ప్రపంచ మార్కెట్లోకి రష్యాని ప్రవేశించకుండా; దానిని ప్రపంచాధిపత్య పోటీదారుడిగా నిలిచే అవకాశం ఇవ్వకుండా;  పాత యూరోప్ దేశాలతో దాని పాత శత్రుత్వం తగ్గే స్థితిని రానివ్వకుండా; ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత తన వెనకంజ స్థితిని బలహీనతగా తీసుకునే అవకాశాన్ని కూడా దానికి ఇవ్వకుండా ఇటీవల అమెరికా శరవేగంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు బెడిసికొట్టాయి. హిరోషిమా, నాగసాకి అణు మారణహోమంతో ప్రారంభమై, ఏడున్నర దశాబ్దాల పైబడి పొందిన  అమెరికా ప్రపంచాధిపత్య రాజనీతి ఉక్రెయిన్ వద్ద గాలిలో కలిసిపోయింది. ఇది ప్రపంచ బలాబలాల పొందికలో వస్తున్న గుణాత్మక మార్పుల్ని సూచించే సంఘటనగా చరిత్రలో నిలుస్తుంది. ఇదేదో ఉక్రెయిన్ కి పరిమితమైన యుద్ధ సంఘటన కాదు. ఇదో సుదీర్ఘ గొలుసుకట్టు యుద్ధ క్రమానికి నాంది పలికే ఓ మైలురాయి సంఘటనగా వర్తమాన సామ్రాజ్యవాద యుగ చరిత్రలో నిలుస్తుంది. ఇదే  తాజా యుద్దానికి గల ప్రపంచ భౌగోళిక విశిష్టత!

తాజా యుద్దానికి కారణాలు ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో దొరకవు. ఈ యుద్ధమూలాలు ఉక్రెయిన్ లో ఉండవు. ఈ యుద్ధ ఫలితాలు గానీ, పర్యవసానాలు గానీ ఉక్రెయిన్ కి పరిమితం కావు. రష్యా-ఉక్రెయిన్ ల  మధ్య యుద్ధం ఒక చర్య మాత్రమే! కేవలం చర్య దగ్గర కాకుండా, దీనికి దారితీసిన పూర్వరంగ ప్రపంచ ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక స్థితిగతులలో ఈ యుద్దానికి మూలాలు, కారణాలు, కారకాలను  వెదికి విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉంది.

ఉక్రెయిన్ ని అమెరికా రెచ్చగొట్టింది. యుద్దానికి తానే కారకురాలైంది. దాని ఫలితంగా అది యుద్ధదాడికి గురైనది. ఐతే దాన్ని రక్షించలేక అమెరికా గుడ్లప్పగించి చూస్తోంది. ఇది అమెరికా ప్రస్తుత దుర్బలస్థితికి నిదర్శనం. ఇది రేపటి నుండి ప్రపంచ గమనంలో రానున్న కొత్త మార్పుల్ని సూచిస్తుంది. ఈ యుద్ధం వర్తమాన ప్రపంచ భౌతిక స్థితిలో పెనుమార్పులు రానున్న స్థితికి అద్దం పడుతోంది. బయటకు చూస్తే ఉక్రెయిన్ కీ రష్యాకీ మధ్య జరిగే యుద్ధమిది. ఆచరణలో ఇది అమెరికా రష్యా మధ్య యుద్ధమే! ఇది నిజానికి అమెరికాని  చావుదెబ్బ తీసిందని చెప్పొచ్చు. ఇంతవరకూ “ప్రపంచ పోలీసు” పాత్రని అమెరికా పోషిస్తోంది. ఆ “సుస్థిర” స్థానాన్ని తాజా ఉక్రెయిన్ పరిణామం అస్థిరపరిచింది. ఉక్రెయిన్  దగ్గర పొందిన ఓటమి వర్తమాన సామ్రాజ్యవాద ప్రపంచ గమనంలో అమెరికా స్థానభ్రంశానికి ఓ సూచిక! అంతమాత్రాన ఉక్రెయిన్ వద్దనే అది వ్యూహాత్మకంగా చేతులు ఎత్తేసే వైఖరి చేపట్టబోదు. 1945 నుండి చెల్లుబడి అయ్యే తన అగ్రరాజ్య స్థానాన్ని ఒక్క ఓటమితో వదులుకోదు. అది నేడు పొందిన ఓటమిని రేపటి విజయంగా మార్చుకునే దుస్సాహసిక పధకాల్ని వ్యూహరచన చేయొచ్చు.

పైన పేర్కొన్నట్లు ఇది సారాంశంలో అమెరికా, రష్యా ల మధ్య జరిగే యుద్ధమే! అది కూడా సర్వసమగ్ర నిజం కాదు. దీన్ని సమగ్ర సారంలో  చెప్పాలంటే, పెట్టుబడికీ పెట్టుబడికీ మధ్య సాగే యుద్ధమిది. ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసం సాగే యుద్ధమిది. అత్యంత భయంకరంగా కొనసాగే యుద్ధమిది. ఇది  ఉక్రెయిన్ తోనే ముగిసే యుద్ధం కాదు. వర్తమాన ప్రపంచ భౌగోళిక పటాన్ని మార్చే లక్ష్యంతో సాగే నిరంతర యుద్ధమిది. భూగోళంపై గొలుసుకట్టు యుద్దానికి దారితీసే క్రమమిది. ఈ దృష్ఠితో  తాజా యుద్ధ గమనాన్ని పరిశీలించాల్సి ఉంది.

ఇది యుద్ధ గమనం మీద రాస్తున్న వ్యాసం కాదు. యుద్ధ ఫలితాలపై రాసేది కూడా కాదు. పైకి కనిపించే యుద్ధ కారకుల గూర్చి రాసేది కాదు. ఇది తక్షణ యుద్ధ కారణాలు, కారకాలు, ఫలితాలపై వ్యాసం కాదు. దౌత్య, రాజకీయ పరంగా రాసేది కాదు. ఈ యుద్ధస్తితికి దారితీసిన పూర్వరంగ పరిస్థితి యొక్క స్థూల రేఖల్ని సంక్షిప్తంగా తెలిపే అతిచిన్న వ్యాసమిది. 

యుద్ధం ప్రారంభమైన ఆరవరోజు ఈ వ్యాసాన్ని రాస్తున్నా. ఒకరోజు క్రితం ఉక్రెయిన్ బేలారస్ దేశాల సరిహద్దులో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు విఫలమైనవి. రూపంలోనే అవి రెండు దేశాల మధ్య చర్చలు! సారంలో భౌగోళిక ఆర్ధిక, రాజకీయ యవనిక పై రెండు పెట్టుబడి శిబిరాల మధ్య చర్చలు మాత్రమే! అవి నేడు విఫలమైతే, రేపు సఫలమవ్వొచ్చు. విఫలమూ, సఫలమూ ఆయా పెట్టుబడి శిబిరాల మధ్య సహజమైనవే. భూగోళాన్ని మోసే డజన్ తలల నాగేంద్రుడు భుజం మార్చితే భూగోళం కదిలి పోతుందట! అదో పుక్కిటి పురాణ కల్పిత గాధ! కానీ  వాస్తవంగానే భూగోళం కదిలే చరిత్ర ఒకటుంది. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలు నాటి ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసం పెట్టుబడి శిబిరాల మధ్య పోటీ ప్రపంచ పటాల్ని మార్చేపనికి కారణమైనది. అది నేడు పునరావృతం అవుతోంది. అట్టి వ్యూహాత్మక భౌగోళిక మార్పుకి శ్రీకారం చుట్టేదే తాజా ఉక్రెయిన్ యుద్ధం!  

అమెరికా ఇటీవల చాలా దేశాల్లో చావుదెబ్బలు తింటోంది. ఓటముల్ని ఎదుర్కొంటోంది. ఐతే ఆర్ధిక, రాజకీయ, దౌత్య రంగాల్లో ఎదురౌతోన్న ఓటములవి. ఆఫ్ఘనిస్తాన్ ఓటమి అలాంటి కోవలోకి రాదు. అది సైనిక ఓటమి! మిగిలిన అన్ని రంగాల ఓటముల కంటే సైనిక రంగ ఓటమి నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. అది 1975 లో వియత్నాంలో పొందింది. ఆ తర్వాత యిదే! 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం సైతం అసాధారణమైనదే. ఐతే అది సైనిక ఓటమి కాదు. వియత్నాం తర్వాత 46 ఏళ్లకు ఆఫ్ఘనిస్తాన్ లో తిరిగి ఎదురైనది. అది ఇంటా బయటా ఎంతటి తీవ్ర సంక్షోభంలో చిక్కితే సైనిక ఉపసంహరణకి దిగిందో తేలిగ్గా అంచనా వేయొచ్చు. తన బలహీన స్థితి ఇతర రాజ్యాల కంటే అమెరికాకే ఎక్కువగా తెలుసు! తన అభద్రతా స్థితిని కప్పిపెట్టే లక్ష్యంతో దూకుడు విధానాన్ని అమెరికా చేపడుతోంది. దానికి ప్రత్యర్థి రాజ్యాల నుండి ఎదురైనదే తాజా ఉక్రెయిన్ సంఘటన!

ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ జరిగిన వెంటనే ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొత్తగా “ఆకస్” సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా పూనుకుంది. యూరోప్ అటక పై నిద్రిస్తోన్న పాత నాటో సైనిక కూటమిని నిద్ర లేపింది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విమోచనోద్యమ  రణక్షేత్రం నుండి చావు తప్పి కన్ను లొట్టపోయిన అమెరికా ఏకకాలంలో రెండు కొత్త యుద్ధక్షేత్రాల్ని ఎంపిక చేసుకుంది. అది ఓవైపు చైనాని; మరోవైపు రష్యాని ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లోకి, మార్కెట్లలోకి, భౌగోళిక ఆధిపత్య స్థానంలోకి రానివ్వకుండా వ్యూహ రచన చేసింది. ఐతే అది ఫలించలేదు. అభద్రతా స్థితి నుండి హడావుడిగా అమెరికా పన్నిన భౌగోళిక వ్యూహం ఉక్రెయిన్ వద్దనే బెడిసికొట్టింది. సహజంగా అది అమెరికాని సంకట స్థితిలో పడవేసింది. అది దాని నుండి బయటపడి తిరిగి ప్రపంచాధిపత్య స్థానాన్ని కొనసాగించాలి. అది అమెరికా తక్షణ కర్తవ్యం! ఫలితంగా ఓ భయంకరమైన పోటీకి ప్రపంచం వేదిక కానుంది. పెట్టుబడి శిబిరాల మధ్య భూగోళపు యవనిక మీద తెరలేవనున్న ఓ సుదీర్ఘ భయంకర యుద్దానికి ముందు ప్రమాద గంటని మోగించిందే ఉక్రెయిన్ సంఘటన!

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య వైరుధ్యాలు నేడు కొత్తగా తలెత్తినవి కాదు. లెనిన్ పేర్కొన్నట్లు సామ్రాజ్యవాద యుగంలో “శాంతి” కాలాలు; యుద్ధ కాలాలు ఉంటాయి. నేటి వరకూ “శాంతి” కాలం కొనసాగుతూ వచ్చింది. ఓ రక్తపాతంతో కూడిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత “శాంతి” కాలం ఏర్పడింది. ఆ యుద్ధం ద్వారా మార్కెట్ల పోటీ నుండి కొన్ని రాజ్యాల్ని తొలగించి, మిగిలిన రాజ్యాలు “శాంతి” ని స్థాపించాయి. లెనిన్ పేర్కొన్నట్లు “శాంతి” కాలం తాత్కాలికమే. అది ముగిసి తిరిగి పోటీ పెరిగి “ప్రచ్ఛన్న యుద్ధ శకం” ఉనికిలోకి వచ్చింది. అది కొనసాగుతూ వుండగానే ఓ రక్తరహిత యుద్ధంలో సోవియట్ యూనియన్ (USSR) కుప్పకూలింది. తిరిగి “శాంతి” కాలం ఉనికిలోకి వచ్చింది. అది కూడా తాత్కాలికమే.  తిరిగి ప్రపంచ మార్కెట్ల పునపంపిణీ ఆవశ్యకత ఏర్పడింది. ఆ పరిణామ క్రమం నేడు పరాకాష్ట దశకు చేడుతోంది. అది రక్తరహిత యుద్ద దశ నుండి రక్తపాత యుద్ధ దశలోకి కొత్తగా అడుగు పెడుతోంది. ఆ అడుగు మోపిన స్ధలమే ఉక్రెయిన్!

సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య ప్రత్యక్ష యుద్దాలు లేని కాలానికి కాలదోషం పట్టే స్థితి ఏర్పడింది. ఆ కాలంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా వంటి దేశాల దురాక్రమణలు సాగాయి. ఇంకా క్యూబా, వెనిజులా, ఉత్తర కొరియా వంటి పలు దేశాల్లో సైనిక జోక్యాలు లేదా కుట్రలు సాగాయి. ఆ కాలంలో కూడా ప్రపంచ ప్రజలకు “శాంతి” లేదు. పైగా అది  సాపేక్షికంగా అత్యధిక అశాంతి ఏర్పడ్డ కాలం! అది ప్రపంచ మార్కెట్ల కోసం పోటీపడే రాజ్యాల మధ్య “శాంతియుత పోటీ”  సాగిన కాలం! దీనర్థం ప్రపంచ ప్రజలు అదనపు అశాంతితో జీవించిన కాలమని అర్ధం చేసుకోవాలి. రెండు అగ్ర రాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ దశలో బాధిత దేశాల ప్రజలకు ఒకింత ఉపశమనం ఉండేది. ఆ తర్వాత ఏర్పడ్డ ఏకద్రువ ప్రపంచ వ్యవస్థ తెచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు పీడిత దేశాల ప్రజలకు అదనపు కష్టాల్ని తెచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా దేశాల్ని రక్తపాత యుద్దాలకి సైతం గురి చేశాయి. ఆఫ్ఘన్, ఇరాక్, లిబియా ప్రజల్ని నెత్తుటి మడుగుల్లో  ముంచిన అతిదారుణ హింసాత్మక అశాంతి కాలం సామ్రాజ్యవాద రాజ్యాలకు “శాంతి” కాలంగా మారింది. ఎందుకంటే, అవి ఇరాక్ లో పేలాలు ఎరుకునే పనిలో ఉన్నాయి. అగ్నికి ఆహుతయ్యే ఆఫ్ఘనిస్తాన్ చితి మంటల్లో బూడిదని పోగేసుకొని అమ్ముకునే వ్యాపారం సాగించాయి. నేడు ప్రపంచ మార్కెట్ల పునర్విభజనకై పరస్పరం పోటీపడుతున్న రాజ్యాల మధ్య సైతం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లపై యుద్ధక్రీడలో సమిష్టిగా పాల్గొన్నాయి. సామ్రాజ్యవాద యుగ వైరుధ్యాల్లో ఒకటైన సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య అంతర్గత వైరుధ్యం నాడు రక్తపాత రూపం ధరించలేదు. అది లెనిన్ నిర్వచనం ప్రకారం “శాంతి” కాలమే! ఇప్పుడు ఆ దశ ముగిసి, రక్తపాత దశలోకి కొత్తగా అడుగు పెడుతోంది. తొలి అడుగు పెట్టె చోటు ఉక్రెయిన్ కావచ్చు. కానీ ప్రయాణం అక్కడే ఆగేది కాదు.

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య అనివార్యమైన అంతర్గత పోటీ ఏదో ఒక నిర్దిష్ట దశలో “శాంతి” కాలానికి కాలదోషం పడుతుంది. ఈ మౌలిక అవగాహన కలిగిన రాజకీయ పండిత వర్గాలు సైతం ఏఏ సామ్రాజ్యవాద దేశాల మధ్య మున్ముందు యుద్ధరూపం దరిస్తుందో ఓ ఇరవైఏళ్ల క్రితం జోస్యం చెప్పలేక పోయాయి. అమెరికాకి యురోపియన్ యూనియన్ ప్రధాన పోటీదారుడిగా వస్తుందో, చైనా వస్తుందో, రష్యా వస్తుందో ఊహించలేక పోయాయి. లేదంటే గత రెండు ప్రపంచ యుద్దాల్లో వలె యురోపియన్ యూనియన్ నాయకత్వ స్థానంలోని జర్మనీయే  అమెరికాకి ప్రధాన పోటీ దారుగా వస్తుందా అనే ఊహాగానాలు ప్రపంచ రాజకీయ విశ్లేషకుల నుండి వినిపించాయి. రిక్, బ్రిక్, బ్రిక్స్ వాణిజ్య కూటాలు ఏర్పడే క్రమం, ఇంకా షాంఘై ఫైవ్ కూటమి ఏర్పడే క్రమం తొలి అంచనాల్ని క్రమంగా మార్చుతూ వచ్చింది. ముఖ్యంగా చైనా జీడీపీ అసాధారణ, అనూహ్య  పెరుగుదల క్రమాన్ని నిశితంగా పరిశీలించే అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భవిష్యత్తు లో అమెరికాకి చైనాయే ప్రధాన పోటీదారునిగా జోస్యం చెప్పసాగారు. కొద్ది మంది ప్రస్తుత యూరోప్ కేంద్రక ప్రపంచం, మున్ముందు ఆసియా కేంద్రక ప్రపంచం గా మారుతుందని కూడా జోస్యం చెప్పారు. నేడు అదే జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా నేడు యుద్ధం చేస్తే చేసి ఉండొచ్చు. కానీ   చైనా లేకుండా రష్యా చేయగలిగే యుద్ధం కానే కాదు.

బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా 4-2-2022 న జిన్పింగ్ పుతిన్ మధ్య ఒప్పందం కుదిరింది. అది షాంఘై ఫైవ్, బ్రిక్స్ కూటాలు చేసే వాణిజ్య ఒప్పందాల వంటిది కాదు. 5200 పదాలతో రాసుకున్న ఆ ఒప్పంద పత్రం ప్రపంచ బలాబలాల పొందికలో మార్పుల్ని కోరేదిగా ఉంది. వర్తమాన ప్రపంచ గమనంలో గుణాత్మక మార్పుల్ని కోరే లక్ష్యంతో చేసుకున్న ఒప్పందమది. ఎలాగూ ప్రపంచ మార్కెట్ల  పునపంపిణీ కోసం చైనా, రష్యా (ముఖ్యంగా చైనా) కొంత కాలంగా పోటీ పడుతున్నాయి. ఐతే అవి రక్తపాత యుద్దదశని ఇంకా ఎంచుకోలేదు. ఆ సానుకూల పరిస్థితికోసం ఎదురు చూస్తున్నాయి. ఇంతలో ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక ఓటమి వాటికొక వరమైనది. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న వాస్తవ బలహీనతని పరిగణన లోకి తీసుకొని, ఇదే సరైన సమయంగా ఎంచుకొని పై ఒప్పందం చేశాయి. ఉక్రెయిన్ యుద్దానికి ప్రతీకారంగా ఆర్ధిక, వాణిజ్య ఆంక్షల్ని విధిస్తే, దాని నుండి బయట పడే స్థాయిలో రష్యా నుండి గ్యాస్ కొనుగోలుకు చైనా ఒప్పందాన్ని చేసుకుంది. అందుకే ఉక్రెయిన్ పై యుద్ధం రష్యా చైనా లు ఉమ్మడిగా చేసేదిగా చూడాల్సి వుంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక ఓటమి ప్రపంచంలో ఓ కొత్త భౌతిక పరిస్థితిని సృష్టించింది. అది “శాంతి” కాలాన్ని ముగింపజేసింది.  మార్కెట్లు సులభంగా దొరికితే “శాంతి” కాలం కొనసాగుతుంది. అలా దొరక్కపోతే, వాటి కోసం సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య పోటీ పెరిగి యుద్ధ స్థితికి దారి తీస్తుంది. అది “శాంతి” కాలాన్ని భగ్నం చేస్తుంది. యుద్ధకాలానికి పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య పోటీ తీవ్రతరమై, యుద్ధస్తితి ఏర్పడుతోంది. దానికి తార్కాణమే తెరపై రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం!

గొలుసుకట్టు స్వభావం తో కూడిన ఒక సుదీర్ఘ యుద్ధక్రమమిది. ఇది సారాంశంలో ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసం సాగే ఒక నూతన యుద్ధక్రమం! ఈ కోణంలో తాజా యుద్ధ గమనాన్ని పరిశీలిద్దాం. ఇదొక సామ్రాజ్యవాద యుద్ధం! దీన్ని ప్రపంచ శ్రామికవర్గ విప్లవ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంది. అదేసమయంలో లెనిన్ చెప్పినట్లు సామ్రాజ్యవాద శిబిరాల మధ్య అంతర్గత వైరుధ్యాల్ని ప్రపంచ శ్రామికవర్గ ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది. ఈ దృష్ఠితో ముందుకు సాగుదాం.

-పి. ప్రసాద్ (ఇఫ్టూ)

Leave a Reply