సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు.
కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపై కొత్తగా నిషేధాస్త్రాన్ని ప్రయోగించింది.
ఇంతకూ నిషేధం పుస్తకం మీదా? లేక చింతామణి నాటక ప్రదర్శనల మీదా? స్పష్టత లేదు. లేక నాటకంలో ఆర్య వైశ్యుల మనోభావాలకు భంగకరంగా ఉన్న ఘట్టాలను, సంభాషణలను నిషేధించిందా? పేర్కొనలేదు.
చట్టం ప్రకారం ఈ నిషేధం చెల్లే వీలు లేదు. దేనికంటే ఒక పుస్తకాన్ని నిషేధించదల్చుకుంటే పాటించాల్సిన పద్ధతుల్లో దేన్నీ ప్రభుత్వం పాటించలేదు. నాటకంలోని సంభాషణలనో, సన్నివేశాలనో చట్ట వ్యతిరేకంగా చూపించి నిషేధం ప్రకటించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కేవలం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని జీవోను విడుదల చేయడానికి వీల్లేదు. చేసినా అది చెల్లదు.
నిజానికి సాహిత్య నిషేధాలకు బ్రిటీష్ వలస ప్రభుత్వం దారి చూపింది. అయితే ఆ రోజుల్లో వాళ్లు కొన్ని పద్ధతులు పాటించేవారు. ఒక రచనలో ఏ భాగాలు అభ్యంతరమో ఎత్తి చూపుతూ నిషేధించేవారు.
సాహిత్య భావజాల రాజకీయ నిషేధాలను అప్పుడూ అంగీకరించలేదు. ఆ తర్వాత కూడా అంగీకరించలేదు. సాహిత్య నిషేధాలపై ఎన్నో సందర్భాల్లో చట్టపరమైన, న్యాయపరమైన వాదవివాదాలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం అవన్నీ తుంగలో తొక్కి ఆర్యవైశ్యులను సంతృప్తి పరచడానికి ఈ నిషేధాన్ని తీసుకొచ్చింది.
ఆ రకంగా నిషేధాలు రాజ్య సంస్కృతిలో భాగమని మరోసారి రుజువైంది.
ఒకప్పుడు ఈ నాటకాన్ని తెలుగు సమాజాల్లో విరివిగానే ప్రదర్శించేవారు. బహుశా గత పాతిక ముప్పై ఏళ్లలో పెద్దగా ఆడటం లేదు. ఈ నాటకమనే కాదు. పాత సాంఘిక, పౌరాణిక నాటకాలు దూరమైపోయాయి. నంది నాటక పోటీలు వచ్చాక ఒక తరహా పాత నాటకాలు కనుమరుగయ్యాయి. దీని వల్ల తెలుగు నాటక రంగం బాగుపడిందేమీ లేదు. కానీ ఈ మార్పయితే జరిగింది. ఈ పరిణామానికి ఇంకో కారణం ఉంది. ఒకప్పుడు ఇలాంటి నాటక కళాకారులు, ప్రేక్షకులు గ్రామాల్లో ఉండేవారు. పండుగల్లో, జాతరల్లో తప్పక ప్రదర్శించేవారు. ఆ సెట్ అంతా మాయమైపోయింది. అట్లా కనుమరుగైన నాటకాల్లో చింతామణి కూడా ఒకటి.
ఇప్పుడు చింతామణి నాటకం శత జయంతి వేడుకలను ఏలూరులో జరపాలని కొందరు సిద్ధమయ్యారు. దీంతో తాజా గొడవ మొదలైంది. ఈ నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర మీద అభ్యంతరం వచ్చింది. ఆర్య వైశ్యులు నాటకాన్ని ప్రదర్శించడానికి వీల్లేదన్నారు. సీఎంను కలిసి నిషేధాజ్ఞలు వచ్చేలా చూసుకున్నారు.
నిజానికి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నాటక ప్రదర్శనలను రద్దు చేశారు. 2014లో విజయవాడలో చింతామణి ప్రదర్శనను అడ్డుకున్నారు. దీన్ని ఆడటానికి వీల్లేదని, ఏ కన్యాశల్కమో, సత్యహరిశ్చద్రో వేసుకోమని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందోగాని, అడపాదడపా చింతామణిని కోమట్లు వివాదాస్పదం చేస్తూనే వచ్చారు.
ఒక రచన మీదయినా, కళా ప్రదర్శన మీదైనా సమాజంలో ఎన్ని భిన్నాభిప్రాయాలైనా ఉండవచ్చు. కానీ ప్రభుత్వం ఒక పక్షం తీసుకొని నిషేధించాలనుకుంటే ఆ రచన పూర్వాపరాలు గమనించాలి. పైగా అది కొత్త రచన కాదు. నూరేళ్ల కిందటిది. ఆ నాటకంలో ఏముందో గమనించాలి. తన నిర్ణయానికి చట్టబద్ధత ఉంటుందా? దాన్ని సమర్థించుకోడానికి హేతుబద్ధ వాదన ఉన్నదా? అని ఆలోచించాలి.
మన ప్రభుత్వాలకు అంత ప్రజాస్వామిక దృష్టి కాదు కదా. కనీస ఇంగితం కూడా ఉండదు. అధికారం ఉంది కాబట్టి ఏ పని అయినా చేయవచ్చని అనుకుంటాయి. తాను నూరేళ్ల కిందటి నాటకాన్ని నిషేధిస్తున్నాననే స్పృహతో వ్యవహరించలేదు. తాను సాహిత్యంతో, కళతో వ్యవహరిస్తున్నాననే విజ్ఞతను ప్రదర్శించలేదు. ఆర్య వైశ్యులను సంతృప్తిపరిస్తే చాలని అనుకుంది.
ఇప్పుడు చింతామణి రాసినప్పటి సామాజిక పరిస్థితులు లేవు. ఆ నాటకం తరపున అస్తిత్వాల పేరుతో, మనోభావాల పేరుతోనో సానుకూలంగా మాట్లాడేవారు లేరు. అలాంటి సామాజికత అందులో లేదు. పైగా వ్యతిరేకంగానే ఒక ఆధిపత్య కులం ముందుకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి నిషేధం సులభమైపోయింది.
చారిత్రక ప్రాధాన్యత మాత్రమే ఉన్న ఆ నాటకం మీద ఇప్పుడు ఎవరు ఏ విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వ నిషేధాన్ని అంగీకరించడానికి లేదు. కళా సాహిత్యాల మంచి చెడ్డలను సమాజం చర్చించాలి. సాహిత్య విమర్శకులు, పాఠకులు, ప్రేక్షకులు నిగ్గుదేల్చాలి. అంతేగాని సమాజం చేయాల్సిన పనిని కూడా తానే చేస్తానని ప్రభుత్వం బోర విరుచుకొని వస్తే చూస్తూ ఊరుకోడానికి లేదు.
చింతామణి మంచి చెడ్డలను ఎవరు పరిశీలించాలనుకున్నా చింతామణి మూల రూపం దగ్గరికి వెళ్లాలి. కాళ్లకూరి నారాయణరావు సాహిత్య సామాజిక వ్యక్తిత్వం దగ్గరికి వెళ్లాలి. ఆయన ఆ నాటకం రాసిన స్థలకాలాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన వరవిక్రయం అనే మరో ముఖ్యమైన నాటకం రాశారు. ఇంకా ఆకాలానికి అవసరమైన రచనలు ఎన్నో చేశారు.
నారాయణరావు జాతీయోద్యయ యుగంలోని సాంఘిక సంస్కరణోద్యమంలో పని చేశాడు. పత్రికా యజమానిగా, పత్రికా రచయితగా, కవిగా ఆయనకు గుర్తింపు ఉండింది. వరకట్నం, వేశ్యావృత్తి వంటిని వాటిని వ్యతిరేకిస్తూ ఆయన రచనలు చేశారు. చింతామణి అట్లా రాసిందే. మొత్తంగా ఆ కాలంలోని ఒక తరహా సామాజిక జీవుల్లో ఆయన ఒకరు.
ఆయన ఈ నాటకాన్ని సరళ గ్రాంథికంలో రాశారు. సంభాషణలు, పద్యాలు అట్లాగే ఉంటాయి. నూరేళ్ల కిందటిదని గుర్తు పెట్టుకుంటే అందులోని భాష ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అలాగే ఆనాటి సంఘసంస్కరణ దృక్పథానికి ఉన్న పరిమితులను కూడా తెలుసుకోవచ్చు. ఈ నాటకంలోని ముఖ్య పాత్ర బిల్వమంగలుడు మారుమనసు పొంది సాధువుగా మారతాడు. రచయిత సంస్కరణ దృక్పథం ఇలాంటిది. ముఖ్యంగా వేశ్యావృత్తి వంటి వాటి మీద ఆనాటి శిష్ట సంస్కరణ దృష్టికి చింతామణి అతీతం కాదు.
దాన్ని ఇవ్వాల్టి అవగాహనతో పునర్మూల్యాంకనం చేయవచ్చు. వేశ్యావృత్తిని చూడ్డంలో ఆ కాలపు వాళ్లకు ఉన్న పరిమితికి కారణాలు వెతకవచ్చు. వేశ్యావృత్తి ఒక సామాజిక సమస్యగా కాక నైతిక సమస్యగా వాళ్లు భావించారు. నిజానికి ఆ రోజుల్లో బోగం మేళాలు సంపన్నుల ‘హోదా’కు గుర్తుగా ఉండేవి. కాబట్టి అభ్యంతరం ఉండేది కాదు. ఆ పరిధిలోనే విమర్శలు ఉండేవి. ఇలాంటి దృష్టి అప్పట్లో ఎక్కువ మందికి ఉండేది.
పెద్దగా సమకాలీనత లేని ఈ నాటకాన్ని ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటే ఈ కోణంలో విశ్లేషించాలి. కానీ ఇప్పుడు నిషేధానికి వేరే అంశాలు సాకు అయ్యాయి. అది చాలా ఆసక్తికరం. అచ్చులో కనిపించే చింతామణి కాలక్రమంలో స్టేజీ మీద మారుతూ వచ్చింది. ఇది ఎలా జరిగిందో, ఎవరు చేశారో చెప్పడం కష్టం. దురుద్దేశాలు ఏమీ లేకపోయినా బహుశా ప్రదర్శనలో ఏ నాటకం అయినా ఎంతో కొంత మారే అవకాశం ఉంది. కానీ చింతామణిలో జరిగింది అలాంటి మార్పులు కాదు. ప్రదర్శనల్లో అది మూలానికి చాలా దూరం వెళ్లిపోయింది. ఒక రకమైన ‘జనరంజకత్వం’ కోసం వల్గర్‌గా మార్చేశారు. సుబ్బిశెట్టి అనే విటుడి పాత్ర అట్లా పూర్తిగా మారిపోయింది. ఆ మాటకొస్తే నారాయణరావు స్ఫూర్తి(వేశ్యావృత్తిపై ఆయన వైఖరే చర్చనీయాంశం)కి పూర్తి భిన్నంగా చింతామణిని స్టేజీ మీద ఆడుతున్నారు. ఆ మేరకు అన్ని పాత్రల స్వభావం మారిపోయి ఉంటుంది. దీనికి చింతామణి మూలంలోనే అవకాశం ఉన్నదేమో చూడాలి. ఇప్పుడు చింతామణిలో కోమట్ల మనోభావాల సమస్యే లేదు. అందులో వేశ్యలను అవమానకరంగా చూపించే ధోరణి ఉంది. నాటకంతో ఏ రకంగా సంబంధం లేని బూతులు, అశ్లీలం ప్రదర్శిస్తుంటారు.
ఇలాంటి నాటక, సామాజిక సంబంధమైన విషయాలు చింతామణి మూల రచనలో ఉన్నాయి. ప్రదర్శనలో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవేవీ ఆర్య వైశ్యులకు అక్కరలేదు. ప్రభుత్వానికి అసలు అక్కరలేదు. నిషేధిస్తేపోలా.. అనుకుంది. రాజపత్రాన్ని విడుదల చేసింది. పెద్దగా సమకాలీనత లేని రచన కాబట్టి సాహిత్యకారులకు కూడా పట్టకపోవచ్చు. కానీ ఒక రచనను స్వీకరించినా, తిరస్కరించినా అది సమాజమే చేయాలి. తనకు అక్కర లేని కళను చెత్తకుప్పమీద పడేసే చైతన్యం సమాజానికి ఉండాలి. అలాంటి కళాభిరుచి, సామాజిక చైతన్యాన్ని ప్రజలు ప్రదర్శించాలి. కోమట్లు కూడా ఈ నాటకం మీద సామాజిక కళా విమర్శకు సిద్ధం కావాలి. అట్లా ప్రేక్షకులను సెన్సిటైజ్ చేయాలి. నిజానికి కోమట్లకు పరపతి ఉంది కాబట్టి తమ కులాన్ని తక్కువగా చూపిస్తున్న చింతామణిని నిషేధింపజేశారు. బహుశా అట్టడుగు కులాలను, పేదలను, వేశ్యలను చిన్నబుచ్చేలా పాత రచనల్లో ఎన్ని లేవు? వాటి మాటేమిటి? నిజంగానే ఈ నాటక ప్రదర్శనలోని బూతు అభ్యంతరం అనుకుంటే సినిమాల్లోని బూతు మాటేమిటి? అనే ప్రశ్న వస్తుంది. అయినా బూతును అన్ని రాజకీయ పార్టీలు అధికారిక విధానంగా మార్చేశాక, చట్ట సభలు బూతుల రంగ స్థలంగా మారిపోయాక ఎవరి మనోభావాల కోసమైనా సరే సాహిత్యాన్ని నిషేధించే నైతికత ఈ ప్రభుత్వాలకు ఉందా?
సాహిత్యాన్ని అర్థం చేసుకొనే చైతన్యం, విలువలు సమాజంలో పెరిగే కొద్దీ పాత రచనల మీద విమర్శనాత్మక వైఖరులు అలవడతాయి. అప్పుడే చింతామణి నాటకం వంటి వాటి మీద తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని ప్రభుత్వం సమాజం మీద స్వారీ చేయడమేగాక కళా సాహిత్యాలను నిషేధించుకుంటూ పోతానంటే అంగీకరించడానికి వీల్లేదు.