కాళీపట్నం రామారావుగారు పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. తాను రాయగలిగిన కథలే రాశారు. ఎంచుకున్న పనులనే చేశారు. మాష్టారు జీవించి ఉండగానే ఆయన కథల మీద చాలా చర్చ జరిగింది. తాను వెళ్లిపోయి మరోసారి ఇప్పుడు ఆ కథల గురించి మాట్లాడుకొనే అవకాశం ఇచ్చారు.
కారా కథల్ని తెలుగు సమాజ, సాహిత్య వికాసానికి అతీతంగా చూడ్డానికి వీల్లేదు. ఎక్కువ చేయడానికైనా, తక్కువ చేయడానికైనా. మరణ సందర్భంలో అతి ప్రశంసల ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. నిజానికి కాళీపట్నం రామారావుగారి నుంచి కూడా కారా కథల్ని వేరు చేసి తెలుగు సాహిత్య, మేధో రంగాల అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి. ఇది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రయత్నించాలి. ఆ అవసరం ఉంది.
దేనికంటే అది మన సమాజం నడిచి వచ్చిన దారి. దాని మీద అంతా చీకటే పరుచుకున్నదనే వాళ్లు ఉండొచ్చు. వెలుగు నీడల సమ్మేళనాన్ని ఎత్తి చూపే వాళ్లు ఉండవచ్చు. ఎగుడుదిగుళ్లను వివరించేవాళ్లు ఉండవచ్చు. కాబట్టి అందులో భాగమైన కారా కథల్నీ విమర్శనాత్మకంగానే చూడాలి.
పైగా కారా పసి రచయిత ఏం కాదు. ఒక శతాబ్దపు ఆటుపోట్ల ఆనుభవశాలి. అలాగే కారా కథలుగా మనం గుర్తించేవి ఇవ్వాల్టివి కాదు. ఒకటి రెండు కథలు మినహా దాదాపు యాభై ఏళ్ల కిందటివి. చాలా చరిత్ర గడిచిపోయింది. అనేక మార్పులు జరిగిపోయాయి. ఒక కొత్త ప్రపంచంలో భాగంగా తెలుగు సాహిత్య రంగం కూడా పునర్నిర్మాణమవుతున్నది. అన్ని శిబిరాల మేధో రీతులు మారిపోయాయి.
ఇంత ప్రత్యేక పరిస్థితిలో కారా కథల్ని సరి కొత్తగానే చూడాలి. అలా చూడ్డానికి ఎవరు ఏ వైపు నుంచి ఎలాంటి ప్రశ్నలు సంధించినా స్వాగతించాలి. వీటన్నిటినీ తట్టుకొనే శక్తి ఉన్నదో లేదో కారా కథలు నిరూపించుకోవాలి. అభిరుచి ప్రాధాన్యంగా కొందరు మోయడం వల్ల తెలుగులో కొన్ని రచనలకు గుర్తింపు వచ్చి ఉండవచ్చు. లోపల సరుకు లేకుండా ఎవరేం చేసినా ఏదీ సాహిత్యంగా మనుగడ సాధించలేదు. మనుషులను ముట్టుకొనే స్వభావం లేనిది, నిరంతరం జ్వలింపచేయలేనిది సాహిత్యమే కాలేదు. అలాంటి శక్తి ఉన్నదాన్ని ఎవ్వరూ తొక్కిపట్టలేరని కూడా ఎన్నోసార్లు రుజువైంది. ఇంత కాలం వ్యక్తం కాని సామాజిక జీవిత మూలాల నుంచి సాహిత్యం వస్తున్నది. అద్భుతమైన సాహిత్యాన్ని రద్దు చేయాలని భావించే వాళ్లూ ఉన్నారు.
సాహిత్యంలో నిజంగానే ఇది ఒక పెద్ద విపత్తు. పాత రోజుల్లోలాగా ఇప్పుడు జరగడానికి వీల్లేదు. కానీ ఇటీవల మళ్లీ ఇది మొదలైంది. దీనికి మన సమాజంలోని కులం ఒక ముఖ్యకారణం. దీనివల్ల సాహిత్య చరిత్రలో ఎగుడు దిగుళ్లు, చీకటి వెలుగులు సమస్యాత్మకంగా మారాయి. ముఖ్యంగా చరిత్రలో కింది కులాల రచయితలకు దక్కవలసిన గుర్తింపు దక్కలేదు. ఆ పని సమగ్రంగా జరిగే వరకు ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి.
దీనికి రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి: ఇంత కాలం అట్టడుగున పడిపోయిన దళిత బహుజన సాహిత్యకారులను, మేధావులను వెలికితీయడం, ఇప్పటికే తెలిసిన వాళ్ల సాహిత్యాన్ని మరింత సమగ్రంగా అంచనా వేయడం. రెండు: ఆధునిక ప్రగతిశీల సాహిత్యాన్నంతా మళ్లీ విలువ కట్టి ఒక్కో రచయిత, లేదా రచన ప్రాసంగికత ఏమిటో తేల్చుకోవడం. మొత్తంగానే ప్రగతిశీల సాహిత్య చట్రంలోని అర్థాలన్నిటినీ వెలికి తీసి పునర్నిర్మించడం.
తెలుగు సాహిత్య రంగంలో ఈ పనులు జరగవలసి ఉన్నది. దీనికి అనేక వైపుల నుంచి తీవ్రమైన ప్రశ్నలు సంధించాలి. ప్రశ్నించడమే మా పని అని ఊరుకోడానికి లేదు. నిర్మాణాత్మక సమాధానాలు రాబట్టాలి. రాజకీయ ప్రజా పోరాటాల్లో, భౌతిక ఆచరణలో నిలబడకుండా ఎవ్వరూ ఈ పని చేయలేరు. అక్కడి నుంచి మాత్రమే పైన చెప్పిన రెండు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆక్రోశాల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. గాలిలో మల్ల యుద్ధాల వల్ల తేలేదేమీ ఉండదు.
మొత్తం మీద నిలకడగా నేల మీద నిలబడి మన వర్తమాన సాంస్కృతిక, మేధో ప్రమాణాలకు నిలబడే సత్తా ఉన్న రచనలేమిటో, లేని రచనలేమిటో తేల్చుకోవడమే అందరి కర్తవ్యం కావాలి. ఇప్పటి దాకా నిలబడ్డవన్నీ అలాంటివే. దాచేస్తే దాగకుండా బైటికి వచ్చినవీ అలాంటివే.
ఆ రచనలకు ప్రస్తుత సమాజ అవసరం ఉండటమే దీనికి కారణం.
0 0 0
కారా కథలను బ్రాహ్మణ కథలనీ, వాటిలో ప్రాసంగితక లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కారా మాస్టారు ఒక దశ తర్వాత వ్యక్తిగత జీవితంలో సంప్రదాయకంగా జీవించారు. ఇది ఆయన పరిమితి, వైరుధ్యం. వాటిని ఎవ్వరూ అంగీకరించలేరు. కాబట్టి వ్యక్తిగా ఆయనపై ఈ విమర్శ ఉండాల్సిందే.
ఈ విమర్శతో సహా ఆయన కథా వాచకాల్లోకి వెళ్లి అవి బ్రాహ్మణ కథలని, అందువల్లనే ప్రాసంగికత లేదని నిరూపించాలి. దానికి సాహిత్య విమర్శ స్థాయిలో కృషి చేయాలి. ఈ పని చేయకుండా ఆరోపించి వదిలేసేవాళ్లూ ఉంటారు. ఇంత వరకే మా పని అని వాళ్లు అనుకోవచ్చు.
అప్పుడు కాళీపట్నం రామారావుగారి కథల్ని సామాజిక సాంస్కృతిక రాజకీయార్థిక ప్రాతిపదికల మీద పరిశీలించగల వాళ్లు ఆ ఆరోపణలను పరిశీలించాలి. గతంలో మాష్టారు కథల మీద విశ్లేషించిన వాళ్లకు ఇవి ఎదురు కాలేదు. ఆయన కథల్లో బ్రాహ్మణవాదం ఎక్కడెక్కడ ఉన్నదో ఇప్పుడు వెలికి తీయాలి. ఇవి ఈ కాలం వేస్తున్న ప్రశ్నలు. ఈ తరం నుంచి ఎదురవుతున్నాయి. ఇంత సీరియస్ ప్రశ్నలకు నిలబడగల శక్తి ఆయన కథలకు ఉన్నదో లేదో తేల్చాలి.
బలమైన ప్రశ్నలు అనేవి వేసిన వారి బలాన్నే తెలియజేయవు. ఎదుర్కొన్నవారి బలాన్ని కూడా సూచిస్తాయి. అదే లేకపోతే ప్రాసంగికత అనే మాట వచ్చేదే కాదు. ఈజీగా అవతలకి తోసేసే వాళ్లు. ఆ పని చేయలేకపోయారు. సుమారు ఆరవై డెబ్పై ఏళ్ల కిందటి కథలకు సామాజిక అస్తిత్వ స్పృహ విస్తరించిన ఈ మారిన వర్తమానంలో ప్రాసంగికత ఏమిటి? అనేది ఈ ప్రశ్న సారాంశం. నిజంగానే భావజాల, సాంస్కృతిక రంగాల్లో అవసరమైన చర్చను ఇది ప్రేరేపిస్తుంది.
ఏ రచన ప్రాసంగికత అయినా ఒకసారితో తేలిపోయేది కాదు. తేల్చగలిగేది కాదు. పదే పదే ఆ పని చేయాల్సిందే. సమాజం సంపూర్ణ ప్రజాస్వామికీకరించబడే వరకు ఇది జరగాల్సిందే. ప్రాసంగికత అంటేనే మారిన ప్రతి సామాజిక సందర్భంలో అంచనా వేయడం. ఇది నిరంతరాయ క్రమం. ఈ పని సాహిత్య రంగంలోకి వస్తున్న ప్రతి కొత్త ఆలోచనా రీతి నుంచి జరగాలి. ప్రతి పీడిత సమూహం ఆ రచనను మదింపు వేయాలి. ఆ కోణంలో పరిమితులు ఉంటే చెప్పాలి. ఏ ఒక్క కోణంలోనో ప్రాసంగికత ఉన్నదనీ, లేదనీ వాదించడం కూడా అయ్యేపని కాదు.
0 0 0
కారా కథల్లో స్థూలంగా రెండు దశలు ఉన్నాయి. యజ్ఞానికి ముందు, యజ్ఞం తర్వాత. తొలి దశ కథలు సుమారుగా మధ్య తరగతి జీవితం చుట్టూ తిరిగాయి. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టారు కాబట్టి సహజంగానే తనకు తెలిసిన కులం పాత్రలతో, వాతావరణంతో కొన్ని కథలు రాశారు. ఇంకొన్ని కథలు అంత నిర్దిష్టంగా లేకపోవచ్చు. అయితే అగ్రకులాల మధ్య తరగతే ప్రధానం. అందువల్ల కూడా ఆ కథల్ని బ్రాహ్మణ కథలనే అభిప్రాయానికి రావచ్చు. ఇదొక దగ్గరి దారి.
కానీ సాహిత్యాన్ని ఇంత సులభంగా చూసి నిర్ధారించడం కుదరదు. సాహిత్య స్వభావానికే ఇది పొసగదు. ఆయన తన కథల్లో జీవితానుభవ చిత్రణ ద్వారా ఏ విలువలు ప్రతిపాదించారు? అవి సనాతన విలువలా? ప్రగతిదాయక విలువలా? కనీసం ఆనాటి పరిమితుల మేరకైనా .. అనే చర్చ చేయాలి.
అసలు ఒక కాల్పనిక రచన ప్రతిపాదిస్తున్న విలువ ఏమిటి? ఒక సామాజిక సమస్యలోంచి ఎంపిక చేసుకున్న సాహిత్య ఇతివృత్తం ఏమిటి? అది ప్రతిపాదిస్తున్న విలువ ఏమిటి? అనేది సాహిత్య విమర్శలో కీలకం. సాహిత్యాన్ని అనేక చారిత్రక, సామాజిక విషయాలు ప్రభావితం చేయవచ్చు. అవన్నీ మనం గుర్తించి వెలికి తీసేవి. కానీ నేరుగా మానవ అనుభవం, ఉద్వేగం, భావజాలం, సంస్కృతి, విలువలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటి ద్వారానే కళా సాహిత్యాలు కొన్ని ప్రతిపాదనలు చేస్తాయి. పాఠకులు తక్షణంగా కనెక్ట్ అయ్యేది అక్కడే. అవి సృజనాత్మక సాహిత్యంలో తప్ప ఇంకెక్కడా ఆ రూపంలో దొరకవు. సాహిత్యం చదివేది వాటిని తెలుసుకోడానికే. పఠన అనుభవం నుంచి జీవితానుభవంలోకి ఆ విలువలను అన్వయించుకోడానికే. తద్వారా పాఠకుల స్పందనల్లో సున్నితత్వం పెరుగుతుంది. వాళ్ల సాంస్కృతిక స్థాయి అభివృద్ధి చెందుతుంది.
ఈ వైపు నుంచి కారా తొలి కథలను కూడా చూడవచ్చు. వాటిలో ఆయన తనకు తెలిసిన కుల, వర్గ జీవితాన్నే చిత్రించినా ప్రతిపాదించిన విలువలకు నిర్దిష్ట, సార్వజనీన లక్షణాలు ఉన్నాయి. ఆ విలువలు ప్రగతిశీలమైనవి. మన సామాజిక వికాసాన్ని ముందుకు తీసుకపోవడానికి దోహదపడేవి. దేనికంటే అవి వైరుధ్యాలను చిత్రించినవి. ఆ విలువలు ఏమేరకు తమకు ఉపయోగపడతాయని పీడిత సామాజిక శ్రేణులు భావిస్తే ఆమేరకు ఆ కోణంలో కూడా అవి ప్రగతిదాయక కథలు అవుతాయి. ఆ విలువలు తమకేమీ ఉపయోగపడవని పీడిత అస్తిత్వ సమూహాలు భావిస్తే వాటిని పక్కన పెట్టేయవచ్చు. కాబట్టి కారా ఆ రోజుల్లో రాసిన కథల్లో ఉన్న ఉన్న విలువల మీద చర్చ జరగాలి. అందులోని బ్రాహ్మణ జీవితాన్ని, వాతావరణాన్ని తిరస్కరించినట్లే ఆ విలువలను కూడా తిరస్కరించాలా? లేక తేడా ఏమైనా చూడాలా? అనేది తేల్చుకోవడం అంత కష్టమేమీ కాదు.
ఉదాహరణకు భార్యాభర్తల సంబంధాలు సమానత్వం అనే విలువ మీద ఆధారపడి ఉండాలని ఆయన తన తొలినాళ్ల కథల్లో కూడా ప్రతిపాదించారు. అయితే అప్పటి ఆయన పరిమితుల వల్ల అతి కొద్ది జనాభా ఉన్న, సామాజికంగా ఆధిపత్య స్థానంలో ఉన్న ఒక కులం వైపు నుంచి కథలు రాశారు. ఆ కులం నుంచే, అందులోని మధ్యతరగతి పాత్రలనే తీసుకున్నారు. ఆ వైపు నుంచే కొన్ని విలువలు ప్రతిపాదించారు.
ఆ విలువ ఏ రకంగానూ కింది కులాల కుటుంబ సంబంధాలకు పనికి రాదని ఇప్పుడు దళిత బహుజన పాఠకులు, విమర్శకులు అనుకోవచ్చు. అసలు కింది కులాల భార్యాభర్తల్లో అసమానతలే ఉండవు.. కాబట్టి ఈ ఈ సమానతా విలువ అవసరం మాకేముందని తిరస్కరించవచ్చు. లేదా అంటరాని కులాల్లో స్త్రీపురుషుల మధ్య అసమానత ఉన్నప్పటికీ కారా కథలు ప్రతిపాదిస్తున్న విలువల కోణంలో ఉండదు.. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన కథల అవసరం లేదు అనవచ్చు. ఇంకా ముందుకు వెళ్లి అసలు ఆ విలువలు ఏ రకంగానూ ప్రగతిశీలం కాదని కూడా ప్రకటించవచ్చు.
పై కులం నేపథ్యంలో ప్రతిపాదించిన విలువల విషయంలో కింది కులాల వాళ్లు ఇన్ని రకాలుగా స్పందించడానికి వీలుంది.
అయితే అప్పుడు విలువ అంటే ఏమిటి? అనే అతి ముఖ్యమైన విషయం తేల్చుకోవాలి. ఒక్కో కులంలో స్త్రీపురుష సంబంధాల సమానత్వానికి ఒక్కో విలువ ఉంటుంది… ఏ రెండు కులాలకూ ఒకే విలువ ఉండదు.. అని ఏ కులానికి ఉండగల విలువలేమిటో, వాటి ప్రాతిపదికలేమిటో తేల్చాలి. అంతకంటే ముఖ్యంగా విలువ అనేదాన్నే పునర్నిర్వచించాల్సి వస్తుంది. విలువ అనేదానికి సాధారణ లక్షణం ఏమీ ఉండదని అంగీకరించాల్సి వస్తుంది.
కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టినందు వల్ల కారా కథలను బ్రాహ్మణ కథలని అని సరిపెట్టకుండా ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది.
విలువల దృష్ట్యా అంచనా వేయాల్సిన సాహిత్య సందర్భంలో దళిత కులాల నుంచి ఇలాంటి చర్చ ఎందుకు వస్తున్నదో తెలుసుకోవాలి. మన సమాజంలో అసంఖ్యాక పీడిత కులాల జీవిత చిత్రణ వైపు నుంచి విలువల ప్రతిపాదన జరిగి ఉండాల్సింది. అది జరగలేదు. ప్రధానంగా పై కులాల జీవితం వైపు నుంచే సాహిత్యం వచ్చింది. ఇలా రావడం ఏమిటి? అక్కడే విలువల చర్చ జరగడం ఏమిటి? అనే ప్రశ్నలు ఇందులో ఉన్నాయి.
దీనికి మన సామాజిక వ్యవస్థలో మూలాలు ఉన్నాయి. పితృస్వామ్యం, కులం, మతం వల్ల ఈ స్థితి ఏర్పడిరది. దీన్ని ఆధునిక యుగానికి ముందు నుంచే ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రజాస్వామిక చైతన్య విస్తరించేకొద్దీ దళిత బహుజన జీవిత చిత్రణ అన్ని వైపుల నుంచీ పెరిగింది. పీడిత సముదాయాల నుంచి వచ్చిన సాహిత్యకారులను అంచనా వేయడం మొదలైంది. సమాజ ప్రజాస్వామికీకరణకు ఆ రచనల అత్యవసరాన్ని అన్ని వైపుల నుంచి విశ్లేషిస్తున్నారు. అయితే ఈ పని పూర్తి కాలేదు. ఈ పనిలో భాగంగానే ఆధునిక ప్రగతిశీల శిబిరం నుంచి వచ్చిన ప్రతి రచనను పదే పదే అంచనా వేయాలి.
ఆ సాహిత్యానికి ప్రాసంగికత ఉన్నదీ లేనిదీ తేల్చుకోడానికి అందులోని విలువల పునర్మూల్యాంకనానికి మించిన దగ్గరి దారి లేదు. కాబట్టి ఎవరైనా కారా కథలకు ప్రాసంగికత లేదని తేల్చాలనుకుంటే అందులోని విలువలను చర్చించి తిరస్కరించాల్సిందే. ప్రాసంగికత చర్చలో ఇదొక ముఖ్యమైన కోణం.
0 0 0
కారా రెండో దశ కథలు చాలా భిన్నమైనవి. ఇవన్నీ యజ్ఞం నుంచి భిన్న ఇతివృత్తాలుగా, భిన్న ఫోకస్ పాయింట్లతో ఫ్లో అయ్యాయి. సూక్ష్మంగా చూస్తే యజ్ఞానికి, ఆ తర్వాతి కథలకు నెరేషన్‌లో పోలికే ఉండదు. ఒక్కో కథ ఒక్కో నెరేషన్‌లో ఉంటాయి. కానీ యజ్ఞంతో సహా అన్నీ ఒక పెద్ద కథన చట్రంలో భాగం. ఆధునికానంత వాదుల భాషలో చెప్పాలంటే ఒక ‘మహా కథనం’ అన్నమాట. అలాంటిది ఆయనకు యజ్ఞంతో సెట్ అయింది. ఆయన పిట్ట కథనాల మీద ఆధాపడే రచయిత కాదు. తెలుగు కథా చరిత్రలో కారా ప్రత్యేకత ఏమంటే, ఆయన వలసానంతర భారత దేశ రాజకీయార్థిక పరిణామాల్లోని వైరుధ్యాలను గుర్తించారు. నిజానికి దీని కోసం ఆయన వలసయుగంలో మూలాలు వెతికారు. అవి అధికార మార్పిడి తర్వాత మారకపోగా మరింత జటిలంగా తయారయ్యాయని గుర్తించారు. ‘స్వతంత్య్ర’ భారతదేశం సాధించిన ‘అభివృద్ధి’ ఫలాల స్వభావం ఏమిటి? అ ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు ఆ అభివృద్ధిలోని విధ్వంసానికి నలిగి రక్తమోడుతున్నారు? చివరికి తమ అస్తిత్వాన్నే ఎలా కోల్పోతున్నారు? శ్రమజీవులు తిరిగి కంబారీలుగా మారిపోతున్న ఈ ఆధునిక అభివృద్ధి క్రమంలోని మర్మం ఏమిటి? .. ఇదీ ఆయన అన్వేషణ.
కారా మాస్టారు విజన్ ఇంత విస్తారమైనది. లోతైనది. ఈ వైరుధ్యాల స్వభావం తెలుసుకోవడంతో ఆయన రెండో దశ ఆరంభమైంది. దాని విశ్వరూపమే యజ్ఞం. ఆనాటి కథకుల్లో ఇంత విస్తారమైన కాన్వాస్‌ను ఊహించిన వారిలో ఆయన మొదటివారు.
ఆ తర్వాత వచ్చిన నక్సల్బరీ పంథా ఈ దేశంలో సమస్యాత్మకం చేసిన మౌలిక వైరుధ్యాలను దాని పూర్వరంగంలోనే కారా గుర్తించారు. అయితే వ్యక్తిగా ఆయనకు ఆ వైరుధ్యాల పరిష్కారం అప్పటికి తెలిసే అవకాశమే లేదు. అందుకే ఆ కథను అట్లా ముగించాల్సి వచ్చింది. ఆ ముగింపు ఆయన పరిమితి కాదు. ఆ కాలానిది. దాన్ని నక్సల్బరీ బద్దలు కొట్టుకొని వచ్చింది.
అందుకే ఆయన రెండో దశ కథలన్నీ ఈ మార్గంలో వచ్చాయి. నిజానికి యజ్ఞంతో సహా తర్వాతి కథల్లో ఆయన ఆ వైరుధ్యాలను మానవ జీవితంలోంచి అర్థం చేసుకోడానికి దోహదపడే భావనల మీద నిర్మాణమయ్యాయి. అవి ఆ కేవలం ఒకానొక కాలానికి చెందినవి కావు. ఆ వైరుధ్యాల స్వభావం మీద ఆధారపడినందు వల్ల వాటికి చాలా విస్తృతి ఉన్నది.
ఉదాహరణకు యజ్ఞం కథలో శ్రీరాముడినాయుడి అభివృద్ధి మీద మాస్టారు విమర్శ కేవలం రాజకీయార్థిక కోణంలోనే కాదు. అక్కడికే పరిమితం చేయలేం. మరోసారి నిశితంగా యజ్ఞం టెక్ట్స్‌ను చదివితే ఆ విమర్శకు సామాజిక, సాంస్కృతిక కోణాలు కనిపిస్తాయి. అప్పల్రాముడు ఈ అభివృద్ధిని కేవలం వర్గ పునాది మీదే చూడలేదు. పదే పదే సుందరపాలెంలోని ఊరుకు`మాల వాడకు మధ్య వైరుధ్యాన్ని తర్కిస్తాడు. అగ్రకులాలకు, మిగతా బడుగు కులాలకు, ముఖ్యంగా మాల కులానికి మధ్య వైరుధ్యాన్ని చర్చనీయాంశం చేస్తాడు. రెండు తరాల మధ్య ఉన్న ఇంకో ముఖ్యమైన వైరుధ్యాన్ని కూడా అప్పల్రాముడు తీవ్రస్థాయిలో ప్రకటించాడు. ఆనాటికి ఇంకా పాత గ్రామ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో పెద్ద తరానికి కట్టుబడి ఉండక తప్పని ఒక స్థితిని చెబుతూనే, ఆ తర్వాతి తరం దాన్ని ప్రశ్నించడాన్ని చాలా సూక్ష్మస్థాయిలో చిత్రికపట్టారు.
‘నేను నీ కొడుకును కాబట్టి నీమాట విన్నట్లే, నా కొడుకు నా మాట వింటాడు..’ అనే అర్థంలో సీతారాముడు అంటాడు. కానీ పైకి ‘విన్నట్లు’గానే కనిపించినా ఎంత తీవ్ర ధిక్కారాన్ని ప్రకటించాడో ముగింపులో చూస్తాం. ఆ రకంగా తరాల మధ్య వైరుధ్యాన్ని కూడా మాస్టారు చిత్రించారు. సమాజంలోని అనేకానేక వైరుధ్యాలను గుర్తించగల శక్తి వర్గ దృక్పథానికి ఉంటుంది.
వర్గ దృక్పథం పాక్షికమని అనుకొనే వాళ్లు ఒకసారి అప్పల్రాముడి విశ్లేషణను గమనించాలి. ఆయన సుందరపాలెంలోని పరిణామాలనే కాదు. తన స్వీయానుభవాన్నీ, అస్తిత్వాన్ని లోతుగా తిరిగి చూసుకున్నాడు. వర్గ దృక్పథం ఎన్నిటిని పట్టుకుంటుందో అప్పల్రాముడి వాదనా శైలిలో గమనించవచ్చు.
అయితే అప్పల్రాముడు సుందరపాలెం సాధించిన అభివృద్ధి ఫలాల్లోని ఆర్థిక కోణంలాగే సామాజిక కోణాన్ని ప్రత్యేకంగా చర్చనీయాంశం చేయలేదు. ‘బాబయ్యా.. ఇంతకాలం గడిచినా, ఇన్ని మార్పులు జరిగినా మేం మిమ్మల్ని బాబయ్యా అనే అంటున్నాం. మీరు ఒరే రాముడూ అనే అంటున్నారు. మీరు న్యాయమంటపం మీద కూచున్నారు. నేను ఈ ఊరి పంచాయతీలో హరిజన మెంబర్‌నే అయినా కిందే కూచున్నాను..’ అనే ప్రశ్న వేయలేకపోయాడు.
ఇది ఆ కాలానికి అప్పల్రాముడి పరిమితి. లేదా మాస్టారు పరిమితి. అయితే ఈ స్థితి మీద ఎరుక ఆ ఇద్దరికీ ఉంది. అప్పల్రాముడు విమర్శలో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. అయితే పై ప్రశ్న వాచ్యంగా లేదు. మీరు, మేము అనే వాదన అప్పల్రాముడు ఎంతో జంటిల్‌గా, నిశితంగా నడిపాడు. ఈ వాదనలో కేవలం గోపన్న కుటుంబం, తన కుటుంబమే లేదు. ఆర్థిక ఫలాలతో బాగుపడ్డవాళ్లు, ధ్వంసమైపోయిన వాళ్లే లేరు. ‘మీరూ, మేము’లో ఊరిలోని అగ్రకులాలు, పేటలోని మాల కులస్థులు ఉన్నారు. ఇది చాలా బలమైన సామాజిక కోణం.
అలాగే చావు, నో రూం కథల్లో కూడా బలమైన కుల దృక్పథం కనిపిస్తుంది. చావులో దళితురాలి శవాన్ని కాల్చడానికి కట్టెలు ఉండవు. నోరూంలో డబ్బు ఇచ్చినా గది దొరకదు. ఈ రెండు చోట్ల ఆర్థిక కోణమే లేదు. చావు కథలో అయితే మాలపేటను, గుడిసెను వర్ణించిన తీరులో శక్తివంతమైన కుల దృక్పథం ఉంది.
ఇప్పుడు చూస్తే ఇందులో పరిమితులు కనిపించవచ్చు. ఆ కథలు యాభై ఏళ్ల కిందటివని మర్చిపోకుండా చదవాలి. నిజానికి ఆయన కథల్లోని బలంతో సహా ఈ పరిమితి కూడా ఆనాటి తెలుగు ప్రగతిశీల, వామపక్ష, విప్లవ చరిత్ర క్రమంలో భాగం. ఆనాటికి దళితుల విషయంలో కులానికి, వర్గానికి మధ్య ఇప్పటికంటే చాలా సన్నిహిత సంబంధం ఉండిరది. దాదాపుగా విభజనే లేదనవచ్చు. అందువల్ల ప్రజల పక్షాన నిలబడ్డమంటే దళితుల పక్షాన నిలబడ్డమే. వేరే ప్రశ్నే లేదు. అందు వల్లనే ఆ ప్రజలు కారా రెండో దశ కథల్లో చాలా చోట్ల దళితులుగా కనిపిస్తారు. పేదరికం, దోపిడీ, అంటరానితనం కలగలసిన విషయంగా కారా చిత్రించారు.
ఆ రోజుల్లో వామపక్ష శిబిరానికి బైట కులాన్ని ప్రత్యేకంగా చూసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల వారసులకు ఇప్పుడు ఉన్నంత అవగాహన ఆ రోజుల్లో వాళ్లకు ఉండకపోవచ్చు. ఇది చాలా సహజం. అలాగే కులం మీద రామారావు మాస్టారుకు ఆ రోజుల్లో ఉన్న అవగాహనతో పోల్చితే ఆ వెనువెంటనే విప్లవోద్యమం చాలా విస్తృతి సాధించింది. దేనికంటే వాస్తవ జీవితంలో దేని నిర్ణాయకత ఏమిటో ఆచరణ నుంచి కూడా అవగాహన కలుగుతుంది. కులానికి మిగతా వాటితో ఎలా సంబంధం ఉంటుందనేది కేవలం సిద్ధాంత సమస్య కాదు. మార్క్సిజం వర్గాల వైపు నుంచి మానవ జాతి చరిత్రను చూస్తుంది. అదే దాని ప్రత్యేకత. అయితే అదే సామాజిక చరిత్రలో భాగమైన ప్రతి దాన్నీ విశ్లేషించగలుగుతుంది. అట్లా గ్రామ జీవితంలోని కులాన్ని మాస్టారు తన సునిశిత పరిశీలన ద్వారా, తార్కిక భావనల ద్వారా, చలనాన్ని, ఘర్షణను గుర్తించగల కాల్పనిక శక్తి ద్వారా వీలైనంతగా కథల్లోకి తీసుకొచ్చారు.
0 0 0
మాస్టారు కథన వ్యూహంలాగే ఆయన కథలు ప్రకటించిన విలువలు కూడా సమగ్రమైనవి. ఆ రకంగా తొలి దశ కథల్లో ప్రతిపాదించిన విలువలకు, యజ్ఞంతో సహా ఆ తర్వాతి కథల్లో ప్రతిపాదించిన విలువలకు తేడా ఉన్నది. అట్లని తొలి దశ కథల్లోని విలువలను ఆ తర్వాతి కథల్లోనివి నెగేట్ చేయవు. మారుతున్న సామాజిక పరిస్థితులను విస్తృత చారిత్రక దృష్టితో అర్థం చేసుకొని వాటి ప్రగతిదాయక క్రమాలు ఎలా ఉండగలవో కాల్పనికంగా ఊహించి విలువలను ప్రతిపాదించే దశకు మాస్టారు చేరుకున్నారు. ఈ పరిణతి సాధించాలంటేల వర్తమాన సంక్షోభాల మీద గురి ఉండాలి. వాటి సారాన్ని అర్థం చేసుకోగల దృష్టి ఉండాలి. బహుశా తెలుగు ప్రగతిశీల సాహిత్య సంప్రదాయమంతా వర్తమాన సంక్షోభాలను గుర్తెరగడం అనే ఒక ముఖ్యమైన ప్రాతిపదిక మీద నిర్మాణమైంది. వాటి భవిష్యత్‌ను ఊహించడం, ఆ దిశగా గైడ్ చేయడం అనే వొరవడి ఉన్నది. మానవ భౌతిక ఆచరణలో, సృజనాత్మక కలాపంలో భవిష్యత్ అనేది అతి ముఖ్యమైనది. ఈ దినుసును ప్రగతిశీల శిబిరం అక్కడి నుంచి తనలో భాగం చేసుకున్నది.
ప్రగతిశీల సాహిత్యంలోని విలువల ప్రతిపాదనలను ఇంత విస్తృత ఆవరణలో చూడాలి. ఇది ఏదో కారా మాస్టారుకే ఆపాదించడానికి వీల్లేదు. ఆయన్ను వ్యక్తిగా గొప్ప చేయాల్సిన పని లేదు. తెలుగు ఆధునిక, వామపక్ష, విప్లవ మార్గాల్లో ఆనాటికే శక్తివంతంగా ఉండిరది.
కాబట్టి యజ్ఞం వంటి కథ రాయడానికి వెనుక రామారావు మాస్టారును కదిలించిన కాల్పనిక, సామాజిక ప్రేరణలను మనం ఇప్పుడు అర్థం చేసుకోవలసి ఉన్నది. యజ్ఞం తర్వాత కుట్ర కథ దాకా అన్నిటికీ యజ్ఞం ఇచ్చిన లీడ్‌ను గమనించాలి. ఈ వైపు నుంచి ఆయన కథల్లోని సాహిత్యకతను కూడా పరిశీలించవచ్చు.
దేనికంటే ఇతివృత్తం రీత్యా కూడా అంతక ముందటి కథల కంటే పూర్తి భిన్నమైన కథన చట్రం రెండో దశ కథల్లో ఉన్నది. దీన్ని సమకూర్చుకోవడంలో మాస్టారు చైతన్యయుతమైన ప్రయత్నం ఉంది. నిబద్ధత ఉంది. వాటితోపాటు ఆ కాల స్వభావం కూడా కారణం. దీన్ని గుర్తించకపోతే ఆయన కథా పరిణామాన్ని వివరించలేం. రెండు దశల్లోని ప్రత్యేకతలనూ చూడలేం. అంతకంటే ముఖ్యంగా మాస్టారు కథల ప్రాసంగికతా చర్చకు ఆధారం దొరకదు.
ఈ రకంగా ఆయన రెండో దశలో చైతన్యవంతంగా తన కథా క్షేత్రాన్ని మార్చుకున్నారు. బహుశా తన కాలపు సుప్రసిద్ధ కథకుల కంటే భిన్నమైన కథా క్షేత్రానికి ఆయన యజ్ఞం కంటే ముందే ప్రయాణించడం మొదలు పెట్టారు. ఈ ప్రత్యేకత ఆయనలో ఉన్నది. దీన్ని కూడా చూడాలి. ఆయన కథల నుంచే ఎత్తి చూపవచ్చు. ఉదాహరణకు 1955లో అశిక్ష అవిద్య రాశాక మళ్లీ 1964లో తీర్పు రాశారు. ఇందులోనే 1966లో యజ్ఞం కథ రాయడానికి తనను తాను సిద్ధం చేసుకొన్న పూర్వరంగం కనిపిస్తుంది. ఆ రకంగా వైరుధ్యాల గతి తార్కిక క్రమం చిత్రించినందు వల్ల కారా కథల్లో సమకాలీనత ఉంది.
ఒకప్పటి సాహిత్యానికి ప్రాసంగికత ఉందా లేదా? అనే చర్చకు ఇంకో కోణమే సమకాలీనత. ఆ సాహిత్యంలోని వైరుధ్యాల చిత్రణను, ఘర్షణను ఒక క్రమంలో చూస్తే తప్పక ఆ సమస్యలు ఉన్నంత వరకు ఆ రచనకు సమకాలీనత ఉంటుంది. సమకాలీన ప్రపంచానికి అన్వయం కాగల, అవసరం తీర్చగల లక్షణం అందులో ఉండాలి. అలాంటి భావనల మీద ఆ రచన ఆధారపడి ఉండాలి. వాటికి సంబంధించిన విలువలను ప్రతిపాదించి ఉండాలి.
కారా కథలు ఇలా నిర్మాణమయ్యాయి. అందు వల్లనే ఆయన కథల్లో ప్రాసంగికత వేర్వేరు స్థాయిల్లో, వేర్వేరు అర్థాలను ప్రకటిస్తుంటుంది. దాని గురించిన చర్చ అనివార్యంగా మన మేధో, సృజన కలాపాలను, వాటి చరిత్రను మరోసారి పరీక్షించుకోడానికి ఉపయోగపడుతుంది.
0 0 0
ఆ రోజుల్లోనే కారా కథల్లో స్త్రీ కోణం ఉన్నది..వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ జీవన సంవేదన ఉన్నది..ఆ ప్రాంతపు అట్టడుగు కులాల, వర్గాల అద్భుత మాండలిక సౌందర్యం ఉన్నది. కళా సాహిత్యాలు మాత్రమే అందించగల జీవితపు ఎరుక ఉన్నది. దానికి సంబంధించిన గాఢమైన ఇతివృత్త భావనలు ఉన్నాయి. ఈనాటికీ కొనసాగుతున్న రాజకీయార్థిక వైరుధ్యాల సంఘర్షణకు అన్వయం కుదురుతున్నది. సంఘర్షణ వల్లనే ప్రగతిని, విముక్తిని మానవాళి సాధించగలదనే అర్థాన్ని ఈ వర్తమానంలో కూడా ఆయన సాహిత్యం ప్రకటిస్తున్నది. భారత రాజకీయార్థిక సాంఘిక సాంస్కృతిక వైరుధ్యాల్లోని పీడన, దోపిడీ, హింస, పరాయికరణలపట్ల సున్నితమైన, లోతైన, చారిత్రకమైన ప్రేరణలను అందించగల శక్తి ఆయన కథలకు ఉన్నది. మానవ సాంస్కృతిక చైతన్యాన్ని పెంచగల దృక్పథం ఉన్నది.
అయితే ఈనాటి అవగాహనతో, ఇప్పుడు అందరూ సంతృప్తి పొందేలా ఆనాడే ఆయన కులాన్ని చిత్రించి ఉండకపోవచ్చు. ఆ మేరకు దళిత బహుజన వాదులు రామారావు మాస్టారు కథలను అంగీకరించలేరు. అట్లని కారా కథలు ఏ ప్రగతిదాయక పరివర్తనకూ పనికిరావని అనడం కుదరదు. ‘అదేమీ కాదు, కారా అప్పటికీ ఇప్పటికీ అందరూ సంతృప్తి పొందేలా కులాన్ని తన కథల్లో చిత్రించార’ని అనడం వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు. దానికైనా, దీనికైనా లేనిపోని కసరత్తు చేయనవసరం లేదు. బ్రాహ్మణ్యమనో, ఆర్థిక నిర్ణాయకవాదమనో, కులం గురించి ఎరుకలేని సాధారణీకరణ అనో యాంత్రిక కుదింపులతో కారా కథలను తిరస్కరించవచ్చు. కానీ సాహిత్యంలో కులం గురించి అవసరమైన ఏ సరి కొత్త అన్వేషణకూ ఈ సూత్రీకరణలు పనికి రావు.
నిజంగానే ఆయన కథల ప్రాసంగికతను తేల్చుకుందామనే ఆలోచన చాలా మంచిది. ఒక్క రామారావు మాస్టారు విషయంలోనే కాదు. ఇటీవల ఇలాంటి సందిగ్ధ సంఘర్షణ అనే సందర్భాల్లో జరుగుతున్నది. తెలుగు సాహిత్య చరిత్రలో, లేదా వామపక్ష ప్రజా పోరాటాల్లో అంతర్భాగమైన ఫలానా వ్యక్తి అవసరం లేదనుకుంటే రద్దు చేసేయవచ్చు. కానీ దానికి కాస్త సీరియస్ భూమికను సిద్ధం చేసుకోవడం మంచిది. కొంచెం ప్రామాణికత ఉన్న పరికరాలను తయారు చేసుకోవాలి. ఆ వ్యక్తుల ప్రాసంగికతను, సమకాలీన అవసరాన్ని తేల్చుకోడానికి పునర్మూల్యాకనం ఒక్కటే మార్గం. ఇది ఒక తరహా వ్యక్తుల కోసమే కాదు. ఇంకా వెలికి రాని అంటరాని కులాల, బహుజన కులాల రచయితలను అర్థం చేసుకోడానికి కూడా ఇలాంటి పరికరాలు కావాల్సిందే. వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉండవచ్చు. ఇష్టాఇష్టాలే సాహిత్య విమర్శ పరికరాలుగా ఎవరికీ ఎల్లకాలం పని చేయవు. గతంలో అగ్రకులాలు ఆ పని చేశారు. కానీ వాళ్లు ఏ వాస్తవాన్నీ సొంతకాళ్ల మీద నిలబెట్టలేకపోయారు. సమకాలీన అవసరం తీర్చగలిగిన, ఇవ్వాల్టి ప్రగతిదాయక పరివర్తనలో నిజంగానే భాగం కాగలిగిన వాక్యం మాత్రమే ఆధునిక ప్రగతిశీల సాహిత్య చరిత్రలో మిగిలి ఉన్నది. ఆ శక్తి ఎవ్వరిలో ఉన్నదో, ఎందుకు ఉన్నదో ఎంతగా గుర్తించగలిగితే అంతగా కొత్త సాహిత్య ఆవరణను నిర్మించుకున్నట్లు. లేకపోతే గాలిలో తీవ్ర యుద్ధాలు చేస్తున్నట్లే.