ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి. రాజ వంశీకులకు ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక ఆకాశ యుద్ధం* అనే పుస్తకం దోహదం చేస్తుంది. ఇందులో రివెరా, పాణి, ఫెలో ట్రావెలర్ వ్యాసాలు ఆదివాసులపై వైమానిక దాడులనే ఈ దశను రాజ్యం, పాలకవర్గాలు, ఉత్పత్తి సంబంధాలు అనే వైపు నుంచి విశ్లేషించే ప్రయత్నం చేశాయి.
ఈ యుద్ధానికి తక్షణ కారణాలతో పాటు గతంలో లోతైన మూలాలు ఉన్నాయి . భూస్వామ్య సమాజ శిథిలాల నుండి ఆధునిక పెట్టుబడిదారీ సమాజం గ్లోబల్ స్థాయిలో ఆవిర్భవించి కొనసాగుతున్న క్రమంలో రాజ్యానికి, విశాల సమాజానికి మధ్యనున్న సంబంధాలు గుర్తించగలిగే స్థాయిలో మారడం మొదలైంది.
మన దేశంలో ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశం, ఆ తర్వాత రెండు శతాబ్దాల కాలంలో వివిధ ప్రజాశ్రేణులతో రాజ్యానికి ఉండిన సంబంధాలు అనేక మార్పులకు లోనయ్యాయి. ఉదాహరణకు, జాతీయోద్యమం ఫలితంగా ప్రత్యక్ష బ్రిటిష్ వలస పాలన పోయి అధికార బదిలీ జరగడం, ఆధునిక భారత రాజ్యాంగం అమల్లోకి రావడం వంటి ఇతర అనేక ఆధునిక సామాజిక కారణాలవల్ల విశాల సమాజంలోని ప్రజాశ్రేణుల సంబంధాలలో ఇదివరకున్న మందకొడితనం నశించి వేగం/ చలనం పెరగడం ఆరంభమైంది. దానిని ప్రజల ఆకాంక్షల్లో, వారి ఆరాట పోరాటాల్లో, వారి భావజాల (చైతన్య) స్థాయిలలో మనం గమనించవచ్చు. దీనినే మార్క్సిస్ట్ పరిభాషలో చెప్పాలంటే –భారత సమాజంలో నేడు కొనసాగుతున్న వర్గపోరాటాల రూపంలోను , తీవ్రతలోనూ అట్టి చలనం ప్రతిఫలిస్తున్నదని మనం చెప్పవచ్చు. ఇటీవల దండకారణ్య ఆదివాసులపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని కూడా రాజ్యం వైపు నుండి కొనసాగిన చలనంగా మనం పేర్కొనవచ్చు.
అయితే చలనమే ప్రజలు ఆశించిన మార్పుకు దారి తీసేటట్లయితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? నేడు భారత సమాజం గురవుతున్న అత్యంత తీవ్ర చలనాలకు ఎన్నో ప్రజానుకూలమైన మార్పులు జరిగి/జరుగుతూ ఉండాల్సింది. కానీ అవేవీ జరగడం లేదని మనకు అర్థమవుతూనే ఉన్నది. అయినా నిత్యం ఏదో ఒక చలనంలో ఉండడం వల్ల మంచి మార్పు ఏదో జరుగుచున్నదని ప్రజలకు భ్రమ కలుగుతుంది. అలాంటి భ్రమాజనిత ప్రపంచంలో మనం జీవిస్తుండడమే సమకాలీన వాస్తవం.
కానీ ఏ చలనమైనా వైరుధ్యం లేనిది కాదు. అంటే, ప్రతి చలనంలోనూ వైరుధ్యంతో పాటు మార్పుకు దారి తీసే స్వభావం కూడా ఉంటుంది. మరి ఆ మార్పు ఒకానొక నిర్దిష్టమైన ఘటన కాదు. అది అనేకానేక ఘటనల క్రమం. ఆయా ఘటనలన్నీ ప్రజలు కోరుకున్నట్టుగానే జరగవు. ఆ ఘటనలకు ఒక క్రమం ఉంటుంది. ఆ చలన క్రమానికి ఒక దిశ ఉంటుంది.అది పురోగమనం వైపా, లేక తిరోగమనం వైపా అన్న దానిని విశ్లేషించి అర్థం చేసుకుంటేనే తప్ప మార్పుకు ఉండే అసలు స్వభావం మనకు అర్థం కాదు.
పై ఉపోద్ఘాత నేపథ్యంలో నుంచి భారత ‘ప్రజాస్వామ్య’ గమనాన్ని పరిశీలిద్దాం. భారత ప్రజలు తామే రూపొందించుకొని తమకు తామే సమర్పించుకున్న ఆధునిక రాజ్యాంగం(1950) ప్రకారం– ఈ దేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశం. ఈ దేశంలో సార్వభౌమాధికారం ప్రజలదే. ప్రపంచ ప్రజల పోరాట అనుభవాలతో పాటు జాతీయోద్యమంతో సహా అనేక దేశీయ ప్రజా పోరాటాల ఫలితంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, సామాజిక న్యాయం వంటి ఆధునిక విలువలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఎంతలేదన్నా- ఈ ఆధునిక విలువలన్నీ పైనుండి ప్రవేశపెట్టబడినవే గాని, మన దేశ సామాజిక పునాదిని మార్చే పోరాటాలలో భాగంగా కింది నుండి, అట్టడుగు సామాజిక మూలాల నుండి ఉద్భవించినవి కావు. అసలు మన దేశ రాజ్యాంగానికి సామాజిక పునాదుల్ని( ఉత్పత్తి సంబంధాలను) మార్చాలనే లక్ష్యం కూడా లేదు. ఎందుకంటే- మన రాజ్యాంగంలోనే సమానత్వంతో పాటు వ్యక్తిగత ఆస్తిపై హక్కును కూడా పొందుపరిచారు. అందుకే ప్రజలకున్న సార్వత్రిక వోటు హక్కు ప్రజల నిజ ప్రజాస్వామ్యానికి దారి తీయకుండా బూర్జువా ప్రజాస్వామ్యానికే దారితీసింది/ తీస్తున్నది. రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రబల నిదర్శనమని చెప్పబడుతున్న సార్వత్రిక వోటు హక్కు ప్రజల రాజకీయ అధికారానికి గాని, రాజకీయ సామాజిక సమానత్వానికి గాని దారి తీయ(డం)లేదు. సార్వత్రిక వోటుకు భారత ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యం అనే ప్రతీకాత్మక స్థాయి తప్ప అంతకు మించిన ప్రజా ప్రయోజనమేదీ లేదు.
1947 లో అధికార బదిలీ వల్ల ప్రత్యక్ష బ్రిటిష్ వలస పాలన స్థానంలో అర్థ (పరోక్ష) వలస పాలన మొదలైంది. అంతకుముందు ప్రజలతో, ప్రజా పోరాటాలతో ఇక్కడి ఆనాటి దేశీయ పాలకులకు సన్నిహిత సంబంధాలుండడం వల్ల, ఎంతో కొంతయినా వారికి స్వేచ్ఛాయుత వ్యక్తిత్వాలు(self/individuality ) ఉండడం వల్ల( అంటే, ఆనాటి పాలకులు ఇంకా సంపూర్ణ దళారులుగా మారనందువల్ల ) సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు వాళ్ళు అనుకున్నట్టుగా నెరవేరలేదు. పైకి చూడ, ఆ మేరకు ప్రజల ప్రయోజనాలకు తీవ్రమైన భంగం కలిగినట్లుగా అనిపించలేదు. కనుక ఆనాటి మిశ్రమ ఆర్థిక విధానంలోని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య సంబంధాలలో ప్రజల పాత్రకు నైతిక ప్రాధాన్యత కనబడేది. కానీ నెహ్రూ మరణం తర్వాత 1967- ’70 ల వరకల్లా జాతీయోద్యమం తాలూకు ఆదర్శాలు, రాజ్యాంగం లోని ప్రజానుకూల విలువలన్నీ వేగంగా ధ్వంసం కావడం, బూర్జువా వర్గ దోపిడీ అధికారికంగా బాహాటంగా అమలు కావడం ఆరంభమైంది. అది క్రమక్రమంగా నగ్నమైన కార్పొరేట్ స్వామ్యంగా మారిన వైనాన్ని నేటి కాలంలో మనం కళ్లారా చూడవచ్చు.
నేడు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలలో నవీనత్వం లేదు, ఉదారత్వమూ లేదు. పక్కా ప్రజల శ్రమ దోపిడి, భారీ స్థాయి వనరుల దోపిడీయే ఒక నికర ఆర్థిక విధానంగా అమలవుతోంది. ఇదంతా భారత పాలకులు మన ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ సామ్రాజ్యవాదుల ఆర్థిక చక్రబంధంలో భాగం చేయడం వల్ల జరుగుతున్న వి(ష)పరిణామమే. క్రమ క్రమంగా ఇతర ఆసియా దేశాలలో వలె ఇండియాలో కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పట్టు పెరగడం వల్ల తీవ్రమైన సంక్షోభం తలెత్తింది. ఫలితంగా ప్రజల కనీస జీవన ప్రమాణాలు ఏమాత్రం పెరగ(డం) లేదు. కనీస జీవన భద్రత, జీవన నాణ్యత కూడా ప్రజలకు అందడం లేదు.
గతంతో పోలిస్తే, ఈనాటి కాలంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పట్టు తీవ్ర స్థాయిలో పెరగడం వల్ల సామ్రాజ్యవాదానికి సంపూర్ణ దళారులైన వాళ్లే తప్ప మరెవరూ భారతదేశ పాలకులు అయ్యే అవకాశం లేనే లేదు. అటువంటి దళారుల నుండి ఏ రకమైన విలువలనూ ఆశించలేం. ప్రపంచ సామ్రాజ్యవాద కార్పొరేట్ సమీకరణాలకు మన దేశంలో హిందుత్వ ఫాసిస్టు రాజకీయ సమీకరణలు తోడైతే ఇక ఆ దోపిడీ పాలకుల రథచక్రాలకు అడ్డు ఏముంటుంది?
గత దశాబ్ద కాలంగా ఆ కాషాయకీయాలే విచ్చలవిడిగా చెలరేగుతూ కొన్ని చోట్ల డబుల్ ఇంజన్ పాలనగా, మరికొన్ని చోట్ల బుల్ డోజర్ల పాలనగా స్వైర విహారం చేస్తున్నాయి. ఇదివరకే అనేక సవరణల ద్వారా లేదా కొత్త చట్టాల ద్వారా భారత పాలకులు ప్రజానుకూలమైన ఆధునిక రాజ్యాంగ విలువలను లోపల నుంచే తొలుచుకుంటూ విధ్వంసం చేస్తున్న క్రమానికి 2014లో బిజెపి అధికారంలోకి రావడంతో ఒక సంపూర్ణ వలయం పూర్తయినట్టు అయింది. తత్ఫలితమే కాశ్మీర్లో 370, 35a అధికరణాల రద్దు, పౌరుల జాతీయ నమోదు(NRC), పౌరసత్వ సవరణ చట్టం(CAA) లాంటి వాటిని ముందుకు తెచ్చి పౌరుల ప్రాథమిక హక్కులను, మైనార్టీల హక్కులను నిరాకరించబూనుకున్నారు.
అయితే కాషాయకీయాలు గుత్తాధిపత్య గ్లోబల్ ద్రవ్య పెట్టుబడితో పీటముళ్లు వేసుకున్నందువల్ల కాషాయ హింస ఒక్క ఏకకేంద్రిత వలయంగానే ఉండదు. అది అనేకానేక హింసా వలయాలుగా విస్తరిస్తూ సమస్త ప్రజానీకాన్ని దోపిడీ,అణచివేతలకు గురిచేస్తుంది.
అందులో భాగంగానే దండకారణ్య ఆదివాసులపై ఇటీవలి గతంలో జరిగిన వైమానిక దాడులను మనం చూడాల్సి ఉంటుంది. నిజానికి ఆ ఆదివాసులపై నాలుగు దశాబ్దాలుగా సాగిస్తున్న అణచివేతకు పరాకాష్టగానే పాలకులు సమీప గత రెండేళ్లలో ప్రయోగాత్మకంగానూ, ఉద్దేశపూర్వకంగానూ నాలుగు సార్లు ఈ ఆకాశ దాడులను చేశారు. ఈ దాడులు నిస్సందేహంగా భారత ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గల సంబంధాలు శత్రుపూర్వకంగా మారాయనడానికి ప్రబల నిదర్శనం. వారి వారి పరస్పర ప్రయోజనాలు తీవ్రమైన విరుద్ధ స్థితికి చేరి ఆదివాసులను శత్రువులుగా భావిస్తే తప్ప దండకారణ్యంపై ఇటువంటి యుద్ధ దాడులు జరగవు.
మరి ఇంతవరకు దండకారణ్య సమాజంపై రాజ్యాంగ యంత్రం ప్రభావం ఏముందనుకోవాలి? ఇంతకాలంగా భారత రాజ్యాంగం ఎలా వ్యవహరించినందువల్ల ఇటువంటి యుద్ధ స్థితి నెలకొన్నదనుకోవాలి? బయటి సమాజంతో పోల్చడం కాదు గాని, రచయిత పాణి ప్రశ్నించినట్టుగా దండకారణ్య సమాజం ఎంతవరకు ప్రజాస్వామికీకరణ చెందినట్లు? సదరు రాజ్యాంగపరమైన సమానత్వం ఎంతవరకు సాధించినట్లు? భారత ప్రభుత్వమే ఎటువంటి నీతి, నియమాలను ఖాతరు చేయకుండా దండకారణ్యంలో తన ప్రజలపై తానే ఆకాశ యుద్ధం చేస్తున్నదంటే అసలు దండకారణ్య ఆదివాసులకు రాజ్యాంగం ప్రాసంగికత ఏమున్నట్లు? ఇవన్నీ నిజమైన ప్రజాస్వామ్యవాదులను ఆందోళన పరిచే ప్రశ్నలు. వీటికి జవాబులు కనుగొనాలంటే మనం మరింత లోతుల్లోకి వెళ్లి చర్చించాల్సిందే.
మొత్తంగా లోచూపు సారించి చూస్తే, భారత సమాజంలోని ప్రజా సమూహాలన్నింటిలో దండకారణ్య ఆదివాసీ ప్రజా సమూహం పూర్తిగా భిన్నమైనది, ప్రత్యేకమైనది. ప్రకృతితో వాళ్ల నైసర్గిక, సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతల కారణంగా దండకారణ్య ఆదివాసుల్లో నిరంతరం మొక్కవోని స్వేచ్ఛాకాంక్ష పనిచేస్తుంటుంది. అంతేకాదు, ప్రకృతిని వాళ్లు తమ జీవితానికి పరాయిదిగా ఎంత మాత్రం చూడరు. కనుకనే ఆదివాసులు ప్రకృతిని ఉపయోగపు వస్తువుగా తప్ప వినియోగ వస్తువుగా అసలే చూడరు. ఏ ప్రకృతి పరిసరాలలో తరతరాలుగా వాళ్ళు పుట్టి పెరుగుతూ వస్తున్నారో అవి వాళ్లకు సహజంగానే చెందాలన్న నిర్దిష్ట దృష్టి కోణం ఉండటం వల్ల ఒకప్పుడు ఆదివాసులు ‘మా గూడెం మీద మాదే అధికారం’ అన్నారు. కానీ ఆధునిక మావోయిస్టు రాజకీయాల సంపర్కం వల్ల వారి నిర్దిష్ట దృష్టి కోణం సాధారీకరణ చెంది విశాలమయ్యింది. అక్షరాల అచ్చమైన ఆధునికతను సంతరించుకున్నది. కనుకనే దండకారణ్య ఆదివాసులు ఇవాళ సహజమైన ప్రకృతి వనరులన్నీ ప్రజలందరివి అనే విశాల పర్యావరణ ఆధునిక రాజకీయ దృక్పథాన్ని దృఢంగా ఏర్పరచుకున్నారు. అటువంటి దృఢమైన రాజీ పడని రాజకీయ దృక్పథం ఉండడం వల్లనే దండకారణ్య ఆదివాసులు పెట్టుబడికి లొంగిపోకుండా నిరంతరం పోరాడుతున్నారు. ప్రకృతిని చెరబట్టి దాన్ని సాంతం సరుకులుగా, లాభాలుగా మార్చుకోవాలనుకునే కార్పొరేట్ పెట్టుబడిదారుల(రాజకీయార్థిక విధానాల)కు ఆదివాసుల దృఢమైన నైసర్గిక సాంస్కృతిక పర్యావరణ ఆధునిక రాజకీయ దృక్పథమే పెద్ద అడ్డంకిగా ఉన్నది. అందుకు విరుద్ధంగా, ఆదివాసుల ఆ దృఢమైన ఆధునిక రాజకీయ దృక్పథమే సమస్త భారత ప్రజానీకానికి నిరంతర పోరాట స్ఫూర్తిగా నిలుస్తున్నది. కనుకనే భారత ప్రభుత్వమే దండకారణ్య ఆదివాసులపై ఈ వైమానిక యుద్ధానికి పూనుకున్నదన్నది దాచేస్తే దాగని సత్యం.
ఇక్కడే ప్రజలను ప్రేమించే నిజమైన ప్రజాస్వామ్యవాదులందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేమిటంటే -అసలు ప్రజాస్వామ్యానికి, సామాజిక పరివర్తనకు మధ్య వైరుధ్యం ఏమన్నా ఉన్నదా? అని. మార్క్సిస్టు రాజకీయ తాత్విక దృష్టి కోణం నుంచి ఆలోచిస్తే- నిజమైన ప్రజాస్వామ్యానికి, మౌలిక సామాజిక పరివర్తన అయిన విప్లవానికి ఎటువంటి వైరుధ్యం లేదు. ఆ రెండింటి మధ్య వైరుధ్యం ఉన్నదని భావిస్తున్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని వర్గ పోరాటంతో నిమిత్తం లేని సంఘర్షణారహిత అపురూప విశేషంగా, విప్లవాన్నేమో కరకు సాయుధ వర్గ పోరాటంగా మాత్రమే చూస్తున్నట్లవుతుంది. కానీ వాస్తవమేమిటంటే విప్లవం నిరంతర ప్రజాస్వామికీకరణతో గూడిన వర్గపోరాట క్రమమే తప్ప వేరే కాదు.