకు వచ్చాడు.వేలాది జనాన్ని సమీకరించడంలో కామ్రేడ్ రాజన్న పాత్ర లేకపోలేదు.1978లో కల్లోలిత చట్టం (Area distrubance Act -1978) కింద సిరిసిల్ల జగిత్యాల తాలూకాలను అక్టోబర్ 20, 1978న కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కల్లోలిత ప్రాంతాల ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్దెత్తున ర్యాలీలు నిర్వహించారు. రైతు కూలీ పోరాటాల ఉద్యమాల ప్రభావంతో ప్రతి ఊర్లో సంఘం జెండా ఎగిరింది.1980లో జనవరి 3న కామ్రేడ్ జెవి చలపతిరావు అరెస్టును వ్యతిరేకిస్తూ సిరిసిల్ల పట్టణంలో జరిగిన నిరసన ప్రదర్శన ఒక జైత్రయాత్ర లాగా ప్రజలు కదిలారు. ఇదే సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కామ్రేడ్ జక్కుల ఎల్లన్న (ఆవునూరు గ్రామం) అమరత్వంతో పాటు ఎనిమిది మంది గాయపడ్డారు. ఇలాంటి నిర్భందాలను సైతం ఎదుర్కొంటూనే ఉద్యమం ఎదిగింది. అమరుడు జక్కుల ఎల్లన్నను ప్రజలు తమ బిడ్డగానే చివరి వీడ్కోలు పలికి తన అమరత్వాన్ని ఎత్తిపట్టారు.1980 సంవత్సరంలోనే వేములవాడ భూస్వామి చెక్కపల్లి భగవంతరావు ఆగడాలకు వ్యతిరేకంగా మార్చి 23న షహీద్ భగత్ సింగ్ వర్ధంతి నాడు వేములవాడ పట్టణంలో భారీ ఊరేగింపు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. పీడిత జనాన్ని ఏకం చేస్తున్న రైతు కూలీ పోరాటాలను అణచడానికి భూస్వాములు, గుండాలు ఒక్కటైనారు. అలా ప్రైవేట్ సైన్యం తయారు చేసి సిరిసిల్ల తాలూకాలో పని చేస్తున్న సంఘం నాయకుల మీద కార్యకర్తల మీద దాడికి పాల్పడ్డారు. ఫకూర్ నాయక్ అనే గుండాని భూస్వాములు నిమ్మపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యమాన్ని అణచడం కోసం ఉపయోగించుకున్నారు. అలాంటి దాడులను తిప్పికొట్టడంలో ముదాం రామన్న కీలక పాత్ర పోషించాడు. ఎన్ని రకాల దాడులున్న ఇవ్వన్నింటిని తట్టుకుని ఉద్యమం ఎగబాకింది. ఎందరో అమరత్వపు జాడలు ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వీరి అమరత్వం రిసారె మీద ప్రభావం వేసింది.
1983లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్నికల సందర్భంలో నక్సలైట్లు దేశ భక్తులంటూ ప్రచారం చేశాడు. అధికారంలోకి రాగానే 1984లో ఆట-పాట-మాట బంద్ చేయించాడు. మీసా, పేసా చట్టాల కింద కుట్ర కేసులు నమోదు చేశాడు. నక్సలైట్లే దేశ భక్తులంటు చెప్పిన ఎన్టీఆర్ 1985 ఏప్రిల్ 10న కొండాపూర్ ఎన్ కౌంటర్ చేయించాడు. చేతులు కట్టేసి ఐదుగురినీ కాల్చి చంపింది రామారావు ప్రభుత్వం. ఎప్పటి లాగానే కట్టు కథ అల్లింది. ఈ ఎన్ కౌంటర్ పచ్చి బూటకమని అందులోంచి తప్పించుకున్న అక్కపల్లి నారాయణ ఆ వార్తను బయట సమాజానికి తెలియజేశాడు. నిత్య నిర్భాంధాల నడుమ ఉద్యమం కొనసాగింది.ప్రజా సంఘాలు విస్తరించాయి.
నక్సల్భరి – శ్రీకాకుళ పోరాటాల వెల్లుల ప్రభావంలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం విస్తరించిన క్రమంలోనే అవిభాజ్య కరీంనగర్ జిల్లా (ప్రస్తుత సిద్దిపేట జిల్లా) లోని హుస్నాబాద్ పట్టణ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబంలో కన్ను తెరిచాడు రిక్కల సహదేవ రెడ్డి. తను చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండే వాడు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోరాటాలు విస్తృతంగా పెల్లుబికాయి. పోరాట కాలంలో రిసారె బాల్యం గడవడం వల్ల తనను ఆలోచింపజేసింది. అలా తాను పిడిఎస్ యు లోకి 80 దశకంలో దారులు వేటుకుంటు అడుగులు వేశాడు. ఇంటర్ చదువుతోనే ఆపివేసి పిడిఎస్ యు విద్యార్థిగా పూర్తి కాలం కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించాడు. విద్యార్థి ఉద్యమంతో మమేకం అవుతూనే, రైతు కూలీలకు, బీడీ అక్కలకు తోడుగా నిల్చాడు. జిల్లాలో జరిగే ఏ ప్రజా పోరాటంలోనైన రిసారె ఉండే వాడు. ఉద్యమ ప్రభావం వలన ప్రజల సమస్యలపై రచన సాగించాడు. అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న తన ఆలోచనలను అక్షర బద్ధం చేసాడు. నూనూగు మీసాల కుర్రోడు. అచ్చం ఈ దేశ విముక్తి కోసం యవ్వనంలో ప్రాణాలు ఒదిలిన షహీద్ భగత్ సింగ్ లా మన రిసారె. ఎంతో కాలం రిసారె బతకలేదు పాతి కేల్ల (25 సంవత్సరాల) వయస్సులో రాజ్యం పొట్టన పెట్టుకుంది.1988 మే 25న పోలీసులు కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డిని పట్టుకుని రెండు రోజులు చిత్రహింసలు పెట్టిన తరువాత మే 28న కోనారావు పేట మండలం ధర్మారం గ్రామంలో కాల్చి చంపి గుర్తు తెలియని శవంగా ప్రకటించారు. ఎప్పటి లాగానే ఎన్ కౌంటర్ కట్టు కథ అల్లారు. రిసారెను పట్టుకున్నప్పుడు తన దగ్గర తీవ్రవాద సాహిత్యం దొరికిందట. సాహిత్యం తన దగ్గర దొరకడం కాదు అసలు తనే ఒక కవి అయితే. రాజ్యాపు కృరత్వాన్ని అక్షర బద్ధం చేయడం కూడా నేరమని రిసారె అమరత్వం మనకు చెపుతుంది. కామ్రేడ్ రిసారె అమరత్వం తర్వాత సంవత్సర కాలానికి సర్దార్ హష్మీని చంపింది. కవులు కళాకారులు మీద రాజ్యం తన కత్తిని ఎక్కుపెట్టింది.
కామ్రేడ్ రిసారె తన మనసుల్లో గుదిగుచ్చుకున్న ఆలోచనలను, తనను కల్చివేసిన ప్రజా సమస్యలను, తాను అక్షర బద్ధం చేశాడు. కొన్ని కవితలుగాను, మరి కొన్ని పాటలుగాను రాశాడు. రిసారె అనే పెరుగానే ఇవ్వని రాశాడు. కరీంనగర్ సాహితీ ఉద్యమంలో కండ్లుదేర్సాడు. “నూతన సాహితీ “నీ ప్రారంభించడంలో రిసారె పాత్ర ఉన్నది. అప్పుడప్పుడే రెక్కలు తోడుగుతున్న కవిగా ఎదిగివస్తున్న కామ్రేడ్ రిసారెను రాజ్యం పొట్టన పెట్టుకుంది. తన అక్షర జ్వాల మాత్రం నేటికీ మండుతున్న అగ్నిలా ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తుంది. నాటి వ్యవస్థలోని రుగ్మతల్ని ప్రశ్నిస్తూ ఈ వ్యవస్థ మార్పు కోసం రిసారె ఉద్యమం – రచనను రెండిటినీ జోడెడ్ల బండిలా కొనసాగించాడు. రిసారె రాసిన ” వసంతం” అనే కవితలోని కొన్ని
“మా జీవితంలో వసంతం లేదు
ఆకురాలు కాలం వలె
బతుకులెప్పుడు రాలుతూనే ఉన్నాయి
మాకు మూడు పంట కాలాలు తెల్సు
చింతపువు కార్తీ లాభిస్తుందని తెల్సు
మా బొక్కలు బొక్కెన చేసి
మా రెక్కలు యాతం చేసి
చెమటలు చెన్లలో పారించటం తెల్సు
కూలీ తరికై దెబురించటం
మేడల ముందు మొకరిల్లడం తెల్సు
అద్దాల మేడల క్రినీడల్లో వాడిగోర్లు తెలుసు
కోయిలమ్మ కూతలకన్న
కామాంధుల కూతలే తెల్సు
ముసి ముసి నవ్వుల వసంతం కన్నా
విషపు నవ్వుల కాలనాగులే తెల్సు “.
(ఇది విరసం 11వ మహాసభల కవి సమ్మేళనంలో చదివిన కవిత) అంటాడు. నాటి దోరల భూస్వామ్య వ్యవస్థ ( feudal landlords) అధికారం, అంగబలం నాటి దొరలకే చెందుతుంది. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో దొరల భూస్వామ్యపు ఆగడాలకు అంతుపొంతు లేకుండా పోయింది. కూలీ చేసుకునే రైతుకు పంట పండించే కాలాలు మాత్రమే తెల్సు కానీ ఆ పంట చేతికి వచ్చినాక అది నాగ కూలీ అంటూ, వడ్డీ కింద లెక్కగట్టి ధాన్యాన్ని కల్లపు రాశుల నుండే దొరల బండ్లెక్కించే వైనం కవి చెపుతున్నాడు. రెక్కల్ని బొక్కలుగా మార్చుకుని కండ్లల్లో వత్తులేసుకొని రైతు పంటను తన కడుపు పంటగా చూసుకుంటాడు. అలాంటి రైతుకు పండించిన పంట మీద హక్కు లేకుండా నాటి దొరల భూస్వామ్య వ్యవస్థ చేస్తే, నేడు పాలక ప్రభుత్వాల తీరు కూడా అలానే ఉన్నది. యెట్టి పని, బాంచెన్ పని కింద ప్రజలు భూస్వామ్యపు దొరల కాడ కాళ్ళ కింద వారి బతుకులు మగ్గేవని కవి వాపోయాడు. మహిళలకు మరో రకంగా అణిచివేత జరిగేదంటాడు. పల్లెల్లో చెట్టు చేన్లలో పక్షుల అరుపులు వింటాము గానీ ఇక్కడ దొరల నోటికి హద్దు అదుపు లేకుండా వాడి అరుపులుంటాయంటాడు. వాడి నోరు తెరిస్తే చాలు కామాంధుడి కోరికలతో నలిగే మహిళల జీవితాల్లో విషాన్ని చిమ్మే సర్పము లాంటి వాడు. ఎందరో అభాగ్య మహిళల జీవితాలతో చెలగాటం ఆడినారంటాడు. తరతరాలగా మారలేని జీవితాల్లో మార్పును కాంక్షిస్తూ ఆ మార్పు దిశగా అడుగులు సాగిన నాడే మాకు వసంతం అంటాడు కవి రిసారె.
ఇంతటితో ఆగలేదు కవి. ఈ సమాజంలో బక్కపల్చని బతుకుల సుడిగుండం ఎలా ఉన్నదో చెపుతాడు.
” కట్నపు కిరోసిన్ మంటల్లో
నిస్సహాయురాలి ఆర్తనాదం
లాకప్ ఊచల నడుమ
అస్తమిస్తున్న నిర్భాగ్యులు” అంటాడు.
అవును కదా నాటికి నేటికి ఏం మారిందని. నాడు వరకట్నపు పేరు మీద మహిళల్ని అత్తింటి వారు చంపిన ఘటనలు కోకొల్లలు. నేడు కూడా అదే వ్యవస్థ లోపాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాది. అంటే సమాజం తన రూపు మార్చుకున్న గానీ దానిలో సారాన్ని మాత్రం మార్చుకోకుండా ఇప్పటికీ ఆనాటి భూస్వామ్యపు పితృస్వామిక ఆనవాళ్లను కొనసాగిస్తుంది. నాడు కూడా అక్షరం ముక్క తెలియక నిరుపేదలు దొరల ఆగడాలకు రాజ్యపు చిత్రహింసల్లో మగ్గి బలైనవారు ఉన్నారు. కొందరు ఊచలేనకాల మగ్గిపోయినవారు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఇదే స్థితి ఈ వ్యవస్థలో ఉన్నది. నేటికీ భారత దేశంలో సుమారు వేలాది మంది ఆదివాసీలు తాము ఎందుకు జైల్లో ఉన్నామో తెలియదు. వారికి బెయిల్ విషయం తెలియదు. ఇలాంటి స్థితులు ఇప్పటికీ ఉన్నాయనేది మన కండ్ల ముందు కదలాడుతున్న సత్యం. వీటిని చూసి రాజ్యం పకలబడి నవ్వుతుందంటాడు కవి
” రక్తం రాబందుల గుండెనిండా హాయి
మాదే గెలుపని
చీకటి చీడలు చిరుహాసం మాడ్తున్న రేయి
కటిక చీకటికేం తెల్సు
చీకటి మబ్బుల్ని పరిహసిస్తూ
రేపటి ప్రభాత రేఖలోస్తాయని”
రాజ్యం పీడిత జన సమూహంలో అల్లుకున్న చీకటిని చూసి నవ్వుకుంటుందేమో కానీ ఆ పీడిత జనం బతుకుల్లో ఉన్న చీకటి ఎన్నటికీ కొనసాగాదు. ఆ చీకటిని చీల్చే కొత్త సూరీడు రాక మానదంటూ కవి ఆవేదనతో తెలియజేస్తాడు.
తన అడుగులు కరీంనగర్ పోరాటంతోనే అనుకుంటు తన జాడల్ని వేతుకుంటాడు.ఆ పోరాటానికి వారసత్వంగా నిల్చిన పల్లెల్ని తడుముకుంటాడు.
” సిరిసిల్ల వేములవాడ ఉద్యమంలో
ఎండి బీటలువారిన నెలల్లో భూస్వామ్య పదఘట్టనల కింద నలిగి
మూగజీవుల స్వేచ్చా కొరకై
శతృవు విషవలయంలో చిక్కి
రేపటి సూర్యోదయానికి
నెత్తుర్లో ముంచెత్తిన జెండాలతో
స్వాగతం పలుకుతున్న ప్రభాత విహంగాలు
అపుడే జన్మించిన నెత్తుటి బిడ్డలు
ఎంత అన్యోన్య పోరాటం
ఎంత మహోన్నత త్యాగం
పల్లెలన్నీ తల్లులై
బిడ్డలకు పోరాటాలు తాపిస్తున్నాయి ” అని తను రాజకీయ క్షేత్రమైన సిరిసిల్ల పోరాటాన్ని తడుముతున్నాడు. అక్కడి నెలల్లో జరిగిన పోరాటాల్లో అమరులైన వారిని మదినిండా తల్సుకుంటాడు. వారి త్యాగాలను ఎత్తిపడుతాడు. ఆ పోరాటాలకు ప్రతి పల్లె తల్లిలా సాదిందంటాడు. భూస్వాములు ఆగడాలకు ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు మళ్ళీ మళ్ళీ పుడుతారంటాడు. వారు ఆ పోరులోనే ఉంటారని కవి కాంక్షిస్తాడు.
ఈ బానిస బతుకులు మారాలని. మార్పు రావాలంటే సాయుధ పోరు జరగాలంటాడు. అలా తన ఆలోచనను మరో మిత్రుడితో రాసుకున్న ” తల్లి వస్తున్నాం”కవితలో వెల్లిబుచ్చుతాడు. మహిళలకు స్వేచ్చ ఎక్కడ ఉన్నది. వారిని సాంప్రదాయం పేరు మీద బంధీలుగా మార్చిన సనాత ధర్మం ఉన్న చోట వారికి ఇంక హక్కులు ఎక్కడ అంటూ ” మార్చి 8″ కవితలో ఇలా అంటాడు.
“సనాతన సాంప్రదాయ ముసుగులో
ధర్మశాస్త్ర నిబంధనలతో
సతి సదాచారాల మాటున
పవిత్ర పరదాల మాటున
పతి ధర్మాల కస్టడీలో
బానిసలుగా
జీవచ్చవాలుగా”
అని కవి మహిళల అణిచివేతల గూర్చి తెలియజేస్తాడు.
మన సమాజం ఎట్లా ఉన్నది. ఇది ఎలాంటి సమాజం అంటూ ” ప్రశ్న” అనే కవితలో సూటిగా చెపుతాడు.
“వరకట్నపు కాలనాగుకీ
వనితలంతా బలౌతుంటే
నిరుద్యోగం విషనాగై
నిరుద్యోగుల్ని కాటేస్తుంటే
సామ్రాజ్యవాదం ఉప్పెనై
సకల సంపదలను ముంచేస్తుంటే
పాలకులందరు జేజేలు కొడ్తూ
భారతావనినే అర్ధవలసగ మార్చిరి”
అంటూ కవి మనకు తెలియజేస్తాడు.
ఈ సమాజంలో వరకట్నపు జ్వాలల్లో చనిపోయిన వనితల గూర్చి, పెరిగిపోతున్న నిరుద్యగం గూర్చి వీటికి కారణం సామ్రాజ్య వాదపు విషపు నీడలే అంటాడు.సామ్రాజ్యవాదం ఈ సమాజంలో అన్నింటికీ కొల్లగొడుతూ కీలు బొమ్మ పాలకులున్న దేశం అర్ధ వలస కాకుండా పోదా అంటూ కవి తన ఆవేదన వెలిబుచ్చాడు. ఇది నేటికీ కొనసాగుతూనే ఉన్నది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏమి మారలేదు. అదే సామ్రాజ్యవాదుపు విష కోరలు మూడో ప్రపంచ దేశాల మీద పడగ విప్పుతూనే ఉన్నది. వీటిని ఎదుర్కోవడం కోసం తమ ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, అల్లూరిలు ఇదే కోరుకున్నారా అని అంటాడు.
1985 సంవత్సరం ఏప్రిల్ 10న రామారావు ప్రభుత్వం ఎన్ కౌంటర్ పేరు మీద హత్య చేసిన కొండాపూర్ అమరుడు కామ్రేడ్ నట్టరాజన్నను తల్సుకోని ” నక్సల్భరి బిడ్డ – నట్ట రాజన్న” అంటూ పాట రాస్తాడు. సమాజ మార్పులో నీ త్యాగం అజరామరమంటాడు. విద్యార్థి పోరాటాలు లేని చరిత్ర లేదు. అలాంటి విద్యార్థులు మూఢ నమ్మకాలు, అంధ: విశ్వాసాలతో కాకుండా ప్రగతి శీలమైన భావనలతో వ్యవస్థ మార్పులో భాగం కావాలంటాడు కామ్రేడ్ రిసారె. అలా ” విద్యార్థి వీర లెమ్మురా” అంటూ పాట రాశాడు.
విద్యార్థులుగా పోరాటం చేస్తూనే, రైతుకు, కార్మికుల పోరాటాలకు అండగా నిలవాలని కాంక్షిస్తాడు. మేటి విప్లవానికి నేడు వారసునిగా నిలవాలని తన ఆకాంక్షను చాటుతాడు.
మనం రిసారె కవితలన్ని, పాటలన్ని చదివితే మనకు ఒక్కటే అర్థం అవుతుంది. కామ్రేడ్ రిసారె తాను కాంక్షించిన సమాజం రావాలన్న ఇప్పుడున్న ఈ వ్యవస్థ మారాలన్న అది పోరాటం ద్వారానే అని స్పష్టంగా తన రచనల ద్వారా చెప్పాడు. కామ్రేడ్ రిసారె అందరికీ తెలిసిన పెద్ద కవి కాకపోవచ్చు కానీ ఈ వ్యవస్థ మార్పులో తాను ఒక భాగంగా మారాడు. కామ్రేడ్ రిసారె రాసిన ” రక్త చలన సంగీతం” సంకలనం 1988 సంవత్సరంలో తన అమరత్వం తర్వాత సెప్టెంబర్ నేలలో వచ్చింది. మళ్ళీ ఈ పుస్తకం ఎక్కడ ముద్రితమే కాలేదు. కామ్రేడ్ రిసారెను నేటి తరానికి పరిచయం చేయడం కోసం ఈ ప్రయత్నం.కామ్రేడ్ రిసారె పుస్తకం విషయంలో నాతో ఆలోచనలు పంచుకున్న మిత్రుడు శివరాత్రి సుధాకర్ తన రచనలను ముద్రిస్తే బాగుంటుందని చెప్పాడు. మేము కామ్రేడ్ రిసారె పుస్తకం మళ్ళీ ముద్రించాలని అనుకుంటున్నాం అని చెప్పాను. ఆ కోవలోనే తన రచనల మీద కొన్ని ఆలోచనలను పంచుకుంటున్నాను .
(కామ్రేడ్ రిసారె పుస్తకం కోసం నాకు సహకరించిన మిత్రులందరికీ స్నేహాన్ని, ప్రేమను అందించగలను..)