గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. రిజర్వు కరెన్సీగా, కరెన్సీ మార్పిడి మాద్యమంగా ఏడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాక అమెరికా సైనిక, ఆర్థిక దండోపాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తనమాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అగ్రరాజ్య అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇన్నాళ్లు ఏ డాలర్ అండతో అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమల దండులా కదం తొక్కుతున్నాయి. గ్లోబల్ కరెన్సీగా రాజ్యమేలుతున్న డాలర్ కోటను బద్దలుగొట్టేందుకు కరెన్సీవార్కు తెరతీశాయి. రష్యాపై ఆంక్షలు విధించి వేల కోట్ల డాలర్ల ఆస్తులను సీజ్ చేసిన అమెరికా భవిష్యత్తులో తమపైన ఇలాంటి ఆస్త్రాన్ని ప్రయోగిస్తే తమకు దిక్కేంటంటూ వర్ధమానదేశాలు మేల్కంటున్నాయి. డాలర్ కరెన్సీ నిల్వలతో పాటు, డాలర్‌తో వాణిజ్యానికి స్వస్తి పలుకనున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సిస్టమ్ డాలర్‌కు మహర్థశను కలిగించింది. కానీ, కాలం మారింది. అమెరికా నైజం ప్రపంచానికి తెలిసింది. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని పలు దేశాలు పిలుపునిస్తున్నాయి. రష్యా, చైనాతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్‌ను పక్కన పెట్టాలని తమ సొంత కరెన్సీలను మాత్రమే ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ ధోరణి ఇలానే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే అమెరికా ఆధిపత్యం, దాని డాలర్‌కు చెల్లుచీటి తప్పదు. డాలర్‌కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.
డాలర్ ఆధిపత్యానికి కారణం :
డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎందుకు చలామణీలో ఉంది? డాలర్‌ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? నిజంగా డాలర్ కుప్పకూలుతుందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుందో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక 1945లో బ్రెట్టన్ వుడ్ ఒప్పందంతో అమెరికన్ డాలర్ పెత్తనం మొదలైంది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెట్టన్వుడ్లో జరిగింది. 44 దేశాలు పాల్గన్న ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారం ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నాయి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువతో సరిచూడడం ప్రాతిపదికైంది. ఒక డాలర్ విలువ ఒక ఔన్స్ (31.1034 గ్రాములు) బంగారంతో సమానమైందిగా గుర్తించారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ పూర్తిగా చితికిపోవడంతో డాలర్ ప్రాభవం మొదలైంది. యూరోపియన్ల యుద్ధకాంక్ష యుఎస్‌కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్ దశ తిరిగింది. దీంతో అమెరికా తన జాతీయ బడ్జెట్ వ్యయం పట్ల ఎలాంటి నియంత్రణ పాటించకుండా అంతర్జాతీయ వ్యయానికి పాల్పడిరది. ఇవాళ దాదాపు అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్స్చేంజ్ మార్కెట్లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడిరగ్ అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ఇకముందు ఈ పరిస్థితి మారబోతోంది.
1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ విలువను బంగారు ధరకు జత చేయడాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్ కరెన్సీగా అవతరించింది. పనామా, ఎల్ సాల్వడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్‌నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్‌కు అత్యధికంగా స్టోర్ వేల్యూ ఉండటం వల్ల అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ మెజారిటీ విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వలను డాలర్లలోనే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ వెలుగొందుతోంది. డాలర్ శక్తి సామర్థ్యంతో రెచ్చిపోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్‌నే ఆయుధంగా వాడుకుంది. ఈ డాలర్ అండతోనే వియత్నాం, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, లిబియా, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధాలతో నేలమట్టం చేసింది. ఫలితంగా విదేశీ రుణభారాన్ని భారీగా పెంచుకుంది.
1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌తో గోల్డ్స్టాండర్డ్ను రద్దు చేశాడు. అప్పటి నుంచి డాలర్ ఫియట్ కరెన్సీగా(పేపర్ కరెన్సీ) మారింది. ఆయన ఔన్స్ బంగారం ధరను 38 డాలర్లుగా నిర్ణయించాడు. ఫియట్ కరెన్సీ అనేది కాగితపు డబ్బు మాత్రమే. దీంతో కామెడిటిమనీ (బంగారం, వెండి) ప్రత్యామ్నాయం కాకుండా పోయింది. రిచర్డ్ నిక్సన్ ఇకపై బంగారంతో డాలర్లను రీడీమ్ చేయలేమన్నాడు. ఒక దేశం ఫియట్ కరెన్సీ రిజర్వ్ కరెన్సీ హోదాను కలిగి ఉంటే, అది అధిక కరెన్సీని ముద్రించడం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాల వస్తువులను, ఆస్తులను కొనుగోలు చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది కనిపించని దోపిడీ. ప్రపంచంలో చమురు అత్యంత ముఖ్యమైనది. చమురు ఉత్పత్తి చేసే దేశాలలో సౌది ముఖ్యమైనది. ఆ దేశ రక్షణ కోసం అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా చమురును డాలర్లలో మాత్రమే విక్రయించాలి. చమురు వ్యాపారం చాల లాభసాటి వ్యాపారం. చమురు ఉత్పత్తిపై నియంత్రణ కలిగియున్న బహుళజాతి సంస్థలు తమ లాభాలను (పెట్రో డాలర్లు) అమెరికా బ్యాంకుల్లో దాచుకున్నారు. దీంతో అమెరికాలో డాలర్ల నిల్వ పెరిగింది.
అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలు తెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడిరది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు అది సూపర్ పవర్‌గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్‌ను కంట్రోల్ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్ ప్రింటింగ్ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది. 2022 నాటికి మొత్తం యుఎస్ అప్పు 31.5 ట్రిలియన్ డాలర్లు (జిడిపితో పోలిస్తే 120 శాతం పైనే).
2014లో యుక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్బాల్లో అఫ్ఘానిస్తాన్, ఇరాన్, వెనిజులా వంటి దేశాలపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా ఇంకా పశ్చిమ దేశాలు సీజ్ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుండి తొలగించాయి. ఈ చర్యలతో అమెరికా, యూరప్ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది.
డాలర్ ఆధిపత్యానికి ఎదురవుతున్న సవాళ్లు :
డాలర్‌పై ఆధారపడటం మాని సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనే సంకల్పంలో అనేకదేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. డీ-డాలరైజేషన్ పదం కొత్తది కావచ్చు, కాని సమీప భవిష్యత్‌లోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే పరిస్థితి రానుంది. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న విషయం కొత్తది కాదు. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఏకచత్రాధిపత్యాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా వంటివాళ్లు పలువురు అనేకమార్లు విమర్శించారు. ప్రస్తుతం డీ-డాలరైజేషన్ను చైనా, రష్యా కూడా సమర్థిస్తున్నాయి. విదేశీ వాణిజ్యంలో చెల్లింపుల కోసం ఇరాన్, రష్యా సంయుక్తంగా బంగారంపై ఆధారపడిన ఒక క్రిప్టోకరెన్సీని విడుదల చేస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రకటించాయి.
ప్రపంచ దేశాలన్ని రిజర్వు కరెన్సీగా పరిగణిస్తున్న డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకొని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయి. ఫలితంగా అమెరికా ఆధిపత్యం ప్రమాదంలో పడుతున్న సంగతి చాలామందికి దశాబ్ద కాలం నుంచి కనిపిస్తూనే ఉంది. ఆ విషయాన్ని ఇన్నాళ్ళకి అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి జానెట్ యెల్లెస్ మొత్తానికి ఒప్పుకున్నారు. ఒకటో, రెండో దేశాల మీద గనుక ఆంక్షలు విధిస్తే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. కాని ఈ మధ్య అమెరికా డజన్లకొద్దీ దేశాల మీద ఆంక్షలు విధిస్తోంది. అప్పుడు ఆంక్షలకు గురైన ఆ దేశాలన్నీ కూడబలుక్కుని తమలో తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఆంక్షల ప్రభావాన్ని తట్టుకుని నిలబడడానికి పూనుకుంటున్నాయి. ఆ విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాలు చేస్తున్నాయి.
క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్‌కు వ్యతిరేకంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్‌కు పెద్ద సవాల్ మొదలైంది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్-యువాన్లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించాయి. అంతేకాదు రష్యా తన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధికశాతం చైనా యువాన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దాంతో 2022 చివరి నాటికి రష్యా విదేశీ మారక నిల్వల్లో యువాన్ 60 శాతానికి పెరిగినట్లు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. అలాగే డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ నిర్ణయించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్‌తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ పెత్తనానికి మరో పెద్ద సవాల్ ఏర్పడిరది. బ్రెజిల్ రీస్, చైనా యువాన్ బంధం డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15,000 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.
డాలర్, యూరో, యెన్, పౌండ్లకు బదులు తమ దేశాల కరెన్సీలతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఏజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి. గత జనవరిలో దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పాండోర్ ఒక ఇంటర్వ్యూలో ‘బ్రిక్, (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ మారకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి’ అని వెల్లడిరచారు. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్-జదాన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. చమురు వ్యాపారంలో డాలర్ స్థానంలో ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించాడు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం ఇప్పటివరకు దాదాపుగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. దీంతో పశ్చిమాసియాలో అమెరికా ఇన్నాళ్లు ఆడిస్తున్న యుద్ధ తంత్రానికి ఈ పరిణామాలు చరమగీతం పాడే అవకాశం ఉంది.
చమురు ఎగుమతుల్లో ఒపెక్ (చమురు ఉత్పత్తి చేసే దేశాలు) దేశాల్లో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లేనని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. భారత్- రష్యా మధ్య కూడా వాణిజ్యం అమెరికన్ డాలర్లో కాకుండా ఇతర కరెన్సీల్లో జరుగుతోంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి చేసుకున్న దిగుమతులకు అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దినార్‌ను వినియోగించేవి. ఇప్పుడు రూబుల్లో చెల్లింపులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి వివిధ దేశాల విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వంతు 59 శాతానికి తగ్గిపోయింది. ఇది 1999 నాటికి 72 శాతం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. బ్రిక్స్ కూటమి మరింత విస్తరించి బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలు పెంచుకుంటుంది. 12 దేశాలు బ్రిక్స్‌లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే స్విఫ్ట్ స్థానంలో సొంత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పనుంది. ఇదే జరిగితే అమెరికా డాలర్‌కు మరణశాసనమేనని ఆర్థిక వేత్తలు కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు.
డాలర్ ఆధిపత్యంలో మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యం యావత్తూ జరగాలన్నది అమెరికా సిద్ధాంతం. కాని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలలో అమెరికా సిద్ధాంతానికి బీటలు పడుతున్నాయి. తాజాగా చైనా, బ్రెజిల్ దేశాలు కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలలో కూడా ఆ రెండు దేశాల కరెన్సీలలోనే లావాదేవీలన్నీ జరుగనున్నాయి. అమెరికా ఆ రెండిరటిలోనూ దేనిమీదా ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. అయినా అవి ఆ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. అది కేవలం తమ రెండు దేశాల స్వంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆ విధంగా చేస్తున్నాయి. బ్రిక్స్ బ్యాంక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు బ్రిక్స్‌గా ఒక కూటమిలో ఉన్నాయి)కు తాజాగా అధ్యక్షురాలిగా నియమించబడిన దిల్మా రౌసెఫ్ (ఈమె గతంలో బ్రెజిల్ అధ్యక్షురాలిగా పనిచేశారు) ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం 2023 నుండి ఆ బ్యాంకు సభ్య దేశాలకు ఇవ్వబోయే రుణంలో 30 శాతం ఆయా దేశాల కరెన్సీల రూపంలోనే ఇస్తారు. తద్వారా ఆ మేరకు డాలర్ ప్రమేయం తగ్గిపోతుంది. మలేషియా ప్రధాని ఇబ్రహీం ఐఎంఎఫ్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఆసియా మానిటరీ ఫండ్ (ఎఎంఎఫ్)ను ప్రతిపాదిస్తున్నాడు.
‘యుఎఇ-చైనా లావాదేవీల్లో డాలర్ నుండి వారి స్వంత కరెన్సీలకు మారడం ద్వారా ఇతర దేశాలను ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా వాణిజ్య లేదా ఆర్థిక మార్కెట్లలో విదేశీ లావాదేవీలను పరిష్కరించవచ్చు’ అని రోస్సీ తెలిపారు. దీర్ఘకాల ఎల్ఎన్జి విక్రయం, కొనుగోలు ఒప్పందాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మరిన్ని యువాన్ ఆధిపత్య లావాదేవీలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ న్యాయ సంస్థ కింగ్ అండ్ వుడ్ మల్లెస్స్న్లో భాగస్వామి అయినా డేవిడ్ పువా పేర్కొన్నారు. మలేషియాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం ఇక రూపాయల్లో జరుగనుందని జనవరి తొలి వారంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యా, మారిషస్, శ్రీలంక దేశాలతో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు రూపాయల్లో జరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మలేషియా వచ్చి చేరింది. ఇప్పుడు మలేషియాతో వాణిజ్యం ప్రస్తుతమున్న కరెన్సీలతో పాటు రూపాయల్లోనూ జరగనుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు ఈ తరహా విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముగింపు :
ఇవాళ డాలర్ల ప్రమేయం లేని అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ అది అమెరికా, పశ్చిమ సంపన్న దేశాల ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ పోతోంది. ఇదేదో ఒక కరెన్సీకి బదులు ఇంకొక కరెన్సీలో వ్యాపారం చేయడం ఎంత మాత్రం కాదు. మూడో ప్రపంచ దేశాలను కొల్లగొట్టి తమ పెట్టుబడిదారీ వ్యవస్థలను పదిలంగా కొనసాగించుకోగలుగుతున్న సంపన్న పశ్చిమ దేశాల ఆధిపత్యానికి గండి కొట్టడం మాత్రమే అవుతుంది. సామ్రాజ్యవాద అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్‌పై మూకుమ్మడి దాడి మొదలెట్టాయి. దీంతో డాలర్, మిలిటరీ, విభజించు-పాలించు… ఈ మూల స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయార్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే… డాలర్‌తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరదించేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం బోధపడుతుంది.
సామ్రాజ్యవాద పెట్టుబడి బదిలీలు అసమానతల పెంపుకు, శ్రమ విభజనకు, సహజ వనరులు కొల్లగొట్టడానికి దారి తీశాయి. విదేశీ పెట్టుబడులు ఆయా దేశాలలో పెట్టుబడిదారీ అభివృద్ధిని నియంత్రించాయి. అందువల్లనే అమెరికాతో బాటు తక్కిన సంపన్న పశ్చిమ దేశాలన్నీ చాలా గట్టిగా డాలర్ ఆధిపత్యం దెబ్బతినకుండా ఉండడానికి కావలసిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కేవలం ఆర్థిక ఆంక్షలకే అవి పరిమితం కాకపోవచ్చు కూడా. ఇతర రూపాలలో సైతం అవి తక్కిన దేశాలమీద ఒత్తిడులను తీసుకు వస్తాయి. అందుచేత డాలర్ల ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నడపాలన్న ప్రయత్నాలు ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి సంకేతం. అందుకే అటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి సామ్రాజ్యవాదులు ఏ దుర్మార్గానికైనా ఒడిగట్టడానికి తయారౌతారు.