‘తిరుగబడు’ కవితా సంకలనం వచ్చిన 53 ఏళ్లకు తిరుగబడు కవులమీద తిరిగి చర్చ జరగటం ఆహ్వానించదగిన విషయం. ” ఇలా వచ్చి అలా వెళ్లిన ‘తిరుగబడు కవులు…’ ” శీర్షికతో రజా హుసేన్ రాసిన విమర్శ చదివాక ఇది రాయాల్సి వచ్చింది.
దిగంబర కవులకు లేని లక్ష్యశుద్ధి తిరుగబడు కవులకు ఉన్నది అని రచయిత స్వయంగా ప్రశంసించిన తర్వాత పై రెండు కవిత్వ పాయల లక్ష్యాలు వేర్వేరు అని తేటతెల్లం అవుతుంది వేర్వేరు పరిధుల్లోని కవిత్వాలమధ్య పోలిక అసంబద్ధమైంది.
దిగంబర కవులదికుళ్లిపోయిన సమాజం పట్ల ఒక బలమైన ప్రతిస్పందన. దాని వికృతిని పతనావస్థను పదునైన మాటల్లో వర్ణించారు. కాని తిరుగబడు కవులది తక్షణ తిరుగుబాటు నినాదం. వారి పోరాట మార్గ అన్వేషణలో యాదగిరిరావు కవిత’ఇపుడు వీస్తున్న గాలి…’ లో తూర్పు దేశాల విముక్తి పోరాటాల గాలిని దర్శించారు.
1969 లో అనుకుంటాను చుట్టపు చూపుగా వరవరరావుతోబాటు లోచన్ వెళ్లిన ఒక మారుమూల గ్రామంలో చదువుకోని పేదజనాలు వీరిరువురి కవితలను రెండు రోజులు కోరి చదివించుకున్నారు. ప్రజలలో పోరాటాల పట్ల సుముఖత ఆనాడు అట్లా ఉండింది.
తిరుగబడు కవిత్వం ఆఫనాటి సామాజిక పరిస్థితులనుండి పుట్టింది.
తెలంగాణ రైతాంగ పోరాట విరామం పదహారు సంవత్సరాలు గడవకముందే పశ్చిమ బెంగాల్ లో నక్సల్బరీ పోరాటం రాజుకుంది. వెనువెంటనే శ్రీకాకుళం లో గిరిజనుల పోరాటం అంటుకుంది. ఈ పోరాటాలే తిరుగబడు కవులకు మొదట తిరుగుబాటు లక్ష్యాన్ని ఇచ్చాయి.
చరిత్ర గతితర్కాన్ని ఎరిగిన తిరుగబడు కవులు సహజ పరిణామ క్రమంలో విప్లవ రచయితల సంఘంలో చేరారు. అంతేకాని విరసం లో చేరటానికి ఎవరి ప్రోద్బలం సహకారం తీసుకోలేదు.
తిరుగబడు కవితా సంకలనం వెలువడింది 1970 ప్రారంభం లోనే. 1970 చివరన కాదు.
ఒకటి,రెండు ఫిబ్రవరి 1970 విశాఖ పట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సభకు అనేక రోజుల ముందే వరంగల్ టౌన్ హాల్ లో తిరుగబడు కవితా సంకలనం ఆవిష్కరణ జరిగింది.
తిరుగబడు కవిత్వ ప్రభావం 1970 లోనే అవతరించిన విప్లవ రచయితల సంఘంలో విప్లవ కవిత్వంలో అంతర్భాగమైంది. తిరుగబడు కవిత్వ ప్రభావమేమి లేదనుకోవటం, సాహిత్యాన్ని చారిత్రక పరిణామ క్రమంలో చూడక పోవటమే.