ఇప్పటివరకు అటువంటి మాటలు వింటూనే ఉన్నాం. కార్యశూరత్వం చూపటంలేదు. అసలు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే కవులే పలచబడుతున్నారు. మరి ఎవరు మట్లాడాలి. మాట్లాడుతున్నది అతి తక్కువమందే కావచ్చు..కానీ మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే..ప్రశ్నించకపోతే..గొంతెత్తి రణన్నినాదం చేయకపోతే రాజ్యం చేసే క్రూరత్వం రెట్టింపవుతుంది. ఇవాళ దేశంలో స్త్రీలు, దళితులు ఆర్థిక రాజకీయ దోపిడీలకు గురౌతున్నారు. డెబ్బై ఏళ్ళు దాటిన ముసలిభారతంలో సాంఘిక అణచివేత ఇప్పటికీ కొనసాగుతున్న పరంపరే. ఆర్థికదోపిడీ వల్ల పేదమధ్యతరగతి జీవితాలు దుర్భరమైపోతున్నా ప్రశ్నించకూడదా..? హక్కులకై కలబడకూడదా..? పిడికిళ్ళు బిగించి రణన్నినాదం చేయగూడదా..? అందుకే సుధా భరద్వాజ్ ప్రశ్నించారు. మేధావులకు హక్కుల ఉద్యమకారులకు మాత్రమే తెలిసిన పేరు. కానీ ఆమెను అరెస్టుచేశాక తెలిసింది. ఆమె ఎంత బలమైన గొంతుకనో అని..సుధా భరద్వాజ్ ప్రముఖ మానవహక్కుల కార్యకర్త. కార్మిక నేత, లాయర్. చాలా ఏళ్ల వరకూ విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన సుధా భరద్వాజ్ గత మూడు దశాబ్దాలుగా ఆదివాసీ ఆధిపత్య ప్రాంతాల్లో సామాజిక సేవ చేస్తున్న యాక్టివిస్ట్. న్యాయవాదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, ఆదివాసీల కేసులు వాదిస్తుంటారు. అందుకే ఆమెను ప్రభుత్వ విరోధిగా, మావోయిస్టు సానుభూతిపరురాలుగా చెబుతున్నారు. భీమాకోరెగావ్ కేసులో 28 ఆగస్టు 2018న ఫరీదాబాద్‌లోని ఇంట్లో ఆమెను అరెస్టు చేశారు. సుధా భరద్వాజ్ ప్రముఖ పౌర హక్కుల సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సెక్రటరీ గా కూడా బాధ్యతల్లో ఉన్నందున ఆమె మీద నేరారోపణ చేయడానికి సులువైంది.
ఈ నేపథ్యంలో సాగిన కవిత్వప్రయాణమే ప్రేమతో మీ సుధ..వాసు రాసిన ఈ దీర్ఘకవిత ఇటీవల విరసం తీసుకొచ్చింది.
వందేమాతరం వందేమాతరం…అప్పటికీ ఇప్పటికీ దేశం ఏం మారింది..ప్రభుత్వాలు మరాయి. పాలకులు మారారు. పేదలు, దళితులు, ఆదివాసీల కన్నీళ్ళు మాత్రం ఆగలేదు. వీళ్ళహక్కుల్ని ప్రశ్నించిన వాళ్ళు మాత్రం ఉపా చట్టం కింద ఖైదు చేయబడుతున్నారు. ఎవ్వరూ మాట్లాడినా రాజ్యహింసకు బలౌతున్నారు. అందుకేనా సుధ ‘‘నా చత్తీస్‌ఘడ్‌ను ఎప్పటికంటే యిపుడు మరింత గాఢంగా ప్రేమిస్తున్నాను.’’ అంటుంది.
ఎవరో వచ్చి చేయికలిపారు
మరెవరో వచ్చి అభినందించారు
బెయిల్ వచ్చిందన్నారు
ఆ ఆనందాన్ని ముంచెత్తే దిగులు లోలోపల
మరి నా సహచరులు?..
జైలుగోడలకు పరిమితం చేయాలన్న దుర్మారగ్గపు ఆలోచలున్నప్పుడు బెయిల్ ఎందుకొస్తుంది. కుట్రకు పన్నాగం పన్నారా..లేదా కాదు..వీళ్ళు ఆలోచిస్తే చాలు..కుట్రలో భాగస్వామ్యమున్నట్టే..ఇదీ రాజ్యం తీరు. తొంబైశాతం వైకల్యమున్నవాళైనా..తొంభైఏళ్ళు దాటిన ముదుసలి అయినా నేరస్తులే..ఇది కుట్రకాదా..? పేదల, అణగారిన, దళిత, ఆదివాసీల పక్షాన ఎవరుగొంతెత్తినా వీళ్ళు ఏదో వొక కేసులో ఖైదుచేస్తారు. అది ఏ కేసైనా కావచ్చు. స్టాన్ స్వామీ విషయంలోనూ జరిగిందదే..అసలు స్టాన్ స్వామీపై ఎందుకు కక్షగట్టిందంటే..
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లోని నిబంధనలను అమలు చేయకపోవడాన్ని ఇతను గళమెత్తాడు. ఈ షెడ్యూల్ ప్రకారం దేశంలో గిరిజనుల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం గిరిజన సభ్యులతో ‘‘గిరిజన సలహా కమిటీ’’ ఏర్పాటు చేయాలని తీర్మానించబడి ఉంది. 1996 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిజన గ్రామ పంచాయితీ విస్తరణ చట్టంఎందుకు నిలిపివేయబడిరదని ఇతను ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. 2020అక్టోబరు 8న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) స్వామీ మావోయిస్టు కార్యకలాపాలకు సహకారాలు అందిస్తున్నాడన్న ఆరోపణతో అతన్ని అరెస్టు చేసింది. రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నాడని కేసు నమోదు చేసింది. స్వామీ అరెస్టు దేశంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. దేశంలోని చాల కాథలిక్ సంఘాలు, అయన అధ్యక్షత వహించిన జెస్యూట్ సంస్థకు చెందిన వారు నిరసనలు చేపట్టారు. 2020 అక్టోబరు 21న జాతీయ నాయకులైన శశి థరూర్, సీతారాం ఏచూరి, సుప్రియ సులే, డి.రాజా స్వామిని విడుదల చేయాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అలాగే కేరళ ముఖ్యమంత్రి పినారయి విజయన్ స్వామీ అరెస్టు ఖండిరచారు. 2020 నవంబరు 6న స్వామీ పార్కిన్సన్స్ వ్యాధి కారంగా చూపుతూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయినా న్యాయస్థానం ఈయన బెయిల్ను పలు సార్లు నిరాకరించింది. స్వామి పార్కిన్సన్స్ వ్యాధి ఇంకా ఇతర వయస్సు సంబంధిత అనారోగ్యాలతో బాధపడ్డాడు. జైలులో ఉన్నప్పుడు రెండు చెవులలో వినికిడి లోపంతో బాధపడ్డాడు, శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.2021 మే 18న, బొంబాయి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో, జైలులో స్వామి తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు రాశారు. దీంతో స్వామిని పరీక్షించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. 2021 మే 21న వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టుకు హాజరైనప్పుడు, స్వామి హాస్పిటల్ లేదా మరే ఇతర హాస్పిటల్‌లో అడ్మిట్ కావడానికి నిరాకరించారు. రాంచీలోని తన ఇంటికి వెళ్లడానికి తాత్కాలిక బెయిల్‌ని మాత్రమే అభ్యర్థించారు. 2021 మే 28న బాంబే హైకోర్టు స్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నందున, 15 రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతను ముంబైలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేరాడు. అక్కడ స్వామీకి కోవిడ్ సోకినట్టు ధ్రువీకరించారు.
బొంబాయి హైకోర్టులో బెయిల్ విచారణకు ముందు 2021 జులై 5న మరణించాడు. స్టాన్ స్వామిని చంపిందెవరు. అందుకేనా ..
దేశమేదైనా పరిత్యాగులను చంపడం
పాలక మత సంస్కృతి
ఫాదర్ స్టాన్ స్వామిని హత్య చేసిందెవరో లోకానికి తెలియదా!
కారాగారపు గోడలకంటిన జేగురుమరకలే
సత్యానికి సంతకం.. కాని నెత్తుటి సంతకాలు పెట్టే రాజ్యానికి సత్య సంతకాలు కానరావు. అందుకే ఈ కవితలో వాసు ఊ.పా ఊపిరి తీసే చట్టమౌతుందంటాడు. యేండ్లకు యేండ్ల ఎదురుచూపులో ఊపిరి గాలిలో కలసిపోవలసిందే. ఇది కూడా కుట్రోన్మాదమే. ఈ దేశాన్ని ఈ దేశసంపదను కార్పోరేట్లకు కారుచౌకగా అమ్మడమేగాక నిజాలు మాట్లాడతాడా? నిజాలు మాట్లాడనప్పుడు.. మనసులోని మాటలు నిజాలు కానప్పుడు ఎన్ని సార్లు మన్ కీ బాత్‌లు మాట్లాడితే ప్రయోజనమేమి..?
‘‘అమ్మగలవన్నీ అగ్గవగా అమ్మేయవచ్చు
బరిబాతల నిలబెట్టి మనిషిని కూడా..’’ ఇప్పుడు నిరంతరం చేస్తున్నదదే..కారు చౌకగా అమ్మేయడమే పని..వాసు బరిబాతల అంటున్నది మనిషిని నగ్నంగా నడిబజార్న నిలువబెట్టి అమ్మేస్తున్నాడని చెప్పడమే. ఇప్పటికే మన దేశాన్ని సంపదను కార్పోరేట్ పెద్దమనుషులైన అదాని, అంబానీకలెప్పుడో అమ్మేశాడు. అమ్మడం ఈయనకు కొత్తేం కాదు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే దేశభక్తిని రెచ్చగొడతాడు. ఈ ప్రజలకున్న ఇల్యూషనంతా దేశభక్తే..అది అతనికి చాలు. దేశపౌరులు ఇద్దరే ఇద్దరు అదానీ అంబానీలే..అందుకే వాసు..
‘‘హక్కుల విలువ నమ్మిన వాళ్ళకు తెలుసు
అమ్మినవాళ్ళకేం తెలుసు
మృత్యు బేహారికేం తెలుసు..’’ అంటాడు .
ప్రజలహక్కుల్ని పాశవికంగా ధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజలకోసం గొంతెత్తిన ప్రతివొక్కరినీ నిర్భందించారు. దేశవ్యాప్తంగా మతోన్మాద పాలకులు చేసిన దుర్నీతి పాలకులు చేస్తున్న దుశ్చర్యలే ఈ కవితాక్షరాలు. ప్రతి అక్షరం నిప్పుకణికై ప్రశ్నిస్తుంది. వర్తమాన సమాజచిత్రాన్ని ఈ కవిత్వం మనముందుంచింది. అక్రమంగా నిర్భందించి జైలుగోడలకు పరిమితం చేసి మానవ హక్కులను కబళిస్తున్నాడు. అక్రమంగా బంధించబడ్డ సాయిబాబా, వరవరరావులు కనబడతారు. జైలుగోడలే అనేకాకనే ప్రశ్నలకు సంకేతాలౌతాయి. అందరికీ తెలుసు ఇదంతా రాజ్యం చేస్తున్న కుట్ర అన్నది. వాళ్ళు మాత్రం ఎన్నేళ్ళు నిర్భందించినా వాళ్ళు పిడికిళ్ళై మొలకెత్తుతూనే ఉంటారు..
కేసుకట్టలను మోశాను
పేద ఆడపడచుల వెతలను వేదనలను మోశాను
ఎందుకు అరెస్టయ్యామో కూడా తెలియని
ఆదివాసీల ప్రేమలు చూశాను
సుధ ఏన్నో ఏళ్ళుగా ఆదివాసీల పక్షాన పోరాడుతుంది. జైలు నిర్భందాన్ని లెక్కచేయలేదు. జైలును ఉద్యమ కార్యస్థానంగానే మార్చుకున్నది. జైలు ఎన్నో అనుభవాలను నేర్పుతుందని బలంగా నమ్మి ఆత్మస్థైర్యాన్ని కోల్పోక పోరుజెండాగా నిలుస్తుంది.
ఇంకా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎందుకుబయటికొస్తారు. ఎందుకు బయటికి రానిస్తారు. ఎక్కడో చదివినట్టు గుర్తు..‘‘నీవు మనిషై మాట్లాడుతున్నంతకాలం వాడు నిన్నేలుతూనే ఉంటాడు’ అని…చివరగా ఓ ప్రశ్న సంధించాలని ఉంది..ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కుందా..లేదా అని..నిజంగా ఆందరికీ హక్కుంటే ఎందుకీ మారణహోమాలు..ఎందుకీ కుట్రలు..ఇక్కడి మనషులమే అని చెప్పుకోడానికి సిఏఏ-ఎన్‌ఆర్సీ చట్టాలెందుకు..? ఈ దేశాన్నేం చేద్దామని..?మతం పేరుతో కులంపేరుతో దేశభక్తి పేరుతో ఓట్ల రాజకీయాలు చేసి గద్దెనెక్కడమేనా..ఇదేనా దేశభక్తంటే..ప్రశ్ననే నేరమని మీరనుకుంటున్నారు..ప్రశ్నించడమే ఈ దేశభవిష్యత్తనే పంథా మాది.. ఈ కవిత్వం ఈ దేశవర్తమాన పరిస్థితులకు ప్రతిబింబం. ఈ కవిత్వం రాజ్యం చేస్తున్న అమానుష అరాచకాలకు నిదర్శనం..
మోహన్ గారి వ్యాసం చాలా కోణాలను చూపెట్టింది. వాసు గారి కవిత్వాన్ని చక్కగా విశ్లేషించింది.
ధన్యవాదాలు సార్