ఇటీవల విడుదలైన శ్రీరామ్ పుప్పాల దీర్ఘ కవిత 1818కు రాసిన ముందుమాట
ఈ మధ్య కాలంలో అంతా బాగానే ఉంది. ‘హక్కులు మనవి, హక్కుల పోరాటం వాళ్ళది’ అని వాటాలు వేసుకున్నాక కులాసాగానే గడుస్తోంది. మీకు తెలియంది కాదు. ‘వర్తమానం’ ఎప్పుడో బహువచనంలోకి మారిపోయింది. ఇప్పుడు అనేక వర్తమానాలు. నచ్చిన, కంఫర్టబుల్ వర్తమానాన్ని ఎంచుకుంటున్నాం. ఏ మాత్రం ఇబ్బంది పెట్టని ‘నైసిటీస్’ని మాట్లాడటం, రాయడం, చదవడం అలవాటు చేసుకున్నాం. నచ్చిన రంగు సన్ గ్లాసెస్ లో వెలుగును చూస్తూ, ‘ఎవ్రీధింగ్ లుక్స్ ఫైన్’ అని ‘ఉబర్ కూల్ పోజ్’ల ఆత్రం లో ఉన్నాం. అంతా బాగానే ఉంది. సౌకర్యంగానే ఉంది.
ఉన్నట్టుండి మీరు ‘నేను భీమా నదిని మాట్లాడుతున్నాను’ అంటూ చాచి లెంపకాయ కొట్టారు. మా కళ్ళద్దాలని నేలకేసి కొట్టారు. ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. కంఫర్ట్ జోన్లో నుండి బైటకి లాగినందుకు కడుపులో మండుతుంది కానీ, గతాన్ని, వర్తమానాన్ని, కాలాలకి అతీతంగా ప్రవహించే నదిలాంటి సత్యాన్ని గుర్తించినప్పుడు గుండె కూడా మండుతోంది. మీ గర్జన విన్నాక వర్తమానం నుండి తప్పించుకోటానికి వీలు, చెప్పటానికి సాకు దొరకట్లేదు.
గంగానదిని ప్రసన్నం చేసుకున్న ‘భగీరధ ప్రయత్నం’ని మాత్రమే వినడానికి అలవాటు పడటం వల్ల కాబోలు, వేదన, ఆర్ద్రత, ఆగ్రహాలతో నిండిన భీమా నది గొంతు ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘తగరంలో చుట్టిన పాలపుంత’ని రెండు అరచేతులా పట్టుకున్నట్టు ఉంది. పదహారు మంది ప్రజా మేధావులని దృష్టిలో ఉంచుకుని ఈ కవితని భాగాలు చేశారు. చీర కుచ్చిళ్ళు పోయటానికి అమ్మకి సాయపడే బిడ్డలా, చరిత్రకు పదహారు భాగాల కుచ్చిళ్ళు పోసిన పొందికకు ముచ్చటేసింది. కులాధిపత్య పురుగు ఎలా పాకుతుందో చూసి వొళ్ళు జలదరించింది. రాజ్యం చేసిన, చేస్తున్న కుట్రలు చూసి, మనసు కకావికలమైపోయింది. చదవటం పూర్తి చేసి మూడు రోజులైనా ఇంకా ఉద్వేగం అదుపులో ఉండట్లేదు. దు:ఖంతోనే కాదు, కోపమొచ్చి కూడా కన్నీళ్ళొస్తాయని ఈ కవిత చదువుతుంటేనే తెలిసింది. కళ్ళ ముందు కవిత, కళ్ళు మూస్తే చరిత్ర. ఉండుండి ‘మట్టైపోయిన పక్కటెముకలు స్థూపాలై తలెత్తుకుని’ ఎదురుపడుతున్నాయి. ‘మొగ్గలు విచ్చుకోలేదని గాయపడ్డ మందార పూల చెట్టు’ కళ్ళ ముందు మెదులుతోంది.
1818 నాటి చరిత్ర తెలిసిందే. పీష్వాల మీదా, కులాధిపత్యం మీదా, రాజ్య హింస మీదా వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన మహర్లు చేసిన పోరాటం, సాధించిన విజయం ఉత్సాహాన్ని, ఆశనీ ఇచ్చే సత్యాలు. కానీ రెండు వందల ఏళ్ళ తరువాత కూడా వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేని స్థితిలోనే ఉన్నాం. కులం, రాజ్య హింసల విషయంలో ఈ రెండొందలేళ్ళైనా పెద్ద మార్పు లేదు. ఎందువల్ల ? అనే ప్రశ్నని మీరు అడగలేదు శ్రీరాం గారు. అడిగి ఉంటే మేమందరం ఒక నిట్టూర్పు విడిచి ఊరుకునేవాళ్ళం.
కానీ, మమ్మల్ని ఏ ప్రశ్నలూ వేయకుండా, టైం ట్రావెలర్ ని చేసి చరిత్రలోకి, వర్తమానంలోకి ఉరుకులు పెట్టించారు. అత్యంత కష్టమైన జర్నీ ఇది. ఒకటే యాతన. వర్తమానం నుండి చరిత్రలోకి, చరిత్ర నుండి వర్తమానం లోకి భీమా నది గొంతు వింటూ, అక్షరాలనెక్కి ప్రయాణం చేశాను. గోవింద్ గోపాల్ మహర్ దగ్గర నుండి కారంచేడు చెరువు దాకా, కాలి బూడిదైపోయిన కంచికచెర్ల కోటేసు దగ్గర నుండి, ‘నీడల్లోంచి తారల్లోకి’ ఎగసిపోయిన వేముల రోహిత్ వరకూ, ఈ ‘ నేల దు:ఖాన్ని’ మోయలేక నా గుండె బరువెక్కిపోయింది. కళ్ళు తడిసిపోయాయి. పురిట్లోనే బిడ్డ చనిపోయిన పచ్చిబాలెంత పాలవాసనని ప్రతి పదంలోనూ పీల్చాను. సిప్పర్ ఇవ్వని ఈ దేశ న్యాయ వ్యవస్థ దుర్మార్గానికి, దాన్ని అడ్డుకోలేని మన చేతగాని తనానికీ సిగ్గేసింది. ‘చివరి ఉన్నిపోగుల కోసం చర్మం వలిచేస్తున్నా కిమ్మనని జడలబర్రె’ల జాతి కదా మనది. దానిని మీరు ముల్లుకర్రతో పొడిచారు. ఇప్పటికైనా మీ గొంతుతో మా గొంతు కూడా కలపకపోతే జీసస్ కి శిక్ష వేసేసి, చేతులు కడుక్కున్న పిలాతులా మిగిలిపోతామని భయమేస్తోంది. అందుకే శ్రీరాం గారూ నేనూ అడుగుతున్నాను
ఇండియా !
సాయిబాబాని విడిచిపెట్టు
నా ప్రియాతి ప్రియమైన కవి
వరవర రావును కూడా.
ఇండియా ! స్టాన్ స్వామి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచు.
Complete magazine. Belongs to SCHSU—-of schsu—for schsu—by schsu ?????????