అకాశంలో ఐదు నక్షత్రాలు
ఒకదాని తర్వాత ఒకటిగా
నేల రాలిన వార్త!
 
నన్ను శోక సముద్రాన ముంచెత్తింది!
గుండె పగిలేలా ఏడ్వాలని... కానీ
కంటనీరు ఎప్పుడో ఇంకిపోయింది
గుండె రాయిలా మారింది!
 
స్పందన లేనట్టు
నిశబ్దం నన్ను ఆవరించింది!
 
ఏమీ తోచక అకాశంవైపు చూశాను
మేమున్నామంటూ
చంద్రుడు మసకచీకటిలో తొంగిచూస్తున్నాడు!
పక్కనే ధృవతార మిణుకు మిణుకుమంటుంది!
అడవి మళ్లీ అంటుకున్నది
 
అ దావానలం కోటి దీపాల వెలుగై
చీకటి దారిని చీలుస్తున్నది!
 
నరేంద్రుడు జనప్రభంజనంలో
రవితేజంలా వెలుగుతున్నాడు!
 
నిశబ్ద నిశీధి నుండి బయటపడి
సముద్రంవైపు చూశాను!
 
సముద్రంలో అల్లకల్లోలం
తుఫాను గాలులు విరుచుకుపడే ఉప్పెన
చెట్లు పడిపోతున్నాయి!
ఇళ్లు కుప్పకూలిపోతున్నాయి!
 
వేటకు వెళ్లిన జాలరులు
నీట మునిగిపోయారన్న వార్త!
 
అయినా...
అలుపెరుగని సముద్రం
సుడిగుండాలను, తుఫానులను, ఉప్పెనలను
పుట్టిస్తూనే ఉంది!

మళ్లీ మళ్లీ ప్రశాంతతను తరిమి కొడుతూనే
జన ప్రభంజనాలను సృష్టిస్తూనే ఉంది!
 
నేలకూలిన చెట్లు అడవి సాక్షిగా
నిటారుగా నిలబడి పచ్చదనాన్ని
చల్లగాలులను వెదజల్లుతున్నాయి!
 
పడిపోయిన ఇళ్లు కొత్త గోడలతో లేచినిలబడి
పల్లెలను పులకరింపజేస్తున్నాయి!
సముద్రాన్ని నమ్ముకున్న జాలర్లు
వలచేత పట్టి హైలెస్సో .... అంటూ
వేట ప్రారంభించి సాగిపోతున్నారు!
 
సముద్ర హోరు-జనసముద్ర హోరు
జనప్రభంజమై  విశ్వమంతా చుట్టుతూ
మునుముందుకు సాగుతూనే ఉంది!
 
విశ్వాన్ని శాసిస్తున్న నియంతృత్వాన్ని  
జనప్రభంజనాలు ముంచెత్తుతాయి!
అ మహా పర్వతం దూదిపింజలా
నేల రాలి మట్టిలో కలిసిపోతుంది!
 
ఈ చారిత్రక సత్యాన్ని చాటుతూ
సముద్రం ప్రశాంతంగా -గంభీరంగా-భీకరంగా
అలల సవ్వడితో ఎగిసిపడుతోంది...!

అమరులు కామ్రేడ్స్‌ ఆకాశ్‌(చంద్రుడు),  సాకేత్‌ (ధృవతార), లక్మూ (అడవి), దీపక్‌

(దీపాల వెలుగు), రామన్న (నరేంద్రుడు) చెరగని స్మృతిలో..

2 తేది: 28 సెప్టెంబర్‌, 2022.

Leave a Reply