అమ్మా నాన్న‌ల త‌ల‌పోత‌

వాటు పడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. ప్రభుత్వ ప్రచారాల్లో సర్కారు ప్రాంతంలోని ఓ జిల్లా మాది. సముద్రానికి రెండు గంటల దూరంలో ఉంటుంది.  జనాభా ఐదు వేలకు మించే (2001).

పచ్చని పొలాలు గట్ల మీద వంపులు తిరిగిన తాటి కొబ్బరి చెట్లు క్షణం తీరిక లేకుండా టక టక సౌండ్‌ చేసే మగ్గాలు, వసారాల్లో ఉండే ఆసుల్సు రాట్నాలతో ఊరు ఆహ్వానం పలుకుతుంది.

గ్రామంలో పెద్ద సంఖ్యలో దేవాంగ, కాపు కులాలు ఉన్నాయి. దేవాంగుల వృత్తి చేనేత. కొద్దిమంది కలంకారీ-అద్దకం పనులు చేస్తారు. కాపులు ఎక్కువ వ్యవసాయం, ఒకటి రెండు కుటుంబాలు తప్ప. గ్రామం మీద ఆధిపత్యం దేవాంగులదే. ప్రసిడెంటు ఎన్నికలప్పుడు దేవాంగుల్లోంచి నిలబడిన వారే గెలుస్తారు. లెక్కల్లోనే మంగలి, కంసాలి, చాకలి,  గౌడ, ఎరుకల్, వడ్రంగి,  కోమటి, బ్రాహ్మణ, యానాది, బోయ‌, ముస్లిం, మాల‌,  మాదిగలున్నారు,. చాకలి, గొల్ల, ముస్లిం , మాలల్లో తక్కువ మంది తమ తమ వృత్తి చేసుకుంటూ నేత కూడా నేస్తారు.

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న యానాదుల జీవితం చిల్లులు పడ్డ తెపాళా వంటిది. వీరు కల్లాల సమయంలో ఎలుకల, పందికొక్కుల కన్నాలను తవ్వి ఆ కన్నాల్లో ఉన్న వడ్లను ఏరుకొని తక్కువ డబ్బులకు కొట్టు దగ్గర అమ్మి జీవనం గడుపుతారు. కన్నాలను తవ్వేటప్పుడు పాము కాట్లకు కూడా భయపడని బతుకులు వారివి. మిగిలిన సమయాల్లో చేపలు, పీతలు, నత్తలు, పిట్టలు, కుందేళ్ళు, ఉడుములు పట్టి ఇంటింటా తిరిగి అమ్ముతారు, వీరికి ఇళ్ళు లేవు.  ఊరి చివర నాలుగు తటాకులను నిలబెట్టి అందులోనే కాలం గడుపుతారు. వానొచ్చినా, వరదొచ్చినా, రేయింబవళ్ళు నానుతూ ఉంటారు. విష సర్పాల కాట్లకు గురవుతుంటారు. ఊరి పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు మిగిలిన సమయాల్లో వీరి ఊసే ఎత్తరు, వీరి బాగోగులు చూడరు. అనునిత్యం ఛీదరింపులు, ఛీత్కారాలకు గురవుతూ ఎవరినీ పల్లెత్తుమాట అనని వీరి ముందు ఓట్ల సమయంలో నోట్ల కట్టలు వచ్చి పడతాయి.

గ్రామంలో సిపిఐ ప్రభావం ఎక్కువ. చేనేత, రిక్షా కార్మికులైన మాలలు సి.పి.ఐనే అంటి పెట్టుకునేవారు. కాపులు మిగిలిన కులాలు కాంగ్రెస్‌, క్రమేపి సి,పి,ఐ, టి.డి.పి, తో కలిసి పోటీ చేయటంతో జనం ఎవరు ఎక్కువ నోటు ఇస్తే వారికి ఓటు వేసేవారు.

ఊర్లో మూడు వార్డులు, ప్రతి వార్డుకి చౌడేశ్వరి(కనక దుర్గ ) దేవాలయం ఉంది. దేవాంగుల కులదైవం చౌడేశ్వరి. ఒకటవ, మూడవ వార్డుల్లో సీతా రాముల గుడి ఉంది. కాపులు,  గౌడ, గొల్ల…ఎక్కువగా కొలుస్తారు.

మూడు వార్డుల్లో ఉన్న చౌడేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా జరుగుతాయి.     మధ్యాహ్నం భోజనాలు, దాని కోసం దేవాంగులు ఇంటికి ఇంత చొప్పున చందాలేసుకొంటారు. కాపు, గొల్ల, గౌడ కోమటి కులాలు అమ్మవారికి హారతి ఇస్తారు గానీ భోజనాల కార్యక్రమానికి హాజరు కారు.

భోజనాల రోజున యానాదులకు ప్రముఖ పాత్ర ఉంటుంది. కానీ వారు చేసే పనికి విలువుండదు. అందరు తిన్న విన్తళ్ళను ఎత్తి పారయటం, బంతి బంతికి ఊడ్చ‌డం.  ఒక్కొక్క విస్తరలో తినగా మిగిలిన అన్నాన్ని వారి డాకల్లో నింపుతారు. పిల్లలకు అదే పెడతారు. భోజనాల తతంగమంతా ముగిసేటప్పటికీ సాయంత్రం ఐదు గంటలవుతోంది. అప్పటివరకు విస్తళ్ళను ఎత్తుతూ ఖాళీ అయిన గంగాళాలను తళ తళ మెరిసేటట్లు తోమి అన్నం నింపిన దాకలను నెత్తి మీదెట్టుకొని ఊసూర్‌ మంటూ బయల్లేర‌తారు. అంత కష్టపడ్డా వారికి నయానా, బ‌యానా ఇవ్వరు.

మాల‌, మాదిగల పరిస్థితి మరో రకం. సాటి మనిషనే ఇంగిత జ్ఞానం లేకుండా కులం పేరుతో దూషిస్తుంటారు. విప‌రీతమైన అస్పృశ్య‌త  విలయతాండవం మధ్యన వీరి జీవితాలు మగ్గుతున్నాయి. ఇది ఊర్లో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ  ప్రతిరూపాలు.

కుటుంబం:

కమ్మేసినా,  కంట్లం చేసినా పోగు పోని కుటుంబం మాది. నాన్న పేరు నాగేశ్వరరావు, అమ్మ   సరోజిని, అందరు అమ్మను ‘చిన్నమ్మి’ అని
ఆప్యాయంగా పిలిచేవారు. అమ్మకు ఒక అక్క ఒక తమ్ముడు ఒక అన్న ఉన్నారు. మా పెద్ద‌మ్మ   అక్కకు పెళ్ళయిన కొద్ది రోజులకే అనారోగ్యంతో చనిపోయింది. పెద్ద మామయ్య నేత నేస్తాడు. చిన్న మామయ్య కు దుకాణం ఉంది. చిన్న మామయ్యకు పిల్లలు లేరు, పెద్ద మామయ్య పిల్లలను పెంచి పెళ్ళిళ్ళు చేసి వారి బాగోగులు చూశాడు.

మమ్ముల్ని కూడా చాలా మంచిగా చూశాడు. ఏదడిగితే అది లేదనకుండా ఇచ్చేవాడు, నాన్న కుటుంబం పెద్దది. ఆరుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కా చెల్లెళ్ళు. ముగురు అన్నయ్యలు నలుగురు అక్కల తర్వాత నాన్న, నాన్న బాబాయ్‌ కవల పిల్లలు, నాన్న పెద్దవాడు. మాట, నడక ఇద్దరిదీ ఒకే రకంగా ఉండేది. రోగాలు కూడా ఇద్దరికీ ఒకే రకమైనవి.

ఒకరోజు బాబాయ్‌ చుట్టాలింట్లో వచ్చిన కుటుంబ సమస్యను మాట్లాడ్డానికి వెళ్ళాడు, అక్కడ మాటా మాటా  వచ్చింది. తట్టుకోలేకపోయాడు. మాట్లాడుతుండగానే మాట పడిపోయింది. కాళ్ళు చేతులు వంకర్లు తిరిగాయి. వెంటనే హాస్పిటల్లో జాయిన్‌ చేశారు.
పక్షవాతం వచ్చింది. క్రమేపి అది తీవ్రమయ్యి లేవలేని పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో బాబాయ్‌ ‘నేనుండగానే చిన్నోడి పెళ్ళి జరగాలని” పట్టు బట్టాడు. పిల్లనెతికి పెళ్ళి చేశారు. పెళ్ళయిన కొన్ని నెలలకు బాబాయ్‌ చనిపోయాడు,

అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉన్న బాబాయ్‌ మరణం నాన్నను బాగా కలచివేసింది ఎప్పుడూ ‘నాకంటే ముందే పోయాడ’ని వాపోయేవాడు. బాబాయ్‌ చనిపోయిన రెండు సంవత్సరాలకు చిన్నోడు సీతాంబరానికి పుట్టిన పిల్లగాడికి బాబాయ్‌ పేరు నిరంజనరావు
అని పెట్టారు. అచ్చం బాబాయ్‌ పోలికలతో ఉండటంతో వాడు ఏం చేసినా ఏమనేవారు కాదు. ఏదన్నా అంటే బాబాయ్‌ ని అన్నట్టేనని అమ్మా నాన్న అనేవారు.

అమ్మా నాన్న అక్కాయ్‌  అన్నాయ్‌ , చెల్లాయ్‌ , నేను ఇదే మా కుటుంబం, మొత్తం ఆరుగురం. ఉమ్మడిల్లు. ఒక్కటే మగ్గం, దాంతో వచ్చేది
అంతంత మాత్రం ఆదాయమైనా ఏనాడు ఖాళీ కడుపులతో నిద్రపోయింది లేదు. ఉన్నంతలో సర్టి పెట్టే గుణం అమ్మది. ఒక రకంగా చాలా పొదుపరి. ఆర్భాటాలు, ఆడంబరాలు ఇంట్లో మచ్చుకైనా ఉండేవి కావు. చెడు వ్యసనాలు  ఇంట్లో దరి చేరనీయలేోదు. ఈ విషయంలో అమ్మా నాన్నలు చాలా నిక్కచ్చిగా ఉండేవారు. పైస, పైస కూడబెట్టి అన్నాయ్ ని, నన్ను, చెల్లాయ్‌ ని చదివించారు. దాని
కోసం ఎంతో కష్టపడ్డారు.

తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వాటు మొదలయ్యిందంటే మళ్ళీ రాత్రి పది గంటలకే మగ్గానికి విశ్రాంతి. మగ్గానికన్నా అమ్మా నాన్నలకు అని చెప్పుకోవాలి. ఒకరి తర్వాత ఒకరు విడవకుండా నేసేవారు. రేడియో మాంచి కాలక్షోపంగా ఉండేది. అన్ని
కార్యక్రమాలు మగ్గం వాటులో వినేవాళ్ళు. వార్తలను అస్సలు మిస్సయ్యేవారు కాదు. ఆ సమయంలో పాటల కోసం మేం రేడియో స్టేషన్‌ మార్చినప్పుడు ఇద్దరూ కోప్పడేవారు. ‘ఎందుకమ్మా?’ అని అడిగినప్పుడు “కనీసం వార్తలన్నా తెలియొద్దా?’ అనేది అమ్మ.

అమ్మ అన్న దాంట్లో మాకేమి తెలియక ‘అమ్మ ఇంతే’ అని నిట్టూర్చేవాళ్ళం.

అన్నాయ్, చెల్లాయ్, నేను చదువుకుంది అమ్మ ప్రేరణ వల్లనే, అమ్మ ఐదవ తరగతి చదివింది. నాన్న రెండవ తరగతి. ఆలోచనల్లో, నిర్ణయాల్లో అమ్మ స్పీడుగా ఉండేది. చాలీచాలని ఆదాయం వలన మా చదువులకు అవుతున్న ఖర్చులకు నాన్న ఎప్పుడూ
అమ్మతో గొడవ పడేవాడు, పైగా నాన్న పిసినారి కూడా. ‘ఆడపిల్లలను చదివిస్తే దానికి రెట్టింపు చదివినోడిని ఎతకాలి. లక్షల్లో కట్నాలుంటాయ్‌. మన బతుకులకు అంత స్థోమతెక్కడ?’ అని అమ్మతో వాదించేవాడు.

‘చేతిలో వృత్తి ఉండాల్సి,  అక్షరం ముక్క ఉండాలి. అప్పుడే వాళ్ళు జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతారు’ అని అమ్మ వాదించేది.

వాదన చిలికి చిలికి గాలి వానై చివరికి వాన వెలిసినట్లు వెలిసేది. అమ్మే నెగ్గేది. చేసేదేమీ లేక నాన్న వాటు వేస్తూనే ఆ సమయానికి గుర్తు కొచ్చిన ఘంటసాల పాట అందుకొనేవాడు. లేకపోతే క్రీస్తు మీద ‘ఏసుప్రభేసు._ఏసుప్రభేసు…’ పాట పాడేవాడు.

పిల్లల భవిష్యత్తు గురించి నిరంతరం తపన పడింది అమ్మ. చదువులో తప్పాం(ఫ్రెయిల్‌) అనేది ఉండొద్దు, పాస్‌ మార్కులు తెచ్చుకోవాలి అని ఆమె ఆశ, అందుకే ఏ పరీక్షలైనా అమ్మతో పాటు తెల్లవారుజాము నాలుగు గంటలకు లేవాల్సిందే. కునికిపాట్లతో పుస్తకం పట్టాల్సిందే.

అమ్మ మమ్మల్ని లేపిన ప్రతిసారి నాన్న కోప్పడేవాడు. ఏం మాట్లాడేది కాదు అమ్మ. వచ్చీరాని ఇంగ్లిష్‌ మేం చదువుతుంటే ‘వాటీజ్ దిస్‌ వంకాయ్‌ పులుస్‌’ అని నాన్న పుస్తకం చదివినట్టు చదివేవాడు. అలా అనేటప్పటికి మాతో పాటు అమ్మ‌ కూడా నవ్వేసేది.
చిన్న చిన్న కోపతాపాలున్నప్పటికీ మమ్మల్ని శ్రద్ధగా చదివించటంతో అన్నాయ్‌ కి చెల్లాయ్‌ కి నాకు ఐదు, ఏడు, పదవ తరగతిల్లో ప్రైజులు వచ్చాయి. అటువంటి సమయాల్లో వెటకారంగా అమ్మను మెచ్చుకొనేవాడు నాన్న,

అమ్మ ఖచ్చితమైన క్రమశిక్షణతో  మమ్మల్ని పెంచింది. సినిమా-షికార్లు చాలా దూరం, పండుగల సమయంలో వేసుకొనే తమలపాకు నిషేధం. ఎందుకంటే ఆకు వక్క వేసుకొంటే నాలుక మందమయ్యి చదువు మంచిగా రాదనేది. ప్రతిరోజూ రాత్రి అన్నం తిన్న తర్వాత
కనీసం అరగంట వరకు లెఫ్ట్‌ రైట్‌ అని ఆ గదిలోంచి ఈ గదిలోకి కొట్టాల్సిందే. అరగంట వరకు తను మమ్మల్ని గమనిస్తూ ఉండేది. ‘ఎందుకమ్మా? ఇది’ అని అడిగినప్పుడు ‘అన్నం తిని ఎంటనే నిద్ర పోయే అలవాటేంటి?’ అనేది. అమ్మ చెప్పేది నిజమైనప్పటికి
మాకు గ్రహించే శక్తి లేక ‘అమ్మ మరీ చాదస్తం’ అని మనసులో తిట్టుకొనేవాళ్ళం, అమ్మకు పౌరాణిక, సాంఘిక‌ సినిమాలంటే ఇష్టం, అంటే ఒక సందేశం ఉండాలి. కుటుంబ బంధాలు కష్టం, ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకొనే ఆదుకొనే సందేశం ఉన్న సినిమాలు చూసేది. మాక్కూడా చూపించేది. అలా తనకు   గుండమ్మ కథ, మాయాబజార్‌, స్వ‌యంకృషి అంటే ఇష్టం. కుటుంబ బంధాలకు విలువివ్వాలి. స్వయంకృషితో ఎదగటం నేర్చుకోవాలి. కష్టమంటే తెలియాలి. లేదంటే గాలికొదిలేసిన పిల్లలవుతారు అని ఆదివారం అంద‌రం క‌లిసి తినే భోజనాల సమయంలో చెప్పేది.

వృత్తి;

చేనేత వృత్తిలో ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంతమందికి పని ఉంటుంది. ఐదు సంవత్సరాల పిల్ల నుంచి కాటికి కాలు చాచే వృద్ధుల వరకు ఏదో ఒక పని ఉంటుంది. అలా చేస్తేనే ఇంటిల్లీపాదికి కడుపు నిండా ఇన్ని మెతుకులు. లేదంటే ఆకలిచావులు.
ఆత్మహత్యలు.

చిన్నప్పుడే మేం కండ్లు చుట్టటం, చెక్కలు తోడటం నేర్చుకున్నాము. బడి మా ఇంటికి దగ్గరలో ఉండటంతో ఇంటర్వెల్‌ సమయంలో ఇంటికొచ్చి రెండు కండ్లు చుట్టి వెళ్ళేవాళ్ళం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సరిపడా కండ్లు చుట్టేవాళ్ళం. ఒక్కొక్కసారి లాంతరు
వెలుగులో రేపటి కోసం కావాల్సిన కండ్లును చుట్టేవాళ్ళం.

నేను ఆరవ తరగతి, చెల్లాయ్‌ నాలుగవ తరగతి చదువుతున్నాం, వేసవి సెలవుల్లో మగ్గం నేర్చుకున్నాం. నాన్న బల్ల చెక్కలను ఎలా తొక్కాలో, వాటు ఎలా వేయాలో చెప్పాడు. సెలవులు ముగిసేటప్పటికి నేత నేయటం వచ్చింది. నాతో పాటు చెల్లాయ్‌కూడా నేర్చుకొంది. మా కన్నా ముందే అన్నయ్య నేర్చుకున్నాడు. ఒకపక్క స్కూలుకి, మళ్ళి పక్క ఖాళీ సమయాల్లో మగ్గం నేసేవాళ్ళం. ముగ్గురం చదువుకుంటూనే మగ్గం నేయటంతో ఇరుగు పొరుగు వారు అమ్మను బాగా దెప్పి పొడిచేవారు. ‘బడికి పంపకుండా ఆ పిల్లలక్కూడా మగ్గం పట్టొచ్చు కదా!’ అని. వారలా అనటానికి పితృస్వామ్య సమాజం పెంచి పోషించిన భావజాలం కార‌ణం.  ‘ఆడపిల్ల చదివి ఎవర్ని ఉద్ధరించాలని? ఎప్పటికైనా పరాయి ఇంటిదే కదా!స‌ అనేవారు.  కానీ అమ్మ ఇవేమీ పట్టించుకొనేది కాదు.

ఏడవ తరగతి పూర్తయ్యి నాకు   హాస్టల్లో సీటు వచ్చింది. నాన్నకు చదివించాలని లేదు. మేనరికం ఇస్తే కళ్ళముందు పిల్ల కదలాడుతుందని ఆశ. నాన్న ఆలోచన అమ్మకు తెలుసు. అమ్మకు చదివించాలని ఉంది. దాని కోసం అమ్మ నాన్నతో
గొడవ పడింది. ఒకరోజు నాన్న ఇంట్లో లోని సమయంలో నాన్న ఆలోచనను నాకు చెప్పింది. ఒక ఫ్రెండ్‌ లా చెల్లాయ్ కి,  నాకు మేనరిక వివాహాల వల్ల వచ్చే అనర్థాలను చెప్పి వాటిని వ్యతిరేకించే చైతన్యం ఇచ్చింది.  ఒక్క నాన్న తరపు సంబంధాలనే కాకుండా అమ్మ తరపు నుంచి వచ్చిన సంబంధాలను కూడా మా అంతట మేమే తిర‌స్క‌రించే  ప్రోత్సాహం ఇచ్చింది.   సైన్సు మీద అమ్మకు ఎంత పట్టుందో తెలియదు గానీ అమ్మ మా కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇది కరెక్టేనని చెల్లాయ్‌, నేను అమ్మకే ఓటు వేశాము. 

ఆడపిల్లలను అంద‌రూ చిన్నప్పుడు  అలంకరిస్తారు. కానీ అమ్మ మమ్మల్ని ఎటువంటి అలంకారాలు లేకుండా పెంచింది. ‘ఏంటి మగరాయుడిలా?’ అని చుట్టుపక్కల వారి సూటి -పోటి మాటల వలన చెవి పోగులు కుట్టించింది.

మార్కుల  లిస్ట్‌ వచ్చిన ప్రతిసారి అమ్మాా నాన్న ఇద్దరూ చూసేవారు. తర్వాతనే సంతకం చేసేవారు. మార్కులు మంచిగా వచ్చినప్పుడు మెచ్చుకొనేవారు. తక్కువొచ్చినప్పుడు “ఇంకో మగ్గం పెడితే సరి’ అనేవాడు నాన్న. అందుకే ఎంత నిద్రొస్తున్నా అమ్మ లేపినపుడు
ఠక్కున లేచి పుస్తకాల్లో దూరేవాళ్ళం.

అమ్మకు మాత్రలపై మంచి పట్టు ఉంది. కారణం అమ్మవాళ్ల నాన్న ఆర్ ఎంపి  డాక్టర్.    అచ్చం పాత సినిమాల్లోని ఎస్‌. వి. రంగారావు లా ఉండేవాడు. ఊర్లో, చుట్టుపక్కల ఊర్లకు తను ఒక్కడే డాక్టర్‌ కావటంతో సైకిల్‌ మీద ప్రతి ఊరు, ప్రతి ఇల్లు తిరుగుతూ వైద్యం చేసేవాడు. సాయంకాలాల్లో ఇంటి దగ్గరే వైద్యం చేసేవాడు.   తాతయ్య పలకరింపులక్కూడా మనసంతా కరిగిపోయేది. అందుకే ఎంత
లేనివారు కూడా చేతిలో ఏదో ఒకటి పెట్టి పోయేవారు. తాతయ్య ఇచ్చే మాత్రలను చూసి అమ్మ ఏ అనారోగ్యానికి ఏ మాత్ర అనేది గుర్తు పెట్టుకొంది. మాకు దగ్శు పడిశం, విరోచనాలు, తలనొప్పి, జరం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించకుండానే మాత్రలను తినిపించేది.  బాగా సీరియస్‌ అయితే తప్ప లేదంటే డాక్టర్‌ దగ్గరికి పోయేవాళ్ళం కాదు.

తాతయ్యను ఊహా తెలిశాక ఒకటి రెండు సార్లు కలిశాము. ప్రేమగా దగ్గరికి తీసుకొనేవాడు. తాతయ్య చనిపోయిన రోజు అమ్మ పడ్డ దుఃఖం అంతా ఇంతా కాదు.  తాతయ్య శవాన్ని రథంలో కూర్చోబెట్టారు. స్మశానానికి తీసుకుపోయే ముందు చివరి చూపుగా ఒక్కొక్కరు తాతయ్యను చూసి వస్తున్నారు. అమ్మ రథం ముందు చలనం లేని తాతయ్య చేయి పట్టుకొని ఏడుస్తూ కూర్చొంది. అక్కాయ్‌ ని అన్నాయ్‌ ని చెల్లాయ్‌ ని
నన్ను పిలిచింది. ఏడుస్తూనే మా చేతుల్లో బుక్కాయ్‌ ని పెట్టి తాతయ్య మీద చల్లమన్నది, ఏడుస్తూనే అక్కాయ్‌ అన్నాయ్‌ చల్లారు. అందరూ ఏడుస్తుంటే చెల్లాయ్‌ కూడా ఏడుపందుకొంది. నాకేం అర్ధం కాలేదు. అటు ఇటు చూశాను, అందర్నీ చూసేటప్పటికీ
నాక్కూడా ఏడుపాగలేదు. చెల్లాయ్ ని, నన్ను దగ్గరికి తీసుకొని మా చేత బుక్కాయ్‌ ని తాతయ్య మీద చల్లించింది అమ్మ. ఆ రోజు అమ్మ పడిన దుఃఖం, తాతయ్య మొఖం ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. ఆ రోజు  ఎందుకలా అమ్మ ఏడ్చిందనేది అంతు
పట్టలేదు. కానీ ఈరోజు అమ్మా నాన్నల వార్త విన్న వెంటనే అప్పటి అమ్మ రూపం కళ్ళముందు కదలాడింది. ఆ రోజు బాధ పడుతున్న అమ్మను అక్కున చేర్చుకున్నారు ఆత్మీయులు. ఈరోజు నాకూ  అటువంటి ఓదార్పు ఉంటే ఆ విషాదం నుండి కొంతైనా
బయటపడే దాన్నేమో?! అని అనిపిస్తుంటుంది.

పిల్లలం పెరిగి పెద్దవారవ్వటం, ఖర్చులు పెరగటంతో ఇంట్లోకి పాలిష్టర్‌ మగ్గం వచ్చింది. దాని బాధ్యత అక్కాయ్‌దే.  పాలిస్టర్‌ మగ్గం పలకను లాగి గట్టిగా కొట్టాలి. బల్లచెక్కలను గట్టిగా తొక్కాలి. దమ్ము బాగా వచ్చేది.  బాగా వేడి. ఎక్కడ చూసినా తెల్లటి తుక్కు
ఉండేది. మొఖం మీద ముక్కు దగ్గర తెల్లటి దూది అతుక్కుపోయి ఉండేది. బరువుగా కొట్టే దెబ్బకు సాయంత్రానికి అక్క పని అయిపోయేది. రోజు కాళ్ళకు కొబ్బరినూనె రాసుకొని పడుకొనేది. కొద్ది రోజులకు అక్కాయ్‌ పెళ్ళవ్వటంతో  పాలీస్టర్‌ మగ్గం తీసేశాము. 

అక్కాయ్‌ పెళ్ళితో అయిన ఖర్చులు, మా  చదువులతో కుటుంబం గడవడం దిన దిన గండంగా మారింది. నాన్న పట్టుదలతో సాయంత్రానికి ఆరు గజాల చీర కోసేవాడు. అమ్మ వంట పని పూర్తి చేసి నాన్నకు బదులు పోయేది. అయినా ఆదాయం సరిపోలేదు.
అలాగయ్యి ‘అమ్మ మగ్గం” ఇంట్లోకి వచ్చేసింది. నాన్న నేసే మగ్గం సొసైటీ (ఆప్కో) వారిదైతే అమ్మ నేసే మగ్గం మాష్టర్‌ వీవర్ది.  మాష్టర్‌ వీవర్‌ది వేయటానిక్కూడా ఒక కారణం ఉంది. మాష్టర్‌ వీవర్‌ దగ్గరైతే కొంత పెట్టుబడి దొరుకుతుంది. దాంతో కొద్దిగా
అప్పులు తీర్చవచ్చు అని. సాగకు ఇంత అని మాష్టర్‌ వీవర్‌ ఇచ్చిన పెట్టుబడిలో కట్‌ చేసుకొంటాడు. అలా కొన్ని సాగలకు వాడిచ్చిందంతా చెల్లించేయొచ్చు. సొసైటీలో అలా ఇవ్వరు. వంటపని పూర్తి చేసుకొని అమ్మ సాయంత్రానికి ఐదున్నర గజాల చీర కోసేది.
ఒక్కోసారి రెండు రోజులు పట్టేది. రెండు మగ్గాలకు సరిపడా కండ్లు చెల్లాయ్, నేను చుట్టేవాళ్ళం, చుట్టాలొచ్చినా, పక్కాలొచ్చినా మగాన్ని ఆపటం ఉండదు. వచ్చిన బంధువులను సాదరంగా ఆహ్వానించటం ఉంటుంది. కూర్చోటానికి కుర్చీ గానీ పీట గానీ వేసి వెంటనే
మగ్గంలోకి దిగుతారు. వాటు వేస్తూనే మాట్లాడుతారు. ఎప్పుడూ చూడని వారికి ఇది వింతగా ఉంటుంది.

ఒకసారి మా ఉద్య‌మ  బాధ్యుడు ఇదంతా చూసి ‘ఏంటి? ఎవరొచ్చినా మగ్గాన్ని ఆపరా? నాకు కూర్చోమని కుర్చీ ఏశారు. ఎంటనే మగ్గంలోకెళ్ళారు’ అని అడిగాడు.

దీని గురించి ‘ఎందుకలా?’ అని నాన్నను అడిగాను. ‘అలా వాటు వేస్తూ మాట్లాడితే రెండు పలకలవుతుంది కదమ్మా!’ అని జవాబిచ్చాడు. అంటే మాట్లాడుతూ నేయటం ద్వారా కొద్దిగానన్నా అవుతుంది అని. నాన్న జవాబు నాకు సంతృప్తి నివ్వలేదు.

అప్పటికీ నాక్కూడా కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. హాస్పిటల్‌ వెళ్లే రక్తహీనత అని చెప్పారు. రక్తం పెరగడానికి మాత్రలు తింటూనే నేత నేస్తున్నాను. ఇరుగు పొరుగు అంతా తాత ముత్తాతల పిల్లలే.  పెద్దనాన్న బాబాయిల కొడుకులు-కూతుళ్ళు, మేనత్త- మేనమామలు వారి పిల్లలు అందరూ నేత పనే, అందరి రూపాలు కళ్ళ ముందు కనపడ్డాయి.  ఒకరికి కిడ్నీల సమన్య,  మరొకరికి దగ్గు, మరింకొకరికి కిళ్ళ నొప్పులు, కంటి చూవు మందగించటం. నాకు కాళ్ళ నొప్పులు. వీటన్నింటితో మా బతుకులు ఇంతేనా? ఈ వృత్తి కాకుండా వేరే పని లేదా? ఉద్యోగస్తుడికి ఆదివారమన్నా సెలవ్‌ ఉంటుందే! మాకు అదీ లేదుగా? అని పరిపరి విధాలుగా ఆలోచించి ఉండబట్టలేక నాన్నను వాటు వేస్తూనే అడిగాను, నాన్న నా ఎదురు మగ్గంలో ఉన్నాడు. నేను అడిగినప్పుడు కమ్మేస్తున్నాడు. ‘మన తలరాత’ అని ఒక ముక్కలో చెప్పాడు. మళ్ళీ అడిగితే కమ్మయ్యాక చెప్తానన్నాడు, చెప్పాడు.

ఒకరోజు శంకరుడు అన్ని కులాల వారిని మాట్లాడటానికి పిలిచాడు. అందరూ జమయ్యారు. కానీ మన కులం (దేవాంగులుు) వాళ్లు వెళ్ల‌లేదు.  మళ్ళీ కబురు పంపాడు శంకరుడు. “అల్లు సాచాం, వానొచ్చేటట్టుంది. నాని పోతుంది. అల్లు చుట్టి వత్తాం అన్నారు.
దానికి శంకరుడు ‘మీ బతుకులు ఇంతే’ అని శపించాడు. అందుకే మన బతుకులిలా అయ్యాయి. అందుకే అంటారు గదా! శివుని ఆజ్ఞ లెనిదే చీమైనా కుట్టదని ” అన్నాడు.

శంకరుడి శాపం ఏమోగానీ నేత నేయకపోతే కుటుంబం మొత్తం ఖాళీ కడుపులతో గడపాల్సిందే. మగ్గం ఆపితే సాయంత్రానికి కోయాల్సిన చీర అవదు. అవకపోతే డబ్బులు రావు. అవి రాకపోతే కుటుంబం గడవదు. ఒక రకమైన ఆర్థిక పరిస్థితిలోంచి వాటు ఆపని
పరిస్థితి వచ్చిందనిపిస్తుంది నాకు.

నాన్న అన్నదమ్ముల్లో ఇద్దరు తప్ప మిగతా నలుగురు, వారి పిల్లలు షెడ్డుల్లో ఉండి మగ్గం నేసేవారు. షెడ్డు అంటే మాష్టర్‌ వీవర్‌ స్తోమతను బట్టి ముప్ఫై, నలభై మగ్గాలుంటాయి. మగ్గం దానికి సంబంధించిన సామాను (ఉత్పత్తి సాధనాలు ముడి సరుకు – పడుగు-పేక మాష్టర్‌ వీవరే ఇస్తాడు. ఏ రోజు కోసిన చీర ఆ రోజు మాష్టర్‌ వీవర్‌ కి ఇచ్చేయాలి. షెడ్డుకు అందుబాటులో అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో జీవనం గడుపుతారు కార్మికులు. మొత్తం సాగకు రావాల్సిన డబ్బుల్లో కండ్లు, చెక్కలు అచ్చు, అల్లుకు తీసి అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత అని కార్మికులకు ఇస్తాడు మాష్టర్‌ వీవర్‌. ఏదన్నా అత్యవసరమైతే కూడా మాష్టర్‌ వీవర్‌ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. కష్టం
కార్మికులది. ఫలితం మాష్టర్‌ వీవర్స్‌ ది. మాష్టర్‌ వీవర్స్‌ దోపిడీకి కార్మికులు ఎదురు తిరగరు. కారణం చేతిలో ఉత్పత్తి సాధనాలు ఉండవు. వాడు ఎంత అరిచిన్మాగీ పెట్టినా, సరిగా నేయలేదని వంక పెట్టి డబ్బుల్లో కోత విధించినా చాలీచాలని కూలీతో బతుకును
భారంగా గడిపేస్తారు. మరో పక్క భయపెట్టి, ప్రలోభపెట్టి మాష్టర్‌ వీవర్స్‌ చేసే లైంగిక వేధింపులను మౌనంగా భరిస్తుంటారు మహిళా కార్మికులు.  క్షణం తీరిక లేకుండా రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడినా ఫలితం రాకపోవటం, ఎండిన డొ్‌క్కలను గంజినీళ్ళతో
సరిపెట్టటం ఫలితంగా ఆకలిచావులు.  వీటన్నింటితో కార్మికులు రాత్రికి రాత్రే పెట్టే బేడ సర్దుకొని పారిపోతారు వ‌ల‌స‌.  
మొదట్నుంచి అమ్మా నాన్నలు షెడ్డు పనిని వ్యతిరేకించారు. ఇంటి పట్టునే మగ్గం పట్టి పని చేశారు.  ఊర్లో ఉన్న మూడు సొసైటీల్లో నాన్న నేసేదే  పెద్దది. మూడవ వార్డులో ఇది ఉంది. మాది ఫస్టు వార్డు. చిన్నప్పటి నుంచే చెల్లాయ్‌ నేను నాన్నతో పాటు సొసైటీకి వెళ్ళేవాళ్ళం. సొసైటిలో మార్కు, ఎంగెల్స్‌, లెనిన్‌,  భగత్‌ సింగ్‌, గాంధీ నెహ్రూ,  ఇందిరాగాంధీ ఫోటోలు ఉండేవి. గాంధీ నెహ్రూ, ఇందిరాగాంధీ తప్ప మిగిలిన వారు తెలియక పోవటంతో ఎవరో ఈ గడ్డాలోళ్ళు? అని అనుకొనేవారం,. సంవత్సరానికి ఒకసారి సొసైటిలో బోనన్‌ లు ఇచ్చేవారు. ఆ రోజు మాత్రం నాన్న తప్పకుండా స్నానం చేసి తెల్లలుంగీ, షర్టు తొడుక్కొని వెళ్ళేవాడు. ఆ రోజు సొసైటీలో బోనస్‌ తో పాటు బూందీ లడ్డు ప్యాకెట్‌ ఇచ్చేవారు. నాన్న తినకుండా వాటిని ఇంటికి తెచ్చేవాడు. బోనన్‌ ఎంత ఇస్తారో మాకు తెలియదు గానీ నాన్న తెచ్చే బూందీ
పొట్లం కోసం చెల్లాయ్‌,  నేను ఎదురు చూసేవాళ్ళం.

అమ్మా నాన్నలు మా నలుగురికి అన్ని పనులు నేర్పించారు. మగ్గాన్నేయటం, అచ్చు లాగటం, అచ్చును పైన గుదుళ్ళకు – కింద బల్ల చెక్కలకు తగిలించటం, మోకు లాగటం, రేషం – జరీ దించటం, కమ్మేయటం, బుఠా తీయటం, ఫ్లవర్‌ వేయటం, సెరుగు – కట్టు
సెరుగు నేయటం, పోగు అతకటం, ఈనే గుచ్చటం, కంట్లం చేయటం, చీర కోయటం, బద్దెత్తటం, అచ్చు అతకటం, సాల్పు వేయటం, ఊడితెలు దాయకర్రలు వేయటం, సువ్వలు పోనిచ్చటం, పేపర్లు వేయటం… అన్ని పనులు నేర్పించారు. అల్లు సాచినప్పుడు
ఇరుసు తిప్పేది మాత్రం నాన్ననే.  తిప్పటంలో నాన్నకే ఆ పట్టు ఉంది. మొత్తం అల్లు చుట్టేంత వరకు అమ్మ అచ్చు పట్టుకొనేది. ఇరుసు స్పీడును బట్టి అడుగు వేయాలి. అలా మొత్తం అల్లు అయ్యేంత వరకు లాగి పట్టుకోవాలి. అది మొత్తం అయ్యేటప్పటికీ గంట పడుతుంది. అంతసేపు అమ్మ కాళ్ళు గుంజుతున్నా గట్టిగా పట్టుకొనేది. సెలవులపై అన్నయ్య ఇంటికొచ్చినప్పుడు అన్నయ్య పట్టుకొనేవాడు,

వృత్తి పట్ట అమ్మా నాన్నలకు చాలా గౌరవం ఉండేది. ఎప్పుడూ వారు కానీ మమ్మల్ని గానీ వృత్తిని చిన్నచూపు చూసేవారు కాదు చూడనిచ్చేవారు కాదు. ‘మనకు అన్నం పెట్టేది అదే కదా!’ అని చెప్పేవారు.

ఒకసారి మా ఇంటిపక్క ఇంట్లో టైలరింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ పెట్టారు. ట్రైనింగ్‌ టీచర్‌ చాలా నెమ్మది. మాటల సందర్భంలో ‘ఒంటిని కప్పే బట్టలను తయారు చేయటం మామూలు విషయం కాదు. మీ వృత్తి చాలా మంచిది. వంద శాతం నూలు దారం కావటంతో ఒంటికి
చల్లదనం ఉంటుంద’ని అమ్మతో అన్నది.

ఆవిడ అన్నది అక్షరాలా నిజం. పవర్‌ లూమ్‌ రాకముందు నూరు నంబరు జీవితాలకు ఎంతో విలువ ఉండేది. అవి వచ్చాక చేనేత విలువలు పడిపోయాయి. జిగేల్స్‌ జిగేల్‌ మనే రంగులు కళ్ళు మిరుమిట్లు గొలిపే డిజైన్లతో వచ్చి ఎంతో నైపుణ్యం ఉన్న చేనేతను దెబ్బతీసింది. ఆరు గజాల చీరను ఎంతో ఒద్దికగా అగ్గిపెట్టెలో పట్టేంత నేసిన నైపుణ్యం చేనేత కార్మికుడిది. రకరకాల పిట్టలు, పువ్వులు, జంతువులలు,  ప్రకృతి… ఇలా ఎన్నో రకాల డిజైన్స్‌ ను చేతితోనే తీర్చిదిద్దగల నైవుణ్యం చేనేత కార్మికులది. మనసును
ముప్పిరి గొలిపే బాతిక్‌ రంగులు కూడా తయారయ్యేది వీళ్ళ చేతుల్లోనే.

బాతిక్‌ డిజైన్‌ కోసం చాలా కష్టపడాలి. ఈ డిజైన్‌ రావటానికి తెల్ల చెక్కలకు రంగు అవసరం లేని చోట దారంతో గట్టిగా ముళ్ళు వేస్తారు. భగభగ మండుతున్న నిప్పు దగ్గర సలసల కాగే నీళ్ళల్లో ఏ రంగు కావాలంటే ఆ రంగు కలుపుతారు. క్షణమాలస్యం చేయకుండా చేతులకు గ్లౌవ్స్‌ వేసుకొన్న కార్మికులు దారం కట్టిన చెక్కలను ముంచి పటాపట్‌ పిండేస్తారు. రంగు నిండుగా రావాలంటే రెండు – మూడు సార్లు ముంచుతారు. అవసరం లేకపోతే ఒకసారే ముంచుతారు. పిండేసిన వెంటనే ముళ్ళు తీసేసి ఎండలో ఆరేస్తారు. అప్పుడు బాతిక్‌ రంగుల అందం వస్తుంది చెక్కకు. ఈ క్రమం చేసేదాన్ని ‘డైయింగ్‌’ అంటారు. మా బాబాయి డైయింగ్‌ లో పని చేసేవాడు. అందుకని చేతులు
కాళ్ళు రకరకాల రంగుల్లో ఉండేవి. నిత్యం మండుతున్న నిప్పు దగ్గర ఉండటం వలన బాబాయికి అనారోగ్యం తోడై ఆ పనిని మానేశాడు. అలా ఎంతో కష్టానికి ఓర్చి ఎన్నో రకాల డిజైన్స్‌ ను సృష్టించి బంగారు మిద్దెల్లో డాబుగా అలంకరించబడుతున్న చేనేత బక్క
పేగులకు కట్టే బట్టే కరువైంది.

ప్రభుత్వాలు ఒక వైపు చేనేతను ఆదుకుంటామంటూనే మరో వైపు పవర్‌ లూమ్‌ పై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయి. ఈ రంగుల ప్రచారాలకు ప్రభావితమైన వారు పవర్‌ లూమ్‌ పై ఆధారపడ్డారు. కొద్దిమంది దిగజారుతున్న విలువల కారణంగా పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు.

ఎన్ని విపత్కర పరిస్థితులొచ్చినప్పటికీ అమ్మా నాన్న నమ్ముకున్న చేనేతను వదిలి పెట్టలేదు. మాక్కూడా అటువంటి నమ్మకాన్ని కలిగించారు. అలా వారి పెంపకం వల్ల ఏ కాలంలో కూడా విసుగు – విరామం లేకుండా మగ్గం నేసేవాళ్ళం,

మగ్గానికి ఒక్కో సీజన్‌ లో ఒక్కో రకమైన సమస్య ఉండేది. ఎండకాలంలో గాల్పులకు పడుగు పెన్‌ తిరిగి పోయేది. నేస్తున్న కొద్దీ నూలు వదులుగా అయ్యి వాటు సరిగా పడక పోయేది. నాడీ ఈ సొరుగులో నుండి ఆ సొరుగులోకి తిన్నగా వెళ్ళకుండా అచ్చు పై
నుండి గెంతు వేసి బయట పడేది. అలా గెంతు వేసినప్పుడు నాడీ మొన పోయేది. ఏం కాదులో అని నేస్తే పోగులు తెగిపోయేవి. వాటిని అతుకు పెట్టటానికి టైం పట్టేది. నాడీ మొన పోయినప్పుడు నాన్న మగ్గం లోంచి లేచి ఆకురాయితో సానబెట్టి ఇచ్చేవాడు. కొన్ని
పనులు నాన్నే చేసేవాడు. బహుశా పురుషుల పనేమో అనిపించేది నాకు. ఎందుకంటే నాన్నే కాదు, పెద్దనాన్న బాబాయి ఇళ్ళల్లో కూడా అంతే. ఎండకాలంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు కోత ఉండేది, చీకట్లో మగ్గానికి లాంతరు కట్టి దాని వెలుతురులో నేసేవాళ్ళం. వర్షాకాలంలో మగ్గమంతా చెమ్మొచ్చి బరువుగా వాటు పడేది. భారీ వర్షాల సమయంలో మగ్గం గొయ్యిలోకి నీళ్ళు వచ్చేవి. ఎంతంటే ఒక్కొక్కసారి మోకాళ్ళ వరకు వచ్చేవి. వాటిని తోడి మగ్గం నేసేవాళ్ళం. శీతాకాలంలో పొద్దున్నే ఉండే మంచు వలన మగ్గం దిమ్ముగా ఉండేది. మంచు కొట్టకుండా షెడ్డు చుట్టూరా సిమెంట్‌ బస్తాల సంచులతో కుట్టిన పరదాను కట్టేవాళ్ళం. అలా ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ
అమ్మా నాన్నలు నమ్ముకున్న వృత్తికి అంకితమై పని చేశారు.

నాన్న శివ భక్తుడు. జంజం వేసుకుంటాడు. మా కులపోళ్ళందరూ ఎక్కువ శివున్ని కొలుస్తారు. పెళ్ళయిన ప్రతి పురుషుడు జంజం వేసుకుంటాడు. నాన్న నిష్టగా పూజలు – పునస్కారాలు చేయడు.  రోజూ స్నానం చేసి నుదుటి మీద చేతులకు పొట్టకు
విబూది నామాలు పెట్టుకొని కాసేపు దేవుడి పటం ముందు అలా కూర్చునేవాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలకు మాత్రం తప్పక పూజించడం అలవాటు. వినాయకచవితి, దసరా, అట్ల‌త‌ద్ది, దీపావళి, సంక్రాంతి శివరాత్రి ఉగాది పండుగలు
ముఖ్యమైనవి. నెలకు ఒకసారి వచ్చే పౌర్ణమి రోజు కూడా నేత పని ఆపేస్తారు. దీన్దేంముందిలే  అనుకొనే కుటుంబాలు నేత నేస్తారు. మా ఇంట్లో పౌర్ణమి అంతగా చేసేవారం కాదు. మధ్యాహ్నం వరకు నేసి ఆపై మగ్గాన్ని ఆపేవాళ్ళం,

శివుని తర్వాత అంతే నైవేద్యం అందుకొనేది వినాయకుడు. ఇతన్నే ‘బొజ్జ గణపతి’ అంటారు. చవితి పండుగ నెల ముందు నుంచే నిక్కచ్చిగా మగ్గం నేస్తారు. దాన్నే ‘నిక్కచ్చి పట్టారా?” అని వాడుకలో అంటారు. మామూలు సమయాల్లో నెలకు నాలుగు
సాగలు అంటే వారానికి ఒక సాగ చొప్పున నేస్తారు. (సాగ అంటే ఏడు గజాల చీరలయితే ఆరు చీరలు చొప్పున నలబై రెండు గజాలు అని. ఇది సొసైటీది. అదే ఐదున్నర గజాల చీరలైతే పది చీరలు చొప్పున మొత్తం యాభై ఆరు గజాలు అని, ఇది మాష్టర్‌ వీవర్‌ ది.)
నెల పట్టినప్పుడు సగటున ఆరు సాగలన్నా దిగాలి. ఇంకా స్పేడుగా నేసేవారు ఏడు ఎనిమిది సాగలు నేస్తారు. దాని కోసం పగలు, రాత్రి తీరిక లోకుండా నేస్తారు. కారణం రెండు రోజుల పండుగ కావటంతో, పండుగ రోజు వినాయకుడిని పూజిస్తారు. రెండవ రోజు
కరకు. అంటే మాంసం తింటారు. మటన్‌ గానీ చికెన్‌ గానీ. కొత్త అల్లుళ్ళు కూతుర్లతో పండుగ సందడిగా ఉంటుంది.

పండుగ ముందు రోజు మగ్గం గొయ్యిని అలికి ముగ్గు పెడతారు. పండుగ రోజు మగ్గం సామానంతా కడగాలి. దోనెలు, బల్లచెక్కలు,  పలక నాడులు, సువ్వలు,  లేకలు, దాయకర్ర ఊడితెల్తు రాట్నం,  ఊసలు వీటితో పాటు పీటలు మంచాలు కూడా. అన్నింటికి విబూది నామాలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి. బిప్పిండితో కుడుములు వండి వినాయకుడిని పూజించి హారతిని మగ్గం, రాట్నం కడిగిన అన్నింటికి
పట్టి కుడుములను మగ్గం గొయ్యిలో వేయాలి. సాయంత్రం గొయ్యిలోని కుడుములను తీసేయ్యాలి. అలా దీనికొక ప్రత్యేకత.

శివరాత్రికి కూడా మరో ప్రత్యేకత ఉంది. ఆ రోజు శివుడిని చిలగడ దుంపలతో పూజించాలి. ఎంత గిరాకి ఉన్నా చిలగడ దుంపలు వండని ఇల్లు ఆ రోజు ఉండదు. దుంపలతో శివున్ని పూజించి హారతిని మగ్గం, రాట్నం దాని తాలూకు సామానుకంతా పూజించటం ఉంటుంది. సంక్రాంతి మరో  రకంగా  గొబ్బిళ్ళతో పూజ. ఇది మూడు రోజుల పండుగ. వినాయక చవితి కన్నా ఎక్కువ నిక్కచ్చి ఈ పండుగకు ఉంటుంది. ఈ పండుగకు మాత్రం తప్పనిసరిగా అందరికీ కొత్త బట్టలు కొనే అలవాటుంది. రెండు మూడు పిండివంటలు – అరిసెలు జంతికలు ప్రతి ఇంట్లో తప్పని సరిగా ఉంటాయి. చుట్టాలతో ప్రతి ఇల్లు కళకళ లాడుతుంది. దూరంగా జరిగే కోడిపందాలు ఈ పండుగకు మరో ఆకర్షణగా
నిలుస్తాయి. ఏదో ఒక బంగారం తొడుగు లేకుండా అత్తవారింటి గడప దాటడు కొత్తల్లుడు.

రాను రాను ఆర్థిక సంబంధాలు – మార్కెట్‌ సంబంధాలు ప్రధానమై మనుషుల మధ్య ఉండాల్సిన కనీసమైన విలువలు అడుగంటి పోతున్నాయి. సగం గొయ్యి జీవితాలకు ప్రశాంతతే కరువయ్యింది. ప్రతిక్షణం ఆరాటం – ఆత్రం – పోటీ. అంతా రేపటి కోసం, తమ
పిల్లలు మంచిగా బతకాలని ప్రతి వాటులో మననం చేసుకుంటారు. దాని కోసం బల్లచెక్కలను లయబద్ధంగా తొక్కుతారు. రేయింబవళ్ళు కష్ట పడతారు. చద్దెన్నంలో నీళ్ళు పోసుకొని ఉప్పులో పచ్చి మిరపకాయ నంచుకొని పంచభక్ష పరమాన్నంలా ఆస్వాదిస్తారు. తట్టుకోలేని మోకాళ్ళ నొప్పులకు రకరకాల మాత్రలు తింటూ బల్ల చెక్కలను తొక్కే బతుకులు. ఎన్ని కష్టాలు పడ్డా బయటికి అర్ధం కానీ కల్నేత బతుకులు,

కల్నోత‌..:

అంటే పడుగు ఒక రంగు, పేక ఒక రంగు ఉంటుంది. పడుగు అంటే నిలువుగా ఉండే దారం. పేక అంటే అడ్డంగా నేసే దారం, ఇవి రెండు కలిపి నేసేదాన్ని ‘కల్నోత’ అంటారు. కల్నోత మీద సహజంగానే అందరికీ చిన్నచూపు ఉంటుంది. అలా నేసిన బట్టలను
పేదవాళ్ళే కట్టుకుంటారు. కాబట్టి. ఒకే. రంగు పడుగు – పేక కొనాలంటే ఎక్కువ ఖర్చవుతుంది. వేరు వేరు రంగులైతే తక్కువ ఖర్చవుతుంది.

చదువుకొనేటప్పుడు ఫ్రెండ్స్‌ ఒకరినొకరం ‘పెద్దయ్యాక ఏమవుతావ్‌?’అని ప్రశ్నించుకొన్నాం. ఎవరికి వారు తమ ఆశలకనుగుణంగా చెప్పారు. గుంటు గంగ ప్రసాద్‌ అనే అబ్బాయి ‘సగం గొయ్యి’ అని చెప్పాడు. ఫక్కున అందరం నవ్వేశాం. ఎందుకు ఆ అబ్బాయన్నాడంటే..ఆ అబ్బాయిని తల్లిదండ్రులు ఆరవ తరగతి లోనే బడి మాన్పించారు. అబ్బాయి చదువులో మెరిట్‌ కావటంతో మా మాష్టారు వడ్డే హరి నారాయణ గారు తన సొంత ఖర్చుతో ఏడవ తరగతి చదివించాడు. ఎనిమిదవ తరగతికి పక్కూరు పోవాలి. అది
సాధ్యం కాని పని. అందుకే తనకు చదువుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పటికీ ఇంటి ఆర్థిక పరిస్థితి వలన సాధ్యం కాదని ‘సగం గొయ్యి’ అన్నాడు,

సగం గొయ్యి…

మా కుల ఆచారం ప్రకారం చనిపోయిన మనిషిని కూర్చో బెడతారు. స్మశానానికి పట్టుకు పోయేటప్పుడు తెల్లటి బట్టతో రథం కట్టి అందులో కూర్చో బెడతారు. ఊరేగింపుగా స్మశానానికి మోసుకెళతారు. స్మశానంలో పెద్ద గొయ్యి తవ్వి అందులో కూర్చోబెట్టి మట్టితో
పూడ్చేస్తారు,. తగలబెట్టే ఆచార సాంప్రదాయం కులంలో లేదు. చేనేత కార్మికుల నడుము వరకు భాగం మగ్గం గొయ్యిలో ఉంటుంది. అందుకే చేనేతను ‘సగం గొయ్యి’ అని సింపుల్‌ గా అంటారు. నిండా గొయ్యి అంటే చనిపోయిన తర్వాత పూడ్చేది,

కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా ఇంకొకరి దగ్గర చేయి చాచలేదు అమ్మా నాన్న. ముగ్గురి  నోటు పుస్తకాలకు బైండింగ్‌ షాపు దగ్గర అతి తక్కువ ధరకు దొరికే ప్రింట్‌ లెస్‌ పేపర్లను తెచ్చి అన్నయ్యే కుట్టి ఇచ్చేవాడు. ఒక్కొసారి తనకిచ్చిన బస్సు ఛార్జీ నుంచి అర్ధ రూపాయ్యి పావలా మిగిల్చి వాటితో ముగ్గురికి పేపర్లు కొని బైండింగ్‌ చేయించు కొచ్చేవాడు,. నేసిన చీరల మడత మంచిగా రావటానికి సొసైటీ వారు పేపర్లు ఇచ్చేవారు, నాన్నే సాగ పట్టుకొని సొసైటీకి వెళతాడు కాబట్టి ఇచ్చిన పేపర్లలో ప్రింట్‌ లెస్‌ పేపర్లను తీసి మాకు ఇచ్చేవాడు, మా బట్టలు కూడా ఎక్కువ ఇంట్లో నేసినవే వేసుకొనేవాళ్ళం. ఒక్క సంక్రాంతికి తప్ప మిగతా అన్ని పండుగలకు ఇంట్లో నేసిన బట్టలే.

మేం ఉండేది ఉమ్మడింట్లో కావటం వలన రెండు రోజుల కొకసారి పెద్దనాన్న ఏదో ఒక నెపంతో నాన్న మీద కొచ్చేవాడు. అతి చిన్న చిన్న విషయాలకు. అది కూడా మాంసం కొట్టే మొద్దు కత్తిని పట్టుకొని మీద మీదకు వచ్చేవాడు. మాట మాట పెరిగి ఇద్దరూ కొట్టుకునేవారు కూడా.  నాన్నకేదన్నా అవుతుందని మాకు భయం వేసేది. నానమ్మ ఇద్దరికీ చెప్పలేక ఏడ్చేది. గొడవ జరిగిన రోజు అమ్మా నాన్న అన్నం తినేవాళ్ళు కాదు. మమ్ముల్ని మాత్రం స్కూలుకి పోక పోయినా, అన్నం తినక పోయినా అమ్మ ఊరుకొనేది కాదు. 

నిరంతరం గొడవల వలన పైస-పైస కూడబెట్టిన డబ్బుతో ఇల్లు కొన్నారు. తక్కువ మొత్తంలో (వేలల్లోనే) బ్యాంకులో వేశారు. అమ్మ మాత్రం చిన్న చిన్న పాగాళ్ళతో నేసిన చీరలను కట్టుకొనేది. లేకపోతే జనతా చీరలని పేరు ఉన్న అరవయ్యవ నంబరు చీరలను కొని కట్టుకొనేది. అవి అరవై డబ్భై రూపాయలకు వచ్చేవి. కానీ దుప్పటిలా మొద్దుగా ఉండేవి. పాలిష్టర్‌ చీరలు కట్టుకోవాలని గానీ లేటెస్ట్‌ డిజైన్‌ ఉన్న చీరలను కట్టుకోవాలని గానీ ఎప్పుడూ ఆశ పడలేదు. పండగలప్పుడు మా కందరికీ కొత్త బట్టలుండేవి కానీ అమ్మా నాన్న లిద్దరికి ఉండేవి కావు. పిల్లలకి మంచిగా ఉంటే చాలు అని తృప్తి పడేవాళ్ళు,.

రాను రాను చేనేతకు గిరాకీ తగ్గి పోయింది. నూరు నంబరు జీవితాలు అతలాకుతలమయ్యాయి. మాష్టర్‌ వీవర్స్‌ కుంభకోణాలు చేసి దివాళా తీశారు. షెడ్డు కార్మికులు తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు వలస పోయారు. కొద్దిమంది ఉన్న ఊరిలో రకరకాల
కూలీలుగా స్ధిర పడ్డారు. కొద్దిమందికి చేసిన అప్పులు తీరక పోవటంతో ఆకలిచావులు – ఆత్మహత్యలకు దారి తీశాయి.

అటువంటి సమయంలో కూడా అమ్మా నాన్న గుండె నిబ్బరంతో నమ్ముకున్న వృత్తికే అంకితమయ్యారు. నాన్న తనకు చేతనైంత నేసేవాడు. అమ్మ పై పనంతా చేసేది. ముగ్గు చేసి అమ్మటం, కోడి గుడ్లు అమ్మటం, గులాబీ పూలు అమ్మటం లాంటి పదో-పరకో వచ్చే పనులు చేసేది. ‘ఇవెందుకమ్మా?’ అని కలిసినప్పుడు అడిగితే ‘మగ్గం నేయలేక పోతున్నాను. నాన్న నేసేది ఎక్కడ సరిపోతుంది? కనీసం కూరకైనా అయితదిగా! ఇక మా జీవితాలింతే గదమ్మా! ఎవరున్నారు మాకు?’ అని బాధగా అనేది.

ఇద్దరికీ వయసు పెరుగుతోంది. దానికి తోడు అనారోగ్యం. అన్నయ్య ఉద్యోగరీత్యా టౌన్‌ లో తోడుగా ఉన్న చెల్లి అత్తారింటికి. చేతికింద ఎవరు లేక ఇద్దరూ మానసికంగా ఇదయ్యారు. ముఖ్యంగా అమ్మ మానసికంగా బాగా ఘర్షణ పడింది. చివరికి రెండు కాళ్ళకు పక్షవాతం వచ్చింది. కాళ్ళు మడత పెట్టలేదు. కింద కూర్చోలేదు. ఏ పనైనా నిలబడి చేయాల్సిందే. లేకపోతే కుర్చీలో కూర్చుని చేయాల్సిందే. రోజు మాత్రలు తింటూ ఇంటి పనంతా చేసేది. నిదానంగా షుగర్‌ కూడా తనని ఆవహించింది. పరిస్థితి మరీ నరకంలా తయారయ్యింది. వంట చేసేటప్పుడు కుర్చీని జరుపుకుంటూ చేసేది. బట్టలుతికేటప్పుడు కుర్చీలో కూర్చొని ఉతికేది. ఎడం కాలైతై అస్సలు వంగేది కాదు.
నడిచేటప్పుడు అది స్పష్టంగా కనపడేది. గదులు కడగాలన్నప్పుడు నాన్న పైపుతో నీళ్ళు కొట్టేసి గదులు కడగటం పూర్తి చేసేవాడు.

ఇవన్నీ విని చూసి ‘మీకేంటి కాళ్ళు కింద పెట్టకుండానే బతికేస్తున్నారు  మీది రాజు బతుకు’ అని అన్నప్పుడు అమ్మ ఫక్కుమని నవ్వేసేది. నాన్న కూడా నాకే ఓటు వేసేవాడు. మరింతలోనే ‘మా బాధలేవో మేం పడతాంలేమ్మా! నువ్వయితే. జాగ్రత్తగా ఉండమ్మా!’ అంటూ ఇద్దరూ ధైర్యం చెప్పేవారు. వాళ్ళలా అన్నప్పుడు నాకు బాగా బాధనిపించేది. మరొక్క రోజు  వారితో గడపాలన్నా కోరిక కలిగేది. ఉన్నా ఏం చేయగలను? అని నాకు నేనే సమాధాన పర్చుకొని ఆటో ఎక్కేదాన్ని.  వీధి మలుపులో ఆటో ఎక్కేంత వరకు అమ్మ నాతో వచ్చేది.
ఆటో బయలుదేరిన తర్వాత ‘జాగ్రత్తే!’ అని కళ్ళు ఒత్తుకుంటూ తిరుగు ముఖం పట్టేది.

తమ పిల్లలు నిప్పులు అనిపించుకోవాలని ఆరాటపడిప అమ్మా నాన్నలు అన్నయ్య ప్రోద్భలంతో నేను తీసుకున్న నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించినా దాని లోతుపాతులు తెలిసిన తర్వాత ‘మంచి పనే కానీ..’ అని వారి ఆందోళనను స్పష్టంగా చెప్పేవారు.

వీలు దొరికినప్పుడల్లా ఇద్దర్ని కలిసేదాన్ని. కానీ ఎక్కువగా అమ్మే వచ్చేది. ‘ఎందుకు నాన్నా నువ్వు రావూ?’ అని ఒకసారి అడిగాను. ‘అమ్మకు ధైర్యం ఎక్కువ. నాకు అంత లేదు” అనేవాడు. అలా అన్నప్పుడు నాకు నవ్వాగేది కాదు. నాతో పాటు వాళ్ళు
నవ్వేవారు. అమ్మ ఎక్కడికి పిలిపించినా ఫ్రీగా వచ్చేది. ఏ విషయమైనా అది అన్నాయ్‌, చెల్లాయ్‌, అక్కాయ్‌ ల సొంత విషయమైనా ఇద్దరూ దాచేవారు కాదు. నీక్కాకుండా ఎవరికి చెప్పుకుంటాం? అని,

నాన్నకు వారసత్వంగా చెవుడు ఉంది. ఇంటికి పోయినప్పుడు మగ్గంలోంచి లేచి నాతో మాట్టాడేవాడు, చెవిటి మిషన్‌ పట్టుకొని, వినపడనప్పుడు మరీ సౌండ్‌ పెంచి వినేవాడు. నానమ్మకైతే చెవిలో నోరు పెట్టి చెపితేనే వినపడేది. అప్పుడప్పుడు బాబాయ్‌ పిల్లలు,  నేను, చెల్లాయ్‌ మామ్మను బాగా ఆట పట్టించేవాళ్ళం. మామ్మ‌కు వినపడనప్పుడు కోపమొచ్చేది. మాకు నవ్వొచ్చేది. మేం నవ్వుతున్నప్పుడు మామ్మ నాన్నకు పితూరి చెప్పేది. ‘యాయ్‌ _.. ఏంటా అల్లరి’ అని నాన్న గదిమేవాడు. నాన్న ఉన్నంతసేపు కిమ్మనకుండా ఉండేవాళ్ళం,

ఒకసారి అమ్మను చూడాలనిపించి ఫోన్‌ చేశాను. వస్తానని రిప్లై ఇచ్చింది. కలుస్తున్నాను అనే సంతోషంతో ఇంటి గడప ఎక్కాను. ఇంటామె ఇచ్చిన నీళ్ళ చెంబుతో కాళ్ళు కడుక్కున్నాను. మంచంలో చేరగిలపడి అమ్మ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మ వచ్చింది. మంచంలో కూర్చుంటూ ‘ఎలా ఉన్నావమ్మా?’ అంటూ అడిగింది.

“బాగానే”.
‘నువ్వు?’

అమ్మ చెపుతుండగా ఒకామె వచ్చి మా ముందు నిలబడింది. నాకయితే ఎవరనేది తెలియదు. కాబట్టి నేను మామూలుగా ఉన్నాను. ఆమె అమ్మ మొఖంలోకి సూటిగా చూస్తూ ‘నువ్వు చిన్నమ్మివి కదా! అని అడిగింది.

‘కాదు’ అని అమ్మ తడబడకుండా జవాబిచ్చింది.

‘ఈ అమ్మాయెవరు?’ మళ్ళీ ఆమె ప్రశ్నించింది.

‘మామ్మాయి’ అమ్మ,

ఆమె రెండు మూడు క్షణాలు మా ఇద్దర్ని అలాగే చూసి వెళ్ళిపోయింది.
‘ఎవరమ్మా?’ అని అడిగాను,

‘తెలిసినామెనే!’ అని చెప్పింది.

అసలు ఆమె అమ్మ వీధి మలుపులో ఆటో దిగేటప్పుడు చూసి అనుసరించింది. ఆ రోజు నా కోసం అమ్మ పడిన మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. కొన్ని క్షణాలుమా మధ్య మౌనం ఆవహించింది. మౌనాన్ని ఛేదిస్తూ నాన్న ఇదిమ్మన్నాడు అని ఒక
పొట్లాన్ని నా చేతిలో పెట్టింది. విప్పి చూశాను. మిఠాయి. తినాలనిపించక పోయినా అమ్మ తృప్తి కోసం నాన్నకు అందించే కబురు కోసం తీసి అమ్మకు కొద్దిగా ఇచ్చి నేను కూడా నోట్లో వేసుకున్నాను, బుట్టలో నుంచి క్యారేజి తీసింది. అన్నం తిందువు గానీ
అని తొందరపెట్టి తినిపించింది. ఇంటామె, ఇంటాయన వారి పాప  వచ్చి మంచం మీద కూర్చున్నారు. అమ్మ అనారోగ్యం గురించి అడుగుతున్నారు. ‘ఏం కాదులే పెద్దమ్మా! మేమున్నాం గదా!’ అని సర్ది చెప్పాడు ఇంటాయన.  వాళ్ళు ఉద్య‌మ   సానుభూతిపరులు. ఇద్దరూ బాగా అభిమానిస్తారు. మొదట్నుండి షెడ్డుల్లో ఉండి చివరికి కాలనీలో స్థిరపడ్డారు. తర్వాత్తర్వాత ఉద్య‌మానికి అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ్డారు.  

ఇంటామె ‘మీరు కూడా అన్నం తినండ‌న్నది అమ్మను. ‘తినిచ్చాన్నమ్మా, మీరు తినండ’న్నది. కుటుంబ విషయాలు చుట్టాలు-పక్కాల పరిస్థితి చెప్పింది. నేను ఊ_ కొడుతున్నా గానీ నాకు చివరింటామె వచ్చి అడిగిన ప్రశ్న ఒ అమ్మ చెప్పిన సమాధానమే
రీలులా తిరిగింది. ఆ రోజు నా గురించి అమ్మ పడిన ఘర్షణ ఇప్పటికీ ఎప్పటికి మరచిపోలోను.

స్కూలు చదివేటప్పుడు కూడా ఎవరమ్మాయివి? అని అడిగినప్పుడు అమ్మ పేరు చెబితే ‘ఆహా… చిన్నమ్మాగారి అమ్మాయివా?!’ అని కళ్ళు ఇంతవి చేసుకొని చూసేవారు. అంత పేరు ఉండేది అమ్మకు.

క్రమేపి అమ్మకు ఆరోగ్యం క్షీణించింది. ‘నా’ అనేవాళ్ళు ఎవరూ దగ్గర లేక మానసిక సంఘర్షణ మరీ ఎక్కువయ్యింది. నాన్నకు కూడా వయసు పెరిగి దానితో పాటు జబ్బులు పెరిగాయి. బెల్లం చుటూ ఈగలు చుట్లి ముట్లినట్లు మంచిగా ఉన్నప్పుడు అందరూ

చుట్టుముట్టారు. జబ్బులొచ్చేటప్పటికీ పలకరించే నాధుడే లేకుండా పోయింది. అలా అయిపోయింది అమ్మా నాన్నల పరిస్థితి. మధ్య తరగతి బతుకుల పరిస్థితి.

ఏ మాత్రం చేసుకోలేని పరిస్థితుల్లో చుట్టుపక్కల వారు ‘ఎందుకు ఇబ్బందులు పడతారు? మీ కొడుకు దగ్గరకు పోవచ్చు కదా!’ అని ఉచిత సలహా ఇచ్చేవారు.

“ఎందుకమ్మా! ఆ అగ్గిపెట్టె జీవితాలు, ఎలాగోలా బతికేస్తాం’ అని ఇద్దరూ చెప్పేవారు.

చివరిసారి అమ్మా నాన్నలను కలిశాను. ఇద్దరూ బాగా ఏడ్చారు. “అందుబాటులో ఉండు. అప్పుడప్పుడు చూట్టానికి రా! నువ్‌ ఒక్క రోజున్నా మాకు మంచిదే*  అని అమ్మ పైట చెంగుతో కళ్ళు ఒత్తుకొంది. నాన్నైతే ‘మేం బతికుండగా నీ గురించి ఏ కబురు వినొద్దమ్మా!’ అని అంటూనే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని ఓదార్చుతున్నా, గానీ నాక్కూడా అంతే బాధగా ఉంది. ఇంకా అక్కడుంటే తట్టుకోలేనని
‘వెళ్ళొస్తా’ అంటూ ఆటో ఎక్కాను.

నేనున్న పని రీత్యా చాలా దూరంలో నుండి ఇద్దరికీ లెటర్‌ వ్రాశాను.  వాళ్ళను కలిసిన ఐదు సంవత్సరాల తర్వాత. తక్కువ సమయంలోనే అమ్మ నుంచి రిప్లై వచ్చింది. సీరియస్‌ అనారోగ్యంలో ఉండి కూడా కుటుంబ విషయాలు రాసి చివరిగా “ఇంటికి రావొద్దు.
కుటుంబ పరువు, వృత్తి పరువు నిలబెట్టాలి’ అని ప్రోత్సాహిన్తూ రాసింది. ఆ లెటర్‌ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.

రోజురోజుకూ ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. నాన్నకు నీళ్ళ విరేచనాలు. ఒకటి రెండు రోజులు కాకుండా రోజుల తరబడి. హాస్పిటల్‌ కి తీసుకెళ్ళారు. పేగులు పాడైపోయాయి. ఆపరేషన్‌ చేసినా బతకని పరిస్థితి,

ఒకరోజు అమ్మ వంట చేయటానికి కుర్చీని ముందుకు జరుపుకుంటుండగా దభేలున కింద పడిపోయింది. సట్ట ఎముక విరిగింది. కదలలేదు, లేవలేదు. రెండు రోజులు జీవచ్చవంలా పడిపోయింది. హాస్పిటల్‌ టెస్టుల్లో షుగర్‌ అని తేలింది. ఆపరేషన్‌ చేసినా
పెద్ద వయసు కాబట్టి బతకదని. కన్నీటితోనే అమ్మను ఇంటికి తీసుకొచ్చాడు అన్నాయ్‌. తన ఉద్యోగానికి కొన్ని రోజులు లీవ్‌ పెట్టి మంచంలో ఉన్న ఇద్దర్ని ‘చంటిపిల్లల్లా’ సాదాడు,

ఆఖరి క్షణాలు. ఇద్దరూ అన్‌ కాన్షియస్‌ లోకి వెళ్ళిపోయారు. ఏవేవో మాట్లాడేవారు.

నాన్న పరిస్సితి అమ్మకు తెలియదు. అమ్మ పరిస్తితి నాన్నకు తెలియదు. అలా నాన్న 2018 వ సంవత్సరం మార్చి ఇరవై ఏడున కన్నుమూశాడు. నాన్న చనిపోయిన విషయం కూడా అమ్మకు తెలియదు. నాన్న చనిపోయిన రోజు అమ్మ ఏదేదో మాట్లాడింది,
అలా అమ్మ కూడా నాన్న చనిపోయిన తెల్లారి ఇరవై ఎనిమిదిన కన్ను మూసింది. ఇద్దరు ఒక రోజు తేడాలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒకరి ఎడబాటు మరొకరికి లేకుండానే.

ఈ దుఃఖపు వార్తను  కరెక్టుగా తొమ్మిది నెలల పన్నెండు రోజులకు  ఒక ఉత్త‌రం మోసుకొచ్చింది.  కంటి నుంచి కన్నీరు టప టప రాలింది. ‘అమ్మాయ్‌’ అని పిలిచినట్టనిపించి ఉలిక్కిపడి లేచాను. వారితో గడిపిన ఆ చిన్ననాటి తీపి గుర్తులు, అనునిత్యం పిల్లల బాగోగులో ధ్యేయంగా బతికిన అమ్మా నాన్నల ప్రతి రూపాలు కళ్ళముందు కదలాడాయి. .

“ఇంటికి రావొద్దు. కుటుంబ పరువు, వృత్తి పరువు నిలబెట్టాలి’ అని ప్రోత్సాహిన్తూ రాసిన అమ్మ లెటర్‌ గుర్తు కొచ్చింది.

నిజంగా వారి ప్రేరణే  లేకపోతే మేమంతా ఈ రోజు ఒక మంచి భవిష్యత్తులో ఉండేవాళ్ళం కాదు. ఎండననక-వాననక్క పగలనక-రేయనక వాటు వేస్తూనే మా కోసం అహర్నిశలు శ్రమించిన అమ్మా నాన్నలు నిజంగా ధన్యులు.  వారి రుణం ఎప్పటికి తీర్చుకోలేనిది.

ఎటువంటి హంగూ – ఆర్భాటం లేకుండా జీవించిన అమ్మా నాన్నల ప్రేమ, ఆప్యాయతలు మా వెన్నంటి ఉంటాయి. వారి జ్ఞాపకాల్లో సదా జీవిస్తూ…

(రచనా కాలం : 28. 7.2020)

Leave a Reply