ఒక సమాజ పతనాన్ని అద్దంలో చూపిన కథలు
మనలో చాలా మందిమి మన చుట్టూ కమ్ముకుని ఉన్న విషాదాన్ని తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తుంటాం. ఆలోచనల్ని ఒక మేరకు మొద్దుబార్చి, నిద్రపుచ్చి, రేపటి కలలేవో కంటాం. అంతఃశ్చేతన పీడకలలా కలవరపెడుతుంది. ఉలిక్కిపడేలా చేస్తుంది. అయినా సంక్షోభం మనదాకా రాలేదని అనుకుంటాం. మన ఎదుట నడుస్తున్న ఒక అసంబద్ధ నాటకాన్ని చూసి నవ్వుతుంటాం. కానీ అందులో మనమూ పాత్రధారులమే అన్న విషయాన్ని గుర్తించలేకపోతాం. నిజానికి అదే పెద్ద విషాదం. దానిని గుర్తించినప్పుడు మనమిక నవ్వలేం. బహుషా ఏడవలేక నవ్వుతామేమో. ఒక నిస్సహాయ స్థితిలో, భరించలేని మానసిక ఒత్తిడిలో, బాధను, భయాన్ని, ఆందోళనను తట్టుకోడానికి మన మీద మనమే జోకులేసుకుని










