నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అభివృద్ధి నినాదాలు, ప్రజాకర్షణ వాగ్దానాల ప్రచార పటాటోపం తప్ప ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది శూన్యం. అందులో భాగంగానే దేశంలో ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఉద్యోగ, ఉపాధి కల్పన కొత్త పుంతలు దొక్కుతోంది. ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయి. ఇవి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలుకుతున్న ప్రగల్భాలు. ప్రధాని మోడీ వల్లెవేస్తున్న ‘వికసిత భారత్‌’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ఈ కఠోర నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ తాజా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)తో బహిర్గతమైంది. 2023 అక్టోబర్‌లో నిరుద్యోగిత రేట్‌ 10 శాతానికి చేరింది. దేశం అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నదంటూ మన ప్రధాని అవకాశం దొరికిన ప్రతిచోట ఊదరగొడుతున్నాడు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాల కారణంగా వ్యవసాయం, ఉత్పత్తి రంగాలు కునారిల్లుతున్నాయి. సామాన్య ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి బదులుగా ఆశ్రితులను నల్ల కుబేరులుగా మార్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని చెప్పవచ్చు. 

గత పది సంవత్సరాలుగా అధికారం వెలుగబెడుతున్న బిజెపి సర్కార్‌ అబద్దాలతో, అర్థసత్యాలతో, ఉద్వేగాలతో, విద్వేషాలతో తప్పుడు సమాచారంతో దేశాన్ని మొరటుగా వందల సంవత్సరాల వెనక్కి నడిపిన్తున్నది. అయినా, 2024 ఎన్నికల్లో మూడో విడత పదవి చేపట్టి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తృతీయ స్థానానికి భారత్‌ చేరుకుని తీరుతుందని తాజాగా తరగని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ సంపద ఐదు ట్రిలియన్‌ డాలర్ల వైపు పరుగెత్తుతుందని నిత్యం ఆత్మస్తుతికి పాల్పడడం వల్ల ఫలితం లేదు. ఇవాళ దేశంలో ఏనాడు చూడని చీకటి రోజులను ప్రజలు చూస్తున్నారు. ‘‘సబ్‌-కా-సాత్‌, సబ్‌-కా-వికాస్‌’’ అన్న మాటలు ఆచరణలో కానరావడం లేదు. అచ్చేదిన్‌ తెస్తానన్న మోడీ ప్రభుత్వం ప్రజలకు చచ్చేదిన్‌ చూపిస్తున్నది. ప్రజలు నిరుద్యోగులుగా కుంగి కునారిల్లినంత కాలం ఇంతే సంగతులు. ఆశ్రిత పెట్టుబడిదారులైన అదానీ, అంబానీల సంపద పెరుగడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. ఆశ్రిత పెట్టుబడి పోకడలతో దేశీయ మార్కెట్‌ నుంచి తమకు తాముగా మాత్రమే బాగుపడే కార్పొరేట్‌ సంస్థల అభివృద్ధిని దేశాభివృద్ధిగా ఎంత మాత్రం చూడలేం. మరోవైపు దేశం అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిందని రిజర్వు బ్యాంక్‌ స్పష్టం చేస్తున్నది.

2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడడంతో కార్పొరేట్‌, మత రాజకీయాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టంగా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అసమ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాంగాన్ని, అటు ప్రజలకు ఇచ్చిన హామీలను దెబ్బతీసింది. మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం… ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం అనుగుణంగానే ‘పాలనతో కార్పొరేట్‌ కలయికకు’ దగ్గర సంబంధం  ఏర్పడింది.  మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రం రద్దు చేస్తోంది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజలపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది.

మోడీ ఆయన వంది మాగదులైన కార్పొరేట్‌ మీడియాలో, గోడీ మీడియాలో నిత్యం ఊదరగొట్టే మాటల్లో జిడిపి పరంగా జర్మనీ, జపాన్‌లను అధిగమించి అమెరికా, చైనాల తరువాత అంతటి సంపన్నమైన  దేశంగా భారత్‌ అవతరిస్తుందన్నది ఆయన ఉద్దేశం. అది సంతోషకరమే కానీ జిడిపి మెరుపుల మాటున మసిబారిపోతున్న సామాన్య జనజీవితాల సంగతేమిటి? ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 84 శాతం కుటుంబాల ఆదాయం తరిగిపోయింది. అదే సంవత్సరం భారతీయ బిలియనీర్ల ఆస్తుల్లో రెండిరతలకు పైగా వృద్ధి నమోదైంది. సంపదంతా ఏ కొద్దిమంది చేతుల్లోనో పోగుపడటం, ప్రజానీకంలో అత్యధికులు కనీస అవసరాలకు అంగలార్చడం దేశానికి అభివృద్ధి చిహ్నం ఎలా అవుతుంది? ఆరోగ్యకరమైన సౌకర్యవంతమైన ప్రజాజీవనం, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు, పౌరహక్కులు, శాంతిభద్రతలే ఏ దేశ పురోగతికైనా ప్రమాణాలు అవుతాయి.

ప్రపంచ దేశాల స్థితిగతులను సరిపోలుస్తూ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుఎన్‌డిపి ఏటా మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డిఐ)ని ప్రచురిస్తుంటుంది. 2015 హెచ్‌డిఐలో 188 దేశాలకు గాను ఇండియాకు 130వ ర్యాంకు దఖలు పడిరది. 2022-23 మానవాభివృద్ధి సూచీలో 191 దేశాల్లో 132వ స్థానానికే భారతావని పరిమితమైంది. సంవత్సరాలు గడచిపోతున్నా ప్రజల బతుకుల్లో మార్పేమీ రానప్పుడు మనది ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ఏమిటి? తగరపు కిరీటాల తళుకుబెళుకులనే ప్రగతి వెలుగులుగా భ్రమింపజేస్తున్న ప్రభుత్వాల తీరు తీవ్ర విస్మయకరం! ఆక్షేపనీయం. బీహార్‌, రaార్ఖండ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, అస్సామ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దారిద్య్ర పీడితుల సంఖ్య నేటికీ ఎక్కువగానే ఉంది. బహుముఖ పేదరిక తీవ్రత పరంగా పల్లెలూ పట్టణాల నడుమ అసమానతలు కొనసాగుతున్నాయని నీతిఆయోగ్‌ ఇటీవలి నివేదికే వెల్లడిరచింది. నాణ్యమైన విద్య, వైద్యం వంటివి దేశీయంగా అందరికీ అందుబాటులో లేవు. మంచి ఆహారం కరవై ఏడాదికి 17 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి దోహదపడని సర్కారీ విధానాలకు ఆ అర్థాంతర చావులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థ పరిమాణం అనేది సాంఘిక పురోగతికి పూర్తిగా అద్దం పట్టదు. ప్రజా స్వేచ్ఛను గౌరవిస్తూ, చట్టబద్ధమైన పాలనకు కట్టుబడిన సమాజమే నాగరిక రాజ్యమవుతుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది. ఆ మేరకు ఇండియా పరిస్థితిని అవలోకిస్తే కడుపు చించుకుంటే  పేగులు కాళ్లమీద పడినట్లు అవుతుంది. గడచిన పదేళ్లలో అధ్వాన నిరంకుశాధికారాల పాలబడిన దేశాల్లో భారత్‌ ఒకటని ‘వీ-డెమ్‌’ ప్రజాస్వామ్య నివేదిక-2023 నిష్కర్షగా వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ పరంగా 142 దేశాల్లో మన దేశానిది 99వ స్థానం. పౌర న్యాయానికి దక్కుతున్న మన్ననలోనైతే భారతావనిది 111వ ర్యాంకు. మానవాభివృద్ధి సూచీలో 132వ స్థానం, ఆకలి సూచీలోనైతే 132 దేశాల్లో భారత్‌ది 111వ స్థానం.

వేతనాల్లో పెద్ద పెంపు లేకపోవడంతో అధిక ధరలతో ప్రజలు బతుకుదెరువు భారం అవుతోంది. హెచ్చు ద్రవ్యోల్బణంతో పొదుపు పడిపోవడంతో భవిష్యత్తుపై ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఉద్యోగులు, కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఆహారం నుండి రోజువారీ సరుకుల వరకు ప్రతీదీ భారం అవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు మొత్తాలు గత ఐదు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంతగా జిడిపిలో 5.1 శాతానికి పడిపోయాయి. అప్పులు, హెచ్చు ధరలు ప్రజల పొదుపు, కొనుగోలు శక్తిని హరించివేయడంతో ఆ ప్రభావం వినిమయాన్ని దెబ్బతీస్తుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుందనేది సుస్పష్టం.

కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కూడా అంత సులభంకాదని, ఆర్థిక ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశం అప్పులు సుమారు 169 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా ఇవి చాలదన్నట్లుగా నవంబర్‌ 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం మరో 33 వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకునేందుకు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిందని, అందుకు తగినట్లుగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) అధికారులు క్లియరెన్స్‌లు ఇచ్చారనే అంశాలపై ఆర్థికవేత్తల్లో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) కూడా భారతదేశం అప్పులపై ఆందోళన వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్‌ కూడా ఇచ్చిందని, ఈ అంశంపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖలోని కొందరు సీనియర్‌ అధికారులు వివరించారు. 2028వ సంవత్సరం నాటికి భారతదేశ అప్పులు జిడిపిలో 100 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని కూడా ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ  అంశమే ఇప్పుడు దేశంలో హాట్‌టాపిక్‌గా మారింది. అప్పులు పెరిగాయేగానీ ఆ మేరకు దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడలేదు. కేంద్ర ప్రభుత్వ అప్పులు ఆర్థిక సంవత్సరం ముగిసే 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 169 లక్షల కోట్లకు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులతో దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరి తలపైన సుమారు 1.75 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోడీ ప్రభుత్వం మోపింది.

ఉపాధి నైపుణ్యాలకు నోచని నవతరాన్ని నిరుద్యోగ భూతం పట్టి పీడిస్తోంది. కష్టించే కర్షకులకు కడకు కడగండ్లే మిగులుతున్నాయి. సుమారు 65 శాతం భారతీయుల వయసు ముప్పై అయిదు సంవత్సరాల కంటే తక్కువే. అందులోనూ 18-35 ఏళ్ళ ప్రాయంలోనివారు నలభై కోట్లకు పైమాటే. సెంటర్‌ ఫర్‌ మోనిటరినింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అనే ప్రభుత్వేతర సంస్థ ప్రతినెల నిరుద్యోగ సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వే ప్రకారం భారత్‌లో నవంబర్‌ చివరి నాటికి నిరుద్యోగం 10.5 శాతం ఉంది. అందులో గ్రామీణ నిరుద్యోగం 10.8 శాతం కాగా, పట్టణాల్లో 8.5 శాతం ఉంది. ఇప్పుడు దేశంలో ఉపాధి కోసం చూస్తున్న శ్రామిక జనం సంఖ్య పెరుగుతున్నా, లభిస్తున్న ఉద్యోగాలు ఏ మాత్రం పెరుగుదల లేకుండా యథాతథంగా ఉంటుంది. యుక్త వయస్సు వచ్చి ఉపాధి కోరుకుంటున్న వారి సంఖ్య ఏటా ఏ మోతాదులో పెరుగుతుందో, కనీసం ఆ మోతాదులో కూడా ఉపాధి అవకాశాలు పెరుగడం లేదు. అందుకు ప్రధాన కారణం శ్రమ సాంధ్రతతో కూడిన పరిశ్రమల స్థానంలో అత్యధిక పెట్టుబడి సాంధ్రత, సాంకేతికతతో కూడిన పరిశ్రమల స్థాపన జరుగుతోంది. అందువల్లనే ‘ప్రపంచీకరణ కాలంలో ద్రవ్యపెట్టుబడి ఆదిపత్యంలో జరుగుతున్న వృద్ధిని ఉపాధి రహిత వృద్ధి అంటారు’ జేమ్స్‌ పెట్రాస్‌. నిరుద్యోగ యువజనానికి సానపట్టి ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోగలిగితే దేశాభివృద్ధి వేగవంతమవుతుంది. కుటుంబ ఆదాయాలూ పెరిగి పేదరికం తగ్గుతుంది. కానీ, కాలంచెల్లిన దేశీయ విద్యావిదానాల మూలంగా అపారమైన యువశక్తి నిర్వీర్యమవుతోంది. ఆ మేరకు క్షేత్రస్థాయి వాస్తవాలను ‘ఇండియా నైపుణ్యాల నివేదిక-2023’ తాజాగా వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నవారిలో ఉద్యోగాలను సంపాదించే సత్తా ఉన్నవారి సంఖ్య 51.25 శాతమేనని అది తేల్చింది. దేశీయంగా మౌలిక వసతులు, ఆటోమొబైల్‌, టెక్స్‌టైల్స్‌, సరకు రవాణా రంగాల్లో నిపుణ మానవ వనరుల కొరత అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. నూతన సాంకేతికతల వెల్లువను, పరిశ్రమల అవసరాలను పట్టించుకోని మూస చదువులు ఉపాధి వేటలో యువతను చతికిలపడేస్తున్నాయి. నైపుణ్య శిక్షణతో నవతరాన్ని రాటుదేల్చడంపై ప్రభుత్వాల మాటలూ నీటిమూటలే అవుతున్నాయి. యువభారత ప్రగతికి అవే గ్రహణం పట్టిస్తున్నాయి!

సింగపూర్‌లోని హ్యూమన్‌ క్యాపిటల్‌ లీడర్‌షిప్‌ ఇన్‌స్టిట్యూట్‌, మరికొన్ని సంస్థలు కలిసి ఏటా విశ్వ సామర్థ్య స్పర్థా సూచీ(జిటిసిఐ)ని వెలువరిస్తుంటాయి. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా ‘జిటిసిఐ’ని రూపొందిస్తున్నాయి. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దఖలుపడిరది. ఆ చేదు నిజాన్ని దాచిపెట్టి ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మాగారం ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు గొప్పలకు పోతున్నాయి. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పిఎంకేవీవై), జనశిక్షణ్‌  సంస్థాన్‌ పథకం తదితరాలతో యువతను సానపడుతున్నామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తూ ఉంటుంది. కానీ, ఆయా పథకాల లబ్ధిదారులకు దక్కుతున్న ఉపాధి అవకాశాలు ఎటువంటివి? ‘పీఎంకేవీవై’ కింద అత్యధికులు దర్జీ, సఫాయి కర్మచారి వంటి కోర్సులను ఎంపిక చేసుకున్నారని కేంద్రమే ఇటీవల లోక్‌సభకు సమాచారమిచ్చింది! దేశంలో నైపుణ్య అంతరాల తొలగింపునకు అంటూ 2018లో ఓ టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పౌరసమాజ ప్రతినిధులు కలిసి శ్రామికశక్తిలో నైపుణ్యాల లేమికి కారణాలు అన్వేషించి, వాటిని అధిగమించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని అప్పట్లో ప్రకటనలు వెల్లువెత్తాయి. ఆ పై టాస్క్‌ఫోర్స్‌ ద్వారా సాధించిందేమిటో ఎవరికీ తెలియదు.

మోడీ పాలనలో, గడచిన దశాబ్ద కాలంగా దళితులు, గిరిజనులకు, ఇతరుల మధ్య, పేదరికం స్థాయి మరింతగా పెరిగింది. ‘ఆక్స్‌ఫర్ట్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అనీషియేటివ్‌’ ప్రకారం, 2021లో పేదరికం స్థాయి ఎస్టీల్లో అధికంగా 50.6 శాతం, ఎస్సీలలో 33.3 శాతం, ఓబీసీల్లో 27.2 శాతం ఉంది. దీనికి భిన్నంగా ఇతరులతో పేదరికం స్థాయి బాగా తక్కువగా 15.6 శాతం ఉంది. ‘మల్టీ-డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌’ ప్రకారం 2021లో, మొత్తం 109 దేశాల్లో భారతదేశం 66వ స్థానంలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర పేద ప్రజల ప్రయోజనాలను కాపాడే చట్టాలను బలహీనపరచి, నిర్వీర్యం చేసే ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు మోడీ ప్రభుత్వం పూనుకుంటున్నది. మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల  అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక సబ్‌ప్లాన్‌ చట్టాలను ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చింది. ఆయా సందర్భాలలో ప్రధాని, నరేంద్ర మోడీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నప్పటికీ, గత ఎనిమిదేళ్లుగా ఆయన ప్రభుత్వ విధానాలు,  వాటి అమలు సామాజిక న్యాయానికి సంబంధించిన కార్యక్రమాలను ధ్వంసం చేసే విధంగా, లింగ, కుల, ఇతర సామాజిక అసమానతలకు ఊతమిచ్చే దిశగా పయనిస్తున్నాయి.

మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు. కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల. సామాజ్య్రవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల స్థానంలో స్వావలంబనకు దోహదపడే విధానాలొస్తేనే దేశం బాగుపడుతుంది. అయితే మతతత్వ కార్పొరేట్‌ కూటమి పాలనలో అది జరగడం అసంభవం. కాబట్టి ఈ దుర్మార్గపు, నియంతృత్వ ప్రభుత్వాన్ని దింపివేసి ప్రజాతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం సమైక్య, సంఘటిత ప్రజా ఉద్యమాలు, పోరాటాలు సాగించి దోపిడీ పీడక పాలక వర్గాల నుండి దేశాన్ని, ప్రజల సంపదను కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు.

Leave a Reply