జీవితం మనది కాని దిశలో సాగుతున్నప్పుడు, అంతా నిరాకారంగా ఉంటుంది. ఆ  మలుపు దగ్గర నిలబడి మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. అలాంటి మలుపు ఒకటి నా జీవితంలో జరిగింది. అదే ఈ రోజున నన్ను మీ ముందిలా నిలబెట్టింది. 

ప్రకాశం జిల్లా నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఊళ్లలో మాది ఒకఊరు. సుంకేసుల గ్రామం. మా పూర్వీకులు అక్కడే నివసించారు.ఇప్పటికి మాఅన్నలు, బాబాయిలు అక్కడే జీవనం చేస్తున్నారు. మా నాన్నని వాళ్ళ మేనమామ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే తీసుకువచ్చి, కొలకలూరు బెంజిమెన్ గారి హాస్టల్లో చదివించి, రైల్వే లో ఉద్యొగం ఇప్పించి పెళ్లి చేశారు. కాబట్టి నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరగవల్సి వచ్చింది. ఈ నేపథ్యంఅంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నా మూలాల వెనక ఉండే నా నేలని గురించి నాలుగు మాటలు చెప్పడం నా ధర్మంగా భావిస్తాను.

పుట్టడం,పెరగడం అంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగింది.కొన్నాళ్ళు గుంటూరు జిల్లాలో ఉన్నాం ఆ తర్వాత ఇప్పటివరకు పూర్తిగా కృష్ణా జిల్లాలోని కొనసాగుతున్నాను. విజయవాడకి దగ్గర్లో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యం లో నడుస్తున్న రామకృష్ణ విద్యాలయ లో విద్యాభ్యాసం  సాగింది.నాగార్జున విశ్వవిద్యాలయం నుండి కామర్స్ లో గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక ప్రయివేట్ కంపెనీలో ఎక్కౌంట్స్ విభాగంలో పని చేస్తున్నాను. 

జీవితం మనల్ని ఖాళీగా ఉండనివ్వదు. నిత్యం ఏదో ఒక సంవేదన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మాది మొదటినుంచి క్రైస్తవ నేపథ్యం ఉన్న కుటుంబం. మా తాత గారు యాభయేళ్ళ క్రితమే మేము క్రైస్తవ సాంప్రదాయం లోనే ఉంటామని చెప్పి రిజర్వేషన్ని వ్యతిరేకించారు. ఇప్పటికి మా ఇంట్లో ఎవరికీ రిజర్వేషన్ లేదు.క్రైస్తవ సంప్రదాయం ఉండడం వలన క్రమశిక్షణ గా పిల్లల్ని పెంచాలి అని చాలా క్రమ శిక్షణగా ఉండేది ఇంట్లో. అందరి దళిత కుటుంబాల్లో లాగానే ఉండడానికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేది కానీ ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం అనే దానికి మా కుటుంబం ఏమి మినహాయింపు కాదు.దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉన్నాం.  ఏదీ సజావుగా అందలేదు.ఏది కావాలన్నా దానికోసం ఒక పోరాటమే చేయవలసి వచ్చేది. అలా జీవితంలో దేనికోసమైనా ఓపిగ్గా ఎదురు చూసే లక్షణం , ఊరికనే ఆవేశపడే అలవాటు లేకపోవడం నాకు నా జీవితమే నేర్పింది. ఆలోచన లేకుండా ఏ పని చేయకపోవడం కూడా జీవితమే నేర్పింది. 

నన్ను నా జీవితం ఎప్పుడూ వెంబడిస్తూనే ఉంటుంది.అది నాకు నేర్పిన పాఠాలు అన్నీ ఇన్ని కాదు.బహుశా నా చాలా కవితల్లో కనబడే జీవితం తాలూకా జ్ఞాపకాలన్నీ అందులోనుంచి నేను అనుభవించినవే కావడం వాళ్లకూడా చాలా మంది వాటిల్లో తమని వెతుక్కున్నారు. 

చదువు పూర్తిగా అయిపోయి ఉద్యోగంలో కుదురుకున్నాక సాహిత్యం వైపుకి మళ్ళాను .అప్పటికే నాకు బళ్ళో చదివే రోజుల్లో ఎస్ఎఫ్ ఐలో  పనిచేయడం . వాళ్ల కరపత్రాలు చదవడం పంచడం వంటి పనుల్లో చురుగ్గానే  ఉండేవాడిని. అదీ కాక మా ప్రాంతం లో సీపీఎం పార్టీ అనుబంధ సంఘాలకు ఎస్సీ, ఎస్టీ ల కాలనీల్లో చందాలు కట్టించే పని చేయడం వంటివి చేశాను. అదీకాక  నిరంతరం దినపత్రికలు, సాహిత్య పత్రికలు చదివే అలవాటు ఉండడం వలన కాస్త రాజకీయం, కవిత్వం అర్ధం అయ్యేయి కానీ రాయాలని అనిపించలేదు.ముందుగా నేను కథకుడు కావాలని అనుకున్నాను. ఆయా వారపత్రికల్లో వచ్చిన చాలా కథ‌లు నన్ను ఆలోచింపజేసేవి.వాటిల్లోనుంచి నాకు సరిపడా నేను రాయగలిగిన ఒక కథని రాసి ఏదో పత్రికకు పంపిన జ్ఞాపకం కూడాఉంది. అదెక్కడా అచ్చు కాలేదు.అది మరీ పిల్ల చేష్ట గా ఇప్పటికి అనుకుంటాను.  

విజయవాడ పుస్తక ప్రదర్శన కూడా నన్ను పుస్తకాలవైపుకి మళ్లేలా చేసింది ప్రతీ ఏడూ వెళ్లడం వల్ల ముందుగా మహాప్రస్థానం కొని చదవడం మొదలు పెట్టాను.అప్పటికి సాహిత్యం అంటే నాకు తెల్సిన ఒకే ఒక్క పేరు శ్రీశ్రీ మాత్రమే. ఆ తరవాత నేను విన్న పేరు కలేకూరి. అప్పట్లో ఇంత విస్తృతమైన నెట్వర్క్ లేని కాలం లో విన్న పేర్లు , చదివిన ఒకటో రెండు కవితలు మహాప్రస్థానం చదివిన తర్వాత నాలో ఆ ప్రభావం ఏదో మెల్లిగా కదలడం మొదలయింది. ఏదేదో రాసేవాడిని నాకే నచ్చేది కాదు. కొన్నాళ్లు అచ్చం శ్రీశ్రీ మాటల్నే రాసి నేను మాత్రమే చూసుకుని మురిసిపోయే వాడిని. అలా కాలప్రవాహం లో జారిపోతున్న సందర్భంలో. ఎక్కడో ఫేస్ బుక్ అనేది ఒకటి  ఉంది అక్కడ మీ మాటలు పంచుకోవచ్చు. అక్కడఉన్న ప్రజలని ఒక చోటపోగు చేస్తే ఒక దేశం అంత అవుతారు అని చదివిన తర్వాత అందులోకి ప్రవేశించాను.అప్పటినుంచి నేను నేనుకాదు.

సామాజిక మాధ్యమం లోకి దిగిన తర్వాత ఒక వాక్యమనేది ఎలా రాయాలో తెలుసుకున్నాను. ముందుగా రెండు లైన్ ల మాటలు రాయడం తో మొదలు పెట్టాను.అది నలుగురు చూసి భలే ఉన్నాయి అన్నారు. అదే కవిత్వం అనే భ్రమలో ఒకటి రెండేళ్లు ఉన్నాను కూడా.అక్కడనుంచి కొత్త కవిత్వాన్ని చదవడం మొదలు పెట్టాను.అప్పటి వరకు నేను దిన, వార పత్రికలో చూసిన పేర్లు, వ్యక్తులు నా ముందే నాతో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం వేసింది అంటే మాటల్లో చెప్పలేను.కొన్ని సార్లు కొంత మందిని చూశాక ఆగలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఏమి తెలియని తనం అది. వాళ్లంతా నిజంగా గొప్పవాళ్లే.అప్పటికే వాళ్ళ కృషి అనన్య సామాన్యం అయింది.అలాంటి వాళ్ళు నన్ను చాలా ఆదరించారు.అప్పటికి నేనేం రాయలేదు.ఒక్క కవిత కూడా  కాగితం మీదకి ఎక్కలేదు.కానీ వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు. నీకేమి కాదు చదువు అని చాలా పుస్తకాలు లిస్ట్ చెప్పారు,చదివించారు వాళ్ళ పుస్తకాలు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను మెల్లిగా సాహిత్యం వైపు పూర్తిగా రావడానికి నాకున్న అడ్డంకులు అన్ని తీసేసుకుని చదవడం మొదలు పెట్టాను. చాలా పుస్తకాలు నన్ను వెలిగించాయి. లోపల ఉన్న భావాల పరంపర నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ఏం రాయాలో తెలీదు, ఎలా రాయాలో తేలీదు మనసంతా అల్లకల్లోలం గా ఉన్న సముద్రం లాగా ఉండేది.ఆ సమయంలో కవిసంగమం అనే గ్రూప్ లో చేరాను. నేను చేరాను అనేదానికన్నా “మెర్సీ” నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది. అక్కడ అప్పటికే కవిత్వం రాస్తున్న చాలా మంది పెద్దకవుల కవిత్వం చదవడం కామెంట్ చేయడం వంటివి చేస్తున్న సమయంలో, కవి యాకుబ్  చదవడం కామెంట్ చేయడం మాత్రమే కాదు రాయడం కూడా చేయమ‌ని నిరంతరం పోరుతూ ఉండేవారు.ఆయ‌నకేం అలాగే అంటాడు మనకి రావాలి  కదా రాయడం అని నేనే దూరం జరిగేవాడిని.కానీ కవిత్వం నన్ను దగ్గరకి లాక్కుంది. తనని ఎలా రాయాలో నాకు కవిత్వమే నేర్పింది.ఏ మాట వెనక ఏమాట రాయాలో ఒక పొందికని నాకు నేర్పింది కవిత్వమే.చదవడానికి చాలా పుస్తకాలు చదివానుకాని నేను రాయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. చాలా అనుమానాల మధ్య ఏవేవో కొన్ని ప్రేమ కవితలు, విరహ కవితలు రాసేవాడిని, కామెంట్స్ లో ఆహా ఓహొ లు బానే వినపడేవి. కానీ లోపల మాత్రం నేను రాయవల్సింది ఇంకేదో ఉంది అని నా మనసాక్షి నాకు చెబుతూనే ఉండేది. కవిసంగమంలో నాతో పాటు ఉన్న నరేశ్కుమార్ సూఫీ, మెర్సీ, కాశిరాజు, నందకిషోర్ ఇలా అప్పటికి పేరు తెచ్చుకున్న యువకవుల కవిత్వం చదువుతూ నేను ఒక కవిత రాశాను 2014 లో అది ప్రజాశక్తి లో అచ్చయింది. ఆ తర్వాత ఏవేవో రాశాను నాకే గుర్తులేవు. కానీ కాలం కుదురుగా ఉండనివ్వదు కదా.

రోహిత్ వేముల మరణం నన్ను నన్నులా నిలబడనివ్వలేదు. సమస్య మూలాల్లోకి వెళ్ళడానికి నాకు దోహదం చేసిన ఘటన అది.ఆ సమయంలో రోజూ ఆ వార్తలు వింటూ నేనెంత సామాజిక వెనకబాటులో ఉన్నానో అర్ధం చేసుకునే వాడిని.అంబేడ్కరిజం గురించి, కుల నిర్మూలన గురించి, సామాజిక అంతరాల్లోఉండే లోతు పాతుల్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడానికి  నేను చదవాల్సిన పుస్తకాల జాబితా సవరించుకున్నాను. అప్పుడు దళిత వాదాన్ని పూర్తిగా అర్ధం చేసుకునే వీలు చిక్కింది. అంతకు ముందే పరిచయం ఉన్న  గుఱ్ఱం సీతారాములు శివసాగర్ బుక్ వేశాను చదువు అన్నప్పుడు పుస్తకం కొన్నాను కానీ చదవలేదు ఎప్పుడైతే రోహిత్ ఆత్మహత్య లేఖ చూశానో ఒక రకమైన భయం నన్ను ఆవహించింది. నేను ఎంత వెనుకబాటు తనాన్ని అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ నన్ను నిలబడనీయలేదు.శివసాగర్ ని పూర్తిగా చదివిన తర్వాత నేను మళ్ళీ ఒక జంక్షన్ లో నిలబడ్డాను. ఎన్నో కొత్త విషయాలు నన్ను ప్రపంచాన్ని కొత్త కోణం లోనుంచి చూసే ఆకాకాశాన్ని ఇచ్చాయి.ఉద్యమాలు, వ్యక్తులు, వారి మాటలు, ప్రాణాలని గడ్డిపోచతో సమానంగా భావించి అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, ఇంద్రవెల్లి ఘటన లాంటివి నన్ను మరింత లోతుకు తీసుకు వెళ్లాయి. అప్పుడు నేను రాసే కవిత్వం కాస్త నాకూ నచ్చడం మొదలైంది. 

మేం కొత్తగా రాస్తున్న వాళ్ళతో ఒక నలుగురిని సెలక్ట్ చేసుకుని ఖమ్మం కవి క్రాంతి . శ్రీనివాసరావు ఒక కవితా సంపుటి ని వెలువరించారు.” తీరం దాటిన నాలుగు కెరటాలు”పేరుతో ఒక సంకలనం తెచ్చాము. నేను నరేశ్కుమార్ సూఫీ, చైతన్య, వర్ణలేఖ.మేం నలుగురం మా తొలి నాటి కవితలు అన్ని అందులో వేశాం. అప్పటికి ఉన్న మిడిమిడి జ్ఞానం వలన, అందునా నలుగురం కలిసివేయడం వల్ల కాస్తంత జనం చూశారు, కానీ మా రచనాశైలి ని గురించి ఎవరూ అంతగా మాట్లాడలేదు సరికదా వెనుకగా నవ్వుకున్నారు కూడా. కానీ క్రాంతి గారు మాత్రం మా భవిష్యత్ మీద నమ్మకం ఉంచారు. మాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. 

ఆ తర్వాత లోకంతీరు ని అధ్యయనం చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా లోతైన విషయాల్లో అవగాహన మెల్లిగా పెరుగుతూ వచ్చింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే  క్లాస్ అంటరానితనం, పైకి నీతులు చెబుతూ వెనకాల మాత్రం ఫక్తు వ్యాపార లక్షణాలు కలిగివుండే వ్యక్తులు, మనతో స్నేహంగా ఉంటూనే మనల్ని మనలా ఉండనివ్వని స్నేహాలు. రాజ్యం ప్రజల మీద చేస్తున్న దమన కాండ, వ్యక్తుల్ని కులాలను బట్టి, మతాన్ని బట్టి, రంగుని బట్టి వేరు చేయడం .మార్కెట్ మనిషిని రోజూ తన మాయాజాలంతో ఆడించడం వంటివి మెల్లిగా అర్ధం కావడంతో నేను రాయవల్సిన విషయం నాకు అర్ధం ఐంది. మెల్లిగా ఎక్కడయితే సమస్య ఉందో ఏ సమస్య పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలో అవి మాత్రమే రాయడం మొదలు పెట్టాను.అలా రాస్తున్న క్రమంలో మనుషుల మధ్య దూరం పెరగడం కూడా గమనించాను.అది కూడా సరిచేయవల్సిన  అంశాల్లో ఒకటి అని భావించాను.

అలా రాస్తూ వెళ్లే క్రమంలో నేను చూసిన అంశాలని అన్నింటినీ నేను అనుభవించిన జీవితానికి ముడిపెట్టి రాస్తూ పోయాను.ఆక్రమంలోనే ” ఎనిమిదో రంగు” అనే నా మొదటి సంపుటాన్ని తీసుకు వచ్చాను. అది నన్ను సాహిత్యం యవనిక మీద నిలబెట్టింది అనుకుంటాను. స్పష్టమైన వస్తువు , దాన్ని నాకు తెల్సిన రూపంలో రాయడంతో, ప్రజలు,మిగతా కవులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. పెద్ద కవులు, మిత్రులు ఆ పుస్తకాన్ని చాలా బాగా సమీక్షించారు.ఇప్పటికి నన్ను చాలా మంది ఎనిమిదోరంగు కవిగానే గుర్తిస్తారు.నాకు అది ఇష్టం గానే ఉంటుంది. ప్రశంసలు ఎన్నొచ్చాయో విమర్శలు అన్నే వచ్చాయి. శైలి, నిర్మాణం బాగాలేదని, విషయాన్ని తిప్పి తిప్పి చెబుతానని, నిడివి మీద పట్టు ఉండదు అని ఇలా చాలా రకాల విమర్శలు వినిపించాయి.చాలా వాటిని అందులో నిజాయితగా వచ్చిన ప్రతీఒక్క విమర్శను స్వీకరించాను. కానీ నాకు తెలియని వస్తువు ఏది రాయలేదు నేను.నాకు అవగాహన ఉన్న అంశాల మీదనే నేను కవిత్వం రాసుకున్నాను. సమస్య అర్ధం అయి నీలో ఆ విషయం నాటుకుపోతే కవిత్వం నిన్ను నడిపించి ఆ సమస్య కవితగా మారేందుకు వీలు కల్పిస్తుంది అనే నమ్ముతాను.నా తొలి సంపుటి మొత్తం అదే సూత్రం మీద ఉంటుంది. భాగ్యనగరంలో జరిగిన అల్లర్లు, రోహిత్ మరణం, రంగు మీద వివక్ష, అలాగే వ్యక్తుల మధ్యలో సాంకేతిక పెంచిన దూరం, రాజకీయ ఫాసిజం ఇలా నన్ను కలవరపరిచిన ప్రతివిషయాన్ని కవిత్వం చేయాలని నా వంతు ప్రయత్నం చేశాను. 

ఆ తర్వాత రెండో సంపుటి “స్పెల్లింగ్ మిస్టేక్” అనే పేరుమీద తెచ్చాను. మన జీవితంలో మనం చేసే తప్పులు మాత్రమే  కాకుండా రాజ్యం చేసే తప్పులకి ప్రజలు బలిఅవుతున్నారు దాన్ని ఆలోచనా పరుడిగా నేను కవిత్వంలో దాన్ని చెప్పలేకపోతే ఎలా అనుకుంటాను.అందుకే స్పెల్లింగ్ మిస్టేక్ లో చాలా వస్తువులను మానవ సంభంధాల ప్రాతిపదికనే చూసాను. అలాగే ఈ దేశం లో ఎవరికి పట్టని ఒక వర్గం మధ్యతరగతి ప్రజలు. అమెరికాలో అంతర్యుద్ధం వచ్చినా ఇండియన్ ఎకానమీ పడిపోయినా సరే దాని ప్రభావం, దానికి బలయ్యేది ఖచ్చితంగా మధ్య తరగతి ప్రజలే. అందులో నేనూ ఒకడిని కాబట్టి దాన్ని నా వ్యక్తిగత సమస్య గా భావించి, అందులో నన్ను నేను చూసుకుంటూ చాలా కవిత్వం రాసుకున్నాను. ఒక హాస్పిటల్ జీవితం కావొచ్చు, నెలవారీ జీతాల సమస్య కావొచ్చు, పెట్టుబడిదారుల వ్యవస్థ కుమ్మక్కై సొమ్ముని ఎలా దోచుకుంటుంది చర్చించాను అనుకుంటాను.ఇలా నాకు అనుభవంలోకి వచ్చిన దాన్ని కవిత్వం చేశాను, చేస్తున్నాను. 

రాజ్యం గొంతు విప్పిన ప్రతీవారిని చట్టాలు చేసి మరీ జైళ్ళకి పంపుతుంటే మనం ఎలా మాట్లాడకుండా ఉండగలం. మన కళ్ళముందే ఒక్కొక్కరు చెరసాల నుంచి నిర్జీవంగా బయటకి వస్తుంటే మనం మౌనంగా ఉండడం క్షమించరాని నేరం అనుకుంటాను.ఫాసిజం తన భావజాలాన్ని మెల్లిగా ఇంజక్ట్ చేస్తూ దాని ముసుగులో ఆశీఫా లాంటి ఆడపిల్లల హత్యలు చేస్తూ వందకోట్ల మందిని మత పరంగా విడదీస్తుంటే మనం ఎలా చేతులు నలుపుకుంటూ కూర్చోవడం కూడా నేరమే కదా. నిన్నగాక మొన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామి మరణం చూశాం. ఇంకా 90 శాతం శరీరం సహకరించక పోయినా ఖైదు చేయబడ్డ సాయిబాబా , దాదాపు ఎనభైకి వయసు చేరువైనా చెక్కుచెదరని గుండె ధైర్యంతో ప్రభుత్వానికి ఎదురు నిలబడిన వరవరరావు లని కదా మనం ఆదర్శంగా తీసుకుని మన వాక్యాన్ని రాయాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. ఎప్పుడూ బాధిత పక్షమే నాది. 

నాన్న పుట్టిన ఊరు ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా సుంకేసుల గ్రామం. ఇప్పటికి అక్కడ నా రక్త సంబంధీకులు ఉన్నారు .అయితే ప్రకాశం జిల్లాలో నీటిపారుదల వసతి కోసం ప్రభుత్వం అక్కడ వెలిగొండ ప్రాజెక్ట్ కడుతుంది.ఆ ప్రాజెక్ట్ కనక పూర్తిఅయితే మొట్టమొదటి నీటి చుక్క పడేది మాఊరి మీదనే.ఇప్పటికే అక్కడ నష్టపరిహారాలు, పూర్తికాబడి, ఇల్లు కూల్చివేత మొదలయింది.దాదాపు వంద ఏళ్ల చరిత్రఉన్న ఆ ఊరు ఇప్పుడు నీటి కింద సమాధి కాబోతోంది. అలాంటి గ్రామం గూర్చి మాట్లాడకుండా ఎలా ఉండగలం. అందుకే కొండకింద ఊరు అనే కవిత రాశాను.రాసిన తర్వాత చాలా మంది మిత్రులు వాళ్ళ వాళ్ళ ఊర్లని మా ఊరితో పోల్చుకున్నారు. అలాగే ఆ ఊరిలోపల ఉండే సమస్యలతో ఊరిలోపల అనే కవిత రాశాను. అలాగే భాష మీద రాసిన కవిత “సందర్భం”. మాకు తెలుగు భాష కావాలి, దానితో పాటుగా ఇంగ్లిష్ భాష కావాలి అని రాశాను.ఎంతో మంది గ్రామీణ దళిత పిల్లలకి ఆంగ్ల భాషా నైపుణ్యం లేక వెనకబడితున్నారు.నాకు కూడా పరభాషా నాలెడ్జి లేదు.కాబట్టే దళిత బిడ్డలకి ఆ భాష అవసరం అని చెప్పాను.కానీ నేను తెలుగు వ్యతిరేకిని అనే ముద్ర వేయించుకున్నాను.పర్వాలేదు నాకు నా ప్రయోజనాల కన్నా సామాజిక ప్రయోజనాలు ముఖ్యం అనిపించింది.ఇప్పటికి అదే మాట మీద నిలబడి ఉన్నాను.ఉంటాను.

కవిత్వం రాస్తూ చదువుతూ అర్ధం చేసుకునే క్రమంలో యాకూబ్ గారు, మిత్రుడు శ్రీరామ్ వ్యాసాల రాత ప్రస్తావన తెచ్చారు. నిజానికి వ్యాసం చాలా కష్టమైన ప్రక్రియ. అయినా మిత్రుడు ఉన్నాడన్న ధైర్యం తో ముందుకు దిగాను. అదే కాకుండా హెచ్ఆర్కే రస్తా వెబ్ మ్యాగజైన్ లో కూడా కొన్ని వ్యాసాలు రాశాను. ఈ వ్యాస పరంపర నన్ను చాలా ప్రభావితం చేసింది.ఒక్కో కవితా సంపుటి ఒక్కో విధంగా ఉండేది వాటి మూలాలు, ఆ పదాలు, మెటఫర్ల వెనక ఉండే అర్ధాలు, తెలుసుకోవడం కోసం విమర్శనా గ్రంథాలు చదుతున్నాను, త్రిపురనేని మధుసూదన్ రావు, లక్ష్మీ నరసయ్య, వేల్చేరు వంటి వాళ్ళు రాసిన వాటిల్లోనుంచి కాస్త నేర్చుకుంటూ అభ్యుదయాన్ని చూపే వాటిని ఎన్నుకుని రాస్తున్నాను.ఇంకా ఆరంభం దశలోనే ఉన్నాను. 

నా ఈ ప్రయాణం లో ఎన్ని మజిలీలు ఉన్నాయో అంతమంది వ్యక్తుల ప్రమేయ ప్రభావాలు ఉన్నాయి. కవిసంగమం వేదిక మీద నా కవిత్వం కానీ కవిత్వాన్ని విని బాగుంది అని వెన్ను తట్టి, ఆయన జ్ఞాపకాలని పంచుకున్న వరవరరావు గారిని మర్చిపోలేను. మరోవ్యక్తి అరసవల్లి కృష్ణ అన్న విజయవాడ లో ఎన్నో వేదికల మీద ఆయన కవిత్వం విన్న అనుభూతి ,ఆయనతో కలసి ఎన్నో వేదికలు పంచుకున్నాసరే ఆయనముందు, ఆయన కవిత్వం ముందు మేం చిన్న పిల్లలమే, అలాగే నా కవిత్వాన్ని ముద్రించిన అన్ని పత్రికా సంపాదకులని మర్చిపోలేను ముఖ్యంగా సత్యాజి, శాంతి అక్క, రమాసుందరి గారు ఇలా లిస్ట్ పెద్దదే ఉంది. అలాగే నా సాహితీ ప్రయాణం లో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చి నన్ను నా దిశని నిర్దేశం చేసిన మా శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు, మా ప్రమీల గారు. నా భుజం మీద ఎప్పుడూ ఉండే చేయి మాధవరావు గారు. ఈమధ్య సభల్లో చూస్తున్నా నిన్ను ఇంకా కొంత మెరుగు పడాలి నువ్వు అంటూ కవితా విప్లవాల పుస్తకం కొనిచ్చిన ” పన్నాల సుబ్రమణ్యం భట్టు” గారు. ఏ చిన్న అనుమానం కలిగినా నా కాల్ ని స్వీకరించి అనుమానాలు నివృత్తి చేసే చినుకు రాజగోపాల్ గారు. నన్ను పుస్తకాల వైపు నడిపించిన నరేశ్కుమార్ సూఫీ, ప్రపంచంని మనకున్న జ్ఞానం తో ఎలా చూడాలో చెప్పే వేణుగోపాల్ జుజ్జురి ఇంకా తోటి కవులు. నేను రాసిన వాక్యాలు మెచ్చి అవార్డులు ఇచ్చిన ప్రతి ఇక్క సంస్థ ను గుర్తుపెట్టుకుంటాను. మొదటి పుస్తకం రాసి భయం భయం గా చూస్తున్న నన్ను ఆదరిస్తూ సమీక్షలు రాసిన మల్లీశ్వరి, బల్లోజు బాబా అన్న, నన్ను తమ్ముడికన్న ఎక్కువ ప్రేమించిన జగద్ధాత్రి . ఇంకా చాలామంది మిత్రుల ప్రస్తావన చేయవలసే  ఉంది. మిత్రుడు శ్రీరామ్ లేంది నేనెక్కడ..? నన్ను అమితంగా ఇష్టపడే నా తోటి దళిత కవులకు , అన్నలకి జైభీం లు.

చుండూరు సంఘటన జరిగినప్పుడు ఒక రోజున మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళగానే ఒక నలుగురు వ్యక్తులు ఒక డప్పు తీసుకుని పాడిన ఒక పాట ఇప్పటికి నాకు బాగాగుర్తు ఉంటుంది ” చిందింది రక్తం చుండూరు లోనాఆగస్ట్ ఆరు తొంభైఒకటిన” అంటూ వాళ్ళు పాడిన ఆ పాట తర్వాత నేను దాదాపు పాతికేళ్ళ తరవాత నేను దళిత క్రమాన్ని, దళిత జీవన స్థితి గతులని అర్ధం చేసుకునే క్రమంలో ఆపాట వెనక ఉన్న బాధ అర్ధం అయింది.దళిత నేపథ్యం లో ఏదైనా కాలానికి నిలబడే రచన చేయాలని ఆశ ఉంది. బాల్య సంఘటనలు అన్నిటినీ ఒకచోట కూర్చి చిన్న కథల సంపుటి గా తీసుకురావాలని అనుకుంటున్నాను. రాయడం కన్నా ఎక్కువ చదవడం మీద ఆసక్తి ఉంది. సాహిత్యాన్ని చదవడం అంటే మనం మనల్ని వ్యక్తిగతంగా ఆలోచనపరులుగా మార్చుకోవడం అని నమ్ముతాను. అరుణాంక్ లత, చైతన్య పింగళి, ఇండస్ మార్టిన్ లాంటి నవతరం దళిత సిద్ధాంతం కర్తల నుంచి ఇంకా రోజు రోజుకి కొత్త కొత్త కోణాలు, దళిత బహుజన వర్గాల కోసం పనిచేయవలసిన దారులు వాళ్ళ పని తీరుని చూసి నేర్చుకుంటున్నాను.

వసంతం మేఘం వెబ్ పేజీ కోసం నా నాలుగు మాటల్ని ఇలా పంచుకోవడానికి అవకాశం కల్పించిననందుకు ఎడిటర్‌కు మ‌నఃపూర్వ‌క‌ కృతజ్ఞతలు.

3 thoughts on “స్వగతం

Leave a Reply