విరసం తదితర 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకించండి

26.4.2021

విప్లవ రచయితల సంఘం సహా 16 ప్రజా సంఘాలను చట్టవ్యతరేక సంస్థలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు, సంఘం పెట్టుకొనే హక్కుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ జీవో ప్రభుత్వ పాలనా పద్ధతులకు కూడా పూర్తి వ్యతిరేకంగా వెలుగులోకి వచ్చింది. జీవో ఎంఎస్ 73 పేరుతో మార్చి 30న ఈ ఉత్తర్వులను తయారు చేశారు. ఏప్రిల్ 28న పత్రికలకు విడుదల చేశారు.

ప్రజాస్వామ్యంలో జీవోలు తయారైన కొద్ది గంటల్లోనే ప్రజలకు బహిరంగపరచాలి. ఈ పారదర్శకతను తెలంగాణ ప్రభుత్వం పాటించలేదు. ఇది పాలనా సూత్రాలకు పూర్తి విరుద్ధం. అంతే కాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం లేకుండానే ఆయన పేరు మీద దీన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజాభద్రతా చట్టం -1992 ప్రకారం ఈ సంస్థలను చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రకటిస్తున్నానని చెప్పుకున్న ప్రభుత్వం ఆ చట్టం ప్రకారమే పాటించాల్సిన పద్ధతులను ఉల్లంఘించింది.

చట్ట వ్యతిరేక సంస్థలుగా ఎందుకు ప్రకటించదల్చుకున్నదీ ముందు ఆ సంఘాల బాధ్యులకు తెలియజేయాలి. ప్రభుత్వ ఆరోపణలపై ఆ సంస్థలు తమ వాదనలను, అభ్యంతరాలను వినిపించడానికి ఒక విచారణ కమిటీని హైకోర్టు న్యాయమూర్తులతో ఏర్పాటు చేయాలి. అక్కడ వాదోపవాదాలు జరిగాక ఆ కమిటీ నిర్ధారిస్తేనే చట్టవ్యతిరేక సంస్థలవుతాయి. నిషేధం అమలులోకి వస్తుంది. ఈ మొత్తానికి చట్టం ప్రకారమే మూడు నెలల గడువు ఉంది.

అంతేగాని ప్రభువుల వారికి కోపం వచ్చినంత మాత్రాన ప్రజా సంఘాలు చట్ట వ్యతిరేక సంస్థలైపోవు. దశాబ్దాలుగా ప్రజా జీవిత ఉన్నతీకరణకు పని చేస్తున్న సంస్థల కార్యకలాపాలు నేరమైపోవు. దొరవారు తమకు ఇష్టం లేని ఆలోచనలను అణచివేయడానికి చట్టాన్ని అడ్డం పెట్టుకుంటామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. సమాజం మీద నిరంకుశ పెత్తనాన్ని చెలాయించడానికి భిన్నాభిప్రాయాలు గల సంస్థలను చట్టవ్యతిరేకమని అనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.

ప్రజలందరూ ప్రభుత్వ అభిప్రాయాలకు లోబడి ఉండాలని, వేరే ఆలోచన ఏదీ చేయడానికి వీల్లేదని అంటే భారత రాజ్యాంగం అంగీకరించదు. ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మకంగా ఉండటానికి, ప్రభుత్వ ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు చేయడానికి, ప్రచారం చేసుకోడానికి భారత రాజ్యాంగం పూర్తి అవకాశం ఇచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విమర్శనాత్మకంగా ఉండటం భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. విరసం సహా 16 సంఘాల మీద తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలు చట్ట వ్యతిరేకమని న్యాయ విచారణలో తేలాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిందని మేం చెప్పదల్చుకున్నాం.

ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రజాసంఘాల మీద 5 ఆరోపణలు చేసింది. సీపీఐ మావోయిస్టు వ్యూహం ఎత్తుగల ప్రకారం ప్రభుత్వ వ్యతిరేకంగా అర్బన్ గెరిల్లా చర్యలకు అనుబంధంగా ఈ సంస్థలు పని చేస్తున్నాయని చేసిన ఆరోపణ పూర్తి అబద్ధం. ఇదొక నిరాధార అసంబద్ధ ప్రచారం. విరసం సీనియర్ సభ్యులు, ప్రముఖ సాహిత్యకారులు వరవరరావు, ప్రొ. జిఎన్. సాయిబాబ విడుదల కోసం పని చేయడాన్ని కూడా చట్ట వ్యతిరేకంగా ఈ జీవోలో పేర్కొన్నారు. వీరిద్దరి విషయంలోనే కాదు, భీమా కొరేగావ్ కేసులోని ఇతర మేధావులపైన, సీఏఏ, ఎన్ ఆర్ సీలను వ్యతిరేకిస్తూ ఉద్యమించినవారిపైన ఉపా కేసులు ఎత్తివేయాలని కోరుకోవడం కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలుగా ఈ జీవో ఆరోపించింది.

ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాసరే బెయిల్ కోరుకోడం, దాని కోసం ఉద్యమించడం చట్టబద్ధమైన హక్కు. వాళ్లు విడుదల అయ్యేదీ లేనిదీ న్యాయ ప్రక్రియలో తేలుతుంది. పౌరులకు ఉన్న ఈ చట్ట పరమైన అవకాశాలను నేరమని ఆపాదించడం చట్టవ్యతికం. ప్రభుత్వం చేసిన ఉపా లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుకోవడం రాజ్యాంగ ఇచ్చిన హక్కు. ఇది ఎంత మాత్రం చట్టవ్యతిరేకం కానే కాదు.

ఇలాంటి ఆరోపణలతో విడుదల చేసిన ఈ ఉత్తర్వులు చెల్లవని మేం ప్రకటిస్తున్నాం. తన రాజకీయ తాత్విక విశ్వాసాల కోసం సాహిత్య కళా మేధో రంగాల్లో విరసం పని చేస్తున్నది. సరిగ్గా 15 ఏళ్ల కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం విరసాన్ని నిషేధించింది. అయితే అప్పుడు ప్రభుత్వం న్యాయ సలహా మండలిని ఏర్పాటు చేసింది. విరసం అక్కడ తన మీద ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సహేతుక వాదనలు వినిపించింది. ప్రభుత్వం తన వాదనలకు కనీస సాక్ష్యాధారాలు చూపుకోలేకపోయింది. అబద్దాలకు ఆధారాలు ఎక్కడ ఉంటాయి? ప్రభుత్వం ఓడిపోయింది. విరసం విజయం సాధించింది. మూడు నెలలకల్లా నిషేధ ఉత్తర్వులు వీగిపోయాయి.

మళ్లీ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఇది ఈ ప్రభుత్వ దుర్మార్గ, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తున్నది. విరసం తాను ఎంచుకున్న సాహిత్య భావజాల రంగాల్లో ప్రజల పక్షాన, ప్రగతి కోసం చేస్తున్న కార్యాచరణ ప్రభువులకు చిరాకు తెప్పిస్తోంది. భయానికి లోను చేస్తోంది. ఇది మౌలికంగా సాహిత్యానికి ఉన్న సృజనాత్మక శక్తికి నిదర్శనం. రాజ్యం పదే పదే నిషేధపు ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాల్సి రావడం విప్లవ రచయితల విశ్లేషణ పటిమకు రుజువు. రచయితలు ప్రజా జీవితంలో ఉంటే రాజ్యపు క్రూర స్వభావం బట్టబయలవుతూ ఉంటుంది. సాహిత్య రచన అంటేనే భావజాల, సాంస్కృతిక పోరాటం. ఆధిపత్య, హింసాత్మక, దోపిడీ భావజాలాన్ని ప్రశ్నించమనే చైతన్యాన్ని ఇది ప్రజలకు అందిస్తుంది. అందుకు పదే పదే రాజ్యం విరసం మీద కన్నెర్ర చేస్తోంది.

రెండోసారి వచ్చిన ఈ నిషేధ ఉత్తర్వులను కూడా మేం తప్పక ప్రజలు, ప్రగతిశీల మేధావులు, రచయితల మద్దతుతో ఎదుర్కొంటాం. ఒక్క విరసమే కాదు, దశాబ్దాలుగా ప్రజా జీవితంలోని వేర్వేరు జీవన పార్శ్వాల్లో నిబద్దంగా పని చేస్తున్న మిగతా ప్రజా సంఘాలు కూడా ఈ అప్రజాస్వామిక ఉత్తర్వుల చీకట్ల నుంచి తేజోవంతంగా, మరింత వెలుగులీనుతూ జనం మధ్యకు త్వరలోనే వస్తాయని నమ్ముతున్నాం. ఈ ఉత్తర్వుల్లోని ఆరోపణలు ఎంత ప్రమాదకరమో ఆలోచించమని సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దురుద్దేశపూరిత, కుట్రపూరిత చట్టవ్యతిరేక ప్రభుత్వ చర్యలను ఖండించాలని అందరినీ కోరుతున్నాం.



అరసవెల్లి క్రిష్ణ(అధ్యక్షుడు)

బాసిత్ (ఉపాధ్యక్షుడు)

రివేరా(సహాయ కార్యదర్శి)

కార్యవర్గ సభ్యులు :

పి. చిన్నయ్య,ఉజ్వ ల్, రాంకి, రాము, పాణి, వరలక్ష్మి

సీనియర్ సభ్యులు :

క్రిష్ణాబాయి, సిఎస్ఆర్ ప్రసాద్, జి. కళ్యాణరావు, రత్నమాల, వి. చెంచయ్య, నల్లూరి రుక్మిణి

2 thoughts on “నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం

  1. ✊✊
    Maa Satyam
    “కెసిఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా” వసంత మేఘం May 2nd 2021 ఇష్యూ చదివి.
    భారత పాలకులు
    ‘ ఉ పా ‘ చట్టం 1967
    (37) వ చట్టం. అంతర్జాతీయ ఒడంబడిక యొక్క హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టం.
    రాష్ట్రపతి గారికి చదివే అవకాశం కూడా ఇవ్వకుండా వారి చేత ఆమోదింప చేసుకొని అమలు చేశారు. ఎందుకు ఆ నాటి కమ్యూనిస్టు సంఘాలు , ఇతర ప్రజా సంఘాలు ప్రతిఘటించే లేదు ? ఎందుకు శక్తివంతమైన ఉద్యమాన్ని ఆనాడు ఎందుకు నిర్మించలేక పోయారు?
    తెలంగాణ
    జీవో 73
    dt 30-3-2021
    (SP&D) ప్రభుత్వం భద్రత చట్టం-1992
    విరసం తో పాటు 16 ప్రజా సంఘాల పై నిషేధాజ్ఞలు జారీ చేశారు. నాలుగున్నర దశాబ్దాల కిందట
    23-4-1976 న
    నాటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు
    పెండ్యాల హేమలత వర్సెస్ ప్రభుత్వం 23-4-1976న (ఆంధ్ర ప్రదేశ్ AIR 1976 AP375)
    చీఫ్ జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి, సాంబశివరావు, లక్ష్మయ్య గార్ల సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన ఆర్టికల్19(1) ( ఎ)
    లో హామీ ఇచ్చిన స్వేచ్ఛను తొలగించడం అవుతుంది, భారత రాజ్యాంగ విరుద్ధం. భావప్రకటన స్వేచ్ఛ హక్కు తో సామాజిక విలువల న్యాయ ప్రమాణంలో రాజ్యాంగంలోని 19(1) (A) తో మేము వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం దృష్ట్యా పిటీషన్ కొట్టివేయబడింది.
    అని తీర్పు ఇచ్చారు.
    ఆ నాటి తీర్పు న్యాయపరంగా ఎప్పటికీ వర్తిస్తుంది కనుక అన్ని ప్రజా సంఘాలు కలిసి సంయుక్తంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై అన్ని ప్రజాసంఘాల వాళ్ళు ఎందుకు కేసు నమోదు చేయలేదు?

  2. 19-9-2021
    ✊✊
    మా సత్యం
    అరుణతార సెప్టెంబర్ 2021 సంచిక వర్కింగ్ ఎడిటర్ మరియు ఎడిటర్ పరిశీలించి పరిశీలించి చర్చించి చర్చించి సెలెక్ట్ చేశారు గావును. ఆర్టికల్స్ అన్నీ కూడా
    ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ..
    ఈ సంచికలో పాణి గారు రాసిన సంపాదకీయం
    ‘ కల్లోల ఆఫ్ఘన్-వర్తమాన వ్యాఖ్య’ తనదయిన శైలిలో తార్కిక తాత్విక కోణంలో సామ్రాజ్యవాద శక్తులతో ముడిపడి ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సంక్లిష్ట పరిణామం క్రమాన్ని, 1980 లో అఫ్గానిస్థాన్ను సోవియట్ యూనియన్ ఆక్రమణ దగ్గరనుంచి,
    2001లో యుద్ధంలో అఫ్గానిస్థాన్ను అమెరికా ఆక్రమించడం, తాజాగా ఇప్పుడు చైనా ఆఫ్ఘనిస్తాన్ పై కన్నేసి ఉంచడం, ఇస్లామిక్ తీవ్రవాదం, తాలిబన్ల ఆవిర్భావం. తాలిబన్ల పాలన ఆఫ్ఘనిస్తాన్ ని ఎక్కడికి తీసుకెళుతుంది అనే క్లిష్టమైన సమస్య? ఆఫ్ఘనిస్థాన్లో బలహీనంగా ఉన్న ప్రగతిశీల శక్తుల గురించి,
    మధ్య ఆసియాలో సామ్రాజ్యవాదానికి ఆఫ్ఘనిస్తాన్ వ్యూహాత్మక ప్రాధాన్యత గల దేశంగా, అంతర్జాతీయంగా ఎన్నో ప్రశ్నలతో మన ముందర నిలబడి ఆలోచింపజేస్తున్నాయి.
    *వికల్ఫ్* గారు రాసిన
    *’ వీరోచిత రైతాంగ ఉద్యమం’*
    వ్యాసం లో న్యాయ సూత్ర కోణాలలో నుంచి విశ్లేషించిన వ్యాసం. భారత కాలకూట కాషాయ క్రూర వికృత రూపంలో దాగిన కుట్రపూరిత మోసపూరిత చర్యలను వెల్లడి చేశాయి. వ్యవసాయానికి చెందిన 3 ఆర్డినెన్స్ చట్టాలలో దాగి ఉన్న దోపిడి తత్వాన్ని,
    భారత రాజ్యాంగ చట్టానికి విఘాతం కలిగిన తీరును, దేశీయ కార్పొరేట్ సంస్థలతో పాటు, విదేశీ బహుళజాతి సంస్థల కోసం మాత్రమే మా పరిపాలన కొనసాగుతుందన్న సత్యం, అంతర్లీనంగా వ్యక్తమవుతోంది. రైతు ఉద్యమంపై పై క్రూరమైన అణచివేత చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేకంగా మహిళా రైతులు
    *’కిసాన్ సంసద్’ లో*
    ‘పొలాలను దున్నగలం –
    దేశాన్నినడపగలం’ అంటూ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిన తీరును, ఇతర రాష్ట్ర రైతులు ఎంతో ప్రభావంతో ఉద్యమించిన రైతాంగాన్ని తనదైన శైలిలో విశ్లేషించారు. ప్రజా ఉద్యమ సంఘాలు మరింత శక్తివంతమైన ఉద్యమంగా నిర్మించుకుంటూ బలోపేతం కావాలని అంతర్లీనంగా తెలియజేస్తుంది.
    ఏప్రిల్ 11- 2021
    విరసం సాహిత్య పాఠశాలలో కే.మురళీ గారు మన సంస్కృతులను
    బ్రాహ్మణీయ భావజాలం నుంచి విముక్తి చేద్దాం.
    ఇంగ్లీష్ లో పంపిన ప్రసంగ పాఠాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సి. యస్. ఆర్ ప్రసాద్ గారి అనువాదం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
    నేను ‘ Critiquing Brahmanism A Collection of Essays” ఇంగ్లీషులో చదివాను చాలావరకు అర్థం అవ్వలేదు. మళ్లీ ఒకసారి చదివా వారు అందులో పేర్కొన్న రిఫరెన్సు గ్రంధాలను కూడా కొన్ని పరిశీలించాల్సి వచ్చింది. మురళి గారి ఇంగ్లీష్ ప్రసంగ వ్యాసాన్ని అరుణతార లో
    సి. ఎస్. ఆర్. ప్రసాద్ సార్ అనువాదం చదివిన
    తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ ఏర్పడింది.
    ఇంగ్లీష్ మూలం లోనీ చాలా విషయాల్ని కొన్ని అర్థం చేసుకోవడం కష్టం. నిఘంటువు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ అనువాదం తీర్చింది.
    నాలో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది అది ఏంటంటే.
    శ్రీ శ్రీ గారు సాంప్రదాయం గురించి ఆరుద్ర గారి తో అన్నమాట
    ” చూశావా ఆరుద్ర తమాషా!
    సాంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా”.
    అసలు ఈ ఆచారాలకు మూలమేది?
    ఒక్కసారిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ గుర్తుకు వచ్చారు.
    ఫ్రాయిడ్ ప్రకారంగా
    ” నిషేధమే ఆచారానికి కారణం. ఇది మానవ జాతి యొక్క ప్రాచీన అలిఖిత ధర్మ శాస్త్రం. దీన్ని దిక్కరిస్తే ఆపదల పాలౌతామన్న భయమే ఆచారాల కొనసాగింపుకు కారణమౌతుంది”. అంటారు. ఈ సిద్ధాంతముతో ఎంతమంది ఏకీభవిస్తారో. !?.
    *ఇక్బాల్ రాసిన ‘జానీ’*
    కథకి సేకరించిన చిత్రం చూస్తూ ఉంటే కష్టాల కొలిమిలో నలిగి
    నలిగిన వేదనతో నిస్సహాయులుగా నిలబడ్డా చిత్రముగా నేను ఫీల్ అవుతున్నాను.
    కథల్లోని శైలి అంతా కూడా వచనకవితా రీతితో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ రచయిత యొక్క వ్యక్తిగతం, మనో సంఘర్షణ వారి లోని సామ్యవాద ఆలోచనతో ముడిపడిన ప్రశ్నలతో ముగింపులో ఇలా అంటున్నాడు.
    ” కసితీరా కాటేసి పళ్ళు బిగుసుకున్న నీ కారాగారాలు
    చేయని నేరాలక శిలు వెక్కిన క్రీస్తుల ఎలుగెత్తిని ఆర్తనాదాల
    సజీవ సమాధులయ్యాయో!
    మెతుకు యుద్ధములో బతుకు తో తల పడలేక వందలు… వేలు… లక్షలు… కోట్ల జనం
    ఎవరెవరు ఎక్కడేక్కడ
    ఎందరెందరు ఎట్లేట్ల
    కనుమరుగయ్యారో….” అంటూ రాజ్యంతో అగ్రోద్వేగంతో ప్రశ్నిస్తున్నాడు.
    నిజమే!
    మనము నివసించే భూగోళం అను అణ్వాయుధ ప్రగతి వల్ల, రసాయన ఆయుధ ప్రగతి పథంలో సంవత్సర సంవత్సరానికి చిన్నదై పోతూ, నేరాలతో హత్యలతో వాతావరణ కాలుష్యంతో సంఘర్షణలతో సతమతమవుతున్నా మని ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply