లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం. 

వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇస్తామన్నారు. అకాడమీ బహిష్కరిస్తున్నామన్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఇక కచేరీ చేయబోమని అన్నారు. ఈ మొత్తం గొడవ వెనుక బీజేపీ ఉన్నదని  పరిశీలకులు అంటున్నారు. వాళ్లూ వాళ్లూ కూడబలుక్కోపని లేదు. ఈ ఛాందస విద్వాంసులకు, సంఫ్‌ుపరివార్‌కు భావజాల సంబంధం చాలా సహజం.

దేనికంటే టిఎం కృష్ణ మామూలు సంగీతకారుడు కాదు. కచేరీలు చేసుకొనేవాడే కాదు. ఆయనకు విస్తారమైన సామాజిక జీవితం ఉంది. కేంద్రంలోని బీజేపీ ఫాసిస్టు పాలనపట్ల స్పష్టత  ఉన్నది. దాని విధానాలన్నిటినీ బాహాటంగా విమర్శించాడు. దానికి వ్యతిరేకంగా జరిగే ప్రజాందోళనలకు మద్దతు ఇచ్చాడు. ఈ ఫాసిస్టు వ్యతిరేక వైఖరికి మూలాలు ఆయన స్వీకరించిన పెరియార్‌ ఆలోచనా విధానంలో ఉన్నాయి. అందువల్ల రాజకీయంగానే కాక సామాజిక సాంస్కృతిక విషయాల్లో సంప్రదాయ సంగీతకారులకు దిమ్మతిరిగిపోయే వైఖరులు ఆయన చెప్తూ వచ్చాడు. వాటి మీద సంప్రదాయవాదులు ఇంత కాలం సణుగుడుతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పురస్కారం రావడంతో బైటపడ్డారు. దీనికి కర్ణాటక సంగీత వ్యవస్థ లోపలి కారణాలతోపాటు దేశంలో బలపడిన హిందుత్వ భావజాల వాతావరణం కూడా తోడైంది. నేరుగా సంఫ్‌ుపరివార్‌ రాజకీయ ఆధిక్యత సరేసరి.

కరడుగట్టిన సంప్రదాయ వ్యవస్థలో ఉంటూ టిఎం కృష్ణ ఆధునిక ఆలోచనలు చేస్తున్నాడు. త్యాగయ్య పరంపరలో ఉంటూ పెరియార్‌ భావజాలాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ రంగంలో తిష్ట వేసుకున్న పెద్దలు ఇలాంటి కాలం వస్తుందని ఊహించి ఉండరు. టిఎం కృష్ణ సామాజిక జీవితంలో ఎట్లా ఉన్నా సంగీత సరస్వతినైనా తూచా తప్పకుండా ఆరాధించి ఉంటే ఎటా ఉండేదో. అప్పుడు ఈ సంప్రదాయవాదులు ఎట్లా స్పందించి ఉండేవారో.

నిజానికి సామాజిక, కళా జీవితాల మధ్య కర్ణాటక సంగీత విద్వాంసులు  పెద్దగా తేడా చూపించరు. గతంలో ఎవరైనా దీనికి మినహాయింపు ఉన్నారేమో తెలియదు. మౌలికంగా ఆ రెంటికీ సంప్రదాయమే సర్వస్వం. అందువల్ల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాల్లో  ఆధునిక, హేతుబద్ధ ఆలోచనలను, విలువలను, వైఖరులను ప్రకటించిన శాస్త్రీయ సంగీతకారులు కనిపించరు. వేరే రంగాలతో పోల్చితే ఈ తేడా కనిపిస్తుంది.

అలాంటి చోట కృష్ణ ప్రజా జీవితంలో ఆధునిక, ప్రజాస్వామిక వైఖరులు తీసుకున్నట్లే సంగీత జీవితంలో కూడా కొత్త వైఖరులు తీసుకున్నాడు. అవి సంప్రదాయ సంగీత గురు పరంపరకు భిన్నమైనవి. ఆ రంగంలోని వాళ్లకు కోపం తెప్పించేవి. అయితే ఆయన ప్రతిభ వల్ల ఇంత కాలం ఏమీ అనలేకపోయారు. ఇప్పుడు అనేక రకాలుగా వాళ్లకు అనుకూల వాతావరణం తయారైంది. ఒక్కసారిగా విరుచుకపడ్డారు. కర్ణాటక సంగీతపు లోతుపాతులు మనకు తెలియకపోయినా ఈ ఛాందసులు చేస్తున్న అల్లరిని తేలిగ్గా తీసుకోడానికి లేదు. ఈ గొడవ మామూలుగా ఎప్పుడైనా జరిగేది కాదు. వేరే రాజకీయ పార్టీలు అవకాశం ఉంటే తమకు అనుకూలమైన వాళ్లకు అవార్డులు ఇచ్చుకుంటాయి.  రావాల్సిన వాళ్లకు రాకుండా అడ్డుకుంటాయి. అవి అంత వరకే చేస్తాయి.

కానీ బీజేపీ అలాంటిలాంటి పార్టీ కాదు. అన్ని సాంస్కృతిక విషయాలను తనకు అనుకూలంగా మార్చేసుకుంటుంది. దానికి తగినట్లు భావజాలాన్ని రెచ్చగొడుతుంది. లేదా ఎవరంతకు వాళ్లు రెచ్చిపోయినా తనకు ఉపయోగపడే భావజాల వలయాన్ని సిద్ధం చేస్తుంది. ఫాసిస్టు ప్రమాదమంటే ఇదే. దీన్నంతా టిఎం కృష్ణ సందర్భంలో చూడవచ్చు.  అందువల్ల ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతు వస్తున్నది. ఆయన చుట్టూ ఛాందసులు లేవదీసిన వివాదంలో ఈ ఫాసిస్టు వ్యతిరేక, ఆధునిక వైఖరి  ఒక ముఖ్యమైన అంశం.

            అయితే ఇదంతా అవతలి వైపున ఛాందసులు ఉన్నందుకో, వాళ్ల నిరసనలో హిందుత్వ ఉన్నందుకో పరిమితం కానక్కర లేదు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు తీసికెళ్లవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఈ ఘర్షణ గడ్డకట్టిపోయిన సంప్రదాయ వ్యవస్థలో జరుగుతున్నది.  అందులో ఉంటూనే దానిలో మార్పు తేవాలనే టిఎం కృష్ణ  ప్రయత్నాన్ని అప్పుడే గుర్తించగలం.  దానికి కూడా మద్దతు ప్రకటించగలం.

ఆయన తీసుకొస్తున్న మార్పులు ఎట్లాంటివి? అవి చివరికి ఏమవుతాయి? అసలు ఆ రంగంలో మార్పులు సాధ్యమేనా? అని ఎన్నయినా  ప్రశ్నలు వేసుకోవచ్చు. ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎక్కువా చేయనవసరం లేదు. తక్కువా చేయనవసరం లేదు. ఏ మార్పునూ అనుమతించని సంప్రదాయ వ్యవస్థలు ఏవైనా సరే, అవి ఆధునిక విలువలకు, ఆలోచనారీతులకు నిత్యం సవాల్‌ విసురుతూ ఉంటాయి. కాబట్టి వాటి మానాన వాటిని వదిలేయడానికి లేదు. ఈ వైపు నుంచి కూడా టిఎం కృష్ణ  సంగీతంలో చేస్తున్న ప్రయోగాలకు కనీసం ఆ రంగం వైపు నుంచి ప్రాధాన్యత ఉంది.

దీనితోపాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం లోపలి విషయాలను కూడా ఎంతో కొంత పరిశీలించవచ్చు.  ఒక రకంగా మన సామాజిక, సాంస్కృతిక కళా రంగాలకు సంబంధించిన అనేక ఆలోచనలు చేయడానికి ఇది ఒక సందర్భం. మార్పుకు తలుపులు మూసేసే ఫాసిస్టు ఆధిపత్య ధోరణులు ఎంత బలపడినా  సరే. అవి వాటికవే కొత్త తలుపులు కూడా తెరుస్తాయి. ఈ  ఎరుకతో చర్చను జాగ్రత్తగా ముందుకు తీసికెళ్లవచ్చు. అదీ కర్ణాటక శాస్త్రీయ సంగీతమనే సంప్రదాయ వ్యవస్థ సందర్భంలో.

బహుశా ఈ చర్చకు సంప్రదాయం`ఆధునికత, శిష్ట`ప్రజా, బ్రాహ్మణ`బ్రాహ్మణేతర కోణాలు ఉంటాయి. సాహిత్యంలో అందరికీ తెలిసిన వస్తువు`శిల్పం`దృక్పథం అనే పరిశీలనను శాస్త్రీయ సంగీతం వైపు నుంచి కూడా  చేయవచ్చు. ముఖ్యంగా ప్రగతి అనే గీటురాయి మీద చేయవచ్చు. గడ్డకట్టిపోయిన కర్ణాటక సంగీత ప్రయోజనాన్ని, మానవ అనుభూతిని అంచనా వేయవచ్చు. టిఎం కృష్ణ ఎప్పటి నుంచో తన సంగీత, సామాజిక వొరవడిని కొనసాగిస్తున్నప్పటికీ ఇతరులు అంతగా పట్టించుకోలేదు. ఈ పురస్కారం, దాని మీద సంప్రదాయవాదుల అభ్యంతరం  అలాంటి అవకాశాన్ని ఇచ్చింది.

శాస్త్రీయ సంగీతం సార్వజనీం కావాలి అనే భావన టీఎం కృష్ణకు ఉన్నట్లు ఉంది. అది ఆధునిక భావన. ఆయన దీని కోసం  కర్ణాటక సంగీత బాణీల్లోకి పెరియార్‌ దగ్గరి నుంచి చాలా వాటిని తీసికెళ్లాడు. తన సంగీత కార్యక్రమాల వేదికలను మార్చేశాడు. అంత వరకు ఆ సంగీతానికి శ్రోతలు కాని వాళ్ల దగ్గరికి దాన్ని తీసికెళ్లే ప్రయోగాలు చేశాడు. ఇవన్నీ వస్తువుకు, సంగీత శిల్పానికి సంబంధించినవి.

అయితే కర్ణాటక సంగీతం గురించి ఏమీ తెలియని వాళ్లయినా సరే,  సాహిత్య విశ్లేషణా పద్ధతి వైపు నుంచి పరిశీలిస్తే ఒక విషయం తెలుస్తుంది. వస్తువు, శిల్పం, దృక్పథం వేరు చేయలేనంతగా సంప్రదాయ సంగీతం రూపొందిన తొలి దశలోనే  కలిసిపోయి ఘనీభవించిన వ్యవస్థగా అది స్థిరపడిరది.  మౌలికంగా అది భక్తిమార్గానికి చెందినది. సాహిత్యంలోని భక్తిమార్గం (బ్రాహ్మణ`బ్రాహ్మణేతర శిబిరాల్లో)లో వచ్చిన మార్పుల వంటివి శాస్త్రీయ సంగీతంలో రాలేదు. కర్ణాటక సంగీతానికి ఆద్యులనదగిన వారిలో, ఆ తర్వాత వచ్చిన ప్రముఖుల్లో ఉన్న  వైవిధ్యం కూడా దాని మౌలిక స్వభావానికి లోబడినదే. ఈ వైపు నుంచి టిఎం కృష్ణ ప్రయోగాలను చూడటం ఆసక్తికరం.       

పాటల టెక్ట్స్‌ను మార్చినా, పాడే పద్ధతిని మార్చినా, సామాజిక ప్రయోజనాన్ని చేర్చినా దాని మౌలిక స్వభావం మారుతుందని చెప్పలేం. దానివి అంత తేలికైన పునాదులు కావు. కర్ణాటక సంగీతానికి మూలమైన సంప్రదాయ వాగ్గేయకారుల స్థల కాలాలు, జీవన విధానం ఏవైనా కావచ్చు. ఆ కాలంలో వాళ్ల  నైతిక విలువలు ఏవైనా కావచ్చు. అందులో ఆ కాలానికి ఒకింత ధిక్కారం కూడా ఉండవచ్చు. కానీ మౌలికంగా అది బ్రాహ్మణ, శిష్ట వర్గానికి చెందినది. అందులోని భక్తి భావం వల్ల వైవిధ్యానికి చోటు ఉన్నట్లే, దాని వల్లే అది ఇరుకు వ్యవస్థగా మారింది. బ్రాహ్మణేత సంగీతకారులు ఉన్నా, ముఖ్యంగా వాద్య సంగీతంలో ఉన్నా గాత్ర సంగీతంలో అది ప్రధానంగా బ్రాహ్మణ కులానికి చెందినది. అన్ని రంగాల్లో చాలా కాలం ఇట్లాగే ఉండేది. కానీ మిగతా రంగాల్లోకి వేరే కులాల వాళ్లు ఆలస్యంగా అయినా ప్రవేశించారు. కానీ కర్ణాటక సంగీతం దీనికి చాలా వరకు మినహాయింపు. అంతకంటే కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఎవరు ఆ రంగంలోకి ప్రవేశించినా బ్రాహ్మణీకరణ చెందక తప్పని భావజాల ప్రాబల్యంలో ఆ సంగీతం ఉన్నది. గురు పరంపరను జాగ్రత్తగా కొనసాగిస్తున్న రంగం అది.

కాబట్టి కర్ణాటక సంగీతంలోకి ఇతరులు ప్రవేశించినా, కృష్ణలాంటి వారు ఎన్ని ప్రయోగాలు చేసినా దాని మౌలికతలో మార్పు వస్తుందా? అనే ప్రశ్న తప్పించుకోలేనిది. భక్తి సంప్రదాయంలోని కొన్ని పాయలు తీవ్రమైన సామాజిక సాంస్కృతిక కారణాల వల్ల వచ్చాయి. అయినా కొద్ది కాలమయ్యాక అవి ఆగిపోయాయి. వెనక్కి వెళ్లాయి. సంస్కృతీకరణకు గురయ్యాయి. స్థూలంగా ఒక పెద్ద చారిత్రక అవధిలో వాటి సానుకూల పాత్ర సరే. కానీ ఈ ప్రత్యేకతలకు అవి లోనయ్యాయి. 

వాటితో పోల్చితే ఇప్పటికీ కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఆధిపత్య కులాల చేతుల్లోనే ప్రధానంగా ఉన్నది. అలౌకిక రసానంద కారకంగానే ఉన్నది. అంత బలీయమైన మూలాలతో అది వ్యవస్థీకృతమైంది. త్యాగయ్య సనాతన రాముడి సంప్రదాయంలోకి ఆర్యన్‌ రాముడికి వ్యతిరేకంగా ద్రవిడ సంస్కృతి కోసం జీవితాన్ని వెచ్చించిన పెరియార్‌ను టిఎం కృష్ణ తీసుకెళుతున్నాడు. దీని వల్ల శాస్త్రీయ సంగీతం ఎంత ప్రజాస్వామికమవుతుంది? వ్యక్తులుగా టీఎం కృష్ణలాంటి వాళ్లు దాన్ని ప్రజలపరం చేయగలరా? అసలు అలాంటి మార్పురాగల సంప్రదాయ మౌలికతను ఆయన పట్టుకున్నారా? అదే జరిగి ఉంటే సంగీత ఆకాడమీ అయినా ఆయన్ను అంగీకరించేదా? అనే ప్రశ్నలు తలతెత్తుతాయి. వీటికి అందులో నిష్ణాతులే చెప్పాలి. అయితే వాళ్లు ఆధునికులై ఉండాలి. టిఎం కృష్ణను కూడా ఆధునికత, ప్రగతి అనే గీటురాళ్ల మీద అంచనా వేయగల వాళ్లు అక్కడ ఉండాలి. అలాంటి వాళ్లు అక్కడ లేకపోవచ్చు. ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. సంగీతంలోని సాంకేతిక విషయాలు ఇతరులకు తెలియకపోవచ్చు. కానీ సంగీతం కూడా సమాజానికి సంబంధించిందే. కాబట్టి ఇతరులు కూడా ఆ పని చేయవచ్చు. సరిగ్గా ఇక్కడే శాస్త్రీయ సంగీతం సార్వజనీనం కావాలనే ఆకాంక్ష చర్చనీయాంశం అవుతుంది. ఇది ఎప్పటికైనా  నిజం కాగల లక్షణం ఆ సంగీతానికి ఉన్నదా? పరిశీలించాలి.

శాస్త్రీయ సంగీతం చుట్టూ ఉన్న భావజాలమే దీనికి కారణం కాదు. అంత వరకే అయితే దాన్ని విమర్శించి సరిపెట్టుకోవచ్చు. ఆ మేరకు మార్పులు తెస్తే చాలని అనుకోవచ్చు. ఒక రకంగా కృష్ణ చేస్తున్నది అదే. కానీ శాస్త్రీయ సంగీతంలోని నైపుణ్యం వెనుక కుల వ్యవస్థ ఉన్నది. అలాంటివన్నీ కలగలసి పోయాయి. శాస్త్రీయ సంగీతంతో సంబంధం లేనివాళ్లు, పెద్దగా ఆసక్తి లేనివాళ్లు కూడా ఎప్పుడైనా చెవి పెట్టి ఆలకించేది ఆ నైపుణ్యానికే. శాస్త్రీయ సంగీతానికి సంబంధించినంత వరకు ఆ నైపుణ్యం బ్రాహ్మణుల సొత్తుగా భావిస్తుంటారు. ఇతర కులస్తులకు ఆ నైపుణ్యం ఉన్నా గుర్తించరు.

బెంగళూరు నాగరత్నమ్మ ప్రతిభను, నైపుణ్యాన్ని బ్రాహ్మణ మగ సంగీతకారులు గుర్తించలేదు. ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా ఆదివాసీ, దళిత కళాకారుల్లో ప్రతిభ ఉందని, నిపుణత ఉందని ఒప్పుకోరు. వాళ్ల పాటలను లల్లాయి పదాలనే అంటారు. నైపుణ్యం, ప్రతిభ అనేవి సంప్రదాయవాదులు తరచూ అనే ‘విద్వత్తు’కు సంబంధించినవి. సంగీతంలో ఇది సాధన వల్లనే రాదని వాళ్లు అంటుంటారు. అంటే జన్మత: వచ్చేవి. దీన్నంతా సంప్రదాయ సంగీతం చుట్టూ అల్లుకున్న భ్రాంతి అనుకోడానికి లేదు. భావజాల చట్రం అని సరిపెట్టుకోడానికి లేదు. దానికదే శాస్త్రీయ సంగీతం ఒక సామాజిక సాంస్కృతిక భౌతిక పునాదిని ఆశ్రయించి బతుకుతున్నది.

కాబట్టే నైపుణ్యం భావజాలంతో కలిసిపోయింది. ఆ నైపుణ్యం కులపరిధిలోనే ఉంది. శిష్ట వర్గానికే పరిమితమైంది. కర్ణాటక సంగీతం రూపొందడానికి, కొనసాగడానికి పడిన ప్రయాస అంతా శిష్ట వర్గానిదే. దాని పునాది వల్లనే అది సమాజం మొత్తానికి కాకుండాపోయింది. ఎప్పటికైనా అవుతుందా? ఆ లక్షణం దానికి ఉన్నదా? టీఎం కృష్ణ చేస్తున్న ప్రయోగాలను స్వాగతిస్తూనే ఈ ప్రశ్నలు కూడా వేసుకోవాలి. అప్పుడే ఆయన శాస్త్రీయ సంగీతాన్ని సార్వజనీనం చేయాలనే ఆకాంక్షను సహితం విమర్శనాత్మకంగా చూడగలం. సంగీతకారుడిగా తన రంగంలో మార్పు రావాలని కోరుకోవడం మంచిదే. దానికి ఎంత రాడికల్‌ రప్చర్‌ జరగాలి? ఆ సంగీతాన్ని ప్రజా సంగీతం చేస్తే అప్పుడు ఆయన నిలబడ్డ చోటు ఏమవుతుంది? వ్యక్తిగా ఆయన్ను ఇవన్నీ అడగలేకపోవచ్చు. కానీ దేన్నయినా ప్రగతి వైపు నుంచి చూస్తే ఇన్ని విషయాలు ముందుకు వస్తాయి.

జీవితంలో సార్వజనీన అంశాలు కూడా ఉంటాయి. కానీ కర్ణాటక సంగీతం ఎన్నడూ తలుపులు మూసుకొనే ఉన్నది.  ఆ రంగంలో పైకి వెళ్లే కొద్దీ బ్రాహ్మిణీకరణ  చెందుతారు. ఇప్పుడైతే అదొక కార్పొరేట్‌ సంగీత ప్రపంచంగా కూడా మారింది. ఒక ఇరుకు, కూపస్థ రంగం ఎప్పటికీ దానికదే ముగిసిపోదు. తన శిష్ట జన సాధకులను తయారు చేసుకుంటూనే ఉంటుంది. శ్రోతలనూ సిద్ధం చేసుకుంటూనే ఉంటుంది. కానీ దాని నిలువ నీటి స్వభావం మారదు. దేనికంటే అది భక్తితో ముడిపడిరది. దానిది సనాతన సంప్రదాయం.

సంగీతంలో దీనికి భిన్నమైన ఆదివాసీ, దళిత ఒరవడులు ఎన్నో ఉన్నాయి. వీటి మధ్య దడి ఉన్నది. ఎన్ని సంస్కరణలు జరిగినప్పటికీ శాస్త్రీయ సంగీతం ప్రజా సంగీతంలోని బాణీలను తీసుకొనేంతగా మారుతుందా? లేక శాస్త్రీయ  సంగీతంలోని వస్తువు, శిల్పం, దృక్పథం, ప్రయోజనం, కళానుభవం వంటి వాటితో సహా మౌలికంగానే అది తన స్వభావాన్ని మార్చుకొని సాధారణ ప్రజల దగ్గరికి రాగలుగుతుందా? అవునని చెప్పడానికి ఆధారాలేమీ లేవు.  ఇవన్నీ కేవలం కళా సంబంధమైన ప్రశ్నలే కాదు. మన సామాజిక సాంస్కృతిక గోదాకు సంబంధించినవి కూడా.

2 thoughts on “టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

  1. వ్యాసం ఒరిజినల్ గా ఉంది.రొడ్డకొట్టుడు పొగడ్తలు గుప్పించకుండా కృష్ణన్ కృషిని విస్మరించకుండానే విభిన్నంగా విమర్శనాత్మకంగా సాగింది.నేనూ ఇలాంటి వాదనే చేశివున్నాను.కర్ణాటక సంగీత శిల్పంలో ఆధునికత ను ప్రవేశ పెట్టకుండా ఆధునిక వస్తువును మాత్రమే ప్రవేశపెట్టినందువల్ల పెద్ద ప్రయోజనం లేదని నా ఉద్దేశం. పాడే విధానంలో బాణీలు నిర్మించే విధానం లో సంస్కరణలు జరగకుండా వెసులుబాటు ప్రయోగాలు చేయకుండా పెరియార్ మీద పాడినా అంబేద్కర్ మీద పాడినా మరే పురోగామీ వస్తువును పాత శైలిలో టోన్ లో కీర్తనల కక్ష్యల్లో ఇరికించినా హాస్యాస్పదంగా పేలవంగా తేలిపోతుంది. ఆయన పెరియార్ మీద పాడిన పాట ఇందుకొక ఉదాహరణ.

    ఈనాటి వస్తువును ఇప్పుడు పద్యంలో ఇరికించడం వల్ల ఎంత ప్రయోజనమో ఇదీ అంతే అని నా అభిప్రాయం. ఇది ట్రాక్టర్ స్థానాన్ని నాగలితో బర్తీ చేయడం లాంటిది.తారు రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళను తిరిగి మట్టి రోడ్డుకు మళ్లించడం లాంటిది.

  2. తెలంగాణ బాలోత్సవం ప్రజాపాట కు నృత్య నీరాజనం కార్యక్రమం నిర్వహించాము శాస్త్రీయ నృత్య గురువులు ఆధునికతను అందుకోన్నారు ప్రజా పాటలకు శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి

Leave a Reply