అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పై నేడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తెలియజేస్తున్న నిరసనలు “తానాడలేక మద్దెలవోడు అన్నట్లు” అనే సామెతను గుర్తుకు తెస్తున్నాయి.
కె సి కాలువకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకొనేoదుకై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రయత్నించకపోగా, 2015 లోనే దానికి వివరమైన ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను ఆ నాటి కృష్ణా బోర్డ్ కు సమర్పించినా, డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర జల కమీషన్ కు తెలిపిన ప్రబుద్ధులు మన అధికారులు. అంతేకాదు, ఎన్నికల ఎత్తుగడలో భాగంగానైనా 2019 మార్చి లో గుండ్రేవులకు చంద్రబాబు నిధులు కేటాయించారు. అయితే రద్దుల జగనన్న దాన్ని తుంగలో తొక్కాడు. దానిపై స్పoదించిన రాజకీయ పార్టీ ఏదీ లేకపోవడం సిగ్గుచేటు. నేడు, వారే 2008 లోనే పనులు మొదలెట్టి, 2010 లో అనుమతులు పొందిన అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పై అభ్యంతారాలు తెలపడం రాయలసీమ ప్రజల చెవుల్లో పూలు పెట్టడంగాక మరేమవుతుంది. విభజన చట్టం లో గాలేరు-నగరి,హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణానికి స్పష్టమైన హామీ లభించినా, ఆనా టి చంద్రబాబుగాని, నేటి జగన్ గాని వాటి విషయంలో కేంద్రం పై ఒత్తిడి తేకపోవడానికి గల కారణాలేమిటి? ఆ నాడు చంద్రన్న ప్రభుత్వం లో బిజెపి భాగస్వామి కాగా, నేడు జగనన్న కేంద్రంలోని బిజెపికి అన్ని విషయాల్లో మద్దతు ప్రకటించడం గమనార్హం. అయినా, సీమను కరువునుండి కాపాడే ఆ ప్రాజెక్టులపై ఏ నాడూ ఈ రెండు పార్టీలు గాని , ఎర్రజెండా పార్టీలు గాని పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి?
ఇక ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్ట్ గురించి మాట్లాడుదాం. కర్నాటక రాష్ట్రం లో క్షామపీడిత ప్రాంతాలైన చిక్ మంగలూర్,చిత్రదుర్గ, తుంకూర్, దేవనగిరి జిల్లాలలో దాదాపు 2,25,515 హెక్టార్ల భూమికి మైక్రో ఇర్రిగేషన్ ద్వారా సాగునీరందించే ప్రాజెక్టు ఇది. తుంగభద్ర, విజయనగర కాలువల ఆధునీకరణ ద్వారా 11.5 టిఎంసిల నీటిని మిగుల్చుకుంటున్నానని, మరో 2.5 టిఎంసిల నీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమకు లభిస్తుందని, కె-8 , కె-9 బేసిన్ల నుండి మరో 6 టిఎంసిలు, బ్రిజేష్ కుమార్ కేటాయించిన 10 టిఎంసిలలు (65% ఆధారిత లభ్యత ) వీటన్నిటినీ కలుపుకొని మొత్తం 30 టిఎంసిలతో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మించుకొనేందుకు అనుమతి నివ్వాలని కర్ణాటక వివరమైన ప్రాజెక్టు నివేదిక 2008లోనే సమర్పించి, 2010లో అనుమతులు పొందిందింది.
ఆ నాటి నుండి నేటివరకు దానిపై ఇప్పుడు గగ్గోలు పెడు తున్న మన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలూ స్పందించక పోవడానికి అవి గాడనిద్రలో వున్నాయనుకోవాలా? 2021 మార్చి లో తెలంగాణా ప్రభుత్వం, అదే సంవత్సరం డిసెంబర్ లో మన ప్రభుత్వం కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పుడు కేంద్రం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి బడ్జెట్ లో రూ.5,౩౦౦ కోట్లు ప్రకటించగానే (కర్నాటక ఎన్నికల సమయం కదా!ప్రజలు అన్ని పార్టీలకు గుర్తుకొస్తారు మరి) మన రాజకీయ పార్టీలు ఒక్కసారిగా పెద్ద ఉపద్రవం సంభవించినట్టు గగ్గోలు పెట్టడం, (అదీ రాయలసీమ ప్రాంతం ఎడారి అవుతుందని కన్నీరు కార్చడం) గత దశాబ్దాలుగా సీమ నీటి ప్రయోజనాల పట్ల ఈ రాజకీయపార్తీలన్నీ కనబరచిన నిర్లక్ష్యం గమనిస్తున్న వారికి వింతగా వుంటుంది. ఎన్నికల ముందు వీరు జరిపే విన్యాసాల ముందు ఊసరవెల్లులు సిగ్గుపడాల్సిందే.
అప్పర్ భద్రా ప్రాజెక్ట్ తుంగానది నుండి 17.40 టిఎంసిల నీటిని భద్ర రిజర్వార్ కు అక్కడ నుండి ఎత్తిపోతల ద్వారా 29.90 టిఎంసిల నీటిని అగ్నాపుర సొరంగం ద్వారా చిత్రదుర్గ, తుంకూర్ బ్రాంచ్ కెనాల్ కు 19.04టిఎంసిలతో 2.26 లక్షల హెక్టార్లకు సాగునీరు, 10.86టిఎంసిలతో 367మైనర్ ఇర్రిగేషన్ ప్రాజెక్టులకు నీటిని అoదిస్తుంది. కేంద్రజలసంఘం ఆగస్టు 24,2020 తన అనుమతులనిచ్చింది. జలవనరుల శాఖ ఖర్చు-లాభం నిష్పత్తి ఆమోదయోగ్యంగా లేదని అభ్యంతరాలు తెల్పినా రాష్ట్ర-కేంద్రప్రభుత్వాలు బిజెపి చేతుల్లోనే ఉండటంతోపాటు, కర్ణాటకలో ఎన్నికలుదగ్గరపడటంతో, ఈ ప్రాజెక్టుకు అనుమతులకు ఇక అడ్డంకేమీ వుంటుంది?
సీమ అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల ఎడారి అవుతుందా?
ఇప్పుడు తుంగభద్రలో నీటి లభ్యత చూద్దాం. కర్నూల్ జిల్లా మల్యాల దగ్గర కృష్ణా నదిలో కలిసే నదీ జలాలు గత 32 సం.లలో సగటున సంవత్సరానికి 150 టిఎంసిల కు పైగానే వున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. బచావత్ ప్రకారం కృష్ణకు కేటాయించిన తుంగభద్రా జలాలు కేవలం 21.5 టిఎంసిలు మాత్రమె. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
2017- 18 లో 62 టిఎంసిల
20 18- 19లో 176 టిఎంసిల
2019- 20లో 288.86 టిఎంసిల
2020- 21లో 228.4 టిఎంసిల
2021- 22 లో 260.86 టిఎంసిల
2022- 23లో 599 టిఎంసిల
నీరు క్రిష్ణా నదిలో కలిసి సముద్రం పాలయ్యాయి. శ్రీశైలం జలాశయం చేరిన ఈ నీటిని బచావత్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి పేరిట ఎడా,పెడా తోడెయ్యటంతో ప్రతి సంవత్సరం .సగటున 500 టిఎంసిల జలాలకు పైగా సముద్రం పాలవుతున్నాయి. బచావత్ ప్రకారం సాగర్ కు విడుదల చేయాల్సింది కేవలం 264 టిఎంసిలు మాత్రమె. అదీ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించిన నీటితో సహా. అంతేకాదు తుంగభద్రకు దిగువ భాగాన నీటిని ఎక్కువుగా సమకూరుస్తుండేది కర్నూల్ జిల్లా మంత్రాలయం దిగువ ప్రాంతామని జలవనరులశాఖ తెలియజేస్తుంది. బచావత్ ప్రకారం కృష్ణకు కేటాయించిన తుంగభద్రా జలాలు కేవలం 21.45 టిఎంసిలు మాత్రమే అని తెలుసుకుంటే, కృష్ణలో ప్రతియేటా వృధా అయ్యే వంద టిఎంసిల కు పైగా జలాలను శ్రీశైలం పైభాగాన వున్న రాయలసీమ, తెలంగాణా, కర్నాటక ప్రాంతాలు వాటిని వినియోగించుకొనే అవకాశం పుష్కలంగా వుంది. వాటి వినియోగం కై సరైన ప్లాన్ లేకుండా వందల టిఎంసిలను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వృధాజేస్తున్నాయో అర్థం జేసుకోవచ్చు. ఇక్కడ కూడా రాయలసీమకు, రాష్ట్రప్రభుత్వం, అన్ని పార్టీలు అన్యాయం జేస్తూనే ఉన్నాయి. సీమ ప్రాజెక్టులకు హెచ్ ఎల్ సి(32.5 టిఎంసి),ఎల్ ఎల్ సి (27.5టిఎంసి)కేటాయించిన నీటిలో సగం కూడా ఇక్కడి రైతాంగానికి అందడం లేదు. తుంగభద్రా జలాశయం లో పూడికవల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీరంతా నదీ ప్రవాహంగా బిడ్డకు దక్కని స్తన్యం లా కృష్ణలో జేరి సముద్రం పాలవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతూనే వున్నాయి. దీనికి పరిష్కారంగా జలనిపుణులు రిటైర్డ్ ఇంజనీర్లు సుబ్బారాయుడు, సుబ్రహ్మణ్యం లాంటి వారు హెచ్ ఎల్ సి సమాంతర కాలువను సూచించినా పట్టించుకొనే వారే లేరు. పైన తెల్పినట్టుగా కేసి కాలువకు కేటాయించిన నీటిని రైతాంగానికి అందించేలా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం గురించి దశాబ్దం పైగా ప్రజలు ఆందోళన జేస్తున్నా దిక్కు లేదు. అదలా వుంచుటే కేసి నీరు కడప జిల్లాకు సజావుగా అందించేందుకై 2005నిర్మించిన అలగనూర్ రిజర్వాయర్ (2.965టిఎంసి)2017నుండి గండ్లు పడి, నేడు ఒక చుక్క నీటిని నిలబెట్టుకోలేని దుస్థిలో వున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. ఇవీ తుంగభద్రా నీళ్ళే.
అంతెందుకు, సీమకు ఎప్పుడూ కన్నీళ్లను మిగిల్చే పెన్నానది కూడా గత మూడు సంవత్సరాలుగా పరవళ్ళు తొక్కుతూ, మన పాలకుల నిష్క్రియపరతత్త్వం జూసి సముద్రుని వొడిలో జేరింది.
గత మూడేళ్ళుగా సముద్రంలో జేరిన జలాలు
20 20-21—-౩5౦ టిఎంసిలు
2021-22—415 టిఎంసిలు
22-23—200 టిఎంసిలు.
అయినా, నేడు వివిధ జలాశయాలలో నిల్వ వున్న నీరు.
జలాశయం. సామర్థ్యం(టిఎంసి). ప్రస్తుతనిల్వ
పెన్నహోబిలం 11.4 4.80
మిడ్ పెన్నార్ 5.1 3.9
మైలవరం 9.98 1.౩6
ఇక శ్రీశైలం జలాశయం లో 2022-23 నీటి సంవత్సరం చేరిన నీరు 2018.16 టిఎంసిలు కాగా, ఇప్పుడు నిల్వ వున్నది.55.75 టిఎంసిలు మాత్రామే. కేటాయించిన నీటిని వాడుకోలేరు, సముద్రం పాలవుతున్న నీటిని నిలుపుకోలేరు, ఇప్పుడు మాత్రం అప్పర్ భద్రా ప్రాజెక్టువల్ల సీమ ఎడారిగా మారుతుందని మొసలి కన్నీళ్లు. నిజమే ఏ 4 సంవత్సరానికొకమారు తుంగభద్రలో నీరు తక్కువుగా లభ్యమయితే, సీమకు నీరు సరఫరా ఇబ్బంది కలుగుతుందనేది కాదన లేనిదే. అయితే, బచావత్ 75% , బ్రిజేష్ 65% ఆధారిత నీరు కేటాయిoచారంటే అర్థం ప్రతి నాలుగేళ్లకోసారి కేటాయించిన నీరు లభ్యం కాదనేగా. వరద కాలంలో నీటి లభ్యత ఎక్కువుగా వున్నప్పుడు వాటిని జలాశయాల నిర్మించి ఒడిసి పట్టుకోమని అన్ని కమీషన్లు ఘోషిస్తూనే వున్నాయి. కానీ, మన ప్రభుత్వాలు కొత్త జలాశయాల నిర్మాణం గాని, చెరువుల పూడిక తీసి వాటి అనుసంధానం చేయడం అటుంచి అధికవర్శాల వల్ల దెబ్బతిన్న అలగానూర్, అన్నమయ్య లాంటి రిజర్వాయర్ల పునరుద్దరించడమూ చేపట్టడం లేదంటే కరువుసీమపై ప్రభుత్వానికున్న ప్రేమ ఏమిటో స్పష్టమవుతుంది. చంద్రన్న, జగనన్నలే కాదు, అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమను ఈ రాష్ట్రం లో ఒక భాగంగా చూడటం లేదని వారి ప్రాధాన్యత (అమరావతి-విశాఖ)లను చూస్తె అర్థమవుతుంది. ఇక ఎన్నికలు దగ్గర పడటంతో గత మూడున్నర సంవత్సరాలు సీమ సమస్యలపై మౌనవ్రతం పాటించిన పార్టీలకు అకస్మాత్తుగా సీమపై పరమప్రేమ పెల్లుబికి పాదయాత్రలు, నిరశన దీక్షలు మొదలెట్టాయి. సీమ ప్రజలకు కురువని మేఘాలపై ఆశ పెట్టుకున్నట్టు ఈ రాజకీయ బేహారీలపై ఆశపెట్టుకోక తప్పని దుస్థితి.
ఇప్పుడు సుప్రీం కోర్టుకు పోవడంవల్ల ఫలితమేమీ ఉండకపోవచ్చు. వకీళ్ళను మేపడం దప్ప. కేంద్రజలసంఘపు అనుమతులు పొంది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించి, బడ్జెట్ లో నిధులు కేటాయిoచబడ్డాకా న్యాయస్థానాలు చేసేదేమీ వుండదు. పైగా కమలనాథులకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పుల నిస్తాయనుకోవడం రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయని అనుకోవడమూ ఒకటే.
తుంగభద్రలో నీరు సమృద్ధిగా లభ్యమవుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకొనే దోరణితో లభ్యమవుతున్న నీటిని కరువుప్రాంతాలైన దక్షిణ తెలంగాణా, రాయలసీమ జిల్లాలకు తరలించేలా, నిల్వజేసేలా చూడాలి తప్ప తానుజేయలేని పని మరొకడు జేస్తున్నాడని ఏడవడం సీమపట్ల మొసలి కన్నీరు కార్చడమే. గతంలో బాబ్లీ రిజర్వాయర్ విషయం లో చంద్రబాబు సాధించినదేమిటో అందరికీ తెలుసు. అప్పుడు కృష్ణాడెల్టాకు నష్టం జరుగుతుందని ఆయన ఏడ్చాడు. ఆ తర్వాత జగన్ రెడ్డి తెలంగాణా ప్రాజెక్టుల వల్ల కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని కర్నూల్ లో నిరశన కార్యక్రమం చేపట్టాడు. అంతేగాని, సీమ గురించి ఇద్దరూ మాట్లాడలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గనుక ఇప్పుడు అన్ని పార్టీలూ అప్పర్ భద్రా గురించి మాట్లాడుతున్నారు. అంతేగానీ, తుంగభద్రా జలాల నిలువజేసుకోడానికి రిజర్వార్లను కట్టాలని ఎవరూ డిమాండ్ చేయడం లేదు. నిర్మాణంలో వున్నా సీమ ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తిజేయాలని అడగరు. గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు ఊసే ఎత్తరు. అప్పర్ భద్రా ప్రాజెక్టు సీమ ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే సాధనంయ్యింది. కర్ణాటకలో అది బిజెపికి ట్రాంప్ కార్డ్ అయితే, ఇక్కడ రాజకీయపార్టీలు దాన్ని తమకు ట్రాంప్ కార్డ్ గా మార్చుకొనే ప్రయత్నం జేస్తున్నారు. ఇది మన ప్రభుత్వం వృధాగా సముద్రంపాలవుతున్న జలాలను వినియోగించలెక, కర్నాటక ప్రభుత్వం పై అక్కసు కక్కడంవల్ల సీమ ప్రాంతానికి ఒరిగేదేమీ ఉoడదు. రాజకీయనాయకుల ఎత్తులు, జిత్తుల గమనించి , ఈ ప్రాంత బుద్ధిజీవులు అప్పర్ తుంగ ప్రాజెక్టు సమస్యతో , సీమ ప్రజల దృష్టిని అసలు డిమాండ్ల(విభజనచట్టం హామీలైన గాలేరు-నగరి, హంద్రీ-నీవ, వెలిగొండ ప్రాజెక్టుల పూర్తీ, కడప ఉక్కు కర్మాగారం, గుంతకల్ రైల్వే జంక్షన్, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు) నుండి మరల్చే ప్రయత్నాల గురించి ప్రజల అప్రమత్తం జేయాలి. ఒక ఎమోషనల్ సమస్యగా పరిగణించక సీమలో ఇప్పుడు నిర్మాణంలో వున్న ప్రాజెక్టుల సంపూర్తికై, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి, చెరువుల అనుసందానికై, వరద జలాల ఒడిసిపట్టడానికి మరిన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి సాధించగలిగితే ఉపయోగకరం.