సిలిగేర్ ఆందోళనగా మొదలై చత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌లలో తొమ్మిది నెలలుగా సాగుతున్న సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటంపై పోలీసుల అణచివేత తీవ్రమైంది. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్ణయం లేకుండా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోడానికి వీల్లేదు. ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం గవర్నర్లకు విశేష అధికారాలను కట్టబెట్టింది. అయితే సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటం పట్ల అటు ప్రభుత్వంకానీ, గవర్నర్లుగాని, రాజకీయ నాయకులుగాని స్పందించడం లేదు.
దీంతో తమ సమస్యను గవర్నర్‌కు వివరించడానికి ఆదివాసీ యువకులు సిద్ధమయ్యారు. గవర్నర్ అనసూయ ఉయికే కొండగావ్‌లో ఉన్న విషయం తెలుసుకొని ఆదివాసులు ఈ ఉదయం (శుక్రవారం) బయల్దేరారు. వాళ్లు అక్కడికి చేరక ముందే సుకుమా దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. మామూలుగా ప్రభుత్వ దుర్మార్గాలను రాజ్యాంగ పరిరక్షణ హోదాలో ఉన్న గవర్నర్‌కు ప్రజలు వివరించాలనుకుంటారు. అక్కడికి కూడా వెళ్లే అవకాశం లేకుండా మధ్యలోనే పోలీసులు అరెస్టు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ప్రముఖ రచయిత్రి నందినీ సుందర్ ఈ ఘటనను ఇప్పటికే ఖండిరచారు. కానీ చత్తీస్‌ఘడ్ గవర్నర్‌కుగాని, ప్రభుత్వానికిగాని ఈ వ్యవహారం చెవికి ఎక్కలేదు.
కొంతమంది శాంతియుత పోరాటాల ప్రాధాన్యతను వక్కాణిస్తుంటారు. విశాల ప్రజారాసులను కదిలించకపోతే ఉద్యమాలు ముందుకు పోవని అంటూ ఉంటారు. మిలిటెన్సీ వల్ల హింసను ప్రయోగించడానికి రాజ్యానికి సాకు దొరుకుతుందని అంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు జరిగితే సమాజం నుంచి పెద్దఎత్తున మద్దతు వస్తుందని సిద్ధాంతాలు చెబుతూ ఉంటారు. లోకమంతా రాజ్యాంగబద్ధంగా ఉండాలని హితోక్తులు వల్లిస్తూ ఉంటారు. దండకారణ్యంలో ఆదివాసులు సరిగ్గా ఇలాంటి పోరాటం చేపట్టి ఎనిమిదో నెల ముగిసింది. తొమ్మిదో నెలలోకి చేరుకుంది. కానీ అక్కడ ఏం జరుగుతోందే గమనిస్తున్నారు కదా. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. నోటిమాటకైనా బీజేపీ ఆదివాసుల పోరాటానికి మద్దతుగా ఒక మాట కూడా అనలేదు. సీఏఏ, ఎన్‌ఆర్సీ వ్యతిరేక పోరాటాలు, రైతు చట్టాల వ్యతిరేక పోరాటాల కాలంలో రాహుల్‌గాంధీ ఎన్ని వీరంగాలు పోయాడో అందరం చూశాం. కానీ సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటం పట్ల ఆయన ‘ఫాసిస్టు వ్యతిరేకత’ కనీసంగా బైటికి రాలేదు. సీపీఐ, సీపీఎంలు నోటిమాటగానైనా ఆదివాసుల పోరాటానికి మద్దతు ప్రకటించలేదు. ఇంక దేశంలో అటు ప్రజల్లో సమరశీల పోరాటాలు, ఇటు పార్లమెంటరీ ఎన్నికల్లో కొత్త ఎత్తుగడల పేరుతో ముందుకు వచ్చిన వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఏవీ ఆదివాసుల డిమాండ్‌ను చెవిపెట్టి ఆలకించలేదు. ఇందులో పీడిత అస్తిత్వ శక్తులు కూడా ఉన్నాయి. తెలుగు సమాజాల్లో ఇలాంటి శక్తుల గురించి ఈ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
కనీసం గవర్నర్‌ను కలవడానికి వెళ్లడం ఎట్టా నేరం అవుతుంది? అని వీళ్లెవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరు.
సైనిక క్యాంపుల వల్ల తమకు ఎంత ప్రమాదమో ఆదివాసులు మొదటి నుంచీ చెబుతున్నారు. కూంబింగ్‌లు, సైనిక క్యాంపుల వల్ల కొరోనా వ్యాప్తి తక్షణ సమస్య అవుతున్నదని వాళ్లు చెబుతూనే ఉన్నారు. అన్నట్లే.. తాజాగా బస్తర్ సైనిక క్యాంపుల్లో 200 మందికి కొవిడ్ సోకిందని జనవరి 18న ఐజీ సుందర్ రాజ్ ప్రకటించాడు. పైగా కొవిడ్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సైనిక చర్యలు నడుపుతామని ఆయన అన్నాడు. అయినా కొవిడ్ ఎంత వేగంగా ఆదివాసీ ప్రాంతాల్లో వ్యాపిస్తున్నదో ఊహించవచ్చు. ఆదివాసులకు కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం వాళ్లను ఇట్లా కరోనా బారిన పడేయడం న్యాయమేనా? అని అడగడానికి చాలా మందికి నోరు రావడం లేదు.
ఇంకో పక్క సుక్మా, జీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ ప్రాంతాల్లో అరగొరగా పని చేస్తున్న పాఠశాలలను పోలీసులు మూసేయించారు. కొవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకోలేదు. దీనికి వాళ్లు చెబుతున్న కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. స్కూళ్లలో చదువుకున్న పిల్లలు మావోయిస్టు ఉద్యమంలోకి వెళుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించడానికి స్కూళ్లను మూసేస్తున్నామని నిస్సిగ్గుగా ప్రకటించారు.
మావోయిస్టు ఉద్యమంపై సాగుతున్న యుద్ధానికి అనేక ముఖాలు ఉన్నాయనడానికి ఇది తాజా ఉదాహరణ. అది కేవలం సైనిక సంబంధమైనదే కాదు. విముక్తి లక్ష్యంతో సాగుతున్న ఆ ఉద్యమానికి ఉన్న బహుముఖాలను రాజ్యం ఇట్లా అర్థం చేసుకుంటున్నది. దేశమంతా కొవిడ్ నివారణకు స్కూళ్లను మూసేస్తోంటే అక్కడ మాత్రం పిల్లలు చదువుకుంటే విప్లవంలోకి వెళతారని మూసేస్తున్నారు. మావోయిస్టు ఉద్యమమంటేనేకాదు, పిల్లలన్నా, చదువున్నా రాజ్యానికి భయమని రుజువు కావడం లేదూ.