గతంలో రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే దృక్పథం కొరవడినందువల్ల దాని పట్ల వ్యవహరించిన తీరు కొంత సమస్యాత్మకంగా, పరస్పర విరుద్ధంగా ఉండేది. కానీ తదనంతర కాలంలో ప్రజా పోరాటాలు విస్తృతమౌతున్న కొద్దీ, ముఖ్యంగా తెలుగు సమాజాలలో లోతైన చర్చలు, అంతర్మథనం జరిగి హక్కుల దృక్పథం తాత్వికంగా బలోపేతం అయ్యే దిశగా వికాసం చెందనారంభించింది. ఆ క్రమంలో భాగంగానే ప్రొ.శేషయ్య గారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలించా

‘రాజ్యాంగం-పౌరహక్కులు’ అనే ఈ  పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడంలో శేషయ్య గారి ప్రత్యేకమైన ముద్ర కనబడుతుంది. పౌర హక్కుల రంగానికి తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని రూపొందించుకునే క్రమంలో ఆయన పాత్ర ప్రముఖంగా పేర్కొనదగినది. రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడం అంటే దానిని ఒకానొక మార్పులేని వ్యవస్థగా చూడడం కాదు. దేశీయ చారిత్రక వికాస క్రమంలో ఏయే పరస్పర వైరుధ్యాల సంఘర్షణల నుంచి, వివిధ ప్రజాపోరాటాల్లో నుంచి రాజ్యాంగం రూపొందిందో ఆయన పరిశీలిస్తారు. ఒక రకంగా ఆనాటి సామాజిక వైరుధ్యాల పరిష్కారానికి ఒక సాధనంగా ఆవిర్భవించిన రాజ్యాంగమే తదనంతర కాలంలో ఒక వైరుధ్యాల  పుట్టగా ఎలా పరిణమించిందో ఆయన చక్కగా వివరిస్తారు. అందుకు బైటి కారణాలే కాకుండా, దానిలోని అంతర్గత కారణాలను కూడా పరిశీలిస్తారు. రాజ్యాంగానికి చరిత్ర నిర్దేశించిన పాత్రకు ఎటువంటి పరిమితులు ఎందువల్ల ఏర్పడినాయో అద్భుతంగా విశ్లేషిస్తారు. అనేక సాంఘిక రాజకీయ ఆర్ధిక వైరుధ్యాలతో గూడిన వాస్తవ సామాజిక స్థితికి, రాజ్యాంగ ఆదర్శాలకు మధ్యనున్న అసలు వైరుధ్యాల మీద ఆయన తన లోచూపును ప్రసరిస్తారు.

సమాజంలో ఉన్న వివిధ ఆధిపత్య శక్తులను నియంత్రించే శక్తిగా ఇక్కడి రాజ్యాంగం లేదని, పైగా రాజ్యమే ఆయా ఆధిపత్య శక్తులకు వత్తాసు పలుకుతోందని శేషయ్య అంటారు. రాజ్యాంగమే సొంత ఆస్తిని వ్యక్తిగత ఆస్తిగా గుర్తించడం వల్ల దాని ఆవిర్భావంలోనే మౌలిక వైరుధ్యం ఏర్పడి ఉన్నదని, అదే క్రమంగా ఒక చిక్కుముడిగా మారి రాజ్యాంగం అమలుకు ప్రధాన అవరోధం అయిందని చెబుతారు. అంటే, సొంత ఆస్తి హక్కే  దోపిడీకి రాచమార్గాన్ని ఏర్పరచడం వల్ల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమే  సమస్యాత్మకం అయిందని, అదే అనేక రూపాల్లో ప్రజల హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తోందని ఆయన విశ్లేషిస్తారు.

 ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రజాపోరాటాల్లో నుంచి, విభిన్న ప్రజాస్వామిక భావజాల ప్రభావాల నుంచి రాజ్యాంగ హక్కులు రూపొందించబడ్డాయని, రాజ్యంపై ఉన్న వివిధ ఆధిపత్య శక్తుల పట్టు వల్ల ఆయా హక్కులు అమలు కావడం లేదని, మళ్ళీ  ప్రజా పోరాటాలు లేకుండా రాజ్యాంగం అమలు కాని పరిస్థితి నెలకొని ఉన్నదని చెబుతారు.

శేషయ్య గారు దేన్నీ అమూర్తంగా, పరమ పవిత్రంగా చూడరు. కనుకనే ఆయన పరిశీలనా  పద్ధతిని అర్థం చేసుకుంటే తప్ప ఆయన ఆలోచనలు, రచనలు మనకు సమగ్రంగా అర్థం కావు. కార్యకర్తగా మొదలై క్రమంగా ఎదుగుతూ  వివిధ దృక్పథాల సంఘర్షణల మధ్యనే  ఆయన హక్కుల రంగాన్ని సామాజిక తాత్వికత వైపుగా నడిపించాడు. సమాజం మరింత నాగరికంగా, మానవీయంగా  ఎదగడానికి చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల శాస్త్రీయమైన, సునిశిత విమర్శ నాత్మక వైఖరిని  అనుసరించారు.

ఆయన సామాజిక మార్పుకు రాజ్యాంగమే ఏకైక మార్గమని నెత్తికెత్తుకునే  రాజ్యాంగవాది కాదు, లేదా రాజ్యాంగాన్ని మొత్తంగా తృణీకరించే  రాజ్యాంగ వ్యతిరేకవాది కూడా కాదు. చారిత్రక పరిణామ క్రమంలో భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చిందని, అది ఇంకెంత మాత్రం మార్పుకు గురికాని  పవిత్ర గ్రంథం కాదని ఆయన భావిస్తారు. నిరంతరం ప్రజా పోరాటాల వల్ల జరిగే మార్పుల  క్రమంలోనే ప్రజల నిజమైన ప్రజాస్వామ్యం  రూపొందించబడుతుందని విశ్వసిస్తారు. ఆ క్రమంలో ఆవిష్కరించబడే  ప్రగతిశీలమైన విలువల ప్రాతిపదికపైనే  చట్టాలు, రాజ్యాంగము మరింత  ప్రగతిదాయకంగా ఎప్పటికప్పుడు పునర్నిర్మాణం కావాలని అభిలషించారు. అందుకు బహుముఖీనమైన ప్రజాపోరాట చైతన్యమే సరైన దిక్సూచిగా నిలుస్తుందని దృడంగా నమ్మారు. నిరంతరం మార్పు కోసం జరిగే వివిధ ప్రజా పోరాటాల పట్ల హక్కుల సంఘాలకు లోతైన తాత్విక దృక్పథం  ఏర్పర్చుకోవాల్సిన  అవసరం ఉంటుందని ఆయన భావించారు.

రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామిక హక్కులు వ్యక్తిగత అనుభవ కోణం నుంచి చూసినప్పుడు చాలా  విలువైనవిగా కనబడినప్పటికీ, వాటి అమలు మాత్రం సామాజికంగానే ఉంటుంది. అయితే సమాజంలో కుల, పితృస్వామిక వ్యవస్థల  రూపంలో అసమానతా, ఆధిపత్యాలు కొనసాగే చోట హక్కుల ఉల్లంఘనలు  తప్పనిసరిగా ఉంటాయి. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు కేవలం పార్లమెంటరీ రాజకీయ రంగానికి  పరిమితమై, సామాజిక ఆర్థిక రంగాలకు విస్తరించక  పోవడం వల్ల నిజమైన ప్రజాస్వామ్యం/ ప్రజాస్వామికీకరణ ప్రక్రియ పురోగమనం చెందజాలదు.

రాజ్యాంగంలోని ఈ వైరుధ్యాల పట్ల అంబేద్కర్ కు ఆనాడే చాలా ఎరుక ఉండింది. అందుకే ఆయన జనవరి 26, 1950 న ‘నేటి నుంచి మనం అసలైన వైరుధ్యాలలోకి ప్రవేశిస్తున్నాం‘ అని అన్నాడు. పైగా రాజ్యాంగంలోని వైరుధ్యాలను సకాలంలో పరిష్కరించకపోతే  ప్రజలు తిరగబడి రాజకీయ(రాజ్యాంగవాద) ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొడతారని కూడా అన్నాడు.

 మరి రాజ్యాంగంలోని వైరుధ్యాలను, రాజ్యాంగానికి, వాస్తవ సమాజానికి మధ్య తలెత్తుతున్న వైరుధ్యాలను పరిష్కరించడం అంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని ఆలోచిస్తే—అసమాన, ఆధిపత్య సామాజిక ఆర్థిక సంబంధాలను, వాటి పునాది అయిన  ఉత్పత్తి సంబంధాలను మార్చడమే రాజ్యాంగపు  వైరుధ్యాలను పరిష్కరించడం అని తేలుతుంది. సామాజిక ఆర్థిక సంబంధాలను మౌలికంగా మార్చడం ద్వారానే సామాజిక సమానత్వాన్ని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించగలం. లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రజల పాలిట గుదిబండగా తయారై నియంతృత్వంగా మారుతుంది. నేడు ప్రజలు అనుభవిస్తున్నది అదేనని చెప్పాలి.

రాజ్యాంగపు వైరుధ్యాల  పట్ల, రాజ్యాంగానికి, బయటి సమాజానికి మధ్య గల వైరుధ్యాల పట్ల ఎంతో ఎరుక ఉండడం వల్లనే అంబేద్కర్ పైవిధంగా హెచ్చరించాడు. ఇలాంటి లోతైన చారిత్రక స్పృహ ఉన్న డాక్టర్ అంబేద్కర్ ను పాలకవర్గాలు రాజ్యాంగ నిర్మాత అని, రాజ్యాంగ పితామహుడని కీర్తిస్తూ  ఆయన కోర్ ఫిలాసఫీని ద్వంసం చేస్తున్నారు. ఆయనను కేవలం రాజ్యాంగవాదిగా కుదించివేస్తున్నారు. పైగా రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూస్తే అంబేద్కర్ ను విమర్శించినట్లే  అని ప్రచారం చేస్తూ, తమ పాలకవర్గ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి పటిష్టమైన రాజ్యాంగ వాదాన్ని లేదా రాజ్యాంగవాదపు గోడ సిద్ధాంతాన్ని అల్లుతూ ప్రజల పోరాట ఆచరణకు బంధనాలు వేస్తున్నారు. ఈ రాజ్యాంగవాదపు మాయాజాలం ప్రభావం వల్లనే కోర్టులు కూడా చాలా సందర్భాలలో పాలకవర్గ స్వభావాన్ని అధిగమించలేక పోతున్నాయని చెప్పవచ్చు.

ఇలా ఈ పుస్తకం లోని శేషయ్య గారి 24 వ్యాసాలలో స్థూలంగా ఈ పరిశీలనా చట్రమే కనిపిస్తుంది. గతంలో వలసవాద పెట్టుబడి లక్ష్యం  ప్రధానంగా దోపిడీయే  అయినప్పటికీ, అది కొన్ని పరిమాణాత్మక ప్రగతిశీల మార్పులకు కారణమైంది. ముఖ్యంగా ఉత్పత్తి వ్యవస్థ వైపు  నుండి ప్రసరించిన ప్రభావాల కారణంగా పై నుండి ఆయా మార్పులు జరిగాయి. కానీ భారత నాగరికత పునాది మాత్రం చెక్కుచెదరకుండా పునరుత్పత్తి అవుతుండడం వల్ల అవి  గుణాత్మక మార్పులు గా పరిణమించలేదు. ప్రత్యక్ష వలస పాలన అంతమైన తర్వాత కూడా భారత ప్రజల మానసికతపై వలసీకరణ ప్రభావాలు  తొలగిపోకపోవడం వల్ల వారి మానసికత పూర్తిగా నిర్వలసీకరణ చెందలేదని శేషయ్యగారంటారు. పైగా ప్రజల మానసికతా పునాదిలో పెట్టుబడిదారీపూర్వ ప్రాచీన భూస్వామిక భావజాలం నిండి ఉండడం వల్ల ఒక విచిత్రమైన, వైరుధ్యపూరితమైన  మానసికత  వాస్తవంగా ఉనికిలో ఉన్నది. అదే హిందుత్వ శక్తుల రాజకీయ క్రీడలకు అనువైన రంగస్థలంగా పనికి వచ్చింది. దాని విశ్వరూపమే నేటి ఫాసిజంగా  ప్రజల అనుభవంలోకి వచ్చింది, వస్తోంది.

మొత్తంగా సమాజాన్ని ప్రజాస్వామికీకరించే క్రమంలో పౌరహక్కుల ఉద్యమానికి కీలక పాత్ర ఉంటుందని శేషయ్యగారు చెబుతారు. అయితే రాజ్యాంగం లోని వైరుధ్యాలను,రాజ్యాంగానికి, సామాజికార్థిక వ్యవస్థకు మధ్యనున్న వైరుధ్యాలను అధిగమించడానికి, సమాజ ప్రజాస్వామికీకరణకు ప్రజల పోరాట చైతన్యమే దిక్సూచి అని చెప్పడమే ఈ పుస్తకం సారాంశం.

Leave a Reply