ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా ఇవి. బీజేపీ మత రాజకీయాల మీద  వ్యతిరేక వాతావరణంలో అయినా అధికారంలోకి రాకపోతే ఇక ఆ తర్వాత  అవకాశమే ఉండదని ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. 

బీజేపీ తన గెలుపు అవకాశాలను గరిష్టంగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల రాజకీయాల్లో ఈ ఎత్తుగడను అందరూ అనుసరిస్తారు. అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించాక ఆ పార్టీ నాయకులు టార్గెట్‌ 400 అని ప్రచారం మొదలుపెట్టింది. 400 స్థానాలలో విజయం సాధిస్తే తమకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. రాజ్యాంగంలోని లౌకికవాదం అనే మాటను తీసేస్తామని అంటున్నారు. వాళ్లకు సెక్యులరిజం అంటే కుహనా సెక్యులరిజం. హిందుత్వ మాత్రమే నిజం. కాబట్టి హిందూ దేశంగా మార్చడానికి రాజ్యాంగంలోనే మార్పులు తెస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ఈ ఎన్నికలలో గెలుపు కోసం పనిచేయాలని హిందుత్వ శక్తులకు బీజేపీ నాయకులు దిశానిర్దేశం చేశారు. దీనికి అవసరమయిన పునాదిని పదేళ్లుగా అన్ని  వైపులా నుండి ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు దాన్ని మరింత వేగం చేస్తున్నారు.

అధికారంలోకి రావడానికి అన్ని ఓట్ల పార్టీలు ఎన్నికల్లో అనేక ఎత్తుగడలు అనుసరిస్తాయి. గెలుపే లక్ష్యంగా అవి ఉంటాయి. కానీ బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత వరకే పరిమితమయ్యేవి కావు. దీర్ఘకాలికంగా మన సమాజాన్ని, రాజకీయాలను, ప్రజల మనసులను, విలువలను ప్రభావితం చేయగల స్థాయిలో ఎన్నికల ఎత్తుగడలు అనుసరించడం బీజేపీకి మాత్రమే చెల్లు. ఫాసిజం ప్రమాదం అంత తీవ్రమైనది.  

ఉదాహరణకు ఫిబ్రవరి 13, 2024 న  కర్నూలుకు వచ్చిన మోహన్‌ భాగవత్‌ సంఫ్‌ు కార్యకర్తలను ఉద్దేశిస్తూ ‘‘సంఫ్‌ు ఇప్పుడు అనేక రంగాలలోకి విస్తరించింది. రాజకీయ క్షేత్రంలోకి ప్రవేశించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. రామజన్మ భూమి ఉద్యమాన్ని నడిపి విజయం సాధించడం జనవరి 22, 2024 అందరం చూశాం’’ అని మాట్లాడాడు. ఇందులో సాంస్కృతిక, భావజాల వ్యూహం ఉన్నప్పటికీ వాళ్ల రాజకీయ వ్యూహం ప్రధానం. గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమేం చేసిందీ ఆయన చెప్పాడు. రాబోయే ఎన్నికల్లో కూడా అలాంటిది చేయడానికి వాళ్లు సిద్ధం. 2019లో పక్కనపడిన సీఏఏను ఇప్పుడు తీసుకరావడం అట్లాంటిదే. ఈ ఎన్నికల్లో విజయం తర్వాత రామ మందిరంలాగే సీఏఏను, ఉమ్మడి పౌరస్మృతిని కలిపి గొప్ప విజయంగా వాళ్లు చెప్పుకుంటారు. 

ఈ రాజకీయ అధికారం దేనికో సంఫ్‌ుపరివార్‌కు బాగా తెలుసు.  వచ్చే ఏడాదికి సంఫ్‌ు ఏర్పడి వందేళ్ల కాబోతుంది. గతంలో అధికారంలోకి వచ్చినప్పటి కంటే ఇప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అది ఏర్పడ్డ వందేళ్ళకు దేశంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా అది మారింది. అది సారంలో ఫాసిస్టుగా మారింది. అందుకు భావజాల రంగంతో పాటు రాజకీయ రంగంలో స్థిరపడటానికి కార్పొరేట్‌ శక్తులు దానికి ఉపయోగపడ్డాయి.  గత కొన్నేళ్లుగా సంఫ్‌ు నాయకులు తమ  కార్యకర్తలకు హిందూ రాష్ట్ర సాధన దిశగా పనిచేయాలని చెబుతున్నారు. సంఫ్‌ు ఏర్పడినప్పుడు ప్రకటించుకున్న లక్ష్యం ఇప్పుడు నెరవేరబోతుందని వాళ్ళు చెబుతున్నారు. అది నెరవేర్చడానికి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో అధికారంలో కొనసాగడానికి ఈ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు.  ఈ పదేళ్లలో అది రాజకీయాధికారం వల్ల   అన్ని వ్యవస్థలను, అన్ని ప్రజాస్వామిక ప్రగతిశీల భావనలను ధ్వంసం చేసే దశకు చేరింది. దేశాన్ని మత ప్రతిపాదికన పోలరైజ్‌ చేయగల శక్తిని కూడగట్టుకుంది.     

వీటన్నిటి ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చి 2025తో మొదలు పెట్టి 2047 నాటికి దేశాన్ని హిందూ రాష్ట్రంగా (దేశంగా) మార్చడం  ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక. దానిని అది బహిరంగానే ప్రకటించింది. ప్రభుత్వమే వాళ్ళ చేతులలో ఉన్నది కాబట్టి అందుకు అవసరమైన అన్నీ పనులు అది చేసుకుంటూ పోతున్నది. ఆర్టికల్‌ 370 రద్దు,  రామమందిరం, సిఏఏ, చట్టాల మార్పు దాకా అన్నీ వీటిలో భాగమే. 

మొదటి నుండి ఈ దేశం హిందువులదీ మాత్రమే అన్నది సంఫ్‌ు అభిప్రాయం. ఇక్కడ ఉండే ఎవరైనా హిందూ సంస్కృతికి, ధర్మానికి  లోబడి, దానికి అనుగుణంగానే ఉండాలన్నది సంఫ్‌ుపరివార్‌ సిద్ధ్దాంతం.  దీని సాధించడానికి  హిందూతేర ప్రజల మీద విద్వేషాన్ని  సమాజంలో నింపుతూ వచ్చింది.  ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టప్రకారంగానే మనుషులను వేరు చేసే పని పెట్టుకున్నారు. ఎన్నో నిరసనల మధ్య గతంలో ఆగిన సిటిజన్‌ సిప్‌ అమెండ్మెంట్‌ ఆక్ట్‌ 2019ను మార్చి 11, 2024 నుండి అమలులోకి తీసుకువచ్చారు. గతంలో దీని మీద జరిగిన చర్చలు, వచ్చిన భిన్నాభిప్రాయాలను అన్నిటినీ పక్కన పెట్టి అమలులోకి వస్తుందని హోమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దీని ఉద్దేశం ముస్లింలను, అసమ్మతి తెలిపే వారిని  ఈ దేశ పౌరులు కాదని చెప్పడమే. దీని మీద అనేక విశ్లేషణలు గతంలోనే వచ్చాయి. ఇది ఎన్నికల ముందు తీసుకురావడం ఓట్ల వేట కోసం మాత్రమే కాదు హిందూరాష్ట్ర సాధన అనే లక్ష్యం కూడా ఉంది.

దీని వల్ల హిందూ ఓటర్లు ప్రభావితం అవుతారు అన్నది వాస్తవం. ఇంకో వైపు నుంచి చూస్తే  ఇవి హిందూ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాలుగా కన్పిస్తున్నప్పటికి వీటి వెనుక కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. 370 రద్దు తరువాత కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులప్రవాహం కొనసాగుతున్నది.  ఇది అక్కడి ప్రకృతిని, ప్రజల జీవనాన్ని కార్పొరేట్లు ధ్వంసం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా  అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు.  370 రద్దు అఖండ హిందూదేశ స్థాపన కోసమే కాదు. కార్పొరేట్ల కోసం కూడా.

ఒకవైపు హిందూ రాష్ట్ర హిందువుల కోసం అని ప్రచారం చేస్తూ దేశమంతగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడం హిందుత్వ ఫాసిస్టుల వ్యూహం. అందుకే ేశంలోని సమస్త ప్రజల సంపద కార్పొరేట్ల పరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పబ్లిక్‌ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మి వేస్తున్నారు. పేరుకే హిందూ దేశం.  కానీ  హిందూ ప్రజలకు కూడా ఈ దేశ ప్రాకృతిక వనరుల మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇవన్నీ పెట్టుబడిదారీ కార్పొరేట్‌ శక్తుల సంపదను పెంచడానికే తప్ప సాధారణ ప్రజల కోసం కాదు.

ఇది ఈ పదేళ్ళలో అనుభవంలోకి వచ్చింది. దీని వల్ల నష్టపోతున్న వారిలో  మెజార్టీ హిందువులు కూడా ఉన్నారన్న విషయం మర్చిపోకూడదు.  బీజేపీ చెబుతున్న హిందూ రాష్ట్ర హిందువుల సంక్షేమం  కోసం కాదు అన్నది తేటతెల్లం.   ముస్లింలును విదేశీ దురాక్రమణదారుగా, పరాయివారుగానే ప్రచారం చేసి, వాళ్ల పౌరసత్వాన్ని సందేహంలో పడేసి, హిందుత్వను నిరంకుశ ఆధిపత్యశక్తిగా రాజ్యంలో, సమాజంలో అధికారంలోకి తేవడమే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం. హిందుత్వ, కార్పొరేటీకరణ తమకు ప్రమాదమని మెజారిటీ హిందువులకు తెలియకుండా చేసి, వాళ్లు నిరంతరం ముస్లింలను ద్వేషించేలా చేయడానికి ఈ ఎన్నికల ప్రచారాన్ని వాడుకుంటారు. దాన్ని అడ్డుకోడానికి సమాజాన్ని చైతన్యవంతం చేయడం అందరి బాధ్యత.

One thought on “2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

  1. Ye media ilanti nijalu cheppatledu maybe cheppademo! miru cheppe party deshamlo political war oneside chesthundi kada. ivanni mi abhiprayala nijala? -……………..

Leave a Reply