ఇటీవల కవిత్వం రాస్తున్నయువతరంలో అనేక నేర్చుకోవాల్సినఅంశాలుఉన్నాయి .వారంతా నిశ్శబ్దంగా, మౌనంగా వర్తమానాన్ని అత్యంత లోతుగా చూస్తున్నారు .ఎక్కడ ఆర్భాటం లేదు రాజకీయ పరిపక్వత పొంది ఉన్నామని భావన లేదు. జీవితాన్ని రాజకీయాల్ని అంచనా వేసే క్రమంలో నిజాయితీ కనబడుతుంది .మన ముందు రూపొందుతున్న పిల్లలు కదా అమాయకత్వం నిండిన చిరునవ్వు ఇవే కదా వీరిలో అదనపు ఆకర్షణ అనుకునే దశ నుండి వారు హఠాత్తుగా కవిగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తారు .వారి కవితా ప్రపంచంలోకి దారి చేసుకుంటే ఇంతటి పరిపక్వత ఎలా వచ్చింది? ఈ పరిణితి వెనుక ఈ తరం పడుతున్న మౌనవేదనేమిటి ? వీరిని దుఃఖితులుగా చేస్తున్న రాజకీయ ద్రోహాలు వికసిస్తున్న పసిమనుసులకు అర్థమవుతున్నాయా? కవిత్వం ఓ పాషన్ కాకుండా జీవన వాస్తవికత ఎందుకయింది. రెండు పదులు దాటిన యువతరం అనుభవ ప్రపంచం ప్రేమ ,జీవితం వీటి చుట్టూ నిర్మితమవుతున్న ప్రపంచం కదా  నిజానికి మన కళ్ళ ముందు జరుగుతున్న అనేక సృజనాత్మకతలను ముఖ్యంగా యువతరం సృజనాత్మక ఆలోచనలును మనం పట్టించుకోం. దీనికి కారణం వయస్సు అంతరం లేదా మన వరకు చేరని నూతన వ్యక్తీకరణలు. తరాల అంతరాలకు సంబంధించిన విషయం కాదు మొత్తంగా ఎక్కడో ఒకచోట గీత ఏర్పడింది.ఆ గీతను తొలగించుకోవాలి.              

      శ్రీ వశిష్ఠ సోమేపల్లి ఇటీవల విస్తృతంగా రాస్తున్న కవి . ఆకురాలిన చప్పుడు మొట్టమొదటి కవిత సంపుటి. నిండా మూడు పదులు దాటిన వయస్సు కవిత్వ రచనకు వయసుతో పని ఏమిటి అనే ప్రశ్న తల ఎత్తవచ్చు. తన చిన్నపాటి మానవ అనుభవం నుండి కవిత్వంలో సాంద్రత కవి చెబుతున్న పాఠం వీటిని అంచనా వేసినప్పుడు కవి యొక్క వ్యక్తికరణలో ఇంతటి పరిణితి ఎలా సాధ్యమైంది. శ్రీ వశిష్ట సోమేపల్లి తన అధ్యయనశీలత తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం ఈ రెండిటిని సమతూకం చేసుకున్నాడు. కవిత్వరచన  అంటే శుద్ధ వాచ్యం కాదు, కవిత్వ నిర్మాణం కొనసాగింపు వస్తువు ఏదైనా కవిత్వం కావాలి. కేవలం వచన శైలి కవిత్వ నిర్మాణం కాదు  కవిత్వ రచనలో దీనిని  అధిగమించడానికి విస్తృత అధ్యయనం మాత్రమే చాలదు. లేదా పూర్వ కవు లను వారి రచనా పరిపక్వతను  ఆవాహన చేసుకుంటే చాలదు  తను రాస్తున్న కవిత్వానికి శిల్పం తన ముందున్న భౌతిక వాస్తవికత.  ఏ శ్రమజీవుల గురించి కవిత్వం రాస్తున్నాము. వారి నుండి గ్రహించడం .ఏ వర్గానికి కవిత్వం చేరువు కావాలని కవిత్వ రచనలోకి వచ్చామో  ఆ వర్గాల నుండి నేర్చుకున్నదే శిల్పం.                               

          వశిష్ఠ సోమేపల్లి ఆకురాలు చప్పుడులో ఈ పరిణితి సాధించాడు. శిల్పం, వస్తువు కవిత చెప్పే విధానం.  మూసలో కాకుండా నూత్న ఒరవడిలో చెప్పే ప్రయత్నం చేశాడు. రాజకీయ అంశాలను  సమకాలీన  రాజకీయ వ్యక్తీకరణలను ఎలా స్వీకరించాడో  దాని ముసుగును రాజ్యాంగపు   నీడలో విధ్వంసమవు తున్న  తీరును నిశితంగా గమనిస్తున్న కవి .తన కవిత్వ అల్లికను  తన కవిత్వ పరిభాషను  రూపొందించుకున్నాడు . వార్తాపత్రికలు మోసుకొచ్చిన     వార్తల నుండి సంగ్రహించి కవిత్వం చేయడం   కవి ఉద్దేశం కాదు. చాలా స్పష్టంగా , స్వచ్ఛతతో ఇవాళ వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న స్థితి ఇందులో ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజల కేంద్రంగా సాగని రాజకీయ నిర్ణయాలు .ఈ నిర్ణయాలు వెనుక దాగిన రాజకీయ వైఫల్యాలు వీటిని అత్యంత దగ్గరగా చూసి కవిత్వ రచనలో భాగం చేసిన కవి 

        రాజ్యం , పాలనా కాంక్ష  డబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్యం ఇవన్నీ నిర్మించిన అభివృద్ధి నమూనా  రాజకీయ నిర్ణయాలు వెనుక దాగిన బుల్డోజర్ వీటిని ఎలా తన రాజకీయ పరిపక్వతతో   కవి స్వీకరించిన విధానం తన మొదటి కవిత్వ సంపుటిని పరిపుష్టం చేసింది.   మెజారిటీ పక్షం బుల్డోజర్ వీటిని ఎలా స్వీకరించారు  అనేది ప్రధాన అంశం.

        కట్టా సిద్ధార్థ అన్నట్లు కొత్త తరం కవులలో రాజకీయ కవుల లేరనే  నిర్ధారణజరుగుతున్నప్పుడు ఇదిగో  శ్రీ వశిష్ఠ . నిజమే కదా ఎవరినీ చదవకుండా ఒక అంచనా కడతాం  ఇదొక సాహిత్య రీతి. కొత్త తరం కవుల చుట్టూ నిర్మిత్మవుతున్న విధ్వంసకర రాజకీయాలకు వారు పరాయి కాదు.  లేదా ఈ స్థితిని పట్టించుకోని కేవలం పేరు రాస్తున్న కవి సమూహాల అల్లిక కాదు. నిజాయితీ అనే స్పటికం దహించవేస్తుంది  హృదయం లోపల బంధం ,పాశం ,ఆగ్రహం ఇవన్నీ రాజకీయ కవిగా రూపొందించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది.  

           శ్రీ వశిష్ఠ సోమేపల్లి కవిత్వం ఎక్కడా వాచ్య ము కాదు. తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచపు క్రీనీడలను నిర్భయంగా పలికించి ఈ చీకటి వెనుక దాగిన ఆధునిక ప్రజాస్వామ్యపు వైఫల్యాన్ని అవగాహన చేసుకున్నాడు  కవిత అచ్చమైన కవిత్వ అభివ్యక్తిగా ఉండవచ్చు .సారాంశంలో రాజకీయ భావజాలం ఇమిడి ఉన్నది . తనలోని అంతర్లీనతకు కవిత్వం ఆలంబన అయింది. నిజానికి ఇది కవి నిర్మించుకున్న  కవిత్వ గమనం. లేదా తానేమి  రాయాలో కచ్చితమైన నిర్ణయిం తీసుకున్న  కవి . నిబద్దతకు సంబంధిన అంశం .కవిత్వం, ఆచరణ ఇవి లోతుగా ఆలోచించాల్సిన విషయం  .అయితే వర్తమాన భారతదేశం దీని వెనుక దాగిన ధనస్వామ్య, మత రాజకీయాలు కవి గమనంలోచోటుచేసుకున్నాయి.

      కాలానికి అవసరమైన కవి  లేదా కాలం కవిని తయారు చేసిందా! కవి ఆలోచన ,వేదన కవిత్వం కావలసినంత దుఃఖము, ఆధునిక కవితకు కావాల్సిన నమూనాలు.  శ్రీ వశిష్ఠ  కవిగా మొదటి దశ లోనే  తన ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారు. నేర్చుకున్నారు . అదే సమయాన ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు. కవిత్వం కళాత్మక   వ్యక్తీకరణ మాత్రమే కాదు  కవిత్వానికి సామాజిక తలంపై విరిసే వెలుగు వుంది. ఆ వెలుగును కవి ఎలాంటి విస్తృతార్థంలో చూస్తున్నాడు అనేది ప్రధానం  .ఆచూపులో ఎలాంటి అర్థత, బాధ్యత భరోసా ఉన్నది ఆ అక్షరాల వెనుక దాగిన మానవ శ్రమ, నూతన ప్రజాస్వామ్య భావన కవి ఏ శిఖరం దగ్గర నిలబడి ఉన్నాడు అనేది ప్రశ్న.       దేశం కాలికి పుండుపడింది /నడిచీ, నడిచీ పుండుపడింది/ దేశం గదుల్లోనే ఊళ్ళల్లోనే ఇరుక్కుపోయింది అంటున్నారు/ ఇది పచ్చి అబద్ధం /దేశం ఇంకా గూటి కోసం నడుస్తుంది/ నెత్తిన తరాల బీదరికాన్ని/  చంకన మరోతరం ఆకలిని మోసుకెలుతుంది . ఈ కవిత్వ పాదాలు చదివాక కవి అంతరంగం తెలుస్తుంది. యువతరం కవులు తాము ఎటువైపు వుండాలో నిర్ణయించు కుంటున్నారు. తమ దారిని వెతుక్కుంటున్నారు. ఆ దారిని విశాలం చేయడం తెలుగు సాహిత్యం భాధ్యత..

One thought on “కాలం తయారు చేసిన కవి

Leave a Reply