విప్లవోద్యమం మనుషులను అద్భుతంగా తీర్చిదిద్దుతుందనడానికి లలితగారే ఉదాహరణ. సంప్రదాయ జీవితం నుంచి అజ్ఞాత ఉద్యమ జీవితానుభవం గడించేదాకా ఆమె ఎదిగారు. ఒక మామూలు గృహిణిగా జీవితాన్ని ఆరంభించి తన కుటుంబం ఉద్యమ కేంద్రంగా మారే క్రమానికి దోహదం చేశారు. ఆ కుటుంబం ఉద్యమకారుల, అమర వీరుల కుటుంబంగా ఎదిగే మార్గంలో లలితగారి అడుగుజాడలు ఉన్నాయి.
ఇదంతా ఆమె ఒక్కరే సాధించి ఉండరు. అసలు ఆమె గురించి విడిగా ఎవ్వరూ మాట్లాడలేరు. భుజంగరావుగారితో కలిపే చూస్తారు. ఇది పితృస్వామ్య కోణం కాదు. విప్లవోద్యమంలో, సాహిత్య రచనలో ఆ ఇద్దరి కలయిక అలాంటిది. నిజానికి లలితగారి ప్రస్తావన, ప్రమేయం లేకుండా భుజంగరావుగారికి ఉనికి ఉంటుందని అనుకోలేం. ఆయన అనువాదం చేసినా, సొంత రచన చేసినా లలితగారు కేవలం రాత పనే చేసిపెట్టి ఉంటారని అనుకోలేం. ఆమె ఆసరా లేకుండా భుజంగరావుగారు ఏ పనీ చేయలేకపోయేవారు. కేవలం ముదిమి పైబడ్డాకే కాదు. ఆయన జీవనయానాన్ని పట్టిచ్చే రచనలను చదివితే మొదటి నుంచీ భుజంగరావుగారు ఆమెపై ఆధారపడ్డ మనిషి అని అర్థమవుతుంది. అది రోజువారీ పనులకే పరిమితం కాకపోయి ఉండవచ్చు. ఆయన అనువాద, కాల్పనిక రచనలన్నిటిలో లలితగారి ఊహలు, అనుభవాలు, ఆలోచనలు భాగమై ఉంటాయి. ఇద్దరుగా కనిపించే జంట ఒక్కటిగానే అనేక పనులు చేసి ఉంటారు.
సొంత జీవితంలో అలాంటి జంటలు ఎన్నో ఉంటాయి. సాహిత్య జీవితంలో కూడా అలాంటి సహచరులు కనిపిస్తారు. అక్కడికే ఆగిపోయి ఉంటే లలితగారి గురించి సామాజికులకు అవసరం లేదు. ఎవరి సొంత జంజాటాలు వాళ్లవి, ఎవరి రాతలు కోతలు వాళ్లవి అనుకోవచ్చు. వాటి కోసం ప్రజాస్వామికంగా అన్ని సాదకబాదకాలు అనుభవించారని మాత్రమే అనగలం.
భుజంగరావు, లలితగార్ల సహచర్యంలో అలాంటివీ ఉండవచ్చేమోగాని, అవొక్కటే లేవు. ఇంకా చాలా ఉన్నాయి. అందులో లలితగారికి ప్రత్యేకమైన పాత్ర ఉన్నది.
ఆ ఇద్దరు కలిసి రాయడమే కాదు, కలిసి గొప్ప సాహసాలు చేశారు. బహుశా ఆమె సాయం, సమ్మతి, చైతన్యం, సంసిద్ధత లేకపోతే భుజంగరావుగారు ఏ పనీ చేయగలిగేవారు కాదనడానికి ఈ సాహసాలే సాక్ష్యం. ఓ పెద్ద సంసారాన్ని ఈది, అందరినీ గగ్డకు వేసి, ఉద్యోగ విరమణ తర్వాత, పెద్దగా బాగుండని ఆరోగ్యంతోనే ఆయన తన జీవన సహచరితో కలిసి అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు.
అట్లని అంతా తీరిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారనుకుంటే పొరబాటే. భుజంగరావుగారి జీవిత చరిత్ర అనదగిన గమనాగమనం, గమ్యం దిశగా గమనం చదివితే వాటిలో ఆమె జీవితం కూడా తెలుస్తుంది. కేవలం సొంత జీవితం కాదు. లలితగారితో, ఆమె ప్రమేయంతో సాగిన ఉద్యమ జీవితం కూడా. ఉమ్మడి పార్టీ కాలం నుంచి కమ్యూనిస్టు ఉద్యమంతో కొనసాగిన భుజంగరావుగారు నక్సల్బరీ తర్వాత ఆ మార్గానికి మళ్లారు. లలితగారితో సహా. కుటుంబంతో సహా. ఆ కాలమంతా రచయితగా, రాహుల్ సాహిత్య సదన్ నిర్వాకుడిగా లలితగారితో చేయగల పనులన్నీ చేశారు.
అప్పటికి విప్లవోద్యమ విస్తరణ క్రమంలో అనేక అవసరాలు ముందుకు వచ్చాయి. వాటిలో తాను తీర్చగల పనుల కోసం భుజంగరావుగారు ఆ వయసులో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నారు. అలా వెళ్లారని అయన రెఫరెన్స్లో అంటాం కానీ లలితగారి గురించి మాట్లాడదల్చుకుంటే ఆమె లేకుంటే భుజంగరావుగారు వెళ్లగలిగేవారా? అనుమానం కలుగుతుంది. నిజానికి అది తోడు మాత్రమేనా? అనేక రకాల పనులను గుర్తించినంతగా వాటిని అంచనా వేయడానికి తగిన పరికరాలు ఇంకా మనం తయరు చేసుకోలేదు. మనుషులు కొన్న పనులు చేసే క్రమంలో తమను తాము నిరంతరం మార్చుకొంటూ ఉంటారు. ఆ మర్పు ఏమిటో, దాని సారం ఏమిటో తెలుసుకున్నప్పడే ఆ మనుషులు చేసిన పనులను అంచనా వేయగలం. లలితగారిలాంటి మహిళలు వేలాది మంది అజ్ఞాత ఉద్యమాల్లో ఉంటారు. వాళ్లు ఎన్ని రకాలు పనులు చేసి ఉంటారో ఎన్నటికీ తెలియదు. బహుశా చివరికి ప్రాణ త్యాగాలు కూడా చేసి ఉంటారు.
దాదాపు పదేళ్లపాటు ఆ జంట అజ్ఙాత విప్లవోద్యమంలో తిరిగారు. ప్రభాత్ అనే హిందీ విప్లవోద్యమ పత్రికకు భుజంగరావు పని చేశారు. దానికి రచన చేశారు. అనేక అనువాదం చేశారు. ముఖ్యంగా తెలుగు కాల్పనిక రచనలను హిందీలోకి తర్జుమా చేశారు ఆ పనులన్నీ లలితగారి చేయి లేకుండా, శ్రమ లేకుండా, ఆలోచన లేకుండా ఆయన ఒక్కరే చేసి ఉంటారని మనం ఊహించలేం. అవేగాక ఇంకా అనేక సాంకేతిక పనులు నిర్వహించారు. ఆమె గడిపిన జీవితం, చేసిన పనులు భుజంగరావుగారు రాసిన నైనా నవల ద్వారా కొంత తెలుస్తాయి.
తీవ్ర అనారోగ్యంతో, వయో భారంతో ఇద్దరూ బైటికి వచ్చారు. మొదట ఆయన విప్లవ రచయితల సంఘంలో చేరారు. సాహిత్యబాటసారి శారద వెంట నడుచుకుంటూ ఆయన తెలుగు సాహిత్యంలోకి వచ్చి, అక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీ వెంట నడిచి, ఆ తర్వాత దండకారణ్యానికి వెళ్లి చరమాంకంలో విరసంలో చేరడం ఆయనకు ఏమోగాని విరసానికి గర్వకారణం కదా. ఆయనతోపాటు లలితగారు కూడా విరసం సభలకు వచ్చేవారు. ఆ తర్వాత ఆమె కూడా విరసంలో చేరారు.
భుజంగరావుగారిలాగా లలితగారు పెద్ద రచయిత్రి కాదు. చాలా కొంచెమే రాశారు. అందుకే ఆమె అనుమానంగానే అడిగారు.. *నేను విరసంలో చేరవచ్చా?* అని. విప్లవ సాహిత్యోద్యమానికి ఆమె ఎలా దూరం మనిషి అవుతారు?
ఆయన మరణానంతరం కూడా లలితగారు ఒంటరిగానే విరసం కార్యక్రమాలకు వచ్చేవారు. విప్లవాన్ని నమ్మకంగా, జీవన విలువగా, జీవితాచరణగా నమ్మే వాళ్లు ఎందరో ఉంటారు. బహుశా అంతకంటే వాళ్లకు *ఏమీ* తెలియకపోవచ్చు. అలా తెలియకపోవడం వాళ్లకు లోపం కాదు. అది వాళ్ల ప్రత్యేకత. వాళ్లు చేసిన పనుల్లో కూడా ఆ ప్రత్యేకత ఉంటుంది. అది చాలా విలువైనది. గౌరవనీయమైనది.
ఆలూరి లలిత అలాంటి గౌరవనీయ కామ్రేడ్.
నేను దండకారణ్యానికి వెళ్లినప్పడు అక్కడ జరిగిన క్రాంతికారీ జనతన సర్కార్ సభా ప్రాంగణానికి గంటి ప్రసాదం, నతాషా అనే ఆదివాసీ అమర కళాకారుడి పేర్లతోపాటు ఆలూరి భుజంగరావుగారి పేరు కూడా పెట్టడం గమనించాను. ఆ సంగతి జనతన రాజ్యంలో రాశాను కూడా. భుజంగరావుగారికి దక్కిన ఆ అరుదైన గౌరవం ఆయన ఒక్కడిదేనా? అని ఇప్పడు అనిపిస్తోంది. అది లలితగారిదీ కదా!
అందుకే ఆమెది సార్థక జీవితం.