(మార్చి 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల కార్యకర్తల ఇండ్ల మీద ఎన్ఐఏ దాడులు మొదలుకావడానికి కొన్ని గంటల ముందు రాసిన వ్యాసం.. అముద్రితం- సంపాదకుడు)


కళ్ల ముందరి సత్యం  తెలుపు న‌లుపుల్లో క‌నిపిస్తుంద‌న్న గ్యారెంటీ ఏమీ లేదు. అది మ‌న చుట్టూ క్రీనీడల్లో కనిపించకుండాపోవచ్చు. ఈ సమస్యను తప్పించుకోడానికి పదునైన చూపు ఉండాలనుకుంటాం. కానీ న్యాయా న్యాయాలపట్ల మన వైఖరులతో, విలువలతోసంబంధం లేకుండా మన చూపు పదునెక్కబోదు. చుట్టూ ఉన్న సంక్షోభాలను, పోరాటాలను అర్థం చేసుకోవడంలో ఈ పరిమితిని  అధిగమించగలమా? లేదా? అనేదే ప్రశ్న.

దేనికంటే మనుషుల్లోని సకల ఉత్తేజాలను పాలకవర్గం నిరంతరం కొల్లగొడుతూ ఉంటుంది. దానికి ఒక పకడ్బందీ పథకంవాళ్ల దగ్గర సిద్ధంగా ఉంటుంది.  మ‌నం గ‌మ‌నించ‌లేక‌పోవ‌చ్చు. కానీ అది మన చుట్టూతా  అమల‌వుతూనే  ఉంటుంది.  అప్ప‌డు మ‌న  న్యాయ దృక్ప‌థం తీవ్ర‌మైన  స‌వాల్ ఎదుర్కొంటుంది.  ఎంత‌గానంటే మ‌న న్యాయా న్యాయ విచ‌క్ష‌ణ పూర్తి మొద్దుబారుపోవ‌చ్చు.  మూడున్న‌ర‌ నెలలుగా రైతులు పోరాడుతున్నావ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం లేదు. కశ్మీరులో 370 రద్దు చట్టం మాత్రం శరవేగంగా పూర్తి స్థాయిలో అమలైపోతోంది. పైగా క‌శ్మీర్ గొప్ప‌గా అభివృద్ధి అయిపోతున్న‌ద‌నే ప్ర‌చారం హోరెత్తిపోతుంటుంది. త‌ర‌త‌రాల స‌మ‌స్య ప‌రిష్క‌రార‌మై క‌శ్మీరీ ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో తుల‌తూగుతున్నార‌నే భ్ర‌మాజ‌నిత స‌త్యం పోటీగా మ‌న‌ల్ని కూడా చుట్టు ముడుతుంది.  ఇక అదే స‌త్య‌మ‌ని చెప్ప‌డానికి కోట్ల గొంతులు పోటెత్తుతాయి. ఈ ర‌ణ‌గొణ ధ్వ‌ని  త‌ప్ప అక్క‌డ  ఏం జరుగుతోందో క‌నీస వార్తలు కూడా బైటికి రావు.   పైగా సత్యం గురించిన సోయి లేనిత‌నం  హుందాగా చ‌లామ‌ణిలోకి వ‌స్తుంది.  ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి?

ఇంత కంటే దారుణమైంది ఇంకోటి చెప్పుకోవచ్చు. అయితే  దాన్ని ఉదాహరణగా కూడా అంగీకరిస్తామా? అనే ప్రశ్నతలెత్తుతుంది. దేనికంటే- పూర్తి భిన్న‌మైనదే కావచ్చు కానీ దండకారణ్యాన్ని సమాజమని అనడానికి మన మేధావుల్లో చాలా మందికిమనసు ఒప్పకపోవచ్చు. అక్కడ ఆదివాసులు ఉంటారనే దానికంటే మావోయిస్టులు తలదాచుకుంటున్న స్థావరమని అనుకొనేవారేఎక్కువ. నిజాలో, అబద్ధాలో తోచింది చెప్పే మీడియాకు కూడా అక్కడ చోటు లేదు. విచిత్రమేమంటే అక్కడ మీడియాకు స్పేన్ ఇచ్చేదిమావోయిస్టులే.  సైనిక బలగాల అధికారులైతే తాము చెప్పేవే అంతిమ వార్తలు కావాలనుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కు ముందుఒకటి అరా వార్తలైనా దండకారణ్యం నుంచి బైటికి వచ్చేవి. ఇప్పుడు అది కూడా లేదు. కేవలం ఎన్ కౌంట‌ర్  వార్తలే. గతంలో ఎవరు,ఎందరు, ఎక్కడి వాళ్లు చనిపోయారనే ప్రాథమిక సమాచారం తెలిసేది. ఇప్పుడు పోలీసు అధికారులు ఆ నెంబర్ కూడా సరిగా చెప్పడంలేదు. మరణాన్ని అంకెల్లోకి కుదించడమేగాక, ఇప్పుడు దాన్నీ అస్పష్టం చేశారు.

కళ్ల ముందరి వాస్తవం దృశ్యాదృశ్య నీడల్లో చిక్కుకపోవడం ఇంటే ఇదే.

ఎంతగానంటే, అక్కడొక సత్యం ఉంటుందని పట్టించుకోనంతగా మనకు దృష్టి మాంద్యం కలుగుతుంది.

0 0 0
దండకారణ్యంలో లాక్ డౌన్ మొద‌ల‌య్యాక‌ ఆపరేషన్ ప్రహార్ పేరుతో అనేక దాడులు జరిగాయి. పోలీసులు ఎంత మందిచంపేశారో, వారు ఎవరో కూడా సరిగా లెక్క లేదు. గత ఏడాది దారుణాల సంగతి అటుంచితే, ఈ ఏడాది పిబ్రవరి చివరి వారంలోఆపరేషన్ సంఘం అనే ఒక పరిమిత కాల అభియాన్ నడిపారు. సరిగ్గా అదే సమయంలో గడ్చిరోలిలో మూడు రోజులపాటు పెద్ద ఎత్తునగాలింపులు జరిపారు. ఇవి సాధారణ చర్యలు కాదు. పూర్తి భారీ స్థాయిలో నిర్వహించారు. ఎంత బీభత్సం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు.ఈ పది రోజులకు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ రెండు ఉద్యమ స్థావరాలపై మానవ రహిత విమానాల, హెలికాప్టర్లదాడులు జరిగాయి.

ఈ సందర్భంగా పోలీసులు ఒక కట్టు కథ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఫొటోలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలోజనతన సర్కార్ అధ్వర్యంలో సాగు చేసిన పంట పొలాలను, మామిడి, పనస తోటలను తగలపెట్టి మావోయిస్టుల ఆయుధాగారాన్నిధ్వంసం చేశామని అధికారులు ప్రచారం చేసుకున్నారు.

యుద్ధంలో విధ్వంసమే కాదు, వల్లారిటీ కూడా అనుబంధంగా సాగుతూ ఉంటుంది. చిత్రకూట్ మహోత్సవ్ పేరుతో కొందరుఆదివాసులతో రాంప్ షో నిర్వహించారు. దండకారణ్యమంటే యుద్ధమే కాదు, ఇది మరో కోణం అంటూ మీడియా గొప్పగా ప్రచారంచేసింది. అక్కడి యుద్దానికి, ప్రజా నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు గుర్తించలేని, వార్తలు బైటికి తేలేని మీడియా ఈ వేడుకలనుఎలా గుర్తించిందో ఊహించడం కష్టమేం కాదు. అంతే కాదు. ఒక చేత్తో యుద్ధం చేస్తూనే ఇంకో చేత్తో ఎబ్బెట్టుగా పోలీసులు శాంతియాత్రను ఇటీవల మరో నిర్వహించారు. పైగా దండకారణ్యాన్ని టూరిస్టు కేంద్రంగా మార్చేస్తామని ప్రకటించారు. అ రకంగా దేశంనట్టనడుమ భారత ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్దానికి ఉండే అన్ని ముఖాలు దండకారణ్యంలో చూడవచ్చు.

దీనికి పరాకాష్ట ఇంకోటి ఉంది. అది గత ఏడాది మార్చి 21న సుక్మా జిల్లాలో జరిగింది. ఆ రోజు మావోయిస్టులకు, ప్రభుత్వబలగాలకు జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. కొందరు పోలీసు, అర్ధ సైనిక బలగాలతోపాటు నలుగురు భారత సైనికులు కూడమరణించినట్లు అప్పట్లోనే అధికారులే ప్రకటించారు. కానీ అది లోకానికి వార్త కాలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం దండకారణ్యంలో జరుగుతున్న దాడుల్లో నేరుగా పాల్గొంటోంది.ప్రభుత్వం ఇంత కాలం మభ్య పెడుతూ వచ్చింది. కానీ సత్యం చాలా నిప్పులాంటిదే కాదు. విచిత్రమైనది కూడా. అనేకరూపాల్లో మారి ఎప్పటికో, అనూహ్యంగా వైటపడుతుంది. అంత వరకు తెలియకుండా పోయినదంతా ఒక్కసారిగా భళ్లున తెరుచుకుంటుంది.

దండకారణ్యంలో 2018 నుంచి మిలటరీ దాడి జరుగుతోందని విప్లవోద్యమం చెబుతూ వచ్చింది. కానీ సైన్యంలోని ఉన్నతాధికారులుకూడా యుద్దానికి సిద్ధంగా లేరని వార్తలు వచ్చేవి. చత్తీస్ ఘ‌డ్  ప్రభుత్వం కూడా సైనిక చర్యలను కొట్టిపడేసింది. కానీ ఇవన్నీ అబద్ధమని ఈ దాడిలో తేలిపోయింది.

గడ్చిరోలిలో సి-60 లాగే చత్తీస్ ఘ‌డ్  సాయుధ బ‌లగాలల్లో జిల్లా రిజర్వు గార్జులు (డీఆర్జీ) అనే విభాగం ఉంది. దానిలోభారత సైనికులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సైన్యం సరిహద్దులో ఉంటుందని మామూలుగా ఎవరైనా అనుకుంటారు. కానీఇప్పుడది వేరే పేరుతో దండకారణ్యం చేరుకున్నది. ఇప్పటికే అక్కడ అనేక రకాల పోలీసు, అర్ధ సైనిక బలగాలు యుద్ధంలో ఉన్నాయి. ఈమాట అంటే యుద్ధమా? అదెక్కడ? అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పించుకోవాలని కూడా చూడకపోవచ్చు.

యూపీఏ ప్రభుత్వం ఆ రోజుల్లో “గ్రీన్ హంటా? అదేమిటి? అలాంటిదేమీ లేద’ని బుకాయించింది. స్వయంగా దాన్ని ఆరంభించినచిదంబరంగారు తడుముకోకుండా అబద్ధమాడేశారు. అప్పుడూ అలౌట్ వార్ అన్నారు. ఇప్పుడు అంతిమ యుద్ధమని అంటున్నారు. ఈయుద్ధంలో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడా ఇదొక్కటే. ఆ రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో బీజేపీ ఉండవచ్చు. ఇప్పుడు అటూఇటూ మారి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ ఆరంభించిన అపరేషన్ గ్రీన్‌హంట్ మూడు దశలను దాటి చిదంబరం నుంచి అమిత్‌షాకాలానికి అది ఆపరేషన్ సమాధాన్ అయింది. అప్పుడూ ఇప్పుడూ పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఈఅభియాన్లో భాగమయ్యాయి. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, అమిత్‌షా నేతృత్వంలో సాగుతున్న యుద్ధంలో సరిహద్దుల్లో ఉండాల్సిన సైనికులు డీఆర్జీ అనే స్థానిక విభాగంలో భాగమయ్యారు. కాకపోతే ఇంత కాలం దాపున ఉన్నదాన్ని అధికారులే తెర చించిబైటికి తెచ్చారు. బీజేపీకి ఏ విషయంలోనూ చాటుమాటు వ్యవహారం నచ్చదు.

అసలు ఈ డీఆర్జీ పుట్టుకలో పురాణ వైచిత్రిని చూడవచ్చు. ఒక రూపంలో మరణించి మరో రూపంలో జన్మించడం ఆ కథల్లోచూస్తాం. చత్తీస్ ఘ‌డ్‌ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అనేక రూపాలు మార్చుకుంటూ ఇక్కడికి వచ్చింది. అప్పట్లో దండకారణ్యంలో ప్రభుత్వంతయారు చేసిన హంతక మూక సల్వాజుడుం అనేక ఘోరాలకు పాల్పడింది. దాని మీద దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వచ్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో అది రద్దయింది. అదే. 2016లో డీఆర్జీగా మారింది. దీనిలో సల్వాజుడుంలో పని చేసిన ఆదివాసులను,పోలీసులను భాగం చేశారు. ఆ తర్వాత సైన్యాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ సంగతి అనేక సందర్భాల్లో విప్లవకారులు ఆరోపిస్తూవచ్చారు. మార్చి 21, 2020 ఘటనతో అది నిజమని తేలింది.

2020 అక్టోబర్లో అమిత్‌షా అధ్యక్షతన అపరేషన్ సమాధాన్‌లో  భాగంగా అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అందులోఆయన పోలీసు అధికారుల మీద కోప్పడ్డట్లు పత్రికల్లో వచ్చింది. మావోయిస్టులను పూర్తిగా ఎందుకు నిర్మూలించలేకపోతున్నారనిప్రశ్నించాడట. అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున అన్ని రకాల సైనిక బలగాలను, ఆయుధాలను సమకూరుస్తామని హామీ ఇచ్చాడు.కేవలం దండకారణ్యం ఒక్కటే కాదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నిటికీ. ఇప్పటికే ఒక్క దండకారణ్యంలోనే సుమారు ఏడు లక్షలబలగాలు ఉన్నట్లు అక్కడి నుంచి వార్తలు వచ్చేవి. ఈ కొత్త ఏర్పాటులో రెండు మూడు రెట్లు ఎక్కువ బలగాలను దింపేందుకు సిద్ధమవుతున్నట్లుపత్రికల్లోనే వచ్చింది. దేనికంటే 2021 జూన్ నాటికి  మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలనే వ్యూహాత్మక నిర్ణయం ఆ సమావేశంలోనేతీసుకున్నారు. దేశంలోని ఉద్యమ ప్రాంతాల్లో, బైటా మొత్తంగా ఆపరేషన్ సమాధాన్ నడిచినా, దండకారణ్యంలో మాత్రం దాన్ని అంతకముందే మొదలైన ఆపరేషన్ ప్రహార్ గానే ప్రకటించారు.

మార్చి 21, 2020 ఘటనలో భారత సైనికులు పాల్గొన్నాక మిలటరీ జనరల్ నరవాణె మాట్లాడుతూ ఇక నేరుగా సైన్యాన్నిదించుతామని అన్నాడు. చైనా, పాకిస్తాన్ అనే రెండు ప్రధాన శతృవులతోపాటు దేశంలోని అంతర్గత సమస్యను ఎదుర్మోవాల్సి ఉందని, ఆరకంగా ఈ రెండున్నర శతృవులతో తలపడేందుకు దీర్హకాలిక వ్యూహం సిద్ధం చేస్తున్నామని అన్నారు. విప్లవోద్యమ శక్తిని, ప్రభావాన్నివిస్తరణను ఇక్కడ చూడాలి.

ఒకసారి ఈ దండకారణ్య దృశ్యాన్ని దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న అనేక ర‌కాల విధ్వంసాల‌తో, దాడుల‌తో, అణ‌చివేత‌ల‌తో పోల్చి చూడండి. అన్నీ ఒకే పెద్ద దృశ్యంలో ఇమిడిపోయే  భ‌యాన‌క స‌న్నివేశాల‌ని త‌ప్ప‌క అర్థ‌మ‌వుతుంది.  క‌శ్మీర్ మీద యుద్ధాన్ని,  దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పోరాటాల మీద,పీఏఏ వ్య‌తిరేక అందోళనల మీద దాడుల్ని,  వేలాదిగా యుఎపీఏ కేసులు-అరెస్టుల‌ను, ఇప్పుడు రైతాంగ ఉద్యమం మీద నిర్బంధాన్ని, కుట్ర‌ల‌ను.. ఇంకా ఇలాంటి వాట‌న్నిటినీ ఒక చోటికి చేర్చి చూస్తేగాని వాళ్లు చెప్పే *అఖండ భార‌త్‌* మ‌న‌కు చ‌క్క‌గా అర్థం కాదు.  ఇది ఇప్ప‌టికిప్ప‌డు మొద‌లైన‌ది కాదు. దీన్ని ఏ పేరుతోనైనా పిలుచుకోవ‌చ్చు. కానీ మంద్ర‌స్థాయి యుద్ధం అనుకుంటే కాస్త స్ప‌ష్టంగా ఉంటుంది.  2010 నుంచే మంద్రస్థాయి యుద్ధమనే మాట భారత దేశంలో, ముఖ్యంగా తెలుగు సమాజాల్లో ప్రచారంలోకివచ్చింది. అది ఎలా ఉండబోతోందో విశ్లేషణలు వచ్చాయి. ఆ వైపు నుంచి చూడండి. ఈ స‌క‌ల విధ్వంసాలు, వికృత క్ర‌మాలు, అణ‌చివేత రూపాలు, దోపిడీ దౌర్జ‌న్యాలు అనేక కోణాల్లో పూర్తిగా క‌నిపిస్తాయి. 

ఇంత‌గా చెప్పినా అప్ప‌ట్లో  చాలా మంది వినిపించుకోలేదు. ఇప్ప‌టికీ  సిద్ధంగా లేరు. ఇదంతా మావోయిస్టుల సమస్యలే మనకెందుకు అనుకున్నారు. అనుకొని సంతృప్తిగా ఉండ‌ద‌ల్చుకున్నారు. కానీ   తీవ్రస్థాయి ఆర్థికసంక్షోభాలను తీసుకొచ్చి, ప్రశ్నించిన వాళ్లందరినీ అణచివేసి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడమే ఈ యుద్ధ తంత్రం. ఇప్పుడది దేశమంతావిస్తరించింది. అందులో ఒక స్పష్టమైన ఆర్థిక ,  రాజకీయ, సాంస్కృతిక, సైనిక విధానాలు ఉన్నాయి. సరిగ్గా ఇవాళ దేశంలో అవి అన్నిరంగాల్లో అమలవుతున్నాయి. మినహాయింపే లేకుండాపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీక‌రించ‌డం, క్రూరమైన రైతాంగచట్టాలు తేవడం, ఆ ఉద్యమంపై నిర్బంధం అమలు చేయడం, అందరిపైనా యుఏపీఏ కేసులు పెట్టడం, పోరాటాలను దెబ్బతీయడానికికుట్రలు పన్నడం, దేశాన్నంతా ఎన్ఐఏ జలైడపట్టి ప్రజాస్వామిక వాదుల మీద దాడులు చేసి, తన నిఘా నీడలోకి తీసికెళ్లడం, అంద‌రినీ భ‌య కుహ‌రంలోకి తోసివేయ‌డం.. అన్నీమంద్రస్థాయి యుద్ధ తంత్రంలో భాగం. దీన్ని నానాటికీ తీవ్రస్థాయిలో పాలకులు రుజువు చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామికవాదులు, పీడితఅస్తిత్వవాదులు, ప్రజల గురించి ఆరాటపడేవాళ్లూ గుర్తిస్తారా లేదా? అనేదే ప్రశ్న. 

Leave a Reply