దేశంలో ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని, దేశం ప్రగతి పథంలో దూసుకోపోతోందని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప వాస్తవం కాదని పలు అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం తగ్గుతూ ఉన్నదని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని    మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, ధనికులు మరింతగా పెరుగుతున్నారు. ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. భారత దేశ ఆదాయం, సంపదను విశ్లేషిస్తూ మొత్తం పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించి ధనిక కుటుంబాల నికర సంపదపై 2 శాతం సూపర్‌ ట్యాక్స్‌ విధిస్తే తప్ప సంపద కేంద్రీకృతం ఆగదని ప్రపంచ అసమానత ల్యాబ్‌, ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు కేంద్రానికి సూచించాయి. దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి శాతం పలు దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. దేశంలో పన్నుల వ్యవస్థలో ఎగవేతలు భారీగా ఉన్నాయి. ఫలితంగా నల్లధనం పెరిగి ధనవంతులు మరింతగా ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారనేది యదార్థం.

 మోడీ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను అనేక అంతర్జాతీయ సంస్థల సర్వేలు బట్టబయలు చేశాయి, చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న తీవ్ర ఆర్థిక అసమానతల గురించి ఇన్‌కం అండ్‌ వెల్త్‌ ఇన్‌ ఈక్వాలిటీ ఇన్‌ ఇండియా, ది రైజ్‌ ఆఫ్‌ ది బిలియనీర్‌ రాజ్‌ పేరుతో 2022లో విడుదలైన నివేదికలో అసమానతల పెరుగుదలను వెల్లడిరచింది. అందులో ఆదాయం, సంపద అసమానత పరంగా ప్రపంచంలోనే భారతదేశం ప్రత్యేకంగా  నిలిచిందని, దేశ జనాభాలో దిగువ 50 శాతం మంది తలసరి వార్షిక ఆదాయం 53,610 రూపాయలుగా, జనాభాలో 10 శాతం సంపన్నులుగా ఉన్న వారి ఆదాయం అందుకు 20 రెట్లు ఎక్కువగా ఉంది. ఒక శాతంగా ఉన్న అగ్రశ్రేణి ధనికులు జాతీయ ఆదాయంలో 20 శాతం కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు.  దిగువ సగం మంది కేవలం 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారని పేర్కొన్నది. ఆ నివేదిక డేటా ప్రకారం భారత దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఆదాయం, సంపదలలో అసమానత పెరుగుతూనే ఉందని, అది కొనసాగుతూనే ఉందని వెల్లడిరచింది.

ఆల్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సర్వే (ఎఐడిఐఎస్‌) ఇటీవల సంవత్సరాల్లో భారతదేశంలో సంపద అసమానతలో మార్పులను పరిశీలించడానికి సూక్ష్మస్థాయి డేటాను అందిస్తున్నది. ప్రపంచ అసమానతల డేటా ఆధారంగా 1981 నుండి 10 శాతం పెద్ద ధనికులు, 1 శాతంగా అతి పెద్ద ధనికుల సంపద పెరిగిందని, దిగువ 50శాతం మంది సంపద క్షీణించిందని పేర్కొంది.1990 నుంచి భారతదేశంలో ఆదాయ అసమాతనలు గణనీయంగా పెరిగాయి. దేశంలో గుత్తాధిపత్యం పెరుగుతుందని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అయినా ప్రభుత్వం నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. ఫలితంగా నిజ వేతనాలు తగ్గుతున్నట్లు, దీంతో అసమానతలుపెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొన్నది. విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రైవేట్‌ కార్పొరేట్‌లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధక చర్యలు తీసుకోకుండా గతంలో లబ్ధి పొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందుతున్నాయి. పేద, మధ్య తరగతి దేశాలు రుణ భారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి.

 ప్రపంచ మొత్తం పేదల్లో 57 శాతం (240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) జరిపిన పరిశోధనలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికాలోని వస్తు ఉత్పాదక రంగంలో 76 శాతం మంది కార్మికుల ఆదాయాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవ కల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించేట్లు  చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొరేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్‌ కంపెనీ విలువ 2023లో మూడు లక్షల కోట్ల డాలర్లనుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7 లక్షల కోట్లని అంచనా. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019 నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది. 2023 నాటికి 23 శాతానికి పెరిగింది.

 ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు జరుగుతున్న  అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది అంతర్జాతీయ  ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటానికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది. మరోవైపు కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచివేతల కారణంగా ట్రేడ్‌ యూనియన్లలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఓయిసిడి దేశాలలో 1985లో30 శాతం మంది చేరగా 2017 నాటికి 17 శాతానికి పడిపోయింది. ఆదాయ సంపద అసమానతలను, సంపదల కేంద్రీకరణలను చరిత్ర చూడలేదు. ఫలితంగా సంపన్నులకు భూతల స్వర్గం అయితే పేదలకు కష్టాల నిలయంగా ఉంది.

 ప్రపంచంలోనే అత్యంత అసమాన దేశాల్లో భారత్‌ ఒకటి అని పలు నివేదికలు పేర్కొన్నాయి. కానీ  కులం, మతం, ప్రాంతం, జెండర్‌ వంటి అంశాలు సమాజ విచ్ఛిన్నతలకు, ఆర్థిక అసమానతల విస్తృతికి తోడ్పడుతున్నాయని నివేదికలు వెల్లడిరచాయి. మరోవైపు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు (1990) తర్వాత టాప్‌ 10 శాతం ధనికుల వద్ద 60 శాతం కంటే ఎక్కువ సంపద ఉంటే, దిగువ 50 శాతం జనాభా వద్ద కేవలం మొత్తం సంపదలో 6 శాతం మాత్రమే ఉంది. వారి వాటా 1961 నుండి సగానికి పడిపోయి, 1980 నుండి 2021 నాటికి 80 శాతం తగ్గింది. అదే సమయంలో ధనికుల వాటా 50 శాతం నుండి 80 శాతానికి పెరిగింది. భారత్‌ అసమానతల దేశంగా సంపన్న వర్గాలతో నిండి ఉందని, భారతదేశ సంపద పంపిణీలో అసమానత ఎంత వేగంగా పెరుగుతోందో కూడా తెలిపింది. దేశ సంపదలో కుటుంబ సగటు సంపద 9,83,010 రూపాయలు కలిగి ఉంటే, దిగువ 50 శాతం కుటుంబాల వద్ద సగటున 66,280 రూపాయలు మాత్రమేనని పేర్కొంది.

జనవరి 2024లో ఆక్స్‌ఫామ్‌ అనే స్వచ్చంద సంస్థ ప్రపంచ ఆర్థిక అసమాతనలపై 71 పేజీల నివేదికను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌) అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న సందర్భంలో ఈ నివేదికను ఆక్స్‌ఫామ్‌ జనవరి 15న విడుదల చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజా సంపద కొద్దిమంది ఆధిపత్య వర్గాల, పారిశ్రామిక కార్పొరేటు శక్తుల, సంపన్న వర్గాల, శక్తివంతమైన పెట్టుబడిదారుల స్వంతం అవుతున్నట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక-2024 రుజువు చేసింది.1 శాతంగా ఉన్న ధనవంతులు తమ చేతుల్లో ప్రపంచ ఆర్థిక సంపదలో 43 శాతం వాటాను కలిగి ఉన్నారు. సంపదల వ్యత్యాసం ఎంతగా ఉన్నదంటే ప్రపంచంలోని అతిపెద్ద వంద కంపెనీల ఒక్కో  సిఇఒ ఒక సంవత్సరంలో సంపాదించే మొత్తాన్ని ఒక మహిళా కార్మికురాలు సంపాదించాలంటే 1,200 సంవత్సరాలు పడుతుంది. 2020 నుండి 2023 వరకు సంపన్నుల ఆస్తులు  రెండిరతలయ్యాయి.  అదే సమయంలో ఐదు వందల కోట్ల మంది ప్రజల సంపద  పడిపోయి మరింత పేదరికంలోకి వెళ్లారు.

ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం భారత్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండికూడ అసమానతలో ఒక దేశంగా ఉండటం ఒక వైచిత్రి. గత మూడు దశాబ్దాలుగా అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. క్రోనీ క్యాపిటలజిం సంపదలో అధిక భాగాన్ని కాజేస్తున్నాయి. పేదలు కనీసం వేతనం పొందడానికి, నాణ్యమైన విద్య, వైద్యం సేవలు అందుకోవడానికి కష్టపడుతుండగా సంపన్నులు సౌఖ్యంగా ఉన్నారు. పెరుగుతున్న అసమానతలు మహిళలను, పేదలను ఎక్కువగా  ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ప్రభుత్వాలు కార్పొరేట్ల శక్తిని నియంత్రించాలని, సంపన్నుల లాభాలపై, సంపదపై అధిక పన్నులను విధించాలని పిలుపునిచ్చింది.

మొత్తం భారత జాతీయ సంపదలో 77 శాతం టాప్‌10 శాతం కలిగి ఉంది. 2017లో ఉత్పత్తి చేయబడిన సంపదలో 73 శాతం అత్యంత ధనవంతులైన 1 శాతం మందికి చేరింది, అయితే 67 కోట్ల మంది పేదలు అంటే జనాభాలో సగం మంది తమ సంపదలో కేవలం 1 శాతం పెరుగుదలను మాత్రమే చూశారు. భారతదేశంలో 162 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంఖ్య 2000లో కేవలం 9 నుండి 2017లో 101కి పెరిగింది. 2018-2022 మధ్య భారతదేశం ప్రతిరోజూ 70 మంది కొత్త మిలియనీర్లను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేసింది. ఒక దశాబ్దంలో బిలియనీర్ల సంపద దాదాపు  10రెట్లు పెరిగింది, వారి మొత్తం సంపద 2018-19 ఆర్థిక సంవత్సరానికి భారత యూనియన్‌ బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉంది, ఇది భారత కరెన్సీలో రూ.24422 బిలియన్లు (ఒక బిలియన్‌కు 100 కోట్లు). అత్యధికులు తమకు అవసరమైన విద్య ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం విద్య ఆరోగ్య సంరక్షణ ఖర్చుల  కారణంగా 6 కోట్ల 30 లక్షల మంది పేదరికంలోకి జారుకుంటున్నారు.

ప్రజల కొరకు పనిచేయవల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్‌, అత్యంత ధనవంతుల ప్రయోజనాల కోసం విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. కార్మికుల హక్కులను హరించివేయడం, కనీస వేతనాలను అమలు చేయకపోవడం, కార్మిక ప్రయోజన చట్టాలను సడలించడం, బాల కార్మిక చట్టాలను సరళీకరించడం, ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండడం ద్వారా ఏకఛత్రాధిపత్యాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారు. అశేష ప్రజానీకానికి చెందవల్సిన న్యాయమైన వాటాను దక్కనీయకుండా, వారిని ఆర్థికంగా ఎదగనీయకుండా పలు క్రూరమైన విధానాలను అమలు చేస్తున్నారు. శ్రామికులు సృష్టించిన సంపదలు వారికి దక్కవల్సినంతగా దక్కకుండా ఏ కొద్దిమంది బొక్కసాల్లోకి తరలిపోతున్నదని ఆక్స్‌ఫామ్‌ నివేదిక – 2024 స్పష్టం చేసింది. 

ప్రపంచ అసమానతల ల్యాబ్‌, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలోని అంశాలు రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేక దిశలో దేశం ఎంతవేగంగా పయనిస్తుందో తెలియజేస్తోంది. వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ జనవరి 21న ప్రచురించిన నివేదిక ప్రకారం 2014-15, 2022-23 మధ్యకాలంలో దేశంలో సంపదకు సంబంధించి ఆదాయ అసమానతలు అధికంగా పెరిగాయి. భారత జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం కేవలం 1 శాతం  ప్రజల చేతిలోనే ఉండిపోతోంది. ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భారతి, లూకస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టి, అన్మోల్‌ సోమంచి ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. అత్యంత సంపన్నులైన 1శాతం జనాభా ఆదాయం, సంపద వాటాలు రికార్డు స్థాయిల్లో ఉన్నాయి. 2022-23లో దేశ ఆదాయంలో 22.6 శాతం, సంపదలో 40.1 శాతం వీరి వద్దే ఉంది. వీరి సంపద వాటా 1961 తర్వాత ఈ స్థాయిలో ఉండడం ఇదే మొదటిసారి. ఆదాయాలు, సంపదలు కొద్ది మంది వద్దే పోగుబడి ఉండడం సమాజం, ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది.

2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. మోడీ ప్రభుత్వ దశాబ్ద పాలనా కాలంలో అనేక ప్రధాన రాజకీయ, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘దేశాన్ని అభివృద్ధి చేస్తామని, ఆర్థిక సంస్కరణలు చేపడతామనే హామీతో బిజెపి అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండుసార్లు దేశాన్ని పాలించింది. అయితే ఈ కాలంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైంది. ఫలితంగా అది నిరంకుశ పాలనకు దారితీసింది. బడా వ్యాపారవేత్తలు, ప్రభుత్వం మధ్య సంబంధాలుపెరిగిపోతున్నాయి’ అని ఆ నివేదిక వివరించింది. భారతదేశంలో ఆదాయం సంపద అసమానత 2022-23 బిలియన్‌రాజ్‌ పెరుగుదల అనే శీర్షికతో కూడిన ప్యారిస్‌కు చెందిన ప్రపంచ అసమానత ల్యాబ్‌ నివేదిక ‘భారత ఆధునిక బూర్జువా’ నేతృత్వంలోని ‘బిలయన్‌ రాజ్‌’ ఇప్పుడు వలసవాద నేతృత్వంలోని బ్రిటిష్‌ రాజ్‌ కంటే అసమానత, దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ సమస్యపై లోతైనా విచారణ, విస్తృత చర్చ అవసరమని నివేదిక పేర్కొంది. గత దశాబ్ద కాలంగా దేశంలో కీలకమైన సంస్థలు సిబిఐ, ఇడి, ఐటి కార్పొరేట్లతో రాజీ పడ్డాయని కూడ పేర్కొంది.

    ఫోర్బ్స్‌ బిలియనీర్‌ ర్యాంకింగులను ఈ నివేదిక ఉటంకించింది. సుమారు రూ.100 కోట్ల డాలర్ల కంటె నికర సంపద ఎక్కువగా ఉన్న భారతీయులు 1991లో ఒక్కరు మాత్రమే ఉండగా 2023 నాటికి వారి సంఖ్య 167కు పెరిగింది. ఇదే కాలంలో ఈ వ్యక్తుల మొత్తం నికర సంపద దేశ నికర జాతీయాదాయంలో 1 శాతం నుండి 25 శాతానికి పెరిగింది. ఆదాయం, సంపదను లెక్కించడానికి దేశంలో పన్ను వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నదని నివేదిక అభిప్రాయపడిరది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలో ప్రభుత్వ పెట్టుబడులు సగటు భారతీయుల కోసమే ఉండాలి తప్పించి సంపన్నుల కోసం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆర్థిక సమాచారం నాణ్యత పేలవంగా ఉన్నదని, ఇటీవలి కాలంలో అది పడిపోతోందని నివేదిక  తెలిపింది. పెద్ద సామాజిక, ఆర్థిక తిరుగుబాటు లేకుండా ఇటువంటి అసమానతలు ఎంతకాలం కొనసాగగలవో చెప్పలేనటువంటి అస్పష్టత కనిపిస్తోందని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది.

భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశాన్ని సామ్యవాద దేశంగా ప్రకటించుకున్నాము. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 39సి సంపద కేంద్రీకరణ కాకుండా చూడాలని సూచించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ తరుణంలో సంపద కేంద్రీకరణపై ప్రపంచ అసమానత ల్యాబ్‌ నివేదిక వెలువరించిన సమాచారం ప్రకారం భారత్‌లో దిగువ 50 శాతం మంది తలసరి ఆదాయం మొదటి పది శాతం మంది తలసరి ఆదాయం కన్నా 20రెట్లు తక్కువగా ఉంది. మొత్తం జాతీయాదాయంలో మొదటి 10శాతం దగ్గర 57 శాతం, మొదటి ఒక శాతం మంది దగ్గర 22 శాతం సంపద పోగుబడిరది. ప్రపంచంలోనే అత్యంత అసమానతల దేశంగా పేదలు (22.89 కోట్లు) ఎక్కువగా ఉన్న దేశంగా భారతదేశం మారిపోయింది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2030 నాటికి ఏడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మారుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు పెరిగిన సంపద దేశ ప్రజలకు పంపిణీ చేయడంలో శ్రద్ధ వహించడం లేదు. మొదటి పదిశాతం మంది వద్ద మూడిరట రెండు వంతుల సంపద చేరితే అది దేశ అభివృద్ధి అవుతుందా? సంపదను సృష్టిస్తున్న అధిక శాతం శ్రామిక ప్రజల వద్దకు ఈ సంపద చేరకుండా దేశ అభివృద్ధి సాధ్యమా?

బ్రిటీష్‌ వలస ప్రభుత్వ కాలంలో (1857-1947) మొదటి 10 శాతం మంది వద్ద దాదాపుగా 50 శాతం సంపద కేంద్రీకరించబడిరది. 1947 ఆగష్టులో అధికార బదిలీ తర్వాత అమలుచేసిన పంవచర్ష  ప్రణాళికలు ఈ సంపద కేంద్రీకరణను 35 శాతానికి తగ్గించాయి. ఈ విధానాలు ప్రజల జీవితాలలో వెలుగులు నింపకపోగా కారు చీకట్లను అలుముకునేలా చేశాయి. ప్రజలు వాడుకునే నిత్యావసరాలపై పన్నులు పెంచడమనేది అసమానతలకు దారితీస్తుంది. పెట్రోల్‌, వంటగ్యాస్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచడం ద్వారా 2014-15లో రూ.99 వేల కోట్ల నుండి 2021 నాటికి 3.73 లక్షల కోట్ల రూపాయలను (277 శాతం పెరుగుదల) ప్రజల నుంచి వసూలు చేశారు. పెట్రోలు 79 శాతం, డిజిల్‌ 101 శాతం,  వంట గ్యాస్‌ 300 శాతం ధరలు పెంచడమనేది ఒక ఉదాహరణ మాత్రమే. పేదలు వారి సంపాదనలో అధికభాగం పన్నులకు చెల్లించవలసి వస్తుంటే వారి జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగవుతాయి? దిగువ 50 శాతం మంది మొదటి 10 శాతం మంది కంటే ఆరు రేట్లు ఎక్కువ పన్నులు(జిఎస్‌టి) చెల్లిస్తున్నారు. ఆహార, ఆహారేతర ఉత్పత్తులపై పన్నులలో 64.3 శాతం పన్నులు దిగువ 50 శాతం మంది ప్రజల నుండే వసూలు చేస్తున్నారు.

 అసమానతలు తగ్గించడానికి చేపట్టాల్సిన, చేపట్టగలిగే చర్యలు ఎన్నో ఉన్నాయి. సంపన్నులపై అధిక పన్నులు విధించే ప్రగతిశీల పన్ను విధానాలను అమలు చేయడం వల్ల సంపద, ఆదాయాన్ని మరింత సమానంగా పున్ణపంపిణీ చేయవచ్చు. దేశంలో    కేవలం అత్యంత 162 సంపన్న  భారతీయ కుటుంబాల నికర సంపదపై కేవలం 2శాతం పన్ను విధిస్తే  ప్రభుత్వాలు గణనీయమైన  ఆదాయాన్ని పొందవచ్చని ఆర్థికవేత్తలు సెలవిస్తున్నారు. అధిక నాణ్యత గల విద్య, నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం వలన వ్యక్తులు, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు చెందిన వారు మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందేందుకు, సంపాదన  సామర్థ్యాన్ని  పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగ భృతి, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత వంటి సామాజిక భద్రతా కార్యక్రమాలను బలోపేతం చేయడం వల్ల పేదలకు ఆర్థిక పరిపుష్టి లభించడమే కాక, ఆర్థిక మాంద్యం సమయంలో వారు పేదరికంలో లోతుగా పడిపోకుండా కాపాడుకుంటారు. తగిన కనీస వేతన ప్రమాణాలను అమలు చేయడం వలన కార్మికులు వారి శ్రమకు న్యాయమైన పరిహారం పొందడం జరిగి తద్వారా ఆదాయ అసమానతలు తగ్గుతాయి.

కులం, జాతి, లింగం, ఆర్థిక స్థితి ఆధారిత వివక్షను రూపుమాపడం కోసం కార్యక్రమాల రూపకల్పన, అమలు సమ సమాజాన్ని సృష్టించడానికి, వ్యక్తులందరికీ ఆర్థిక అవకాశాలకు సమాన ప్రాప్యతను నిర్థారించడానికి కీలకమైనది. ఆదాయం- సంపదలలో తీవ్ర అసమానతలను రూపుమాపకపోతే అవి ఆర్థిక అస్థిరతకు దారి తీసి, సామాజిక ఐక్యతను నాశనం చేసే అవకాశం ఉంది. సామాజిక చలన శీలతకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాకుండా, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలకు, సామాజిక అశాంతికి, సంఘర్షణలకు దారితీస్తాయి. పౌరులందరికీ అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు కలిగిన సమ సమాజ కల్పన మన రాజ్యాంగ ఆదర్శం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆర్థిక సమానత్వం కోసం కార్యక్రమాలు రూపొందించాలని పాలకులను నిలదీయడమే. ప్రజల ముందున్న ఏకైక మార్గం.

Leave a Reply