అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా.
అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి తీసుకోలేం. అధికార, ప్రతిపక్షపార్టీలన్నీ ఈ సమస్య చుట్టూ వున్నాయి. అందువల్ల ఈ సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడది ప్రాంతాల మధ్య సమస్యగా రూపుదిద్దుకుంది.
మొదటినుండి కోస్తా ప్రాంతం పట్ల, అనేక న్యాయమైన కారణాలవల్ల సీమ ప్రజలకు వ్యతిరేకత వుంటూ వస్తుంది. దీన్ని తనకనుకూలంగా మార్చుకొనడంలో వై ఎస్ ఆర్ పి సఫలమైందని చెప్పవచ్చు. అమరావతి ప్రాంత రైతులపట్ల, వారి డిమాండ్ల పట్ల సీమలో, ముఖ్యంగా మధ్యతరగతి బుద్ధిజీవుల్లో, కొంతమేరకు విద్యార్థి లోకంలో వున్న వ్యతిరేకతను, ఆగ్రహాన్ని వైసీపీ అనునాయులు బాగా వ్యాప్తి చేయగలిగారు. ఆ వ్యతిరేకత, అమరావతి రైతులను తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించవద్దని హెచ్చరిక చేసేదాక పోయింది. ఇది చాలా బాధాకరం. అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉందనడంలో సందేహం లేదు. అంతేగాక ప్రతిపక్షాల మద్ధతు వుంది. అందుకనే వై ఎస్ ఆర్ పి శ్రేణులు అమరావతి రైతుల తిరుపతి సభను అడ్డుకోచూస్తున్నాయి. వై ఎస్ ఆర్ పి కి అనుయాయులు గాకున్నా అమరావతి రైతుల డిమాండ్లు రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అడ్డుగా ఉన్నాయని వారి సభ తిరుపతిలో జరగడానికి వీల్లేదని కొందరు రాయలసీమవాదులు అంటున్నారు. ఇది ఒక విధంగా, వైసీపీ గొంతును వినిపించినట్టే.
నిజంగా, రాయలసీమవాసుల వ్యతిరేకత ఆనాడు అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన అప్పటి ప్రభుత్వo పై, అందులో భాగస్వాములైన తెలుగుదేశం, బిజేపిపై వుండాలి. ఆ అమరావతి ప్రతిపాదనను పూర్తిగా సమర్థించిన జగన్ అండ్ కో పై ఉండాలి.అంతేగానీ, ఆ ప్రభుత్వపు హామీలను నమ్మి భూములిచ్చిన వారిపై వుండటం హేతుబద్ధతేనా? సీమవాసులు, తమకు న్యాయంగా రావాల్సినవి ఎందుకు రావడం లేదో ఆలోచించక, దానికి కారణాలను సరిగా విశ్లేసించిక ఏం కావాలో వాటికై ఉద్యమించక దానికి అమరావతి రైతులను బాధ్యులు చేయడం సరికాదు. ఇది వాదనకు నిలిచేది కాదు కూడా. అలాంటి ఆఫర్ ఇక్కడ, సీమలో రైతాంగానికిచ్చి, ఆ తర్వాత అమలు జేయకుండి వుంటే, ఈ ప్రాంత ప్రజాస్వామ్య మేధావులు రైతుల హక్కులకోసం పోరాడేవారా? కాదా? అనే ప్రశ్న ఉదయించడం సహజమే కదా! ఇది అమరావతి రైతుల డిమాండ్లను పూర్తిగా సమర్థించడం కాదు. అసలు రాయలసీమకు అన్యాయం చేసిన వారినీ, చేస్తున్న వారిని వదలి, అమరావతి రైతులపై ఆగ్రహం ప్రదర్శించడం వల్ల సీమకు కలిగే ప్రయోజనం ఏమిటి?
రాయలసీమ ప్రాంత మేధావులలో కొందరి వాదనలు:
- అమరావతి ప్రాంతంలో రాజధానికై భూములిచ్చినవారు రైతులే కాదు, వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వారి లబ్ది కోసమే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన చేసాడు. వారే యిప్పుడు రైతుల ముసుగులో ఉద్యమం చేస్తున్నారు.
- అలా భూములిచ్చినవారు ధనిక రైతాంగం. అందులోనూ ఒకే సామాజిక వర్గా(కమ్మ కులం)నికి చెందిన వారున్నారు.
- ఆ ప్రాంతం వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళేనాడూ ఇతరప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచించకుండా అన్నీతమకే కావాలంటారు.
- శివరామకృష్ణ నివేదికను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
- రాయలసీమ ప్రాంత రైతులు శ్రీశైలం ప్రాజెక్ట్ కై 80 వేల ఎకరాలు త్యాగంజేశారని, వారిని పట్టించుకోలేదని, ఇప్పుడు తమదే త్యాగం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని మరో వాదన.
పై వాదనలను ఒకసారి పరిశీలిద్దాం.
మొదటిగా, అమరావతికి భూములిచ్చినవారు రైతులాకాదా? సాధారణ రైతులున్నారా లేదా అనేది వాదనల వల్ల తేలేది కాదు. అక్కడ అంతర్గత ఒప్పందాలు జరిగాయనడo కోర్టులలో నిలబడలేదు. ఆవిషయానికోస్తే, అమారావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుజేయాలనే ప్రతిపాదన అక్కడి ప్రజలనుండి రాలేదు. పాలక పార్టీ తన ప్రయోజనాలను ప్రజా ప్రయోజనాలుగా ముందుకు తెచ్చింది. తమ ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాల ముసుగులో నెరవేర్చుకోవడం అన్నీరాజకీయపార్టీలకు వెన్నతో పెట్టిన విద్యేగా. (వైఎస్ఆర్సీపి మూడు రాజధానుల ప్రతిపాదంలోని ఆంతర్యమూ అదేఅంటున్నారు.)
ఇక భూములెవరిచ్చినా, వారికిచ్చిన హామీలు అమలుజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అందులోనూ, ఆ నిర్ణయం ఆనాడు అధికారంలో వున్న తెలుగుదేశం, బిజేపి పార్టీలదే కాదు, దానికి సంపూర్ణ మద్దతును, అదీ బేషరుతుగా ఇచ్చిన అన్నీపార్టీలదీ. అందులో ప్రధాన బాధ్యత, నాడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీది కూడా. ఆ విషయాన్ని మరుగుపరుస్తూ, భూములిచ్చినవారిని నిందించడం ఎంత సమర్థనీయమో పై మేధావులు ఆలోచించాలి.
ఇక, శ్రీశైలం ప్రాజెక్ట్ కై భూములిచ్చిన రాయలసీమ ప్రాంత రైతుల గురించి మన మేధావులకు ఇప్పుడు జ్ఞప్తికి రావడం విచిత్రం. అందులోనూ, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, అదీ, అమరావతి రైతుల ఉద్యమానికి పోటీగా వీరికి జ్ఞాపకం రావడం మరీ విచిత్రం. అయితే, శ్రీశైలం ప్రాజెక్ట్ కై భూములిచ్చిన రాయలసీమ రైతులకై సీమ ప్రజలు పోరాడితే అంతకన్నా సంతోషమేముంది? అంతేగాక, వీరిని సీమ రైతుల హక్కులకోసం ఉద్యమించవద్దని కోరే హక్కు ఎవరికీ, మరీ ముఖ్యంగా అమరావతి రైతులకు లేదు. సీమ డిమాండ్లపై మన ఉద్యమించే హక్కును ఎవ్వరూ కాదనలేరు. ఎవ్వరికీ సీమ ఉద్యమాన్ని అడ్డుకొనే హక్కులేదు కూడా. అలాంటప్పుడు, సీమ ప్రాంత రైతుల హక్కులకు అమరావతి రైతుల ఉద్యమాన్ని పోటీ పెట్టడం అసమంజసం, అప్రజాస్వామికం కూడా. వారి డిమాండ్లు మనకు నచ్చకపోతే వారికి మద్దతునివ్వాల్సిన అవసరం లేదు. అంతేగానీ, వారి ఉద్యమాన్ని నిందించే హక్కు ఎవరికీ లేదు. అంతేగాక సీమ సమస్యలకు అమరావతి రైతులను తప్పుపట్టడం, రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహంలో పావులు కావడమే.
విభజనానంతరం సీమపట్ల రాజకీయ పార్టీల వైఖరి:
అన్ని రాజకీయపార్టీలూ, 1953 నుండి సీమప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవే. ఈ ప్రాంత ప్రజల అవసరాలను తమ స్వప్రయోజనాల కోసం కోస్తాప్రాంత ధనిక రైతాంగానికి తాకట్టు పెట్టినవే. ఈ ప్రాంత రాజకీయ నాయకులు చేపట్టిన ఉద్యమాలు వారిని అందలమెక్కిoచాయి తప్ప, ప్రజలకు ఒనగూడినదేమీ లేదని చెప్పవచ్చు. పోతే, తమ ప్రాంతంవాడు ముఖ్యమంత్రి అయ్యాడన్న అల్ప సంతోషమే ప్రజలకు మిగిలింది. దీనికి నిందించాల్సింది సీమ ప్రాంతపు అన్ని రాజకీయపార్టీలనూ, వారిని నిలదీయలేని ఈ ప్రాంత చైతన్యాన్ని.
ఇక 2014 లో రాష్ట్ర పునర్విభజన తర్వాత, ఇప్పటి రాష్ట్రం, 1953 నాటి ఆంధ్ర రాష్ట్ర భౌగోళిక సరిహద్దులతో ఏర్పడిందని, అందువల్ల రాష్ట్ర రాజధాని కర్నూల్ లో ఏర్పాటవుతుందని కొత్త ఆశ సీమ విద్యావంతుల్లో కొందరికైనా చిగురించింది. అయితే, ఈనాడు అధికార, అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నేటి అధికార పార్టీ గానీ, దాని అనునాయులుగానీ, అంతేకాదు, నేడు అమరావతి రైతుల డిమాండ్లను వ్యతిరేకిస్తున్న మేధావులుగాని కర్నూల్ లో రాజధాని డిమాండ్ కై ఉద్యమం చేయడం అటుంచి, నోరు విప్పిన దాఖలాలు లేవు. కేవలం కొన్ని ప్రజా, విద్యార్థి సంఘాలు మాత్రమే కొంత అలజడిజేసాయి. ఇక, YSRCP సానుభూతిపరులైన కొందరు మేధావులు, మాజీ ఐఏఎస్ లు, ఇంజనీర్లు మాత్రం దొనకొండలో రాజధాని ఏర్పాటుజేయాలని అన్ని సీమ జిల్లాలలో కాలికి బలపంకట్టుకొని తిరిగారు. జగన్, ఆయన సహ MLAలు మాత్రం నోరు విప్పలేదు. రాబోయే ఎన్నికలలో అన్ని ప్రాంతాల ఓట్లు కావాలిగా! పోతే, పై మేధావుల కష్టానికి తగిన ఫలితం నేడు దక్కింది. లక్షల వేతనంతో ప్రభుత్వ సలహాదారులయ్యారు. సీమ డిమాండ్లను గాలికొదిలేసారు. ఇదీ, సీమపై నాడు YSRCPకి వున్న ప్రేమ. అంతేకాదు తెలంగాణాలో కొత్త నీటి ప్రాజెక్టుల వల్ల కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని కర్నూల్ లో మూడు రోజులు నిరసన దీక్ష వహించిన చరిత్ర నేడు సమదృష్టి అంటున్న జగన్ ది..
ఇక మూడు రాజధానుల విషయాని కొద్దాం. జగన్ కు ఆలస్యంగానైనా మంచి ఆలోచన కలిగిందని కొంతసేపు భ్రమిద్దాం. అప్పుడు ముఖ్యమంత్రిగా, ప్రజలకు భాధ్యత వహించే నాయకునిగా చేయాల్సిందేమిటి? తన నూతన విధానం వల్ల నష్టపోతున్నామంటున్న వారితో చర్చలు జరపాలి. వారికి తమ విధానపు హేతుబద్ధత వివరించాలి. వారుపొందే నష్టానికి తగిన పరిహారమిస్తానని హామీ యివ్వాలి. ఇదీ ప్రజాస్వామ్య పద్ధతి. మరి, జగన్ ఏంజేశారు? మోదీ కన్నా పెద్ద నియంతగా ప్రవర్తించాడు. మోదీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమకారులతో కనీసం నామమాత్రపు చర్చలన్నా జరిపింది. మన చక్రవర్తికి, ఆయన గారి మంత్రివర్యులకూ ఆ మాత్రం తీరుబాటు కూడా దొరకలేదు పాపం. హడావిడిగా అసెంబ్లీలో, తనకున్న బ్రూట్ మెజారిటీతో చట్టంజేశాడు. న్యాయస్థానంలో తిన్న మొట్టికాయలతో చట్టాన్ని రద్దుజేశాడు. అంతటితో ఆగితే, ఆయన జగన్ ఎలా అవతాడు? మళ్ళీ ఎలాంటి ఆటంకాలు రాకుండా మూడు రాజధానుల చట్టం తెస్తానన్నాడు. దానికి సీమ వాసుల అభ్యంతరమేమీ వుండదు. అయితే, జగన్ కు సీమపై నిజమైన ప్రేమ వుంటే, పాలక రాజధానిని విశాఖగా ఎందుకు ప్రకటించాడు? సీమప్రాంత ప్రజలకు అమరావతికన్నా విశాఖ అనుకూలమనుకోవాలా? లేక పాలక రాజధానికన్నా, న్యాయరాజధాని ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తుందనుకోవాలా? ఏమైనా, శ్రీబాగ్ ఒప్పందం అంటూ రాయలసీమ అస్తిత్వాన్ని ముందుకు గుర్తుకు తెచ్చారు, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనావికేంద్రీకరణ అంటూ సామ్యవాద ప్రణాళిక తెచ్చి ప్రగతిశీలవాదులలో కొందరి మెప్పు పొందాడు కూడా.
అయితే, సందేహమేమిటంటే రాజధాని తరలింపుకు కోర్ట్ లు అడ్డుపడ్డాయి గాని, హైకోర్ట్ ఏర్పాటుకు జగన్ చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఆయన హైకోర్ట్ తరలింపుకై కేంద్రప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి అనుమతి ఉత్తర్వులను పొందాలి. ఆ ప్రయత్నాలు ఇంతవరకు చేయలేదంటే ఏమనుకోవాలి?
ఇక్కడే మరో విషయం, తన పరిధిలో వున్న కృష్ణానది నిర్వహణ బోర్డ్ కార్యాలయాన్ని సీమలో కాకుండా, విశాఖలో ఏర్పాటుకై ప్రతిపాదించడంలో గల మతలబు ఏమిటో జగన్ అభిమానులూ, అనునాయులూ చెప్పగలరా?
పై విధాన విన్యాసాలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, తన పరపతిని ఒక్క కృష్ణా, గుంటూర్ జిల్లాలో తప్ప మిగతా జిల్లాలలో పెంచుకోగలిగాడు. అందుకే, ఈనాడు అశేష త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తూంటే, దానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం కేవలం విశాఖ ప్రజలకే పరిమితమయ్యింది. మిగతా రెండు ప్రాంతాలలో, రాజకీయ నాయకుల ప్రకటనలకే పరిమితమయ్యింది తప్ప, ప్రజాస్పందన లేదనేది చేదు వాస్తవం. ఇక అమరావతి రైతుల ఉద్యమం విషయం సరేసరి. దానికీ రాజకీయపార్టీల, మీడియా మద్దతు తప్ప మిగతా ప్రాంతాలలో ఏమాత్రం స్పందన లేదు. పైగా సీమ ప్రాంతంలో వ్యతిరేకతను మూట గట్టుకుంది. సీమ డిమాండ్ల విషయంలో, మిగతా ప్రాంతాలనటుంచి (వారెప్పుడూ సానుకూలంగా లేరు) సీమ సామాన్య ప్రజల్లోకి ఇంకా చొచ్చుకొని పోలేదు. ఈ పరిస్థితులలో, ప్రభుత్వం ఎవరి డిమాండ్లను పట్టించుకొకపోయినా, రాష్ట్ర ప్రజలందరి సమిష్టి సంఘటిత ఉద్యమానికి అవకాశం లేదు. ఇంతకన్నా పాలకులకు ఏం కావాలి?
ఇక టిడిపి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, బిజేపి పార్టీలు ఇప్పటికీ గతంలో తామిచ్చిన మద్దతుకు కట్టుబడి ఉన్నాయి. వారికెవ్వరికీ సీమప్రాంత అసెంబ్లీ సీట్లపై పెద్దగా ఆశలేదు. కోస్తా ప్రాంతంలో కొంతమేరకు సీట్లు సంపాదించగలమనే ఆశనే వారిని అమరావతి రైతులకు మద్దతునిచ్చేలా జేస్తున్నది. అంతే గాదు, ఇక్కడ కులసమీకరణలూ పనిజేస్తున్నాయన్నది సత్యదూరం కాదు. ఎవరంగీకరించినా, లేకపోయినా కమ్యూనిస్టులు తప్ప మిగతా పైన పేర్కొన్న అన్ని పార్టీలూ కులపార్టీలు, ఏకవ్యక్తి నియంతృత్వ పార్టీలే. వాళ్ళు సీమ న్యాయమైన డిమాండ్లకు మద్దతునిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. అందులోనూ ప్రభుత్వ ఏర్పాటులో సీమ ప్రాంత ఎమ్మెల్యేల పాత్ర తక్కువ. ఈ విషయం శ్రీబాగ్ ఒప్పందమే గుర్తించి, సవరించాలని కోరింది.
ఇక, అమరావతి రైతుల ఉద్యమం చట్టబద్ధత కలిగి వుండవచ్చు. న్యాయమైనదే అని వారనవచ్చు. కానీ, అభివృద్ధికి తామే కేంద్రం గావాలనీ, మిగతా ప్రాంతాల ప్రజల న్యాయమైన డిమాండ్లను తోసిరాజనడం అప్రజాస్వామికo. రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన రాగానే కోస్తా ప్రాంతపు దాదాపు ఆరు జిల్లాల న్యాయవాదుల సంఘాలు నిరసన తెలపడం వారి అప్రజాస్వామిక ధోరణికి, సంకుచితత్వానికి నిదర్శనం గాక మరేమవుతుంది? అలాంటప్పుడు, ఆ ప్రాంత ప్రజల న్యాయమైన డిమాండ్లకు మిగతా ప్రాంతాల ప్రజల మద్దతు ఎలా పొందగలరు? సీమ ప్రజలు నేడు డిమాండ్ చేస్తున్నది – అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలి. అందుకోసం వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, శ్రీకాకుళాంధ్రలకు ప్రాధాన్యతనివ్వాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని కొంతమేరకైనా నెరవేర్చేందుకు సీమలో హైకోర్ట్, మిగతా రెండు ప్రాంతాలలో హైకోర్ట్ బెంచీలు, రాయలసీమ, శ్రీకాకుళాంధ్రలలో మినీ సెక్రటేరియట్లు, అసెంబ్లీ సమావేశాలతో పాటు, ముఖ్యమైన కార్యాలయాలను అన్నిప్రాంతాలలో ఏర్పాటు జేయాలి.
తద్వారా మాత్రమే అన్నీ ప్రాంతాల మధ్య సమాభివృద్ది, సమతుల్యత ఏర్పడుతుంది. అది సమైక్యతా భావనకు దారి తీస్తుంది. ఈ విషయంలో చొరవ తీసికోవాల్సిన భాధ్యత అభివృద్ది చెందిన కోస్తా ప్రాంత ప్రజాస్వామ్యవాదులదని వేరే చెప్పాలా? రాష్ట్రాభివృద్ధిలో తమవంతు వాటా పొందనపుడు, సీమ ప్రజలూ తెలంగాణ ప్రజల బాట పట్టక తప్పదు.
తాజాకలం: గుంటూరులో హైకోర్ట్ అదనపు భవన నిర్మాణానికై ప్రధాన న్యాయమూర్తి శంఖుస్థాపన జేసారని ఆంగ్ల దినపత్రిక వార్త. అంటే సీమకు హైకోర్ట్ హుళక్కే. అయితే, సీమవాసులకు మరొక ఆశ కల్పిస్తున్నారు – సీమలో అసెంబ్లీ పెట్టాలని జగన్ యోచనట. సీమవాసులు ఎంత అమాయుకులైనా, ఆశావాదులైనా సీమ ప్రత్యేక రాష్ట్రమేర్పడకుండా రాజధాని కర్నూల్ కు వసుందని నమ్మేటంత అజ్ఞానులు కారు. సీమలో వారి హక్కుల పట్ల పెరుగుతున్న చైతన్యాన్ని, వారి ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే ఇది.
– అరుణ్, రాయలసీమ విద్యావంతుల వేదిక