1. ఉయ్యాలలెగిరి పోతున్నాయి 
                         
ఈ ఆలీవ్ కొమ్మలపై వేలాడ్తున్న
ఎండిన పాల చుక్క పెదవులు  
సగం కాలి మెతుకులు 
తొంగి చూస్తున్న తడియారిన నోళ్ళు 
కమిలి పోయి
తెగిపడిన పసి ఆరని కనురెప్పలు 
మసిపట్టి
రాలి పడిన మఖ్మల్ వేళ్ళు  

గోరు తగిలితే నెత్తురు కారే పాల బుగ్గల్ని 
మిస్సైల్ కొరికేసిన దృశ్యం
ఈ గుండె మూడు నెలల శిశువుది కాబోలు ! 
అవి ఆటగోళీలా కళ్ళా? 
యుద్ధం నవ్వుతోంది ఇజ్రాయెలై

ఈ ఇసుక నేల మీద 
పిట్టగూళ్ళలా భూమికి వేలాడ్తున్న అస్తిపంజరాలు!

ఈ దుబ్బ మీది చిన్నారిఅచ్చుల పాదాలు 
ఎక్కడా కనిపించవేం ? 
లోతైన గాట్లు పడి నెత్తురొడ్తూ 
నిస్సహాయంగా రోదిస్తూ
పాలస్తీన ముఖచిత్రమైన పిల్లలు  

ముక్కలు ముక్కలైన శ్వాసాడని పసినవ్వులు 
చెల్లాచెదరై మరణించిన బుజ్జిబుజ్జి మాటలు 
విరిగిపడిన గుండాడని బుడిబుడి నడకలు  

దేశాన్ని పసిపిల్లల కబేళ చేశారు కదరా! 
 
2. వొక నెత్తుటి జీవనది 
                
చావుపత్రం మీద 
సంతకం చేశాకే 
ఈ నేలమీద మనుషులు పుడుతారేమో!

కల్లార బోసినట్టు సారార బోసినట్టు  
సొంత నేలకోసం
మనుషులు ఆరబోయబడ్తున్న నేలా! 
పాలస్తీనా! 
దుఃఖసముద్రమా! 

కూలిననీడల నడుమ 
తెగిపడిన మనుషుల నిర్మాణాల మధ్య 
అమ్మ మాయమైన 
నాన్నఅదృశ్యమైన  
అక్కో అన్నో చెల్లో తమ్ముడో  అందరో 
మరణించిన రక్తబంధాల్లో 
చెదరిన కాలానివి 

సొంత నేల మీద పరాయివి 
సొంత నేల మీద శరణార్థివి  
సొంత నేల మీద ప్రవాసానివి
సొంత నేల మీద భయానివి
సొంత నేల మీద ఎదురుచూస్తున్న శవానివి 

పాలస్తీనా !
నువ్వో గాయాల ప్రదర్శనశాలవి 
నెత్తురొల్కుతున్న సమాధివి  
గోధుమ గింజల మీది పేరు గీకేసిన దానివి 
ఇవ్వాళ అలీవ్ తోటల స్మశానవాటికవి 

ఈ శిథిలాల మధ్య ఎన్ని శ్వాసలు తప్పిపోయాయో!
మంచు పట్టిన ఈ మాంసపు ముక్క ఎవరిదో? 

ఈ మట్టి దిబ్బ చిట్టి పాదాలు ముద్రించిన
ఆ అపరిచిత లేత గుండెచప్పుడు 
ఏ శిథిలాలమేటల్లోంచో 
నాగుండెకు వినిపిస్తోంది  

బాల్యం ఎర్రదుమ్మై 
ఆకాశ ప్రయాణం చేస్తున్న దానా 
నా నేల పూలనదై ప్రవహిస్తున్నప్పుడే
నెత్తుటి జీవనదై పొంగుతున్నదానా! 
నీ చరిత్రను మింగుజూసే శీర్షికల నడుమ 
యుద్ధోన్మాదాన్ని గురిపెట్టిన పిచ్చుకమ్మా! 

నెత్తుటి దీపాలు వెలుగుతున్న 
నీ మట్టిని 
నా ప్రియమైన అక్షరాలుగా రాస్తానమ్మా!

3. ఈ రాత్రి ఇలానే ఉండక పోవచ్చు
                    
నన్ను లేపకండి  
గాజాలో  
మళ్ళీ మరణించాను  

మీ పిచ్చిగానీ  
తెల్లభాస్వరం చల్లని మరణమివ్వదు కదా! 
నా రక్తాన్ని తోడుకొనితోడుకొని    

శవ దాహంతో ఎగిసి పడ్తున్న  ఈరాత్రి  
ఆపిల్ పళ్ళ నిగారింపుతో  
స్శశానవాటికై వికసిస్తుంది 

ఈ యుద్ధచక్రాల కింద 
చావుకేకల దుమ్మునై లేస్తున్న శవాన్ని నేనే ! 
దశాబ్దాల తీరాల్లో కల్లోలమై 
నా కనురెప్పల కింద నెత్తుటి కొలనుల్ని 
దాచుకొని  
వెన్నెలరాత్రుల్ని కలకన్నాను   
ఇవ్వాళ చివరిశ్వాస గల్లంతైన క్షణాన  
జీవితం నిషేదించబడిన 
శిథిల శవాన్నై నెత్తురొడ్తున్న దేశాన్ని నేను!  

నాకాళ్ళను దొంగిలించినా 
నా కళ్ళను దొంగిలించినా
నా చేతులు దొంగిలించినా
నాప్రాణాల్నీ ఎత్తుకు పోయినా
నా కణకణాన మండుతున్న 
సూర్యుల్లను దొంగిలించలేక పోయారు  

కూల్చిన ఇళ్ళ లెక్కపెట్టుకుంటూ
కాల్చిన మిస్సైళ్ళ మీసాలెగిరేస్తూ 
చచ్చిన శవాల సంఖ్యల వివరిస్తూ
ఈ కొండల వాలుమీంచి
ఈ రాత్రి 
ఇలానే ఉండక పోవచ్చు  

అదృశ్యమైపోయిన మృత్యురాకాసి ముందు కూర్చొని  
కొన్ని గోధుమ పొలాలు
కొన్ని ఆకుపచ్చని ఆలీవ్ తోటలు  
కొన్ని ఆపిల్ తోటలు 
అమరులజ్ఞాపకాల తన్మయత్వంతో 
పాలస్తీన పాడ్తాయి.

Leave a Reply