1818 దీర్ఘ కావ్యంపై సామాజిక సాంస్కృతిక విశ్లేషణ
శ్రీరామ్ పుప్పాల 1818 దీర్ఘ కవిత రాత ప్రతి దశ నుంచి అచ్చు పుస్తకం వరకు ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారీ నాకు మరింత లోతైన అర్థం తోచేది. ప్రతి చరణమూ ఒక సంఘటననో, చరిత్రలోని కీలక పరిణామాన్నో గుర్తుచేసేది. మన దేశ ప్రజల పోరాటాలను, హక్కుల హననాన్నీ ఒక క్రమంలో రికార్డు చేసిన రచన ఇది. తనలో తాను మాట్లాడుకుంటూ, మనతో మాట్లాడుతూ భీమానది ఒక విస్మృత చరిత్రను పరిచయం చేస్తున్నది.
నదులు నాగరికతా చిహ్నాలు. నదుల వెంట జనావాసాలు ఏర్పడి స్థిర వ్యవసాయం సమకూరే క్రమంలో ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి శక్తులు వృద్ధి చెందినాయి. ఉత్పత్తి సంబంధాలలో గణనీయమైన మార్పు వచ్చింది. భాష, సంస్కృతి, కళలు కొత్త పుంతలు తొక్కినాయి. మన నాగరికతా మొహానికి మరొక వికృత పార్శ్వం కూడా వుంది. యీ సంపద వృద్ధి క్రమంలో స్వాములూ – దాసులు, భూస్వాములు – వెట్టి కూలీలు, సవర్ణులు – శూద్రులు – పంచములుగా సమాజం విడిపోయింది. వికృతమైన యీ ముఖాన్ని అందరూ అంగీకరించేలా, నిరంతరం సమ్మతి కూడగట్టడానికి ఆచారాలు, కట్టుబాట్ల రూపంలో ఒక ఆలిఖిత రాజ్యాంగమూ రూపొందింది. కొన్ని వేలయేళ్ల సమాజ గమనానికి సాక్షి యీ నది.
అటువంటి ఒకానొక నది, మన కృష్ణకు ఉపనదీ అయిన భీమా దాసుల పక్షాన, పంచమ మెహర్‌ల పక్షాన నిలబడి గొంతువిప్పడం, వొక స్పష్ట సత్య ప్రకటన చేయబూనడం కవి చేసిన వొక గొప్ప వూహ.
‘‘నేను భీమా నదిని
ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ, పెళ్ళగిస్తున్న
పక్కటెముకల్లోంచి నేల కధనై మూల్గుతున్నాను..’’
పీడితులలో అత్యంత పీడితుల పక్షాన నిలబడి ప్రాథమిక ప్రజాస్వామ్య నియమాన్ని పాటించాడు యీ కవి.
అయినా ఇప్పుడెందుకీ వివేచన, యిలా తవ్విపోసు కోవడాలూ, యీ నిరసనలూ? కొందరైనా అనుకోవచ్చు. మనమెంత ప్రజాస్వామిక సమాజంగా వున్నామో, యే యే విలువలను నిలుపుకున్నామో, ఏవేవి కోల్పోయామో తడిమిచూసుకోడానికి, నిరంతరం నెత్తురోడుతున్న యీ గాయాల లోతెంతో తెలుసుకోవడం అవసరమే కదా!
‘‘అది వేటకెళ్ళిన రాజుగారి కథ కాదు
రాజును వేటాడిన సైనికుల కథ
పూల కొమ్మ చుట్టూ
మూగిన నల్ల రెక్క సీతాకోక చిలుకల కథ
దీప స్థంబం వైపు సాగిన
తుఫాను ఓడల మీది జండాల కథ
కొత్తగా బట్టబయలు చేసేందుకేమీ లేదు..’’
గతాన్ని తవ్వుకొని, వర్తమానం మీద పేర్చుకొని, భవిష్యత్తులోకి నడవడమే చరిత్ర అని నమ్మి యీ కవిత్వం రాశాడు.
‘‘నీటి దేహమ్మీద
జ్ఞాపకాల తూనీగలెగురుతున్నాయి
బయళ్ళ దోవంతా గతం గుచ్చుకుంటోంది
నేను భీమా నదిని, కొండలు గుట్టలు దాటి వస్తున్నాను’’
1990ల తరానికీ, ఆ తరువాతి తరాలకు మనం చరిత్రగా నేర్పింది చాలా కొంచెమే. అది కూడా విజేతల కథలుగా నమోదైన పాలకుల చరిత్రే. యీ తరానికి చరిత్ర పేరున జరిగిన, జరుగుతున్న మోసాలు తెలియవు. పీడితుల విజయాలు ఎక్కడా రికార్డు కాలేదు. సమాజాన్ని చదివే ఎరుకా, వెసులుబాటూ లేని యువతరం ఇది. క్లాసు పుస్తకాల జ్ఞానంతో యీ విస్తృత, విస్మృత చరిత్ర అర్థమయ్యేదీ కాదు. ప్రసార మాధ్యమాల్లో ప్రచారంలో వున్నదే దేశ చరిత్ర అని భ్రమపడే వాళ్ళే ఎక్కువఇందులో. కాబట్టి కవి ఒక్కొక్క అడుగు వెనక్కు వెళ్లి, మూల మలుపుల్లో నిలబడి శిథిలమైన చరిత్ర గోడలను తడిమాడు. కాలాన్ని ఆవాహన చేసుకొని సత్యా సత్యాలను నిర్భీతిగా దర్శించాడు, మనకూ చూపాడు. ఆనాటి స్థల కాలాల్లో వ్యవస్థను ధిక్కరించి ధీరులుగా నిలిచిన మానవీ మానవుల ఉదాహరణలుగా యిప్పుడు చరిత్రను పునర్ వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ పోరాట వారసత్వం ఎక్కడుందో అన్వేషిస్తున్నాడు. వర్తమానం లోని అద్భుత పోరాటాలు, విప్లవాలు కవిని ప్రేరేపించి యీ అన్వేషణకు పురికొల్పాయి.
యీ వెతుకులాటలో కవికి 1818 తారసపడిరది. ‘శనివార్ వాడా ‘ సమాధిలోని వీరుడు దళిత శక్తుల ఐక్యతకు ఎక్కడ ప్రేరణ అవుతాడోనన్న భయంతో మతవాదులు తవ్వి పారేసిన గోవింద్ గోపాల్ మహర్ సమాధి శకలాలు కనిపించాయి.
‘‘నేను
యుద్ధం చేసినవాణ్ణి
నిర్భయంగా కత్తి దూసినవాణ్ణి
అయినవాడు పరిచిన చిరుగుల విస్తరాకుని
కానివాడు కావులించుకున్నప్పుటి ఉద్వేగాన్ని
ఛత్రపతి కోట పునాదుల్లో నేనింకా నిలబడే ఉన్నాను
ఔరంగజేబు, ఇరవయ్యారు ముక్కలు చేసినప్పుడు
శంభాజీ మహరాజ్ శరీర తునకల్ని పొదువుకున్న అరచేతులు నావి
గోవింద్ గోపాల్ మహర్ నా పేరు
భీమా కోరేగావ్ నేను పుట్టిన ఊరు’’
శ్రీరామ్ పుప్పాల రాసిన కావ్యం 1818 భీమా కోరేగావ్ నేపథ్యంగా రెండు వందల ఏళ్ల కిందటి నుంచి వర్తమానం వరకూ సాగిన ఒక సుదీర్ఘ ప్రజా పోరాటాల, ధిక్కారాల చరిత్ర.
ప్రస్తుత సందర్భంలో నుంచి దాని పొరలను విప్పి చూద్దామా .
సాహిత్యంలో:
సాహిత్యానికి రాజకీయాలెందుకు? పాత ప్రశ్నే కొత్తగా మొలకెత్తుతున్న కాలం. కవిత్వం మాత్రమే కావాలని దబాయిస్తూ మళ్లీ అనుభూతివాదులు రంకెలేస్తున్న కాలం. జ్ఞాత, అజ్ఞాత సంఫీుయకవులు ఆధునిక ముసుగుల్లో చరిస్తున్న కాలం. ఇంతకాలం కవిత్వం దాపునున్న అభ్యుదయ ముసుగులూ తొలగుతున్న కాలం. ‘‘అందరితో మంచిగుంటే పోలా?’’ అనే లౌక్యమే అవార్డుల కొలమానం అయిన కాలం. సెలబ్రిటీ హోదానే సాహిత్య గుర్తింపుగా వూరేగుతున్న కాలం. నావంటి పిరికి నేనో, నాలాంటి భద్రజీవులో పులివేటన పడకుండా బోరియల్లో, కలుగుల్లో ఉద్యోగ చర్మాన్ని కాపాడుకుంటున్న కాలం. ఎరుక కలిగిన వొక నిశ్శబ్దం జగమెల్లా ఆవరించిన కాలం. ఏమి జరిగిందో ? ఏమి జరుగుతోందో ? అందరికీ తెలుసు. అయినా నిద్ర నటించే వారిని ఎలా లేపడం?
సమాజంలో :
భిన్నత్వాల సంగమమైన నా దేశానికి పనిగట్టుకొని ఏకత్వపు చట్టాలను చుడుతున్న కాలం. ఇంకో పక్క మళ్లీ ఏకం కావడం కష్టమేమో అన్నంతగా మనుషులు విడిపోయి కేవలం అస్తిత్వాలు మాత్రమే మిగిలివున్న కాలం. అందరూ పీడితులే అయినా ఒకరిమీద ఒకరికి నమ్మకం మసకబారుతున్న కాలం. నీ తిండి, నీ మాట, ఆచారాలు నీవు కాక మరెవరో నిర్దేశిస్తున్న కాలం. మొత్తంగా నీ వునికే వొక నిరాకరింపబడిన పౌరసత్వ పత్రమైన కాలం.
పుస్తకానికి రాసిన ముందు మాటలో పింగళి చైతన్య ఒక మాట నిక్కచ్చిగా చెప్పారు. ‘‘హక్కులు మనవి, హక్కుల పోరాటాలు వాళ్ళవి అని వాటాలు వేసుకున్నాక అంతా కులాసాగానే వుంది.’’ యీ వాక్యం నాకు బ్రేప్ట్ా పద్యాన్ని గుర్తుకు తెచ్చింది..
‘‘మా స్నేహితులను తొలిసారి ఊచకోత కోసినపుడు
భీతిల్లిన శోకాలు వినవచ్చాయంట
ఆ తర్వాత వందలాది ఊచకోతకు గురయ్యారు
కానీ, వేలాది ఊచకోతకు గురయినపుడూ
ఆ ఊచకోత నిరాటంకంగా కొనసాగినపుడూ మాత్రం
మౌనం బొంతలా పరుచుకుంది.
చెడు చేతలు కుండపోతలా వచ్చినపుడు
ఎవ్వరూ ‘ఆపండి’ అని అరవరు.
నేరాలు పేరుకుపోయినపుడు
వారెవరూ కనే కనిపించరు
వేదనలు భరించలేనివి అయినపుడు
ఏ ఏడుపులూ వినే వినిపించవు’’
– బ్రెహ్ట్ (అనువాదం.. అనంతు)
అటువంటి ఒక నిశ్శబ్దమే యిపుడు చుట్టూరా. ఇంతేనా? అంతా ఇంతేనా? కాలం ఇట్లాగే నడుస్తుందా? ప్రజలు చరిత్రను ఇట్లా సాగిపోనిస్తారా? కవి దృక్పథం దాన్ని పసిగట్టింది.
‘‘ఈ మౌనాన్ని బద్దలు కొట్టాలి
ఈ వేటాడ్డాన్ని వ్యతిరేకించాలి
ఏ దేశమైనా దేవుళ్ళది కాదు, కష్టజీవులదని చెప్పాలి’’
ఏం వేట అది? మనుషుల కోసం రాజ్యం వేట. ప్రజాస్వామ్య భారత రాజ్యం పుట్టినప్పుడే ఆరంభమైన వేట. వేదాంత నుండి అదానీ వరకు దేశ ఖనిజ సంపదను, అటవీ సంపదను దోచి తమ వాళ్లకు దఖలు పెట్టాలంటే అడవిలో వాళ్ళు, అడవి బయట వీళ్ళు ప్రధాన అడ్డంకి. అందుకే పచ్చదనాన్ని వేటాడే యుద్ధం మొదలైంది.
‘‘ఆపరేషన్ గ్రీన్‌హంటో, లేక మరింకే కడుపు మంటో
ఆనవాళ్ళనేవీ మిగల్చని రాక్షస వాన
ఏ దాహాన్ని తీరనివ్వదు
తగులబెట్టిన ఇంటి చూరుల్ని
అందులో పిచ్చుక గూళ్ళని
సావాస గాళ్ళని
వాళ్ళ లేలేత చూపుడు వేళ్ళని
ఒడిలోంచి బిడ్డల్ని,
బిడ్డల నోట్లోంచి పాలపీకల్ని
ఈ యుద్ధం, ‘సెక్యూరిటీ చెక్ పోస్టై’
పోడుపల్లె నరనరాల్లోంచి ఆఖరి రక్తం బొట్టును పీల్చుతోంది’’
పత్రికలను మీడియాను తమ యింటి కావలి కుక్కలుగా కట్టేసుకున్నాక , ప్రతిపక్షాలను బెదిరించి లొంగదీసుకున్నాక ఇక అంతా తుడిచేయవచ్చని అనుకున్నారు. అంతిమ యుద్ధంలో గెలుపు సొంతమనుకున్నారు. కానీ మారు మూలల నుంచి, నేల పొరల నుంచి, మానవుల రక్తమాంసాల నుంచి అరుపులు వినిపిస్తూనే వున్నాయి. ధిక్కార స్వరాలు హెచ్చుతూనే వున్నాయి. గత కాలమెన్నడూ కనీ వినీ ఎరుగని తిరుగుబాట్లు ప్రజ్వరిల్లుతున్నాయి. వాటిని వాక్యాలుగా, స్వరాలుగా, వాచకాలుగా తీర్చిదిద్దే మేధావులు ఈ కాలపు కర్తవ్యాల్లో లీనమయ్యారు. వాళ్ల నోళ్ళు కట్టేయడానికి ఒక బలమైన కేసు కావాలి. భీమా నదికి ఈ యుద్ధమూ తెలుసు. ప్రతియుద్ధమూ తెలుసు.
‘‘పాటగాడి పరవళ్ళ మీద
తాళం కప్ప వేలాడుతుంది
క్లాస్ రూం లోని పాఠానికి,
ఖైదీ సంఖ్య కేటాయిస్తారు
ఎంతటి మహానుభావులు !
ఎన్ని చట్టాల పొట్టలు చీల్చి ఖరారు చేస్తున్న సెక్షన్లివి
ఈ గోడల ఎత్తు పెంచేందుకు పెడుతున్న ఖర్చెంత
నేరం రుజువు కాకుండా మరణించేట్టు
చార్జిషీట్ తయారవుతుంది
వొణుకుతున్న చేతుల్లోంచి ప్రాణం
నీళ్ళ గ్లాసులా జారిపోతుంది
నేను భీమా నదిని
కుట్రలోని రహస్యం
చెట్టు తొర్రలో దాగి ఉందనుకున్నాను
సాలీడు గూట్లో చిక్కుకుందనుకున్నాను’’
భీమా నది భీమా కొరెగావ్ కేసు గురించి శ్రీరాం గొంతుకతో మాట్లాడుతోంది. ఈ కేసు ఆరుగురితో మొదట మొదలై, ఆపై 12 మంది, ఆపైన 16 మంది. యీ చిట్టా ఇంతటితో ఆగదు. ప్రశ్నించే వాళ్ళతో జైళ్లు మొత్తం నిండే వరకూ.
భీమా నదికి మన దేశ ప్రజాస్వామ్యం గురించి అందరికంటే బాగా తెలుసు. భిన్నాభిప్రాయాన్ని చంపేసే వేట యీ క్షణమో, యీ దినమో మొదలవలేదని. కలబుర్గి, గౌరీ లంకేష్ హత్యలు మొదలూ కాదు. వెనక్కి చూస్తే డాక్టర్ రామనాథం, పౌరహక్కుల పురుషోత్తం, అజాం అలీల హత్యల కోసం వేట కుక్కలను, బూడిద కుక్కలను, నయీంలను యీ రాజ్యమే వదిలింది. అంతకు ముందు కోరన్న మంగన్నలను, చారుమంజుందార్‌ను, భూమయ్య కిష్టా గౌడ్‌లనూ పొట్టన పెట్టుకుంది. వందల వేల మందిని బలి తీసుకున్న ప్రజాస్వామ్యం ఇది.
ఎందుకూ? ఎందుకిలా జరుగుతోందో భీమా నదికి తెలుసు. భీమానది ప్రాకృతిక విశేషమే కాదు. చరిత్రలోంచి పుట్టి చరిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నది. భారతదేశంలో సమస్య ఏదయినా సరే. అంతిమంగా అది ముడిపడేది నేలకో, కులానికో. ఈ నేల మీద, ఈ మట్టి మనుషుల, అంటరాని కులాల నెత్తుటిని, చెమటను కలుపుకొని పారుతున్న భీమా నదికి తన పరివాహకమంతా ఎట్లా సారవంతమైనదో ఎరుక వుంది.
‘‘తన నీడ సోకి తానే
మైల పడ్డానని భయపడ్డ
పాలసేపుల తల్లి, ఈ బాలింత
తన బతుకు తీపిని తానే
రుచి చూడలేక రాలిపోయిన
మామిడి పండు, ఈ ఆశల పూత
ఇది లక్ష్మింపేట ఆకుమడి !
కారంచేడు చెరువు నీరు !
మల్లెతోటల్లో ఎరువైన చుండూరు !
కంచికచెర్ల కన్నెపిల్ల ప్రేమించిన అరికట్ల కోటేసు !
‘కార్ల్ సాగన్‌లాగా సైన్సు రచయిత కావాలనుకుని
నీడల్లోంచి తారల్లోకి’ రేగిన కాంతి కణం ఈ నేల’’
అవును యీ దేశ చరిత్రను తవ్వినపుడు అడుగడుగునా దొరికినవి అవమానాల ఆనవాళ్లే. బ్రాహ్మణ పీష్వాల రాజ్యానికి భౌగోళిక సరిహద్దులు ఉండవచ్చు. కానీ దేశమంతటా ఆవరించిన కులం గురించి చెబుతూ..
‘‘కాళ్ళకి చెప్పుల్లేని నేల
సిగ్గు కప్పుకునేందుకు
గుడ్డ పీలిక లేని నేల
ప్రేమ తీరని నేల, చేతులెత్తి
రాత్రింబగళ్ళని కావులించుకునే వేళ
ఆకాశం నుంచి వివక్షల వాన కురిసేది’’ అంటాడు శ్రీరాం.
యీ చరణాలు చదువుకున్నప్పుడు నాకు పల్లెలోని దుర్భరమైన అంటరానితనం నుంచి, అవమానాల నుంచి బైటపడాలని రైల్వే కలాసీగనో, బ్రిటీష్ ఇండియా మిలిటరీలో సిపాయిగానో గౌరవప్రదమైన బతుకు కోసం తపన పడ్డ నిషిద్ధ మానవుడు కనిపించాడు. యీ నేలపై తన కులపు ఆనవాలును శాశ్వతంగా చెరిపేసుకునేందుకు రంగూన్‌కో, సిలోన్‌కో వలసపోయిన నిస్సహాయ ధీరులూ కనిపించారు.
‘‘నేలకి ఈస్టిండియా కంపెనీ
యూనిఫార్మ్ తొడిగినపుడు
రేషన్ బియ్యమిచ్చినపుడు
పంట చేల వొంటికి పండే వ్యాయామమై
మేధస్సులో ధాన్యపు పురులు కట్టినపుడు
నేలది రాజద్రోహమంటున్నారు
నేలని జైళ్ళలో పెట్టమంటున్నారు
నేల కోర్టుల్లో ఓడిపోయింది
నట్టడవిలో ఒంటరైంది
నేలపై మోపిన నేరాలేమిటో
పేనిన ఉరితాళ్ళు లెక్క చెబుతాయి
పెడరెక్కలు విరిగిన పందిరి గుంజలు చెబుతాయి
దిసమొలేసుకున్న అధికరణలు చెబుతాయి
యుద్ధంలో రక్తమోడిన ఒక చిన్న గ్రామం చెబుతుంది
ఆ ఊరి పిడికెడు మట్టిలోంచి
తొలిమానవుడి గుండె లయనై పల్లవిస్తున్నాను’’
చరిత్రలో కొన్ని ప్రధాన మలుపులు తిరుగుబాటు సంకేతాలుగా (సింబల్స్) నిక్షిప్తమౌతాయి. పాలకులు యీ సంకేతాలను తమ పక్షానికి తిప్పుకునేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. బుద్ధుడు, పోతులూరి వీరబ్రహ్మం ఇందుకు ఉదాహరణ. కొన్ని ఘటనలను, కొందరు వ్యక్తులను ఎన్నుకొని వాటిని తమ చరిత్రగా ప్రచారంలోకి తేవాలని మాటి మాటికీ ప్రయత్నిస్తారు. అవసరమైతే కొన్ని అబద్ధపు కథలనూ జోడిస్తారు.
భారత స్వాతంత్రోద్యమంలో సంఘ్ మతతత్వ శక్తుల పాత్ర దాదాపు శూన్యం. తమ సొంతానికి చెప్పుకోదగ్గ నాయకుడే లేడు. ఉన్న సావర్కర్ ఒక్కడిదీ ప్రాణభిక్ష కోసం బ్రిటిష్ జండా ముందు మోకరిల్లిన ఘన చరిత్రే. బైటి నుంచి ఎవరు అనువుగా దొరికితే వాళ్లను ఎత్తుకొచ్చి తమ హిందుత్వ సంకేతాన్ని నిర్మింపజూశారు. మొదట భగత్ సింగ్‌ను తెచ్చారు కానీ అతని సామ్యవాద ఆలోచనలు, తన రచనల్లో రష్యన్ విప్లవ ప్రభావమూ రుజువుపడడంతో (నా నెత్తురు వృథాకాదు) ఆ ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. సుభాష్ చంద్రబోస్‌ను కొంతకాలం ప్రయత్నించినా పెద్దగా అమోదం లభించలేదు. బహుశా నియంత హిట్లర్‌తో జతకట్టిన అతని ఆచరణ సర్వజన ఆమోదానికి అడ్డంకి అయివుండవచ్చు. వల్లభాయ్ పటేల్‌ను అనుకూలమైన, అవసరమైన చోట మాత్రమే (కాశ్మీర్, నిజాం రాష్ట్ర విలీనం సందర్భంలో) పొదుపుగా వాడుతున్నారు. అర్. ఎస్. ఎస్‌ను రద్దుపరచమని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పటేల్ చేసిన సిఫార్సు వల్ల ఆయనను గుండు గుత్తగా స్వాధీనం చేసుకొన వీలుకావడం లేదు. అయినా వాళ్ళ ప్రయత్నాలు ఆపరు. మను ధర్మం నాలుగు పాదాల నడవాలన్న వాళ్ల అత్యాశలూ చావవు. మళ్లీ మళ్లీ బ్రాహ్మణ్యాన్ని, శిథిలాల్లోని సనాతన వైభవాన్ని బైటికి తీసుకొస్తున్నారు.
‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని
మళ్ళీ వూరేగిస్తోన్న రాచవీధుల్లోంచి నడచి వస్తున్నాను’’
ఇస్లామిక్ తాలిబాన్లకైనా, ఇజ్రాయెల్ యూదుపాలకులైనా, మనదేశపు మత శక్తులకైనా అజెండా ఒక్కటే. ఒక పొరుగు దేశాన్నో, మైనారిటీ మతాన్నో బూచిగా చూపి ప్రజలను మత ప్రాతిపదికన చీల్చడం, ఏదో ఒక పద్ధతిలో అధికారంలోకి రావడం, వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం తీవ్రమైన హింస ప్రయోగించడం, ప్రశ్నించే వారిని తీవ్రవాదులుగా ముద్ర వేయటం, భయంతో ప్రజలను మాట్లాడనీకుండా చేయడం.
‘‘నేల బొందిలో ప్రాణాన్ని పీక్కుతినే
మతవాద రాబందు
మొగ్గ తొడిగే పోరాటానికెప్పుడూ
కుట్ర అనే పేరు పెడుతుంది’’
అధికారం – చరిత్ర – మతకోణం:
హిందూ మతతత్వ శక్తులు వాస్తవాలను మరుగుపరిచి శివాజీని తమ ప్రతీకగా వాడుకోవడంలో మాత్రం సఫలమయ్యారు. బ్రాహ్మణ పీష్వాలకు ఎదురు నిలబడి గెలిచిన ఒక శూద్ర రాజును తమ ఊహల్లోని అఖండ హిందూ సామ్రాజ్యానికి ప్రతీకగా మార్చడం అంత సులభం కాదు. అందుకోసం ఔరంగజేబు చేసిన కొన్ని వికృత చర్యలను (జిజియా పన్ను వంటి) మాత్రమే విస్తృత ప్రచారంలో పెట్టి అతణ్ణి ప్రతినాయకుడిగా మార్చారు. ఆటోమాటిక్‌గా శివాజీ నాయకుడయ్యాడు. ఔరంగజేబు రాజనీతిజ్ఞతను, నిజాయితీనీ, పరిపాలనా దక్షతను మరుగుపరచారు.
ఔరంగజేబు అలహాబాద్‌లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్నీ, ఉజ్జయిని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్, శత్రుంజయ జైన్ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకు నిధులు ఇచ్చాడు. గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు ! ఇదీ చరిత్ర.
శివాజీ రాజ్యానికి సైన్యంలోని శూద్రులు, ముస్లింలు దన్నుగా నిలిచింది వాస్తవం. బ్రాహ్మణ పీష్వాల కుట్రలవల్లే శివాజీ సామ్రాజ్యం పతనమైంది కూడా అంతే వాస్తవం. ఈ నిజాలను దాచిపెట్టి తమకు అనుకూలమైన కొన్ని ఘటనలనే చరిత్రగా ప్రచారం చేశారు. ఆసియా ఖండంలో ప్రతి రాజూ సంపద కోసమే యుద్ధాలు చేశారు. రాజులెవరైనా రాజులే. మత కేంద్రాలపై మాటిమాటికీ దాడులు చేశారు. పర్షియన్ రాజుల నుంచి హిందూ రాజుల వరకూ ఎవ్వరూ ఇందుకు మినహాయింపు కాదు. దాడుల ఉద్దేశ్యాలు చాలా స్పష్టం. దేనికంటే.. దేవాలయాలు సంపదకు కేంద్రాలు. వజ్రాలు, బంగారు, వెండి ఆభరణాల వంటి సంపదలకు కేంద్రాలు. అందుకే రాజులు వాటిని లక్ష్యం చేసుకున్నారు. అలాంటి కేంద్రాల్లో విగ్రహాలను కొల్లగొట్టడం ద్వారా శత్రువుపై తక్షణ ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నారు.
పదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు ఇంద్ర-III యమునా నది పక్కనున్న కాలప్రియ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. కారణం దానికి తమ ప్రత్యర్థులు అయిన ప్రతీహారులు దాని పోషకులు. ఇలాగే చాళుక్యులు, చోళులు, పల్లవులు ఒకరి దేవాలయాలపై మరొకరు దాడులు చేశారు. విగ్రహాలను ఎత్తుకు పోయారు.
హిందూ రాజులు యెన్నో జైన దేవాలయాల పైనా, బౌద్ధ ఆరామాల పైన దాడులు చేశారు. ఇవి ఎక్కడా ప్రస్తావనకు రాక కేవలం ఘోరీ మహమ్మద్, ఔరంగజేబుల దాడులను మాత్రమే ప్రచారంలో పెట్టడం చరిత్ర రచనకు వున్న మత వర్గ స్వభావాన్ని సూచిస్తుంది. రోమిలా థాపర్, బిపిన్ చంద్ర, వంటి చరిత్ర కారులు యీ కుట్రను బయట పెట్టినా దీన్ని అందిపుచ్చుకొని కుట్రను శక్తివంతంగా ఓడించాల్సి ఉన్నది. దీన్ని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగింది.
మన దేశంలో వున్న ముస్లింలు, క్రిస్టియన్లు యెవరు? యీ నేల మీద నడిచిన మనుషుల వారసులే! వాళ్ళ తాతలు, తండ్రులు దళితులే కదా ? హిందూ మతం అమలు పరచిన అంటరానితనాన్ని, వెట్టిని, వివక్షను తప్పించుకునేందుకు నీడనిచ్చి ఆదరించిన మరో మతం మాటున ఓదార్పు పొందిన పంచములే కదా!
ఈ నేల మీద సుదీర్ఘకాంగా సాగుతున్న సామాజిక, సాంస్కృతిక సంఘర్షణనంతా భీమా నది తన కవితా కంఠస్వరంతో ఇలా గానం చేస్తున్నది.
‘‘మరాఠా పీష్వాలు దేశభక్తులు కాదు
ఆ చిత్పవన బ్రాహ్మణ యుద్ధం స్వాతంత్య్రోద్యమం కాదు
ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లు కోసిన
తలలనుంచి కారిన దేవుళ్ళ రక్తంలో
వేదాల చర్మం చీరుకు పోయింది నిజమే గానీ
మత జెలగల నోళ్ళు శ్వేతహూణలై
ప్రాణాలు తీయడం చరిత్ర పుటల్లోకెక్కలేదు
పుష్యమిత్రుడు చంపిన బౌద్ధ సన్యాసుల
తలలకు లెక్క తేలలేదు
లా ఇలాప్ా ఇల్లా అల్లాప్ా,
మహమ్మద్ రసూల్ అల్లాప్ా అని
గతిలేక మసీదుల ముందు
షహదా చదివిన వాళ్ళు ఎవరెవరు ?
చర్చీల్లో బాప్తిజపు శిలువని మోసేందుకు
సిద్దమైన అమాయక పరిశుద్ధులెంతమంది?
చరిత్ర, సంపద శయ్యపై పడుకుని
నిరుపేద నేల చెలమల్లోకి తొంగి చూడలేదు’’
ఆస్తి వర్గాలకు పీడితులకు పునాది రంగంలో పెరుగుతున్న యీ వైరుధ్యం, ఘర్షణ సామాజిక ఉపరితలమైన కళ, సాహిత్య, భావజాల రంగాలన్నిటిలో ప్రతిఫలిస్తుంది. పాలకులే కాదు పీడితులు కూడా తమ సొంత సంకేతాలను వెతకడం ప్రారంభిస్తారు. నమోదైన చరిత్రలోకి పునరన్వేషణ జరుపుతారు. యీ క్రమంలో ఒక్కోసారి పాత సంకేతాలకు అర్థాలూ మారవచ్చు. భీమా కోరెగావ్ విషయంలో జరిగింది అదే. ఆంగ్లేయుల విజయమా? మహర్ల విజయమా? అన్న చర్చ ఇప్పుడు అనవసరం. అంబేద్కర్ మహాశయుడి ప్రవేశంతోనే యీ సంకేతం ఎప్పుడో తన పాత అర్థాన్ని మార్చుకుంది. ఈ దేశపు అంటరాని జనపోరుకు ప్రతీకగా బాబాసాహెబ్ భీమా కొరేగావ్‌ను పునర్ వ్యాఖ్యానించాడు. చరిత్ర పురోగమించడమంటే ఇదే. చరిత్ర తనను కన్న ప్రజల ఒడిలోంచి సరికొత్త రూపు దాల్చడమంటే సరిగ్గా ఇదే. అందుకే భీమా మహోగ్రంగా, తన ఉత్తుంగ కెరటాల హోరులోంచి చరిత్రనిలా ఒక కావ్యఖండికగా మార్చి మనకు వినిపిస్తున్నది.
‘‘రంపం కోత పడ్డ నిలువెత్తు స్వప్నాన్ని
నీలం మబ్బులొచ్చి ప్రేమార తల నిమరడం చూశాను
దూరాభారం మరచి వాల్తున్న పక్షులకి
ఈ రణస్థలి దగ్గర ఒక ‘పెద్దాయన’ గింజలు జల్లడం జూశాను
నన్ను నా యీ ఉనికి ముందు-
జై భీం జై భీం జై జై జై అని అరచి నిద్ర మేల్కొల్పుతున్నాను
ఇంక్విలాబ్ జిందాబాద్ –
అని గొంతు చించుకుని నిట్ట నిలువునా
గట్టు తెగిపోతున్నాను’’
బాబాసాహెబ్ ఒక్కడే కాదు. వలస వ్యతిరేక చరిత్రలోని రణధ్వని భగత్సింగ్. ఇవ్వాల్లికీ, రేపటికి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ఆయన పేరుకు పర్యాయపదం. చెక్కుచెదరని నినాదం. అందుకే భీమా నది ఇప్పుడు ఇంక్విలాబ్‌తోపాటు జై భీంను కలిపి నినదిస్తున్నది.
ఎప్పుడైతే మత శక్తులు కోరేగావ్ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డాయో ప్రగతిశీలశక్తులు ఎటువైపు నిలబడాలో నిశ్చయమైనట్టే. ‘‘నీ మిత్రుడెవరో తెలుసుకోవాలంటే నీ శత్రువు ఎవరిని వ్యతిరేకిస్తున్నాడో చూడు’’ అన్నదే మనకు కొలమానం. వందేళ్లు దాటి 2018 వచ్చేసరికి, విజయ ధ్వజం, భీమా కోరేగావ్‌లు దళితుల ఆత్మ గౌరవ పోరాటానికి ప్రతీకలయ్యాయి. విప్లవ దళిత శక్తుల ఐక్యతకు ప్రేరణ అయ్యాయి. కేవలం రాయితీలు, రక్షణలు, వాటాలే కాదు. విముక్తి కావాలి. ఈ దేశాన్ని నూతన సమాజం చేయాలి. దళితుల ఆత్మగౌరవం సాయుధ పోరాటంలో నూతన మానవుల ఆవిష్కారానికి దారి చూపాలి.
‘‘2018, జనవరి ఒకటి గుర్తొస్తే
ఒక ఆత్మ గౌరవ చైతన్యం నోరారా పిలుస్తుంది
తరాల ఇసుక తిన్నెలకింద,
మూగబోయిన శంఖనాదాలు వినిపిస్తాయి
అడవి రొమ్ములో ఆఖరి పాల చుక్క కోసం
ఆదివాసీ పసిగుడ్డు గుక్కపట్టినట్టు
దొడ్లో పాడిగేదె తొలి ఈతలో ప్రాణాలు బిగపట్టినట్టు
భీమా కోరేగాం
శనివార్ వాడ కోట ముందు
విముక్తి కాంక్షను గజ్జె కట్టి ఆడిరది
నేను భీమా నదిని !
స్థంభించిన కాలరహస్యం గుట్టు విప్పుతున్నాను
2018 జనవరి ఒకటి
ఫ్యూఢల్ కన్నులపై నిద్రలేని రాత్రయ్యింది
రెక్కల కింద పిల్లల్ని దాచి,
జోరువానలో ఒక పక్షి తల్లి
ముద్దగా తడిచిపోయింది
ఆ సాయంత్రం
నలిగిన డిసెంబర్ పూల నీలం రంగు
కోటానుకోట్ల శోక తంత్రులు మీటి
ఏకధాటిగా వర్షం కురిసింది
వేదన నిలువరించలేని ఎర్ర మట్టి బాటలు
దీప కాంతిలో తళుక్కున మెరిశాయి
తనని తాను పోగొట్టుకోవడం
మళ్ళీ పురుడు పోసుకోవడం
ఒక్క విప్లవానికే చెందిన రసవిద్య
నదీమ తల్లిని చెబుతున్నాను
మొప్పల అలికిడిలో పిడికిళ్ళ కేరింతలు విన్నాను …..’’
దళితులు ఓట్ల మార్గంలోంచి విముక్తి పోరాట మార్గంలోకి మళ్లుతున్నారని రాజ్యానికి భయం పుట్టింది. ఆదివాసులు, అంటరానివారు ఆయుధాలు ధరిస్తే తను కుప్పకూలిపోవడం తథ్యమని ఆగ్రకుల రాజ్యానికి తెలుసు. అందుకే 2018 భీమా కొరేగావ్ చుట్టూ కొత్త కుట్రను అల్లింది.
ఇది ప్రజాస్వామ్య పాలనా?
బ్రిటిష్ వలస చట్టం అనుమతినిచ్చినప్పటికీ చెరువులో నీళ్ళు తాగేందుకు అంబేద్కర్ నాయకత్వంలో మహర్లు కదిలిన వొకానొక కాలం నుంచీ సుమారు వందేళ్ల తరువాత స్వతంత్ర భారతంలో బడిలో దాహమేసి కుండలో నీళ్ళు తాగినందుకు వొక పిల్లవాడు తన్నులు తిన్నాడు. ఆజాదీ అమృతోత్సవ కాలంగా నిజంగా ఏమి మారినట్టు? ఎందుకు మారనట్టు?
1947న బ్రిటీష్ రాజ్యం అధికారాన్ని వదులుకుంది. అప్పటికే సిద్ధంగా వున్న భారత భూస్వామ్యం చేతులు సాచింది. ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఒక రాజ్యాంగం రచించబడింది. అయితే ఇవన్నీ ‘‘డెమోక్రసీ ఫ్రమ్ ది అబవ్’’గానే కొనసాగాయి. నిజమైన ప్రజాస్వామ్య భావనలు యీ నేలలోకి ఇంకనేలేదు. ప్రజాస్వామ్యం అమలుకాగల స్థాయికి ఈ సమాజమే ఎదగలేదు.
‘ప్రజాస్వామ్యం’ విలువల పునాది మీద నిర్మింపబడే వ్యవస్థ అన్న స్పృహతో మన పాలకులు ఏనాడూ ప్రవర్తించలేదు. ‘ఓటు వేయడం పౌరుల బాధ్యత’ అన్న ఒక్క ప్రచారం తప్ప మిగిలిన ప్రజాస్వామ్య హక్కులపట్ల బాధ్యతగా వ్యవహరించలేదు. అప్పటికి యాభై శాతం పైగా నిరక్షరాస్యులు వున్న భారత సమాజంలో ‘అందుకున్న’ వారికే అన్ని అవకాశాలూ దక్కాయి.
1964 వచ్చేసరికి వనరుల పంపిణీలో, ప్రాంతాల అభివృద్ధిలో అసమానతలు ఏర్పడ్డాయి. నిరుద్యోగం పెరిగింది. అసంతృప్తి బహిరంగపడినది. నీటి ప్రాజెక్టుల ద్వారా, విద్య ద్వారా, ఉద్యోగాల ద్వారా పేదల జీవితాలు యెంతో కొంత మెరుగుపడ్డాయి. ఊర్ధ్వ చలనం మొదలైంది. కమ్మ, ఝాట్ వంటి శూద్ర కులాలు మొట్ట మొదట సంపదలో, తరువాత రాజకీయాల్లో వాటా డిమాండు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా కొంత సాధించుకోగలిగారు. అతి శూద్ర కులాలు కూడా ఇదే స్పృహను, ఆకాంక్షను వ్యక్త పరిచినపుడు మాత్రం అన్ని రకాల వనరులను,అధికారాలనూ వారసత్వంగా అనుభవిస్తున్న భూస్వామ్య, జమీందారీ వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగింది యీ ప్రశ్నలు నచ్చలేదు, నిరసనలు నచ్చలేదు అణచివేత మొదలైంది. హక్కుల ఉల్లంఘన రాజ్యం స్వభావంగా మారింది. కొనసాగుతున్న బ్రిటిష్ చట్టాలకు తోడుగా కొత్తగా అనేక అప్రజాస్వామిక చట్టాలు పాలకులకు అవసరం అయ్యాయి.
పాలకుల అధికార హింసా ప్రవృత్తినీ, పరిధినీ పెంచే ఊపా వంటి చట్టాలు, ఎన్ఐఏ వంటి కొత్త అణచివేత సంస్థలూ సమాజంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న వొక సంక్షోభాన్ని, దాన్ని సజావుగా పరిష్కరించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తాయి.
స్వాతంత్య్ర పూర్వం బ్రిటిష్ ఇండియాలో నెహ్రూ ఆధ్వర్యంలోనే తొలి పౌరహక్కుల సంఘం ఏర్పడిరది. ఆ సంగతే మరచిపోయిన ‘సోషలిస్టు ’ నెహ్రూ నిజాము ప్రభుత్వంతో పోటీగా కమ్యూనిస్టులను వేటాడారు. ఒక ప్రభుత్వం తన ప్రజల మీద తానే యుద్ధం ప్రకటించడం
ఆ విధంగా నెహ్రూతో మొదలైంది. ఆ యుద్ధం ఇప్పుడు నేరుగా ప్రజలపైన వైమానిక దాడులుగా మారిపోయింది.
స్వాతంత్రోద్యమ తళుకులు మసకబారగానే పాలకుల అసలు రూపం త్వరలోనే బహిర్గతమైంది. కానీ ప్రజలకు అప్పుడూ ఇప్పుడూ కూడా పాలకుల స్వభావం బాగా తెలుసు.
‘‘రంగూ రంగుల మారి నెహురయ్యా
నీ రంగూ బైరంగ మాయె నెహురయ్యా’’ అని ప్రజలు పాటలు పాడుకున్నారు. భూస్వాములు, జమీందార్లు, అగ్రకుల సంపన్నులు నిండిన యీ పాలక పార్టీల వల్ల దళిత ప్రజల విముక్తి జరిగేది కాదని అంబేద్కర్ ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ‘ స్థాపించాడు. ఆ కాలంలో విచిత్రంగా కమ్యూనిష్టులు మాత్రం కాంగ్రెసుతోనే అంటకాగారు.
పైనుంచి దిగుమతి అయిన యీ ప్రజాస్వామ్యానికి యే సామాజిక పునాది లేకపోవడంతో రాజ్యాంగం కల్పించిన హక్కులతో సహా అన్ని ప్రజాతంత్ర విలువలూ పాలకుల బిక్ష మాత్రమే అయ్యాయి. రాసుకున్న రాజ్యాంగమేమో ఆధునికం, నేర, న్యాయ విచారణ వ్యవస్థా, చట్టాలూ వందల ఏళ్ల కిందటి బ్రిటిష్ తయారీకావడంతో రెంటి మధ్య అంతరం, బోలెడంత వైరుధ్యమూ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు యీ దేశంలో చట్టమూ, న్యాయమూ బహిరంగంగా, నిస్సిగ్గుగా కొనగలిగిన, ప్రభావితం చేయగలిగిన వస్తువులు కావటం మహా విషాదం. ఇందుకు ఉదాహరణ 11 ఏళ్ళ కిందట వాకపల్లిలో గ్రే హౌండ్స్ బలగాలు ఆదివాసీ మహిళలపై జరిపిన అత్యాచారం కేసు – దానిపై ఇటీవలి తీర్పు. న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థకు సాటి మనుషులలోని కొన్ని సమూహాల పట్ల వున్న అంతులేని యీ నిర్లక్ష్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యం సహిస్తుందా?
మా వూరు డోన్. చుట్టుపక్కల యెక్కడా నదుల ఆనవాలు లేదు. కొంచెం పూనుకొని వేదవతి అనే ఒక చిన్న నీటి ప్రాజెక్టును పూర్తి చేస్తే కనీసం ఒక వైపు వున్న మెట్ట ప్రాంతాలకు తాగునీరు దొరుకుతుంది. ఒకకారు సాగునీరు అందుతుంది. ప్రజలు ఎల్లకాలం గుర్తుపెట్టుకొని మిమ్ములనే గెలిపిస్తారు తల్లీ! అంటే ‘‘వూళ్ళల్లో మాల మాదిగ నాకొడుకులు ఇప్పటికే మా మాటయినడం లేదు. నీల్లుగాని ఇస్తే ఇంగ తలకు చెప్పులడుగుతారు. నేను గెలవక పోయినా పరవాలేదు. వేదవతి ప్రాజెక్టు మాత్రం తెప్పియ్యను’’ నిష్కర్షగా అన్నది మా ఎం.ల్. ఎ. ఇదీ ఆచరణలో ప్రజాస్వామ్యం. ఇదీ ప్రజా సంక్షేమంపట్ల పాలకుల వైఖరి.
ఒక్కసారి యీ గణాంకాలు చూడండి:
దేశ జనాభాలో దళితులు (షెడ్యూల్డ్ కులాలు) 16.6 శాతం. దేశంలో విచారణలో ఉన్న ఖైదీలలో దళితులు 21 శాతం. దేశ జనాభాలో ఆదివాసులు (షెడ్యూల్డ్ తెగలు) 8.6 శాతం. కాని దేశంలో విచారణలో ఉన్న ఖైదీలలో ఆదివాసులు 9.8 శాతం. విచారణలో ఉన్న ఖైదీల పేరుతో దేశం లోని జైళ్లలో సంవత్సరాలుగా మగ్గుతున్న 4,27,000 మందిలో ఎస్సీలు 21శాతం బీ ఎస్టీలు 9.7 శాతం. మొత్తం విచారణ ఖైదీల్లో 30శాతం మంది యీ రెండే సమూహాలకు చెందిన వాళ్ళు, నిస్సహాయంగా జైళ్లలో మగ్గుతున్నారు. అందులో చాలా మందికి తమ మీద పెట్టిన కేసు ఏమిటో, అభియోగం తీవ్రత, దాని పర్యవసానాలు ఏమిటో కూడా తెలియవు. ఇవి గణాంకాలేనా? ఇవి జీవిత సత్యాలు. కవిత్వమయ్యే వస్తువులు. హక్కుల స్పృహ కలిగిన పౌరుడిగా యీ కవి ఏమంటున్నారంటే..
‘‘అండర్ ట్రయిల్’ గాళ్ళకి
భారత శిక్షా స్మృతిలో మిల్లీమీటర్ చోటుండదు
ఉంటే, దూడల్ని జున్నుపాలు తాగనివ్వాలి
పురిట్లోనే అనాధలైన తల్లుల ఉమ్మనీట్లో తడవాలి
పుస్తెలు కట్టీ కట్టగానే, అరెస్టైన నూనుగు మీసాలవాణ్ణి
పున్నమి రాత్రి విడిచిపెట్టాలి
వకీళ్ళను అనుమతించాలి
ములాఖత్ అర్జీలపై మనసుతో దస్తఖత్ చెయ్యాలి
నేను భీమానదిని,
నిర్బంధానికి సాకులు వెతికే
పురాతన జైళ్ళ బయట ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్నాను’’
‘‘మీ అధికారిక గృహసముదాయంలో నా కొడుకు తోటపని చేస్తున్నాడు
నా ఇంటిది మీ కక్కూసుదొడ్లు శుభ్రం చేస్తోంది
మీ బట్టలొత్తే ఇస్త్రీ పెట్టెలో వేడి, నా ఉఛ్చ్వాస
వంటగది స్టవ్ లోని గ్యాస్, నా నిశ్వాస
అశోక చక్రాలు గల మీ కారు నడుపుతున్న డ్రైవరూ,
మీ వాయిదాల సంచీలు మోసే గుమాస్తా
మీ ఇంట్లో అంట్లు తోముతున్నది,
ఊడ్చి తడి గుడ్డ పెడుతున్నదీ
అందరూ నా రక్తం పంచుకు పుట్టిన
సోదర సోదరీమణులే
మీ హోదాలో కరిగిన నా కండలున్నాయి,
మీ మంచి నీళ్ళ గ్లాసులో నేను సుడులుతిరుగుతుంటాను
మీ ఆఫీస్ రూం గోడ మీద నా దేవుడి ముఖచిత్రం ఉంది’’
నేను పైన ఇచ్చిన గణాంకాలు వండి వార్చిన ఫేక్ మీడియా సృష్టి కావు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా పార్లమెంటులో ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు. ఇప్పుడు శ్రీరాం కవిత్వాన్ని చదవండి. మంత్రి చెప్పిన గణాంకాలకు ఉన్న సామాజిక,సాంస్కృతిక అర్థం ఏమిటో తెలుస్తుంది.
‘ప్రజాతంత్ర విలువల ప్రకారం పోలీసు యంత్రాంగం పరిపాలనా విభాగంలోని పౌర విభాగానికి లోబడి వుండాలి. యీ రెండూ న్యాయ వ్యవస్థకు లోబడి వుండాలి. ఇది స్థూలంగా రాజ్యం హింసా ప్రవృత్తిని నియంత్రణలో వుంచి సంక్షేమం, ప్రగతి దిశగా సమాజాన్ని నడుపుతుంది. మరి యీ క్రమం ఎప్పుడు ధ్వంసమైంది?
భూసారాన్ని ధ్వంసం చేస్తే తిరిగి పెంపొందించడం యెంత కష్టమో నాగరికతా సారాన్ని నాశనం చేస్తే తిరిగి సాధించటం అంతకంటే కష్టం’ – బాలగోపాల్.
ఈ అవగాహన అమలవుతున్నదా? రాజ్యం అడవిని, నేలను, చెట్టును బతకనిస్తున్నదా?
‘‘ఇది అడవి కాపులపై విసిరిన గ్రెనేడు గుండు
తునికాకుల వెన్ను చీల్చుతున్న నొప్పి
ఇది ఇక్కడి గాలిని తడమలేని స్వార్ధపు తేమ
ఇదొక బతుకు చర్మాన్ని వొలుస్తున్న
దయనీయ విస్థాపన
ఈ యుద్ధం దేశ సంపదని కాపాడ్డం కాదు
అయినవాళ్ళకోసం ఎదురుచూస్తూ నిలబడ్డ
మెత్తటి బూరుగ వనాల నరికివేత మాత్రమే కాదు
పుల్లటి చింత తోపుల నాలుక తెగ్గోసేస్తున్నారు గనుక
దీన్ని కేవలం సైనిక చర్యగా చూడనే వద్దు
అన్నీ అబద్దాలే, అంతా మోసమే
ఉసురు పోయిన నిజం, నీళ్ళబాయి దాచుకోదు
బోగస్ నివేదికల చిట్టచివరి సంతకంలోని పచ్చదనం
అడవంతా వినేలా భళ్ళున నవ్వుతుంది
కూంబింగ్ లో అనేక గాయాలపాలైన భూగోళం
కడుపులో బాయినెట్లు దిగి విలవిల్లాడుతుంది
వరుసగా పడుకోబెట్టిన అసంఖ్యాక శరీరాలమీద
అంకెలు దిద్దిన సుద్దముక్కకీ నొప్పి తెలుసు
దమ్ములో మొలకల్నీ,
పదునైన వాటి మొనల్ని
కోడి పుంజు పూలనీ, ఎగరేసే వాటి తలల్ని
జైళ్ళలోకి నెట్టేస్తున్నారు
దిల్లీరోడ్లపైకి వెళ్ళాను
ఆచూకీ దొరకని కాశ్మీరు లోయల్ని వెతికాను
జామియా గోడలమీది ఎలిజీలు చదివాను
పసుపురంగు హరియాణా సరిహద్దుల్లో
దమ్ములో మొలకల్నీ,
పదునైన వాటి మొనల్ని
కోడి పుంజు పూలనీ, ఎగరేసే వాటి తలల్ని
జైళ్ళలోకి నెట్టేస్తున్నారు
దిల్లీరోడ్లపైకి వెళ్ళాను
ఆచూకీ దొరకని కాశ్మీరు లోయల్ని వెతికాను
జామియా గోడలమీది ఎలిజీలు చదివాను
పసుపురంగు హరియాణా సరిహద్దుల్లో
ఆవ పూల మధ్య తప్పిపోయాను
గొడ్డుబోతు ఆకలిది
నాలుక్కి తెలియని రుచి
అందుకే ఈ దేశపు చట్టాల్ని
తన పిల్లల్ని తానే తినే జంతువులతో పోలుస్తాను
భీమానదిని నివ్వెరపోతున్నాను
ఈ దేశ సార్వభౌమాధికారం
పొలంలో పొగ బెట్టని ఎలుక బొరియలా ఉంది’’
రాజ్యానికి తన సహజ నేర స్వభావం పెరిగే కొద్దీ బైటికి చెప్పుకొనే సంక్షేమ స్వభావం తరిగిపోతుంది.
యే సమాజంలోనైనా వృద్ధులకు, శారీరిక, మానసిక వైకల్యం కలిగిన వారికి ప్రయాణ రాయితీలు, కల్పించడం ఒక బాధ్యత. సంక్షేమ రాజ్యమే అయితే వీరికి ఉచిత వైద్యం, రేషన్ అందించాలి ( ఇప్పటికీ బ్రిటన్‌లో అమలులో వుంది). మన దగ్గర వికలాంగులకు కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు. కొద్ది రోజులు నడిపి చెప్పకుండా ఆ పాలసీ ఎత్తేసింది. గతంలో వృద్ధులకు వున్న ప్రయాణ రాయితీలు కూడా కరోనా కాలంలో ఎత్తేశారు. అవి ఇప్పటికీ పునరుద్ధరించబడలేదు. అడిగే వాడే లేడు. సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోవడంలో మన ప్రభుత్వాలకు మించినవి లేవు యీ ప్రపంచంలో.
భీమాకొరేగావ్ కేసులో ఫాదర్ స్టాన్‌స్వామి చట్టబద్ధ హత్యను ఈ దృష్టితో కూడా చూడాలి. దీన్ని అర్థం చేసుకోడానికి ప్రజాస్వామ్యం పేరుతో మన దేశంలో చెలామణి అవుతున్న నియంతృత్వ చరిత్రను పరిశీలించాలి. అప్పుడే భీమా నది విప్పుతున్న ఈ ఆధునిక ప్రజాస్వామ్యం గుట్టు మనకు అర్థమవుతుంది.
1975 ఎమర్జెన్సీ – ప్రజాస్వామ్యపు చీకటి రోజులు:
ఎమర్జెన్సీ 25 జూన్ 75 న మొదలై -25 మార్చి 77 వరకు 21 నెలలు కొనసాగింది. ‘అంతర్గత అలజడి’ కారణంగా చూపి ఎన్నికల రద్దుతో పాటూ అన్ని హక్కుల నిరాకరింప బడ్డాయి. జూన్ 25న ప్రధాని ‘రూల్ బై డిక్రీ’గా ప్రతిపాదించబడి, రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహమ్మద్‌చే ఆమోదించబడ్డ తరువాత జూలై నెలలో కాబినెట్‌లోనూ, పార్లమెంట్‌లోనూ ఆమోదం పొందింది. అంటే రాజ్యాంగం సూత్రాలు యెంత ఉల్లంఘించబడ్డాయో అర్థమవుతుంది.
బాహ్య, అంతర్గత ప్రమాదాలు పొంచి వున్నాయన్న సాకుతో విద్యార్థి ఉద్యమంతో మొదలు పెట్టి , రైల్వే ఉద్యగుల సమ్మె దాకా దారుణ అణచివేత అమలైంది. అప్పటి సోషలిస్టు పార్టీ నాయకుడు ఫెర్నాండెజ్‌ను జైల్లో వేశారు. రైల్వే నాయకులను అరెస్టు చేసి క్వార్టర్స్‌లోని వాళ్ళ కుటుంబాలను బయటికి గెంటేశారు.
1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రాజ్ నారాయణ్ కేసు వేస్తే అలహాబాద్ హైకోర్టు విచారణ తరువాత అది నిజమని అంగీకరిస్తూ ఇందిరా గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. సుప్రీం కోర్టుకు పోతే అక్కడా జస్టిస్ కృష్ణయ్యర్ హైకోర్టు తీర్పునే సమర్థించాడు.( దేశ ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులను ఇప్పుడు మీరు ఊహించగలరా!) 24 జూన్ యీ తీర్పు వచ్చింది. తీర్పు అమలును అడ్డుకుంటూ 25వ తేదీ అర్థరాత్రి ఇందిర ఎమర్జెన్సీ ప్రకటన వచ్చింది.
ఎమర్జెన్సీలో మీసా, పోసా చట్టాల కింద సుమారు లక్షా నలభైవేల మంది పైగా నాయకులు అరెస్టు అయ్యారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఎమర్జెన్సిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా విపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు అరెస్టు అయ్యారు.
కేరళ అర్. ఇ. సి విద్యార్థి రాజన్ అరెస్టు తరువాత లాకప్ హింస వల్ల మరణంతో పోలీసులు ఆ శవాన్ని కూడా మాయం చేశారు. తెలుగు కవి పఠాభి భార్య స్నేహలతా రెడ్డి అక్రమ అరెస్టు, మరణం ఇవి చెప్పేందుకు మచ్చుకు కొన్ని మాత్రమే.
ప్రాథమిక హక్కులు కూడా కాలరాచివేయబడ్డాయి. అర్ ఎస్ ఎస్, నక్సలైట్ పార్టీలు, వాటి ప్రజాసంస్థల పైన నిషేధం అమలు జరిగింది. సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి జైలు తప్పించుకున్నట్టు బాలాసాహెబ్ దేవరస్ సంజయ్ – ఇందిరాగాంధీలతో ఒప్పందం చేసుకొని అరెస్టు తప్పించుకున్నాడు. అలాగే అటల్ బిహారీ వాజ్ పాయ్ కూడా ఇందిరతో లాలూచీ పడి ఎమర్జెన్సీ కాలం మొత్తం పెరోల్ మీద ఇంట్లోనే వున్నాడు. గోల్వార్కర్ తరువాత అంతటి స్ధానంలో వున్న రామకృష్ణ రణడేను ఇందిరతో త్వరగా ఒప్పందం లోకి రావాలని ఆర్ ఎస్ ఎస్ ప్రాంతీయ నాయకులు వొత్తిడి పెట్టారు.
రణడే ఆ పని చేసి పెట్టి అందుకు ప్రతిఫలంగా ఇందిర హయాంలో భారత సాంస్కృతిక సంబంధాల కౌన్సిల్ సభ్యుడయ్యాడు కూడా. బల్బీర్ పుంజ్ వంటి ఎబి వి పి నాయకులు నేరుగా ఇందిరకు లొంగిపోయి 20 సూత్రాల పథకాన్ని సమర్థించి జైలు బయట వుండగలిగారు. మధులిమయే వంటి 30 మంది ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఇందిరాగాంధీకి నేరుగా లొంగుబాటు పత్రం సమర్పించి ఆమె విధానాలను బహిరంగంగా సమర్ధించారు.
ఇందిరకు క్షమాపణ చెప్పమని వాజ్‌పాయ్, ఓం మెహతా వంటి జనసంఘ్ ప్రముఖులు కోరితే ఆనాటి ఎబివిపి యువకులు కొందరు నిరాకరించడం విశేషం. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే యీ దేశంలో మతతత్వ శక్తులు ఎన్నడూ విడిగా లేవు. మొదటి నుంచీ అన్ని పాలక పార్టీలతో సఖ్యంగా కలిసే వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌తో కలిసే ఉన్నాయి. ఆ పార్టీ కూడా సంఘ్పరివార్‌తో చెట్టపట్టాలేసుకొని నడిచింది. అందువల్లే ఎవరు అధికారంలో వున్నా హిందుత్వ శక్తులు తమ పనులు సాగించుకుంటూనే వున్నాయి. దీనికి ఉదాహరణే గుజరాత్ మారణకాండ కేసులో హోం మంత్రి చిదంబరం తమ ప్రత్యర్థి అయినప్పటికీ మోడీని తప్పించడం.
మతతత్వ శక్తులు ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ మద్దతును పొందగలిగాయి. ఆ తరువాత జనతాపార్టీలో భాగమూ కాగలిగాయి. అవి ఎన్నడూ విడిగా, రిజిడ్‌గా లేవు. తన, మన తేడాలు లేకుండా ఏ పార్టీతోనైనా, ఎక్కడ అవకాశం వుంటే అందుకనుగుణంగా తమ రాజకీయం నెరిపాయి. ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో తమతో తీవ్ర సైద్ధాంతిక విభేదాలు వున్న కమ్యునిస్టు (సీపీఐ, సీపీఎం) పార్టీలతో కూడా జట్టుకట్ట గలిగాయి (జనతా పార్టీ ప్రయోగం అలా జరిగిందే). ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పక్కన కుడి ఎడమల బిజెపి, కమ్యునిస్టులు వుండటం, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నారాయణ నాయుడు నాయక త్రయం కావటం తరువాతి చరిత్ర. ఇంత జరిగాక సోషలిస్టు, కార్మిక నాయకులుగా పేరొందిన జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండావతెలు సిద్ధాంతాలను గాలి కొదిలి బీజేపీతో కేంద్ర ప్రభుత్వ అధికారం పంచుకున్నారని విమర్శించడం హాస్యాస్పదం.
యీ మార్పులన్నీ ఒకరోజు జరిగినవీ కాదు. ఎమర్జెన్సితో మొదలై కల్లోల ప్రాంతాల చట్టం, బోడో విద్యార్థుల మీద సైన్యం ప్రయోగించడం, నాసా, యస్మా, టాడా వంటి క్రూర చట్టాలు వచ్చాయి. మన్మోహన్ మలివిడత అధికారంలోనే అత్యంత క్రూరమైన ‘ ఊపా ‘ చట్టం రూపొందింది.
‘దేశంలో మతవాద హిందుత్వ భావనలకు మద్దతు పెరిగే కొద్దీ పార్టీలతో సంబంధం లేకుండా రాజ్యం చేసే హింసకు ఆమోదనీయత పెరుగుతూపోతున్నది. ఎందుకంటే హింస క్షాత్ర ధర్మం అని పురాణ హిందూ సాంప్రదాయం ప్రకటించింది. అహింసను ఆయుధం చేసుకున్న గాంధీ కూడా రాజ్యహింసను వ్యతిరేకించ లేదు. ఎందుకంటే వర్ణ ధర్మం ఆయన ప్రాపంచిక దృక్పథంలో భాగం’ – బాలగోపాల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో పోలీసులు, సైన్యం వంటి రక్షణ యంత్రాంగం రాజ్యాంగ నిబంధనల నుంచి బయటపడి తన కార్యపరిధిని విస్తృత పరచుకుంది. అధికారంలోని అన్ని పార్టీల (కేరళ, త్రిపుర బెంగాల్‌తో సహా) ప్రభుత్వాలు దీనికి మద్దతుగా నిలిచాయి. 2010 వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు భాషలోనే మాట్లాడింది. ఒరిస్సా, జార్ఖండ్ అడవుల్లో సహజ సంపదను వేదాంత వంటి కార్పొరేట్‌లకు ఇవ్వకుండా అడ్డుపడుతున్న మావోయిస్టులు ప్రధాన శత్రువులు అయ్యారు. విప్లవకారులు అంతర్గత శత్రువులని మన్మోహన్, చిదంబరం ప్రకటించారు.
అడవి మీద యుద్ధం అలా, అందుకు మొదలయింది. భీమా నది ఈ యుద్ధం లోతుల్లోకి వెళ్లింది. భీమాకొరేగావ్ కేసు ఒకానొక అక్రమ కేసు కాదు. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలతో, విప్లవంతో గొంతు కలిపిన మేధావులను అణచివేసే యుద్ధతంత్రంలో భాగం. అందుకే శ్రీరాం ఈ యుద్ధాన్ని సైనిక చర్యగానే చూడవద్దని హెచ్చరిస్తున్నాడు.
‘‘ఈ యుద్ధం దేశ సంపదని కాపాడ్డం కాదు
అయినవాళ్ళకోసం ఎదురుచూస్తూ నిలబడ్డ
మెత్తటి బూరుగ వనాల నరికివేత మాత్రమే కాదు
పుల్లటి చింత తోపుల నాలుక తెగ్గోసేస్తున్నారు గనుక
దీన్ని కేవలం సైనిక చర్యగా చూడనే వద్దు
అన్నీ అబద్దాలే, అంతా మోసమే
ఉసురు పోయిన నిజం, నీళ్ళబాయి దాచుకోదు
బోగస్ నివేదికల చిట్టచివరి సంతకంలోని పచ్చదనం
అడవంతా వినేలా భళ్ళున నవ్వుతుంది
కూంబింగ్‌లో అనేక గాయాలపాలైన భూగోళం
కడుపులో బాయినెట్లు దిగి విలవిల్లాడుతుంది
వరుసగా పడుకోబెట్టిన అసంఖ్యాక శరీరాలమీద
అంకెలు దిద్దిన సుద్దముక్కకీ నొప్పి తెలుసు
కోర్టుకు హాజరు పెట్టని భర్త కోసం
ముట్టని గంజి మెతుక్కి,
ఈ పస్తుల రుచి తెలుసు
గడ్డిపోచల తలలకీ యుద్ధ ట్యాంకు బరువెంతో తెలుసు
‘‘కొండ వాగులో తడుస్తున్న వెన్నెల దేహాన్ని
గండుచలి తినేయాలని చూస్తుంది
ఇది పత్రహరితాన్ని వేటాడ్డం,
ఇది సాల్వాజుడుం,
అన్నల్ని చంపమని
తమ్ముళ్ళని ఎగదోయడం
అక్కల పాలిండ్లలో తల్లితనాన్ని నలపడం
ఇది అరాచకం, ఈ యుద్ధం అంతం కావాలి’’
2014 తరువాత ప్రభుత్వమే కార్పొరేట్ అయ్యింది. అంబానీ అదానీల కోసం పనిచేయడమే ఏకైక కార్యక్రమం అయ్యింది. స్టాన్ స్వామినో, సోనీసోరినో చేసే శాంతి యుత నిరసన రెచ్చగొట్టే చర్యగా, సుధా భరద్వాజ్ కోర్టు ద్వారా అడిగే న్యాయం కుట్ర ప్రయత్నంగా చూడబడు తుంది. వ్యవస్థ తలకిందులు కావడమంటే ఇదీ.
‘‘నేనిప్పుడు ముద్దాయిని
కధల పుస్తకాల్లో దోబూచులాడే
చందమామని పట్టుకెళ్ళిపోయారు
అప్పుచేసి కొనుక్కున్న సెకండ్ హేండ్
కంప్యూటర్ని తిరిగివ్వలేదు
పదిహేనొందలు చేసే మొబైల్ ఫోనులో
దాచిన ద్రోహం ఏముందో ఇప్పటికీ చెప్పలేదు’’
‘‘ఆనంద్ పాఠం చెప్పేవాడు
అరుణ్ ఫరేరా గీసిన గోధుమ కంకి బొమ్మలతో
జైల్లో నేల, సారవంతమవుతుంది
షోమా సేన్ వల్లెవేసే ఆంగ్ల కవితలతో
బైకుల్లాబ్యారకులు సేద దీరతాయి
ఒంటరి తల్లుల వ్యధల్ని, సుధ
కన్నీళ్ళనుంచి అక్షరాల్లోకి తర్జుమా చేస్తుంది
ఎదురు చూపు ఖాళీ చేసిన సముద్రాలతో
తవ్వి పోసిన ఖగోళాలతో
కనురెప్పలపై జైలు నిదుర కాస్తుంది
ఇరుకు గదులకున్న ఇనుప చువ్వలన్నీ
రుజువుల్లేని నేరాలు
నా దేశంలో నేర విచారణ
పొదక్కుండా వొదిలేసిన పక్షి గుడ’’
వున్న యీ చట్టాలు చాలవని ఇజ్రాయెల్, లాటిన్ అమెరికా శైలిలో ప్రభుత్వమే కిరాయి నేరస్థుల మూకను (ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు, ఈశాన్య భారతం,పంజాబ్, కాశ్మీరుల్లో సైన్యం) తయారుచేసి క్రియాశీల కార్యకర్తలపైన వాళ్లకు సామాజిక పునాది అయిన ప్రజలపై ప్రయోగించింది. నయీమ్, జడల నాగరాజు పావులుగా తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు హత్య చేయించిన బెల్లి లలిత, పురుషోత్తం, అజం అలీల హత్యలు బిజెపి అధికారంలోకి రాక ముందు కాలంలో జరిగినవే. ఒకరకంగా యీ చర్యలు బిజెపికి ఒక మెథడాలజీని అందించాయి. బిజెపికి విడిగా మూకను తయారు చేసుకోవలసిన అవసరం లేడు. తన సోదర సంస్థల అనుచరగణం ఆ పని చేసిపెట్టగలరు. గౌరీ లంకేశ్, కల్బుర్గి, పన్సారేల హత్యలు ఆ కోవలోనివి. ఇటీవల గంటి ప్రసాదం గారి హత్య రాజ్యం నేర స్వభావానికి మరొక ఉదాహరణ. పాలకులే సమాజాన్ని క్రిమినలైజ్ చేయబూ నటం మన దేశపు ప్రజాస్వామిక విషాదం.
ఒకవైపు ప్రజాస్వామిక విలువల విధ్వంసం కొనసాగుతుం డగా దీనికి సమాంతరంగా సమానత్వాన్ని స్థాపించే దిశగా నిరంతర వర్గపోరాటమూ సాగింది. భారత దేశం స్వాతంత్య్రం సాధించుకుంటున్న కాలానికి తెలంగాణాలో సాయుధ రైతాంగ పోరాటం, బెంగాల్‌లో తెభాగా రైతు ఉద్యమం నడుస్తుండినది. కాడి దించిన కమ్యూనిష్టులు పోరాట విరమణ చేసి నెహ్రూలో విప్లవాన్ని దర్సిస్తున్నప్పుడు మార్గదర్శనం చేసినవి నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాలు. అణచివేతలో అణగివున్న నివురును మళ్లీ రాజేసి వర్గ పోరు వారసత్వాన్ని అందుకున్నది గోదావరి లోయ, దండకారణ్యం. వెలివాడలు, గూడేలు నిర్మాణ కేంద్రాలు అయ్యాయి. దళిత, ఆదివాసీలు అంతర్భాగమై దిక్కు మొక్కు లేని జనానికి కొండంత అండగా నిలబడింది. రాజ్యహింసను ఎదుర్కొంటూనే త్యాగాల చాలుబోసి విప్లవాన్ని సమున్నతంగా నిలబెట్టింది.
‘‘స్థూపాలమీద చెక్కిన అక్షరాల్లో
అమ్మ గుండెలపై పొడిపించుకున్న నాన్న పేరుంటుంది
ఇల్లొదిలి వెళ్ళినప్పుడు పూసిన తమ్ముడి ఆఖరి చిరునవ్వుంటుంది
స్థూపాల శరీరంలో పంటి గాట్లు పడ్డ
చెల్లాయి మర్మాంగముంటుంది
నిలబెట్టి కాల్చినప్పుడు దబ్బున ఒరిగిపోయిన
నేస్తగాడి లేలేత వక్షస్థలముంటుంది
స్థూపాలు కట్టిన ఇటుకరాళ్ళన్నీ
గాయానికీ గాయానికి మధ్య
మూల్గుతున్న అవయవాల భాష మాట్లాడతాయి
రెండు వందల ఏళ్ళ శైధిల్యం తరువాత
నేనీరోజు మళ్ళీ రక్తస్నానం చేస్తున్నాను
తెగిపోయిన పేగు బంధాల్ని మళ్ళీ
ఒక ఏకాంత సంభాషణతో ముడివేస్తున్నాను
నాకిప్పుడు ఏ స్థూపాన్ని చూసినా
కోరేగాం గుర్తొస్తున్నది
నేను భీమానదిని !
కామ్రేడ్స్ లాల్ సలాం చేస్తున్నాను’’
ఈ వివక్షల చారిత్రకత
ఈ మహర్వేద సారాంశం
కొంత దైన్యాన్నిచ్చింది, మరికొంత ధైర్యాన్ని
కొంత పంతాన్నిచ్చింది,
మరికొంత మొండితనాన్ని
నిదుర మేయని రాత్రులు
గాయపడ్డ కలలతో అలమటిస్తున్నప్పుడు
ఒంటరిని చేసి గందరగోళపరుస్తున్నపుడు
గొడ్ల చావిడి మీది నక్షత్ర మండలమేదో
ఒక మారుమూల పల్లెటూరుకు లాక్కెళుతుంది
ఈ దు:ఖ నది ఒడ్డునెవరో
డక్కలిపిల్లల కోసం
నిలువెత్తు కన్నీటి దేహాంతో ఎదురుచూస్తుంటారు
నిజానికి మట్టైపోయిన పక్కటెముకలే
స్థూపాలై తలెత్తుకు నిలబడతాయి
అవి ఉడుకు నెత్తురు వెల్లవేసుకున్న ఇంటిగోడల్లా ఉంటాయి
కోతలయ్యాక కొడవళ్ళిక్కడ నెలవంకలై వచ్చి వాల్తాయి
గూట్లోకెళ్ళే ముందు పక్షుల్లా సేదదీరతాయి
పదహారు నక్షత్రాలు పొదిగిన
కిరీటంతో ఒక మాతృమూర్తి
జైళ్ళ చీకటిని వెలిగిస్తుంది
ఆమె సజీవమైన కళ్ళు, నిర్బంధ క్షణాల్ని
చుక్కల్లా మెరిపిస్తాయి
నిండు చూలాలిగా ఆ తల్లి,
తన కడుపున ఉద్యమాల్ని మోసింది
పగలూ రాత్రి పునరుత్థాన కధలు చెప్పింది
చెర నుండి పోరాటాల నట్టింటికి
తిరిగి వెనక్కు తీసుకువెళ్ళే వాగ్దానమిచ్చింది
అమ్మవారో, మరే దేవతో
ఆ తల్లి ఎవరైతేనేం
బహుశా, ఆమె అన్నంముద్దలు కలిపి పెడుతున్నందుకే
తలోజా జైల్లో ఆదిమ పుత్రుల ఆకలి తీరుతోంది
గడ్డకట్టిన అండాసెల్ నిద్ర లేమి నీరై కరుగుతోంది
ఆమె మల్లోజుల మధురమ్మ,
వివేక్‌ని కన్న కొదమగుండ్ల మాధవి,
వేముల రోహిత్ కోసం
గుండెలు పగిలేలా ఏడ్చిన రాధికక్క
నేను భీమా నదిని,
ప్రాధేయ పడుతున్నాను
ఇసుక మేటలు వేస్తున్న చట్ట సభల నుంచి
ఈ దేశపు నత్తగుల్లల్ని ఎవరన్నా కాపాడండి
ఇది పత్రహరితాన్ని వేటాడ్డం,
ఇది సాల్వాజుడుం,
అన్నల్ని చంపమని
తమ్ముళ్ళని ఎగదోయడం
అక్కల పాలిండ్లలో తల్లితనాన్ని నలపడం
ఇది అరాచకం, ఈ యుద్ధం అంతం కావాలి
దమ్ములో మొలకల్నీ,
పదునైన వాటి మొనల్ని
కోడి పుంజు పూలనీ, ఎగరేసే వాటి తలల్ని
జైళ్ళలోకి నెట్టేస్తున్నారు
ఢల్లీి రోడ్లపైకి వెళ్ళాను
ఆచూకీ దొరకని కాశ్మీరు లోయల్ని వెతికాను
జామియా గోడలమీది ఎలిజీలు చదివాను
పసుపురంగు హరియాణా సరిహద్దుల్లో
ఆవ పూల మధ్య తప్పిపోయాను
గొడ్డుబోతు ఆకలిది
నాలుక్కి తెలియని రుచి
అందుకే ఈ దేశపు చట్టాల్ని
తన పిల్లల్ని తానే తినే జంతువులతో పోలుస్తాను’’
ఇప్పుడు ప్రశ్న ఏమంటే ఈ యుద్ధంలో ఎవరం ఎటు ఉంటాం అనేదే. ఆదివాసీ అస్తిత్వాన్ని చూసి అయినా మనం ఆలోచించాలి. అస్తిత్వ వాదాలు 1990లలో సమాజానికి యెంతో మేలు చేశాయి. వివిధ అస్తిత్వ సమూహాల వేదనలను, ప్రశ్నలను, ఆగ్రహాన్ని బహిర్గతపరిచాయి. స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదాలతో మొదలు పెట్టి ఇటీవలి ఎల్.జి.బి.టి.క్యు దాకా విప్లవం అన్నిటినుంచి నేర్చుకుంది. ప్రజలనుంచి నేర్చుకోవడాన్ని నిజమైన అర్థంలో తెలియపరచింది. ఆచరణలో తన్ను తాను మెరుగుపరచుకుంది.
యీ కావ్యం అంతర్లీనంగా పీడిత అస్తిత్వాల విముక్తి పోరాటాలు, వర్గ పోరాటాల ఐక్యతను ఆకాంక్షిస్తుంది. అది తీరాలంటే మన గతాన్ని, వర్తమానాన్ని కూడా చర్చకు పెట్టుకోవాలి. అందుకు ప్రాతిపదికను ఏర్పరచుకోవాలి.
1.1990ల్లో అస్తిత్వ వాద నాయకులు తమ ప్రశ్నలను నేరుగా వివక్షలు అమలు పరచిన సమాజం పైకి కాక ఆశ్చర్యంగా నక్సలైటు ఉద్యమం పైకి సంధించారు.
2. స్త్రీ వాద, దళిత వాద ఉద్యమాలు వచ్చిన యీ కాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా యీ రెండు సమూహాల లోకి ఎన్.జి. ఓ లు ప్రవేశించాయి. తీవ్రంగా జరుగుతున్న వర్గ పోరాటాన్ని పక్కకు పెట్టి, తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే టేబుల్ మీటింగులకు దారిచూపాయి. బేరసారాల స్థాయికి పోరాటాలను కుదించాయి. ఆ తరువాత ప్రజలు అవినీతిపరులు అయిపోయారని మళ్లీ ఇవే సంస్థలు ఆరోపిస్తున్నాయి.
3. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలు కావాలన్నా కూడా సమాజంలో ఒక ప్రత్యామ్నాయ పోరాట కేంద్రం ఎప్పుడూ వుండాలి. అవసరమైన ఒకానొక తీవ్ర దశలో అది రక్షణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. యీ స్పృహ కోల్పోయి రాజ్యం అణచివేత, వేట కొనసాగిస్తున్న దశలోనే విప్లవోద్యమం పైకి తామూ నాలుగు రాళ్ళు వేసి సంబరపడిన వాళ్ళున్నారు. అస్తిత్వాల పేరుమీద ఒక సమూహం పైకి మరొకరిని ఉసిగొల్పి మరెప్పుడూ కలవలేనంతగా పీడితులను చీల్చిన వాళ్ళూ వున్నారు. ఈ తీవ్ర గందరగోళంలో, దాడులలో క్యాడర్ విచ్చిన్న మైపోయి కొన్ని నక్సలైట్ పార్టీలు కనుమరుగైపోయాయి.
4. నూతన ఆర్థిక విధానాలు, నూతన విద్యా విధానాల అమలు, విద్య, వైద్యం ప్రైవేటీకరణ జరిగింది యీ కాలంలోనే. విద్య ప్రైవేటీకరణతో కాలేజీల్లో విద్యార్థి ఉద్యమాలకు పునాది లేకుండా పోయింది. కొత్త తరం విప్లవోద్యమాలే కాదు యితర సామాజిక ఉద్యమాలలోకి వచ్చే అన్ని దారులూ మూసుకుపోయాయి.
5. యే దేశంలోనైనా నూతన భావాల వ్యాప్తికి క్రియాశీల వాహకం మధ్యతరగతే. వినిమయ, వ్యాపార సంస్కృతికి మొదట బలి అయినది ఆ వర్గమే. తన ప్రగతిశీల పాత్రను అది మరచిపోయి చాలాకాలమైంది.
6.అస్తిత్వ ఉద్యమాలు తమ పాత్రను అతిగా ఊహించుకున్నవేమో అనిపిస్తుంది. వాటికి ఒక రాజకీయ ప్రణాళిక లేదు కాబట్టి ప్రశ్నలు లేవనెత్తడంతో సమాజంలో వాటి పాత్ర దాదాపు ముగిసిపోయింది. ఇంక తదుపరి కార్యాచరణ లేదు కాబట్టి ప్రభుత్వపంచనో, ప్రతిపక్ష అండనో అవసరాన్ని బట్టి ప్రెషర్ గ్రూపులుగా కొనసాగుతున్నాయి. ఇక ఆ వాదాలు చేయమిగిలింది ఈ పని మాత్రమేనా? వాటి నాయకత్వం ఆలోచించాలి.
స్త్రీ, దళిత, మైనారిటీ వంటి అస్తిత్వ వాదాల అవసరం ఇంకా తీరిపోలేదని అందరూ గుర్తించాలి. ఆ ఆలోచనలు సమాజంలో భాగమై హక్కులుగా రూపొందాలి. వాటిని అమలుపరచడం ద్వారా సమాజ ప్రజాస్వామికీకరణ జరగాలి. అవి ముందుకు తెచ్చిన ఆలోచనల వెలుగులో సమాజం నిరంతరం పరిశీలనకు గురి అవుతూవుండాలి. కళలు సాహిత్యం, రాజకీయ సంఘ నిర్మాణాలు ఎప్పటి కప్పుడు పరీక్షింపబడాలి. ప్రజాస్వామిక సమాజ స్థాపనకు అస్తిత్వ ఉద్యమాలతో సహా అన్ని ప్రగతిశీల శక్తులు తక్షణం ఏకం కావాలి
ప్రజా శ్రేణులలో వచ్చిన యీ అన్ని చీలికలు పాలకులకు లాభించినాయి. ముఖ్యంగా ఐక్యత లోపం అందివచ్చిన వరం. విడగొట్టి అణచివేయవచ్చు. ఎంతటి క్రూరమైన చట్టాలనైనా ఆర్డినెన్సు రూపంలో అమలు చేయవచ్చు. యే రాజ్యాంగ నిబంధననైనా నేరుగా ఉల్లంఘించవచ్చు. న్యాయాధికారులనైనా తనకు అనుకూలంగా మార్చవచ్చు, అనుకున్నది నిరాటంకంగా చేయవచ్చు. ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలు ప్రస్తుతం కుక్కలను కట్టేసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇంతకుమించిన తరుణం మళ్ళీ దొరకదు కాబట్టి కావలసిన సంపద తమవాళ్లకు కట్టబెట్టడానికి, నేరుగా మనువాదాన్ని రాజ్యాంగం చేయడానికి మత శక్తులు ఉబలాటపడు తున్నాయి. రైతు చట్టాలు, పౌరసత్వ చట్టాలు ఆదశలో వచ్చినవే.
‘‘అసలు నా ఇంటిపేరేమిటి
సందు మొగసాలనుంచి మాదెన్నో ఇల్లు
నా ఆధార్ కార్డులో నెంబర్లు ఎక్కడికి వెళ్ళాయి
జేబులో నా రూపాయిబిళ్ళ ఏమయ్యింది
నా కిలో బియ్యం ఎవరింట్లో ఉడుకుతోంది
నా చూపుడు వేలిపై ఇంకు మరకని ఎవరు తుడిచేశారు
నాట్లప్పుడు, కోతలప్పుడుబీ కుప్పలు వేస్తున్న సాయంత్రం
మెళ్ళో చిరు గంటలు మోగుతున్న ఎడ్ల జతలేవి
గుళ్ళో పోలేరమ్మకెవరు అన్నపురాశి పోస్తున్నారు
తాటి కల్లు తాగి జాతరలో వీరంగం ఆడుతోందెవరు’’
మన అస్థిత్వాలూ, అస్తిత్వవాదాల వునికీ ప్రశ్నార్థక మయ్యాయని కవి హెచ్చరిస్తున్నాడు. ఈ సందర్భంలో కూడా రాజ్యం, వ్యవస్థ, మౌలిక మార్పు గురించి ఎందుకు అస్తిత్వవాదులు ఎందుకింత మౌనంగా ఉంటున్నారు? కానీ. ఆటుపోట్ల మధ్య, ప్రజా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అవరోధాల మధ్య, ఆంక్షల సంకెళ్ల మధ్య తీవ్రమైన యుద్ధానికి ప్రతియుద్ధాన్ని దేశమంతా విస్తరింపజేస్తున్నారు. శ్రీరామ్ చాలా స్పష్టంగా ఇవ్వాల్టి పోరాట రంగాన్ని, దాని ప్రజాస్వామిక, లౌకిక, విప్లవకర స్వభావాన్ని మనకు గుర్తు చేస్తున్నారు.
ఇండియా !
నువు కేవలం
జలియన్వాలాబాగ్ దురాగతానివనుకుంటావ్
తిరగబడ్డషాహీన్ బాగ్‌వి,
రైతుల మహా నాగలి యాత్రవి కూడా
కశ్మీర్ యాపిల్ పండు వనుకుంటావ్
కశ్మీరియత్ హంతకురాలివి
పౌరసత్వ జాబితాలో గల్లంతైన చిరునామావి
నువు తల తెగిన బాబ్రీ మసీదువే ! ఇండియా !
గోద్రా పట్టాలపై కాలిబూడిదైన రైలుపెట్టెవే !!
నేను భీమా నదిని !
ఆఖరి సారి హెచ్చరిస్తున్నాను
ఇండియా !
సాయిబాబాని విడిచిపెట్టు
నా ప్రియాతి ప్రియమైన కవి
వరవర రావును కూడా
స్టాన్ స్వామి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచు
కుందేళ్ళతో పాటు రెండు నిముషాలు మౌనంగా నిల్చో
సహచర ఖైదీలకీ, వాళ్ళింట్లో సాకే
కుక్కపిల్లలకి బేషరతుగా క్షమాపణ చెప్పు’’
రాజ్యాంగమే అణచివేత సాధనంగా ఇంత కాలం పాలకులు వ్యవహరించారు. తరతరాల దళితుల, ఆదివాసుల, కార్మికుల పోరాటాల వల్ల అందులో భాగమైన హక్కుల భావననే ఇప్పుడు ఫాసిస్టులు రద్దు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలోని హక్కుల పరిరక్షణ కోసమే ఒక ఐక్య హక్కుల ఉద్యమం తక్షణ అవసరం. రాజ్యాన్నే మార్చే వర్గపోరాటమూ అత్యవసరం. ఈ కాలమూ, యీ కావ్యమూ ఈ రెంటినీ గుర్తుచేస్తున్నాయి.
యీ దేశంలో ప్రజాస్వామిక చేవ చావలేదని ఢిల్లీ రైతు ఉద్యమం, షాహిన్‌బాగ్ మహిళా వుద్యమం, ఈ రెండు పోరాటాలతో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న సిలింగేర్, వెచ్చఘాట్ పోరాటాలు రుజువు పరిచాయి కూడా. భీమా ఆ పోరాట తీరాలంతటా ఉవ్వెత్తున ప్రవహిస్తూ ఆ చైతన్యాన్ని తనలో భాగం చేసుకొని సంభాషిస్తున్నది. ఈ కవితా పఠనమూ, వ్యాఖ్యానమూ భీమాతో గొంతు కలవపడమే.
1818 దీర్ఘకవితను మరింత లోతుగా అర్ధం చేసుకునేందుకు మీ వివరణాత్మక విశ్లేషణ ఎంతగానో ఉపకరించింది .కవి కలానికి తొడిగిన దండకడియం మీ ఈ సమీక్ష hats off to you sir