‘నేను టాయిలెట్ కు వెళ్ళలేను, సహాయం లేకుండా స్నానం చేయలేను, జైలులో ఎలాంటి ఉపశమనం లేకుండా చాలా కాలం జీవించాను. నేను జైలు నుంచి సజీవంగా బయటపడడం కేవలం యాదృచ్ఛికం ‘ ‘ అని 56 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత గురువారం (మార్చి 7)న తన మొదటి పత్రికా సమావేశంలో చెప్పారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చి 5న ఆయనతో పాటు మరో ఐదుగురిని ఉగ్రవాద కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. చక్రాల కుర్చీలో కూర్చొని 90 శాతానికి పైగా వికలాంగుడు అయిన సాయిబాబా, ఇతరుల సహాయం లేకుండా ఒక అంగుళం కూడా కదలలేనని చెప్పారు.

2017లో ఈ రోజున గడ్‌చిరోలిలోని స్థానిక కోర్టు ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది. ఆరవ నిందితుడు విజయ్ టిక్రీ కు 10 సంవత్సరాల కఠిన శిక్ష విధించారు. జైలులో తీవ్ర అనారోగ్యానికి గురైన పాండు నరోటే 2022 ఆగస్టులో మరణించారు. ఆ సమయంలో నరోటే వయసు 33 సంవత్సరాలు మాత్రమే.

సాయిబాబా జైలులో చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్బంధంలో వున్నకాలంలో  ఆయనతో దౌర్జన్యంగా వ్యవహరించారని పలు సందర్భాల్లో ఆయన భార్య వసంత కుమారి, ఆయన న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అతని విడుదల కోసం  వసంత్ కోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసింది. తక్షణం విడుదల చేయకపోతే అతను చనిపోతాడని ఆమె భయపడింది. జైలులో తన పరిస్థితి మరింత క్షీణించిందని సాయిబాబా గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

వారిని అన్ని ఆరోపణల నుంచి సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. 2022 అక్టోబరు 14న న్యాయమూర్తులు రోహిత్ బి. డియో, అనిల్ పన్సారేలు గడ్‌చిరోలి సెషన్ కోర్టు తీర్పును తిరస్కరించారు. రాజ్యం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్తే, హైకోర్టు తీర్పును రద్దు చేసింది. జస్టిస్ దేవో వెంటనే రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు వినయ్ జి. జోషి, వాల్మీకి ఎస్. మెనెజెస్‌లు సాయిబాబా తదితరులను నిర్దోషులుగా ప్రకటించారు.

నాగ్‌పూర్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ఈ విచారణను నిర్వహించారు. గడ్‌చిరోలి సెషన్స్ కోర్టులో విచారణ పూర్తయిన వెంటనే, ఎల్గార్ పరిషద్ కేసులో గాడ్లింగ్‌ను అరెస్టు చేశారు. తన కేసును నిర్వహించినందుకు మాత్రమే న్యాయవాది గాడ్లింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారని సాయిబాబా చెప్పారు.

ఈ ప్రాంతం లోని వందల, వేలాదిమంది దళితులకు, ఆదివాసీలకు న్యాయస్థానాలలో ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది జైలులో ఉన్నాడు. నా కేసులో పూర్తి న్యాయం జరగాలంటే గాడ్లింగ్‌ను విడుదల చేయాలి” అని ఆయన అన్నారు.

హైకోర్టులో తనను సమర్థించిన న్యాయవాదుల బృందానికి సాయిబాబా కృతజ్ఞతలు తెలిపారు.  “ఒకసారి కాదు, రెండుసార్లు వారు (న్యాయవాదులు) నన్ను హైకోర్టులో రక్షించాల్సి వచ్చింది. ఇది వారికి సులువైన పని కాదు”అని ఆయన అన్నారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కొద్ది గంటల ముందే విడుదల కావడంతో, తన కేసు తీర్పును చదవడానికి అవకాశం దొరకలేదని ఆయన అన్నారు. చట్టబద్ధంగా పరిహారం చెల్లించాలని రాజ్యాన్ని డిమాండ్ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సాయిబాబా, “నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దీని గురించి నేను యింకా ఆలోచించలేదు” అని సమాధానమిచ్చారు.

జైలులో తగిన వైద్యసేవలు అందకపోవడంతో మరణించిన నరోటే గురించి మాట్లాడారు.  “అత్యంత ప్రాచీనమైన తెగకు చెందిన ఒక యువకుడు మాతోపాటు జైలులో మగ్గిపోయాడు. అతడికి ఒక చిన్న కూతురు ఉంది. అతను చాలా కష్టాలు పడ్డాడు. న్యాయం నిజంగా జరిగిందా?” అని ప్రశ్నించారు. నరోటేకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయన మరణానికి కారణమైన జైలు అధికారులు సకాలంలో చికిత్స చేయలేదని ఆయన న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

హైకోర్టు ఈ తీర్పును మార్చి 5న వెలువరించినప్పటికీ, సాయిబాబా 7వ తేదీన మాత్రమే జైలు నుండి విడుదలయ్యారు. నాగ్పూర్ సెంట్రల్ జైలు అధికారుల ‘అహంకారం’ వల్లనే ఈ ఆలస్యం జరిగిందని ఆయన న్యాయవాది నిహాల్ సింగ్ రాథోడ్ ఆరోపించారు.

 “మేము మొదట గడ్‌చిరోలి కోర్టులో పత్రాల పనిని పూర్తి చేసి, ఆ తరువాత విడుదల పత్రాలను జైలు అధికారులకు ఇవ్వాల్సి వచ్చింది. మార్చి 6వ తేదీ సాయంత్రం 6.15 గంటల సమయంలో మేము యిస్తే, ఆ రోజు విడుదల సమయం అయిపోయింది అన్నారు” అని రాథోడ్ ది వైర్ కు చెప్పారు. అయితే ఈ కేసుతో సంబంధం లేని ఇతర ఖైదీలు రాత్రి 8 గంటలకు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. రాథోడ్ నాగ్‌పూర్ జైలు సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

మార్చి 7న విడుదల ప్రక్రియ పూర్తయింది. ఉదయం సాయిబాబా, రాహిలను విడుదల చేశారు. కొల్హాపూర్ జైలులో ఉన్న మిశ్రా మధ్యాహ్నం విడుదలయ్యారు. విజయ్, మహేష్‌ల విడుదలకు సంబంధించిన పనులు సాయంత్రం వరకూ కొనసాగాయి.

తమ స్వస్థలమైన డెహ్రాడూన్ నుంచి వచ్చిన మిశ్రా తల్లిదండ్రులు కొల్హాపూర్‌కు వెళ్లే ముందు ముంబైలో కాస్సేపు ఏగారు. తమ న్యాయవాది గడ్లింగ్‌ను ముంబైలోని ఎన్ఐఏ కోర్టు ముందు హాజరు పరుస్తారని తెలిసిన వారు, ఆయనను కలవడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి తమ ప్రయాణంలో చిన్న మార్పు చేసుకొని, కలిసిన తరువాత  కోల్హాపూర్‌కు వెళ్లారు” అని ఎల్గార్ పరిషద్ కేసులో నిందితులలో ఒకరు చెప్పారు.

https://thewire.in/rights/it-is-only-by-chance-that-i-came-out-of-prison-alive-g-n-saibaba

Leave a Reply