కథలు రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’
(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)
ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన అభిప్రాయాలను బట్టి ఈ అభిప్రాయం కలిగింది. కాని సాహిత్య విమర్శ ఒక ప్రత్యేక ప్రక్రియగా ఆధునిక కాలంలోనే ఆవిర్భవించింది. ఆధునిక కాలంలో వైజ్ఞానికంగా, సాంకేతికంగా ప్రపంచం సాధించిన విజయం వల్ల ఇది సాధ్యమైంది.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మొదట పుట్టింది సాహిత్య విమర్శే కావచ్చు. కావలి వెంకటరామస్వామి, సిపి బ్రౌన్ 1829లోనే తెలుగు సాహిత్య విమర్శకు పునాదులు వేశారని ఎస్.వి. రామారావు, కోవెల సంపత్కుమారాచార్య వంటి వాళ్ళు గుర్తించారు. ఆ రకంగా ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు 190 ఏళ్ళ చరిత్ర ఉన్నట్లు భావించాలి. ఈ చరిత్రంతా ఒక ముద్ద కాదు. కానీ ఇదొక పెద్ద ప్రయాణం. గ్రంథ పరిష్కరణ దశ నుండి గ్రంథ వివేచన దాకా, శబ్ద సాధుత్వా సాధుత్వ నిర్ణయం నుండి రచనల సాధుత్వా సాధుత్వ దశ దాకా, కవుల కులగోత్రాల నిర్ధారణ దశ నుండి రచయితలు చిత్రించే కుల, వర్గ జీవితాల విశ్లేషణ దాకా ఇదొక పెద్ద నడక. ఈ నడకలో సంప్రదాయవాదులు, ఆధునికులు భాగస్వామయ్యారు, అవుతున్నారు. ఆధునికులలో అనేక కాలాలలో, అనేక భావజాలాలతో ఈ ప్రయాణంలో కలుసుకున్నారు. రాటకొండ నరసింహారెడ్డి, శ్రీశ్రీ, కొ.కు, చంద్రం వంటి వాళ్ళ నుండి నేటి ఎన్. వేణుగోపాల్, వి. చెంచయ్య పెనుగొండ, పాణి దాకా ఒక యాభై, అరవై మంది మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు గత ఎనిమిది దశాబ్దాల నుండి విమర్శ రాశారు, రాస్తున్నారు. ఈ తానులో పోగు 25.02.2021న కన్ను మూసిన సింగమనేని నారాయణ ఒకరు.
1943లో జన్మించిన సింగమనేని 1960 నుంచి కథలు రాశారు. అయితే 1978లో ‘జూదం’ కథ ఆయనకు గుర్తింపు తెచ్చింది. సాహిత్య విమర్శ రంగంలోకి సింగమనేని ఎప్పుడు ప్రవేశించారో ఖచ్చితమైన ఆధారాలు అన్వేషించాలి. ఆయన రాసిన విమర్శ ‘‘సమయమూ సందర్భమూ’’, ‘‘సంగ్రహణ’’, ‘‘కథావరణం’’, ‘‘మధురాంతకం రాజారాం’’ మొదలైన సంపుటాలుగా వచ్చింది.
సింగమనేని ప్రధానంగా కాల్పనిక సాహిత్య విమర్శకుడు. అందులోనూ కథా సాహిత్య విమర్శ మీదనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. కథావరణం, మున్నుడి (సింగమనేని పీఠికలు) గ్రంథాలో ఆయన కథా విమర్శ మనకు లభిస్తుంది. ఈ రెండు గ్రంథాల ఆధారంగా ఈ వ్యాసం రాశాను. ‘కథావరణం’లోని 17 వ్యాసాలు 1991`2010 మధ్య కాలంలో రాశారు. ‘మున్నుడి’లోని 35 పీఠికలు 1992-2018 మధ్య కాలంలో రాశారు. ఈ 52 వ్యాసాలు, పీఠికలలో 20వ శతాబ్దం చివరి దశాబ్దంలో 1992-2000 మధ్య రాసినవి ఏడు మాత్రమే. తక్కిన 45 వ్యాసాలు, పీఠికలు 21వ శతాబ్దంలో రాశారు. ఈ సంఖ్యను అలా ఉంచి, ఆయన కథా సాహిత్య విమర్శలోకి వెళదాం.
వల్లంపాటి వెంకట సుబ్బయ్య సాహిత్య విమర్శను రచనా కేంద్రిత విమర్శ, రచయిత కేంద్రిత విమర్శ, పాఠక కేంద్రిత విమర్శ, సమాజ కేంద్రిత విమర్శ అని నాలుగు రకాలుగా విభజించి వివరించారు. సింగమనేనిలో ఈ నాలుగు రకాల పోకడలు కనిపిస్తాయి. ‘‘ఓల్గా ‘భిన్న సందర్భాలు’ సంపుటిలోని కథలన్నీ స్త్రీ పక్షాన, స్త్రీ గురించి, స్త్రీ కోసం, స్త్రీ శక్తిని నిరూపిస్తూ రాసినవే (కథావరణం పు. 0188) వంటి వాక్యాలు రచయిత కేంద్రంగా చెప్పినవి. ‘‘రారా కథలన్నీ చదివిన తర్వాత పాఠకుడి సంస్కార స్థాయి ఒక మెట్టు అయినా పెరుగుతుందని నమ్మకంగా చెప్పవచ్చు’’ (కథావరణం పు. 134), ‘‘స్త్రీవాద కథలు ముఖ్యంగా పురుష పాఠకులను చాలా డిస్టర్బ్ చేశాయి’’, పురుషుల సంస్కార స్థాయినీ, స్త్రీ చైతన్య స్థాయినీ పెంచటానికి ఈ కథలు చేయగలిగినంతా చేశాయి’’ (కథావరణం పు. 44) వంటి అభిప్రాయాలు పాఠక కేంద్రిత విమర్శకు నిదర్శనాలు. ‘‘కడప జిల్లా గ్రామాల గురించి తెలుసుకోవాలంటే విశ్వనాథరెడ్డి గారి కథలు చదవాలి (కథావరణం పు 135), ‘‘రాజారాం గారి కథల్లో ప్రతిబింబిస్తున్నది. తెలుగు నాట జీవితమే కాబట్టి ఆయన యాభై సంవత్సరాల కాలంలో రాసిన వందలాది కథలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక అర్ధ శతాబ్ది తెలుగు దేశపు సాంఘిక పరిణామం మనకు అందులో స్పష్టంగా కనిపిస్తుంది’’ (కథావరణం పు. 63) వంటి సమాజ కేంద్రిత విమర్శను సూచించే వాక్యాలు, ‘‘స్వామి రాసిన ‘నడక’ కథ ఫాక్షనిస్టులకు సొంత సైన్యం సమకూర్చే విధానాన్ని వివరిస్తుంది’’ (కథావరణం పు 160) వంటి అభిప్రాయాలు రచనా కేంద్రిత విమర్శకు నిదర్శనాలు. సాహిత్యాన్ని ఎన్ని పార్శ్వాల నుండి వ్యాఖ్యానించవచ్చునో సింగమనేనికి తెలుసు.
సింగమనేని ప్రధానంగా కథా రచయిత, ఆయన విమర్శంతా ప్రధానంగా కథా నవలా సాహిత్యం మీద. అయితే ఆయన శ్రీశ్రీ ‘‘మహా ప్రస్థానం’’ చదివి మార్క్సిజం వైపు మళ్ళారు. కవిత్వం ద్వారా మార్క్సిస్టు అయ్యారు. మహా ప్రస్థానం గేయాన్నీ ఆయనకు నోటికి వచ్చు. చాలా ప్రసంగాలలో ఆయన శ్రీశ్రీ, తిలక్ కవితలు ఉదాహరించేవారు. ఆయన కథా సాహిత్య విమర్శలో కూడా శ్రీశ్రీ కవిత్వ పదజాలాన్ని ఉపయోగించారు. ఆయన విమర్శలో ఇదొక ధోరణి. వి. ప్రతిమగారి ‘‘పక్షి’’ కథా సంపుటికి ముందు మాట రాస్తూ, దానికి ‘‘విలాపాగ్నులూ, విషాదాశ్రులూ’’ అని పేరు పెట్టారు. (కథావరణం పు 139) ఆయన కథా సంపుటికే ‘‘జీవఫలం, చేదువిషం’’ అని పేరు పెట్టారు. వై.వి. మల్లారెడ్డి గారి ‘‘అనంత ప్రస్థానం’’ అనే గ్రంథానికి రాసిన ముందుమాటకు ‘‘ఏ వెలుగులకీ ప్రస్థానం’’ అనే పేరు పెట్టారు. ‘‘కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని’’ అనే పేరుతో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల ‘‘ఒక్క వాన చాలు’’కు ముందుమాట రాశారు. ఇలాంటి పని ఆయన చాలా వ్యాసాలలో చేశారు.
మార్క్సిస్టు సాహిత్య విమర్శకు సామాజిక పరిణామాలకు సాహిత్యాన్ని ప్రతిఫలనంగా చూడటం, మానవ సంబంధాలను నియంత్రించే ఆర్థికాంశాలను గుర్తించడం, సమాజంలోని వర్గ స్వభావాన్ని సాహిత్యంలో అన్వేషించడం, రచయిత వర్గ స్వభావాన్ని ఎత్తి చూపడం, ఒక రచన లేదా ఒక సాహిత్యం పుట్టిన నేపథ్యంలోంచి ఆ రచనను, ఆ సాహిత్యాన్ని విశ్లేషించడం వంటివి విధిగా చేయవలసిన పనులు. సింగమనేనికి ఈ విమర్శాంశాలన్నీ బాగా తెలుసు. 1990కి తర్వాత తెలుగు కథ, 2002 తెలుగు కథ వంటి వ్యాసాలలో సింగమనేని అనేక మార్క్సిస్టు విమర్శ సూత్రాలను అనుసరించారు. 1990-96 మధ్య ఏడేళ్ళలో వచ్చిన తెలుగు కథల్ని విశ్లేషిస్తూ 1980 నుంచి తెలుగు సాహిత్య రంగంలో విజృంభించిన వ్యాపార ధోరణులను పేర్కొని, 1990 తర్వాత తెలుగు కథ ఆ ధోరణులను అధిగమించి వచ్చిందని వివరించారు. ‘‘పత్రికల్లో మంచి కథ వెతుక్కోవటం ఒక సాంస్కృతిక స్థాయి గల పాఠకుడికి కూడా దాదాపు కష్టమయ్యే పరిస్థితి దాపురించింది’’
‘‘గత దశాబ్ది (1990) చివరి కల్లా పరిస్థితి క్రమంగా కొంత మారుతూ వచ్చింది. ఒక సాంస్కృతిక చలనం చల్లగా విప్పారసాగింది’’ (కథావరణం పు 39). 2002లో వచ్చిన కథ నేపథ్యాన్ని సింగమనేని ప్రపంచీకరణ దుర్మార్గాల నేపథ్యంలో చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతా లమీద ప్రపంచీకరణ ఎలా పంజా విసిరిందో చెప్పి ఆయా ప్రాంతాల కథలను విశ్లేషించారు.
ఆర్థికాంశాలు జీవితాన్ని ఎలా శాసిస్తాయో చాసో గారి వాయులీనం, ఎందుకు పారేస్తాను నాన్నా, ఎంపు వంటి కథల పరామర్శతో సింగమనేని వివరంగా చర్చించారు. ఆర్థిక విషయాలు నైతిక స్థాయిని కూడా దిగజారుస్తాయని ‘ఏలూరెళ్ళాలి’ కథ చెబుతుందన్నారు. చాసోగారి ‘బండపాటు’ కథ ‘‘చావు చుట్టు కూడా ఆర్థికాంశాలే బలమైన పాత్రను ‘ప్లే’ చేస్తాయని బీభత్సంగా నిరూపిస్తుందన్నారు (కథావరణం పు 62) చాసోగారి కథల్లో ప్రధానంగా ఆర్థికాంశాలు జీవితాన్ని ప్రభావితం చేస్తున్న వైనం పాఠకులకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. రారా కథ ఇతివృత్తాలలో ఆర్థికాంశం ప్రధానంగా ఉంటుందని, సమాజాన్ని శాసించేది, నియంత్రించేది ఆర్థిక శక్తులే అన్న తాత్విక దృక్పథం గల రచయిత కావడం వల్ల ఆయన మరొక రకమైన కథలు రాయలేదన్నారు. చాలా మంది మార్క్సిస్టు కథకుల కథల్లో తొంగి చూసే ఆర్థికాంశాన్ని ఆయన ప్రస్తావించారు.
మార్క్సిస్టు సాహితీపరులకు వర్గ దృక్పథం ఉండటం సహజం. సింగమనేని ‘‘చాసోకు స్పష్టమైన వర్గ దృక్పథం ఉన్నది’’ అని గుర్తించారు (కథావరణం పు 64). జీవితాన్ని ఆర్థికాంశం నియంత్రిస్తుందని సింగమనేని అన్నపుడు ఆయనకూ వర్గ దృక్పథముంటుంది. ఉంది కూడా. కాని సింగమనేనికి వర్గ దృక్పథం లేని మధురాంతరం రాజారాం గారిపైన అపారమైన ఇష్టం, అభిమానం ఉన్నాయి. ‘‘కథకులు కథన రీతులు’’లో ఆయన మీద పెద్ద వ్యాసం రాశారు. ఆయన మరణించినపుడు స్మృతి వ్యాసం రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ఆయన మీద మోనోగ్రాఫ్ రాశారు. అనేక సభలలో ప్రసంగాలు చేశారు. ఆయన దగ్గరికి వచ్చే సరికి సింగమనేని తన వర్గ దృష్టిని పక్కకు పెట్టారనిపిస్తుంది. టాల్‌స్టాయ్‌ని గురించి లెనిన్ అన్న మాటను రాజారాం గారికి అన్వయించి, ఆయన వర్గ రహిత దృక్పథాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు సింగమనేని. ‘‘రాజారాం గారు మనిషిని కేంద్రంగా ఉంచి, చుట్టూ సామాజిక జీవితం అనే గూడును అల్లుతారు. మనిషి జయాపజయాలకు కష్ట నిష్ఠూరాలకు సుఖదుఃఖాలకు మంచి చెడులకు రాజారాంగారి కథలు మనిషినీ బాధ్యుణ్ణి చేస్తాయి. కాని ఒక వ్యవస్థనుగాని, ఒక వర్గాన్ని కాని బాధ్యుణ్ణి చెయ్యవు. మనుషుల్లో మంచితనం చూడటానికి ఆయనకు వర్గాలు అడ్డు రావు. భూస్వాముల్లో కూడా రాతిలో తేమ లాంటి మంచితనాన్ని ఆయన చూడగరు. ‘‘మంచితనం వెనుక గ వర్గ స్వభావాన్ని ఆయన గుర్తించరు’’ ఇలాంటి చాలా వివరాలు ఇచ్చారు రాజారాం గారిని గురించి. కాని ఆ రకమైన వర్గరహిత దృష్టిమీద సింగమనేని కామెంట్స్ మాత్రం కనిపించవు. అభిమానం ఉన్న చోట ఇలాగే ఉంటుందేమో!
సింగమనేని సాహిత్య విమర్శంతా అస్తిత్వ ఉద్యమా కాలంలోనే ఎక్కువ రాశారు. దళిత, స్త్రీ, ప్రాంతీయ, ముస్లిం అస్తిత్వ కథా సాహిత్యం మీద సింగమనేని చాలా వ్యాసాలు రాశారు. అస్తిత్వవాదుల సమస్యనూ, ఆయా వాదాల కథా సాహిత్యాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. వ్యాఖ్యానించారు. ‘‘వతన్’’ అనే ముస్లిం సంకలనం మీద, సత్యాగ్ని కథల మీద సింగమనేని విలువైన వ్యాసాలు రాశారు. సత్యాగ్ని కథలను మార్క్సిజం అందించిన విముక్తి వాద నేపథ్యంలో వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. సత్యాగ్ని ముస్లిం సమాజంలో పీడితులైన స్త్రీ పక్షం వహించి, మతమౌఢ్యం నుంచి వాళ్ళను విముక్తి చేసి, ఆధునికత వైపు వాళ్ళను మళ్ళించే ప్రయత్నం చేశారన్నారు. ‘‘వతన్’’ కథన్నీ చదివే సరికి మనం కంపించిపోతాం, ద్రవించిపోతాం’’ అంటారు. ఆ కథలను చదవడం ఒక సామాజికానుభవం, ఒక సాంస్కృతికానుభవం. ఒక జీవితానుభవం వంటి విశేషణాలు వేశారు. (కథావరణం పు 146). ఈ సంపుటి రెండు మతాల మధ్య మానవీయ సంబంధాలను పునరుద్ధరించడానికి ఒక వారధి అని అభిప్రాయపడ్డారు.
1990 – 96 మధ్య వచ్చిన కథల మీద, 2002లో వచ్చిన కథల మీద రాసిన వ్యాసాలో దళిత, స్త్రీవాద కథలను చర్చించారు. ప్రాంతీయ అస్తిత్వవాద కథలను కూడా పరామర్శించారు. దళిత స్త్రీవాద దృక్పథాలతో కథలు రావడం మొదలు కాకముందే దళిత, స్త్రీ జీవితాల మీద చాలా మంది కథలు రాశారు అన్నది గుర్తు చేశారు సింగమనేని. ‘‘స్త్రీ సమస్యల్నీ స్త్రీ అణచివేతనూ, పురుషాధికత్యనూ చిత్రించటం తెలుగు కథకులకు ఏమాత్రం కొత్త కాదు’’ (కథావరణం పు 41) ‘‘అస్పృశ్యమైన మాదిగ పక్షం వహించి ఆర్ధ్రతతో అనుకంపతో సానుభూతితో గతంలో శ్రీపాద కాలం నుండి ఎందరో కథకులు కథలు రాశారు’’ (కథావరణం పు 45) అని అంటూనే అస్తిత్వ దృక్పథంతో ఇచ్చిన ఇటీవలి కథలను సానుభూతితో పరామర్శించారు. స్త్రీవాదం తెలుగు కథలోకి కొత్త వస్తువులను, కొత్త పాత్రలను, కొత్త ఆలోచనా విధానాన్నీ, కొత్త జీవన విధానాన్నీ, కొత్త సంచనాల్నీ సృష్టించింది అంటూనే, స్త్రీ పురుష సంబంధాలను వర్గ దృష్టితో చూడటం స్త్రీవాద కథల్లోని లోపం అంటారు (కథావరణం పు 44). అలాగే కుటుంబ వ్యవస్థ పట్ల అలెర్జీ కలిగించే ధోరణిని కూడా ఆయన ఆమోదించలేదు. మొత్తం మీద సింగమనేని కుటుంబ వ్యవస్థను తిరస్కరించే స్త్రీవాద కథలను ఆమోదించలేదు. దళిత కథలను కొన్నిటిని వివరంగా విశ్లేషించి మంచి దళిత కథ ఇంకా రూపుదిద్దుకోలేదు అనే వాదనను తిరస్కరించారు. విప్లవోద్యమం మొదయినప్పుడు వచ్చిన కథలనూ, 1990 తర్వాత వచ్చిన విప్లవ కథలనూ సింగమనేని బేరీజు వేశారు. విప్లవోద్యమాల పట్ల స్పందించి ఆత్మీయతతో, ఇష్టంతో రాజయ్య, తుమ్మేటి, చంద్ వంటి రచయితల కథలు రాశారంటూనే సింగమనేని ‘‘ప్రత్యక్ష పోరాటాన్ని ఏ రచయితా కథాబద్ధం చేయకపోయినప్పటికీ, వాటి స్పర్శ గాలలూ, పోరాటాల పట్ల ఒక స్పృహనూ ఆలోచనలనూ రేకెత్తిస్తాయి’’ అన్నారు. (కథావరణం పు 50) ఈ అభిప్రాయం పరిశీలించవసినది. అయితే ఆయన వెంటనే విప్లవ కథల్లో పల్లెల్లోకి పార్టీ వాళ్లు రావటమూ, గ్రామీణ యువకుల రహస్య జీవితంలోకి వెళ్ళటమూ, భూస్వాము భూముల్ని పోరాటవాదులు ఆక్రమించుకోవటమూ, వంటి ఉద్యమ పరిణామాలను ప్రతిబింబిస్తున్నాయంటారు. ఇక్కడ సింగమనేని అస్పష్టంగా మాట్లాడడం అనిపిస్తుంది. అట్లని ఆయన అతడు, సన్నజీవాలు, రెండు మరణాలు వంటి కథలను బాగా వివేచించక మానలేదు. అలాగే సింగమనేని తొలితరం విప్లవ కథలకూ, మలితరం విప్లవ కథలకూ మధ్య తేడాను గుర్తించారు. తొలి దశ విప్లవ కథలో యాంత్రికత ఉండేదని, మలి దశలో అది లేదని అభిప్రాయపడ్డారు.
సింగమనేని గుండె నిండా స్పందించి, తక్కిన అస్తిత్వ వాద కథలన్నిటి కన్నా, ప్రాంతీయ అస్తిత్వవాద కథలను గురించే ఇష్టంగా మాట్లాడారు. రాయసీమ కథా చిత్రం, తెలుగు కథ ` ప్రాంతీయ స్పృహ, సీమకక్ష కథలు, తెలుగు కథ 1990 తర్వాత, తెలుగు కథ 2002 ఇక్కడ మేమంతా క్షామం (ఇనప గజ్జె తల్లి ముందుమాట) వంటి వ్యాసాలలో సింగమనేని ప్రాంతీయ అస్తిత్వ వాద స్పృహతో తెలుగు కథల్ని విశ్లేషించారు.
‘‘నిర్దిష్ట స్థలకాలాలకు చెందిన స్పృహే ప్రాంతీయ స్పృహ’’ (కథావరణం పు 175) అనే అవగాహనతో, సింగమనేని ప్రాంతీయ వాస్తవికతను గుర్తించని వాళ్ళను ఘాటుగా విమర్శించారు. ‘‘ప్రపంచంలో వచ్చిన సాహిత్యమంతా ఒక ప్రాంతాన్నీ ఆ ప్రాంతపు నిర్దిష్ట జీవితాన్నీ సమస్యనూ ఆశ్రయించుకొని ఉన్నదే’’ (పైది) అన్న స్పృహను గుర్తించని వాళ్ళను అధిక్షేపించారు. గురజాడ నుంచి వచ్చిన గొప్ప సాహిత్యమని భావించే సాహిత్యమంతా ప్రాంతీయ సాహిత్యమేనని పేర్కొన్నారు. ఈ అవగాహనతో సింగమనేని రాయలసీమ నుండి గంజి కోసరం (జి. రామకృష్ణ) ఉత్తరాంధ్ర నుండి ‘పులుసు’, తెలంగాణ నుండి ‘జాడ’ కథలు తీసుకొని ఆ కథలు ఆయా ప్రాంతీయ వాస్తవికతకు ప్రతిబింబాలని విశ్లేషించారు. 2002లో వచ్చిన తెలుగు కథల్లో సింగమనేని నాలుగు ప్రాంతాల జీవన వాస్తవికత ఎలా ప్రతిబింబించిందో చర్చించారు. ఇక్కడ ఆయన ప్రపంచీకరణ నేపథ్యాన్ని ప్రధాన ఆధారంగా పెట్టుకున్నారు. అన్నీ ప్రాంతాల కథలనూ వివేచించిన సింగమనేని ‘‘గ్రామీణ జీవితంలోని ఈ సంక్షోభం తనకు తాను తెచ్చి పెట్టుకున్నది కాదు, సరళీకృత ఆర్థిక విధానాల అమలు కారణంగా, ప్రపంచ బ్యాంకు ఒప్పందాల అమలు వల్ల, ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయానికి పెనుముప్పు దాపురించి, రైతాంగం ఆత్మహత్యలు, వలసలతో గ్రామాలకు గ్రామాల చిరునామాలు లేకుండా చేసింది. ఈ పరిణామాలు, పతనాలు ఈ యేటి కథల్లో కన్పించడం విశేషం’’ అన్నారు (కథావరణం పు 88).
ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో సింగమనేని సహజంగానే రాయసీమ కథలను గురించి అత్యంత అభినివేశంతో, ఇష్టంతో, ఆవేదనతో వివేచించారు. రాయలసీమ ప్రజా జీవితంలో చురుకైన పాత్ర నిర్వహించిన సింగమనేని, తన జ్ఞానాన్నంతా సీమ కథల మీద రాసిన వ్యాసాలలో నిక్షేపించారు. అందులోనూ అనంతపురం జిల్లా మీద మరింత ఆవేదనతో మాట్లాడారు.
1998లో ‘‘రాయసీమ కథాంశం’’ వ్యాసం రాశారు సింగమనేని. అప్పటికి తెలంగాణ రాష్ట్రోద్యమం రగులుకుంటున్నది. ఈయన అప్పటికే ‘‘సీమ కథలు’’ సంకలనం చేసి ప్రాంతీయ అస్తిత్వ స్పృహను రగిలించి ఉన్నారు. రా.రా. బహుశా మొదటిసారి రాయలసీమలో ఆధునిక సాహిత్యం, కోస్తా ప్రాంతంతో పోల్చి చూస్తే చాలా ఆలస్యంగా మొదలైందని, ఇందుకు ప్రాంతాల మధ్య అభివృద్ధిలో తేడాలే కారణమని కడప జిల్లా సాహిత్యం మీద వ్యాసం రాస్తూ అన్నారు.అప్పటి నుంచి అందరూ అవే మాటలే అంటూ వచ్చారు. సింగమనేని కూడా ఆ బాటలోనే నడిచారు. అయితే 2010 తర్వాత యువ పరిశోధకులు తవ్వా వెంకటయ్య, పొదిలి నాగరాజు, అప్పిరెడ్డి హరినాథరెడ్డి రాయలసీమలో ఆధునిక సాహిత్యం మన పూర్వ విద్వాంసులు అనుకున్నంత వెనకబడిపోలేదని రుజువు చేశారు. అయినా ఎందుకో సీనియర్ విద్వాంసులు తమ అభిప్రాయాలను అందరూ మార్చుకోలేదు. సింగమనేనిగారు ఈ వ్యాసంలో పాత అభిప్రాయాలను అలాగే ప్రచురించేశారు. రాయలసీమ తొలి కథకుడిగా కె. సభాను గుర్తించారు. కానీ ‘‘దిద్దుబాటు’’ ప్రకారం 1887లోనే రాయలసీమ కథ పుట్టింది. రచయిత పేరు తెలియదు. ఇదలా ఉంచితే సింగమనేని రాయలసీమ కథకులను రెండు తరాలుగా విభజించారు. 1950 నుండి రాసినవారు తొలితరం అని, 1975 నుండి రాస్తున్న వారు రెండో తరం వారని అన్నారు. 1950కి ముందే రాయలసీమలో తొలితరం కథకులున్నారని గుర్తిస్తే మూడు తరాల కథకులవుతారు.
ఈ వ్యాసంలో సింగమనేని ఒక మాట అని వివాదం సృష్టించారు. ‘‘విచిత్రమేమంటే రాయసీమలో కథులు రాస్తున్న వాళ్ళంతా బ్రాహ్మణేతరులు కావటం (ఒక్క వల్లంపాటిగారిని మినహాయిస్తే)’’ అన్నారు. (కథావరణం పు 24). ఇది ఒక వివాదమైంది. అయితే 2010 తర్వాత యువ పరిశోధకులు అందించిన వివరాల ప్రకారం 1940కి ముందు రాయలసీమలో కథానిక ఉందని, ఆ కథలు రాసిన వాళ్ళలో బ్రాహ్మణులు, వైశ్యులు ఉన్నారని తెలుస్తుంది. అయ్యగారి నరసింహమూర్తి, ఆలూరు శేషాచార్యులు, ఎం.వి. పాపన్న గుప్త, వెల్లాల మైసూరయ్య, దోమా వెంకటస్వామి గుప్త, అవధానం సుందరం, గడియారం శ్రీరాములు, వంశీపురం వేంకటశేషాచార్యులు, కందా శేషాచార్యులు మొదలైన వాళ్లు తొలినాళ్లలో కథానికలు రాశారు. అందువల్ల 1940 తర్వాతనే రాయలసీమలో కథ పుట్టిందని, రచయితలు బ్రాహ్మణేతరులననే అభిప్రాయాలను రాయలసీమ కథా చరిత్రకారులు, విమర్శకులు మార్చుకోవలసి ఉంది. మహబూబ్ మియా అనే ముస్లిం కథకుడు కూడా తొలినాటి రాయలసీమ కథకుడు కావడం విశేషం.
సింగమనేని రాయలసీమ వ్యవసాయరంగ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రచయితలు రాసిన కథలను విశ్లేషించారు. ఇది మంచి అధ్యయన పద్ధతి. తొలితరం రచయితలు కపిల (మోట) తొలి వ్యవసాయం చేసే కాలానికి చెందినవారని, రెండవ తరం వారు బోరుబావు సేద్యం కాలంలో కథలు రాశారని గుర్తించారు. ఈ వ్యవసాయ రంగ పరిణామాలే ఆ రెండు తరాల కథల వస్తు శిల్పాలను నిర్దేశించాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సింగమనేని విలువైన వివరాలు చాలా ఇచ్చారు. రాయలసీమ రచయితలంతా పల్లె పట్టు నుంచి, శ్రమ జీవన సంస్కృతితో సంబంధం ఉన్న వాళ్ళని పేర్కొనడం గమనించాలి.
1995 నుంచి, మరీ ముఖ్యంగా 2000 – 2003 మధ్య రాయలసీమను, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాను దుర్భరమైన కరువు చుట్టుముట్టింది. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు బృందాలుగా ఏర్పడి కరువు అధ్యయన యాత్ర చేశారు. ప్రపంచీకరణ ప్రవేశించి, రాష్ట్ర పాలకు లు ప్రపంచ బ్యాంకులకు విధేయులై ప్రజలకు దూరం కావడం వల్ల అప్పుల్లో కూరుకుపోయిన రైతు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైంది. అప్పుడు రైతు ఆత్మ విశ్వాసయాత్ర జరిపారు. కరువులో పనులు వెతుక్కుంటూ గ్రామాలు వలస వెళ్ళిపోయాయి. మిగిలిన పిల్లలు, ముసలివాళ్ళు ఆకలితో మలమల మాడిపోయారు. ఆ సమయంలో ప్రజాసంఘాలు దాదాపు 100 గంజి కేంద్రాలు నిర్వహించాయి. ఈ మూడు కార్యక్రమాలో సింగమనేని క్రియాశీల పాత్ర నిర్వహించారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం ‘‘వొరుపు’’ కవితా సంకనం, ‘‘ఇనప గజ్జెల తల్లి’’ కథా సంకలనం ప్రచురించింది. సింగమనేని ఈ కథల సంకలనానికి శాంతి నారాయణతో పాటు సంపాదకత్వం వహించారు. ఈ రెండు సంకనాలకు ముందు మాటలు రాశారు. వాటిలో ఆయన అధ్యయన సామర్థ్యం కనిపిస్తుంది. 1964 ప్రాంతంలో ఒక రాయలసీమ ఇంజనీరుకు కృష్ణా జిల్లా వాళ్ళు అమ్మాయినిచ్చి తొమ్మిది వేలు కట్నమిచ్చారట. అదే ఆ అబ్బాయి కృష్ణా జిల్లావాడయ్యుండే లక్ష కట్నం వచ్చేదన్నారు. అనంతపురం జిల్లా ఉభయగోదావరి జిల్లాల కన్నా ఎక్కువ వైశాల్యముందని, కానీ ఆ జిల్లాలో జనాభా 82 లక్షలు కాగా, అనంతపురం జిల్లాలో 38 లక్షలు మాత్రమేనని గుర్తించారు. అలాగే శాసన సభా స్థానాలలోను తేడాను గుర్తించారు. 28 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 10 శాతానికి మాత్రమే నీటి సౌకర్యం ఉందని పేర్కొన్నారు. ఇలా అనేక వివరాలిచ్చి, పాలకుల మీద విమర్శ పెట్టి ‘‘మా జిల్లాను భారత దేశ చిత్ర పటం నుండి తుడిచివెయ్యండి అని జిల్లావాసులు ఇప్పుడు ఘోష పెడుతున్నారు. మేమీ భారతదేశంలో జీవించే హక్కును కోల్పోయాము. మేము ఈ దేశంలో ఉండటం కంటే ప్రత్యేక దేశంగా (ప్రత్యేక రాష్ట్రంగా కాదు) మామానాన మేం జీవిస్తాం. మామానాన మేం చస్తాం. మీ దయా దాక్షిణ్యాలు మాకు అక్కరలేదు అని జిల్లా ప్రజలు రేపు ఘోషిస్తే ఏం సమాధానం చెబుతారు?’’ అని అడిగారు (మున్నుడి పు 59).
సింగమనేని చదివింది ఎక్కువ. రాసిన విమర్శ పరిమితం. రాసిన దానిలో కథా విమర్శే అత్యధికం. రారా, కేతు విశ్వనాథరెడ్డి, వల్లంపాటి, ఆర్ఎస్ సుదర్శనం, సొదుం రామ్మోహన్ మొదలైన వాళ్ళతో పాటు సింగమనేని రాయలసీమ నుండి తెలుగు కథానికా విమర్శను సుసంపన్నం చేశారు. మార్క్సిస్టు విమర్శకుడైన సింగమనేని అమార్క్సీయ కథా సాహిత్యం మీద ఎంత అనుకూల దృష్టితో విమర్శ రాసినా, తగ్గు స్వరంతోనైనా కొంత రిజర్వేషన్ పాటించారనిపిస్తుంది. అభిమానం ఉన్న చోట మాత్రం ఆ రిజర్వేషన్ పాటించినట్లు కనిపించదు. వాస్తవిక వాద కథా సాహిత్యాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు. వ్యాపార కథా సాహిత్యాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కథా శిల్పపరంగా కూడా గట్టి పట్టుద గల విమర్శకుడు సింగమనేని.
‘‘కథ తెలుగు’’ పేరుతో సింగమనేని రాసిన పెద్ద వ్యాసం ఒక మంచి పరిశోధన పత్రం. గురజాడ నుండి ఈనాటి కథకు దాకా తెలుగు కథా రచయితలు తెలుగు భాషను ఎన్ని రకాలుగా, ఎలా ఉపయోగించుకున్నారో సింగమనేని వివరించారు. కథలో తెలుగు భాషా వినియోగానికి ఆద్యునిగా పేర్కొంటూ ‘‘ఆధునికత, దేశీయత, సమకాలీనత, సామాజికత, వాస్తవికత పునాదులుగా తెలుగు కథానికను తీర్చిదిద్దిన వాడాయన’’ అని నిర్వచించారు. గురజాడ తర్వాత అన్ని ప్రాంతాల కథకుల భాషను పరామర్శించారు. శ్రీపాద తెలుగు కథా భాషకు దేశీయతను, చలం వడినీ, వాడిని, కొకు నిరాడంబరతను, చాసో ప్రాంతీయతను, మల్లాది నిసర్గతను, బుచ్చిబాబు కవితాత్మకతను, పాలగుమ్మి సందర్భౌచిత్యాన్ని, సురవరం భాషా విస్తృతిని, గోఖలే మాండలికతను ఇలా ఒక్కో రచయిత ఒక్కో గుణాన్ని తెలుగు కథా భాషలో సాధించారని పేర్కొన్నారు. 1970 తర్వాత అన్ని ప్రాంతా ల భాషకూ సాహిత్య గౌరవం దక్కిందన్నారు.
కథానికా రచన పట్ల సింగమనేనికి శాస్త్రీయమైన అభిప్రాయాలున్నాయి. రచయిత తీసుకున్న వస్తువే తన రూపాన్ని ఎంచుకుంటుంది అనే మార్క్సీయ సిద్ధాంతం పట్ల సింగమనేనికి నమ్మకముంది. రచయిత తీసుకునే వస్తువు కథకునికి బాగా తెలిసి ఉండాలి. తెలిసిన జీవితం గురించే కథకుడు రాయడం మంచిది అంటారాయన (కథావరణం పు 198). కొ.కు ఇలాంటి అభిప్రాయాలు చెప్పారు. కొ.కు. అన్నట్లు కథానికలు పువ్వుకు పూసిన పూలు కారాదంటారు. కథా రచనతో భాష కూడా ఒక వాస్తవికత అంటారు సింగమనేని. సాహిత్యానికి జీవితమే ముడి సరుకు అన్నది సింగమనేని అభిప్రాయం కూడా. కథానికతో ప్రతి పాత్ర తన భాషనే మాట్లాడాలంటారు.
కథ కథ కోసం కాదూ, ఒక పాయింటును పాఠకుడికి చేరవేయడానికే కథ అవసరమంటారు సింగమనేని. ఇవన్నీ తెలుగు మార్క్సిస్టుందరికీ ఉన్న అభిప్రాయాలు. సింగమనేనికీ ఉన్నాయి. సింగమనేని ఒక నియమబద్ధమైన విమర్శకుడు.
‘‘సైన్సు తెలియకుండా సాహిత్యం చదవకుండా
ఈ సమాజమూ, ఈ ప్రపంచమూ అర్థంగావు’’
(సింగమనేని: ముందుమాట, ఉపాధ్యాయ కథలు 2016)