కారా మాస్టారు జనాపకాల్లోకి పోయేముందు మనం కథా ప్రక్రియ ఎందుకు ఎన్నుకున్నామో, ప్రేరేపించిన కారణాలు ఏమిటో ఆలోచిస్తేనే ఓ అనుభూతి!

నాకు కలిసొచ్చిన అవకాశం ఏమిటంటే 8 వ తరగతి నాటికే మా ఇంట్ల అన్ని రకాల పుస్తకాయాలుండటం. మా పెద్దన్నయ్య వరంగల్ గాబ్రియల్ స్కూల్ విద్యార్థి. క్యాథలిక్ క్రిస్టియన్ ఫాదర్ గా శిక్షణ పొంది, చివరి దశలో ఎన్నో కారణాలతో బయటకు రావడం. అతనికి లిబరేషన్ థియాలజీ మీదున్న విశ్వాసం, మాటలు నన్ను ఆకర్షించేవి. హైదరాబాద్, విజయవాడ నుండి ఎన్నో పుస్తకాలు వచ్చేవి. అలా నాకు నవలలు, కథలతో పరిచయం ప్రారంభమైంది. ఎమిలీ జోలా నవల ‘భూమి’ ఎన్నిసార్లు చదివానో. కారణం మా గూడెంల జరుతున్నట్లు ఉండేది నవల!

1983 నాటికే ప్రగతిశీల, విప్లవ విద్యార్థి సంస్థలతో, ఉద్యమాలతో పరిచయాలు కావడంతో వారి నుండి పుస్తకాలే కాదు, అనేక నూతన విషయాలు అందేవి. గ్రామాల్లో ప్రజలను, కుల వ్యవస్థను అర్థం చేసుకోటానికి కొత్త చూపు దొరికింది. గ్రామాలకు పోతే దళితుల ఇంట్ల ఉండాలనే వారి మాటలు నన్ను మరింతగా వాళ్ళకు దగర చేశాయి. ఇంట్లో ఠాగూర్, చలం, శ్రీశ్రీ, కొకు, రావిశాస్త్రి, యద్దనపూడి, మాలతి చందూర్ పుస్తకాలున్నప్పటికీ తెలంగాణ నుండి వచ్చే అల్లం రాజయ్య, రాములు ఇంకా చాలా మంది మారుపేర్లతో వచ్చే కథలు ఆకర్షించేవి. కారణం ఇలా మాండలికంలో గూడ రాయొచ్చా అని ఆశ్చర్యం వేసేది. అలా చిన్న కథలు రాయటం ప్రారంభం. కానీ ఎవరికి చూపించాలి! ఎప్పుడో రెండు మూడు నెలలకు కలిసే ఉద్యమ మిత్రులు. వాటిని చదివి ఓ సలహా చెప్పారు.

అలా నాకు నచ్చిన కథల్లో ఒకటి తీసుకొని 1994 మేలో మహానంది (కర్నూల్) కథా వర్క్ షాప్ కు హాజయ్యా. నా కథతో కథా పఠనం  ప్రారంభం కావటం మధుర జ్ఞాపకం నాకు. నిజానికి 1984 ఆగస్టులో విశాఖలో మొదటి కథా వర్క్ షాప్ విరసం నిర్వహించింది. పదేళ్లకు మహానందిల జరగడం రెండోసారి. 1995 మేలో విశాఖ జిల్లా లోపూడిలో మూడో కథా వర్క్ షాప్ జరిగింది. ఆ రోజుల్లో ఇప్పటిలాగ ఆధునిక సమాచార వ్యవస్థ లేదు. మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి కొన్నిసార్లు సమాచారం ఉండేది కాదు.

ఓ కథను తీసుకొని నల్లగొండ నుండి ఒంటరి ప్రయాణం. ఎలాగో విజయవాడ, అక్కడి నుండి రాజమండ్రి చేరుకున్న. అప్పటికే తుఫాన్ మొదలయినట్టుంది. రాత్రిపూట బస్సులు లేవు. వో లారీ మీద అనకాపల్లి బయలుదేరా. మధ్యలో వర్షాలతో ట్రాఫిక్ జామ్. లారీ ముందుకు కదలలేని స్థితి. లారీని ఓ చిన్న గుడిసె హోటల్ ముందు నిలిపారు. రాత్రంత చలిలోనే. మరునాడు అనకాపల్లి చేరుకున్న. నిద్రలేమి, నీరసంతో బస్ స్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా కారా మాస్టర్ ను తీసుకొని చలసాని, కృష్ణక్క రావడం! ఆడికి పోయిన ప్రయాణం లేచొచ్చినట్టయింది!

“హి ఈజ్ ఫ్రమ్ నల్లగొండ” అంటూ నన్ను కారా గారికి పరిచయం చేశాడు చలసాని. మాస్తారును అప్పటికి ప్రత్యక్షంగా చూసింది లేదు. వెనుక సీట్ల కూర్చుని లోపూడి చేరుకునేంతవరకు మాస్టారు గారిని గమనిస్తూ ఉండిపోయా!

నా కథను తీసుకొని కారా గారికిచ్చాడు చలసాని. లోపల భయం. అప్పటికి ఇంకా అమాయకత్వం వదలని స్థితి. వర్క్ షాప్ రెండో రోజు ఉదయం నన్ను పిలిచి, నా గురించి వివరాలు అడగటం మొదలు పెట్టాడు.  నా కథను చదినట్టుంది. అండర్ లైన్స్ ఉన్నాయి. నేను చేస్తున్న పని ఉంటున్న ప్రాంతం, కుటుంబ వివరాలు అడిగాడు. ఎందుకడిగాడో వెంటనే అర్థం కాలేదు. బహుశా వడ్డెర జీవితాల సమస్య మీద నేను రాసిన ‘బండ పగిలింది’ కథ చదివాక వివరణ కోసం అడిగినట్టుంది.

గ్రామంలో ఉంటాను కాబట్టి కింది వర్గాల గురించి పరిశీలించటానికి, రాయటానికి మంచి అవకాశం దొరుకుతుంది అంటూ, నేను రాసిన కథలో సంభాషణలు ఎలా ఉండాలి, కామాలు, ఫుల్ స్టాపులు, మూడు చుక్కలు, ఆశ్చర్యార్థక  గుర్తులు ఎలా ఉపయోగించుకోవాలో వివరించాడు. అతి తక్కువగా మాట్లాడే మాస్టారి స్వభావం నన్ను ఆకర్షించేది. కథా నిలయం మొదలయ్యాక పోస్టు కార్డులు రాసి, జిల్లాలోని కథకుల, కథల వివరాలు పంపమనేవాడు. మాస్టారు చెప్పిన పూర్తి పని చేయలేకపూయా ఏవో సమస్యల వల్ల. అదే బాధనిపిస్తుంది ఇప్పటికీ.

1984 లో విశాఖలో ప్రారంభమైన కథా వర్క్ షాపులు, మాస్టారు స్ఫూర్తితో ఇప్పటి దాక ఇరవై ఆరు వరకు జరిగాయి. ఎందుకో గాని విశాఖ, లోపూడి వర్క్ షాపుల తర్వాత పాల్గొనడం తగ్గింది. అరకులోయ, కీసర వర్క్ షాప్ లలో చివరగా పాల్గొన్నట్లు గుర్తు.

ఒక్క విశాఖ మినహా, 1994 నుండి ఇప్పటి వరకు దాదాపుగా కథా వర్క్ షాప్ లలో పాల్గొన్నాను. కథకునిగా ఏమి సాధించానో చెప్పలేను గాని, నన్ను నేను ఓ మనిషిగా నిలబెట్టుకోడానికి, బతకటానికి గొప్ప మార్గాన్ని చూపాయి. సంవత్సరానికి ఒకసారైనా కథకులుగా మనం కలుసుకోకపోతే ఏదో వెలితి, అసహనంగా ఉంటది.

చలం  గారిలా చలం గారే రాయగలరు, శ్రీపాద లా ఇంకొకరు రాయలేరు. రావిశాస్త్రిలా రాయబోయి భంగపడ్డారు. మనం మనలాగే రాయగలం. ఉన్నంతలో దానినే అభివృద్ధిపరుచుకోవాలి…!

Leave a Reply