పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి.

పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది.

ఇప్పుడిక ఎవరిదైనా పెండ్లి అంటే కొత్తపేటకు వెళ్లాల్సిందే. నాలుగో నెంబరు జాతీయ రహదారి  దాటాల్సిందే.

వంటమాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా  పాతపేటలోని ఎస్టీ కాలనీకి రావాల్సిందే.! 

కపాలి వుండేది ఎస్టీ కాలనీలోనే. ఆ మనిషి కోసం పెద్ద పెద్దోళ్ళు రోడ్డు దాటి, వీధులు దాటి ఎస్టీ కాలనీలోకి వస్తారు. మేం ఒకప్పుడు వాళ్ళ ఇండ్లల్లోకి పోలేని వాళ్ళమే అయినా,  ఇప్పుడు మా జాతోడు చేసే వంటలు అందరూ మెచ్చుకుంటూ తింటున్నారంటే దాని వెనుక చాలా కథే వుంది.

ఒకప్పుడు కపాలి అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు కపాలి అంటే అందరికీ తెలుసు. కబాబ్ కపాలి అంటే ఊర్లో చిన్న పిల్లలక్కూడా తెల్సిపోతుంది. చికెన్ కబాబ్స్ చేయటంలో కపాలి మంచి నేర్పరి. వివాహాలకు, శుభ, అశుభ కార్యాలన్నింటికీ కపాలి వంట చేస్తాడు. శాఖాహారమైనా, మాంసాహారమైనా వంటలు  చేయించాలంటే ఊర్లోనే కాక, చుట్టుపక్కల మండలాల్లో  సైతం జనం ముందు కపాలికి వీలవుతుందేమో అని వాకబు చేస్తారు.

కపాలికి వీలు కాదంటేనే మరింకెవర్నయినా వెతుక్కుంటారు. కొంచెం పెద్దవాళ్లయితే ఇంటికే అప్పుడప్పుడు కపాలిని పిలిపించుకుని కబాబ్స్, బిరియాని, తందూరి, ఫ్రైడ్స్, చికెన్ పకోడి, నాటుకోడి బిరియాని లాంటివి చేయించుకుంటూ వుంటారు.

కాపాలికి అంత పేరు రావటం ఒక్కరోజులో జరగలేదు. ఎరుకల కపాలి వంటల మాస్టర్ అవుతాడనేది కపాలి  అయినా కలలో అయినా ఊహించని విషయం. అదంతా అనుకోకుండా జరిగిపోయింది. కపాలి టెంట్ హౌస్ లో పనిచేసేవాడు. కపాలి వాళ్ల తాతలది బాతుల వ్యాపారం. తండ్రిది పందుల వ్యాపారం. కపాలి ఆరెండింట్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సింది పోయి ఇంట్లో గొడవపడి ఏదో చిన్న విషయానికే అలిగి ఇంట్లో దొరికినంత డబ్బు  తీసుకుని మద్రాసుకు పారిపోయాడు.

కొన్నేళ్ళ బాటూ  ఎక్కడెక్కడో తిరిగి తిరిగి , ఎట్లాగో బతికి విసుగొచ్చి, ఇంటికి తిరిగివచ్చేనాటికి  తాత లేడు, అమ్మ నాయినా  లేరు, బాతులూ లేవు, పందులు లేవు. ముగ్గురు అన్నలు ఆస్థులు పంచుకునే క్రమంలో బాతుల్ని, పందుల్ని. గుడిసెలని   భాగం పెట్టుకుని వేరు కుటుంబాలు పెట్టుకునేసారు.

ఇంకా రాడేమో అనుకున్న కపాలి రావటం ఎవరికీ నచ్చలేదు. అతడి రాకను ఎవరూ ఇష్టపడలేదు.ఇంకో మార్గం లేక, తప్పనిసరై  కపాలి కుల పంచాయతి పెట్టించాడు. అసలే  ఎరుకుల వాళ్ళది ఒక విచిత్రమైన పంచాయితి కదా!

 రెండు రాత్రులు, మూడు పగల్లు సాగింది పంచాయితి. ఎరుకల కులపెద్దలంటే మాటలు కాదు. నాటుసారా, పంది మాంసం పంచాయతీ పెద్దలకు ఇరుపక్షాలు పంచాయతి జరిగినంత కాలం సమర్పించుకోవాల్సిందే.వాదించే కొద్దీ మాటలే కాదు మాటలతో బాటూ ఖర్చులూ పెరిగిపోతాయి.అప్పులూ పెరిగిపోతాయి,అయినా ఒక పట్టాన తొందరగా ఏ పంచాయతీ ఎప్పుడూ తేలింది లేదు.అయినా కులపోల్లా మాట కాదని ఎవరూ బయట పోరు, అదొక తరతరాల కట్టుబాటు, కులం గీసిన సరిహాడు రేఖల్ని దాటినోల్లకి కులం నుండి  వేలివేతే పెద్ద  శిక్ష!

ఆ అన్నలు ముగ్గురూ అప్పులూ చూపించారు. మొన్నటిదాకా బతికి రోగంతో చనిపోయిన తల్లికి ఖర్చులు, ఏవేవో అప్పులూ వడ్డీలు లెక్కలు  చూపించారు. కపాలికి ఆ లెక్కలూ  తెలియవు, ఏ లెక్కలూ తెలియవు.  పంచాయతీ పెద్దలు వాళ్ల ముగ్గురికీ వత్తాసు పలికారు. మూడువేల రూపాయలు కపాలి భాగం కిందకి వస్తుందని లెక్కతేల్చి మూడు వాయిదాల్లో ఆ మొత్తాన్ని అతడికి అన్నలు అప్పగించాలని తీర్పునిచ్చారు. ఆ మూడో వాయిదా సొమ్ము చేతికందేసరికి జరిగిన ఆరు పంచాయతీలకు రెండువేల రూపాయలు ఖర్చయిపోగా నికరంగా అతడి  చేతికొచ్చింది ఒక వెయ్యి మాత్రమే.

 అదీ అతడి ఆస్తి, పెట్టుబడి. అది  కూడా పూర్తిగా  అయిపోయాక చివరికి  టెంట్ హౌస్ లో ఆర్ముగం  దగ్గర పనికి చేరిపోయాడు కపాలి.

షామియానా, కుర్చీలు, మైక్సెట్, వంటపాత్రలు బాడుగకు తిప్పి పందిళ్లు. షామియానా వేసే పనిలో ఆరితేరి పోయాడు. ఆర్ముగం కు బాగా దగ్గరయిపోయి చిన్న ఆర్ముగం అని పిలిచే స్థాయిలో అంతా కుదురుగా వున్నప్పుడు , ఆ షాప్ లో దొంగతనం జరిగింది.

ఇరవైవేలు గల్లా పెట్టెలోంచి మాయమైంది. ఎంతో నమ్మకంగా పనిచేసిన చోటే  అతడికి దొంగ అనే ముద్ర పడిపోయింది. మూడు రోజులు పోలీస్ స్టేషన్లో తగిలిన లాఠీ దెబ్బలకు అతడి ఒళ్లు హూనమైపోయింది.

“ఇల్లూ లేదు. వాకిలీ లేదు. ఆలీ బిడ్డల్లేరు అన్నా , రాత్రి పగలు నీ పంచనే పడిండాను. నా సంపాదన కూడా నీ దగ్గరే దాచుకుంటా వుండా. నేను నీ దగ్గర దొంగతనం చేస్తానని ఎట్లా అనుకున్నావు అన్నా , నా పైన నమ్మకం లేదా నీకు ? ఎన్నో పూటలు పస్తే ఉండిపోయా కానీ, ఏ  పొద్దూ ఒకుడి దెగ్గిర చెయ్యి సాచింది లేదు,దొంగ బతుకు బతికిందీ  లేదు నా గురించి నీకు తెలియదా అన్నా ,  ” అంటూ వలవలా ఏడ్చేసాడు కపాలి.

 “జాతి బుద్ధి యాడపోతుంది, విశ్వాసం లేని పని చేసినావు కదరా” అనేసాడు ఆర్ముగం. 

. సచ్చేదాకా మరస్తానా ఆ మాటలు . పోలీసులు దెబ్బలకన్నా ఆర్ముగం మాటలే ఇప్పటికి నొప్పి కలిగిస్తా వుంటాయని అంటాడు  కాపాలి.

“అన్నా  నమ్మితే ప్రాణమిచ్చే జాతి మాది. గురువు కాని గురువడిగితే గురుదక్షిణగా బొటనవేలే కోసిచ్చిన ఎరుకల జాతి మాది,  నన్ను విశ్వాసం లేని వాడంటావా. బుద్దుంటే  మళ్ళీ నీ ముఖం చూడనీ జన్మలో ” అనేసాడు.

నాలుగోరోజో, ఐదోరోజో నిజం తెల్సిపోయింది.

డబ్బు దొంగిలించిన వాడు ఆర్ముగం తమ్ముడే.

క్లబ్బులో పేకాడుతూ పోలీసులకు డబ్బుతో సహా దొరికిపోయినప్పుడు అంతడబ్బు ఎక్కడిదని పోలీసులు నాలుగు తగిలించేసరికి అతడు నిజం కక్కేసాడు.

అదే ఆర్ముగం స్టేషన్ కు  స్వయంగా వచ్చి చేతులు పట్టుకుని బ్రతిమిలాడుకున్నా కపాలికి తగిలిన గాయం మానలేదు.

స్టేషన్లోంచి బయట పడిన తర్వాత,  అప్పటిదాకా ఎస్టీ కాలనీలోనే ఉండకూడదని, బయటే ఉండిపొయిన వాడు మనసు మార్చుకుని, నేరుగా ఎస్టీ కాలనీలోకే  వచ్చేసాడు. ఆర్ముగం దుఖానం లో ఉంచిన  అతడి బట్టలు, వస్తువులు అన్నీ అక్కడే వదిలేసాడు. ఆ తర్వాత ఆర్ముగం వాటిని పంపించినా అవి తెచ్చిన మనిషి దగ్గిరే  ఎందుకో అన్నీ తిప్పి పంపేశాడు.

వరుసకి తాత అవుతాడు దేవరాజులు.

బంగాకు తాగుతూ ఎప్పుడూ మత్తులో ఉండిపోతాడు. తత్వాలో, పాటలో పాడుకుంటూ వుంటాడు. ఒంటరి జీవి.కపాలి కోసం పోలీసు స్టేషన్ లో ఉన్నన్ని రోజులూ  కుంటుకుంటా వచ్చి  అన్నం నీళ్ళు తెచ్చి ఇచ్చిందే అతడే. కాలనీ లోకి వచ్చి   అతడి గుడిసెలో ఓ మూల  చేరిపోయాడు కపాలి. తనకు అన్నం పెట్టిన   ముసలోడు జ్వరంతో కళ్ళు తెరవకుండా గుడిసెలో శవం మాదిరి పడివుంటే చూడలేకపోయాడు. 

అప్పటిదాకా బయట  తిండికి అలవాటు పడినవాడు కాస్తా,  గుడిసెలోకి రాగానే పుల్లలు ఏరుకుని వచ్చి పొయ్యి అంటించి కుండపెట్టి వండటం నేర్చుకున్నాడు.ముందు గంజి కాచాడు, అంత నూకలు ఉడికించి  రాగి పిండి వేసి సంగటి కెలికాడు. సట్టిలో వేసి నున్నగా ముద్ద చేసి, రోట్లో అంత వూరిబిండి నూరి  ముసలోడి ముందు  పెట్టాడు.అప్పుడట్లా మొదట  పొయ్యి ముట్టించింది తనకోసం కానే కాదు. అట్లా మొదలైన వండటం.. వంటవాళ్ల దగ్గర చేరి చిన్నా చితక పనులు చేస్తూ.. నేర్చుకుంటూ  ఆరేడు నెలల్లోనే  వంటమాస్టర్ అయిపోయాడు.

అప్పటికి ఎస్టీ కాలనీలోనే ఎవరూ వంటవాళ్లు లేరు.

ఆ మాటకొస్తే పాతపేటలోనే వంటవాళ్లు లేరు.ఎరుకల కులంలో ఒకడు ఇట్లా  వంటమాస్టర్ అవతాడని మాత్రం ఎవరు ఊహించగలరు ?

మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ, వచ్చిన ఆ  కూలి డబ్బులే   గుడిసెను మార్చి వేసుకోవటానికి, కొంచెం మంచి బట్టలు కుట్టించుకొని, గరిటలు అవీ  కొనుక్కోవటానికి ఉపయోగపడ్డాయి.

“అయినా ఎరుకలోడేంది? వంటలు చెయ్యడమేంది?” అని మొదట్లో సందేహపడి.. రకరకాలుగా మొహమాటాలకు, నిష్ఠూరాలకుపోయిన జనమే , కపాలి చేతిలోని మహత్తు తెలిసాక అతడి వంట ఒకసారి రుచి చూసాక కులం గురించి మాట్లాడ్డం మానేసారు.ఇదంతా జరగటానికి మాత్రం కొన్ని సంవత్సారాలే పట్టింది. ఆకలి ముందు, అన్నం ముందు మా కులం లెక్కల్లో లేకుండా గాల్లో కలసిపోయింది, అసలు  రుచి తెలుసుకున్నాక   ఏ  నాలుకా కులం పేరు ఎత్తడం మానేసింది.

పనికోసం ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరి ముందో చేతులు కట్టుకుని నిలబడిన కపాలి దగ్గరకు  వంటలు చేయడం నేర్చుకోవడం కోసం, శిష్యరికం చేయటానికి ఎందరో పోటీలు పడి వచ్చే వాళ్ళు  !

“కులవృత్తి కాదు కదరా. ఎట్లా నేర్చుకున్నావ్ ఈ విద్య” అని ఎవరైనా మొహంపైనే అడిగినప్పుడు కపాలి నవ్వేస్తాడు.

`“అదేమన్నా అట్లంటావు? కుదురుగా కూర్చొని మనసు పెట్టి చెయ్యల్ల. కానీ ఏ పనయినా మనిషికి లొంగకుండా వుంటుందా? కులందేముంది అన్నా… గుణం ముఖ్యం కదా. కృష్ణమాచారి చేసే మంచం కన్నా మనూర్లో మాలపాళ్యం జాకబ్ చేసే మంచాలకే గిరాకీ ఎక్కువ కదన్నా . పై కులమోల్లంతా ఇప్పుడు  టీ అంగళ్ళు,టిఫిన్ అంగళ్ళు  బొరుగుల అంగళ్ళు, బట్టలంగళ్ళు పెట్టుకుని జరపతా వుండలేదా?” అని పేర్లతో సహా వివరంగా జవాబు చెప్పేస్తాడు.

అందరి దగ్గరా మంచి పనివాడు, మంచి వంటవాడు అనిపించుకున్న కపాలి, బీడి తాగటం వక్కాకు నమలటం లాంటి అలవాటయినా లేని కపాలికి ఉన్నట్లుండి ఎప్పుడు ఎట్లా మొదలయ్యిందో కానీ తాగుడు అలవాటయి పోయింది. కుదురుగా వంట పనులకి పోవడం మానేసాడు. పనులు లేనప్పుడు తాగినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ , పనికి పోయిన చోట కూడా తాగడం మొదలుపెట్టే సరికి అతడి పేరు చెడు పోయింది.

పెండ్లి చేసుకోరా అంటే వినలేదు.

ఇల్లు కట్టుకోరా అంటే వినలేదు.

తాగుడు మానెయ్యరా మంచిదికాదు అంటే వినలేదు.

ఇన్నాళ్లూ లేని గొడవల్ని తాగడం మొదలు పెట్టినాక మొదలుపెట్టాడు.. వాళ్ల అన్నల ఇండ్ల దగ్గరకు వెళ్లటం గొడవ పడటం…వాళ్ళని  తిట్టడం మనుషల పైకి పోవడం , వీధుల్లోకి వచ్చి అరవడం  ఎక్కువైపోయింది.

ఆ గొడవల కారణంగా మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్లి వారం వుండి దెబ్బలు తినేసి వచ్చాడు. వారం రోజులు స్టేషన్లో వుండి తాగుడుకు దూరంగా వుండటం వల్లనో, చేతిలో సొమ్ము తాగుడికి , పంచాయతీలకి అయిపోవటం వల్లనో కొన్ని రోజులు  మళ్లీ తాగుడు జోలికి పోకుండా వుండిపోయాడు.

“ముందా గుడిసెలోంచి బయటికొచ్చేయి. ఈ ముసిలోడు నీకు బంగ్యాకు కూడా నేర్పించేస్తాడు. యాడైనా ఇల్లు బాడుక్కి తీసుకుని పెండ్లి చేసుకోరా… బాగుపడతావ్” అని నచ్చచెప్పారు కొందరు.

నవ్వేసి ఊరుకున్నాడు కపాలి.  మళ్ళీ పనిస్తానని ఆర్ముగం  నాలుగైదుమార్లు మనిషిని పంపినా కదల్లేదు.

కపాలికి ఇప్పుడు మళ్లీ కష్టకాలం మొదలయ్యింది.

 ఇంతకు ముందులాగా అతడ్ని అందరూ వంట పనులకు పిలవటం లేదు. అతడు వంట నేర్పించిన వాళ్ళల్లో కొందరు  ఈమధ్య వంట మాస్టర్లు అయిపోయారు.

“కపాలి మంచి పనోడే. కానీ తాగుబోతు. తాగి వంట ఎక్కడ చెడగొడతాడో లేదా ఎక్కడెవర్తో గొడవ పడతాడో, ఎందుకు వచ్చిన తంట కానీ వంటకి  కపాలి వొద్దులేబ్బా. వంటలో ఉప్పూకారం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. తగ్గిపోయినా పర్వాలేదు. మొత్తం వంటంతా నాశనమైపోతే కార్యం మొత్తం చెడిపోతుంది. మనం మన డబ్బులు ఇచ్చి దొబ్బిoచుకున్నట్లు ఉంది,  ఆ  కపాలికో దండమప్పా” అనేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఎవరైనా పొరబాటున పిలిచినా కానీ  కపాలి పనికి పోకుండా పస్తులైనా వుండిపోతున్నాడు.

కబాబ్ కపాలికి ఇప్పుడు చేతిలో పనిలేదు. అవసరాలకి వంటపాత్రలు, గరిటెలు కూడా అమ్ముకునేసాడు. అతడి దగ్గర పని నేర్చుకోవాలనో, పనులు చెయ్యాలనో వచ్చేవాళ్లే లేరిప్పుడు, మొండిగా, పంతంగా అట్లాగే రోజుల్ని నిర్లక్ష్యంగా నెట్టుకొస్తున్న కపాలి ఒకరోజు  – జన్మలో ముఖం చూడనని ముఖం పైనే తను చెప్పేసిన ఆర్ముగం  దుకాణం ముందు కాళ్లకు చెప్పులైనా లేకుండా మండుటెండలో  నిలబడ్డాడు.

లోతుకు పోయిన కళ్లు చిక్కిన శరీరం. పెరిగిన గడ్డం. తైలసంస్కారాలు లేని ఆ మనిషిని చూసిన  వెంటనే ఆర్ముగం  గుర్తు పట్టనే లేదు. గుర్తు పట్టాక లోపలికి పిలిపించాడు.

 “ఏరా.. డబ్బులేమైనా కావాలా? ఏమైంది? ఎందుకిట్లా అయిపోయావ్. పనికి పోకుండా వుండిపోయినావ్? కడాకి  ఈదినం దావా కనిపించిందా  ఇట్లా వొచ్చినావ్ ” ఆర్ముగం ప్రశ్నలతో తలగోక్కున్నాడు కపాలి.

“ ఎంత పిలిచినా వినకుండా  ఆ దినం పొయ్యిననోడివి  ఈ పొద్దు దాకా నా ముందుకొచ్చి నిలబడింది లేదు. పని లేక పోయినా , పస్తయినా వుండి చావనైనా చస్తాను కానీ నీ ముఖం  చూడను  అని నా ముఖం పైనే అనేసి పోయినోడివి ఈ పొద్దుకు  మళ్ళీ నీ కళ్ళకి కనిపిస్తా వుండానా  నేను ” నిష్టూరంగా మొహం పైనే అడిగేసాడు  ఆర్ముగం.

“అన్నా  నీ ముఖమే చూడకూడదు అనుకున్నా. నీ ముందుకే రాకూడదనుకున్నా.ఆ  ముసిలోడు సచ్చేట్లు వుండాడు. నాకు అన్నం పెట్టి నీడనిచ్చినోడ్ని చూస్తా చూస్తా ఎట్లా సంపుకునేది? మంచి  ఆస్పత్రికి వాడ్ని తీసుకుపోయి చూపించల్ల.  ముసలోనికి  బతికినంతకాలం కడదాకా  నేనే  అన్నం పెడతానని మాట ఇచ్చినా అన్నా . హోల్ చరిత్రలో ఎరికిలోడు ఏ పొద్దూ మాట తప్పలే  అన్నా . ముసలోడు ఆకలిపైన వుండాడు. నాకేదైనా పనిప్పించు  ” కళ్లనీళ్ల పర్యంతమయిపోయాడు కపాలి.

“ మళ్ళీ ఆ పనీ ఈ పనీ ఎందుకు కపాలి  ? నీ కులం గురించి ఎక్కడా మాట  ఎత్తకు. ఏదో ఒక కులం పేరు మార్చి  చెప్పేయ్ చాలు.  హోటల్లో ఎక్కడైనా మాస్టర్ గా పెడతాలే. ఒకచోట   సరిగ్గా  కుడురున్నావు అంటే చాలు,  మళ్ళీ  నీ గరిట రోజంతా  తిప్పాల్సిందే  ”

ఆర్ముగం మాటలకి అస్సలు ఒప్పుకోలేదు కపాలి.

“అన్నం వండతా అన్నం తినే నోటితో అపద్దం ఎందుకు చెప్తాను అన్నా? వుండే కులమే చెప్తాను. ఇస్తే పని ఇమ్మను లేదంటే లేదు.తాగి తాగి  నేను చెడిపోయినా కానీ  యాడా మా కులం చెడిపోలేదు అన్నా .” అనేసాడు.  

“నా కులమేందో ఖాయంగా ఎవురైనా పని ఇచ్చే ముందే అడగతారు కదన్నా , నేనూ ఖాయం గా నిజమే చెప్తా . ఎరికిలోడనే చెప్తా . చెప్తే ఏమి పోతాది అన్నా ?  నిజమే చెప్తాను.  ఇస్తే  పని ఇస్తాడు,  లేదంటే లేదు.అంతే కదా ! సారాయి మానేస్తే మా కులం లో కూడా రత్నాల్లాంటోల్లు దండిగా వుండారులే అన్నా. అయినా  కులం వల్ల ఎవురూ ఎప్పుడూ సెడిపోలేదు…అన్నా .ఎవురైనా సెడిపోయినాడంటే మాత్రం  అది కులం వల్ల కాదులే అన్నా . మా మర్యాదలు పోగొడతాతా వుండేది ఖాయంగా  ఆ పాడు సారాయే  అన్నా. ”

అప్పటికి ఆర్ముగంకు నమ్మకం కుదిరి ‘’ సరే సరే ముందు లోపలి రారా ..” అని పిలిచాడు. అప్పుడు ఆర్ముగం వైపు  సూటిగా చూస్తూ  ఒక మాటన్నాడు కపాలి. “ మనిషన్నాక ఎంత  కష్టంలో అయినా   ఏదో ఒక దోవ ఉండనే వుంటుందిలే అన్నా  , పట్టుబట్టి వెతికితే  నాకూ ఏదో ఒక దోవ దొరక్కుండా పోతుందా . ఆ ముసలోడి కోసమే కదన్నా నేను నీ కాడికి వచ్చిండాను. ఇన్ని  బాధలు పడతా ఉండేదీ  వాని ఋణం తీర్చుకోవాలనే అన్నా  .ఒక్కో జాతికి ఒక్కో నీతి వుంటుంది కదన్నా అట్లా  ఇది మా జాతి నీతి. ఒక్క పూట అన్నం పెట్టినోల్లని అయినా    ఏ ఎరికలోడూ ప్రాణం  పోయినా  కడదాకా మర్చి పోడన్నా. “   

Leave a Reply