అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. స్టూడియోలో అందరూ ఉత్కంఠతతో ఊపిరి బిగపట్టి ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. యాంకర్ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించాడు. స్టూడియో లో ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయు. యాంకర్ ఎదురుగా వున్న కుర్చీలో ఒక తెల్లని వెలుగు ప్రశాంతంగా కూర్చుని వుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ విధించకనే దేశంలోని విధులన్నీ నిర్మానుష్యం ఆయుపోయాయి.

“మొదట, ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడగడానికి నన్ను అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియదు” యాంకర్ మొదలుపెట్టాడు.

“మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అనేక ప్రార్ధనల తర్వాత మా ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చేందుకు మీరు ఒప్పుకున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. అన్ని పెద్ద వార్తా సంస్థలను గత కొద్ది రోజుల్లో మిమ్మల్ని సంప్రదించారు. కానీ మీరు మమ్మల్ని కరుణించినందుకు ధన్యవాదములు” యాంకర్ స్తుతింపు కొనసాగించాడు.

“మీరు అన్నీ మతాలకు, ప్రజలకు దేవుడు ఒక్కడే అని నమ్ముతారా ” గంభీరమైన స్వరం అటునుంచి వినిపించింది.

“నేను ఒక్కడినే. నేను అనంతమైన శక్తిని. నాకు మీరు కోట్ల పేర్లు పెట్టుకున్నారు”

“బైబిల్ గ్రంధం మీరు చెప్పినట్లే వ్రాయబడిందా ” యాంకర్ అలవాటుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోబోయు తమాయుంచుకున్నాడు.

“ప్రజలు గ్రంథాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. పాత, క్రొత్త నిబంధనలను కొంతమంది తమ సొంత అవసరాలకు తగినట్లుగా భారీగా సవరించారు. కొన్ని విషయాలు తప్పుగా వ్రాయబడ్డాయి. అన్ని మత గ్రంధాలు ఇదే విధంగా వ్రాయబడ్డాయి” 

“ఇదంతా దేవుడి క్షమించండి మీ సృష్టే అని అంటారా” యాంకర్ ప్రశ్నించడం ప్రారంభించాడు.

“అవును. నేను ఇప్పటికే ప్రజలకు దాని గురించి చెప్పాను. ప్రారంభంలో దేవుడు ఆకాశాలను, భూమిని సృష్టించాడు. కానీ, చాలా మంది స్వర్గం, నరకం, ముల్లోకాలు అని చెప్పారు. అక్కడే గందరగోళానికి తెర లేపారు. భూమి స్వర్గంలో ఉంది. ప్రజలు ఇప్పటికే స్వర్గంలో ఉన్నారు. వారు మొదటి నుండి ఉన్నారు. వ్యవస్థీకృత మతంతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పుగా రాసి ప్రచారం చేశారు. ఇది వారి స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. ప్రజలను నియంత్రించడానికి, వారి డబ్బును దొంగిలించడానికి మతాన్ని ఉపయోగించుకున్నారు. గ్రంథాలలో సంపద, ఆస్తులు ఒకరి జీవిత లక్ష్యం కాకూడదని స్పష్టంగా చెప్తారు. అయినా దేవాలయలు, చర్చిలు, మసీదులు తమ అనుచరుల నుండి పెద్ద మొత్తంలో సంపదను సేకరిస్తాయి”

“కాబట్టి, చర్చిని నమ్మలేమని మీరు చెబుతున్నారా?”

“చర్చే కాదు అన్ని మసీదులు, దేవాలయాలు పూర్తిగా అవినీతిమయమని నేను చెప్తున్నాను. వారు మత సంప్రదాయాలకు ఇచ్చిన విలువ, మానవత్వానికి ఇవ్వరు”

 “మీరు ఏ భాష మాట్లాడుతారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు”

“నేను రెండు భాషలను పూర్తిగా నేనే అభివృద్ధి చేసుకున్నాను. అవి సంస్కృతం, ఇంగ్లీష్. అన్ని భాషల మధ్య సారూప్యతలు ఉన్నాయి”

“ఆ రెండు భాషలూ రాని ప్రజల పరిస్థితి ఏంది “

“ప్రజలకు అర్థం చేసుకోవడం సులభమే. ఎందుకంటే భాషల చరిత్ర మూలాన్ని ప్రజలు నమ్ముతారు”

“ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది?”

“ఇది 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం అని సైన్స్ చెబుతుంది. కొంతమంది మత ప్రజలు 5000 నుండి 10000 సంవత్సరాల క్రితం అని పేర్కొన్నారు. నిజానికి పదార్దానికి ఆది, అంతం లేదు”

“అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడే ఏర్పడినట్టు అనిపిస్తుంది చాలా మందికి”

“దేవుడు శక్తివంతమైనవాడు అని ప్రజలు అర్థం చేసుకున్నారు. కనుక ఇది ఎలా సాధ్యమని అడగకండి? నేను దానిని మరింత వివరంగా వివరించగలను. కాని ఇక్కడ కుర్చునే ముందు మీరు మీ ప్రశ్నలతో ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించాలని మీరు చెప్పారు”

” అలాగే. ఆదాము అవ్వలతో సరిగ్గా ఏమి జరిగింది? ప్రజలు దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు” 

“ఆదాము అవ్వలు ఎప్పుడూ లేరు. ప్రజలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. రచయిత ఏమి వ్రాయాలో ప్రజలకు సూచించేటప్పుడు, నేను సమయం, స్థలం వెలుపల ఉన్నాను. నేను చేసిన మార్పుల వల్ల, నేను ఇచ్చే సూచనల ఫలితంగా ఏ మార్పులు వస్తాయో నేను చూడగలను. నేను ఆటమ్, ఎలక్ట్రాన్ గురించి పురాతన ప్రజలకు చెప్పాలని ప్రయత్నించాను. కాని ప్రజలు అర్ధం చేసుకోలేక పోయారు. అణువు ఆడమ్ గా, ఎలక్ట్రాన్ ఈవ్ గా, ఎలక్ట్రాన్ నెగటివ్ చార్జ్ ఆడమ్ నుండి పక్కటెముకగా మారిపోయింది”

“ఇది మైండ్ బ్లోయింగ్. కానీ, దీని గురించి మీకు తెలుసా? ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారా? మీరు దాన్ని ఎందుకు సరిదిద్దలేదు?” యాంకర్ ఆవేశానికి లోనయ్యాడు. యాంకర్ ముందర స్టూడియో లో కూర్చున్న ప్రతి ఒక్కరు అతనికి లోకువ గానే కనపడతారు.

“అవును నాకు తెలుసు. మరికొన్నింటిని ప్రజలకు సూచించడానికి నేను చాలా సార్లు ప్రయత్నించాను. నా మరింత విస్తృతంగా, అబద్ధంగా చేశారు. నేను దానిని ఆ విధంగా వదిలి ఇతర సమాచారాన్ని మరొక విధంగా వ్రాయాలని నిర్ణయించుకున్నాను”

“కానీ, గ్రంధాలలో స్త్రీలను మతం లోపల రెండవ తరగతి పౌరులుగా చూసే మూలాలు అనేకం వున్నాయు”

“లేదు. దీనికి మూలం మత పెద్దలే. క్రైస్తవ మతాన్ని ప్రారంభించాలనే మొత్తం ఆలోచన ప్రజలను ఉన్నత ప్రమాణాలకు ప్రవర్తించేలా చేయడం. లోపభూయిష్ట విషయాలతో సంబంధం లేకుండా చేయాలనే. మహిళల జీవితాన్ని మునుపటి కంటే మెరుగ్గా చేసే ప్రయత్నం జరిగింది. స్త్రీలు, పిల్లలను పురుషులందరూ నిరంతరం కొట్టి, అత్యాచారం చేస్తున్నారు. వారిని ఆస్తిగా భావించారు. చెత్త ముక్కలు మీకు అవసరం లేదని అనిపించినప్పుడల్లా మీరు విసిరివేయవచ్చు”

” యేసు, రాముడు కథల గురించి ఏమిటి? వాస్తవానికి వాళ్లు చరిత్రలో వున్నారా?

“ప్రజలను వ్యక్తిగతంగా మెరుగైన జీవన విధానానికి, అవగాహనకు మార్గనిర్దేశం చేయడానికి నేను వ్యక్తిగతంగా యేసు పేరుతో ఇక్కడకు వచ్చాను. మీరు చదివినట్లుగా, నేను ఎవరో కొంతమంది నమ్మకపోవడంతో నా స్థాయిని తగ్గించే ప్రయత్నం జరిగింది. ప్రధానంగా బైబిల్ గ్రంథాలతో గందరగోళంలో ఉన్న యూదు వర్గం నన్ను చంపడం ద్వారా మంచి కోసం నన్ను వదిలించుకోవచ్చని వారు భావించారు. రాముడు, కృష్ణుడు గాధలు అలాంటివే. అయితే నేను అనుకున్నది జరగలేదు”

“దేవుడు చనిపోయాడనే వాదనను నీట్చే చాలా ప్రచారం చేశాడు. దాని పై మీ అభిప్రాయం ఏమిటి”

“ఇది అర్ధంలేనిది. దేవుడు శాశ్వతమైనవాడు. అందువలన చనిపోలేడు. నీట్చే వాదన ఏమిటంటే, “దేవుడు” అనేది మానవులు సృష్టించిన కల్పన. ఈ విధంగా, దేవుడు ఉన్నాడని నమ్మడానికి సరైన కారణం లేనప్పుడు దేవుడు “చనిపోతాడు”.

“కమ్యూనిస్టులు, హేతువాదులని ఎలా అర్ధం చేసుకోవాలి” “ప్రజలను దోచుకోవడానికి దేవుని ఆలోచన సృష్టించబడిందని వారు నమ్ముతారు. యూదు-క్రైస్తవ దేవుడిని ముందుకు తెచ్చిన ప్రాచీన ఇజ్రాయులు భయంకరమైన పరిస్థితులలో నివసించారు. అనేక తరాలపాటు వారు బానిసలుగా, కొట్టబడి, చంపబడ్డారు. అటువంటి అపారమైన దుర్బలత్వం కింద, బాధలను వాళ్ళు అనుభవించారు. దీనికి బాద్యులు వారిని హింసించిన వారే. కాని దేవుడు కాదు” వెలుగు మాట్లాడింది.

“అంటే దేవుడు, మతం వల్ల ఉపయోగం లేదంటారా”

“దేవుని ఆలోచన ఆ పాత్రను పోషిస్తుంది. చీకటి ప్రపంచంలో కాంతిని అందించడానికి దేవుని ఆలోచన ఉద్భవించింది. పురాతన కాలం నుండి నేటి వరకు చాలా మంది భయంకరమైన విషాదాలు జరిగినప్పుడు దేవుని వైపు మొగ్గు చూపారు. ఉదాహరణకు తుఫానుల వచ్చినపుడు, బాంబు దాడి చేసిన నగరాల్లో చిక్కుకున్నప్పుడు, క్యాన్సర్‌తో, కరోనాతో బాధపడుతున్నప్పుడు, చాలామందికి, దేవునిపై నమ్మకం అటువంటి కష్టాలను భరించడానికి బలాన్ని అందిస్తుంది. దేవునిపై నమ్మకం మన ప్రియమైనవారు చనిపోయినప్పుడు మనం వారితో శాశ్వతంగా జీవించగలమనే ఆశను కూడా అందిస్తుంది. భగవంతునిపై నమ్మకం ఎటువంటి నష్టాన్నైనా భరించగలమని, అన్యాయం జరగదని నిర్ధారిస్తుంది. అందుకే మతం మత్తుమందు మాదిరి పనిచేస్తుంది.”

“దేవుణ్ణి నమ్మని వాళ్ళను మీరు శిక్షిస్తారా”

“దేవుణ్ణి విశ్వసించాల్సిన అవసరం లేదు. ఇంకొక ప్రపంచపు అస్తిత్వాన్ని ఆలింగనం చేసుకోవడం వల్ల బాధ తగ్గదు. మనల్ని మనం మంచిగా చేసుకోవడానికి బాధలను ఉపయోగించుకోవాలి. అర్ధవంతమైన జీవితం, వ్యక్తిగత నైపుణ్యాన్ని సాధించటానికి ఉపయోగ పడుతుంది. కష్టాలను ఎదుర్కోవడం ద్వారా గొప్పతనాన్ని సాధించాలి. ఈ ప్రపంచంలో నిజంగా అసాధారణమైనది ఏదీ శాంతి, సంతృప్తి నుండి రాలేదు. పోరాటాల ద్వారానే వచ్చింది”

“దేవునిపై నమ్మకం అభివృద్ధిని బంధిస్తుందని మేధావులు భావిస్తారు. ఇది నిజమేనా”

“సమానత్వం, సామాజిక క్రమానికి ప్రయోజనం చేకూరుస్తుంది. మధ్యస్థతను ఆహ్వానిస్తుంది. నిజమైన వ్యక్తిత్వాన్ని ఇస్తుందా? క్రైస్తవ సంప్రదాయం నిస్వార్థత, వినయం, బలహీనతను విలువైనదిగా భావిస్తుంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ అలాంటి విలువలను స్వీకరించాలని కోరుతున్నారు. దీని వల్ల ఖచ్చితంగా వ్యక్తులు అందరు అభివృద్ధి చెందరు. 

“అంటే దేవుణ్ణి నమ్మొద్దు అంటారా” యాంకర్ సీరియస్ గా అడిగాడు.

ఇంతలో స్టూడియో లో పెద్ద పేలుడు సంభవించింది. అక్కడున్న వాళ్లంతా హాహాకారాలు చేస్తూ వెంటనే స్టూడియో నుండి బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశారు.ఆ గది రక్తపు మడుగులతో నిండి పోయింది. ఎటు చూసినా చిందరవందరగా పడ్డ శవాలు. టీవీ యాంకర్ తో పాటు టెక్నీషియన్స్ 10 మంది చనిపోయారు. సుమారు 25 మందికి పైగా టీవీ సిబ్బంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశ ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంక మీడియా వార్తాకథనాలను పండించింది. ఇది మావోయిస్టులు లేదా ఉగ్రవాదుల పనే అని బలంగా విశ్వసించే కథనాల్ని ప్రజలకు వినిపించారు. దేవుని చంపే కుట్ర వాళ్ళ తప్పితే ఇంకెవ్వరు చేయలేరని వాళ్ళ బలమైన వాదన. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వచ్చింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి మీడియా ముందుకు వచ్చి దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.

” మనం కష్ట కాలంలో ఉన్నాం. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి అసాంఘిక శక్తులు ఈ చర్యలకు పాల్పడ్డాయి. దేశమంతా వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దేశ ప్రజలు ఎవ్వరు కూడా ఇళ్లను వదిలి వీధుల్లోకి రాకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అసాంఘిక శక్తులు ఏకంగా దేవుని చంపటానికి ప్రయత్నించాయి. అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. దీనిపై సమగ్ర దర్యాప్తును మేము ఆదేశించాము. కమిటీ నివేదిక వచ్చేంత వరకు అన్ని వర్గాల ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలి. ఇది దేశ సార్వభౌమత్వంపై దాడిగా భావిస్తున్నాము”.

అయితే ఈ దాడిలో దేవుడు చనిపోయాడా లేదా అనే ప్రకటన మాత్రం ఎవరూ చేయలేదు.

ఈ సంఘటన జరగటానికి సరిగ్గా రెండు వారాల ముందర. 

ప్రపంచంలోని అన్ని మతాలకు చెందిన మతాధికారులు అందరూ కూడా ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. ఒక మతాధిపతి లేచి గొంతు సవరించుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు.

” ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మతాధిపతులే. మత సామరస్యం కోసం, మత సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్న వారే. అయితే మతం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ఆధ్యాత్మిక వ్యాపార సామ్రాజ్యాన్ని పెద్దఎత్తున మనం విస్తరించాం. అందువల్ల సమాజం ముందర మనం చాలా సందర్భాల్లో దోషులుగా నిలబడవలసి వచ్చింది. ఒకప్పుడు పెట్టుబడిని మన గుప్పిట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు పెట్టుబడితో కలిసి మనం సమాజాభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేవునికి కూడా తప్పుగా అనిపిస్తుంది. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో డబ్బులు లేకుండా మనము ఎటువంటి మత కార్యకలాపాలను నిర్వహించలేము. ఈ విషయాన్ని దేవునికి అర్థం చేయించే ప్రయత్నం చేసి విఫలమయ్యం. అందుకే ఆయన మన ద్వారా కాకుండా వేరే మీడియా ద్వారా ఈ ప్రపంచానికి సందేశం ఇవ్వదలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలో ఒక నిర్ణయానికి వద్దాం”

మరో మతాధికారి లేచి నిలబడి” వచ్చినతన్ని దేవుడు కాదందాం” అన్నాడు.

అందరూ మల్లగుల్లాలు పడ్డారు. ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు. దేవుడు నిజం చెప్తే మత సామ్రాజ్యాలన్నీ కుప్పకూలి పోతాయి. సుదీర్ఘ చర్చల తర్వాత మెజారిటీ మతాధికారులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం అమలుకు ప్రపంచంలోనే ఎక్కువ మందిని కర్కశంగా చంపిన సి ఐ ఏ ను నియమించు కున్నారు.

Leave a Reply