వాచ్యంగా చెప్పిన దానికన్న ఎక్కువగా సూచనలు అందించిన కారా కథల గురించి గత నలబై ఏళ్లలో చాలా చర్చ జరిగింది, ఇంకెంతో చర్చ జరగవలసే ఉంది, జరగవచ్చు కూడా. కాగా మరణం తర్వాత కారా గురించి, కారా కథల వర్తమాన అన్వయం గురించి జరుగుతున్న చర్చ మరిన్ని కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. కారా కథల ప్రాసంగికత గురించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారాను, ఆ మాటకొస్తే ఏ రచయితనైనా ఎలా అర్థం చేసుకోవాలనే మౌలిక అంశాలు చర్చకు వస్తున్నాయి. కారా కథల్లో చెప్పిన, చెప్పదలచుకున్న విషయాల ద్వారా ఈ చర్చలోకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది.

మొదట ఒక రచన, లేదా ఒక రచయిత ప్రాసంగికత అంటే ఏమిటనే ప్రాథమిక ప్రశ్న దగ్గర ప్రారంభిద్దాం. ప్రాసంగికత అని తెలుగు సాహిత్య విమర్శలో, మరీ ముఖ్యంగా ఇటీవలి మేధా చర్చల్లో చాల తేలికగా వినియోగిస్తున్న మాట నిజానికి చాల లోతయినది. ఒక గత కాలపు భావానికి, రచనకు, దాన్ని వ్యక్తీకరించిన మనిషికి వర్తమాన అన్వయం ఎంత ఉంది అని దీని స్థూల అర్థం. ఒక సాహిత్య రచన అది పుట్టిన కాలం కన్న ఎక్కువకాలం మనగలుగుతుందా, మనగలిగితే ఏ కారణాల వల్ల ఆ మనుగడ ఉంటుంది, సాహిత్యం స్థలకాల బద్ధమైనదా, లేక స్థలకాలావధులను అధిగమించే అవకాశం ఉందా అనే మౌలిక సమస్యల చర్చకు సంబంధించినది ప్రస్తుత చర్చ. రచయిత తన స్థలకాలాలను కూడా సరిగ్గా పట్టుకోగలిగారా లేదా అనేది కూడ ప్రాసంగికతకు ఒక కోణంగా ఉన్నది.  

సాహిత్యాన్ని అనేక సామాజిక చైతన్య రూపాలలో ఒకానొకటిగా చూసినప్పుడు ఆ సాహిత్యం గాని, ఆ స్థల కాలాలలో ఆ సామాజిక చైతన్య రూపపు వాహికలుగా, సాధనాలుగా, ప్రేరకులుగా ఉండే సాహిత్యకారులు గాని ఆ ప్రత్యేక, నిర్దిష్ట సమాజాన్ని మాత్రమే చిత్రించగలరు, ఆ సమాజం మీద మాత్రమే ప్రభావం వేయగలరు. అలా సాహిత్యం స్థలకాల బద్ధమైనదే. సాహిత్యకారులు స్థలకాల బద్ధమైనవారే.

మరి వందల వేల ఏళ్ల కిందటి సాహిత్యం చదవడం, దాని ప్రభావానికి లోను కావడం, దానిలో చిత్రణ పొందిన భావాలు, పాత్రల మనస్తత్వాలు ఇవాళ్టికి కూడా ఎక్కడో ఒకచోట కనబడుతున్నాయని, ఆ సాహిత్యంలో ప్రతిపాదించిన విలువలకు ఇవాళ్టి సమాజంలో కూడా అన్వయ శక్తి ఉన్నదని అనుకోవడం ఎందుకు జరుగుతున్నదో ఆలోచించాలి. ఈ దృగ్గోచారాంశం సాహిత్యపు లేదా భావాల స్థల కాలాతీత శక్తికి నిదర్శనమైనా కావచ్చు. లేక ఆ సాహిత్యంలో, ఆ భావాలలో చిత్రణ పొందిన సమాజం ఇవాళ్టికీ మౌలికంగా మారలేదనడానికి చిహ్నమూ కావచ్చు. మారిందని అనుకుంటున్న కాలం నిజంగా మారి ఉండకపోవచ్చు. సమకాలిక సమాజాన్ని చిత్రించిన సాహిత్యానికి ఆ స్థలం, కాలం మారిన తర్వాత కొత్త సమాజం మీద ప్రభావం ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, సాహిత్య ప్రయోజనం, ప్రభావం సమకాలీనం మాత్రమేనా, ఆ కాలం గడిచిన తర్వాత కూడా ఉంటాయా అనే ప్రశ్నలు మిగిలే ఉంటాయి.

ఒక రచయితనో, రచనలనో తర్వాతి కాలంలో కూడా గుర్తుంచుకోవడానికి, తలచుకోవడానికి, మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడానికి, అరె ప్రస్తుత సందర్భానికి కూడా పనికొస్తాయే అని ఆశ్చర్యపోవడానికి, ఇది సార్వకాలికం అని భ్రమపడడానికి అవకాశం ఇప్పటికీ ఉన్నట్టే కనిపిస్తున్నది. అలా కనిపించడానికి కారణం ఏమిటో ఆలోచించవలసే ఉంది. రచనకు కూడా ఒక పుట్టుక, ఒక జీవితం ఉన్నట్టుగానే ఒక మరణం కూడా ఉంటుందని అంత సులభంగా సరళ సమీకరణం వేసినట్టు చెప్పగల స్థితి లేదు. ఇతర భాషా సాహిత్యాల చరిత్రలోనూ, మన సాహిత్య చరిత్రలోనూ కూడా దశాబ్దాలూ శతాబ్దాలూ మరుగున పడిన రచనలు, రచయితలు, మళ్లీ ఒక కాలంలో ప్రాచుర్యంలోకి రావడం, వారి ప్రాసంగికత స్పష్టం కావడం మన కళ్లముందరి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన మనిషికి మరణం ఉంటుంది గాని మనిషికి మరణం లేదు అనే తాత్విక సత్యం లాగా ఒక రచయితకు మరణం ఉంటుంది గాని రచనకు మరణం లేదు అనే అవకాశం ఉందేమో. రచన మొత్తంగా సజీవంగా, ప్రాసంగికంగా ఉండకపోయినా, ఆ రచనలోని భావాలు, విలువలు, దృక్పథం మళ్లీ మళ్లీ పునర్జీవనం పొందుతుండవచ్చు. వర్తమానం చాలా సార్లు గతంతో సంభాషించాలని కోరుకుంటుండవచ్చు.

ఇటువంటి అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు అన్వేషించవలసిన సందర్భం ఇది. ఆ ఓపిక లేని కొందరు తమకు నచ్చిందే సాహిత్యమనీ, పుట్టుక వల్లనో, ప్రాంతం వల్లనో, భాష వల్లనో, కాలం వల్లనో కొందరు రచయితలను తాము కొట్టివేశామనీ, చదవదలచుకోలేదనీ, చదివినా చదవకపోయినా నచ్చలేదని అనాలని నిశ్చయించుకున్నామనీ, అందువల్ల ఆ రచయితలకు, రచనలను కాలం చెల్లిపోయిందని శాసనం చేస్తున్నామనీ అనడానికి పూనుకుంటున్నారు. లేదా ఆ సవాళ్లకు జవాబు ఇవ్వాలనే తొందరలో మరి కొందరు మరొక కొసకు వెళ్లి తమకు నచ్చిన రచనలు సార్వకాలికమైనవని అనవసర నిర్ధారణలు చేస్తున్నారు.

సాహిత్యం సమాజ ప్రవాహపు అల. ప్రవాహ స్వభావం మారితే తప్పనిసరిగా పాత అలలు రద్దయిపోతాయి. ఒక సాహిత్యం ప్రాసంగికం కాదని చర్చించడానికైనా, ప్రాసంగికంగా ఉందని చర్చించడానికైనా భూమిక సమాజం కావాలి. మన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, అపోహలు, ఈర్ష్యాసూయలు, అకారణ, సకారణ ద్వేషాలు కారణం కాగూడదు. తన సమకాలీన సమాజ స్వభావాన్ని, సమాజ గమనాన్ని ఆ ప్రత్యేక రచన సక్రమంగా చిత్రించిందా లేదా, ఆ సమాజ స్వభావం, గమనం మారాయా అనే చర్ఛ జరగాలి. సమాజ స్వభావం మారి ఉంటే ఆ రచన దానికదే కాలం చెల్లిపోతుంది. మారకపోయి ఉంటే ఎవరు ఎంత అభ్యంతర పెట్టినా ఆ రచనను ప్రాసంగికంగా భావించే వాళ్లుంటారు.        

ఒక గతకాలపు భావానికీ, రచనకూ వర్తమానంలో ప్రాసంగికత ఉండడం అనేది అనేక విధాలుగా జరుగుతుంది. ఈ ప్రాసంగికత ఆ భావాల, రచనల వస్తువులోనూ ఉంటుంది, రూపం లోనూ ఉంటుంది. వస్తుగతమైన ప్రాసంగికత కనీసం నాలుగు కారణాల వల్ల ఉండవచ్చు: ఒకటి, కాలం మారినప్పటికీ గతకాలపు భావజాల భారమే సమాజం మీద కొనసాగుతున్నప్పుడు గతకాలపు భావాలు, రచనలు ప్రాసంగికంగా కనబడతాయి. రెండు, గతం నుంచి వర్తమానానికి పరిణామం కేవలం కాలసూచిగా మాత్రమే ఉండి సామాజిక విలువల్లో మౌలికమైన మార్పు లేనప్పుడు గత కాలపు రచనలు ప్రాసంగికంగా కనబడతాయి. మూడు, గతకాలపు యథాస్థితి నుంచి మౌలికమైన విచ్ఛిత్తి (రాడికల్ రప్చర్ అన్నాడు మార్క్స్) జరగకుండా, పైపై మార్పులు, అటుకులు, మాట్లు, పైపై పూతలు మాత్రమే జరిగినప్పుడు గత కాలపు రచనలు ప్రాసంగికంగా కనబడతాయి. నాలుగు, మొత్తం రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనంలో సారం మారకుండా రూపం మాత్రమే మారినప్పుడు గత కాలపు రచనలు ప్రాసంగికంగా కనబడతాయి. ఇది రాజకీయార్థిక, సామాజిక పునాదికి సంబంధించిన విషయం గనుక ఈ వస్తుగత ప్రాసంగికత మౌలికమైనది.

ఇక ఒక భావంలో, ఒక రచనలో ఉండే నవ్యత, అద్భుతత్వం, ప్రయోగశీలత, ఆకర్షణ కూడా తర్వాతి కాలాల్లో వాటిని ప్రాసంగికంగా ఉంచుతాయి. ఈ రూపంలో, శిల్పంలో ప్రాసంగికత కనీసం మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటి, ఆ రచనలో పాత్రచిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణలు విశ్వసనీయంగా, పునరుక్తి సంభావ్యతతో ఉన్నప్పుడు ఆ గతకాలపు రచనలోని పాత్రలే వర్తమానంలో మళ్లీ మళ్లీ ఎదురుపడుతూ ఆ రచనకు ప్రాసంగికతను కల్పిస్తాయి. రెండు, మౌఖిక, సంభాషణా వ్యవహారంలో తరతరాల సంచితపు సామెతలూ, నుడికారాలూ అనేకం ప్రాసంగికంగా ఉండడం మనందరి అనుభవంలో ఉన్నదే. వందల ఏళ్ల కింద పుట్టిన నుడికారం, సామెత ఇవాళ్టి మన నిత్య జీవిత వ్యవహారానికి పనికి వస్తుంది, ప్రాసంగికంగా ఉంటుంది. ఈ సామెతలు, నుడికారాలు లిఖిత రచనలోకి వచ్చినప్పుడు చాల సహజంగా ఆ తరతరాల జీవన సారాంశపు సత్యాల శక్తి తర్వాతి తరాల పాఠకులకు కూడ అంది, ఆ రచన తమ కాలంలో కూడా ప్రాసంగికమే అనిపిస్తుంది. మూడు, ముఖ్యంగా లిఖిత రచనల విషయంలోకి వస్తే, ఆ రచనా నైపుణ్యం, అందులోని శిల్ప విశిష్టత, వస్తువును సంభావించిన సంవిధానం తర్వాతి తరాల రచయితలకు ఆదర్శాలుగా, పాఠ్యాంశాలుగా, అనుసరణీయాంశాలుగా మారి సాహిత్య వారసత్వం అవుతాయి. ఆ వారసత్వ లక్షణం వల్ల ఆ ప్రత్యేల రచన ప్రాసంగికంగా కనబడుతుంది.

పైన చెప్పిన వస్తుపరమైన ప్రాసంగికత ఇచ్చే అంశాలూ, రూపపరమైన ప్రాసంగికత ఇచ్చే అంశాలూ అన్నీ కాళీపట్నం రచనల్లో ఉండడం ఒక ప్రత్యేకత. సమాజంలో ఏ గత భావజాల భారం మీద ఆయన తన కథల్లో విమర్శ ఎక్కుపెట్టారో ఆ భారం బహుశా సమాజంలో పెరుగుతున్నవేళ ఆయన కథలకు ప్రాసంగికత ఉంటుంది. ఆయన రాసిన 1950-70ల నుంచి సమాజం 2020ల్లోకి వచ్చిందని కాలసూచిగా చెప్పుకోవలసిందే తప్ప ఆయన చిత్రించిన, విశ్లేషించిన వస్తువుల్లో అత్యధిక భాగం ఇంకా మారలేదు గనుక ఆయన కథలకు ప్రాసంగికత ఉంటుంది. మన సమాజ గమనంలో, సామాజిక విలువల్లో మౌలిక విచ్ఛిత్తి జరగలేదని, చిలవలు పలవల కొనసాగింపు మాత్రమే జరుగుతున్నదని అర్థం చేసుకున్నప్పుడు ఆయన కథల ప్రాసంగికత అర్థమవుతుంది. మన సమాజపు దోపిడీ పీడనల సారం మారలేదనీ, రూపాలు మాత్రమే మారాయనీ చూసినప్పుడు ప్రధానంగా సారం గురించి రాసిన కారా కథలకు ప్రాసంగికత ఇంకా ఉన్నదని అర్థమవుతుంది.

అలాగే పైన చెప్పిన రూపపరమైన అవిచ్ఛిన్నతాంశాలు కూడా కారా కథలకు వర్తమాన అన్వయానికి అవకాశం ఇస్తున్నాయి.

ఒక రచనను, భావాన్ని తర్వాతి తరాల్లో కూడా ప్రాసంగికంగా మార్చే పైన చెప్పిన లక్షణాలు మాత్రమే కాక, కారా కథల్లో కొన్ని ప్రత్యేకమైన అదనపు అంశాలు కూడా వాటికి ప్రాసంగికతను ఇస్తున్నాయి. 1950ల్లో పత్రికల్లో అచ్చయిన నాటి నుంచి, 1960ల నుంచి సంపుటాలలో వెలువడిన నాటి నుంచి కారా కథలు విడివిడిగానూ, సంపుటాలుగానూ గత అరవై సంవత్సరాల్లో ఇరవై సార్లయినా పాఠకులకు అంది ఉంటాయి. ఇదేదో ప్రచురణకర్తలు అచ్చువేసి సమాజంలోకి తోయగా మాత్రమే జరిగిన పని కాదు, గత అరవై సంవత్సరాలలో కనీసం మూడు తరాల కొత్త పాఠకులు చూపిన ఆదరణ ఫలితం అది. కారా కథల ప్రాసంగికతకు అది ఒక నిదర్శనం.

ఆయన కథల మధ్య ఇతర విమర్శకులు చేసిన రెండు మూడు దశల విభజనను అంగీకరిస్తూనే, అన్ని కథల్లోనూ మానవసంబంధాల జీవధార అవిచ్ఛిన్నంగా ప్రవహించడం కనబడుతుందని నేను 1986లో ఒక వ్యాసంలో రాశాను. ఆ విశ్లేషణను ఇంకా విస్తరించవలసి ఉంది. ఆయన కథారచన మూడు దశాబ్దాల్లోనూ మానవ సంబంధాల చిత్రణ మాత్రమే కాదు, మానవసంబంధాల ప్రజాస్వామికీకరణ అన్వేషణ ఉన్నది. ఈ అన్వేషణ మన సమాజంలో 1950ల నుంచి 1970ల దాకా నడిచిన కాలానికి సంబంధించినది మాత్రమే కాదు. ఆ పెనుగులాట అంతకు ముందు వందలాది ఏళ్లుగా సాగుతున్నది, ఈ యాబై ఏళ్లుగా కూడా కొనసాగుతున్నది. మన సమాజ మౌలిక స్వభావం మారేవరకూ ఈ ప్రజాస్వామికీకరణ ప్రయత్నాలు సాగుతుంటాయి. ఆ మానవ సంబంధాల ప్రజాస్వామికీకరణ అన్వేషణ కారా కథల్లో కుటుంబం, గ్రామం, కులం, వర్గం, స్త్రీపురుష సంబంధాలు, వయోభేదాలు, రాజ్యానికీ ప్రజలకూ మధ్య ఘర్షణ వంటి వేరు రూపాల్లో, వేరు వేరు స్థాయిల్లో వ్యక్తీకరణ పొందవచ్చు, వేరు వేరు పాత్రల స్వరాల్లో పలకవచ్చు, వేరు వేరు సన్నివేశాల్లో దృశ్యమానం కావచ్చు. కాని మౌలికమైనది ఆ ప్రజాస్వామిక అన్వేషణ. ఇవాళ్టికీ కొనసాగుతున్న, ఇవాళ్టికీ పరిష్కారం కాని ఆ అన్వేషణే ఆయన రచనలకు ప్రాసంగికతను సంతరింపజేస్తున్నది.

ఈ మానవ సంబంధాల ప్రజాస్వామికీకరణ అన్వేషణ కారాను సహజంగా, అనివార్యంగా వర్గపోరాటం దగ్గరికి చేర్చింది. ఆయన కథలన్నీ వర్గపోరాటానికి వేరు వేరు వ్యక్తీకరణల చిత్రణలే. అయితే రచయితగా ఆయన విశిష్టత ఏమంటే ఆయన వర్గపోరాటాన్ని సమాజవ్యాప్తంగా వేరువేరు తలాల్లో జరిగే నిరంతర ప్రయత్నంగా విశాలంగా, లోతుగా, సృజనాత్మకంగా అర్థం చేసుకున్నారు. వర్గపోరాటపు సుదూర, సూక్ష్మ ప్రకంపనలను కూడా ఆయన పట్టుకున్నారు. వర్గపోరాటాన్ని, దాని వ్యక్తీకరణలను నేరుగా, సూటిగా, మొరటుగా చిత్రించడం కాల్పనిక సాహిత్యం పని కాదనీ, అది విశ్వసనీయం కావాలంటే, పాఠకుల ఆలోచనల మీద ప్రభావం వేయాలంటే దాని చిత్రణ విభిన్నంగా, విశిష్టంగా, అపురూపంగా ఉండక తప్పదని ఆయన గుర్తించారు. అందువల్లనే ఆయన ఈ వర్గపోరాట నిత్యజీవిత ప్రతిఫలనాలను మానవ సంబంధాల ద్వారా, సామాజిక చరిత్ర ద్వారా, సాధారణ జీవన సంఘటనల ద్వారా, జీవన పరిణామాల ద్వారా చిత్రించాలని పూనుకున్నారు. అందుకే కారా కథలు చదువుతున్నప్పుడు పైపొరలో ఎవరికైనా కనబడేవి మానవ సంబంధాలు, సామాజిక చరిత్ర, సాధారణ జీవన సంఘటనలు, సాధారణ జీవన పరిణామాలు. అక్కడి నుంచి కింది పొరల్లోకి వెళ్తున్నకొద్దీ వర్గపోరాట అనివార్యత, పీడితవర్గ పక్షపాతం, వ్యవస్థ పరివర్తన ఆవశ్యకత కనబడతాయి. వర్గపోరాటాన్ని అంగీకరించని వాళ్లయినా, గుర్తించనివాళ్లయినా, దాని పట్ల అపోహలు ఉన్నవాళ్లయినా కారా కథలు చదివి ఆకర్షితులయ్యేది వారికి ఈ నాలుగు అంశాల్లో ఏ ఒక్కదాని మీదనైనా ఉండే ఆసక్తి, అభిరుచి వల్లనే. ఆ కథల్లోని నిర్మాణం వల్ల, పొరలు పొరలుగా సూచించిన అనేక అంశాలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. అంతిమంగా అవి పాఠకుల ఆలోచనా సరళిని ఉన్నతీకరిస్తాయి. పాఠకుల అవగాహనాల ఉన్నతీకరణే కారా రచనలను ప్రాసంగికంగా ఉంచుతుంది.

**

జూన్ 18, 2021

Leave a Reply