ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్టర్ జయగోపాల్ ఫిబ్రవరి 7న విశాఖపట్నంలో మరణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా నాస్తికోద్యమ నిర్మాణానికి ఆయన జీవితమంతా కృషి చేశారు. 1972లో ఆయన భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి దాన్ని నిర్మాణాన్ని దేశమంతా విస్తరింపజేశారు. భానాసను ఒక ఉద్యమ సంస్థగా, ప్రజా చైతన్య వేదికగా మలచడానికి జయగోపాల్ భావజాల, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన కృషి చేశారు. నాస్తికవాదాన్ని ఒక సామాజికవాదంగా, హక్కుల వాదంగా కూడా ఆయన తీర్చిదిద్దారు. ఆస్తికత్వాన్ని భారతీయ సామాజిక, సాంస్కృతికరంగాల్లో ఆధిపత్యశక్తిగా గుర్తించిన ఉద్యమకారుడు ఆయన.
భారత నాగరికతలో కులం, మతం, మూఢాచారాలు ప్రజల చైతన్యాన్ని ఆడ్డుకొని యథాతధ ఆధిపత్య, దోపిడీ సంబంధాలను వ్యవస్థీకృతం చేస్తున్నాయి. ప్రజల ఆలోచనాస్థాయి ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. సాంస్కృతిక, భావజాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాకుండా సమాజం ప్రగతిశీల పరివర్తన సాధ్యంకాని ప్రత్యేక పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా మన దేశంలో అనేక మంది నాస్తిక ఉద్యమాన్ని ప్రభావశీలమైన సాంస్కృతిక ఉద్యమంగా తీర్చిదిద్దారు. అలాంటి వారిలో పెరియార్ శిఖరాయమానమైన దేశీయ ఉద్యమకారుడు. ఆయన ఆలోచనా, పోరాట స్ఫూర్తిని డా. జయగోపాల్ స్వీకరించారు. అందువల్లనే జయగోపాల్కు ఆంధ్రా పెరియార్ అనే సగౌరవమైన గుర్తింపు వచ్చింది.
నాస్తికత్వాన్ని ఆయన సామాజిక ఉద్యమంగా తీర్చిదిద్దే క్రమంలో దళితులపై ఆగ్రవర్ణ ఆధిపత్య శక్తుల దాడులకు వ్యతిరేకంగా కూడా పని చేశాడు. దళితుల, పీడితుల హక్కుల అవగాహనగా నాస్తికత్వాన్ని అభివృద్ధి చేశారు. హిందుత్వ, బ్రాహ్మణీయ భావజాలాన్ని ఎదుర్కొనే పోరాటాలకు కుల నిర్మూలనలో కీలక స్థానం ఉందనే పెరియార్ స్ఫూర్తిని జయగోపాల్ తెలుగు సమాజాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. భౌతికవాద, శాస్త్రీయ దృక్పథాన్ని సామాన్య ప్రజల్లోకి ఉద్యమస్థాయిలో తీసికెళ్లడానికి ఆయన చేసిన కృషి ప్రగతిశీల సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలకు దోహదం చేసింది. ఆధ్యాత్మిక, మత, మూఢ నమ్మకాల నుంచి ప్రజల ఆలోచనలను మళ్లించినప్పుడే ఆధునిక ప్రజాస్వామ్య, హేతుబద్ధ చింతన సమాజాన్ని నడిపిస్తుందనే అవగాహన విస్తరించడానికి భారత నాస్తిక సమాజం తన శక్తిమేరకు పని చేసింది. దీనికి ఆ సంస్థ నాయకుడిగా, వ్యాఖ్యాతగా జయగోపాల్ కృషి మర్చిపోలేనిది. హిందుత్వ ఫాసిజం ప్రజలను అతార్కిక, మూక, మత మౌఢ్యంలోకి తీసికెళ్లి సమ్మతి పొందుతున్న సమయాన మన సమాజ ప్రజాస్వామికీకరణకు అనేక వైపుల నుంచి ప్రజాస్వామిక కృషి జరగవలసి ఉన్నది. ఫాసిజానికి ఉన్న భావజాల పునాదులను ఎదుర్కోకుండా దాన్ని తుదముట్టించడం అయ్యే పని కాదు. అలాంటి ప్రజాస్వామిక కృషి చేసిన డా.జయగోపాల్ మృతి మన ప్రజాస్వామిక సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు. ఆయన నిర్వహించిన ప్రగతిశీల పాత్రను విరసం గుర్తు చేసుకుంటూ, ఆయనకు నివాళి ప్రకటిస్తోంది.