వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం

దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం నుండి నారాయణపుర్‌ జిల్లా సోన్‌పుర్‌ వరకు కోత్రి, పాముల గౌతమి నదులపై వంతెనలను నిర్మిస్తూ రోడ్ల నిర్మాణం రూ.65 కోట్ల ఖర్చుతో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వపు ‘వామపక్ష ఉగ్రవాద’ ప్రభావిత ప్రాంతాలలో అకాంక్ష జిల్లాల పేరుతో చేపడుతున్న వివిధ పథకాలలో భాగంగా వీటి నిర్మాణం జరుగుతోంది.  పరాల్‌కోట్‌ వద్ద పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కోత్రి నదిపైవంతెన, రోడ్డు నిర్మాణం, వాటికి రక్షణగా కాందాడి, చిత్రం, పరాల్‌కోట్‌ వద్ద వీ.ఎస్‌.ఎఫ్‌. క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు, వంతెనలు అమూల్యమైన ప్రాకృతిక వనరుల తరలింపుకు, వాటి రక్షణకు పోలీసుల, సంపన్నుల అనందానికి పర్యాటక కేంద్రాలు నిర్మిస్తున్నారు. బస్తర్‌ డివిజన్‌లో సిలింగేర్‌, గోంపాడ్‌, గోండేరాజ్‌, బుర్గిల్‌, వెచ్చపాల్‌, వెచ్చఘాట్‌ వరకు దాదాపు 183 చోట్ల ప్రజలు నెలల తరబడిగా నిరవధిక ధర్నాలు కొనసాగిస్తున్నారు.

            కార్పొరేటు వర్గాల దోపిడీని  అడ్డుకుంటున్న విప్లవోద్యమ నిర్మూలనకై కేంద్రంలోని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘సమాధాన్‌’ వ్యూహాత్మక సైనిక ఆపరేషన్‌కు రాష్ట్రంలోని భూపేశ్‌బఘేల్‌ నాయకత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది.  మాకు  పోలీసు క్యాంపులు వద్దు, రోడ్లు-వంతెనలు వద్దు, అడవులు-భూములు-జలాలపై మాకే అధికారం వుండాలి  అంటూ వెచ్చఘాట్‌ చుట్టు పక్కల వున్న దాదాపు 70 గ్రామాల ప్రజలు గత 2021 డిసెంబర్‌ 7 నుండి నిరవధిక ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నా నిర్వహణకు వారు పోరాట కమిటీని ఏర్పర్చుకున్నారు. ఆ ప్రజాధర్నాకు 2022 డిసెంబర్‌7తో యేడాది పూర్తయింది.

            అదివాసీ ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ప్రజా ధర్నాకు యేడాది నిండిన సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని, ప్రజా వ్యతిరేక అణచివేత చర్యలను ప్రపంచం ముందుంచడానికి  భారీ ఎత్తున వార్షిక సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభ జయప్రదం కావడానికివారు దేశ వ్యాపిత పీడిత సముదాయాల, సెక్షన్ల, విద్యార్థుల, రైతుల, కార్మికుల, ప్రజాస్వామికవాదుల మద్దతును విస్తృతంగా కూడగట్టుకొని డిసెంబర్‌ 7 నుండి 10 వరకు ప్రజాసభను నిర్వాహించారు. 

            వెనక్కి వెళితే..2021 డిశంబర్‌ 7నాడు కోత్రి నది, వెచ్చాఘాట్‌ చుట్టు పక్కల గల 22 గ్రామాల ప్రజలు వెచ్చఘాట్‌ వద్ద 2 వేల మంది జమై భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వాహించి మొదటిసారి తమ డిమాండ్లను వెల్లడిరచారు. తమ డిమాండ్లు సాధించుకునే వరకు ప్రజా పోరాటాన్ని కొనసాగించాలని నిరవధిక ధర్నా ప్రారభించారు. వారి పోరాట అనుభవంలో వారికి ఇదొక కొత్త అనుభవం.

డిమాంద్స్‌:

1. ప్రకృతి వనరుల తరలింపుకై కోత్రి నదిపై ప్రభుత్వం తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని, మరోడా నుండి సోన్‌పూర్‌ వరకు రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలి.

2. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రాంతాలలో నిజాయితీగా ప్రభుత్వం పెసాను అమలుచేయాలి. గ్రామసభల అనుమతి లేకుండా తలపెట్టిన చిత్రం, కాందాడి వద్ద బీ.ఎస్‌.ఎఫ్‌.క్యాంపు ఏర్పాటును రద్దు చేయాలి.

3. మా పూర్వీకుల వారసత్వ స్థలమైన (ఆనల్‌ జాగా) పరాల్‌కోట్‌ (చిత్రం గ్రామం) వద్ద పర్యాటక కేంద్ర ఏర్యాటును రద్దు చేయాలి.

నిర్దిష్టంగా ఈ మూడు డిమాండ్లతో పోరాటం ప్రారంభించిన ప్రజలు, రాబోయే జనగణనలో తమకు  హిందువులుగా నమోదు చేయకూడదని, తమ అస్థిత్వాన్ని తుడిచివేసే మతోన్మాద చర్యలకు ఒడిగట్టకుండా తమది ప్రకృతి మతం అని  నమోదు చేయాలనే న్యాయమైన డిమాండ్‌ చేర్చారు. ఈ నాలుగు కోర్కెలను సాధించుకోడానికి సంవత్సరకాలంగా వందల సంఖ్యలో అదివాసీ ప్రజలు రిలే ధర్నా నిర్వహిస్తున్నారు.

            ప్రజల న్యాయమైన డిమాంద్స్‌కు మద్దతునిస్తూ కాంకేర్‌ జిల్లాలోని వెనుకబడిన కులాల(బీ.సీ.) సంఘం, హల్బీ ఆదివాసీ సంఘం, సర్వ అదివాసీ సమాజ్‌, అదివాసీ విద్యార్థి సంస్థలు, చత్తీస్‌గఢ్‌ బచావో అందోళన్‌ లాంటి ప్రగతిశీల సంస్థలు, మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామికవాదులు సంఫీుభావాన్ని ప్రకటించాయి.

            వెచ్చఘాట్‌ ప్రజాపోరాట డిమాండ్లలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. పెసా చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తున్న  ప్రజలు పెసా (1996) దినాన్ని పురస్కరించుకొని 2021 డిసెంబర్‌ 24న వెచ్చఘాట్‌ ధర్నా స్థలంలో బహిరంగసభ జరుపుకున్నారు. అ సభకు 2 వేల మంది ప్రజలు హజరయ్యారు. అ సభలో ఆదివాసీ ప్రజలు అనేక సంవత్సరాలు పోరాడి రాజ్యంగంలోని 5వ షెడ్యూల్‌కు సవరణలు చేయించి పెసాను సాధించుకున్నారు. కానీ, ఆ పెసాను ఏ రాష్ట్రంలోనూ అధికారులు నిజాయితీగా అమలు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1996 నాటి పెసా (గ్రామసభ) అధికారాల నుండి ఆదివాసీలను వంచిస్తూ, గ్రామసభ అధికారాలను పరిగణనలోకి తీసుకోకుండా అనేక ప్రజా వ్యతిరేక ప్రాజెక్టులను, పరిశ్రమలను, తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలను రక్తసిక్తం చేస్తున్నారు. వాటి అమలు కోసం పోలీసు, అర్ధ సైనిక బలగాల క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. సంపన్న వర్గాల వినోదం కోసం  ఆదివాసుల మధ్య అరాచక సంస్కృతిని, లైంగిక విశృంఖలత్వాన్ని ప్రోత్సహించే పర్యాటక కేంద్రలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఆదివాసులు వ్యతిరేకిస్తూ పలు పంచాయితీల గ్రామసభలలో చేసిన తీర్మానాలను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు ఆదివాసీల సంరక్షకులు. కానీ నిజానికి ఏ గవర్నర్‌ ఏ రాష్ట్రంలో ఆదివాసుల హక్కులను కాపాడడం లేదు.

            ప్రజల డిమాండ్‌లను ఖాతరుచేయని ప్రభుత్వపు మొండి వైఖరికి నిరసనగా పఖాంజుర్‌, బాందే రాష్ట్ర జాతీయ రహదారిపైన మరోడా గ్రామం వద్ద 7 వేల మంది ప్రజలు చక్కాజామ్‌ చేసి వాహనాల రాకపోకలను అడ్డుకుని తమ డిమాండ్లను తెలిపారు. ప్రజల చక్కజామ్‌ను అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎస్‌.డీ.ఎమ్‌.,  తహశీల్‌దార్‌ కలిసి పోలీసులతో లాఠీచార్జ్‌ చేయిస్తామని, అరెస్టు చేయిస్తామని బెదిరించినప్పటికీ ప్రజలు దృఢంగా, మిలిటెంట్‌గా చక్కజామ్‌ నిర్వహించి రాష్ట్రపతికి, గవర్నర్‌కు తమ డిమాండ్ల పత్రాన్ని పంపాలనీ ఎస్‌.డీ.ఎమ్‌.కు అందజేశారు.

            గత సంవత్సర కాలంగా వెచ్చఘాట్‌ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇండ్ల నుండి బియ్యం, కూరగాయాలు, నూనె, పప్పులు సహ తిండి పదార్థాలన్నీ తెచ్చుకొని స్వచ్ఛందంగా ధర్నాలో వంతుల వారిగా పాలుపంచుకుంటున్నారు. తమ అవసరాలకుగాను వారు దాతల నుండి చందాలు సేకరించుకుంటున్నారు. వారంతా అదివాసులు, రైతులు కావడంతో తమ వ్యవసాయ పనులకు, అటవీ ఉత్పత్తుల సేకరణకు నష్టం వాటిల్లకుండా, ధర్నా నిలిచిపోకుండా అన్ని కుటుంబాలు బాధ్యతపడుతూ వంతులవారిగా ధర్నాలో కూచోవడం ఒక కొత్త పోరాట అనుభవాన్ని అందిస్తున్నది. మహిళలు సైతం అందులో భాగం కావడం వారి రాజకీయచైతన్యాన్ని పెంచడానికి తోడ్పడుతోంది. మండుతున్న వేసవి ఎండలలో, కుండపోతగా కురిసే వర్షాలలో,  వజ వజ వణికించే శీతాకాలం చలిలో సైతం ప్రజలు వెచ్చఘాట్‌ ప్రజా పోరాటంలో పాలు పంచుకోవడం వారి జీవన్మరణ సమస్యల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. వారు తమ భూముల కోసం, జీవిక కోసం, వనరుల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ, తమ పిల్లల భవిషత్తు, దేశ ప్రజల అవసరాలు వారిని పోరాటానికి అనివార్యం చేశాయి.

            వెచ్చఘాట్‌ ప్రజా ధర్నా స్థలం ప్రజా రాజకీయ కార్యకలాపాల వేదికగా కొనసాగుతోంది. ప్రజలలో సామూహిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నది. వారంతా ప్రతి యేటా తమ తమ ఊళ్లలో జరుపుకునే మాడియా రాజ్‌ స్థాపనా దినం ఫిబ్రవరి 10ని (1910) భూంకాల్‌ దివస్‌గా వెచ్చఘాట్‌ వద్దే జరుపుకోవడం సామ్రాజ్యవాదుల దోపిడీని తెలుసుకోవడానికి తోడ్పడిరది. ప్రతి యేటా గ్రామ గ్రామాన పాటించే 8 మార్చ్‌ అంతర్జాతీయ శ్రామిక మహిళ దినాన్ని సైతం ధర్నా స్ధలంలో పెద్ద ఎత్తున స్రీ-పురుషులు జమై జరుపుకున్నారు. తద్వారా ఆరోజు ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సామూహికంగా చర్చించుకోవడానికి చాలా తోడ్పడిరది. ఆగస్టు9 అంతర్జాతీయ మూలవాసుల దినాన్ని కూడ వారు జరుపుకున్నారు. రోజూ జరిగే సాంసృతిక కార్యకలాపాల ద్వారా వారికి వినోదం సమకూరుతోంది. నిజంగా ప్రతి ధర్నా స్థలం ఒక సామూహిక నివాస స్థలంగా, పోరాట కేంద్రంగా మారిందనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.

            పై నాల్గు డిమాండ్లతోతో పాటు అనేక అదివాసీ ప్రాంతాలలో గ్రామసభల అనుమతి లేకుండానే ఏర్పాటు చేసిన పోలీసు, అర్ధ సైనిక బలగాల క్యాంపులు ఎత్తివేయాలి, సార్మన్‌గూడ, ఎడ్సుమెట్ట, సిలింగేర్‌లలో పోలీసులు కొనసాగించిన నరసంహారాల దోషులను, తాడిమెట్లతోపాటు మరో రెండు ఊళ్లలో వందలాది ఆదివాసీల పూరిళ్లకు నిప్పంటించిన ఖాకీ నేరగాళ్లను శిక్షించాలని, అదివాసీ పోరాటమహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన పోలీసులను శిక్షించాలని, 2006 ఆదివాసుల, గైరాదివాసుల హక్కుల గుర్తింపు చట్టం అనుసరించి తమ భూములకు పట్టాలు ఇవ్వాలని  2022 మార్చి 24న అనేక ఆదివాసీ సంస్థలు, ఇతర పోరాటసంస్థలు ‘‘ఛలో విధానసభ-ఛలో రాయ్‌పుర్‌’’ అంటూ ప్రజా ర్యాలీ నిర్వహించారు. తమను పోలీసులు రాయపుర్‌ వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ వారు పోలీసుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించి తమ డిమాండ్లను మీడియా ముందు చెప్పుకున్నారు. ప్రజాహిత మీడియా మితృలు ప్రజల డిమాండ్లను తమ శక్తి మేరకు ప్రచారం చేశారు.

            వెచ్చఘాట్‌ ధర్నా ప్రజలు సోదర ప్రజల సిలింగేర్‌, హస్‌దేవ్‌, అందాయ్‌, వెచ్చపాల్‌ మున్నగుచోట్ల జరుగుతున్న క్యాంపు వ్యతిరేక ప్రజాధర్నాలకు, కార్పొరేట్‌ వర్గాల గనుల తవ్వకాల వ్యతిరేక పోరాటాలకు తమ సంఫీుభావాన్ని తెలుపుతున్నారు. పొరుగున వున్న మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లాలో సుర్జాగఢ్‌ గనుల తవ్వకాలు, వాటి విస్తరణను ఖండిస్తున్నారు. సోదర అదివాసీ, పీడిత ప్రజా పోరాటాలతో మేమున్నాం అంటూ నినదిస్తున్నారు.

            తమ న్యాయమైన పోరాటాన్ని డిశంబర్‌ 2022 సంవత్సరం పొడవునా ప్రజలు పోలీసుల వేధింపులు, అరెస్టులు, స్థానిక బీ.జే.పీ., కాంగ్రెస్‌ దళారీ నాయకుల కుట్రలను వమ్ముచేస్తూ పోరాట రాజకీయాలలో తర్పీదు పొందుతూ పోరాటం కొనసాగించారు.

            తమ న్యాయమైన పోరాటానికి సంవత్సరం నిండిన సందర్భంగా డిసెంబర్‌ 7నుండి పెద్దఎత్తున ప్రజలు దూర దూర ప్రాంతాల నుండి కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు. 9, 10 తేదీలలో వేలాది మందితో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. వెచ్చఘాట్‌ పోరాట వార్షికసభకు ఆహ్వన కమిటీని ఏర్పరచుకున్నారు. సభను జయప్రదంగా జరుపుకోవడం కోసం సులువుగా అందుబాటులో వున్న సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకున్నారు. సహజంగానే ప్రధాన స్రవంతి మీడియా తొలి నుండి ఇక్కడ జరుగుతున్న అదివాసీ పోరాటాలపట్ల శీతకన్నుతోనే వుండడం కాకుండా పోరాటాలను పక్కన పెట్టి మావోయిస్టుల సమస్యను ముందుకు తెచ్చి పోలీసుల గొంతును అలుపు, సొలుపు లేకుండా వినిపిస్తున్నారు. మరోవైపు వెచ్చఘాట్‌ పోరాట ప్రాంత గ్రామాలలోకి వందలాది కార్యకర్తలతో కూడిన ప్రచార టీంలు వెళ్లి విస్తృతంగా సంప్రదాయ పద్ధతులలో ప్రచారం చేశాయి. వంటచెరకుతో సహ ఇవ్వగలిగినంత సహాయాన్ని అందించి సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి. వివిధ కూడళ్లలో పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా, బ్యానర్ల ద్వారా ప్రచారం కొనసాగించారు.

            డిసెంబర్‌ 9న సంవత్సర కాల ఉద్యమాన్ని  పోరాట కమిటీ సమీక్షించింది. లోపాలను గుణపాఠంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు అదివాసీ వ్యతిరేక విధానాలకు పథకాలకు వ్యతిరేకంగా, ఫాసిస్టు నిర్బంధాన్ని ఎదుర్కొంటూ మిలిటెంట్‌గా పోరాటాలను కొనసాగించాలనినిర్ణయించింది.

            డిసెంబర్‌ 10 అంతర్జాతీయ మానవ హక్కుల రోజున, వెచ్చఘాట్‌ పోరాట వార్షికసభ ఉదయం 9 గంటలకు ధర్నా స్థలం నుండి వెటియాచౌక్‌ వరకు దాదాపు 15 వేల మందితో జరిగిన ర్యాలీతో ప్రారంభమైంది. ఆదివాసీల సాంప్రదాయక నృత్యాలు, పోరాట నినాదాలతో ‘‘పోలీసు క్యాంపులు మాకు వద్దు’’ రోడ్లు-వంతెనలు మాకు వద్దు’’ ‘‘మీ లాభాల కోసం, మేం విస్థాపితులం కాము’’ ‘‘మమ్ములను మా గ్రామాల నుండి, సాగు భూముల నుండి, అడవుల నుండి తరిమికొట్టి ‘కార్పోరేట్‌ వర్గాలకు అప్పగించే పథకాలకు బలి చేయవద్దు’’, పోలీసు-దళారీ రాజకీయ/తెగ నాయకుల కుట్రలకు బలిచేయవద్దు’’   అంటూ ప్రజలు నినదిస్తూ సభ స్థలం చేరుకున్నారు. నూతనంగా ఏర్పడిన మాన్‌పుర్‌-మొహలా జిల్లా నుండి, పొరుగునవున్న గడ్‌చిరోలీ జిల్లా నుండి, నారాయణ్‌పుర్‌ జిల్లాలోని కుతుల్‌, సోన్‌పుర్‌, నెల్‌నార్‌ ప్రాంతాల నుండి, కాంకేర్‌ జిల్లాలోని పఖాంజూర్‌, కోయిల్‌బేడ, దుర్గ్‌ కోందల్‌, అంతాగథ్‌, భానుప్రతాప్‌పుర్‌ బ్లాక్‌ల నుండి దాదాపు 15వేల మంది ప్రజలు పోరాట ఉత్సాహంతో వచ్చి సభలో పాల్గొన్నారు. సభను విజయవంతం చేయడానికి పోరాట గ్రామాల నుండి ఆరు వందల మంది వాలంటీర్స్‌, 150 మంది సాంసృతిక కళాకారులు హాజరయ్యారు.

            బస్తర్‌ డివిజన్‌లోని సిలింగేర్‌, వెచ్చపాల్‌, గోర్నం గొంపాడ్‌, నందరాజ్‌ పహద్‌, బెహరవేడ, ఆకటేడ, ఇరుక్‌బట్టి ప్రజా ధర్నా స్థలం నుంచి బస్తర్‌ డివిజన్‌లో సిలింగేర్‌, గోంపాడ్‌, గోండేరాజ్‌, బుర్గిల్‌, వెచ్చపాల్‌, వెచ్చఘాట్‌ వరకు దాదాపు 183 చోట్ల ప్రజలు నెలల తరబడిగా నిరవధిక ధర్నాలు కొనసాగిస్తున్నారు.   బస్తర్‌ సహా అన్ని అదివాసీ  ప్రాంతాలలోని అమూల్యమైన ప్రాకృతిక వనరులను, ప్రజలను విచ్చలవిడిగా దోచుకునే కార్పొరేట్‌ అనుకూల విధానాలను తిప్పికొట్టాలని, వారికి రక్షణగా ఉక్కు కోటలు నిర్మించుకొని కాపలా కాస్తున్న పోలీసు, అర్థ సైనిక బలగాలను ప్రతిఘటించాలని,  అడవుల కార్పొరేటీకరణకు సైనికీకరణకు  వ్యతిరేకంగా  ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.   సమైక్యంగా ఐస్తర్‌ జన్‌ సంఘర్ష్‌ సమితి నాయకత్వంలో పోరాడుదామని  ఒక కొత్తవేదికను ప్రకటించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల డిమాండ్లను, రాజ్యాంగం ద్వారా లభించిన 5వ షెడ్యూల్‌, పెసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేస్తున్న అర్ధ సైనిక బలగాల క్యాంపులను, రోడ్ల-వంతెనల నిర్మాణాన్ని ప్రజా ధర్నా స్థలాలపై దాడులను, ప్రజలపై  దౌర్జన్యాలను, మహిళలపై అత్యాచారాలను అడ్డుకుందాం అంటూ ముక్తకంఠంతో నినదించారు. ‘పడియోర’ (పూర్వ పోరాట యోధులు) దారిలో పోరాడాలని పిలుపునిచ్చారు.

            ఈ సభకు ఢల్లీి, రాయ్‌పుర్‌ నుండి అనేక మంది ప్రజాస్వామికవాదులు, మేధావులు హాజరయ్యారు. అస్సాం నుండి లోకసభకు ఇండిపెండెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ పార్లమెంట్‌సభ్యుడు, ప్రముఖ అదివాసీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరవింద్‌ నేతాం కూడ

హాజరై వెచ్చఘాట్‌ ప్రజల పోరాటానికి మద్దతు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులను కాపాడడం మానవాళి మనుగడకు, జీవనోపాధికి అనివార్యం అంటూ వర్తమానం, భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆదివాసుల నుంచి పోరాటాలను నేర్చుకోవడానికి కూడ  తరచుగా వస్తుంటామని ఢల్లీి, రాయ్‌పుర్‌ల నుండ విచ్చిన ప్రజాస్వామికవాదులు, మేధావులు తమ సందేశాలు వినిపించారు.

            ఈ ప్రాంతంలోని వెచ్చఘాట్‌ వద్ద చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద బహిరంగసభ జరగడం, సభలో పోరాట సందేశాన్ని ఇస్తూ పలువురు పెద్దలు భరోసా ఇవ్వడం, ప్రజా కళాకారులు మధ్య మధ్యలో సంప్రదాయ నృత్యాలతో పాటలు వినిపించడం స్థానిక ప్రజల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. పోలీసుల కళ్ల ముందు కిలోమీటర్ల పొడవుతా సాగిన ర్యాలీ, దిక్కులు పిక్కటిల్లే నినాదాలు, నిర్భయంగా వక్తల సందేశాలు ఆదివాసీ ప్రజలలో ఒక కొత్త శక్తిని నింపాయి.

            పరల్‌కోట, కోత్రినది చుట్టు పక్కల గ్రామాల ప్రజలలో 1824-25లో అంగ్ల్ల-మరాఠా రాజులతో తమ పూర్వీకుడు, గొప్ప ప్రజా యోధుడు గేంద్‌సింగ్‌ జరిపిన యుద్ధం కదలాడిరది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుండాదుర్‌ నాయకత్వంలో పోరాడి మాడియా రాజ్యాన్ని స్థాపించుకున్న 1910 నాటి గొప్ప భూంకాల్‌ పోరాటం గుర్తొచ్చింది. గడ్‌చిరోలీ ప్రాతంలో అమర పోరాట యోధుడు సడ్మెక్‌ బాబురావు నాయకత్వంలో సాగిన సాయుధ పోరాటం స్ఫూర్తినిచ్చింది.  గొప్ప పోరాట వారసత్వం వున్న వివిధ అదివాసీ సముదాయాలకు చెందిన మాడియా, గోండ్‌, మురియా, హల్బీ ప్రజలు తమ పోరాట యోధుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.              2023 ప్రజా పోరాటాలకు ముఖ్యంగా అదివాసీ ప్రజా పోరాటాలకు పరీక్షా కాలం. ప్రత్యేకించి వెచ్చఘాట్‌ లాంటి ప్రజా పోరాటాలకు పరీక్షా సమయం. ఈ సంవత్సరం మన దేశం జీ-20 దేశాల సమూహానికి అధ్యక్షత వహిస్తోంది. మన దేశ ప్రధాని అదో వరంగా భావిస్తూ తన మేక ్‌ఇన్‌ ఇండియా కలలను సాకారం చేసుకోవడానికి పూనుకున్నాడు. ఇప్పటికే ఒడిశాలో పెట్టుబడిదారుల సభ జరిగి రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగిపోయాయి. వీటిలో అధిక శాతం ఆదివాసీ అటవీ ప్రాంతాలలో గనుల తవ్వకాలపైనే పెట్టారు. మరోవైపు ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌లో అలాంటి సభ జరుగనుంది. 1999లో తీవ్రసంక్షోభం మధ్యనే జీ-20 కూటమి ఏర్పడిరది. అడవులను ధ్వంసం చేసే, పర్యావరణాన్ని నాశనం చేసే జీ-20 సంపన్న దేశాల సంక్షోభానికి మన దేశాన్ని బలిపెడుతున్న మోదీ ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని అనుకున్నాడు.  పర్యాటక రంగాన్ని తీర్చిదిద్ది డాలర్లు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు.  మోదీ కుట్రలకు బలి కాకుండా ప్రజా పోరాటాలను తీవ్రతరం చేయడం ద్వారానే మన దేశ అమూల్య వనరులను, వర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం.

Leave a Reply