2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొంతమంది ఉన్నత వర్గాల ముస్లింలు తమ సమాజాన్ని బిజెపి గురించిన తమ అభిప్రాయాలను పునరాలోచించమని కోరుతున్నారు. (తారిక్ మన్సూర్, ‘ముస్లింలు బిజెపి గురించి పునరాలోచించాలి’, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 01, 2024).
భారతీయ ముస్లింల పట్ల ఎలాంటి వివక్ష జరగడం లేదని పునరాలోచనకు పిలుపునిచ్చినవారు అంటున్నారు. ఆహార ధాన్యాలు, గృహనిర్మాణం, వంట గ్యాస్, తాగునీరు మొదలైన వాటికి సంబంధించిన ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాల వల్ల ముస్లింలకు కూడా ప్రయోజనం చేకూరుతున్నదని వారు అంటున్నారు.
ఇది కాకుండా, పస్మాందా, సూఫీ ముస్లింలపై బిజెపి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2014 తరువాత భారతదేశంలో చెప్పుకోదగిన మతపరమైన అల్లర్లు జరగలేదు. మత హింస పరంగా చూస్తే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి గత దశాబ్దం భారతదేశం అత్యంత ప్రశాంతమైన కాలం అని కూడా అంటున్నారు.
ఇటువంటి విజ్ఞప్తులు అర్ధ-సత్యాలపై ఆధారపడి ఉంటాయి. భారతీయ ముస్లింల జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసే ప్రధాన సమస్యలను విస్మరిస్తాయి. ఉన్నత వర్గానికి చెందిన కొంతమంది ముస్లింలు మునుపటి కంటే తక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ముస్లింలకు సంబంధించిన అభద్రత, అట్టడుగుతనం, తమ ప్రాంతాలకే పరిమితం కావాల్సిన తప్పనిసరి పరిస్థితి వంటి సమస్యలు మాయమైపోవు.
2014 నుంచి ఇప్పటి వరకు ముస్లింలపై పెద్దగా హింసాత్మక ఘటనలు జరగలేదనడంలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఉద్యమం తర్వాత, బిజెపి నాయకుల ప్రేరేపణతో (“గోలీ మారో…”) ముస్లింలపై భయంకరమైన హింస జరిగింది.
ఈ హింసలో మరణించిన 51 మందిలో 37 మంది ముస్లింలు.
ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో ముస్లింల ఆస్తులను ధ్వంసం చేసేందుకు బుల్ డోజర్లను మోహరిస్తున్నారు ముస్లింల ఆస్తులకు ఎవరు ఎక్కువ నష్టం కలిగిస్తారనే దానిపై కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోటీ నడుస్తోంది. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఎ.పి. షా ఒక న్యూస్ పోర్టల్‌తో మాట్లాడుతూ, “ఒక నేరానికి పాల్పడినట్లు ఒక వ్యక్తిపై వున్న ఆరోపణలు ఏ సందర్భంలోనైనా ఆ వ్యక్తి ఆస్తికి నష్టం కలిగించడానికి ఆధారంగా ఉండవు.
ఆవు, ఆవు మాంసం రాజకీయాల వల్ల కలిగిన మొదటి ఫలితం – అసంఖ్యాక విచ్చలవిడి పశువులు రోడ్లపై తిరుగాడడం, వాటి కారణంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. రెండవ ఫలితం – విచ్చలవిడి ఆవులు, ఎద్దుల మందలు పొలాల్లో పడి పంటలను తినేయడం. మూడవ ఫలితం – భారతదేశంలో హత్యలు – లించింగ్ (విచారణ లేకుండా చంపేయడం) అనే కొత్త పద్ధతిని ఉపయోగించడం.
మహమ్మద్ అఖ్లాక్ మొదలుకొని, రక్తపిపాసి గుంపులచే చంపబడిన అనేక మంది ముస్లింలు (దళితులు) ఉన్నారు. నసీర్, జునైద్లపై జరిగిన హింసాకాండలో పాల్గొన్న మోను మానేసర్ కథ హృదయాన్ని కలచివేస్తుంది.
బాధిత కుటుంబాలను కలిసిన హర్షమందర్ “మోను మనేసర్ సోషల్ మీడియా పేజీలను చూసి నేను స్తబ్దతకు గురయ్యాను” అని వ్రాశాడు. అతను, అతని ముఠా సభ్యులు బహిరంగంగా ఆధునిక తుపాకులతో, పోలీసు వాహనాల సైరన్ల మాదిరిగానే శబ్దాలు చేసే జీపుల్లో తిరుగుతారు, వాహనాలపై కాల్పులు జరుపుతారు, చేతికి అందిన వారిని నిర్దాక్షిణ్యంగా చావబాదుతారు.
అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే వారు తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తారు. గోవు సంబంధిత హింసలో మరణాలు, గాయాల సంఖ్యకు సంబంధించి అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. ఎందుకంటే ప్రభుత్వం వాటిని దాచాలనుకుంటున్నది.
అయితే ఇలాంటి ఘటనల వల్ల ముస్లింలు చాలా భయపడిపోతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
పాడి పరిశ్రమలో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్న మేవాత్, ముస్లింలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రదేశాలలో ఒకటి. రాజస్థాన్‌లో అఫ్రజుల్ను చంపుతూ శంభులాల్ రేగర్ వీడియో తీశాడు. కలీముద్దీన్ అన్సారీ హత్యకేసు నిందితులను అప్పటి కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఘనంగా సత్కరించాడు.
ఇలాంటి ఘటనలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
లవ్ జిహాద్ చుట్టూ అల్లిన ద్వేషం, భయాల వలను మనం చూశాం. యుపిఎస్సి జిహాద్, ల్యాండ్ జిహాద్‌లు కూడా ఉన్న జిహాద్ రకాల పట్టికలను మనం చూశాం. అన్నింటికంటే వినోదకరమైనది కరోనా జిహాద్.
భారతదేశంలోని తబ్లిగీ జమాత్‌కు వచ్చిన ముస్లింలు కరోనాను వ్యాప్తి చేశారని మనకు చెప్పారు! అనేక కాలనీలు తమ నివాస సముదాయాల్లోకి ముస్లిం వీధి వ్యాపారుల ప్రవేశాన్ని నిలిపివేశాయి.
ఇస్లామోఫోబియా కొత్త శిఖరాలను అందుకుంటోంది.
ముస్లింలు భయపడిపోయారు, తమ వారి మధ్య మాత్రమే జీవించాలనుకుంటున్నారు.
చాలా నగరాల్లో, మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలకు ఇళ్లు కొననివ్వరు లేదా అద్దెకు ఇవ్వరు.
ముస్లింల ఆర్థిక, విద్యా స్థితి కూడా క్షీణిస్తోంది. ఉన్నత విద్య కోసం యిచ్చే, లబ్ధిదారులు ఎక్కువగా ముస్లిం విద్యార్థులు ఉన్న మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను నిలిపివేసారు. ఆర్థిక పరంగా కూడా ముస్లింల పరిస్థితి క్షీణించిపోతోంది.
గాలప్ డేటా ప్రకారం, 2018-2019 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ మందగించిన తరువాత, తమ జీవన ప్రమాణాలు క్షీణించాయనే భావన రెండు సమూహాలలో (హిందువులు- ముస్లింలు) బలపడింది.
2019లో 45 శాతం భారతీయ ముస్లింలు తమ జీవన ప్రమాణాలు మునుపటితో పోలిస్తే దిగజారిపోయాయని చెప్పారు. 2018లో ఈ శాతం 25గా ఉండింది. హిందువులలో, 2019లో ఇలా చెప్పిన వారి శాతం 37, అంటే 2018 కంటే 19 శాతం ఎక్కువ. ఎన్ఆర్సి, సిఎఎల ద్వారా ముస్లింల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
అస్సాంలో సుదీర్ఘ కసరత్తు తర్వాత, అవసరమైన పత్రాలు లేని 19 లక్షల మందిలో ఎక్కువ మంది ముస్లింలు అని తేలింది. సిఎఎలో అటువంటి హిందువులకు తప్పించుకునే మార్గాలు వున్నాయి, కానీ అలాంటి ముస్లింల కోసం నిర్బంధ కేంద్రాలను నిర్మిస్తున్నారు.
పస్మండ ముస్లింల పట్ల ప్రస్తుతం చూపుతున్న సానుభూతి మోసం మాత్రమే. మెజారిటీ రాజకీయాల ప్రేరణతో జరిగిన హింసాకాండలో ప్రధాన బాధితులు పస్మందాలే (దళిత ముస్లింలు) అని మనకు తెలుసు.
అష్రఫ్ ముస్లింలు పస్మందా ముస్లింలతో మెరుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పనవసరం లేదు. అయితే మొత్తం సమాజానికి అతిపెద్ద ముప్పు పస్మందా, అష్రఫ్‌లను ప్రభావితం చేసే అభద్రతా భావం. ఇది ఛాందసవాద అంశాలు వృద్ధి చెందడానికి అనుమతినిస్తుంది.
ముస్లిం సముదాయంలో సామాజిక సంస్కరణల అవసరం వుంది. కానీ సముదాయం అస్థిత్వం, పౌరసత్వం ముప్పులో ఉన్నంత కాలం ఈ అవసరం అంతంతమాత్రంగానే ఉంటుంది. వివిధ రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు ముస్లింలపై వివక్ష చూపే అనేక చర్యలు చేపడుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ-ఆర్ఎస్ఎస్ల మెజారిటీ రాజకీయాలు మరింత ఊపందుకోవచ్చు. రాజకీయ సంస్థల్లో ముస్లింల భాగస్వామ్యం ఇప్పటికే తగ్గిపోతోంది.
ఈ హిందూ జాతీయవాద పార్టీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా ముస్లిం కాదని మనం మర్చిపోకూడదు. గత ప్రభుత్వాలు కూడా ముస్లింల సమస్యలను పరిష్కరించలేకపోయాయి
దాని మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా వున్నవి సంఘ్, బిజెపిలు. ఈ సముదాయానికి అనుకూలంగా తీసుకోవాలనుకునే సానుకూల చర్యలకి ఎలా అడ్డంకులు కల్పిస్తారో సచ్చార్ కమిటీ సిఫారసులకు వచ్చిన ప్రతిస్పందన తెలియచేస్తుంది.
ఈ నివేదికను సమర్పించిన తరువాత, జాతీయ వనరులపై వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు మొదటి హక్కు ఉందని అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు.
ఈ దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు అని మన్మోహన్ సింగ్ అన్నాడని సంఘ్ ప్రచారం చేసింది.
ఈ సముదాయపు కష్ట నష్టాలను తగ్గించే ప్రతి ప్రయత్నానికి అడ్డంకులు కలిగించారు.
తమ ప్రభుత్వ పథకాలైన ఉచిత రేషన్ తదితర ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందుతున్నారని బీజేపీ అంటోంది.
ఈ పథకాలు, లేదా ‘లబ్దిదారులు’ అనే మొత్తం భావనయే ప్రజాస్వామిక “హక్కుల ఆధారిత దృష్టికోణానికి” విరుద్ధంగా ఉన్నది.
ఎవరికి ఓటు వేయాలి అనే విషయాన్ని అన్ని సముదాయాలూ ఆలోచించాలి. ముస్లింలను ఆకర్షించే ప్రయత్నాల విషయానికొస్తే, వాటి ఆధారం శూన్యం.
06/02/2024
తెలుగు: పద్మ కొండిపర్తి