కాళీపట్నం రామారావు గారు యీ లోకం నుంచి వెళ్ళిపోవటం.. మాష్టారు గార్ని వొక జ్ఞాపకంగా మాట్లాడుకోవటం బాధగా గుండెల్ని మెలిపెడుతూనే వుంది.
మాష్టారి గారితో వ్యక్తిగతంగా.. కధానుబంధంగా.. వున్న జ్ఞాపకాలను రచయితలు మాత్రమే కాదు. యెందరో పాఠకులూ పంచుకుంటున్నారు. పరిశోధకులు కథా నిలయం తమ పరిశోధనకి యెలా వుపయోగపడిందో గుర్తుచేసుకుంటున్నారు.
మనం రాసిన వాటినే మనం దాచుకోలేని వారెందరో వున్న కాలంలో దాదాపు మనందరి కథలని అక్కడ భద్రపరిచే పనిని కథపై, ముందు తరాలపై యిష్టంగా.. ప్రేమగా.. బాధ్యతగా.. గౌరవంతో వారు ఆ పనిని అత్యంత శ్రద్ధగా చేశారు.
మనందరికీ తెలుసు వారు వుపాధ్యాయులని. పిల్లలకి శ్రద్ధ లెక్కలు చెపుతూ వృత్తి ధర్మాన్ని, తన కుటుంబ బాధ్యతలని శ్రద్ధగా నెరవేరుస్తూ, కథలు రాస్తూ, కథకుల కథలు చదువుతూ, వారితో సంభాషిస్తూ, మీటింగ్స్ కోసం ప్రయాణాలు చేస్తూ వారు కధనే శ్వాసించారు.
ప్రపంచంలో యెక్కడా లేదు యిలా కథలకి మాత్రమే వో నిలయం. భలే సంకల్పం… ఆలోచిస్తుంటే యే సమాజానికైనా ఆర్కైవ్ యెంతో ముఖ్యం. ఆర్కైవ్ ఆధారంగా చేసుకొని చెప్పిన అధీకృత కథనాన్ని చరిత్ర అంటాము. అదే ఆర్కైవ్ ని ఆధారంగా చేసుకొని మనం ధిక్కార కథనాలను కూడా చెప్పుకోవచ్చు. ఆర్కైవ్ కి కొత్త వస్తువులు జోడించుకోవచ్చు. ఆర్కైవ్ మన జ్ఞాపకాలని భద్రపరచుకునే నిలయం. అది లేకపోతే కథలు ఉండవు. ‘మాష్టారు గారు కథానిలయం పేరుతో మనకి యిచ్చింది అలాంటి ఆర్కైవ్’ అని రాసానో వేదిక మీద.
చిన్ని పల్లెటూరులో బతుకు సాగిస్తూ వున్న వొక బడుగు బ్రాహ్మణ మాష్టారు తనకి వున్న పరిమితులని మించి వొక కొత్త ప్రపంచాన్ని వూహించడానికి ప్రయత్నం చేస్తే అప్పటికి వున్న స్థలకాల పరిస్థితుల్లో ‘యజ్ఞం’ లాంటి కథ సాధ్యం అయిందనే ఆశ్చర్యంతో వారినే అడిగానోసారి. ఆ తరువాత కాలంలో వారు దగ్గరుండి ఆ పరిస్థితులు చూసిన ప్రదేశాన్ని చూపించారు. జీవితమే యే రచనకైనా ప్రేరణ. తన జీవితంలోవి కావొచ్చు, మరొకరి జీవితం కావొచ్చు , చుట్టూ వున్న వారి జీవితం కావొచ్చు. వాటినే కథలుగా రాస్తాము. వొక తరంలో వారికి సమస్యలుగా కనిపించినవి మరో తరం వారికి కనిపించకపోవచ్చు. ఆ సమస్యల తీరి వుండొచ్చు. ప్రతి తరమూ యెదుర్కొనే సమస్యలు భిన్నమైనవి కావొచ్చు. కానీ కొన్ని జీవితాలజడులు.. పీడన కాలానుగుణoగా మారుతుంటాయి. మార్పు కోసం పనిచేస్తున్నట్టే రచయితలూ రాస్తుంటారు. యెవరు యే దృక్పథంతో రాస్తున్నారన్నదే ముఖ్యం.
తెలుగు కథా చరిత్రని పరిశీలిస్తే మాష్టారు గారు కథలు రాసే సమయానికి అప్పటి సమాజంలో కథలు రాస్తున్నవారు వున్నారు. అయితే ఆ కథకుల కంటే భిన్నంగా తన చుట్టూ వున్న సమాజాన్నిలోతైన చూపుతో చూసారని అనిపిస్తుంది. అప్పటి వరకూ మధ్యతరగతి జీవితాన్ని అధికంగా రాస్తోన్న రచయితలే యెక్కువ. మధ్యతరగతి నుంచి వచ్చిన రచయితలు యెక్కువగా వున్న ఆ సమయంలో తమ కంటే పేదరికంలో వున్న వారి జీవితాల్ని రాసినవారు పెద్దగా లేరు. అట్టడుగు జీవితాల బాధామయ ప్రపంచాన్ని లోతులకంటూ వెళ్ళి వారి జీవితాల్ని పట్టిపీడిస్తోన్న ఆధిపత్యo.. దోపిడీ.. వివక్ష మీద వర్గ దృక్పథం నుంచి వారి జీవితాల్ని కథలుగా రాసారు కారా మాస్టారు.
పీడనకి గురైన జీవితాల గురించి రాయాలంటే ఆయా విషయాలు పట్ల అవగాహన వొక్కటే సరిపోదు. ఆ పీడనకి మూలాలు తెలియాలి. ఆ పీడించే వారి స్వభావమూ అర్ధం కావాలి. రచయితకి తాము రాస్తోన్నఅట్టడుగు జీవితాల పట్లా అవగాహన వొక్కటే సరిపోదు… వారి పట్ల వాత్సల్యం వుండాలి. Empathy వుండాలి. రాస్తోన్నప్పుడు వారిని వుద్దరిస్తానన్న ఆధిపత్య భావజాలం వుండనేకూడదు. వారి అంతస్సంఘర్షణని అక్షరాల్లోకి వొంపుతున్నప్పుడు రచయితలోని రచయిత అచ్చంగా ఆ ప్రాత్రల్లోని ప్రతి అణువణువులోకి మమేకం అయిపోవాలి. అప్పుడే ఆ రచన జీవంతో తొణికిసలాడుతూ వుంటుంది.
కారా మాష్టారు అలా తననితాను మార్చుకోవలసిన అవసరమే లేదు…
వారితో మాటాడినప్పుడు మనకి వారి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.
యే పనినైనా చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ పోవాలి తప్పా యీ పనిచెయ్యటం వల్ల యేమొస్తుందనే యోచన వారిలో లేదు. ఆచి తూచి మాట్లాడేవారు.. వొక్క పదం యెక్కువా కాదు.. వొక్క పదం తక్కువా వుండేది కాదు.. లెక్కల మాష్టారు కదా.. యెక్కడా స్టెప్స్ మిస్ అయ్యేవి కావు మాటలో, కథలు రాయటంలో.
ఆయన ప్రతి మాటలో ఆయన వ్యక్తిత్వం చూడగలిగితే కనిపించేది. ఆయనకి సాహిత్యమూ వ్యక్తిత్వానికీ పెద్ద తేడా కనిపించేవి కాదు. మమేకత వుండేది. కథలు రాసేవారు నింపుకోవలసినవిగా తోచేవి. నమ్మికకు ఆచరణకూ దృక్పథమూ వుంటే కథ కథ కచ్చితంగా మాష్టారు గారి కథలా వుంటుంది.
మాష్టారు గారి కథల్ని చదివితే కొన్ని విషయాలకు సంభ్రమమేస్తుంది.
వారి కథల నిండా వున్న మనుష్యులు మనతో వారి జీవితాల్ని పంచుకుంటారు. యెవరి అనుభవాల్ని వారే చెపుతున్నప్పుడు ఆ అనుభవాల సాంద్రత మనలోకి యింకుతుంది. వాళ్ళ జీవితానుభవాల్లోని భావోద్వేగాలు మనలో అలాంటి భావాన్నే కలిగిస్తాయి. ఆ పాత్రలకీ మనకీ నడుమ యింక రచయిత కనిపించరు. మాష్టారు యీ విషయాన్ని యెలా సాధించారో యేమో కానీ వారి కథలు పాఠకుల్ని వెంటాడటానికి యిదో గొప్ప కారణమనిపిస్తుంది. ‘యజ్ఞం’ కథలో ఆ వూరిలోకి మనల్ని ఆహ్వానించిన రచయిత మనకి తిరిగి కనిపించరు. అందులోని పాత్రలన్నీ మనకి డైరెక్ట్ అయిపోతాయి.
దళితులకు తమ బతుకే కాదు, చావు కూడా పెద్ద సమస్యేనని కారా మాష్టారు గారు రాసిన ‘చావు’ కధ యెన్నో సందర్భాల్లో మన మనసులోకి వచ్చేస్తోంది. యెప్పటి కథ?! 1971
లో సృజన మాస పత్రికలో అచ్చయిన యీ కథ యిప్పటికీ యెందుకు యిప్పటి కథలానే వుంది! అప్పటికీ అస్తిత్వవాదాల వూసే లేదు. ఆ వాదాలతో చర్చలూ లేవు. కథలూ లేవు. వర్గకోణం వుంది. వర్గంకోణం యిచ్చిన చూపు వొక్కటే యింత బలమైన కథ రాయడానికి సరిపోతుందా?! తన చుట్టూ వున్న మానవజీవితంలోని వర్గ సంఘర్షణనీ.. పాతుకుపోయిన అణిచివేతని పట్టించే యీ ‘చావు’ కథలోని లోతు కులం అనేది యీ దేశంలో పోయి అందరినీ సమానంగా చూసే పరిస్థితి రావాలనిపిస్తుంది. యెలాంటి ఆధిపత్య ధోరణి వున్న వాళ్ళకైనా. యీ కథలో పాత్రలు మాటాడిన భాష రచయిత యెంచుకున్న పద్ధతి యెంతో సహజంగా.. అంతే పవర్ఫుల్ గా వుంది. అందువల్ల యీ కథలో రచయిత చెప్పాలనుకొన్న విషయం పాఠకులకీ అందుతుంది. ప్రతీ రచయితకీ వారు యెంచుకొన్న తన భాష మీద అవగాన యెంతో అవసరం. పాఠకులకి రచయితకీ మధ్య భాష అడ్డంకిగా కాకూడదు. ముఖ్యంగా యెదుటి వాళ్ళ జీవనానుభావంతో మమేకమై కథలు రాసేటప్పుడు యెటువంటి భాషని తన కథల్లో వొంపుకోవాలి అనేది మాష్టారి కథల్ని చూస్తె అర్ధమవుతుంది.
***
రచయిత తన కథని యేయే వాతావరణంలో సెట్ చెయ్యాలో తెలియాలి. అప్పుడా కథలోని మూడ్ చదువరి మనసులో ముద్రించుకుపోతుంది. మాస్టారు కథల్లో వాతావరణం అలా యిమిడి వుంటుంది.
చావు కధలో ‘చలి’ వొక ప్రధానమైన పాత్ర.
నా ఏడుపల్ల బతికున్న శవాల గురించే… ఎందును గురించి మనవిలాగ కుళ్లాల?…
“సలి సంకటం-
ఈ సలి సంకటం మనకి ఎన్నుబావుని పట్టీసింది. ఎవుకులు తినీసింది. సీవూ నెత్తురు మరేటి మిగల్నేదు. కుక్కలో నక్కలో ఒక్కపాలే సస్తాయి. మన్దిపుట్టిన కాన్ణుoచి కొనదాక సావే, వొక్క పాలి సావాడవంటే మనకి బెదురు. కసింత కసింత సావడం మనకి శవాన గుంటాది..
పెత్తందారీ వ్యవస్థ నుంచి దళితుల విముక్తి విప్లవం వల్ల సాధ్యమవుతుందనే రచయిత నమ్మకమని చదువుతున్నప్పుడు తోస్తుంటుంది. ‘చలి’ని పెత్తందారీ వ్యవస్థగా పోలుస్తూ చెప్పిన యీ కథలో ఆ పోలిక కూడా కథలో యెక్కడా వాక్యరూపంగా చెప్పరు. మన చుట్టూ ఆవరించిన చలిని ఆవిరి చేసి మన బతుక్కి కావాల్సిన వెచ్చదనాన్ని విప్లవం యిస్తుందనే విషయాన్ని కధలో ప్రతీకాత్మకంగా మాష్టారు చెప్పిన తీరు యెంతో బాగుంటుంది. కథలు రాస్తున్నప్పుడు పాత్రల చుట్టూ కమ్ముకుని వున్న విధ్వంసాన్ని లేదా ఆధిపత్యాన్ని ఫలానా దానివల్ల తొలగిపోతుందని వార్తాకథనాల్లోలా కాకుండా కథలోనే ఆ విషయాన్ని మిళితం చేసి రాస్తూ ఆ విషయం చదువరి మనసుకి అందేట్టు రాయటం మాష్టారు గారి కథలన్నిట్లోనూ కనిపిస్తాయి.
*
కథలకి పేరు పెట్టటం వో ఆర్ట్. మాస్టర్ గారి కథల పేర్లు దాదాపు కథకి యింతకు మించిన టైటిల్ లేదనిపిస్తుంది.
‘భయం’ కథని చూస్తే భయం గుట్టును విప్పే యీ కథలో అంతటా చీకట్లే కమ్ముకుంటున్నప్పుడు, ఆ చీకట్లకు కారణమైన పరిస్థితులు అర్థమవుతున్నప్పుడు, భ్రమలు చెదిరిపోతున్నప్పుడు, కాటేసే పాములు మీది మీదికొస్తా వున్నప్పుడు, మిర్రి మిర్రి చూస్తున్నప్పుడు వాటిని కొట్టాల, వొదిలిపెట్టాలో, లేక చేతుల్జోడించి దణ్ణాలు పెట్టాలో తేల్చుకోడానికి ఒక అవకాశమిచ్చే కథ.
కథ మొదలవడం “ఓలమ్మ పాఁవర్రా..” అంటూ ఒక్క దాటు వేసి వాకిట్లోకి వచ్చి పడింది పారమ్మ. పూరింటి గుమ్మంలో ఆమె యెత్తిపడేసిన బుడ్డి దీపం భగ్ భగ్ మని మండుతోంది’’ యిలా కథలోని ఆరంభ వాక్యాలు. యివి చదివిన యెవ్వరైనా, యెవైందా అని ముందుకెళ్ళకుండా ఆగగలరా? అద్భుతమైన యె త్తుగడ గదా! భయాన్ని జయిస్తే యెలావుంటుంది.
***
కథని యెవరి కోణం నుంచి చెపుతాం అన్నది మరో ముఖ్య విషయం. యీ విషయంలో కారా మాష్టారు గారి అవగాహన చూస్తూ భలే ఆశ్చర్యంగా వుంటుంది. ‘భయం’ కథని చూద్దాం. యీ కథని సాక్షి దృష్టికోణంలోంచి కథ చెబుతారు మాష్టారు. యిలా చెపుతున్నప్పుడు చదువరి కళ్ళ ముందు పాత్రలూ, చుట్టూ వున్న వాతావరణం దృశ్యాలు దృశ్యాలుగా ఆవిష్కారమవుతుంది.
“ఎక్కడే?” అంది ముసలమ్మ.
“అదిగాదా? కమ్మరేకుల్లోకి తల, బైటికి తోకా!… గోడ వోరనుంది”- చూపు సరీగ్గా ఆనని ఆ ముసలమ్మ సంగతేఁవో గానీ నీకూ నాకూ మాత్రం పాఁవు కనపట్టం ఖాయం…అవునా కాదా? జలదరించే ఒళ్ళు సాక్షిగా అవునంటున్నావ్. కదూ..?
కధంతా చదివాక కూడా ఆ దృశ్యం మనకి గుర్తొస్తోనే వుంటుంది. యే పాత్ర యెక్కడ కూర్చుంది.. యే గోడ యెలా వుంది… యిన్ని యేళ్ళు అయిపోయాక కూడా అవి కళ్ళల్లో మెదుల్తూ వున్నాయంటే యెంతగా ఆ దృశ్యాలు కథని కాంప్లిమెంట్ చేసుంటాయో కదా.
కథని యెక్కడ మొదలు పెట్టాలి యెక్కడ ముగించాలన్నది చాల మంది కథకులకి సమస్యగా వుంటుంది. యెత్తుగడా ముగింపు ప్రతి కథలోనూ భిన్నంగా వుంటాయి వీరి కథలు. ప్రతీ సమస్యకీ పరిష్కారం యిదిని చెప్పకుండానే పాఠకులే గ్రహించేట్టు వుంటాయి.
రాసిందంతా అలానే వుండాలని కాకుండా దర్జీ వొక చొక్కా కుడుతున్నప్పుడు అవసరం లేని బట్టని యెలా కత్తెరతో కట్ చేసేస్తారో అలా కథకి అవసరం లేనివన్నీ యెడిట్ చేసుకోవాలి. కారా మాష్టారు గారి కథల్నీ వొక్క వాక్యం అనవసరమనిపించదు.
***
మాష్టారు యీ కథలన్నీ రాసి చాల యేళ్ళు అయింది. అప్పటికీ యిప్పటికీ కథకుల సంఖ్యా పెరిగింది. అప్పటి నుంచి యిప్పటి వరకూ యీ కథల్ని కొత్తతరం కూడా చదువుతూనే వున్నారు. అప్పటికీ యిప్పటికీ ప్రజల జీవనవిధానంలో యెంతో మార్పు వచ్చింది. యిప్పటికీ యీ కథల్లోని విషయ ప్రాధాన్యత పెద్దగా పాతదైపోలేదు. ఆ దోపిడీ.. పీడనల్లో పెద్దగా మార్పు రాకపోవటమన్నది సమాజపరంగా విషాదమే. కథకునిగా వారి ప్రాధాన్యత చెక్కుచెదరలేదు.
‘ఆర్తి’ కథలో గొప్పవాళ్ళలో – గొప్పవాళ్ళూ, చాలా గొప్పవాళ్ళూ, అతి గొప్ప వాళ్ళూ ఉన్నట్టే; పేదవాళ్ళలో, కడుపేదలూ, నిరుపేదలూ వుంటారు. అందులో – ఎర్రెమ్మ కడు పేదది.
యిప్పటికీ యీ పరిస్థితిలో మార్పు లేదు.
అలాగే కుట్ర కథలో “ కుట్రంటే – ఇద్దరో ముగ్గురో మధ్య రహస్యంగా ఏదైనా జరిగితే అది కుట్ర. నూర్నూటేబై మంది జనవేటి, ఆళ్ళ పక్షాన కాదు, నీ పక్షాన పలకడానికొచ్చేనో నోళ్లే వెయ్యి మంది సాక్షులు! అంత సాక్షింలో జరిగిందీ అంటే అది పబ్లిగ్గా జరిగిందన్నమాట. అలాటిది ఏటన్నా కావచ్చు గాని కుట్రనడానికి మాత్రం కాదు. నన్నదిగితే దాన్ని కుట్రనడవే ఓ పెద్ద కుట్రంటాను. ఏటి – తిరుగుబాటనడానికి నీకు నామోషీ దేనికి?
“ఏవి సావీ మీలా పుస్తకాల్లో కుట్రకీ, తిరుగుబాటుకీ వేరే వేరే పదాల్లేవా? ఉన్నా, ఇంగ్లీషోడి సావెత ఉంది గదా, ఉరితీసీ ముందు చెడ్డ పేరెట్టని, ఇది ఆ పద్ధతా?”
కాదు కాదు. లాపుల్ గా ఏర్పడ్డ గవన్మెంటుని కూల్దోయ్యడం, అందుకు ప్రయత్నించడం కూడా నేరమే. ఆ ప్రయత్నం ఎందరు చేసినా ఏ దేశంలో చేసినా దాన్ని కుట్రనే అంటారు.” –యీ మాటలు అప్పటి నుంచి యిప్పటి వరకూ వినిపిస్తూనే వున్నాయి. యివి వినిపించని సమాజం వచ్చిన రోజు మనం కారా మాష్టారు గారి కథల్ని అప్పటి కథలు అనుకోవచ్చు. అప్పటివరకూ వారి కథలు contemporary నే.
***
ప్రయాణానికి మొదట ‘యజ్ఞం’ ప్రయాణానికి చివర ‘కథా నిలయం’ !! నడిచిన బాటలో యేముందో తెలుసుకోవాలసిన అవసరం, దాని నుంచి ధిక్కార స్వరాన్నో, వొక నిర్మాణాత్మకతనో ఆవహింపచేసుకోవటం మన పని.
***
మాష్టారు గారికి వినమ్ర నివాళి.