డప్పు-డోలక్ ల‌ను జననాట్యమండలి ఎందుకు స్వీక‌రించింది? ఎలా వినియోగించింది? ఏం ప్రయోజనం నెరవేరింది? వాటిని వినియోగించడంలో ఏ లక్ష్యం సాధించారు? శబ్దం, దరువు – ప్రదర్శనలో గాని పాత్ర బాణీలు మారినప్పుడు ఏ విధంగా డప్పుశాస్త్రం రాయడం, నాలుగు తాళాలు అభివృద్ధి చేయడం ఇంకా భవిష్యత్‌లో అవకాశాలు. పాటకు ఈ వాయిద్యానికి మధ్య సమన్వయం గురించి వివరణలో రాగాలు మారినపుడు ఎలా?

జననాట్యమండలి రచయితలు, కళాకారులు ప్రజల జానపద బాణీలతోనే తమ మెజారిటీ పాటలను, రాశారు. కాబట్టి ప్రధానంగా జానపద పాటలకు ప్రధానంగా ప్రజలు వాడే  వాయిద్యం డప్పు కనుక జననాట్యమండలి కూడా అదే వాయిద్యాన్ని తన ప్రధాన వాయిద్యంగా ఉపయోగించింది. అది పేదల, (శ్రమకులాల వాయిద్యమే కాకుండా సులువుగా లభిస్తుంది.

జానపద బాణీలు ప్రాంతాన్ని బట్టి రకరకాల యాసల్లో వున్నట్టే (ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, దక్షిణ కోస్తా అంధ్ర) డప్పుల తయారీలోని వాటి అకారం, సైజు, ఆయా శబ్బాలు, ఆయా దరువులు తమ ప్రాంత కళలకు తగ్గట్టుగా ప్రజలు తయారుజేసుకున్నారు.

పై వాటన్నిటిలో అత్యంత కళాత్మకత గల్లి చక్కని ప్రతిభావంతమైన డప్పు కళాకారులు, బృందాలు, డప్పులు – కృష్ణా జిల్లాలోని పూర్తి మైదాన ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలోని మదిర లాంటి ప్రాంతం, గుంటూరు జిల్లాలోని తూర్పు భాగాలలో (తెనాలి, మంగళగిరి, రేవల్లె, బావట్ట, పొన్నూరు)కనిపిస్తవి.

డప్పును జననాట్యమండలి వుపయోగించటంలో మూడు ప్రయోజనాలు నెరవేరాయి.

1. వన్‌ మ్యాన్‌ కల్చరల్‌ ఆర్టిస్ట్‌

2. టు మ్యాన్‌ కల్చరల్‌ టీమ్‌

3. త్రీ మ్యాన్‌ కల్చరల్‌ టీమ్‌

ఈ మూడు విధాలే గాక న‌లుగురు, ఐదుగురు  ఇంకా ఎక్కువ 20 మంది వరకు వున్నా ఈ డప్పులు కళాబ్బందం  సంఖ్యను బట్టి వుపయోగించింది. పైన చెప్పినట్టు అత్యంత కష్ట పరిస్థితిలో ‘సైతం ఒక్కరే వెళ్ళి తానే పాట పాడుతూ, డప్పు కూడా తానే వాయించేవాడు. మరో చోట ఇద్దరు వెళితే ఒకరు పాడితే,  మరొకరు కోరస్‌ ఇస్తూ డప్పు కొట్టేవారు. ముగ్గురు వెళితే ఒక్కరు పాడితే  ఇద్దరు, లేదా ఒకరు డప్పును లేదా డప్పులను వాయించేవారు.

ఒకవేళ డోలక్‌ బాగా వచ్చిన కామ్రేడ్‌ వున్నచోట కనీసం ముగ్గురు గాయకులు పోతుంటే  డోలక్‌ అతన్ని కల్సి నలుగురు వెళ్ళేవాళ్లు. జననాట్యమండలి ఎక్కడైనా ఎప్పుడైనా 7గురి కంటే పెద్దగా 20 మంది వరకు వెళుతుందో అలాంటప్పుడు పాటలు,  నృత్యరూపాలు, ఒగ్గుకథలు, భూమి భాగోతం, రగల్‌జెండా బ్యాలే లాంటి రూపాలతో పాటు మొట్టమొదట ఒక ప్రత్యేక అకర్షణగా 2, 4 డప్పులు వచ్చిన వారి సంఖ్యను బట్టి, అంతకు మించి డప్పులతో, కొన్ని దరువులు, లయబద్దంగా అత్యంత కళాత్మకంగా, ఉద్వేగంగా, వట్టి దరువులనే కొద్ది సేపు వాయించేవారు. అలాంటప్పుడు  ప్రధాన కళాకారుడు/కళాకారిణి “జనం గుండెల చప్పుడు జననాట్యమండలి డప్పుల చప్పుడు వినండి” అంటూ ఈ దరువులు వేసి అపి, పాటలు పాడేవారు.

మరో రకంగా ఇందులోనే సంక్షిప్తంగా  జననాట్యమండలి అంటే ఏమిటి? అనేది చెబుతూ పల్లె జానపద రాగాలు తీసి, చిన్న చిన్న జానపద బాణీలు పాడి/వాటిని విప్లవీకరించి, ప్రజల బ్రతుకుల మార్పుకోసం ఎలా విప్లవీకరించి తెచ్చిందో వినిపించే నాలుగైదు జానపదాలు/వాటి విప్లవ పాటల బాణీలు తెలియజేస్తూ, సాగుతున్న ఈ జన నాట్యమండలి ప్రోగ్రామ్‌ను మీరు ఈ సభలో మధ్య మధ్య పాటలతో, కళారూపాలతో చూస్తారు అని మళ్ళీ ఒకసారి వినండి! ఈ “జనం గుండెల చప్పుడు జననాట్యమండలి డప్పుల చప్పుడు” అంటూ మళ్ళీ డప్పు, దరువులు వేసి అపేసే వాళ్లు. ఈ కార్యక్రమాన్ని “జననాట్యమండలి పరిచయం” అని పిలిచే వారు. ఈ విధంగా డప్పులను చిర్ర, చిటికెతో కొట్టడం (కొన్ని దరువులు) నేర్చుకున్నారు. వాటిని జననాట్యమండలి పరిచయ దరువులని పిలిచేవారు.

ఇక పాటలకు జననాట్యమండలి డప్పునే ఎందుకు మెజారిటీగా ఉపయోగించిందో తెలుసుకుందాం!

డోలక్‌ను కూడా జననాట్యమండలి ఉపయోగించింది. హైదరాబాద్‌ జననాట్యమండలి టీము ఎక్కువగా డోలక్‌ను ఉపయోగించింది. అక్కడి పేదల బస్తీలలో అంతటా రామ, కృష్ణ భజన మండళ్లు వుంటాయి. వాటిలో ప్రతి మండలికి డోలకిస్టులు వుంటారు. మన కళాకారులు గాయని/ గాయకులు వాటిల్లో నుండే వచ్చిన వారే. సెంట్రల్‌ జన నాట్యమండలి టీమ్‌లో అమరుడు డోలక్‌ దయ ఒకరు. ఆయన చాలా సుదీర్హ కాలం జననాట్యమండలితో కొనసాగి శతృవుచే కిడ్నాప్‌ చేయబడి, చిత్రహింసల పాలై అమరుడైనాడు.

డోలక్‌ ప్రత్యేకతలు:-

1. దీన్ని వాయిస్తూ పాట పాడటం కష్టం. దీన్ని కూర్చుని మాత్రమే వాయించాలి. కానీ డప్పు అయితే నిలబడి వాయిస్తూ పాట పాడవచ్చు.

2. ఇది డప్పుకన్నా వినసొంపే గానీ, నేర్చుకోవ‌డం  కష్టం. డప్పిస్టుల కన్నా డోలకిస్టులు అరుదుగా దొరుకుతారు.

3. మనకు రాష్ట్రం నలుమూలలా ఎక్కడ చూసినా, ప్రతి గ్రామాన దళిత వాడలు వున్నవంటే డప్పిస్టులు కనిపిస్తారు. దళిత ప్రజలు మనకు విప్లవ చోదక శక్తులూ మనం మొదట విప్లవ  ప్రచారం కోసం పోయేదీ అక్క‌డికే గనుక వారి వాడలలో పాటలు పాడేవారు, డప్పులు వాయించేవారు కూడా పుష్కలంగా లభిస్తారు. కానీ డోలక్‌ వాయించేవారు ఒక సిటీలో, దాని పరిసర గ్రామాలలో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో చాలా అరుదుగా తారపడుతుంటారు.

4 డోలక్‌ను ఒకవేళ మైక్‌లు లేనిచోట వాయించినా అది పెద్దగా శబ్జాన్ని యివ్వదు. దానికి తప్పనిసరిగా ఒకటి, రెండు, మైక్‌లు అటు, ఇటు, పెట్టి వాయిస్తేనే, (పాటలకు కూడ మైకు వుంటూ) దాని విలువ ఉపయోగపడుతుంది. అదే డప్పు ఒక్కటి గానీ, మరెన్నయినా డప్పులు కానీ మైకు లేక పోయినా పాడుతూ వాయిస్తుంటే తగినంత శబ్దాన్ని ఇస్తయ్‌. కనుక జననాట్యమండలి డప్పునే ఎక్కువ నేర్చింది, కేడర్లకు నేర్పింది.

5. డోలక్‌ తయారీ కూడా ప్రత్యేకించి నగరాల్లోనే చాలా అరుదైన చోట్ల చేస్తారు. దాని మూతలు మేక చర్మంతో మాత్రమే కప్పాలి. అదే డప్పు చర్మాన్ని ఎక్కడికక్కడ దళితులు దాని చెక్క నిర్మాణాన్ని దాని చర్మపు మూతను (దూడ) వారే తయారు చేసుకుంటారు. ఒకవేళ మన వద్ద వున్నది పగిలి పోయినా వెంటనే దాన్ని ప్రజలతో మూయించుకోవచ్చు లేదా బదులుగా మరొక దాన్ని అడిగి తీసుకోవటమో, కొనటమో చేయవచ్చు.

6. నిర్బంధ   కాలంలో సైతం జననాట్యమండలి టీము ప్రయాణాల్లో డప్పులు తమ వెంట తీసుకు పోకుండా ఎక్కడకు వెళితే అక్కడే ప్రజలనుండి డప్పులు అడిగి తీసుకుని వాడుకొని తిరిగి ప్రజలకి ఇచ్చిరావడం జరిగేది.

ఇన్ని విధాల అనుకూల అంశాలను బట్టి జననాట్యమండలి అంతటా, నాటి నుండి నేటి వరకు డప్పునే తన ప్రధాన వాయిద్యంగా వినియోగించింది.

ఈ వాయిద్యాన్ని వినియోగించడం ద్వారా నెరవేరిన ఫలితాలు చూద్దాము…

1. జననాట్యమండలిలో ఎప్పటికప్పుడు మొదటి నుండి వచ్చిన పాటలను పరిశీలిస్తూ ప్రోగ్రామ్‌ స్వభావాన్ని బట్టి పాటలను ఎంపిక చేసుకునేది. జననాట్యమండలి టీము అ ప్రోగ్రాముకు ఒకటి, రెండు రోజుల ముందు అ పాటలను ప్రాక్టీస్‌ చేసేది. అప్పుడు అ పాటల రాగాల  ప్రకారం డప్పు దరువులను జతపర్చేది. ఒక్కో పాటను ఒక్కొ ప్రధాన గాయని/గాయకుడు పాడుతుండగా దాని సబ్దెక్టు దెబ్బతినకుండా అత్యంత స్పష్టమైన పద ఉచ్ఛార‌ణ‌తో, స్పష్టమైన కోరస్‌ గొంతుల కలయికతో, నిర్దిష్టమైన భావ వ్యక్తీకరణకు తగిన “వేగం” “టెంపో” “నడక”తో వాయిద్య సమ్మిళిత

రిహార్సల్‌ చేసేది.

 ఇలా ప్రతి ఒక్క గాయని/గాయకుడు తనవంతు పాటలను ‘పేపరు(పుస్తకం) చూడకుండా నృత్యంతో పాడుతూ రిహార్సల్‌ చేసుకుని స్టేజి మీదకు వెళ్ళేది.

ఇప్పుడు మెయిన్‌ సింగర్‌/కోరస్‌/డప్పు ఒక్కటి లేదా రెండు.

అంటే ముగ్గురి నుండి 7 గురి వరకు టీము ఒకే కళాత్మక స్థాయికి ఎదిగిన మూడు రకాల సమ్మేళనంతో తయారయి, ప్రదర్శన ఇచ్చేది. రెండు డప్పులుంటే ఒకటి ‘బేస్‌స‌ మరొకటి ‘టాప్‌’-సౌండ్స్‌ వచ్చే వాటిని ఇరువురు, ఒక్కో పాటకి ప్రతిక్షణం ఇద్దరూ ఒకే దరువును ఒకే శబ్దం వచ్చేలా పాటకు తగ్గట్టు వాయించేది/వాయిస్తూ గొంతులు కూడా కోరస్‌ ఇచ్చేవి.

ఈ విధంగా పాటలు, ఒగ్గుకథ కూడ పాడుతూ, డప్పులు వాయిస్తూ “ముగ్గురిలో ఒకరు వాయించరు, కథకుడిగా గొంగడి భుజాన వేసుకొని కథ నడిపిస్తుంటే మరో ఇద్దరు రెండు డప్పులు వాయిస్తూ, అడుగులు వేస్తూ, కోరస్‌ పాడుతూ, మాటలతో రాజకీయ సంభాషణ చేస్తూ, హాస్యం చేస్తూ, వాటిని కథకు లింక్‌ చేస్తూ, కథకునికి అవకాశమిస్తూ, కథను హుషారుగా ముందుకు నడిపించ‌డానికి తగిన కళా సామర్థ్యంతో ఈ ‘ఒగ్గుకథ టీమ్‌” ప్రదర్శన ఇచ్చేది అద్భుతమైన స్పందన ప్రజల నుండి వచ్చేది. అటువంటి అద్భుతమైన పాటలు, ఒగ్గుకథలు, నృత్యాలు, డప్పు డ్యాన్సులు, చివరికి బ్యాలే, బాగోతాలు కూడా కళాకారుల తీవ్ర కృషి ఫలితంగా ప్రజల్లో అద్భుతంగా రక్తిగట్టాయి. విప్లవ భావాలు ప్రజల హృదయాలకు హత్తుకుపోయాయి. ఎక్కడ చూసినా ప్రదర్శన ఇచ్చి వెళ్ళిన మరుసటి రోజున అ గ్రామం (చిన్నపట్నం)లో కళాప్రియుల నాలుకలపై ఆ పాటలు కదలాడుతుండేవి.

గొప్ప భావోద్వేగానికి గురిజేసేవి. ప్రజలకు జననాట్యమండలి కళాకారులపై విశ్వాసం, నమ్మకం ఏర్పడి ఎంతో ప్రేమతో వారిని పలకరించి, ఆదరించి అన్నం పెట్టి, చార్జీలకు డబ్బులు ఇచ్చి మరోసారి రండి అనటం దీని ప్రయోజనం నెరవేరిందనడానికి ఒక నిదర్శనం.

అన్ని జననాట్యమండలి టీమ్‌లకు దాదాపుగా మొదటి నుండి (నాటినుండి) నేటికీ ప్రజల్లో ఇదే ఆదరణ లభిస్తున్నది. 1972న ప్రారంభమైన జననాట్యమండలి ప్రయాణం, 1980 వచ్చేసరికి పాత, కొత్త కళాకారుల సమ్మేళనంతో అనగా ప్రారంభంలో హైదరాబాదు టీమ్‌, మరోవైపు విశాఖపట్నం టీములతో మొదలై, దశాబ్దం గడిచేసరికి 2వ రాష్ట్ర జననాట్యమండలి ట్రైనింగ్‌ అనంతరం-దీని వాసి, రాసి, అదేవిధంగా ప్రజాదరణ, ప్రయాణాలు, పెద్దఎత్తున పెరగసాగాయి. దానికి ఒకే ఒక్క బలమైన కారణం దాని వెనకనున్న స్పష్టమైన విప్లవ రాజకీయాలు, వాటి  నిరంతర ప్రజా ఉద్యమ కార్యక్రమాలు ప్రజల్లో అంతపెద్ద ఆదరణ లభించటానికి పనిచేసినవి.

 దానికితోడు కళాకారులు సుదీర్డ కాలం ప్రజల మధ్య ప్రత్యక్షంగా ప్రదర్శనలిస్తూ వచ్చారు. ప్రజల నాడిని పట్టుకుని నూతన పాటలు, వివిధ కళారూపాలలో విప్లవ రాజకీయాలు అందించారు. ఒక ధారావాహికగా ప్రదర్శనలు కొనసాగటం, వాటితో కళాకారులు గుర్తింపు పొందడం కూడా జరిగింది. ఉన్నత చదువులు అభ్యసించిన వారు కొందరు పాటలు రాయటం, కంఠస్తం చేయటం, నిరంతరం దోపిడీ పాలక పార్టీల రాజకీయాలను వివిధ సంభాషణల్లో స్టేజిపై హాస్యంతో, వ్యంగ్యంతో నవరసాల్లో ప్రదర్శించటం ద్వారా జననాట్యమండలి పాటలు ప్రజలలో మంచి ముద్రవేశాయి

దానికి తోడు కళాకారుల సుధీర్హకాలం ప్రజల మధ్య ప్రదర్శనలిస్తూ వచ్చారు. ప్రజల నాడిని పట్టుకొని నూతన పాటలు, వివిధ కళారూపాలలో విప్లవ రాజకీయాలు అందించారు. ఒక ధారావాహికగా ప్రదర్శనలు కొనసాగటం, వాటితో కళాకారుల గుర్తింపు పొందటం కూడా జరిగింది. ఉన్నత చదువులు అభ్యసించిన వారు కొందరు పాటలు రాయడం, కంఠస్థం చేయడం, నిరంతరం దోపిడీ పాలక పార్టీల రాజకీయాలను వివిధ సంభాషణల్లో స్టేజిపై హాస్యంతో, వ్యంగ్యంగా నవరసాల్లో ప్రదర్శించటం ద్వారా జననాట్యమండలి పాటలు ప్రజల్లో మంచి ముద్ర వేశాయి.

 ఒక అద్భుత డోలకిస్టు హైదరాబాదు జననాట్యమండలిని అంటిపెట్టుకొని రెండు దశాబ్దాలను దాటి కొనసాగాడు. అంటే అద్భుత డోలకిస్టు రెండు దశాబ్దాలకు పైగా జననాట్యమండలిని అంటిపెట్టుకుని హైదరాబాదు నుండి వచ్చాడు. అలాగే 80ల నుండి గుంటూరు జిల్లా నుండి ఒక డప్పిస్టు డిగ్రీ కాలేజి నుండి బూర్జువా (సినీ) పాటలకు వాయించే క్లాసికల్‌ వాయిద్య శబ్దాల, దరువుల, అనభవాలను క‌లిగి, వాటిని విడిచి జననాట్యమండలికి పూర్తికాలం కార్యకర్తగా వచ్చాడు. తాను దిన దిన విప్లవ పాటలకు, ప్రజల్లో ప్రదర్శనలకు, సమష్టి సహాకారంతో, డప్పుపై శర వేగంతో చెప్పలేనన్ని ‘చేతితో వాయించే” వాయిద్యాలను డప్పుపై వాయించేవాడు. అలా 8 ఏండ్లకు కొన్ని వందల ప్రోగ్రాముల అనంతరం, కొన్ని పదుల శిక్షణా శిబిరాల అనంతరం డప్పుపై ఒక నోట్సు తయారు చేయడం జరిగింది. అదెలాగనగా డప్పును ఒక సందర్భంలో చదువుకున్న విద్యార్థుల జననాట్యమండలి టీమ్‌కు నిర్బంధంలో మూడే మూడు రోజుల్లో శిక్షణ ఇవ్వాల్సి రాగా శబ్దాలు పెద్దగా రాకుండాచూపిస్తూ మొట్టమొదటి “డప్పునోట్స్‌” తయారు చేశారు. వారికి బేసిక్‌గా చేతి ముద్రలు, చిర్ర చిటికెనల శబ్దాలకు అక్షర రూపం ఇచ్చి “నొటేషన్‌” రూపొందించి, అర్థం చేయించి పంపగా ఒక ముగ్గురు ఫలితం సాధించారు. దాన్ని మరికాస్త వివరంగా 1990 తాత్కాలిక వెసులుబాటులో 8వ రాష్ట్ర జననాట్యమండలి శిక్షణా శిబిరం నాటికి స్పష్టమైన “డప్పుశాస్త్రం”గా తయారు చేసి అంతటా, అందరూ, జననాట్యమండలి పాటలకు ఒకే విధంగా వాయించేలా అభివృద్ధి సాధించింది జననాట్యమండలి.

అ మొదటి నోట్సు, దరువులు నాలుగు:-

1 ఢి, కు, ట, క

2) ఢిం,  ట, కు, ట, ఢిం

౩)ఢిం, కు, ట, కు, ట, క, ఢిం

4)ఢిం, ఢిం, ఢిం-ఢిం, టక్‌, టక్‌ ఇవి.

1. ఢిం  ఎలా వాయించాలి అంటే, ఎడమ చేయి  మద్య వేలితో, డప్పు మధ‌ భాగాన స్పింగ్‌లా మీటి లేపాలి. ఏకకాలంలో ఎడమ చేయి వేలి దెబ్బతో పాటు డప్పు రింగ్‌ (కట్టె ఫేం) మీద డప్పు చిర్ర (పెద్దపుల్లుతో టక్‌ మనే కట్టెదెబ్బ కలిపి కొట్టాలి. దీన్ని  ఢిం అంటారు.

2. “కు” ఎలా వాయించాలి?

ఎడమ చేయి బొటన వేలు+చూపుడువేలును కలిపి చిటికె డప్పు మీద వేయటం “కు”

ట- ఎలా?

డప్పు చెక్క ఫ్రేమ్‌ పైన ఒక దెబ్బ కట్టెతో వేస్తే అది ‘ట.

క- ఎలా?

కేవలం ఎడమ చేయి మధ్య వేలు ఒక్కటే డప్పు మద్య భాగాన ప్రింగ్‌లా మోది లేపాలి. దీన్ని క అంటారు.మొత్తం వరుసగా ఒక లయబద్దంగా వాయిస్తే ధింకుటక, ఢిం కు టక, ఢింకుటక శబ్ధం పలుకుతుంది. ఇలా 2వ దరువు, 3వ, 4వ దరువులను అక్షరీకరించి, వారికి ఏ ఏ పాటలు అవసరమో వాటికి నిర్ధిష్టంగా ఏ పాటకు ఏ దరువు! ఏ పాట దరువును,  1వ స్పీడా,  2వ స్పీడా,  3వ స్పీడా ఇలా ప్రతి ఒక్క దరువు మరలా మూడు స్పీడులు గలగి ఇలా వంద పాటలంటే, నాలుగు ప్రధాన దరువులు, 4*3=12 రకాలుగా వాయించడం రూపొందించారు. అ మూడు రోజుల్లో అర్థంచేయించి పంపగా వారి కృషి ఫలించి మంచి ఫలితాలొచ్చాయి. అలా డప్పు శాస్త్రం మొత్తం జననాట్యమండలి అంతటే గాక, మరికొన్ని బహిరంగ ప్రజా సాంస్కృతిక రంగాల్లోనూ, దండకారణ్యం వరకు విస్తరించి 2001 నాటికి సిఎన్‌ఎమ్‌ చేతిలో కూడా అద్భుత సాధనమయ్యింది. అందులో సంప్రదాయ సంకెళ్లను ఛేదించుకొని ఆదివాసీ మహిళ చేతిని డప్పు సింగారించింది. ఒక దశాబ్దం తరువాత సిఎన్‌ఎమ్‌కు డప్పుకు తోడు డోలక్‌ కూడా జతకలిసి పాట పరవళ్ళు తొక్కుతూ ‘ప్రజాయుద్ధ గీతమై వందల పాటలై పాట, తూటాతో సమన్వయం సాగుతున్న దరువులో వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

ప్రతి పాటకు పల్లవి, చరణం, వుంటయిగదా! పల్లవికి దురువులోని ఒక నడకతో ప్రారంభించి చరణంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో “తిరికిట”తో, తిరికిట అంటే -తత్తిరికిట టప అని కొట్టాలి.

“ముక్తాయింపు దరువు”తో మరలా “నడక” కొనసాగించటం. ఇలా ప్రతి చరణంలోను రాగ చ్భాయలో మార్పు వున్నట్లయితే అక్కడ దరువు “ఛేంజ్‌ ఓవర్‌ బిట్‌” వాయించి తిరిగి చరణం ముగింపులో “కటింగ్ బిట్‌” అంటే (పప-పప) వాయించి ఇలా పాట ఒకవేళ స్లోగా ప్రారంభించి వడిగా సాగి, వడిగా ముగుస్తుంటే డప్పు కూడా అదే వేగం పెంచుతూ తగిన ఉద్రేక శబ్దాన్ని తగిన కటింగ్స్‌తో, ముక్తాయింపులతో, తిరికిటలతో, “ఘుం”లతో, చాప్స్‌తో వాయిస్తూ సాగేది.

ఉదాహ‌రణకు పాట:-

జుంభాక్‌ జుంభాక్‌ జుంభాక్‌ బాలా

జుంభాక్‌ జుంభాక్‌ జూం…

ఇక్కడ నొటేషన్‌:

ఢిం, ఢిం, ఢథిం-టక్‌ టక్‌,

ఢిం,ఢథిం,థిం-ప.పా.ప

అడవి తల్లికి దండ‌లో…

మా తల్లి అడవికి దండ‌లో…

(సేమ్‌ పైన వాయించిందే)

అడవి సల్లా గుంటే అన్నానికి కొదువలేదు

పంటా ఇంటికొస్తే పండుగ సేద్దాము…

(ఇంత వరకు పైన రాసిన నొటేషన్‌) ఇక్కడ తత్‌ తరికిట టప అనే ముక్తాయింపు.

మార్పు:- కొండల నుండీ కోనల నుండీ,

గోదారమ్మా పరుగులు చూడు…

నొటేషన్‌:- ప:- అంటే చేయి మొత్తం వేళ్ళతో సహా అంటించి దెబ్బ వేయడం.

ఢింటప టటప టటప ధింధిం

ఢింటప టటప టటప ధింధిం

ధిం:- అంటే డప్పును పొట్టకు అనించిన దగ్గర అంచుపై అన్ని వేళ్ళతో కల్పి గట్టిగా, అదే

టైమ్‌లో చెక్కపై కట్టెతో మోది కల్పి కొడితే దాన్ని ‘ధిం అని పలకాలి.

వంపులు తిరుగుతు వయ్యారంగా

పెను గంగమ్మ వురకలు చూడు

(ఇక్కడ కూడా పైన చూపిన దరువే)

తర్వాత… ఏటిలో వూట జూడు

సెలిమెలో సెగలు జూడు

డప్పు:-

త,ధిం, ధిం,ధిం

త,ధిం, ధిం,ధిం

త:- అంటే చేయి నాలుగేళ్ళతో అంటిపెట్టి గట్టిగా కొడుతూ కట్టె దెబ్బను చెక్కపై కూడా కల్పి కొడితే అది “త.

పాట:- జీవ నదులతో సుట్టుముట్టినా

గోండోళ్ళ జీవ గడ్డర బాబు

ఒక తిరికిట వేసి,

ఢిం టకు టఢిం కొట్టి,

ముక్తాయింపు:-

పప, పప అని చరిచి

త  త ఇదీ అదే.

రేలా రేలా రేలా రేలా రేలారేలారే

రేలా రేలా రేలా రేలా రేలారే.. లా.. రే..

ఇక్కడ కంటిన్యూగా ఢిం టకు టఢిం ను వాయించి ముంగించి చరణంకు పోతూ పపపప కటింగ్‌ కొట్టి.

రెండవ చరణం:- కో, కో, కో, యంటూ కోకిలమ్మ పాట

కిలకిల కిలకిల కిలకిల

రామచిలుక పలుకు

(ఇంత వరకు ఢిం ట కు ట ఢిం).

పావురాల జంట జూడు

పాలపిట్ట పాట విను

పట్టు పురుగు పట్టు చూడు

తేనెటీగ తెట్టె చూడు

ఇంతవరకు త, ధిం, ధిం, ధిం-

త, ధిం, ధిం, ధిం వాయించి.

అందరికి అండగ వున్నా

అడవీ తల్లీ అందం చూడు

ఢిం ట కు ట ఢిం – కొట్టి,

ముక్తాయింపు:- పప, పప కొట్టి

రేలా రేలా కు నడక:- ఢిం ట కు ట ఢిం…

          ఇలా పాట మొత్తం రకరకాల దరువులు, ఘుంస్‌లు, చాప్స్‌, కటింగ్స్‌తో ఒకేసారి ఇద్దరు ఒకే విధంగా నేర్చుకుని ఒక టాప్‌ డప్పు, మరొక బేస్‌ డప్పుపై కలిపి వాయించటం. పాటకు అద్భుతమైన సొంపునిచ్చేది.

ఇలా 10, 15 సంవత్సరాల కల్లా, జననాట్యమండలిలోని అన్ని పాటలకు, ఒక్కొక్క పాటకు దానికి తగిన దరువు, దాని వేగము, దాని రాగచ్చ్భాయాలు మారగా దాని దరువు, నడక మార్పులతో, ముక్తాయింపులు, కటింగ్‌లు, చాప్స్‌, ఘుంస్‌తో వాయించడంలో మెరుగుదల సాధించింది.

నోట్‌.- ముగ్దాయింపులు, కటింగ్‌లు, చాప్స్‌, ఘుంస్‌, ఇవి తబ్లా, డోలక్‌లకు వుండే నొటేషన్‌లు. ఈ జననాట్యమండలికి వచ్చిన వాయిద్య కళాకారుడు మొదట ఆ క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో పరిచయమున్న కారణంగా వాటిని డప్పుకు అన్నయించడం వల్ల, డప్పుపై కూడా చేతితో వాయించడం వల్ల, అ రోజుల్లో (1980-90ల్లో) డప్పులు  చర్మం డ‌ప్పులే  కావటం వల్ల పాట+కోరస్‌+దప్పులు+గజ్జెలు ఇలా నాలుగు తాళాలకు, మూడు స్పీడులకు వందల పాటలను తయారు చేసింది. జననాట్యమండలి వాయించే డప్పు దరువులతో సమానంగా మరే ఇతర ప్రజా సాంస్కృతిక బృందాలు అ దశాబ్దం మొత్తంగా చూసినా వాయించటం కనబడలేదు. వారు డప్పులనుకేవలం చిర్రలతోనే వాయిస్తారు. అలాగే ఒక్కటి,రెండు కటింగ్స్‌నే కొట్టి, తాళం నడిపిస్తారు.

వారికి జననాట్యమండలికి చాలా తేడాను చూసేవారు. ఒక్కోసారి జననాట్యమండలి “బ్యాలే”కు డప్పు+డోలికీ పెట్టినా అ రెండింటినీ అద్భుతంగా రెండూ డొలికీలే కొడ్డున్నట్టు సింకర్‌నైజేషన్‌తో వాయించేవారు.

 అలాగే ఒకే పాటను ముగ్గురు, నలుగురు గాయకులు ఒక్కో చరణం పంచుకుని పాటను కొనసాగించేవారు. అందరూ ఒకే స్థాయిలో పాడటం, ఒకే లయలో కొనసాగటం, ఎవరికి వారు వారి చరణాన్ని వారి బాడీ లాంగ్వేజ్‌లో యాక్టింగ్‌ చేస్తూ మొత్తం వైవిధ్యంగా సాగేది. అదో అద్భుత ప్రక్రియగా జననాట్యమండలి చేసింది. అందులో వాయిద్యానిది గొప్ప ప్రాధాన్యత అని మరువకూడదు.

మొదట ఈ డప్పు కళాకారులు పాడుతున్న ప్రధాన గాయకుల గొంతులను మించిన శబ్దంతో, అవేశంతో కొట్టేవారు. ప్రోగ్రామ్‌ అయిపోయి, సమీక్ష సమావేశంలో చెప్పినా, గుర్తించినా, తిరిగి అదే పొరపాటు చేసీ, చేసీ సూచనలు వచ్చీ వచ్చీ చాలా కాలంకు ప్రధాన గాయనీ/గాయకుల గాత్రంకు మించి వాయించకుండా సమంగా వాయించటం దృష్టి కేంద్రీకరించి నేర్చుకుని సాధించారు.

వీరికి ఒక నిబంధన వుండేది. డప్పు దరువులు వచ్చీ రాని దశలో పాట కోరస్‌ పాడుతూ కొట్టవద్దు. కేవలం దరువునే చూసుకుంటూ, పాట వెంటనే వాయించాలి. అని చెప్పటం జరిగింది. అప్పుడే ప్రక్క డప్పిస్టు సీనియర్‌ వుంటే వారిని అనుసరిస్తూ రెండో డప్పిస్టు తయారయ్యేవారు.

మరో నిబంధన:- స్పెషలైజేషన్‌ ఈ డప్పిస్టులు, నేను కూడా మిగతా సింగర్స్‌ వలే పాటలు పాడతాను నాకు మిగతా కళాకారులు ఎవరైనా వాయించండి అని అడిగినా అంతమందికీ ఈ డప్పు వాయించటం రాదనేది ఒక వాస్తవం. కనుక పాటలు పాడటం డప్పిస్టుకు సాధ్యమయ్యేది కాదు. దాన్ని టీమ్‌లో వర్క్‌ డివిజన్‌గాను, అత్యంత ఇంపార్టెంట్‌ పోస్ట్‌గాను చెప్పుకుంటూ వచ్చేవారు.

ఒక్కో డప్పిస్టు పొలిటికల్‌గా, క్రమశిక్షణ లేని కారణంగా మెయిన్‌ సింగర్స్‌ కన్నా స్పీడ్‌ గానైనా, స్లోగానైనా, చిన్నగానైనా/పెద్దగానైనా వాయిస్తే విమర్శ ద్వారా సరిదిద్దబడకపోతే, ఆ డప్పిస్టును ఆ  టీము మార్చు చేసి క్రమశిక్షణతో సాధన జేసే మరో డప్పిస్టును తర్భిదు చేసుకొని సాగేది.

 ఒక్కోసారి జననాట్యమండలి ప్రోగ్రామ్‌ ఆగకుండా వరుసగా 3, 4 గంటలు నడిచేది. అప్పుడు రెండు డప్పులు వాయిస్తుంటే, మరో రెండు డప్పులను ప‌క్క‌నే  నిప్పు రాజేసి పెట్టుకుని గ్రామస్తులచే వేడి కాపడం పెట్టిస్తూ, ఇవి చల్లారిపోతూ దరువు బలహీనపడుతుండ‌గా  వెంటనే వేడి డప్పుల్ని అందుకుని అ ప్రోగ్రామ్‌ టీమ్‌తో పడిపోకుండా అ డప్పిస్టు చూసుకొనేవారు.

 (డ‌ప్పుకు ఉన్న ప్రాధాన్యత గురించి  ర‌మేష్ ఒక సంద‌ర్భంలో చేసిన ర‌చ‌న.                – సహచరులు )

Leave a Reply