కత్తి మోహన్ రావు స్మృతిలో
ఎంఎస్సి కెమెస్ట్రీ విద్యార్థిగా, ఆర్ఎస్యు నాయకుడుగా 1982 నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసిన సన్నిహిత మిత్రుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించి ఇప్పటికీ ఏడాదిన్నర కావొస్తుంది. ఆయన స్మృతిలో గుర్తుచేసుకోవాల్సిన విషయాలు రెండు – కాకతీయ యూనివర్సిటీలో కెమెస్ట్రీ ల్యాబ్ తగులబడినపుడు పోలీసులు ఆయనను అందుకు బాధ్యుణ్ణి చేసి ముద్దాయిని చేయడం. ఒకే ఊరు, సహ విద్యార్థులు చైతన్య పూర్వకంగా ఎంచుకొని ఒకరు మెడిసిన్‌లోకి ఒకరు కెమెస్ట్రీలోకి వచ్చిన ఒకే ఊరు విదార్థులు డా. ఆమడ నారాయణ, మోహన్‌రావుల ఆదర్శ జీవితం. చివరిసారి ఆయనను వరంగల్ జైలు నుంచి బెయిల్ మీద విడుదల చేయించుకొని అతని సోదరులు పోతూ ఉంటే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో చూసాను. నేను విశాఖపట్నం పోతున్నాను. స్లీపర్ బర్త్‌లో ఉన్నాను. వాళ్లు ఖమ్మంలో దిగాలి కనుక కూర్చోవడానికి లేదా నిలబడడానికైనా చోటు దొరుకుతుందని వాళ్లు నేను అందులో ఉన్నానని తెలియకుండానే నేనున్న కంపార్ట్మెంట్లో ఎక్కారు. ఖమ్మంలో దిగేముందు మాత్రమే నేను నా స్లీపర్ బెర్త్ నుంచి ఆయనను చూసి పలకరించగలిగాను. ఆయన చనిపోయినప్పుడు ఆయన మరణవార్తతో పాటు, ఆయన గురించి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పంపిన సంతాప సందేశం కూడా ‘సాక్షి’ దిన పత్రిక ప్రస్తావించింది.
మావోయిస్టు పార్టీ రెండవ తరం నాయకుల్లో కీలక నేతగా ఎదిగిన కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ 2021, ఏప్రిల్ 10న గుండెపోటుతో మరణించాడు 11న దండకారణ్యంలో పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయని, ఈ పత్రిక ద్వారానే తెలిసిన సమాచారం. ఆయన కిన్నెర దళానికి డిప్యూటీ కమాండర్, మహదేవపూర్ దళ కమాండర్‌గా పనిచేసినట్లు తర్వాత ఏటూరునాగారం పాండవ దళ స్క్వాడ్ ఏరియా సభ్యుడుగా ఉన్నట్లు, ఉత్తర తెలంగాణ ప్రెస్ యూనిట్ నిర్వహణ కమిటీలో, ఖమ్మం జిల్లా కమిటీలో పనిచేసి 2008లో దండకారణ్యానికి బదిలీ అయినట్లు తెలిసింది. అక్కడ పేరు మార్చుకొని జనతన సర్కార్ నడుపుతున్న స్కూల్లో గురూజీగా పనిచేశాడని, ఆ క్రమంలోనే 1985, 1992లో రెండు సార్లు పోలీసులకు పట్టుబడి ఆరేళ్లపాటు జైలు జీవితం అనుభవించినట్లు గూడా రాసింది. మోహన్‌రావు నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం ముగిసిందని మావోయిస్టు పార్టీ ప్రకటించిందని కూడా రాసింది.
80ల నుంచి, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో గానీ, పరిధిలో గానీ వరంగల్ జిల్లాలోగానీ రాడికల్ విద్యార్థి సంఘాన్ని నిర్మాణం చేస్తూ, మార్గదర్శకత్వం చేసిన నాయకత్వంలో సాగర్ (పులి అంజయ్య) ఐలన్న (గోపగాని ఐలయ్య) లింగమూర్తిల తర్వాత విప్లవోద్యమంలో రాష్ట్ర స్థాయికి ఎదిగిన నాయకత్వంలో నిస్సంశయంగా కత్తిమోహన్‌రావు ఉంటాడు. వీళ్లు ముగ్గురు కూడా ఎం.కాం., ఎం.ఎ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు వంటి ఆప్షనల్స్‌తో క్యాంపస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లే. వీరిలో పులి అంజయ్య లెఫ్ట్ ఫ్రంట్ తరఫున పిడిఎస్యు నుంచి బుర్రా రాములు (ఎం.ఎ. ఎకానామిక్స్)తో పాటు ప్యానెల్లో జనరల్ సెక్రెటరీకి పోటీచేసి ఇద్దరూ అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఐలయ్య సికెఎం నుంచే ఆర్‌ఎస్‌యును నిర్మాణం చేస్తూ త్వరలో విప్లవోద్యమంలో సాగర్‌తోపాటు జిల్లా స్థాయి నాయకుడై అరెస్టు కూడా అయ్యాడు. జి. లింగమూర్తి ఎం.ఎ. తెలుగులో ఎం. గంగాధర్ రెండు బంగారు పతకాలు పొందితే తాను ఆధునిక సాహిత్యంలో ఒక పతకం పొందాడు. కాళీపట్నం రామారావు కథలపై ఎం.ఫిల్కు రిజిష్టర్ చేసుకున్నాడు. 1984 నాటికే కె. యు. క్యాంపస్‌లో కూడ పోలీసు స్టేషన్ వచ్చి రాడికల్స్ ఎబివిపిల మధ్య ఘర్షణ వచ్చి ముందుగా పులి అంజయ్య, గోపగాని ఐలయ్య క్యాంపస్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. 1984 నాటికి ప్రభుత్వానికి పాలక పార్టీలకు కార్ల్‌మార్క్స్ యూనివర్సిటీగా కన్నెర్ర అయిన క్యాంపస్ హాస్టళ్లపై జిల్లా కాంగ్రెస్ నాయకుడు హయగ్రీవాచారి, ఆర్ఎస్ఎస్ వాళ్లు టైగర్‌గా పిలుచుకునే బిజెపి హైదరాబాద్ గూండాల నాయకుడు నరేంద్ర నాయకత్వంలో ఆర్గనైజ్ చేసిన గూండాలు జి. లింగమూర్తి మొదలైన వారిని లక్ష్యంగా పెట్టుకొని క్యాంపస్‌లోని నాలుగు హాస్టల్ గదుల పై దాడులు చేసి బీభత్సం సృష్టించారు. అప్పటికే రాత్రిపూట తమ గదుల్లో నిద్రించడం మానేసిన ఆర్ఎస్యు విద్యార్థి నాయకులు ఇంక అజ్ఞాత జీవితం ఎంచుకోవాల్సి వచ్చింది. పోలీసుల సహాయంతోనే ఈ దాడి జరిగాక, పోలీసులు ప్రవేశించి ఒక గదిలో జి. లింగమూర్తి, పుస్తకాలు, కాగితాల్లో అన్నాసాగరం భూస్వామిని హత్య చేసే మ్యాప్ దొరికిందనే ఆరోపణతో ఆయనపై, మరి కొందరు విద్యార్థి నాయకులపై ఎఫ్ఐఆర్ చేసారు. 1985 నాటికి ఈ ముగ్గురు నాయకులు పూర్తికాలం అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నారు. పులి అంజయ్య సాగర్‌గా జిల్లా కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయికెదిగి, రాష్ట్ర కార్యదర్శిగా సహచరి భాగ్యతో పాటు 1993 అక్టోబర్ 24న బెంగళూరులో అరెస్టయి పీచర పొలాల్లో ఎన్‌కౌంటరయ్యాడు. గోపగాని ఐలయ్య కొరియర్ రాజమౌళితో పాటు నవరంగ్ టాకీసు ముందు అరెస్టయిన ‘మిస్సింగ్’ కేసులో జస్టిస్ టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ కూడ కె.ఎస్. వ్యాస్, అనురాగ్ శర్మలను బాధ్యులుగా గుర్తించింది. అప్పటికాయన ఉత్తర తెలంగాణ రీజినల్ కమిటీ కార్యదర్శిగా విప్లవోద్యమ విస్తరణను గడ్డు రోజుల్లో నిర్వహించి ఉన్నాడు. జి. లింగమూర్తి కర్నూలుకు ఆర్గనైజర్‌గా వెళ్లి రాయలసీమ విప్లవోద్యమ నాయకుడుగా రాష్ట్ర స్థాయి నాయకుడై 2002 లో కృష్ణా నదిని నల్లమలలో దాటుతూ పుట్టి మునిగి అమరుడైనాడు.
కాకతీయ క్యాంపస్‌లో 1985 నాటికి ఆర్ఎస్యు నాయకుడుగా గుర్తింపు పొందిన కత్తి మోహన్‌రావు ఎం.ఎస్.సి. కెమెస్ట్రీ విద్యార్థి. ఆయనది అవిభక్త వరంగల్ జిల్లా ఇప్పటి మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామం. ఆ గ్రామం నుంచి ఇంటర్ తర్వాత వరంగల్‌కు వచ్చిన ఇద్దరు బాల్య మిత్రులు ఆమడ నారాయణ, కత్తి మోహన్ రావు. ఒకరు వైద్య శాస్త్రం, మరొకరు సైన్స్ చదవడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరూ అదేకాలంలో అంటే 1982లో ఆర్ఎస్యులో చేరారు. అందుకే తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి జగన్ ఆయనది నలబై సంవత్సరాల విప్లవోద్యమ జీవితం అన్నాడు. ఆమెడ నారాయణ అతిపేద కుమ్మరి కుటుంబం నుంచి వచ్చి రిజర్వేషన్, స్కాలర్‌షిప్‌లతో మెడిసిన్ పూర్తిచేసి డాక్టర్ రామనాథం గారి దగ్గర క్లినిక్‌లో కొన్నాళ్లు పనిచేసి అప్పటి (90ల) జిల్లా విప్లవోద్యమంలో అమరుడు రామకృష్ణ (సుదర్శన్‌రెడ్డి) కోరికపై మొగిలిచెర్లలో ప్రజావైద్యశాల పెట్టి ప్రజా వైద్యుడుగా వేలాది మంది నోట్లో నాలుక అయ్యాడు. ఆయన ప్రజాదరణకు భయపడిన పోలీసులు మొగిలిచెర్లలోన స్కూటర్‌పై వస్తుంటే చెరువుకట్టపై చికిత్స నెపంతో ఆపి కాల్చి చంపారు. నార్మన్ బెతూన్ కొట్నీస్ల దారిలోనే కాదు భాస్కరరావు మల్లికార్జునుడు, డా. రామనాథంల దారిలో నడిచిన డాక్టర్ అతను.
కత్తి మోహన్‌రావు ఎం.ఎస్.సి. కెమెస్ట్రీ చేసి రెండు బంగారు పతకాలు పొందాడు. ఆయన ఇంగ్లిష్ ఎం.ఎ. కూడ గోల్డ్ మెడల్ పొంది ఉంటారు. కాని ఎం.ఎస్.సి. కెమెస్ట్రీ చదివేప్పుడు ఇటు విద్యార్థి ఉద్యమాలలోనూ, క్రియాశీలమైన ప్రతిభాశాలిగా, సౌమ్యుడుగా అధ్యాపకుల్లో అశేష ఆదరణ పొందిన ఆయన చొరవకు పోలీసులకు కంటుకంగా మారాడు.
1978 నుంచి 85 దాకా కె.యు. క్యాంపస్‌లో ప్రజాస్వామిక విప్లవ భావజాలాలు అధ్యాపక విద్యార్థుల్లో విస్తృతంగా ప్రచారం పొంది వ్యాపించాయి. ముఖ్యంగా సోషల్ సైన్స్, హ్యూమానిటీస్ డిపార్టుమెంట్స్ ఈ భావజాలాన్ని బోధిస్తున్నాయనే ప్రచారం జరిగింది. జిల్లా ఎస్పిలుగా వచ్చిన అందరూ క్యాంపస్‌ను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు. 1984-85లో వరుసగా జరిగిన సంఘటనలతో గాలి వేడెక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ఎన్టిఆర్ ముఖ్యమంత్రి అయి నాదెండ్ల భాస్కరరావు కుట్రతో పదవీచ్యుతుడై మళ్లీ గెలుచుకున్న తర్వాత తీవ్ర నిర్బంధాన్ని అమలుచేసాడు. అది ఆట మాట పాట బందయిన కాలం. అది వరంగల్ జిల్లాలో 1984లో కాజీపేట పోలీస్ స్టేషన్లో కొడవటి సుదర్శన్ ‘మిస్సింగ్’ కేసుతోనే ప్రారంభమైందనవచ్చు. వరంగల్‌లోని అన్నీ కాలేజీల్లో లెఫ్ట్ ఫ్రంట్ విద్యార్థి సంఘాలు గెలుస్తున్నాయి. అటువంటి తరుణం జిల్లాలో లాటిన్ అమెరికా తరహా అమలవుతున్న నిర్బంధాన్ని దేశం దృష్టికి తీసుకపోవడానికి జిల్లా పౌర హక్కుల సంఘం (అధ్యక్షుడు అమ్జదలీ, ఉపాధ్యక్షుడు డాక్టర్ రామనాథం, కార్యదర్శి కె. బాలగోపాల్) పియుసిఎల్ అధ్యక్షుడు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రజినీ కొఠారీని ఆహ్వానించారు. అప్పటికే ఎన్‌టిఆర్‌ను బలప్రదర్శనలో రామకృష్ణ స్టూడియోలో ఎంఎల్ఎలను ఆయుధాలతో సమావేశపరచలేదని సర్టిపికెట్ ఇచ్చిన డిసిపి అరవిందరావును మెచ్చి ఎన్టిఆర్ వరంగల్ జిల్లా ఎస్పిగా పంపాడు.
వరంగల్‌కు వచ్చిన రజినీ కొఠారికి రెండు రోజుల్లో చాల కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎపిసిఎల్సి నిర్బంధ వ్యతిరేక సభయే కాకుండా ఎల్బి కాలేజీలో సెమినార్, మర్నాడు సోషల్ సైన్సెస్ డీన్ ఎం. కిష్టయ్య ఆహ్వానంపై క్యాంపస్‌లో ఎక్స్టెన్షన్ లెక్చర్ ఏర్పాటయ్యాయి. ఎల్బి కాలేజీకి పోవడానికి ముందు సాయంత్రం నాలుగు గంటలకు ఎస్పి అరవిందరావు ఆయనను టీకి పిలిచాడు. నలబై ఐదు నిమిషాలు జరిగిన సంభాషణతో బాలగోపాల్, రామనాథం వంటి నక్సలైట్లు ఎపిసిఎల్‌సికి ఆమోదం కోసం తన వంటి మేధావిని పిలుస్తున్నారని వెళ్లొద్దని హెచ్చరికవంటి విజ్ఞప్తి చేసాడు. ఎపిసిఎల్సి గురించి, దాని నాయకత్వం గురించి తనకు పోలీసు డిపార్ట్మెంట్కన్నా సన్నిహితంగా తెలుసునని టీ కూడా తాగకుండా ఆయన ఎల్బి కాలేజీ ప్రసంగానికి వచ్చి అక్కడ ఈ విషయమంతా చెప్పాడు. ఎపిసిఎల్సి మీటింగ్‌లో పాల్గొన్నాడు, మర్నాడు కె.యు. క్యాంపస్‌లో డీన్ కిష్టయ్య అధ్యక్షతన ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇచ్చాడు. ఎవరినైనా ఎక్స్టెన్షన్ లెక్చర్‌కు పిలిచినా, ఎవరయినా పత్రికల్లో రాసినా ముందుగా తన దృష్టికి తేవాలని వైస్ చాన్సలర్ వాసుదేవ్ ఒక సర్క్యులర్ని క్యాంపస్ కాలేజీలకే కాదు, నగరంలోని కాలేజీలకన్నిటికీ పంపించాడు. ముఖ్యంగా ఈ సర్క్యులర్ ఇపిడబ్ల్యులో బాలగోపాల్ రాస్తున్న వ్యాసాల దృష్ట్యా, సోషల్ సైన్సెస్‌లో, ముఖ్యంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అధ్యాపకులు అకడమిక్ కార్యకలాపాలపట్ల పోలీసులు కక్షతో రాయించినదేనని ఎక్స్టెన్షన్ లెక్చర్లు, సిలబస్ వంటి విషయాలు సబ్జెక్ట్‌లో స్పెషలైజేషన్‌కు సంబంధించినవని, రజనీ కొఠారీ ఢిల్లీ యూనివర్సిటీలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంటూ కిష్టయ్య గారు వెస్ ఛాన్సలర్‌కు జవాబు రాశారు. ఇంక చేయగలిగేదేమి లేకపోయింది పాలకులకు. ఇటువంటి క్యాంపస్‌లో ఘర్షణాయుత వాతావరణంలో ఒక రాత్రి కెమెస్ట్రీ ల్యాబ్ షార్ట్ సర్క్యూట్ జరిగి తగులబడిరది. మర్నాటికి ఇది స్థానిక పత్రికల్లో పతాక శీర్షికై చర్చనీయాంశమైంది. పోలీసు యంత్రాంగానికి ఎంతో అందివచ్చిన జోక్యం చేసుకునే సందర్భం అయింది. కెమెస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా బ్రాహ్మనీయ భావజాలంతో నిండిన స్టాఫ్. ఎవరి పేరు పేర్కొనకుండా ఇది ఒక దౌర్జన్య చర్యగా కూడ భావిస్తున్నామనే అనుమానంతో డిపార్ట్మెంట్ నుంచి ఫిర్యాదు తీసుకొని అనుమానిత విద్యార్థులున్నారని ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఒక వంక ఇది చేసి మరొకవైపున జిల్లా కలెక్టర్ నుంచి యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు 16 మంది అధ్యాపక, విద్యార్థులు సత్ప్రర్తన పూచికత్తు ఇవ్వాలని ఒక నోట్‌ను పంపించారు. వైస్ చాన్సలర్ ఆ పేర్లు ఉన్న సోషల్‌సైన్స్ డిపార్టుమెంట్లు, ఇంగ్లిష్, మ్యాథ్స్ (కె. బాలగోపాల్) లతోపాటు సికెఎంలో వివి, జీవన్‌కుమార్‌ల పేర్లు ఉన్నాయి కనుక ఆ కాలేజికి పంపాడు. ఈ 16 మందిలో డీన్ కిష్టయ్య, ప్రొఫెసర్స్ భాస్కర్‌రావు, హరగోపాల్, ఎకనామిక్స్ శివరామకృష్ణ, పొలిటికల్ సైన్స్ వెంకటేశ్వర్లుతో పాటు ఒకే ఒక్క విద్యార్థి ఎం.ఎస్.సి. కెమెస్ట్రీ విద్యార్థి కత్తి మోహన్‌రావు ఉన్నాడు. డీన్ కిష్టయ్య నాయకత్వంలో ఈ నోటీస్‌ను హైకోర్టులో సవాల్‌చేసి స్టే తెచ్చుకోగలిగారు కానీ ఎఫ్ఐఆర్లో అనుమానితులుగా పేర్కొన్న విద్యార్థులలో మోహన్‌రావు ఉండి ఉంటాడన్నది స్పష్టమే. ఇది మాత్రమే కాదు, నగరంలో జరిగిన చాల సంఘటనల్లో రాడికల్ విద్యార్థులు పాల్గొన్న వారిలో ఆయనను ముద్దాయిగా చూపి ఉంటారు. పార్టీ అధికార ప్రతినిధి పేర్నొన్న 1985 జైలు నిర్బంధం ఈ సందర్భమే కావచ్చు.
క్యాంపస్ జీవితంలో కుమార్పెల్లికి, తరచుగావచ్చే ఆర్ఎస్యు నాయకుల్లో పులి అంజయ్య రాజ్య నిర్బంధం వల్ల ఆరంభంలోనే ఆగిపోయినా లింగమూర్తి, నాగేశ్వరరావులు తర్వాత ఎక్కువ వచ్చినవాడు కత్తి మోహన్‌రావు. రాజారావు అనే పేరుతో కుమార్‌పెల్లిలో బాల రాడికల్ సంఘం పెట్టి పిల్లలతో గడిపినవాడు ఈ మోహన్రావే. కుమార్పెల్లికి మోహన్‌రావు తన బాల్య మిత్రుడు ఆమడ నారాయణను కూడా కలవడానికి వచ్చేవాడు. ఆ ఇద్దరు మిత్రులు అట్లా తాము ఎంచుకున్న విప్లవోద్యమ మార్గంలో జీవితమంతా ప్రయాణం చేసారు. ఒకరు పోలీసుల చేతుల్లోనే అమరుడైన ఎన్నడూ అజ్ఞాతంలో జీవించని, వందల రోగుల మధ్యన చికిత్స చేస్తూ మసలుకునే ప్రజా వైద్యుడు ఎంత ఐరనీ అంటే నలబై ఏళ్ల విప్లవ ఉద్యమ జీవితంలో దాదాపు 35 ఏళ్ల అజ్ఞాత జీవితంలో అందులో ఆరేళ్ల జైలు జీవితంలో అస్తమా, గుండె జబ్బులతో కఠినతరమైన సవాల్ వంటి జీవితం గడిపిన కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ అనారోగ్యంతో మరణం పొందాడు.
80ల విప్లవకారుల్లో వరంగల్‌లో అందరికన్న చిన్నవాడు ప్రకాశ్ (వెంకటేశ్వర్లు) పేరు బహుశా అతని అమరత్వం తర్వాత ఆ జ్ఞాపకాలతోనే మోహన్‌రావు ఎంచుకొని ఉంటాడు. ఐవి మాస్టారు కూడ ప్రకాశ్ పేరు పెట్టుకున్నాడు. విప్లవోద్యమంలో ప్రకాశ్ సర్వనామం. కత్తి మోహన్‌రావుకు విప్లవ రాజకీయాల చర్చ చాల ఇష్టం. ముఖ్యంగా పోలిమికల్ చర్చలు. ఆ చర్చలు ఎక్కువగా బాలగోపాల్‌తో చేసేవాడు. బాలగోపాల్ హనుమకొండ ఏనుగులగడ్డకు వేమూరి కూతురు అరుణ (బేబక్క) ఇంట్లో కింది గదిలో ఒక్కడే ఉండేవాడు. తమపై నిర్బంధం ఎక్కువలేని రోజుల్లో మొదట గోపగాని ఐలయ్య అయినా, ఆ తర్వాత మోహన్రావయినా వేరే పనులు లేని వేళల్లో ఆయన గదిలో ఆయనతో చర్చిస్తూ గడిపేవారు. మిల్‌కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ ఇంటిపై బాంబుదాడి తర్వాత అటువంటి చర్చ బాలగోపాల్‌తో మోహన్‌రావు పెట్టినపుడు నేను కూడా ఉన్నాను. ఆ బాంబు పేలలేదు. ఏ నష్టమూ, ప్రమాదమూ జరుగలేదు. పోలీసులు మిమ్మల్ని వివిని ఇద్దరిని కూడ అరెస్టు చేసేంత సీరియస్‌గా ఎందుకు తీసుకున్నారు అని అడిగాడు, పోలీసులు అది వ్యవస్థ మీద దాడిగా చూస్తారు. ఒక భూస్వామినో, రాజకీయ నాయకుణ్నో చంపిన దానికన్నా సీరియస్‌గా తీసుకుంటారన్నాడు బాలగోపాల్. 92లో అరెస్టయి విడుదలయ్యాక ఆయన అజ్ఞాతంలో ఉండలేని అనారోగ్యంతో ఉన్నాడు, వెళ్లలేడనుకున్నాం గానీ ఆయనకు విప్లవం పట్ల కమిట్మెంట్ ముందు ఆరోగ్యం సమస్యకాలేదు
ఇద్దరు మిత్రులు….. వ్యాసకర్త ఎవరో పేరు రాయలేదు.
చడువుతున్నంత సేపు వరంగల్ లో ఆరోజుల్లో భయంకరమైన నిర్భందం లో రహస్య లో ఉన్న కారీకార్తలే కాక నైతికంగా,ప్రజాస్వామిక వదులుగా మా లాంటి వారు కూడా అనుభవించిన రోజులన్నీ గుర్తుకొచ్చాయి.
పౌరహక్కుల సంఘం లో బాధ్యుడు గా ఉన్న నాపై పోలీసుల దాడి,నా కళ్ళముందే మాయమైన (disappeared), ఉద్యమ నాయకులు,విద్యార్థులు ,ఎప్పుడు ఎవరు encounter చేయ బడుతారో తెలియని పరిస్థితులు , పోలీసుల చేతిలో నేను ఎరిగిన దాదాపు వంద మంది విప్లవ కార్యకర్తల హత్యలు,చిత్ర హింసలు కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.
నిజానికి ఒక్క వరంగల్ లో ఆ రోజుల్లో నెలకొన్న పరిస్తితి గురించే రాయ డానికి ,చెప్పడానికి చాలా ఉంది.
రచయితకు ధన్య వాదాలు.
*జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక
ఆనాటి మైదాన ఉద్యమం గురించి సినిమా రీలులా చాలా బాగా చూపారు. విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన నాయకత్వం యొక్క చదువులోని వారి మెరిట్ ను ప్రజల పట్ల వారి నిబద్ధతను పోలీసు దమనకాండను మరొకసారి గుర్తు చేసారు. ధన్యవాదాలు