అక్టోబర్‌ 21, 2023 రాత్రి 8 గంటలకు లకు వ్యర్థపదార్థాలతో కూడిన ట్యాంకర్‌ ఇథనాల్‌ పరిశ్రమ నుండి బయటికి వచ్చిన విషయం తెలుసుకొని, ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటి సభ్యులు మరియు ఎక్లాస్‌పూర్‌, చిత్తనూర్‌, జిన్నారంకి చెందిన రైతులు దాన్ని 21 రాత్రి శనివారం 8 గంటల నుండి 22 ఉదయం 11 గంటల వరకు దాన్ని నిలువరించి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ ట్యాంకర్లో ఇథనాల్‌ ఉందా లేక పరిశ్రమ వ్యర్థ పదార్థాలు ఉన్నాయా అని స్పష్టం చేయాలనే ప్రజల డిమాండ్‌ పట్ల 15 గంటల నిరీక్షన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా ప్రజలు కనీసం ఎంఆర్‌ఒ సునీత అయినా బాధ్యతపడి ఆ ట్యాంకర్లో ఉన్న పదార్థం ఏమిటో తెలియజెప్పాలని నాయకత్వం ఒకవైపు మాట్లాడుతుండగానే నారాయణ్‌పేట్‌ డిఎస్‌పి సత్యనారాయణ పోలీసు బలగాలతో, వజ్ర వాహనంతో (తెలంగాణ ఉద్యమం అప్పుడు గుంపులను చెదరగొట్టడానికి టియర్‌ గ్యాస్‌ సెల్స్‌ నిర్విరామంగా వేయడానికి ఉపయోగించే వాహనం) ప్రజలపై లాఠీచార్జీ, టియర్‌ గ్యాస్‌ సెల్స్‌ వాడి శాంతియుత ధర్నాను హింసాత్మకంగా మార్చారు.

ఈ ఘటన 22 వ తారీకు నాడు జరిగితే అక్టోబర్‌ 24, 2023 న పౌర హక్కులసంఘం రాష్ట్ర సమితి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కమిటి సంయుక్తంగా నిజ నిర్దారణను నిర్వహించాయి. అందులో భాగంగా ఎక్లాస్‌పూర్‌, జిన్నారం, చిత్తనూర్‌ గ్రామ ప్రజలతో మాట్లాడి విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాక చిత్తనూరు గ్రామ సర్పంచ్‌ రఘునాధ్‌రెడ్డి తో పాటు కొద్ది మందితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నాం. అయితే ఘటనకు ముందు ఇప్పటికే గత రెండు సంవత్సరాలుగా చిత్త నూరు, ఏక్‌ లాస్‌ పూర్‌, జిన్నారం తదితర గ్రామాల ప్రజలు చిత్త నూరు ఇథనాల్‌ కంపెనీ వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రాంధీ పోరాట రూపమైన శాంతియుతంగా పోరాడుతున్నారు. ఈ రెండేళ్ళ కాలంలో సభలు, సమావేశాలు, గ్రామాలలో పాద యాత్రలు, శాస్త్రజ్ఞులతో ఇథనాల్‌ పరిశ్రమ యొక్క పర్యవసానాలు, గ్రామ సభ తీర్మాణాలు, ప్రజాసంఘాల నుంచి మద్దతు ఉద్యమాలను కొనసాగించాయి. కాని ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ పరిశ్రమ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉందని కాని, అది ప్రజలకు వినాశనకారి అని కాని ఎటువంటి స్పందన లేకుండానే కంపెనీని ప్రారంభించింది. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఎలా అణచివేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తూఉన్నది. చిత్తనూరు ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటి ఇందులో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రజల ముందు బహిర్గతం చేసి పోరాటాన్ని ఉదృతం చేసి పరిశ్రమను ఆ ప్రాంతంలో లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకు అర్థం చేపించడం కోసం ఒక ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఆ కంపెనీ పనులు పూర్తి చేసుకుంటు ఇటీవల కంపెనీ వారు వ్యర్థమైన విష రసాయన పదార్థాలను పక్కనే ఉన్న మన్నెవాగులోకి వదిలేశారు.  ఆ ప్రభావంతో చేపలు, జింకలు ఇతర వన్య ప్రాణులు చనిపోయినవి. చిన్న పిల్ల లు తెలియక వాగులో స్నానం చేయగా శరీరం మీద దద్దుర్లు ఏర్పడి ఎర్రగా మారి పోయింది. నిమ్స్‌ కి చికిత్సకు తరలించారు.  ప్రజల ఆందోళన గమనించిన కంపెనీ వారు ఆ విష రసాయన ద్రవ పదార్థాలను ట్యాంకర్ల ద్వారా కొంచెం దూరంగా రోడ్ల పైన, పక్కన పోశారు. ఇది గమనించిన ప్రజలు ఆ వాహనాల ను పోలీసు స్టేషన్‌ లకు అప్పగించారు. ఇలా రోడ్ల మీద పోసినా, వాగులో కి వదిలినా ప్రజల, పశువుల, ఇతర ప్రాణుల ప్రాణాలకి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళనతో చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం 21-10-23 న వెళ్లి నారాయణపేట జిల్లా కలెక్టర్‌ గారికి పరిస్థితులు వివరించడం జరిగింది. ఆయన ఆర్‌.డి.ఒ. గారిని పంపిస్తామని చెప్పారు.  21-10- 23 రాత్రి వేళల్లో ఒక భారీ వాహనం తరలిస్తుండగా ప్రజలు పట్టుకున్నారు. రాత్రి ఆరు వందల మంది వరకు అక్కడ కాపలా ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు ఎంఆర్‌ఒ సునీత రావడం ఆమెతో పాటు పోలీసు అధికారులు రావడం సమస్య పరిష్కారం దిశగా ట్యాంకర్‌ను కంపెనీలో చెక్‌ చేయాలని ఒక ఆలోచన, లేదు హైదరాబాద్‌కు తీసుకెళ్ళి పరీక్షించాలనే ఒక ఆలోచనతో చర్చలు జరుగుతున్నాయి.

ఆ చర్యలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో డిఎస్‌పి సత్యనారాయణ రావడంతోనే లాఠీ చార్జికి ఆర్డర్‌ ఇవ్వడంతోనే హింస చెలరేగిందని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాక పోలీసు లాఠీ చార్జి చేసినప్పటికి ప్రజలు పారిపోయే ప్రయత్నంలోనే ఉన్నారు. కాని మహిళలపై కూడా లాఠీ చార్జి చేసి వాళ్ళ కాళ్ళకు తీవ్రమైన గాయాలతో రక్తాలను చూసిన తరువాతనే ప్రజలు కూడా తిరగబడ్డారు. రాళ్ళు, కర్రలతో పోలీసులపైకి దూసుకువచ్చారు. దాన్ని గమనించిన కొద్దిమంది పోలీసులు అక్కడే ఉన్న గుడిలోకి వెళ్ళి లోపల గడి పెట్టుకొని బంధించుకున్నారు. అప్పటికే అరెస్టు చేసిన నాయకులను పోలీసు అధికారులు వాళ్ళ వారిని విడిపించుకోవడం కోసం వాళ్ళను వదిలేసారు. నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఈ హింసను, పోలీసుల బంధించడాలను ప్రజాస్వామ్యం కాదని పోలీసు వాళ్ళందరిని వదిలి పెట్టారు. ఆ తర్వాత పోలీసులు విపరీతంగా లాఠీ చార్జి చేసేసరికి నాయకులతో సహ అందరూ పారిపోయారు. పోలీసులపై దాడి ఘటనను, వజ్ర వాహనాన్ని దగ్దం చేసిన ఘటనను సాకుగా తీసుకొని పోలీసులు ఈ మూడు గ్రామాలపై విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది వరకు పోలీసులు రిమాండ్‌ చేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. ఎక్లాస్‌పూర్‌, చిత్తనూర్‌ గ్రామాలపై పోలీసులు రాత్రంతా ముఖ్యంగా పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల ఇళ్ళపై దాడులు చేశారు. కానీ ఆ మూడు గ్రామాలల్లో ఒక మగ మనిషి లేడంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. పోలీసుల బెదిరింపులు జరిగిన హింసాత్మక ఘటనలు చూసి పోలీసులు చేస్తున్న దాడులను చూసి మగమనుషులెవరూ గ్రామాల్లోకి రాలేక పోతున్నారు. గ్రామాల్లో కూడా ఇండ్లలో ఉన్న ఆడవాళ్ళను రోజు రాత్రి రెండుమూడు సార్లు తలుపులు దౌర్జన్యంగా తెరిపించి మగవాళ్ళ గురించి ఆచూకి కోసం ప్రయత్నిస్తూ అసభ్య పదజాలంతో తీవ్ర హింసలకు గురిచేస్తున్నారు. మమ్మల్ని కలిసిన చిత్తనూరు ప్రజలు దళితుల ఇండ్లపై విపరీతంగా దాడులు చేస్తున్నారు. మగవాళ్ళు గ్రామంలో లేరని తెలిసినప్పటికి అర్థరాత్రులు 2,3 సార్లు వచ్చి తలుపులు విరగ్గొట్టినంత పని చేస్తున్నారు. ఒక వైపు పరిశ్రమ నుంచి వస్తున్న వాసనతో మేము ప్రాణాలు కోల్పోతామని భయపడుతుంటే, మరొక వైపు రెండు రోజులుగా పోలీసులు మా గ్రామాలపై పడి మనుషులను ఎత్తుకొని పోవడం చూసి ప్రభుత్వం పరిశ్రమాధిపతుల వైపు ఉన్నదని అర్థమైనందున మా అందరిని చంపేసి మా భూములు, జాగలన్ని పరిశ్రమకు ఇచ్చేయండి అని ప్రభుత్వాన్నే కోరుతున్నామని  పౌరహక్కుల సంఘం   దృష్టికి తీసుకువచ్చారు.

గత రెండేళ్ళుగా చేస్తున్న శాంతియుత పోరాటం పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. నిజంగానే ప్రభుత్వానికి ఇథనాల్‌ కంపెనీ గురించి, అక్కడి ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా ఉండడంలో వారికి నిజంగా తెలియదని మనమెవరం అనుకోలేం. రెండేళ్ళుగా అక్కడి ప్రజలు శాంతియుతంగా గాంధేయమార్గంలో పోరాడుతున్నప్పటికి వాళ్ళ సమస్యలకు శాస్త్రీయమైన శాశ్వతమైన పరిష్కారాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ట్యాంకర్‌ను బంధించిన ఘటనను సాకుగా చేసుకొని ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడం కోసం ప్రభుత్వం పోలీసులు కలిసే ఈ హింసాత్మక ఘటనలకు కారణమయ్యారు.

ఈ ఘటనలకు ముందు పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను నిలువ చేయడం కోసం ఇప్పటికే పరిశ్రమలో మూడు చెరువులు తవ్వారని అవి నిండిపోయాయని ఆ కారణంగా ఆ వ్యర్థ పదార్థాలను మొన్నటి వరకు మన్నె వాగులో, ఖాళీ పొలాల్లో, రహదారులకు ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ ఈ వ్యర్థాలను వదిలేస్తున్నారు.పరిశ్రమ ఏడాది లోపటనే తన వ్యర్థాలను ఎక్కడ వదిలేయాలో తెలియని పరిస్థితిలో కంపెనీ బయట చుట్టుపక్కట స్థలాల్లో వ్యర్థాలను వదిలివేయడం వలన అక్కడున్న ప్రజల ఆరోగ్య హక్కు, జీవించే హక్కు పూర్తి ప్రమాదంలో పడుతున్నాయి. దానికోసమే కదా వీళ్ళు రెండేళ్ళుగా శాంతియుత పోరాటం చేస్తున్నది. దాన్ని గుర్తించని ప్రభుత్వాలు ఇప్పుడు తప్పుడు కేసులతో 150 మందిని జైళ్ళలో తోయాలని చూస్తున్నారు. అక్టోబర్‌ 24, 2023 సాయంత్రం 5`6 గంటల ప్రాంతంలో హైదరాబాదులో ఉన్న ప్రధాన నాయకత్వం బండారు లక్ష్మయ్య, దాసరి చంద్రశేఖర్‌ లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు కాబడి 24 గంటలు దాటుతున్నా అరెస్టు ప్రకటించడం లేదు. నారాయణ పేట్‌ ఎస్‌పిని పోరాట కమిటి నాయకుడు చంద్రశేఖర్‌ సహచర్‌, స్వరూప కలిసినప్పటికి బాధ్యతాయుతమైన సమాధానాన్ని ఎస్‌పి నుంచి పోందలేకపోయారు. ఈ నేపథ్యంలో పౌరహక్కుల సంఘం ఈ ఘటనతోనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మూడు పంటలకు నెలవైన మరికల్‌ మండల గ్రామాలల్లో ఇటువంటి కాలుష్య కారకమైన ఇథనాల్‌ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని రైతుల పంటలకు అవకాశం ఇవ్వాలని పౌరహక్కుల సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ నిర్మాణం పూర్తి చేసుకుని ‘‘ఇథనాల్‌ ఉత్పత్తి’’ప్రారంభించి వ్యర్థ పదార్థాలు ఎక్కడ నిల్వ చేయలేని స్థితి నుంచి నేడు జరుగుతున్న హింసాత్మక ఘటనలను మనం ఆలోచించాలి.  కంపెనీ నుండి వెలువడే బొగ్గుపులుసు వాయువు వల్ల దాని చుట్టూ నివసించే ప్రజలకు తీవ్రమైన హాని కలిగే అవకాశముంది. చిత్తనూరు చుట్టూ ఉన్న ఎక్లాస్పూర్‌, జిన్నారం, జిన్నారం తాండ, పర్దీపురం, పర్దీపురం తాండ, సీతారాంపేట, దమగ్నాపూర్‌, కుమార్‌ లింగంపల్లి, పర్కపురం, రాంపూర్‌, లంకాల, నర్వ, పాతరేడ్‌, ఉందేకోడ్‌, జంగంరెడ్డిపల్లి, కన్మనూర్‌, కన్మనూర్‌ తాండలు, మరికల్‌, వీరపట్నం, పెద్దచింతకుంట, లాల్కోట, గ్రామాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. మన్నెవాగు పరిసర గ్రామాలైన నెల్లికొండి, చిన్నవడ్డెమాన్‌, పెద్దవడ్డెమాన్‌, అప్పంపల్లి, ఏదులాపూర్‌, దుప్పల్లి, చిన్న చింతకుంట, అల్లీపూర్‌, అమ్మాపూర్‌, మద్దూర్‌, కురుమూర్తి, గోపనపల్లి, రామన్‌ పాడ్‌ డ్యామ్‌ ద్వారా సాగు త్రాగు నీరు అందే వందల గ్రామాలు పరోక్ష ప్రభావంలో నుండి ప్రత్యక్ష ప్రభావితంలోకి వస్తాయి. మొత్తంగా మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాలలోని ప్రజలు బాధితులుగా మారారు.

మానవ మనుగడకే ప్రమాదం తెస్తున్న జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్‌ మరియు ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఇథనాల్‌ కంపెనీని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించ రాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చిత్తనూరులో ఏర్పాటుచేస్తున ఆ ఇథనాల్‌ కంపెనీని వెంటనే రద్దుచేయాలి. విశాల ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. పుట్టి పెరిగిన మన ఊరును మనఉ భద్రంగా కాపాడుకోవాలంటే ఇంటింటికి ఒకరు కదిలి ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడాలి. ఇథనాల్‌ కంపెనీ మూసివేయాలని ఇథనాల్‌ పరిశ్రమ వ్యర్థ పదార్థాలతో కాలుష్య కారకమవుతుందని దాంతో ప్రజలు ఆరోగ్యంగా జీవించే హక్కు కోల్పోతారని మనందరం గ్రహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

One thought on “చిత్తనూర్‌లో  ఇథనాల్‌- రాజ్య హింస

 1. మా సత్యం

  జైల్లో పెట్టాల్సింది
  ఇథ నాల్ కంపెనీ యొక్క యాజమాన్యాన్ని, పర్యావరణ కాలుష్యనికి, విధ్వంసానికి తోడ్పడి అనుమతి జారీ చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు చేపట్టకుండా మౌనం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఆవిర్భావ కాలం నుంచి నేర సామ్రాజ్యాన్ని అన్ని రంగాలలో విస్తరించుకుంటుంది. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ కాలుష్యము చుట్టుపక్కల ఇతర గ్రామాల్లో వ్యాపిస్తున్న కూడా నిత్యం కాలుష్యముతో బలివుతున్న ప్రజల ఆవేదన పట్ల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించాల్సిన కేసు పై మౌనం వహించడం చారిత్రక నేరం.
  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సంఘటన పట్ల యుద్ధ ప్రతిపాదికన స్పందించి అక్రమంగా అరెస్టు చేసి హింసలకు గురిచేసిన పోలీస్ అధికారులపై చర్యలు చేపడుతూ
  ఇథనాల్ కంపెనినీ మూసివేయాలని తగు ఉత్తర్వులు జారీ చేసి కోర్టుల పట్ల ప్రజల నుంచి తమ విశ్వాసాన్ని పెంపొందించుకుంటారని మనవి చేస్తున్నాను.
  జైల్లో నిర్బంధించిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply