ఈ నడమ ఏదో ఒక రూపంలో సాహిత్య విమర్శ గురించిన చర్చలు జరుగుతున్నాయి . ఇప్పుడు ఆ చర్చా సందర్భాల గురించి మాట్లాడబోవడం లేదు. అవి కొన్ని ముఖ్యమైన విషయాలను పరోక్షంగా ముందుకు తీసుకొచ్చాయి. అవి మాట్లాడుకుంటే చాలు.
సాహిత్య విమర్శ పని ఏమిటి? దానికి సొంత కార్యక్షేత్రం ఏదైనా ఉన్నదా? విమర్శ అనేది సాహిత్యం మీద, సాహిత్యకారుల మీద ఆధారపడిన పరాన్నజీవి మాత్రమేనా? రచయితలను పొగిడి వాళ్ల మెప్పు పొందడంతో విమర్శ కార్యక్షేత్రం ముగిసిపోతుందా? అనేవి ఆలోచించాలి.
నిజానికి సాహిత్యం గురించి మాట్లాడుకొనేటప్పడు *సాహిత్య విమర్శ* ఆటలో అరిటిపండులా మారిపోతోంది. నేరుగా దాని గురించి పెద్దగా మాట్లాడరు. అది ఏం చేయాలో చెప్పరు. దాని కర్తవ్యాల పట్ల శ్రద్ధ ఉన్నట్లు వ్యవహరించరు. సాహిత్య విమర్శ గురించి పట్టించుకున్నట్లు కనిపించదు. పట్టించుకున్నా తమకు తోచిన కర్తవ్యాలు దాని మీద మోపుతుంటారు. ఇందులో సాహిత్యకారులు ఉంటారు. పాఠకులూ ఉంటారు. పుస్తకాలు అచ్చేసేవాళ్లూ ఉంటారు. రచనలను ప్రమోట్ చేసే వారూ ఉంటారు. సాహిత్యం మీద, సాహిత్య విమర్శ మీద కేవల అభిప్రాయ ప్రకటనలు చేసేవాళ్లూ ఉంటారు.
అయితే విమర్శకులైనా తమలో తాము విమర్శ మంచి చెడ్డల గురించి మాట్లాడుకుంటున్నారా? దాని ముందున్న సవాళ్లను పట్టించుకుంటున్నారా? విమర్శ రంగం లోపల ఏం జరుగుతున్నది? అనేవి చాలా సీరియస్ విషయాలే. వాటినీ చర్చించాల్సిందే.
అది ఎలా ఉన్నా.. రచయితలు మాత్రం తమ రచన మీద ఒక చిన్న విమర్శ వస్తే మాత్రం సహించరు. ఆగ్రహిస్తారు. అప్పడు మాత్రమే విమర్శ గురించి మాట్లాడతారు. విమర్శకులకు తమ రచన చదివే శక్తే లేదని అంటారు. అందులోని అంతరార్థాలు అందుకొనే స్థాయి లేదని అంటారు. తెలుగులో విమర్శ ఎదగలేదనే అంటారు.
మరో సందర్భంలో కూడా విమర్శ గురించి రచయితలు మాట్లాడుతుంటారు. తాము అచ్చేసిన పుస్తకాల మీద తాము కోరుకున్న స్థాయిలో ప్రసంశలు రాకపోతేనో, ఆశించినన్ని సమీక్షలు రాకపోతేనో తెలుగులో విమర్శ ఎక్కడుంది? అని నిట్టూర్పులు విడుస్తారు. మరి కొందరైతే.. విమర్శకులు అంటే తమకు చిరాకని, విసుగని నేరుగానే ప్రకటిస్తుంటారు. విమర్శకులవి సంకుచిత పారా మీటర్లని అంటారు.
విమర్శ గురించి ఈ మాట అనడం కూడా విమర్శే. అప్పడు ఆ పారా మీటర్లు ఎలా సంకుచితమో చెప్పాలి. వాటిని సవరించాలి. అంటే.. తాము విమర్శ రంగంలోకి రావాల్సి ఉంటుంది. అదేమీ చేయకుండా తమ విసుగును ప్రదర్శించి ఊరుకుంటారు. ఈ తరహా అభిప్రాయాల మీద కూడా ఇతరులు విసుగు ప్రదర్శించవచ్చు. ఈ విషయం మర్చిపోయి విమర్శ మీద విసుగు, విసుర్లు ప్రదర్శిస్తుంటారు. దీని వల్ల అయ్యేదేమీ ఉండదు.
విమర్శ గురించి ఇన్ని రకాల అభిప్రాయాలు వినిపించడానికి కారణం ఆ రంగం సరిగా లేకపోవడమే అనే వాళ్లు ఉంటారు. విమర్శకులు తమ పనితాము సక్రమంగా చేయకపోవడమే అని నిర్ధారించే వాళ్లు ఉంటారు. ఇందులో ఏ కొంచెమైనా నిజం ఉండకపోదు. కాబట్టి విమర్శ మీద, విమర్శకుల మీద రచయితల వైఖరులకు విచారపడాల్సిన పని లేదు. ఈ స్థితిని ఎదుర్కోవడం కూడా విమర్శ రంగంలో చేయవలసిన కృషే. దేనికంటే ఈ ధోరణులు ఇప్పుడే వచ్చినవి కాదు. గతంలో కూడా ఇవన్నీ ఉన్నవే. కొన్ని ఇంకా ఎక్కవగా ఉండినవే. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే తెలుగు విమర్శ రంగం ఎంతో విస్తరించింది.
ఇప్పుడున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే తిరిగి మళ్లీ మళ్లీ విమర్శ రంగ కర్తవ్యాలు ఏమిటో గుర్తించాల్సిందే. విమర్శ అంటే ఏమిటి? అనేక రూపాల్లో సాగే విస్తారమైన విమర్శ కార్యక్షేత్రంలోకి వెళ్లి దానికి ఏదైనా సొంత పని అంటూ ఉన్నదా? తేల్చుకోవాల్సిందే.
సాహిత్య విమర్శ పాత్ర … రచనకు-రచయితకు, రచనకు-పాఠకులకు, రచయితలకు-పాఠకులకు మధ్య మాత్రమే ఉండదు. అచ్చయిన వందల పుస్తకాలన్నీ సహనంగా చదివి పాఠకులకు రెకమెండ్ చేయడం సాహిత్య విమర్శ కానే కాదు. ఒక రచనలోని అర్థాలను విప్పి చెప్పడం, ఒక రచన పాఠకులను చేరుకోడానికి తనంత తాను నిర్మించుకున్న బ్రిడ్జిలను వివరించడం మాత్రమే సాహిత్య విమర్శ పని కాదు. లేదా ఆ రచన పాఠకులకు చేరకుండా అందులోనే మొలిచిన అడ్డుగోడలను ఎత్తి చూపడం ఒక్కటే విమర్శ పని కాదు. ఒక ప్రయోగాత్మక రచనలోని మర్మాలను విప్పి చూపి ఎలా చదవాలో దారి చూపడంతో విమర్శ పని ముగిసిపోదు.
సాదాగా రాయడం వల్ల పది మందికి చేరే ఓ కవితను, కథను, నవలను ప్రయోగాత్మకంగా రాస్తే.. వంద మందికి, అనేక తలాల్లో అందితేనే అది సవ్యమైన ప్రయోగం అవుతుంది. మామూలుగా రాసినప్పటికంటే ప్రయోగాత్మకంగా రాస్తే అనూహ్యమైన అర్థాలు గోచరించాలి. ఈ లక్ష్యంతో ఎలాంటి ప్రయోగమైనా చేయవచ్చు. అప్పుడే అది మంచి ప్రయోగమవుతుంది. అందు కోసమే ఎవరైనా ప్రయోగాలను స్వాగతిస్తారు. విమర్శ ఇలాంటి ప్రయోగ గుణాలను ఎత్తి చూపాలి. అలాగే రచయితలు తమ కాల్పనిక శక్తి తో అబ్బరపరచడం కూడా సాహిత్య లక్షణమే. దాని గురించీ విమర్శ మాట్లాడాలి.
అయితే ఆ ప్రయోగం వల్ల కథ లేదా నవల అపురూపమైన, అరుదైన, ఉద్వేగపూరిత మానవానుభవాన్ని అందించగలగాలి. ఇంకే రకంగా ఆ విషయం గురించి కలగని ఎరుకను అందించగలగాలి. కల్పనా సాహిత్యంలో మిగతావి ఎన్ని ఉన్నా ఇవి రెండూ తప్పక ఉండాలి. ఆ అనుభవాన్ని, ఎరుకను విమర్శ చెప్పగలగాలి. లేదా ఇవేవీ కలగకుండా ఆటంకాలు ఏమైనా ఆ ప్రయోగంలోనే ఉంటే దాన్నీ విమర్శ చెప్పగలగాలి.
ఇవన్నీ చేసినా అదే సాహిత్య విమర్శ కాజాదు.
పైన చెప్పినవన్నీ సాహిత్య విమర్శలోని ముఖ్యమైన పనులు మాత్రమే. ఇవే సాహిత్య విమర్శ రంగ సర్వస్వం కాదు. ఇక్కడికే పరిమితమైతే సాహిత్య విమర్శకు సొంత పని ఏదీ లేదని అంగీకరించినట్లవుతుంది. సొంత కార్యరంగం ఏదీ లేదని ఒప్పుకున్నట్లవుతుంది. రచయితలు విమర్శ నుంచి తమకు ఇష్టమైనవి కోరుకోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందనుకుంటే పొరబాటే. విమర్శకుల వల్ల కూడా వచ్చింది. గట్టిగా చెప్పాలంటే .. కొందరు విమర్శకులకైనా సాహిత్య విమర్శ కార్యక్షేత్రం గురించి, కర్తవ్యాల గురించి సమగ్ర అవగాహన లేకపోవడంతో విమర్శ అంటే రచయితలను పొగడ్డంగా మారిపోయింది. లేదా రచనను పాఠకులకు స్పూన్ ఫీడింగ్ చేయడంగా మారిపోయింది.
సారాంశంలో సాహిత్య విమర్శ అంటే సృజనాత్మక రచయితల మీద, రచనల మీద ఆధారపడిన పరాన్నజీవి అనుకొనే ప్రమాదం ఏర్పడింది. దీని వల్లనే కొందరు రచయితలు తమ రచన మీద ఒక్క విమర్శ ప్రకటించినా విమర్శ రంగం మీదనే ఆరోపణలు చేసే పరిస్థితి ఏర్పడింది. విమర్శకులలోని లోపాలను ఎంతయినా చెప్పవచ్చు. విమర్శా పద్ధతి బాగా లేకపోతే ఆ సంగతి కూడా చెప్పవచ్చు. అసలు తాము ఏ విమర్శనా సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారో దాన్ని ఎత్తి చూపవచ్చు. కానీ విమర్శ పాత్రనే తిరస్కరించే దాకా ఈ ధోరణి వెళ్లింది. విమర్శా చరిత్రను ఇష్టానుసారంగా కుదించే పెడధోరణి వచ్చేసింది. తమ రచనలోని లోపాలను చెబితే భరించలేకపోవడం రచయితల స్వీయ బలహీనత. లేదా తమ రచన మీద వల్లమాలిన మమకారం. దీంతోనే విమర్శ పాత్రను తిరస్కరిస్తున్నారు. లేదా అసలు తెలుగులో విమర్శే లేదని అంటున్నారు.
కొందరైనా విమర్శకులు దీనికి లొంగిపోయారు. దీని వల్ల విమర్శ రచయితల చుట్టూ, అచ్చయిన రచనల చుట్టూ గిరికీలు కొడుతున్నది. విమర్శకులు తమ రంగానికి సంబంధించిన ప్రధాన పనులు చేస్తూ కాల్పనిక రచయితలు ఏం రాస్తున్నారు? ఎలా రాస్తున్నారు? అని నిర్దిష్టంగా కూడా పరిశీలించాలి. దీనికి భిన్నమైన పరిస్థితి ఇవాళ ఉన్నది.
ఇది ఉన్నంత వరకు విమర్శకులు తమకంటూ ఒక ప్రపంచం ఉన్నదని, అందులో కొన్ని బాధ్యతలు ఉన్నాయని గుర్తించలేరు. తమకంటూ పాఠకులు ఉంటారని ఎన్నటికీ గుర్తించలేరు. సాహిత్య విమర్శలో వివిధ వాచకాలను పరిశీలించడం ఒకానొక పని మాత్రమే. సాహిత్య విమర్శ మొత్తంగా చారిత్రక, సామాజిక, రాజకీయార్థిక, భావజాల, సాంస్కృతిక రంగాల ఉమ్మడి క్షేత్రానికి సంబంధించింది. అక్కడ నిలబడి మిగతా సామాజిక విమర్శ పద్ధతుల కన్నా ప్రత్యేకమైన పని చేయాలి. సాహిత్య విమర్శ కూడా సామాజిక విమర్శే. కానీ భిన్నమైనది. దానిదైన సిద్ధాంత స్వభావం ఉంటుంది. నేరుగా సామాజిక, రాజకీయ విశ్లేషణల్లో ఒదగలేని వాటిని సాహిత్య కళా విమర్శ తనలో భాగం చేసుకుంటుంది. కాల్పనిక రంగంలో అందుకోలేని వాటిని కూడా విమర్శ తన సిద్ధాంతశక్తి వల్ల అందుకుంటుంది.
సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకున్నందు వల్ల సాహిత్య విమర్శ సామాజిక, రాజకీయార్థిక విమర్శగా, భావజాల, సాంస్కృతిక విమర్శగా విస్తరిస్తుంది. మొత్తంగా చారిత్రక, భావజాల, సాంస్కృతిక ప్రపం చంలో, నిత్య పరివర్తనాశీల జగత్తులో సాహిత్య, కళా విమర్శకు పాత్ర ఉన్నది. దేనికంటే సాహిత్యం ఒకానొక సామాజిక ఉత్పత్తి. మిగతా భౌతిక ఉత్పత్తుల వంటిది కాదు. చారిత్రక క్రమాన్ని, ముఖ్యంగా ఆధునిక పరివర్తనా క్రమాన్ని ఆసరా చేసుకొని సాహిత్యాన్ని వివరించే సిద్ధాంత దృక్పథం సాహిత్య విమర్శ రంగానికి వెన్నెముక. సాహిత్యానికి సంస్కృతికి, భావజాలానికి ఉన్న సంబంధం వల్ల అది భావజాల విమర్శగా, సాంస్కృతిక విమర్శగా కూడా ఉంటుంది. విమర్శకు సొంత కార్యక్షేత్రాన్ని గుర్తించవలసింది ఇక్కడే.
ఇక్కడి నుంచి సాహిత్య విమర్శకు ఉండే పాత్రను, లేదా స్థానాన్ని విమర్శ రంగం నిత్యం పునర్నిర్మించుకోవాలి. సృజనాత్మక రచయితలకు, ఆ రచనలు చదివే పాఠకులకు విమర్శ పరిమితం కాదు. పోటీ కాదు. సమానం కాదు. ప్రత్నామ్నాయం కాదు. విమర్శ.. అంతకంటే చాలా విస్తారమైన అనేక మేధో రంగాల, జీవన క్షేత్రాల, కాల్పనిక ప్రేరణల ఉమ్మడి ప్రాంతానికి చెందినది.
అందువల్లనే రచయితలు తమ అనుభవంతో, భావోద్వేగాలతో, కాల్పనిక శక్తితో, సామాజిక లక్ష్యంతో సహితం అందుకోలేని భిన్నమైన ఆవరణలోకి విమర్శ ఆవలి వైపు నుంచి ప్రవేశిస్తుంది. దానికి సొంత లక్ష్యాలు ఉంటాయి. పరికరాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉంటాయి.
సృజనాత్మక సాహిత్యానికి, విమర్శకు మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. పరస్పర ఆధారితంగా ఉనికిలో ఉంటాయి. సాహిత్యం లేకుంటే సాహిత్య విమర్శ అసాధ్యం అనిపించవచ్చు. విమర్శ లేకుంటే సాహిత్యం తీరు తెన్నులు బాగుపడేది ఎట్లా అనే సందేహం కలగవచ్చు. ఇవి రెండూ నిజమే. కానీ విమర్శుకులు చేయిపట్టి నడిపించనవసరం లేకుండానే అత్యుత్తమ కాల్పనిక సాహిత్య సృజన సాగుతూ ఉంటుంది. అలాగే విడి విడి రచనల మంచి చెడ్డలను చెప్పడమేగాక సాహిత్య విమర్శకు తనకంటూ సొంత కార్యక్షేత్రం ఉంటుంది. అక్కడ అది ఒకానొక సామాజిక సిద్ధాంతంగా, భావజాల, సాంస్కృతిక విశ్లేషణ ఆయుధంగా కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది.
సాహిత్య విమర్శ ఒక కాలు మానవానుభవంలోని కాల్పనిక ప్రపంచంలో పెట్టి, మరోకాలు అత్యంత వాస్తవికమైన చారిత్రక ప్రపంచంలో పెట్టి కొనసాగుతుంటుంది. ఆ రెంటి ఉమ్మడి ప్రాంతం విమర్శ సొంత కార్యక్షేత్రం. ఇక్కడి నుంచే ఒక రచనలోని గుణదోషాలు విమర్శకులు చెబుతారు. రచనలోని అర్థాలను వివరించగలుగుతారు. వాచక అధ్యయనం వల్లనే ఈ అర్థాలను చెప్పడం సాధ్యం కాదు. వాచకానికే పరిమితమై ఎవ్వరూ ఈ పని చేయలేరు. సిద్ధాంత దృక్పథం ఉండాలి. చారిత్రక రాజకీయార్థిక అవగాహన, దాన్ని సంస్కృతీ భావజాల విమర్శగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉండాలి. సాహిత్యానికి ఉండే సామాజికతను చలనంలో భాగంగా చెప్పాలి. విమర్శ స్థావరం ఇదీ అని తెలిస్తే.. విమర్శకులు రచనల మీద అభిప్రాయాలు చెప్పడంతో తమ పని అయిపోయిందని అనుకోరు. అట్లాగే ఒక రచనలోని లోపాన్ని ఎత్తి చూపినప్పడు సదరు రచయితలు ఆవేదనకు గురి కారు. ఒకవేళ విమర్శకులు చెప్పిన మాట సహించకపోవచ్చుగాక.. విమర్శ పాత్రను తిరస్కరించలేరు. విమర్శకులను బ్లాక్‌మెయిల్ చేయలేరు. సృజనాత్మక రచన చేయడం కూడా ఒక రకమైన విమర్శే, దాని పైన విమర్శ కూడా సామాజికమే అనే అవగాహన కలిగితే నిజంగానే రచయితలు ఎదుగుతారు.
ఇవన్నీ జరగాలంటే విమర్శకులు తమ విస్తృత రంగాన్ని ముందు గుర్తించాలి. దానికి ఉన్న విస్తృత సామాజిక, చారిత్రక, సాంస్కృతిక పాత్రను గుర్తించి, పరిగణలోకి తీసుకొంటేనే సాహిత్యానికి మేలు జరుగుతుంది. అంతకంటే ఎక్కువగా సమాజానికి మేలు జరుగుతుంది.
తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో మొదటి నుంచీ ఈ స్పష్టత ఉన్నది. విమర్శ రంగానికి ఉండే ప్రత్యేకత చాలా మంది విమర్శకులకు తెలుసు. ఈ విషయంలో తొలి రోజుల మార్క్సిస్టు విమర్శకులకు అంత స్పష్టత ఉండకపోవచ్చు. వాళ్లలో కొందరైనా ఆధునిక, ప్రగతిశీల వైఖరులతో విమర్శ రాసినవారే. వర్గపోరాట దృక్పథం అంతగా లేదు. అనేక ప్రత్యేకతలు ఉండే సాహిత్య కళా, భావజాల, సాంస్కృతిక రంగాలకు చెందిన విమర్శ తనదైన సిద్ధాంత దృక్పథాన్ని సంతరించుకోవడంలో వర్గపోరాట చైతన్యం ఒక ముఖ్యమైన అంశం. అది తొలి రోజుల్లో అంతగా లేకపోవడం వల్ల వాళ్ల సిద్ధాంత కృషికి కూడా పరిమితి ఏర్పడింది. మొత్తంగానే తెలుగులో ఆ కాలపు మార్క్సిస్టు సిద్ధాంత స్థాయికే ఈ ప్రత్యేకత ఉండింది. వర్గపోరాటం తీవ్రంగా ముందుకు వచ్చాక సహజంగానే సిద్ధాంత పటుత్వం పెరుగుతుంది. ఎక్కడైనా జరిగేది ఇదే. మార్క్సిస్టు సిద్ధాంత జ్ఞానం పాండిత్యంగా మారకపోవడానికి ఇదొక ముఖ్యమైన సానుకూల ఆధారం.
ఏ సమాజమైనా తనకు అవసరమైన సాహిత్యాన్ని సృజించుకుంటుంది. సాహిత్య విమర్శ కూడా అంతే. తెలుగు సమాజం సాగించిన, సాధించాల్సిన ప్రగతిదాయకమైన పరివర్తనా క్రమానికి తగిన పద్ధతిలో విమర్శ అభివృద్ధి చెందుతోంది. దానికి మూలం.. విమర్శ రంగ సొంత కార్యక్షేత్రం తెలిసి ఉండటం. దాని సిద్ధాంతం తెలిసి ఉన్నందు వల్లనే మార్క్సిస్టు విమర్శ తన ప్రతిపత్తిని చాటుకున్నది.
అంత మాత్రాన అందులో లోటుపాట్లు లేవని కాదు. అభివృద్ధి చేసుకోవలసి అంశాలు లేవని కాదు. వాటితో సహా దానికి ఉన్న ఈ పునాదిని గుర్తించాలి. నిజానికి విస్తారమైన తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శా చరిత్రను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఇది కేవలం తెలుగు సాహిత్య చరిత్రతో ముడిపడినది మాత్రమే కాదు. తెలుగు సమాజంలోని అనేక రంగాల పరిణామాలతో, సామాజిక ఆధిపత్య నిర్మితుల స్వభావాల్లోని మార్పులతో, పీడనలకు వ్యతిరేకంగా సాగిన ధిక్కారాలతో, వర్గపోరాటాలతో, వీటి వెలుగులో సంతరించుకున్న సిద్ధాంత, మేధో రంగాల వికాసంతో ముడిపడిన విషయం ఇది. దీన్నంతా కేవలం రాజకీయం అని కొట్టి పడేయడానికి వీల్లేదు. సిద్ధాంత పద్ధతి రూపొందడానికి అతి ముఖ్యమైన సోర్స్ ఇది.
అందువల్ల ఇలాంటి మిగతా వాటన్నిటి నుంచి వేరు చేసి విమర్శను సిద్ధాంత అంశంగా చూసి తేల్చగలిగేది ఏమీ ఉండదు. ఖచ్చితత్వం సాధించేది అసలే ఉండదు. కచ్చితత్వం, ప్రామాణికత అనేవి విమర్శ అనే సామాజిక సిద్ధాంత పద్ధతికి తప్పనిసరి.
ఈ రకంగా మార్క్సిస్టు విమర్శ తన సొంత కార్యక్షేత్రాన్ని సంతరించుకోవడం వెనుక అనేక మంది విమర్శకుల సిద్ధాంత కృషి ఉన్నది. ఎవరెవరు ఎలా పని చేసిందీ చాలా ప్రత్యేకంగా పరిశీలించవచ్చు. ఇప్పటికే విడివిడిగా జరిగిన విస్తారమైన కృషిని క్రోడీకరించి, నిర్మమకారంతో, ఆయా కాలాల, ప్రజా పోరాటాల ప్రత్యేకతలను, పరిమితులకు దృష్టిలో పెట్టుకొని అంచనా వేయడం సులభమే.
మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ఉన్న ఈ లక్షణం తెలుగు ఫెమినిస్టు సాహిత్య విమర్శకు కూడా కొంత ఉన్నది. పితృస్వామ్యాన్ని ఒక ఆధిపత్య సామాజిక నిర్మితిగా, భావజాలంగా, నిత్య జీవితంలోని సాంస్కృతిక ఆచరణగా ఫెమినిజం గుర్తించింది. చరిత్రను చూసే కోణం మార్చింది. ఈ మొత్తం నుంచి సాహిత్యాన్ని పరిశీలించే సిద్ధాంత కృషి సాగించింది. వాచకాలను వివరిస్తూ ఈ పని కూడా చేసింది.
అంత కాకపోయినా దళిత వాద సాహిత్య విమర్శలో కూడా దీన్ని చూడవచ్చు. కుల సామాజిక నిర్మాణాన్ని, దాని పరిణామాన్ని, ఆధునిక యుగంలో దానికి వ్యతిరేకంగా వచ్చిన చైతన్యాలను పరిగణలోకి తీసుకొని సిద్ధాంత కల్పనకు ప్రయత్నిస్తున్నది.
దీన్నంతా సవరించి, ఇప్పటి దాకా జరిగిన పనినంతా క్రోడీకరించి, విమర్శనాత్మకంగా చూసి, మరింత బలమైన సిద్ధాంత పద్ధతిని నిర్మించినప్పుడే విమర్శ తన సొంత కార్యక్షేత్రాన్ని సంతరించుకుంటుంది.
0 0 0