1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు?

వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను పావుగా ఉపయోగించుకుంటోంది. ప్రజా సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి బృందాలుగా పని చేయడాన్నిఅపరాధంగా ముద్ర వేసి దర్యాప్తు సంస్థను ఉసిగొల్పుతోంది. ఈ దర్యాప్తు సంస్థ నిజంగా దర్యాప్తు చేస్తే ఈ ఒత్తిడి బృందాల నేరపూరిత చర్యలు ఏవీ తేలవు గనుక దర్యాప్తు మాని దాడులు చేస్తోంది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోతుంది.

అయితే ఈ సంస్థ ఏమి సాధిస్తోందంటే ప్రజా సంఘాల మెదళ్ళలో భయాన్ని, ఆందోళనను, దిగులును నింపాలనుకుంటోంది. ఎలాంటి నేర పూరిత చర్యలకు పాల్పడని నిజాయితీ, నిబద్దత, బాధ్యత కలిగిన వ్యక్తులను భయపెట్టి గొంతు నులిమి ప్రజలను దిక్సుచి లేని వారిగా చేయాలని తలపోస్తోంది. సమస్యలపై పోరాడితే తప్ప పరిష్కారాలు సాధించలేరని చైతన్యవంతులుగా చేయాలని సంకల్పించిన వారిని టార్లెటు చేసి సోదాలు, దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నారు. ఎన్‌ఐఎ రాజ్యాంగేతర శక్తిగా రూపొంది చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం – ఊపా కేసులన్నిటినీ గుత్తగా దర్యాప్తు చేస్తుంది. పాలకులపాలసీలను కొనియాడే వారిని, బిజెపి హిందూత్వ వాదాన్ని సమర్దించే వారిని ఎన్ని దౌర్దన్యాలకు, నేరాలకు పాల్పడినా వారిని రక్షిస్తూ అందలమెక్కిస్తూ సమాజంలో హింసను, అత్యాచారాలను, అరాచకత్వాన్ని పెంపొందిస్తున్నది. బిజెపి అనుసరిస్తున్న విధానాల వల్ల సమాజం నేరపూరితమవుతోంది. ప్రజల పక్షాన దృఢంగా నిలబడి రాజ్యాంగ హక్కుల సాధన కోసం పోరాడుతున్న వారి కృషిని నేరపూరితం చేస్తున్నది. గొంతెత్తి మాట్లాడితే, ప్రభుత్వ విధానాల అప్రజాస్వామిక పార్శ్వాన్ని ప్రశ్నిస్తే తీవ్రవాద ముద్ర వేస్తోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల, ప్రజల జీవన ప్రమాణాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుదల, ఆకలి, పేదరికం పెరుగుదల గురించి నిలదీస్తే యిది మార్క్సిస్టు గొంతు అని నిందలు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను, కార్పొరేట్‌ సంస్థల ఆస్తుల పెరుగుదలను, ఆర్థిక అసమానతలను ఎత్తి చూపితే, మావోయిస్టులంటున్నారు. జీవించే హక్కు గురించి, ఆర్టికల్‌ 21 గురించి, లాకప్ మరణాల గురించి, బూటకపు ఎన్‌కౌంటర్ల గురించి, (ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటాల్లోని ప్రజా స్వామిక ఆకాంక్షను గుర్తించమని ఒత్తిడి పెంచితే మావోయిస్టులతో సంబంధాలున్నాయని నేరారోపణ చేస్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్న దళిత, బహుజన, నిరుద్యోగ యువతీ యువకులను మావోయిస్టులుగా ప్రభుత్వం భావిస్తోంది. బిజెపి ప్రభుత్వానికి రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. దేశంలో ఒకే మతం వుండాలని, ఒకే రాజకీయ విశాసాలుండాని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీనికి భిన్నంగా వుండేవాళ్ళని, ప్రతిపక్ష పార్టీలను సైతం మావోయిస్టు సమర్ధకులని ముద్ర వేస్తోంది. ప్రగతిశీల మేధావులను, హేతుబద్ధ చైతన్యంతో మూఢ విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆధునిక సమాజ పురోగమనానికి ఆటంకంగా నిలుస్తాయని మాట్లాడేవారిని అర్బన్‌ నక్పలైట్టని ముద్ర వేస్తోంది. ప్రభుత్వ పాలసీలను సమర్దించని వాళ్ళను అయితే అర్బన్‌ నక్సలైట్లుగా కాకపోతే అడవి నక్సలైట్లుగా చిత్రీకరించి నిర్భంధాన్ని ప్రయోగిస్తోంది. భారతప్రజలందరు తమ సిద్దాంతాల్లో సంలీనం కావాలని, లేకపోతే చేతులు ముడుచుకుని, గొంతు కవాటాలను మూసుకొని నిస్తేజంగా పడి వుండాలని కోరుకుంటున్నది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్చను కాలరాస్తున్నది. కాని మానవుల్లో వేయి ఆలోచనలతో సంఘర్షిస్తేనే నూతన ఆధునిక సమాజాలు ఏర్పడ్డాయన్న స్పృహ పక్కకు పెట్టింది. శాస్త సాంకేతిక పురోగమనంలో మానవులకున్న ఈ స్పజనాత్మకత ఆలోచనలతోనే సాధ్యమయిందనే విషయాన్ని మరచిపోయింది. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ వైనాన్ని కళ్ళున్నాయి గనుక నిశితంగా పరిశీలిస్తున్నవారు, చైతన్యవంత సంస్థలలో క్రియాశీలకంగా కదులుతున్నవారు ప్రళ్నిస్తున్నారు. రాజ్యం వీరి ఆలోచనలను కట్టడి చేస్తూ బందీ చేస్తుంది.

2. మొన్న మార్చి 31న దాడులు జరగగానే చాలా మందికి భీమా కోరెగాం అరెస్టులకు ముందు దేశ వ్యాప్తంగా మేధావుల ఇండ్ల మీద దాడులు గుర్తుకు వచ్చాయి, మీరేమంటారు?

భీమాకొరేగాం యుద్దం బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి పీష్యాలకు మధ్య జరిగి 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 1, 2018న పూనెలో ఎల్గార్‌ పరిషత్‌ నిర్వహించిన సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న అభియోగంతో దేశంలో వున్న ప్రజాతంత్ర మేధావులను అరెస్టు చేసి జైల్లో నిర్భంధించడం చరిత్ర మరవని విషాదం. 

గత రెండున్నర సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక మంది మేధావులు జైలులోనే మగ్గిపోతున్నాను. రాజ్యాంగం కల్పించిన బెయిల్‌ పొందే హక్కు కూడా నిరాకరించబడింది. ఈ కేసుతోనే భారతదేశంలోని ప్రజా మేధావుల చరిత్ర మలుపులు తిరిగింది. వీరి యిళ్ళపై దాడులు చేసి, కంప్టూర్జు ల్యాప్‌టాపులు, హార్డ్‌ డిస్కులు యితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సాహిత్యం ఎత్తుకెళ్ళారు. విషాదమేమిటంటే జైల్లో వేశాక నేరపూరిత సాక్ష్యాధారాల కోసం దర్యాప్తు మొదలు పెడుతున్నారు. నిజానికి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాతంత్ర మేధావులను, హేతువాదులను టార్లెటు చేసి దాడులకు పూనుకుంది. రాజ్యాంగం ప్రకారంప్రభుత్వాలే ప్రజలకు క్రమాను గతంగా మూఢవిశ్వాసాలు త్యజించి శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించాలి. యింత వరకు ఏ ప్రభుత్వాలు ఆ పనిని చేపట్టలేదు. ఈ పని కొంతమంది మేధావులు తమ బాధ్యతగా భావించి ప్రయత్నం చేస్తుంటే సాంప్రదాయవాద బిజెపి తన భావజాల వ్యాప్తికి ముప్పుగా భావించి వారిని అంతం చేసేపనికి పూనుకున్నది. గారీ లంకేష్, పన్సారే, దబోల్కర్‌ లాంటి హేతువాదులను భౌతికంగా నిర్మూలించింది. ఆహారంపైనా, ఆహార్యంపైనా, చివరికి ఆలోచనల పైన దాడి చేస్తూ హత్యలకు తెరతీసింది. హిందూత్వ శ్రేణులురెచ్చిపోయి దాడులకు, హత్యలకు, అవమానాలకు పాల్పడినా వారిని ఉపేక్షిస్తోంది ప్రభుత్వం. హిందూత్వం పేరు మీద ప్రజలకు ఎంతహాని తలపెట్టినా సురక్షితంగా  ఉపేక్షిస్తుంది. ఎక్కడో మహారాష్త్రలోని మారుమూల గ్రామం అహిరిలో ఒక దొంగతనం జరిగితే అందులో ప్రొ. సాయిబాబా పాల్గొన్నాడని నేరం మోపి ఢిల్లీలో వున్న తన ఇంటిపై దాడి చేసి హార్డ్‌ డిస్కులు, ల్యాప్‌టాపులు, పెన్‌ డ్రైవ్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ ఎత్తుకుపోయి వాటిల్లో వాళ్ళకు కావాల్సినంత నేరపూరిత సమాచారం జొప్పించి సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధం అంటగట్టి జీవిత ఖైదు శిక్ష విధించారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో కేవలం ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ సాక్షాల మీద ఆధారపడి విధించిన మొట్టమొదటి కేసు యిదే కావడం విశేషం. ఈ విధంగా అనేక మంది మేధావుల యిళ్ళపై దాడికి ప్రభుత్వం ఎన్‌ఐఎను వుసిగొల్పింది. న్యాయస్టానాలు స్వతంత్రతను కోల్పోయి నిస్పక్షపాతికతను కోల్పోయి రాజకీయ వత్తిడులకు లొంగిపోయేంత బలహీనపడ్డాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో మేధావుల మీద,ప్రజాసంఘాల కార్యకర్తల ఇండ్ల మీద జరిగిన దాడిలో కూడా ఈ స్వభావమే ఉంది.

3. ఏపీలో నమోదైన రెండు అక్రమ కేసులకు, గత రెండేళ్ళుగా తెలంగాణలో అమలవుతున్న కేసులు, అరెస్టులకు పోలిక ఏదైనా ఉందా?

నిర్భంధం అమలు పర్చడానికి ప్రాంతీయ బేధాలుండవు. ఎక్కడైనా రాజ్యమే రాజ్యమేలుతుంది. రాజ్యానికి ఎక్కడ వున్నా ఒకే స్వభావముంటుంది. అది అణిచివేత ప్రాంతాల వారిగా పరిశీలిస్తే అమలుతీరు కొంత ముందూ వెనక మాత్రమే. తెలంగాణ ముఖ్యమంత్రికి ఉద్యమ చరిత్ర వుంది. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి కేంద్రంతో కొట్లాడిండు. ఈ క్రమంలో ముఖ్యంగా పౌరహక్కుల సంఘంతో అనేక యితర సంఘాలు, సంస్థలు, పార్టీలతో జతకట్టి పోరాడాడనేది కాదనలేని సత్యం. ఆ వరవడిలో తాను ఎన్నికల్లో గెలిస్తే నక్సలైట్ల ఎజెండా అమలు పరుస్తానన్నాడు. చాలా కాలంగా పౌరహక్కుల సంఘంతో సహచర్యం చేసిన ప్రభావంతో కెసిఆర్‌ పౌరహక్కుల కార్యకర్తగా పనిచేయడం అన్ని సాంప్రదాయ పదవులకన్నా మిన్న అని ప్రకటించాడు. తెలంగాణ ఏర్పడితే హక్కులను కంటికి రెప్పలాగ కాపాడుకుంటానన్నాడు. అంతేకాని ఏ పదవిలోనూ కూరుకుపోనన్నాడు.

అయితే తెలంగాణ ఏర్పడి ఎన్నికల్లో తన పార్టీ గెలిచాక ఆయన తన ఆలోచనలు మార్చుకున్నాడు. తానే ముఖ్యమంత్రి అయ్యాడు. పాత నిర్బంధ పద్దతులను మించిన నిర్భంధాన్ని అమలుపరచడం మొదలు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎన్‌కౌంటర్ల పర్వానికి నాంది పలికాడు. మావోయిస్టు పార్టీనాయకులు శృతి, సాగర్‌లను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపింది తెలంగాణ ప్రభుత్వం. యిట్లా మొదలై 25 మందిని ఎన్‌కౌంటర్లలో, 10 మందిని లాకప్పుల్లో హత్య చేశారు. కనీవినీ ఎరుగని రూపాల్లో తెలంగాణలో ఇప్పుడు నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజా సంఘాలను నిషేధిస్తున్నట్టు సంవత్సరం కింద ప్రకటించి సాధ్యం కాకపోవడంతో ప్రజా సంఘాలను మరో పద్దతిలో దెబ్బతీయడానికి బాధ్యులపై అక్రమ కేసులు, ఊపా కేసులు బనాయించి జైల్లో నిర్భంధిస్తున్నారు. ప్రజా సంఘాల నాయకుల్లో ఒక్కొక్కరిపై పదుల కేసులు నమోదు చేసి అరెస్టుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికి రాష్ట్రంలో 30 మందిని జైలుపాలు చేశారు. వృత్తులను, భవిష్యత్తును విచ్చిన్నం చేస్తున్నారు. ఆంధ్రలో ఈ పరిస్థితి తేవద్దని జగన్‌కు సూచించాం. కానీ ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్‌ పద్దతిలో అనేక మందిని జైల్లో నిర్భంధించాడు. మరో 30 మంది పై కేసులు మోపి అరెస్టు చేయడానికి సిద్దంగా వున్నాడు. రాజ్యాంగం ప్రజలు నిరసన తెలిపే హక్కు, ప్రజా స్వామ్యపద్ధతిలో పోరాడే హక్కు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు గ్యారంటీ చేయబడింది. ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా పాలన సాగించడం లేదనడానికి యిది తిరుగులేని నిదర్శనం.

4. ఇంతకూ రాజ్యాంగపరంగా ఎన్‌ఐఏ పరిది, ప్రతిపత్తి మాటేమిటి?

26 నవంబర్‌ 2008లో బొంబాయిలో జరిగిన టెర్రరిస్టుల దాడి లాంటి ఘటనలను నిలవరించడానికి పటిష్టమైన ప్రత్యేక సంస్థ కావాలని 31 డిసెంబర్‌ 2008 న జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం పార్లమెంటు ఆమోదించడంతో ఎన్‌ఐఎ ఉనికిలోకి వచ్చింది. అంటే ఉగ్రవాద దాడుల కేసులతో వ్యవహరించాల్సిన ఎన్‌ఐఎ సాధారణ హక్కుల కార్యకర్తలపై ప్రజలు, విద్యార్తులు, యువకులపై విరుచుపడుతూ వారి భవిష్యత్తు జీవితాన్ని ఛిద్రం చేస్తున్నది. ప్రధానంగా ప్రత్యామ్నాయ ప్రగతిశీల ఆలోచనల మీద, వ్యక్తి స్వేచ్చ మీద దాడి చేస్తున్నది. పథకం ప్రకారం అమలు పరిచే సామూహిక టెర్రరిస్టు చర్యలను నిలవరించడం ఎన్‌ఐఎ ‘ప్రాథమిక చట్రం. అది ఎదిగి వచ్చిన నేపథ్యంలో దాని పరిధి పక్కకు పెట్టి వ్యక్తి ప్రజాహిత చర్యలపై విరుచుకుపడుతున్నది. దేశ భద్రత, సమగ్రతా కాపాడాల్సిన ప్రధాన బాధ్యతకు మాత్రమే పరిమితమై వుండకుండా సాధారణ వ్యక్తులపై పంజా విసురుతున్నది. ఎన్‌ఐఎ ఆచరణలో రాజ్యాంగ స్పూర్తికి, విలువలకు వ్యతిరేకంగా తయారైంది. ప్రజా స్వామిక వ్యవస్టలో యిలాంటి సంస్థఒకటున్నదని ప్రజలు దడుసుకొనే పరిస్థితి ఏర్పడింది. దీంతో నేరాల వైవిధ్య చట్రాన్ని ఛేదించడానికి అమలులో వున్న సాధారణ చట్టాలు సరిపోతాయని ప్రజలు భావిస్తున్నారు.

5. దేశవ్యాప్తంగా భిన్న భావజాలాలుగల వాళ్ళ మీద యుఎపిఎ కేసులు నమోదవుతున్నాయి? ఈ దశలో రాజ్యనిర్చంధాన్ని ఎలా చూడవచ్చు?

ఊపా చట్టానికి కాని, ఈ చట్టం కింద నమోదైన కేసులను దర్యాప్తు చేసే దర్యాప్తు సంస్థకు గాని రాజ్యాంగ విలువలను పెంపొందించే స్వభావం లేదు. ఊపా క్రూరమైన చట్టమని, వ్యక్తి స్వేచ్చకు భంగకరమని, ఊపా రద్దు కమిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసి ఊపా రద్దుకై పోరాడుతున్నారు. ఈ పోరాటానికి నాయకత్వం వహించే వారిపై దాడులు చేసి అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ చట్టం క్రింద దేశ వ్యాప్తంగా దాదాపుగా 5200 మందిని నిర్బంధించారు. టెర్రరిస్టు కార్యకలాపాలను అరికట్టడం కోసం రూపొందించిన ఈ చట్టం కింద మగ్గిపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే. కనుక ఈ చట్టం పాలకుల చేతిలో దుర్వినియోగమవుతున్నది. గతంలో టాడా, పోటాకువ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి వాటిని రద్దు చేసింది. మళ్ళీ కొంత కాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ రెండు చట్టాలను మించిన భయంకరమైన ఊపాను ప్రజల మీద రుద్దింది. ప్రజలు మరింత ఐక్యమై ఈ చట్టాలు రద్దు చేసేంత వరకు మరోసారి పోరాడాలి. ఊపాను వ్యతిరేకించడమంటే హింసను సమర్దించడమేనని బిజెపి అపవాదు వేసినా భయపడవలసిన పని లేదు. స్వభావ రీత్యా బిజెపి ఆధిపత్య వర్గాల పార్టీ కనుక బెదిరింపులు దబాయింపులే అధికంగా ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. అన్యాయమైన చట్టాలను వ్యతిరేకించడమంటే హింసను, నేరాలను సమర్దించడమని ఆరోపిస్తే కుదరదు. న్యాయాన్యాయాలవిచక్షణ కోల్పోయి తీసుకొచ్చిన చట్టాలు ఆధునిక మానవ మనుగడకు ముప్పు. పెరుగుతున్న నాగరికత, సంస్కృతికి ఉపా తీరని ద్రోహం తలపెడుతున్నది. రాజకీయ మిలిటెన్సీ వెనుక లోతైన సామాజిక, రాజకీయ కారణాలుంటాయి. ఈ కారణాలను శాప్రీయంగా పరిశోధించి పరిష్కరించే ఓపిక, సంసిద్ధత లేని ప్రభుత్వాలు వాటిని క్రూరమైన చట్టాలతో అణచివేయాలని చూస్తాయి.  

6. యుఎపిఎ తర్వాత పౌర హక్కుల ఉద్యమ కర్తవ్యాల్లో పనితీరులో ఏమైనా మార్పు రావలసి ఉందని అనిపిస్తున్నదా?

హక్కుల ఉద్యమం కార్యక్షేత్రం తరచుగా ఒడుదుడుకులకు గురవుతూనే ఉన్నది. చీకటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటం హక్కుల ఉద్యమంలో అంతర్భాగం. భారత శిక్షాస్మృతుల్లో అదనంగా ఏది వచ్చి చేరినా అది అప్రజాస్వామికంగానే వుంటోంది. 1985లో పాలకులు టెర్రిస్టు, విచ్చన్న కార్యకలాపాల (నిరోధక) చట్టాన్ని (టాడా)ను తెచ్చారు. ఇది క్రూరత్వంలో రౌలట్‌ చట్టాన్ని మించింది. కనుక హక్కుల ఉద్యమం చట్టం కుదుపులకు గురైంది. ప్రజలు కృతనిశ్చయంతో పోరాడటంతో ప్రభుత్వం చివరికి 1995లో దాన్ని రద్దు చేసింది. అయితే టెర్రరిస్టు చట్టం లేకుండా నిద్రపట్టడం కష్టమైంది మన పాలకులకు. కఠినమైన చట్టాలు లేకుంటే దేశం ఏమై పోతుందోననికలవరపడ్డారు. వెంటనే మళ్ళీ 2002లో ఉగ్రవాద వ్యతిరేక చట్టం(పోటా)ను తీసుకొచ్చారు. మళ్ళీ హక్కుల ఉద్యమం కార్యక్షేత్రాన్ని సవరించుకోవాల్సి వచ్చింది. చట్టం ద్వారా తీవ్రవాదాన్ని రూపుమాపడం అటుంచితే పోలీసులు ఈ చట్టాన్ని విచ్చల విడిగా దుర్వినియోగం చేశారు. తమిళనాడులో ‘వైగో’ను పోటా కింద అరెస్టు చేశారు. నక్సలైట్లకు కొరియర్‌గా పనిచేసాడని ఒక పన్నెండేళ్ళ బాలుడిని పోటా కింద అరెస్టు చేసింది జార్ధండ్‌ ప్రభుత్వం. ప్రజలు ఆందోళనకు దిగడంతో దిగివచ్చిన ప్రభుత్వం 2004లో ఈ పోటాను రద్దు చేసింది. ప్రజల హక్కుల కోసం పనిచేయాల్సిన హక్కుల ఉద్యమం యిలా చీకటి చట్టాలకు వ్యతిరేకంగా కార్యాచరణ మార్చుకోవాల్సి వచ్చింది. యిపుడు మళ్ళీ 2019 నుండి ఊపాకు వ్యతిరేకంగా పౌరహక్కుల ఉద్యమం పోరాడుతున్నది. ప్రజలు మరింత పెద్ద ఎత్తున హక్కుల ఉద్యమాన్ని బలపర్బాల్సి వుంది.

7. హిందూత్వ ఫాసిజం పెచ్చరిల్లాక పెరిగిన రాజ్య నిర్బంధానికి – అంతకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత విధానాలకు ఏదైనా తేడా ఉందా? దేని వల్ల?

‘ప్రజా స్వామిక ఉద్యమాలు యిపుడు బీతావహమైన నిర్భంధాన్ని ఎదుర్కొంటున్నాయి. కారణం మతోన్మాదమే అధికారం అయింది. మతం అధికారంగా మారినప్పుడు రాజ్యాంగానికి అవకాశం సన్నగిల్లుతుంది. అందుకని ఇపుడు రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్నాయి, మతోన్మాద భావజాలానికి రాజ్యాంగ పరిరక్షణ పోరు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు సర్వత్రా హక్కులు కోల్పోతున్నారు. చివరికి రాజ్యాంగ హక్కైన బెయిలును నిరాకరించారు. యిది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం.


8. గత టాడా – పోటాల కంటే యుఎపిఎ అణచివేత స్వభావంలో తేడాను ఎలా వివరిస్తారు?

చీకటి చట్టాలన్నీ హింసాత్మకమైన చట్టాలే. యివి మైండుతో గేమ్‌ ఆడతాయి. తాత్కాలికంగానైనా మెదడులో భయాందోళనలను నింపుతాయి. కాని పోరాడే ప్రజలకు వాటికి గురికావడం, మళ్ళీ తేరుకోవడం, మళ్ళీ పోరాటానికి సంసిద్ధం కావటం చూస్తాం. చరిత్రలో రౌలత్‌ చట్టం దగ్గర నుండి ఇదే జరుగుతోంది. గతంలో టాడా చట్టం మనిషి మనసులోకి తొంగి చూసి నేర ఆనవాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. పాలకులకు నచ్చని రాజకీయాభిప్రాయాన్ని కలిగి వుండడాన్ని ఆచరించడాన్ని టాడా చట్టం నేరంగా చేసింది. ఒక చర్య చట్ట విరుద్దం కాకపోయినా, లేదా సాధారణ చట్టాలతో సమసిపోయేదయినా అదే చర్య “టెర్రరిస్టు” లేదా “విచ్చిన్నకర” ఉద్దేశంతో చేశాడని పోలీసులు ఆరోపిస్తే అది చట్ట విరుద్దం అవుతుంది. “టెర్రరిస్టు” లేదా “విచ్చిన్నకర” ఉద్దేశం అంటే ఏలికలకూ, వ్యవస్తకూ వ్యతిరేకంగా పనిచేయడమే. మరో మాటలో చెప్పాలంటే నిర్దిష్టమైన రాజకీయాభిప్రాయాలను కలిగి వుండి వాటిని ఆచరించడం కూడా టాడా కింద చట్ట విరుద్దం. రాజకీయాలను నేరం చేయడమంటే యిదే.

తర్వాత వచ్చిన మరో చట్టం పోటా – “సహకరించడం”లోకి కన్నేసి చూపింది. నిషిద్ద సంస్థలకూ, టెర్రరిస్టు సంస్థలకూ వాటి లక్ష్యాలకూ ఏ రకంగానైనా సహకరించినా, మద్దతునిచ్చినా, మదతు కోసం ఆహ్వానించినా, వాటి కార్యకలాపాలకు అవకాశం కల్పించినా, ప్రోత్సహించినట్టు దాని కంటికి కనపడితే చట్టం కఠినంగా శిక్షిస్తుంది. అయితే ఆ రాజకీయ సంస్థలకు, వాటి లక్ష్యాలకు మద్దతు యివ్వడం, సహకరించడం, ‘ప్రోత్సహించడం అనేవి అస్పష్టమైన మాటలు. ఒక హింసాత్మక చర్యను ప్రోత్సహించడం ‘నేరమంటే అర్ధముంది గానీ హింసాత్మక చర్యలకు పాల్పడే రాజకీయ సంస్థల లక్ష్యాలకు మదతు యివ్వటం, సహకరించడం జీవిత ఖైదు విధించగల నేరం అంటే రాజకీయ భావాలను శిక్షించడం కాదా? హింసకు, రాజకీయాలకు తేడా చూసేంత సున్నిత దృక్పథం మన న్యాయ వ్యవస్టకు వుందా? పోలీసు వ్యవస్థకు అసలే లేదు. అందుకే ప్రజలు పోటాను కూడా తిప్పికొట్టారు.

యిక ప్రస్తుతం అమలులో వున్న ఊపా గత రెండు చట్టాల కంటే పటిష్టమైన పొందిక. ఒక్కొక్కటి విడిగా కాఠిన్యమని ప్రజలు పోరాడి వెనక్కి పంపితే రెండింటిలోని కాఠిన్యం పకడ్బందీగా సంతరించుకుని ఊపా ముందుకు వచ్చింది. దీన్ని ఎదుర్కొనడానికి ప్రజలు మరింత దృఢసంకల్పంతో కదలాలి. 

ప్రధాని మోదీకి స్వభావ రీత్యా అలాంటి ఆయుధం కావాల్సిన అవసరం వచ్చింది “చట్ట వ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టం 1967కు 2019లో సవరణ చేసి ఊపా తీసుకొచ్చాడు. ఈ చట్టం వ్యక్తి చుట్టూ తిరుగుతూ తనకు రాజకీయంగా నచ్చని వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించే నిబంధన చేర్చి సవరణ చేయడం దీని ప్రత్యేకత. దీనికి ముందు కేవలం సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించే వీలుండేది. ఉగ్రవాద కార్యకలాపాలను సంస్థలు చేయవు. వాటి వెనక వున్న మనుషులు చేస్తారన్నాడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. 2019 ఆగస్టు 2నచట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక బిల్టు చట్టం రూపొందింది. ఊపాలోని సెక్షన్‌ 35, 36 ప్రకారం ఎలాంటి మార్గ దర్శకాలు, నిర్దేశించిన విధానం లేకుండా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించవచ్చును. మన న్యాయవ్యవస్టలో ఒక నిందితుడు దోషిగా నిరూపణ అయ్యే వరకు నిర్జోషి కిందే లెక్క. కాని ఇక్కడ విచారణకు ముందే ఉగ్రవాదిగా ముద్ర వేస్తారు. యిది ప్రభుత్వం, న్యాయవ్యవస్థకు మధ్య స్వతంత్రకు, అస్టిత్వానికి, నిష్పాక్షికతకు సంబంధించిన అంశం. ఈ విషయంలో రెండు వ్యవస్థలు ఒకటిగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను సమర్దవంతంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. నిజమే కాని భారత శిక్షాస్మృతి (ఐపిసి) వీటిని అడ్డుకోవడంలో అంత బలహీనంగా వుందా?

9. స్వాతంత్రానంతరం ప్రభుత్వాలు తెచ్చిన అప్రజాస్వామిక చట్టాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి ఏదైనా రాజకీయ ఆర్దిక నేపథ్యం వుందా?

అప్రజాస్వామిక చట్టాలు వెలుగు చూడటం వెనుక ఉన్నదంతా రాజకీయ వ్యతిరేకతే. తను నచ్చని రాజకీయ విశ్వాసాలను కలిగి ఉండటం, ఆచరించడమే నేరంగా భావించబడుతున్నది. అక్షరాలు నేర్చుకున్న దళిత బహుజనులు ఆత్మ గౌరవంతో అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అణచివేత, నిర్భంధం, హింస, అవమానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు దిగే స్టాయికి చేరుకున్నారు. రాజ్యాంగం ఆ మేరకు శాంతి యుతంగా ఉద్యమించే హక్కును ప్రసాదించింది. అందుకే కొంత మంది బిజెపి నాయకులు “ఒకప్పుడుమన బూట్లు పాలిష్‌ చేసినోళ్ళు, బానిసలుగా పడివున్నోళ్ళు, యిపుడు మనల్నే ధిక్కరించడానికి కారణం రాజ్యాంగం” అని రాజ్యాంగాన్ని నిందిస్తున్నాను. వారిని అణిచి పెట్టడానికి పాలకులకిపుడు పాశవిక చట్టాలు కావాలి. అవి లేకుంటే తమకు శాంతియుతమైన మనుగడే లేదనుకుంటున్నారు. దేశ సంపదను ఏ కొద్ది మంది చేతిలో దోచిపెట్టే ప్రక్రియ సజావుగా సాగటానికి ఈ కఠిన చట్టాలు పాలకులకు అవసరం ఉంది మరి. ఈ పరిణామం మన దేశంలోని దశాబ్దాల రాజకీయార్థిక నేపధ్యంలో జరిగిందే. 

10. హక్కుల ఉల్లంఘనకు, రాజకీయార్దిక వ్యవస్థలోని మార్పులకు ఉన్న సంబంధాన్ని పౌర హక్కులఉద్యమం ఎలా విశ్రేషిస్తోంది ? 

మన రాజ్యాంగ నిర్దేశం ప్రకారం (ప్రభుత్వాలు ప్రజల్లో మూఢ విశ్వాసాలను తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. మద్యపాన నిషేదాన్ని అమలు పర్చాలి. నిర్బంధ ఉచిత విద్యనందించాలి. ఆత్మ గౌరవంతో బతకడానికి కావాల్సిన ఆదాయ వనరులను కల్పించాలి. వ్యక్తి స్వేచ్చ స్వాతంత్రాలకు భంగం కలగకుండా కాపాడాలి. తమకు నచ్చిన మతం, రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండే వాతావరణాన్ని నిలబెట్టాలి.

ముఖ్యంగా దేశ ఆర్థిక సంపద ఏ కొద్ది మంది చేతిలో కేంద్రీకృతమై అసమానతలు తలెత్తుకూడదని రాజ్యాంగం చెబుతోంది. ప్రభుత్వాలు సరిగ్గా ఈ లక్ష్యాలకు భిన్నంగా పని చేస్తున్నాయి. కాబట్టి ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. ఒక్క శాతం మందిలో 90 శాతం భారత దేశ సంపద పోగయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు రాజ్యాంగ ఉల్లంఘనకు, హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ వర్గాల ప్రజలైతే హక్కులు కోల్పోతారో, నిర్లక్ష్యానికి గురౌతారో వాళ్ళ పక్షాన నిలబడుతుంది హక్కుల ఉద్యమం. ఏ వర్గానికైతే యంత్రాంగం హక్కులను కల్పిస్తుందో వారికి హక్కుల ఉద్యమంతో పనిలేదు. ఈ సున్నిత రేఖ అర్థం చేసుకోవడానికి ఇష్టపడని కొన్ని వర్గాల వారు ఉద్దేశపూర్వకంగా హక్కుల ఉద్యమాన్ని విమర్శిస్తుంటారు. హక్కుల ఉద్యమానికి, ఆర్థికంగా, సామాజికంగా అట్లడుగుకు తోసి వేయబడ్డ వర్గాలకు దగ్గర సంబంధం వుంటుంది. ఈ వర్గాల ప్రజలే పౌర ప్రజా స్వామిక హక్కులకు, రాజ్యాంగ హక్కులకో అందనంత దూరం విసిరి వేయబడ్డారు. కనుక సహజంగానే హక్కుల ఉద్యమం వారి పక్షాన గొంతిచ్చి నిలబడాల్సిన అవసరం ఏర్పడుతుంది.

Leave a Reply