ఆధునిక చరిత్రలో ఒక దేశాన్ని మరోదేశం దురాక్రమించడం లేదా వలసగా మార్చుకోవడం చూశాం. కాని అత్యధిక ప్రపంచ దేశాలచే గుర్తించబడి, చారెడు నేలకు నోచుకోక పోవడమనే దుస్థితి ఊహకందని విషయం. అదోక వాస్తవమై పాలస్తీనాగా మన కళ్లముందు కనిపిస్తోంది. పాలస్తీనా ఐరాస సభ్యదేశం, అలీన దేశాలలో గుర్తింపు పొందిన దేశం. ఆ దేశానికి రాజధాని లేదు. దాని పాలనలో ఉన్న ప్రజలు ఒకచోట లేరు. పాలస్తీనా వెలుపల (40 లక్షలు) సగం మంది కాందీశీకులుగా ఉన్నారు. ఇది ఒక భయంకర పరిస్థితి, దీని చరిత్ర అంతా పోరాటాల, త్యాగాల, రక్తసిక్త చరిత్ర. తమ మాతృభూమి కోసం 75 ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. పాలస్తీనా ప్రజలపై అమెరికా దన్నుతో దశాబ్ధాలుగా ఇజ్రాయెల్‌ క్రూరత్వం కొనసాగిస్తూనే ఉంది. పాలస్తీనియన్ల ఈ దయనీయ స్థితికి జియోనిస్టు జాత్యహంకార ఇజ్రాయిలీలు, అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాద దేశాలు కారణం. ప్రపంచంలో ప్రతి దురాక్రమణ వెనుక, యుద్ధం వెనుక ఉండేదీ సామ్రాజ్యవాదమేనన్నది అక్షర సత్యం. అందులో ప్రధానంగా 1945 తదనంతరం అమెరికా యుద్ధోన్మాదం పలు దేశాల వనరులను కొల్లగొట్టడానికి రెండు దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు సృష్టించి, దేశాధినేతలను హత్య చేయించి, కోట్లాది ప్రజలను బలితీసుకున్న చరిత్ర అమెరికాదని మనందరికి స్పష్టంగా తెలిసిన విషయమే.

పాలస్తీనా – ఇజ్రాయెల్‌ వివాధానికి మూలాలు :

వేయి సంవత్సరాల క్రితమే పాలస్తీనా నుండి వెళ్లగొట్టబడిన యూదులు జెరూసలేంను వదలి వ్యాపారరీత్యా యూరప్‌ దేశాలకు వెళ్లిపోయారు. యూదులు ప్రధానంగా పట్టణాల్లో ఉండటం, వ్యాపారంలో అభివృద్ధి చెందడం క్రిస్టియన్‌ పాలక వర్గాలకు కంటగింపుగా ఉండడంతో ఆ దేశాలలో  క్రైస్తవులచే అవమానాలకు, హింసకు, హత్యలకు గురైనారు. 1896లో థియోడర్‌ హెర్జెల్‌ యూదులకు తమ పవిత్ర గ్రంథం జెరూసలేం తమ పూర్వీకులదని చెబుతోందనీ ఇచ్చిన పిలుపుతో తమకంటూ ఒక చిరునామ లేని జాతి పాలస్తీనియన్ల చెంతకు చేరింది. తాము ఉండడానికి కాసింత స్థలం అడిగింది. అరబ్‌లు సోదరులు లాగా  కలసి జీవిద్దామన్నారు. 19వ శతాబ్ది చివరినాటికి ఈ జియోనిస్టు ఉద్యమం క్రమంగా వలసవాద ఉద్యమంగా తయారై చాలామంది యూదులు పాలస్తీనా వెళ్లి స్థిరపడ్డారు. హిబ్రూ భాష కూడా పునరుజ్జీవించింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్‌ సేనలు పాలస్తీనాను ఆక్రమించాయి. మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతుండగానే 1916లో టర్కీ సామ్రాజ్యంలోని దేశాలను బ్రిటన్‌-ఫ్రాన్స్‌లు సైక్స్‌-పికాట్‌ ఒప్పందం ద్వారా పంచుకున్నాయి. పాలస్తీనా బ్రిటన్‌కు వచ్చింది.  ఐరోపాలోని యూదు పెట్టుబడిదార్ల నుండి యుద్ధ సహకారం బ్రిటన్‌ పొందింది. దీంతో 1917 నవంబర్‌లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ లాయడ్‌ జార్జ్‌, విదేశాంగ కార్యదర్శి ఆర్థర్‌ బాల్‌ఫోర్‌ ఇద్దరూ జియోనిజం డిమాండ్లకు లొంగిపోయారు. యుద్ధానంతరం ‘యూదు ప్రజలకు ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తాము’ అని వారు 1917లో ప్రకటించారు. దీనినే బాల్‌ఫోర్‌ ప్రకటన అంటారు.

బాల్‌ఫోర్‌ ప్రకటన తర్వాత పాలస్తీనా అరబ్‌ కాంగ్రెస్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంతో సహాయ నిరాకరణ ప్రారంభించి బ్రిటిష్‌ వారు ఏర్పాటుచేసే చట్టసభల ఎన్నికలను బహిష్కరించింది. ఈ బహిష్కరణ విజయవంతమైంది. సహాయ నిరాకరణ చాలా సంవత్సరాలు కొనసాగింది. అమెరికా, ఇంగ్లాండ్‌ మద్దతుతో ఈ ప్రాంతం తమదేనని పేచిపెట్టి పాలస్తీనియన్లతో యూదులు కయ్యానికి దిగారు. 14వ శతాబ్దం నుండి పాలస్తీనా ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగం. మొదటి ప్రపంచ యుద్ధం(1914-19)లో టర్కీ  ఓటమి పాలవ్వడంతో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ 1922లో బ్రిటన్‌ సామ్రాజ్యవాదులకు ఒట్టోమన్‌ సామ్రాజ్యంలోని టర్కీ తప్పా మిగిలిన భూభాగంపై పాలనాధికారం ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం (1939-45) తర్వాత వలసరాజ్యాలు చాలావరకు స్వతంత్ర దేశాలుగా మారాయి. అందులో భాగంగానే బ్రిటన్‌ తన పాలనలో ఉన్న జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌, లిబియా దేశాల సరిహద్దులను గుర్తించింది. కాని పాలస్తీనా సరిహద్దులు గుర్తించకుండానే మే 14, 1948లో అర్థరాత్రి బ్రిటన్‌ పాలనాధికారం నుండి వైదొలగింది.

1945 తర్వాత ప్రపంచంలో అమెరికా ఒక అగ్ర రాజ్యంగా వెలిసింది. 20వ శతాబ్దం ఆరంభంలో పర్షియా, సౌదీ వంటి గల్ఫ్‌ దేశాలలో చమురు పరిశ్రమ విస్తృతి చెందింది. పశ్చిమాసియాలో పెట్రోలియం నిల్వలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాలస్తీనా భౌగోళికంగా ఆసియా, యూరప్‌, ఆఫ్రికా దేశాలకు రవాణా మార్గ కూడలిలో ఉండడంతో పశ్చిమాసియాలో అమెరికాకు ఒక తొత్తు దేశం ఏర్పాటు చేసుకోవాల్సిన రాజకీయ అవసరం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో అమెరికా చొరవతో 1947 నవంబర్‌ 29న ఐ.రా.స పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని దేశంగా గుర్తించాలని భావించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి 181 తీర్మాణం చేసింది. దీని ప్రకారం పాలస్తీనా భూభాగంలో ‘ఒక దేశం- రెండు జాతులు అన్న భావనతో పాత పాలస్తీనాలో 43 శాతం పాలస్తీనాకు, 56 శాతం ఇజ్రాయెల్‌కు, 1 శాతం జెరూసలేంకు కేటాయించాలని తీర్మాణించింది. ఈ తీర్మాణాన్ని అమలుచేసే ప్రక్రియను ఐక్యరాజ్యసమితి ప్రారంభించకముందే, మే 15, 1948 నాడు ఇజ్రాయెల్‌ నాయకుడు డేవిడ్‌ బెన్‌ గురియన్‌  ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. అదేరోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ ఇజ్రాయెల్‌ను ఒక స్వతంత్ర సార్వభౌమాధికార దేశంగా గుర్తించాడు. 1949లో ఐరాస ఇజ్రాయెల్‌ను గుర్తించింది.

75 సంవత్సరాలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ ఆగడాలు :

ఇజ్రాయెల్‌ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం అరబ్‌ దేశాలకు నచ్చలేదు. పాలస్తీనాకు న్యాయం చేయడానికి ఆ దేశాలు 1948లో ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగాయి. కాని ఓటమి పాలయ్యాయి. యూదు   గుండాలు పాలస్తీనా పౌరులు నివసించే ప్రాంతాల్లోకి చొరబడి గృహదానాలు, హత్యలు, హత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో 7 లక్షల మంది పాలస్తీనీయులు పక్కనున్న ఈజిప్ట్‌, సిరియా, లిబియా, జోర్డాన్‌, లెబనాన్‌ దేశాలకు కాందీశీకులుగా దేశం వదిలి వెళ్లారు. ఈ దాడులను ‘నక్బా మారణహోమం’ అంటారు. ఇజ్రాయేలీల హింసను అనాడే పాలస్తీనా ప్రజలు అనుభవించారు. కాలక్రమంలో జరిగిన యుద్ధాలతో పాటు, ఇజ్రాయెల్‌ నిర్బంధాన్ని తట్టుకోలేక నేటివరకు సగం మంది(40 లక్షలు) పక్క దేశాలకు వెళ్లారు. 2007 తర్వాత నెతన్యాహు ప్రధానిగా ఎన్నిక కావడంతో ఒకవైపు  పాలస్తీనియన్లపై నిర్బంధం, మరోవైపు సెటిల్‌మెంట్‌(నివాస కాలనీలు) ఏర్పాటు వల్ల పాలస్తీనా భూభాగంలో 90 శాతం ఇజ్రాయెల్‌ ఆధీనంలోకి వెళ్లింది.

ఇజ్రాయెల్‌లో 1948లో యూదు జనాభా 5 లక్షలు ఉండగా ఇవ్వాళ 90 లక్షలకు చేరింది. పాలస్తీనా జనాభా 1948లో 80 లక్షలు ఉండగా ఇప్పుడు 40 లక్షలకు చేరింది. గాజా, వెస్ట్‌బ్యాంకు ప్రాంతాల్లో 40 లక్షల పాలస్తీనీయన్లు  జీవిస్తున్నారు. ఇజ్రాయెల్‌ పాలస్తీనియన్లపై 2008లో 23 రోజులు, 2012లో 8 రోజులు, 2014లో 50 రోజులు, 2021లో 11 రోజులు దాడికి పాల్పడిరది. అయినా తమ మాతృభూమి విముక్తి కోసం, తమ జాతి ఆత్మగౌరవం కోసం, పాలస్తీనా జాతి పోరాడుతూనే ఉంది. నెత్తుటి మడుగుల మధ్య, స్వేచ్ఛ కోసం రాజీలేని పోరాటం చేస్తూనే ఉంది. ఈ ప్రతిఘటన క్రమంలోనే హమస్‌ పుట్టింది. హమస్‌ నుండి ప్రతిఘటన పుట్టలేదు. ఈ సారి యుద్ధం అంతా ఆషామాషిగా ముగిసేది కాదని అర్థమవుతుంది.  75 ఏండ్ల పాలస్తీనియన్ల విశాద కన్నీటి చరిత్రే కాదు, అదో రక్తసిక్త చరిత్ర కూడా. పాలస్తీనా జాతి ప్రతిఘటనకు ప్రతిరూపమే హమస్‌.

హమస్‌ గమనం, గమ్యం :

హమస్‌ మూలాలు ముస్లిం బ్రదర్‌ హుడ్‌ ఉద్యమంలో ఉన్నాయి. ఈజిప్టు ఇస్లాం మతాధికారి హసన్‌ అల్‌-బన్నా 1928లో బ్రదర్‌హుడ్‌ ఏర్పాటు చేశారు. పాలస్తీనాలో 1930 దశకంలో అది తలెత్తింది. ముస్లిం సమాజాన్ని నూతన వరవడితో తీర్చిదిద్దడం దీని లక్ష్యం. 1964లో ఏర్పడిన పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్‌ఒ) పాలస్తీనా జాతీయ భావాలకు ప్రాతినిధ్యం వహించింది. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం పశ్చిమాసియా అంతటా ఇస్లామిక్‌ దృశ్యాన్ని మార్చివేసింది. పాలస్తీనా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా హమస్‌ 1987లో ఏర్పడిరది. దీన్నే ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ మూవ్‌మెంట్‌ అని కూడ పిలుస్తారు. ఈ సంస్థకు ఇరాన్‌ షియా ముస్లింల నుంచి, షియా అధికార గణాల నుంచి అన్ని రకాల మద్ధతు లభించింది.1987లో బయలుదేరిన మొదటి ఇంతెపధా (తిరుగుబాటు)తో హమస్‌ ప్రేరణ పొందింది. మే3, 1989లో హమస్‌ ఇద్దరు ఇజ్రాయెల్‌ సైనికులను అపహరించి హత్య చేయడంతో పాలస్తీనాలో తన ఉద్యమాన్ని ప్రారంభించింది. పాలస్తీనా విముక్తి ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన సంస్థ (పిఎల్‌ఒ). దీనికి నాయకుడు యాసర్‌ అరాఫత్‌. 1988 ఆగష్టు 19న హమస్‌ జారీ చేసిన చార్టర్‌లో యూదు మత వ్యతిరేక వ్యాఖ్యలున్నాయి. జీహద్‌ తప్ప పాలస్తీనాకు పరిష్కారం లేదని, శాంతి చర్చలు కాలహరణకు దారితీస్తుందని స్పష్టం చేస్తూ ఓస్లా ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. పిఎల్‌ఒ ఇజ్రాయెల్‌ను గుర్తించగా హమస్‌ రెండు రాజ్యాల పరిష్కారాన్ని తిరస్కరించింది.

హమస్‌ సాయుధ విభాగం పేరు ఇజ్‌ ఆద్‌-దిన్‌ అల్‌- ఖాసం బ్రిగేడ్స్‌. 2007 నుంచి పాలస్తీనాలో అన్ని వర్గాల నుంచి ప్రబలమైన మద్దత్‌ లభిస్తోంది. 2004లో పిఎల్‌ఒ నేత యాసర్‌ అరాఫత్‌ మరణం తర్వాత పాలస్తీనా పిఎల్‌ఒ, ఫతా పార్టీ నియంత్రణ మహమూద్‌ అబ్బాస్‌ చేతికి వెళ్లింది. హమస్‌ తన సైనిక బలాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని కలిపి పాలస్తీనా నేషనల్‌ అథారిటీ అని పిలుస్తారు. దీనికి ఐరాస గుర్తింపు ఉంది. 2006లో గాజాలో హమస్‌ తిరుగుబాటు చేసి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గాజా స్ట్రిప్‌లో 2007 నుంచి హమస్‌ సంస్థనే అధికారంలో ఉంది. 2006 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం గాజాపై హమస్‌ పట్టు మరింత పెరిగింది.

జెరూసలేం నగరంలో ఉన్న పవిత్రమైన అక్సా మసీదు ప్రాంతాన్ని విముక్తి చేయాలన్న లక్ష్యాన్ని హమస్‌ పెట్టుకుంది. అయితే ఇటీవలి కాలంలో యూదులు తమ పండుగలు జరుపుకోవడానికి ఈ మసీదుకు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హమస్‌ను నాశనం చేస్తానని ప్రకటించాడు. ఇజ్రాయెల్‌ ప్రతీకారం పశ్చిమాసియా అంతటా ప్రతిధ్వనిస్తాయనడంలోని అంతర్యాన్ని గమనించాలి. అయితే ఇజ్రాయెల్‌ రెండు వాస్తవికతలను పరిగణనలోకి తీసుకోవాలి. 1967 సరిహద్దులకు తిరిగి ఇజ్రాయెల్‌ను వెళ్ళగొట్టే శక్తి హమస్‌కు లేకపోవచ్చు. కానీ పాలస్తీనా భూభాగంలో హమస్‌ ప్రధానమైన శక్తిగా ఎదిగింది. హమస్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఇజ్రాయెల్‌- పాలస్తీనా సమస్యకు పరిష్కారం సాధ్యం కాదు. హమస్‌ పూర్తిగా నాశనం చేయబడితే తప్ప, రెండు, గతించిన కాలంలో హమస్‌ తమ వ్యవస్థాపక నాయకులందరినీ కోల్పోయినా, దాన్ని తీవ్రవాద సంస్థగా ముద్రవేసినా, తరచూ ఇజ్రాయెల్‌ దాడులకు గురవుతున్నా మరోరోజు పోరాడటానికి అది సజీవంగా పినిక్స్‌ పక్షిలాగా లేసి వస్తుందని నెతన్యాహు గుర్తించాలి.

పాలస్తీనియన్లకు యుద్ధం కొత్తకాదు. 75 ఏండ్లలో అత్యధిక యుద్ధాలను చూసిన నేల అది. అనూహ్యంగా మొదలైనట్టుగా కన్పిస్తున్న హమస్‌ అక్టోబర్‌ 7 నాటి దాడి వెనుక వందేళ్ల పాలస్తీనా నెత్తుటి చరిత్ర ఉంది. ప్రజల వ్యధ ఉంది. ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదం, జాత్యహంకారం, దురాక్రమణ, దిగ్బంధం ఉంది. నిజానికిది ఇజ్రాయెల్‌-హమస్‌ తగాదా కాదు. 75 ఏళ్ళుగా కొనసాగుతున్న పాలస్తీనా విస్ఫోటనం. ఐరాస భద్రతా మండలి ఆమోదం లేకుండానే సామ్రాజ్యవాద దన్నుతో ఏకపక్షంగా పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ దేశాన్ని ప్రకటించుకోవడంలో ఉంది. ఐరాస 1947లో చేసిన 181 తీర్మాణాన్ని, 1967లో చేసిన 242 తీర్మాణాన్ని అమలు చేయకపోవటంలో ఉంది. 1967 తర్వాత గాజా స్ట్రిప్‌, వెస్టుబ్యాంక్‌, తూర్పు జెరూసలేం అక్రమించుకోవడంలో ఉంది. ఇజ్రాయెల్‌ దురహంకారంతో అక్రమిత ప్రాంతంలో నివసిస్తున్న పాలస్తీనియన్ల జీవితాలను నియంత్రించడంలో ఉంది. ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానం అంతర్జాతీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఐరాస బలహీనతలో ఉంది. మొత్తంగా పాలస్తీనియన్లు తమ మాతృభూమిలో స్వతంత్రంగా జీవించే హక్కును ఇజ్రాయెల్‌ కబళించింది. అందువల్లనే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌ ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడి ఒక్కసారిగా జరిగింది కాదని, 56 ఏండ్లుగా పాలస్తీనీయులు అణచివేతకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఏర్పాటే సమస్యకు పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.

గాజాలో జాతి నిర్మూలన :

సాయుధ పోరాట గ్రూప్‌ హమస్‌, జియోనిస్టు యూదు జాత్యహంకార ఇజ్రాయెల్‌ దళాల మధ్య అక్టోబర్‌ 7 నుండి దాడులు- ప్రతి దాడుల్లో ప్రజలు చనిపోవడం యావత్‌ ప్రపంచాన్ని కలచి వేస్తోంది. 75 ఏండ్లుగా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుని, పాలస్తీనియన్లను తమసొంత భూమి మీదనే శరణార్థులుగా మార్చిన ఇజ్రాయెల్‌ అకృత్యాలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో హమస్‌ను మాతృభూమి సాధన కోసం పోరాడుతున్న ఒక సాయుధ సంస్థగా చూసే బదులు కేవలం ఒక తీవ్రవాద సంస్థగా పరిగణించడం అంటే పాలస్తీనా ప్రజానీకాన్ని పక్కదారి పట్టించి ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అన్ని రకాల దుర్మార్గాలనూ సమర్థించడమే అవుతుంది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, దాని కొమ్ముకాస్తున్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు ఒక జాతికి చెందిన ప్రజలను పాదాక్రాంతం చేసుకోవడానికి, వారికి చెందిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సాగిస్తున్న బల ప్రయోగాన్ని చాలా న్యాయమైనదిగా చెప్పుకోవడం హస్యాస్పదం. 

హమస్‌ అక్టోబర్‌ 7న చేసిన దాడికి ప్రతిస్పందించే పేరుతో గాజా భూభాగం మొత్తాన్ని ఇజ్రాయెల్‌ భారీ బాంబుల వర్షంతో ముంచెత్తుతోంది. అంతటితో ఆగకుండా గాజాకు ఆహారం, విద్యుత్తు, గ్యాస్‌, మంచినీరు అందకుండా కట్టడి చేసింది. అక్టోబర్‌ 13, 2023న గాజా ప్రాంతంలో నివసిస్తున్న 22 లక్షల మంది ప్రజానీకానికి (వీరంతా కేవలం 365 చ.కిమీ పరిధిలోనే జీవిస్తున్నారు) 24 గంటల్లోగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. గత రెండు వారాలుగా గాజాపై ఎడతెగకుండా సాగుతున్న ఇజ్రాయెలీ బాంబు దాడుల వల్ల అక్కడ నివసిస్తున్న 23 లక్షల పాలస్తీనియన్ల జీవనం నడకప్రాయంగా మారింది. పరిస్థితి హృదయవిధారకంగా ఉంది. దీనికి అమెరికా దాని మిత్ర సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయెల్‌కు పూర్తిగా అండగా నిలిచాయి.

గాజా నుండి ఈజిప్ట్‌ పోవడానికి ఉన్న ఒకే ఒక్క దారినీ బాంబు దాడితో ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. దాంతో ఆ దారిని ఉపయోగించడానికి వీలులేకుండా పోయింది. పైగా తన దేశంలోకి పాలస్తీనా శరణార్ధుల్ని అనుమతించబోనని ఈజిప్ట్‌ ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్‌ ఆదేశించినట్టు గాజా భూభాగాన్ని 24 గంటల్లో ఖాళీ చేయడం అసాధ్యం అయింది. ఒకవేళ గాజా నుండి బైటకు రావడానికి దారి తెరచి అనుమతించినా, 10 లక్షల మంది ప్రజానీకాన్ని, అందునా, వృద్ధుల్ని, రోగుల్ని, స్త్రీలను, చిన్నపిల్లల్ని, కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయించడం సాధ్యమేనా? ఇటువంటి గడువు విధించడమంటే గాజా నివాసులను తమ పదాతి దళాల దాడుల ద్వారా అంతమొందించడాన్ని సమర్థించుకోవడానికి ఒక ఎత్తుగడ వేసిందని అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే రోడ్ల మీద సైన్యం వేస్తున్న బాంబుదాడుల ఫలితంగా వేలాదిమంది ప్రజల  ప్రాణాలు పోతున్నాయి. అంటే ఇప్పుడు పాలస్తీనా జాతిని నిర్మూలించే దుస్సాహాసిక యుద్ధానికి దిగింది.

‘‘మొత్తంగా గాని, పాక్షికంగా గాని ఒక జాతి, లేదా తెగ లేదా మత సమూహాన్ని నిర్మూలించడానికి చేపట్టే చర్యలను జాతి నిర్మూలనగా పరిగణించాలి’’ అని 1948 జెనీవా సదస్సులో ఐరాస తీర్మానించింది. ప్రస్తుతం గాజాలో సాగుతున్నది ఆ ఐరాస తీర్మానానికి సరిగ్గా సరిపోతుంది. అయితే ఈ దారుణాన్ని సామ్రాజ్యవాద శక్తులు సమర్ధిస్తున్నాయి. హమస్‌ అనేది ఒక తీవ్రవాద సంస్థ అని, అది ఇజ్రాయెల్‌ మీద దుర్మార్గంగా దాడికి తెగబడిరదని, భవిష్యత్తులో కూడా హమస్‌ నుండి దాడుల ముప్పు ఇజ్రాయెల్‌కు ఉందని, తీవ్రవాద దాడుల నుండి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, హమస్‌ దళాలు గాజా ప్రజానీకం వెనుక దాక్కుని ఉన్నందున హమస్‌ను లొంగదీయాలంటే గాజా మీద దాడులు అనివార్యం అని ఇజ్రాయెల్‌ దాడులను సామ్రాజ్యవాదులు సమర్థిస్తున్నారు. హమస్‌ ఒక తీవ్రవాద సంస్థ అని అంగీకరించినా, ఎలుకలు ఉన్నాయని ఇళ్ళు తగలబెట్టే చందంగా ఒక దేశంలో తీవ్రవాదులు దాక్కొని ఉన్నారనే సాకుతో ఆ దేశంలోని ప్రజానీకాన్ని తుదముట్టించే హక్కు ఏ దేశానికైనా ఉందని అంతర్జాతీయంగా ఏ చట్టమూ ఒప్పుకోదు.

జెనీవా నాల్గవ సదస్సు తీర్మాణం ప్రకారం ఏ కొద్దిమందో నేరం చేసినందుకు మొత్తం ప్రజానీకాన్ని, వారు వ్యక్తిగతంగా ఏ నేరమూ చేయకపోయినా, ఉమ్మడిగా శిక్షించడం యుద్ధ నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ చేస్తున్నది ఉమ్మడిగా శిక్షించడం మాత్రమే కాదు. మొత్తం ఒక జాతినే నిర్మూలించే దాడికి పూనుకుంటోంది. నిజానికి హమస్‌ను ఒక తీవ్రవాద సంస్థగా అభివర్ణించడం అంటే 75 సంవత్సరాల పాలస్తీనియన్ల చరిత్రను చూడకుండా కళ్ళు మూసుకోవడమే. ఈ 75 ఏళ్ళ పాటూ పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంటూనే ఉంది. పాలస్తీనా ప్రజల్ని దారుణంగా అణచివేస్తూనే ఉంది. చిత్రహింసలపాలు చేస్తూనే ఉంది. వారి సంపదలను కొల్లగొట్టి నిరాధారులుగా నిలబెట్టింది. ఈ దాడులకు పరాకాష్ట అరబ్బులకు పవిత్రమైన అల్‌-అక్సా మసీదును ధ్వంసం చేయడం. ఈ చర్యలే హమస్‌ దాడిని పురికొల్పిందని చెప్పవచ్చు.

అంతర్జాతీయ న్యాయసుత్రాల ప్రకారం, ఇజ్రాయెల్‌ బలవంతంగా తమ భూభాగాలను ఆక్రమించుకుంటున్నప్పుడు సాయుధ ప్రతిఘటనతో సహా అన్ని రకాలుగా ఎదుర్కొనే హక్కు పాలస్తీనియన్లకు ఉంది. 1983లో ఐరాస సర్వసభ్య సమావేశం తీర్మానం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. ‘‘తమ స్వాతంత్య్రాన్ని, సరిహద్దులను, జాతీయ సమైక్యతను కాపాడుకోవడానికి, వలసాధిపత్యం నుండి, జాతి వివక్షత నుండి, విదేశీ దురాక్రమణ నుండి విముక్తి సాధించుకోవడానికి, సాయుధ పోరాటంతో సహా అన్ని రకాల పోరాటాలనూ చేపట్టే అధికారం బాధిత ప్రజలకు ఉంటుంది’’ అని ఆ తీర్మానం స్పష్టం చేసింది. హమస్‌ను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, జియోనిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థగా చూసేబదులు కేవలం ఒక తీవ్రవాద సంస్థగా పరిగణించడం అంటే ఐరాస తీర్మాణాన్ని ఉల్లంఘించడంతో బాటు ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అన్ని రకాల దుర్మార్గాలనూ సమర్థించడమే అవుతుంది. అది అన్యాయమే కాదు, అనైతికం కూడా.

గాజాలో ధ్వంసమైన  గ్రామీణ ప్రజా జీవన వ్యవస్థ :

గత మూడు వారాల్లో ఇజ్రాయెల్‌ బాంబుదాడుల్లో 3వేల మంది చిన్నారులతో సహా 7 వేల 3 వందల మంది చనిపోయారు. వీరిలో 2000 మంది మహిళలు ఉన్నారు. 18 వేల మందికిపైగా గాయపడ్డారు. దాదాపు పది లక్షల మంది శరణార్థులుగా మారారు. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా రుద్ర భూమిగా మారింది. ఎక్కడ చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తాయి. అక్కడ నేలమట్టమైన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహలు, క్షతగాత్రుల ఆక్రందనలు. ఎటువైపు నుంచి మృత్యువు తరుముకొస్తుందో తెలియదు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య గాజాలో ప్రతిక్షణం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ నివసించడం అంటే నిత్యం బుల్లెట్‌లతో సహావాసం చేయాలి. దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా జీవించాలి. దశాబ్దాలుగా ఎడతెగని ఈ పోరులో గాజా స్ట్రిప్‌ వణుకుతోంది. ఆసుపత్రుల్లో జనరేటర్ల కోసం ఇంధనం నిండుకుందని, చిన్నారులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారని గాజా ఆసుపత్రుల అధికారులు దయనీయస్థితిలో వేడుకుంటున్నా ఇజ్రాయెల్‌ కనికరించడం లేదు. ఇంధన ట్యాంకులు ఆసుపత్రులకు చేరకుండా సరిహద్దు ప్రాంతాల్లోనే నిలిపివేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లుహెచ్‌ఎ) సైతం గాజాకు మానవతా సాయం అత్యవసరంగా అందాల్సి ఉందని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకించి ఇంధనం చాలా కీలకంగా మారిందని, ఈ దశలో పూర్తి స్థాయిలో సురక్షితమైన మానవతా సాయం అందాల్సి ఉందని డబ్య్లుహెచ్‌ఎ ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల డైరెక్టర్‌ డాక్టర్‌ ఇక్‌ బ్రెన్నన్‌ కోరారు.

గాజాపై ఇజ్రాయెల్‌ నిరంతరంగా కొనసాగిస్తున్న బాంబు దాడులు, వైద్య సరఫరాలు, సిబ్బంది కొరత కారణంగా మొత్తంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. తక్షణమే ఈ వ్యవస్థ పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ పరిస్తితులపై తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రపంచ దేశాలు పట్టించుకోవడం లేదని అన్నారు. గాజాలో 30 శాతానికి పైగా ఆస్పత్రులు మూతపడ్డాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మూడిరట రెండు వంతులు మూతపడ్డాయని తెలిపింది. బాంబు దాడులతో సర్వం ధ్వంసం కావడం, ఇంధన కొరత కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇజ్రాయెల్‌ బాంబు దాడులతో గాజా పొరుగు ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ జీవన పరిస్థితులన్నీ అస్తవ్యస్థంగా మారాయి.  సర్వం వదిలి లక్షలాది మంది వలస బాట పట్టారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా, పాశ్చాత్య దేశాల మద్ధతు :

ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించేందుకు అమెరికా తూర్పు, మధ్యదరా సముద్ర స్థావరాలకు నావికులను, యుద్ధ నౌకలను పంపింది. యుఎస్‌ఎఫ్‌ ఐసన్‌ హోవర్‌, యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ యుద్ధ విమానాలు నావికులను అమెరికా సైనిక స్థావరాలకు చేర్చాయి. అలాగే ఎఫ్‌ 15, ఎఫ్‌ 16, ఎ 10 యుద్ధ విమానాలను కూడా పంపారు. అంతర్జాతీయ చట్టాలను అమెరికా, ఇజ్రాయెల్‌ ఇష్టం వచ్చినట్లుగా ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. బాంబులను కురిపించడం ద్వారా యుద్ధ నేరాలకు ఈ రెండు దేశాలు పాల్పడుతున్నాయి. అమెరికాలో సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌, ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా బైడెన్‌ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిరచారు. మానవీయ సంక్షోభం పట్ల ఇరువురు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కాల్పుల విరమణ జరగాలని కోరారు. ఈ పోరును మరింత తీవ్రతరం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇజ్రాయెల్‌ దాష్టీకాలను ఖండిస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తుంటే, వాటిని లెక్కచేయకుండా సామ్రాజ్యవాద దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ఇజ్రాయెల్‌కు కొమ్ముకాస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు యుద్ధోన్మాదంతో రెచ్చిపోతుంటే పశ్చిమ దేశాల నేతలు ఒక్కొక్కరూ వచ్చి ఆయనకు వత్తాసు పలుకుతున్నారు. బైడెన్‌, ఒలాఫ్‌ షుల్జ్‌, సునాక్‌, మాక్రాన్‌ ఇజ్రాయెల్‌ను సందర్శించి హమస్‌పై దాడులకు మరింత ఆజ్యం పోస్తున్నారు. 75 సంవత్సరాలుగా పాలస్తీనా ఏర్పాటుకు అంగీకరించకుండా ఎనలేని కష్టాలకు గురిచేస్తున్న అమెరికా, దురాక్రమణకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను సమర్థించడం దుర్మార్గం. ఐక్యరాజ్యసమితి చేసిన పాలస్తీనా సానుకూల తీర్మానాలను సైతం అమలు జరుగకుండా అడ్డుపడుతోంది.

 ఐరాస యుద్ధవిరమణ తీర్మాణం గాజాకి ఓదార్పు :

జోర్డాన్‌ అభ్యర్థన మేరకు అక్టోబర్‌ 26, 27 తేదిలలో 193 దేశాల ప్రాతినిధ్యం గల ఐరాస ప్రత్యేక సాధారణ సభ జరిగింది. ఇజ్రాయెల్‌ గాజాలో కాల్పుల విరమణతో పాటు గాజాకు మానవత సహాయం చేయడానికి జోర్డాన్‌ ప్రతిపాదించిన తీర్మాణానికి మద్ధతుగా 120 దేశాలు, కేవలం 14 దేశాలు మాత్రమే తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు చేశాయి. కాగా 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అందులో భారత్‌ ఉండడంతో బిజెపి మతోన్మాద, మితవాద స్వభావాన్ని వెల్లడిరచుకుంది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసే అధర్మ యుద్ధాన్ని అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో ఖండిరచింది. అమెరికా ఏకాకి కావడం విశేషం. మిగితా జి-7 దేశాలు తటస్థంగా ఉన్నాయి. హమస్‌ని తీవ్రవాద సంస్థగా తీర్మాణం చేయాలని పట్టుబట్టిన కెనడా తీర్మాణం వీగిపోయింది. ఈ తీర్మాణానికి భారత్‌ సానుకూలంగా ఓటు చేయడం మరో విశేషం. ఐరాస తీర్మాణం నెత్తుటి దారల్లో తల్లడిల్లే  గాజా బాధితులకు ఐరాస తీర్మాణం నైతిక, మానసిక ఉపశమనం కల్పించింది.

ముగింపు :

‘‘సమస్యాత్మకంగా ఉన్న’’ కొద్దిమంది ‘‘సాయుధ ప్రతిఘటన వాదులను’’ గనుక ఏరిపారేస్తే ఇజ్రాయెల్‌కు శాంతి సుస్థిరంగా ఏర్పడుతుందన్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సమాజం ముందుకు కార్పొరేట్‌ మీడియా ద్వారా బహుళంగా ప్రచారం చేస్తోంది. గత 75 సంవత్సరాల కాలంలోనూ అటువంటి శాంతిని ఎందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నెలకొల్పలేకపోయింది? అన్న ప్రశ్నకు దాని వద్ద సమాధానం  లేదు. ప్రస్తుతం సాగిస్తున్న జాతి నిర్మూలన కార్యక్రమాల వంటివి పాలస్తీనా ప్రజల తరపున పోరాడే ఏదో ఒక సంస్థ నుండి (అది హమస్‌ కావచ్చు, మరేదైనా కావచ్చు) తప్పకుండా ప్రతీకార చర్యలకు దారి తీస్తుంది. మరిన్ని ప్రాణాలు పోతాయి. మరింత హింసాకాండ చెలరేగుతుంది. అణచివేత ఉన్నంత వరకు ప్రతిఘటన ఉండడం సహజమే. అందువల్ల ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ఐరాస తీర్మాణాలు అమలు చేసి అక్రమిత భూభాగాల నుండి వైదొలగడం తప్ప మరో మార్గం లేదు. 

ఇజ్రాయెల్‌- హమస్‌ మధ్య అక్టోబర్‌ 7 నుంచి జరుగుతున్న యుద్ధం మొదటిది కాదు, గాజా స్ట్రిప్‌ మీద ఇజ్రాయెల్‌ కురిపిస్తున్న బాంబుల వర్షంతో ఈ యుద్ధం ముగిసేది కాదు. ఈ ఘర్షణ పాలస్తీనా- ఇజ్రాయెల్‌ లకు పరిమితమవుతుందని కూడా చెప్పలేం. ఇప్పటికే లెబనాన్‌ హెజ్బుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. అమెరికా విమానాలు సిరియాలోని ఇరాన్‌ స్థావరంపై దాడి చేశాయి. ఇరాన్‌ ఇజ్రాయెల్‌ గాజా నుండి వెనుదిరగకపోతే తాను ఉద్యమంలో దిగవలసి వస్తుందని హెచ్చరించింది. చైనా, రష్యా దేశాలు కూడ తమ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అందువల్ల సంప్రదింపుల ద్వారా పాలస్తీనా సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని  సాధించాలి. ప్రస్తుతం పాలస్తీనాలో జరుగుతున్న జాతి నిర్మూలనను ఆపాలి. ఆ ప్రజలపై ఇజ్రాయెల్‌ విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. గాజా భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాన్ని ఇజ్రాయెల్‌ విడనాడాలి. సమస్యను పరిష్కరించవలసిన ఐరాస ఇప్పుడు చేష్టలుడిగి నిస్సహాయంగా ఉండిపోయింది. భద్రతా మండలిని పని చేయనివ్వకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకోవడమే దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో అమెరికా, పాశ్చాత్య దేశాల కుట్రలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలందరినీ కదిలించడమే ఏకైక మార్గం.

Leave a Reply