హుస్సేన్‌ రచించిన తల్లులు, బిడ్డలు చారిత్రిక స్మృతులు సింగరేణి విప్లవోద్యమ చరిత్రను ఈ తరానికి హృద్యంగా పరిచయం చేస్తుంది. “’తల్లులు-బిడ్డలు” చదువుతున్నసేపు గోర్కీ ‘అమ్మ” నవల గుర్తుకు వస్తూ ఉంటుందని, ముందుమాట రాసిన విమల్‌ అంటాడు. ఇది వాస్తవమే. రష్యన్‌ విప్లవోద్యమలో   వచ్చిన సాహిత్యాగానికి   ఎంతో లోతు, విస్తృతి ఉంది. అది ప్రపంచంలోనే ఒక గొప్ప సాహిత్యంగా గుర్తించబడింది. అందులో అమ్మ నవల మహా రచయిత గోర్కీ కలం నుండి జాలువారింది. అమ్మ నవలను ప్రపంచంలో కోట్లాది మంది చదివారు. ఎంతో మంది ఆ నవల చదివి విప్లవకారులుగా మారారు. 1905 లో రష్యాలో విప్లవం ఓడిపోయి కార్మిక వర్గంలో నిరాశా నిస్పృహలు వ్యాపిస్తున్న కాలంలో కామ్రేడ్  లెనిన్‌ “దారిలో” అనే రచన చేస్తే, గోర్కీ తన అమ్మ నవల ద్వారా సాహిత్య రూపంలో  అప్పటికీ విప్లవోద్యమానికి ఉన్న  అంతర్గత బలం, భవిష్యత్తు గురించి చెప్పగలిగాడు. హుస్సేన్‌ రాసిన తల్లులు-బిడ్డలు రచనలో కూడా మనకు ఆ విషయం గోచరిస్తుంది.

అయితే  హుస్సేన్‌ తన రచన శక్తికి గల పరిమితుల గురించి కూడా ఇందులోనే రాసుకొన్నాడు. అది అలా ఉంచితే, గోర్కీకి అంత గొప్ప అమ్మ నవల రాయడానికి ఆయన జీవితం ఎలా ఉపయోగపడిందో, హుస్సేన్‌ కు కూడా ఆయన అనుభవించిన సంఘర్షణ పూర్వకమైన జీవితం ఈ పుస్తకం రాయడానికి ఉపయోగపడింది. అందుకే ఆయన ఈ చారిత్రాత్మిక స్మృతులు కూడా అమ్మ నవలను గుర్తుచేసేలా రాయగలిగాడు. అంతేగాక, “తల్లులు-బిడ్డలు’ లోని గజ్జెల లచ్చవ్వ, గంగారామ్‌ పాత్రలు గోర్కీ అమ్మ నవల లోని నీల్నోవా, పావెల్‌ పాత్రలకు సరితూగేలాగా ఉన్నాయి.   సింగరేణి కార్మిక ప్రాంతం జనజీవనంలో , విప్లవోద్యమంలో   రష్యన్‌ పోరాటంలోని  అనేక అంశాలతో   పోలి ఉన్నాయి. అందువల్ల   కూడా తల్లులు-బిడ్డలు మనం చదువుతున్నాసేపు అమ్మ నవలను పదే పదే గుర్తుకు తెస్తూ వుంటుంది.

ఈ పుస్తకంలో హుస్సేన్‌ ఉద్యమ నాయకుడుగా ఉద్యమ చరిత్రను, తన అనుభవాన్ని, అనుభూతిని కలిపి చెబుతూనే చారిత్రిక, సామాజిక, జీవన సంఘర్హణలోకి, విప్లవకారుల త్యాగంతో నిర్మాణమైన  కార్మిక రాజకీయ, పోరాటాల్లోకి    మనల్ని తీసుకెళ్తాడు. అవ్వ, జిలానీ బేగమ్‌ పాత్రలని అత్యద్భుతంగా చిత్రీకరించడమే కాక ఉద్యమంలో పలు రకాలుగా భాగస్వామ్యం వహించిన అనేక మంది కార్యకర్తల, సానుభూతిపరుల, నాయకుల పాత్రలను సహజంగా ఆవిష్కరించాడు. ప్రభుత్వ పాశవిక తకు సజీవ సాక్ష్యమైన మాదిరెడ్డి సమ్మిరెడ్డి ఎన్‌ కౌంటర్లో ప్రజల, ప్రజాస్వామిక శక్తుల ప్రతిస్పందలు తెలియజేశాడు. ఇలాంటి చిత్రణల వల్ల 

 ఈ పుస్తకం శీర్షికలో ఉన్న చారిత్రాత్మక స్మృతులను  దాటి   నవలా పరిధిలోకి కూడా వెళ్ళింది. 

దేశంలో కార్మికోద్యమం రివిజనిజం మూలంగా స్తబ్దతకు గురిఐన సమయంలో నక్సల్బరీ పోరాట జ్వాలలతో కార్మికులు  వర్గపోరాట మార్గం పట్టారు. సింగరేణి కార్మికులు కూడా రివిజనిజాన్ని బద్దలు కొట్టి విప్లవోద్యమాన్ని నిర్మించారు. సింగరేణి విప్లవ కార్మికోద్యమానికి   సైద్దాంతిక, రాజకీయ అవగాహన ఉంది. కామ్రేడ్‌ లెనిన్‌ రచించిన “ఏమి చేయాలి” అనే రచనను నిరంతరం ఉద్యమానికి అన్వయించి అక్కడి విప్లవకారులు పని చేశారు. ఆర్థిక పోరాటాలకు, లాబియింగులకు పరిమితమైన రివిజనిస్ట్‌ ట్రేడ్‌ యూనియన్‌ లను బద్దలు కొట్టి విప్లవకర ట్రేడ్‌ యూనియన్‌  “సింగరేణి కార్మిక సమాఖ్య’ ను నిర్మించారు.

ఇది భారత దేశానికి కొత్త అనుభవం. అంతేగాక, సింగరేణిలో పోరాటాలు ఎగిసిపడడానికి దోపిడీపీడనలు, అణిచివేత, వారి అతి దుర్భరమైన జీవితం కూడా మిలిటెంట్‌ పోరాటాలకు కార్మిక వర్గాన్ని పురికొల్పింది. అలా కార్మిక వర్గం 44 డీప్‌ లో గాలి సప్లై పోరాటం నుండి ప్రారంభించి, మస్టర్ల కోతకు వ్యతిరేకంగా 56 రోజుల చారిత్రాత్మక సమ్మె పోరాటం, భారత కార్మికవర్గ పోరాటాలకు మిలిటెంట్‌ పోరాట మార్గాన్ని నమూనాగా నిలిపిన 4 వ వేజ్‌ బోర్డ్‌ కోసం నిర్వహించిన మిలిటెంట్‌ సమ్మె పోరాటం కార్మిక వర్గానికి విప్లవకర ట్రేడ్‌ యూనియన్‌ ఎందుకు అవసరమో నిరూపించాయి.

‘సికాస’ అనేక వృత్తుల, వర్గాల పోరాటాలు, అసంఘటితరంగ కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించి విజయం సాధించింది. సారా వ్యతిరేక పోరాటాన్ని చేసింది. పోరాటాలు ఉవ్వెత్తున్న రావాలంటే బలమైన నిర్మాణం అవసరం. మొదటి నుండి నాయకత్వం ఈ విషయాన్ని నొక్కి చెబుతూ పిట్‌ కమిటీలను విప్లవకరంగా తీర్చదిద్దడం, కార్మిక వర్గంలో విప్లవ పార్టీ ని నిర్మించడం, మొదట బలం తక్కువ ఉన్న రోజుల్లో అప్పటికి ఉనికిలో ఉన్న ట్రేడ్‌ యూనియన్ల లో పని చేస్తూ, బలం పెరగగానే స్వంత విప్లవకర ట్రేడ్‌ యూనియన్‌ ను స్థాపించారు.   ఈ విషయాలన్నీ  హుస్సేన్‌ తన స్వంత అనుభవంతో చాలా వివరంగా చెప్పాడు. ఇవి ఇప్పటి పోరాటకారులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

తెలంగాణ దోపిడి, పీడనలకు గురైన  పేద దళితులు, బడుగు వర్గాలు ప్రాణాంతకమైన బొగ్గు బావుల్లో పనిలో చేరారు. ఇది నిరంతరం సాగింది. గజ్జెల లచ్చవ్వ కుటుంబమే ఇందుకు ఉదాహరణ. హుస్సేన్‌ ఈ కుటుంబ చరిత్రను పరిశోధించి చాలా వివరంగా రాశాడు. లచ్చవ్వ సంఘర్ష పూరితమైన జీవిత సారం స్పష్టంగా అర్ధమవుతుంది. అలాగే జిలానీ బేగమ్‌ సాధారణ గృహిణి నుండి పూర్తికాలం కార్యకర్తగా మారి చివరకు విప్లవం లోనే అమరురాలైంది . ఆమె తో ముడిపడిన  చరిత్రను ,  ఆమె పడిన సంఘర్షణను అత్యద్భుతంగా, వాస్తవానికి   దగ్గరగా ఆవిష్కరించాడు. ఈ తరం ఎందుకు ఇంత ఉత్తేజంతో విప్లవోద్యమం లోకి చేరిందో   మనకు స్పష్టంగా తల్లులు బిడ్డలు   ద్వారా అర్ధమౌతుంది. అయితే మొదటి తరాల వాళ్ళ లాగా కాకుండా, బావి పని మంచి ఉపాధిగా మారడం, దానితో ఇక్కడికి పెద్దఎత్తున రైతాంగం రావడం, వారికి నిరంతరం గ్రామాలతో సంబంధం ఉండడం వలన తక్కువ చైతన్యం గల కార్మిక వర్గం కూడా ఇక్కడ ఉండడం వల్ల, వారిని చైతన్య పరచడానికి విప్లవోద్యమం  తీసుకొన్న కార్యక్రమాల గురించి కూడా హుస్సేన్‌ చక్కగా తెలియజేశాడు.

సింగరేణి కార్మికులకు, నాయకులకు రష్యన్‌ కార్మిక వర్గ  పోరాటాల పట్ల, సోషలిజంపట్ల అవగాహన ఉన్నది. అలాగే  వారిపై చైనాలో జరిగిన “ఆన్‌ యూన్‌’ కార్మిక పోరాటాల ప్రభావం కూడా ఉంది. అందుకే ఇక్కడి కార్మికుల్లో నుండి అనేక మంది రైతాంగ పోరాటాలలోకి వెళ్లారు. అసలు సింగరేణి పోరాటాలు, రైతాంగ, ఆదివాసీ పోరాటాలు జమిలిగా సాగాయి. అందుకే జగిత్యాల జైత్ర యాత్ర, ఇంద్రవెల్లి పోరాటాలు సంక్షిప్తంగా నైనా ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.

లచ్చవ్వ లో గల ధీరత్వన్నీ, విప్లవం పట్ల ఆమెకు గల విశ్వాసాన్ని హుస్సేన్‌ అనేక సందర్భాలలో సజీవంగా చూపెడతాడు. లచ్చవ్వ జీవితం పొడుగునా అత్యంత కఠినమైన పరిస్థితులను  ఎదుర్కొన్నది. ఏ తల్లి ఐనా తన పిల్లలను కోల్పోయినపుడు ఎంత తల్లడిల్లుతుందో మాటలు చాలవు, తనకు అత్యంత ప్రేమాస్పదుడు తన జీవితంలో ఎదురుకున్న సమస్యలకు పరిష్కారంగా విప్లవ మార్గం చూపిన, ప్రజా నాయకుడైన గంగరాం అమరత్వం సందర్భంగా ఆమె చూపిన నిబ్బరంను చాలా సహజంగా హుస్సేన్‌ చెప్పగలిగాడు. “బిడ్డా  చేతిలో కట్టె లేకపోతే సందుల పొంటి ఉండే బజారు కుక్కలు కూడా మీద ఎగబడతాయి.’ అని లచ్చవ్వ అంటుంది. ఈ వాక్యం ద్వారా అప్పటికి ఆమెలో తన కొడుకు మార్గం పట్ల గల విశ్వాసాన్ని ప్రకటింపజేస్తాడు. అవును గోర్కీ అమ్మ నవలలో పావెల్‌ అమరుడు కాకుండా చివరి వరకు నవలలో జీవించి అజరామరమైన పాత్రగా నిలిచి పోతే, గంగారామ్‌ మాత్రం విప్లవ తొలి దినాలలో అమరుడు అయి విప్లవం మీద వెలుగు ప్రసరింప జేశాడు. అమ్మ, చెల్లితో పాటు అనేక మంది విప్లవకారుల్లో మరింత పట్టుదల పెంచాడు.

ఉద్యమాలు నడిపే ఏ పార్టీకి, సంఘానికైనా గానీ ప్రజా పునాది, కేడర్లు, సానుభూతిపరులు కావాలి. అలాగే ప్రచార యంత్రాంగం అవసరం. ఈ పనులు అన్నీ నడవాలంటే ఎప్పటికప్పుడు రిక్రూట్స్‌ అవసరం. సింగరేణిలో ఎప్పటికప్పుడు చాలామంది రిక్రూట్‌ అవుతూ వచ్చి కార్యకలాపాలు అన్నీ నడిపారు. కామేడ్‌ రఘు ఈ విషయాన్ని చెబుతూ సింగరేణి రిక్రూట్లకు ‘ఊటచెలిమ’ అంటాడు. ఇది ఎంతో సారూప్యత గల పదం. ప్రారంభ దశలోనే స్వయంగా హుస్సేన్‌ టీ హోటల్‌ పెట్టి అక్కడ పార్టీ పత్రికలు అమ్మడు. , జననాట్యమండలి పాటలు పాడాడు.   ఉద్యమ నాయకుల రక్షణ, కమిటీల మీటింగుల కోసం అనేకమంది సానుభూతి పరులు, బహిర్గతం కానీ ఉద్యమ సహచరులు   కీలక పాత్ర పోషించారు. అందులో మనకు రాజక్క, చంద్రన్న కుటుంబము మంచి ఉదాహరణగా కనపడుతుంది. అలాగే నిరంజన అందుకు ప్రాణత్యాగమే చేస్తుంది. ఇలా రచయిత ఈ పుస్తకంలో చాలా శ్రద్ద తీసుకొని ఈ విషయాలను పొందుపరిచాడు.

రష్యన్‌ విప్లవం లో అనేక మంది మహిళా కామేడ్స్‌ అత్యంత కఠిన పరిస్థితిలో పని చేశారు. వాళ్ళు టివి నిర్బంధం మధ్య    జారు ప్రభుత్వ పోలీసుల కన్ను కప్పి విదేశాలలో అచ్చు అయ్యే ఇస్కా పత్రికను రష్యా కార్మికవర్గం దగ్గరకు చేర్చే వాళ్ళు. సింగరేణిలో కూడా కొరియర్‌ పనితో పాటు అనేక రంగాలలో పని చేయడంతో పాటు ఆటవీ ప్రాంతాల్లో దళాలలోకి వెళ్ళి అనేక మంది మహిళలు పని చేశారు. ఇద్దరు సరోజల మొదలు అనేక మంది ఈ పుస్తకం లో మనకు కనపడుతారు. అయితే పట్టణ మహిళలను రిక్రూట్‌ చేసుకోవడం,వారికి పని ఇవ్వడం లో గల సమస్యలపై రచయిత ఇందులో చర్చించాడు. సింగరేణి ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం వివిధ రూపాలలో ఉంది. పూర్తి కాలం కార్యకర్తలుగా ఉద్యమంలోకి పోయిన వారి భార్యల స్థితిగతులు, ఇబ్బందులు లచ్చవ్వ, జిలానీ బేగం మద్యలో జరిగిన చర్చలో మనకు తెలుస్తుంది. కుటుంబము సూటి పోటీ మాటలు,  పిల్లలు కనడం విషయంలో ఎదుర్కొన్న   సమస్యలు ఎంతో సహజంగా చిత్రీకరించాడు. ఇక్కడ జిలానీ ఎదుర్కొనే   కుటుంబ నియంత్రణ సమస్యను లచ్చవ్వ అర్ధం చేసుకొని సమస్యను పరిష్కరిస్తుంది. శ్రీ లత ఉద్యమంలోకి   రిక్రూట్‌ అయినప్పుడు తండ్రి చంద్రయ్య “విప్లవోద్యమము లో అమరురాలు అయి ఇంటికి తిరిగి వచ్చిన సరే కానీ విప్లవోద్యమాన్ని విడిచిపెట్టి మాత్రం ఇంటికి రావద్దు” అని శ్రీలత తో అన్నాడని లచ్చవ్వ చెప్పడం చూస్తే ఆ రోజు తమ పిల్లలను స్వచ్చందంగా విప్లవంలోకి తల్లిదండ్రులు పంపారని అర్ధం అవుతుంది.

సింగరేణి ఉద్యమం పై ప్రభుత్వ పాశవిక నిర్బంధకాండ తీవ్రంగా పెరిగిపోయి అరెస్టులు, చిత్రహింసలు. బూటకపు ఎంకౌంటర్లు చోటుచేసుకున్నాయి. మోటా శంకర్‌, కట్ల మల్లేశ్‌, సమ్మిరెడ్డి లాంటి సికాస నాయకులతో పాటు, ఉద్యమంలోకి   రెండవ తరంగా ముందుకు వచ్చిన తెలివైన, చురుకైన యువజన, విద్యార్థి నాయకులైన షంషేర్‌ ఖాన్‌, రవీందర్‌ రెడ్డి, వీరయ్య, ఫాల్గుణ, మంతెన వెంకటేశ్వర్లు లాంటి ఎందరో విప్లవకారులు అమరులైనారు. వీరంతా తీవ్ర నిర్వంధంలోనే ఉద్యమాన్ని ముందుకు నడిపారు. సింగరేణిలో నిర్బంధంలో   అనేక కొత్త నిర్మాణ, పోరాట రూపాలు ముందుకు వచ్చాయి. ఈ అనుభవాలు అన్నీ ఉద్యమకారులకు ఎంతో విలువైనవి.

చంద్ర బాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో సింగరేణి ఉద్యమము పై ఉక్కు పాదం మోపాడు. ఈ కాలంలో అనేక బూటకపు ఎన్‌ కౌంటర్లు జరిగాయి. సింగరేణి నాయకుడు అయిన మాదిరెడ్డి సమ్మిరెడ్డి ఎన్‌ కౌంటర్‌ వేలాది ప్రజల మద్య జరిగిన ప్రభుత్వ హత్య. ఆయనను లొంగదీసుకోవడానికి అవకాశాలూన్నప్పటికి పాశవికంగా ఇంటిలోనే దహనం చేయడం, ఆ తర్వాత షెల్టర్‌ ఇచ్చిన నిరంజనను కాల్చి చంపడం సింగరేణి తో పాటు యావత్తు ప్రజలు ఎన్నటికీ మరిచిపోని విషాద సంఘటన. అయితే సమ్మిరెడ్డి సాహస పోరాటం దాని పక్కనే శ్వాశాతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది. పోరాట క్రమంలో లచ్చవ్వకూ నాయకులతో, ఎందరో క్యాడర్లతో పరిచయం ఏర్పడింది. వీరిలో ఎంతో మంది అమరులైనారు.

తన కొడుకు గంగారామ్‌, బిడ్డలు సరోజ, పద్మ, తన బిడ్డ లాంటి జిలానీ బేగమ్‌, కేంద్ర  నాయకుడు, అల్లుడైన రఘు అమరులు కాగా తన మనుమరాలు ఆయిన ప్రదీప కూడా తన నుంచి దూరమైంది. ఎంతో దుఃఖకరమైన దినాల్లో కూడా ఆమె ఏ రోజు చలించ లేదు. విప్లవంలో ఏ రోజైన అమరులు కావచ్చని తెలిసి తన వారిని ఎలాంటి సంకోచం లేకుండా విప్లవంలోక పంపింది. అయితే విజయ్‌ అమరుడు అయినప్పడు నాయకత్వం లేకుంటే విప్లవాలు కష్టం అని అంటుంది. ఆమె జీవితంలో వర్ణించలేనంత ఘర్షణ చోటు చేసుకుంది. అయిన ఆమె ఈజిప్ట్‌ పిరమిడ్లలా విప్లవం పై విశ్వాసముతో చివరి వరకు కొనసాగింది. తనకు ఉద్యమం  సభ్యత్వం ఇచ్చినప్పుడు ఎంతో గర్వపడింది. ఆ బాధ్యతను ఆమె తన చివరి శ్వాస వరకు కొనసాగించింది. తన కుటుంబం దూరమైన, ఉద్యమం వెనుకపట్టు పట్టి  విప్లవోద్యమ సంబందాలు తగ్గినప్పటికి ఆమె కన్నాల బస్తి ని వదలలేదు. ఆ ఇంటిని వదలలేదు. అక్కడ ఉంటేనే ప్రజలతో, ఉద్యమంతో సంబంధాలు ఉంటాయని భావించింది. ‘ఆ ఇల్లు లచ్చవ్వకు కొత్త దారులు తెరిచింది. లచ్చవ్వ తర తరాల రక్త చలన గుండెకాయ’*- అని హుస్సేన్‌ అంటాడు.

ఈ పుస్తకం లో కేంద్ర బిందువు కామేడ్‌ అవ్వ గజ్జెల లచ్చవ్వ. ఆమె ఆలోచన, ఆచరణ, ఆమె కుటుంబ త్యాగం, విప్లవంలో లక్షలాది ప్రజల భాగస్వామ్యము, పారిన 114 మంది మెరికలైన యువ రక్తం, విప్లవ ఆచరణలో తెర మీదకు వచ్చి పోయే ఎంతో మంది వహించిన త్యాగ పూరిత పాత్ర, రాజకీయాలు, పోరాటాలు, జీవిత సంఘర్షణ, రక్తసిక్తమైన చరిత్ర, అందరని కోల్పోయి బాధపడుతూనే విప్లవం పై సడలని దీక్షతో భౌతికంగా జీవించి అమరురాలు అయిన లచ్చవ్వ చుట్టూ పరిభ్రమించే  విప్లవ చరిత్రను చదువుతూ వుంటే, అది మనల్ని ఎంతో లోతుల్లోకి తీసికెళుతుంది. ఇది మన స్వంత ఆలోచనలను కట్టివేసి తన లోకి ఇముడ్చుకుంటుంది. ఆ త్యాగపూరిత చరిత్ర చాలరోజులు మన మనసులను వెంటాడుతూనే ఉంటుంది.

ఈ పుస్తకంలో కొన్ని చిన్న చిన్న కొరతలు కూడా ఉన్నాయి. గంగారామ్‌, సింగరేణి ఉద్యమ నాయకుల పాత్రలకు హవ భావాలు, భావోద్వేగాలు జతచేస్తే పాత్రలు మరింతగా రక్తికట్టేవి. వాళ్ళ భావాలు ఉపన్యాస ధోరణిలో వ్యక్తపరచబడినాయి. అయితే అవి నిజమైన జీవిత పాత్రలు కాబట్టి మనల్ని అవి కదిలిస్తూనే ఉంటాయి. రాజక్క, చంద్రయ్య పాత్రలు చివరి వరకు ఉన్నాయి. కానీ వారి చరిత్ర ఏమిటో ప్రస్తావించలేదు. రెండవ తరం నాయకుల్లో ఒకరిద్దరి చరిత్ర తడిమితే బాగుండేది. ముఖ్యంగా షంషేర్‌ చరిత్ర రాస్తే బాగుండేది. పోరాటాల, కమిటీ మీటింగ్‌ వివరణలు ఎక్కువై కథనం డాక్యుమెంటరీగా సాగింది. వాటి పూర్తి భావం స్పురించేలా సంకీప్తంగా చెప్పగలిగితే బాగుండేది.

ఈ పుస్తకం చదివిన వారికి సింగరేణి పోరాటాలు, త్యాగాలు ఎడారి కావని, అవి ఎడారిలో సరస్సులు సృష్టించి, పూలు పూయిస్తాయనే విశ్వాసం కలుగుతుంది. మానవ జీవితంలో సంభవించే విభిన్న సంఘటనల ద్వారా లభించే జ్ఞానముతో చరిత్ర రూపుదిద్దుకొని, అది నూతన భవిష్యత్తుకు హామీని ఇస్తుంది. అయితే చరిత్ర మళ్ళీ పునరావృతం కాదు, కానీ భవిష్యత్తులో సింగరేణి మరో నూతన విప్లవ వెల్లువకు పురోగమిస్తుందనే విషయంలో ఆ త్యాగమయమైన ఆ రక్తసిక్త చరిత్ర మనకు హామీని ఇస్తుంది. చరిత్రను సృష్టించడానికి, చరిత్రను తెలుసుకోవాలి. హుస్సేన్‌ రాసిన తల్లులు -బిడ్డలు చారిత్రాత్మక స్మృతులు సింగరేణి త్యాగపూరిత చరిత్రను అందించడంతో పాటు మనలని పోరాటాలకు పురికొల్పుతుంది.

One thought on “మన కాలపు తల్లులు-బిడ్డల కథే విప్లవోద్యమం

  1. TDP RUINED TELUGU STATE—BABU is -CHEATER -LIER —WORTHLESS POLITICIAN—-HE IS NOT A LEADER —-NO VISION -/-always just he wants power —-play dirty politics —-2 tongues —2 faces
    Pachihi mosagadu….

Leave a Reply